ఆశను వాగ్దానం చేస్తున్న స్త్రీలు  

భిన్న మత, తాత్విక జీవన విధానాల పట్ల,  భిన్నాభిప్రాయాల పట్ల సమాజంలో అసహనం పెరుగుతోంది.సామాజిక, సాంస్కృతిక, రాజకీయరంగాలలో వీటి ప్రతిఫలనాల గురించి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 2014  నుండి సీరియస్ గా మాట్లాడుతున్నది. ఆ అసహనం ఈ పదేళ్లుగా మరింత వ్యవస్థీకృతం అవుతూ హేయమైన  రీతులలో వ్యక్తం అవుతోంది.  ఫాసిజం, అన్ని జీవిత పార్శ్వాలనూ, మానవ సంబంధాలను విషపూరితం చేయడానికి కొన్ని సాంకేతిక సాధనాలను సమకూర్చుకుంటున్నది. అలాంటివాటిలో ట్రోలింగ్ ఒకటి. 

సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ సహజమేమో అన్నంతగా పాతుకుపోయింది. సామాజిక మత రాజకీయ అంశాలపై పనిచేసేవారు కూడా దీనికి మినహాయింపు కాదు. యాక్టివిస్టులు,రచయితలు, ఉపన్యాసకులు, నిజాలు నిర్భయంగా వెలికితీసే జర్నలిస్టులు మొదలైన వారిపై గురిపెట్టి, అశ్లీల, అసభ్య పదజాలంతో, వ్యక్తిత్వ హననం లక్ష్యంగా  బెదిరింపులతో  దాడులు చేయటం చూస్తున్నాం. పని విధానాలు, ప్రగతిశీల రచనలు, సమాచార విషయ వినిమయ విశ్లేషణలలో విమర్శనాత్మక దృక్పథం పట్ల అసహనం యొక్క అవాంఛనీయ వ్యక్తీకరణ అది. ఆయా రంగాలలో చురుకుగా పనిచేస్తున్న మహిళల ఆలోచనలు, అభిప్రాయాల పట్ల విద్వేష ప్రకటన అనేక రూపాలలో బహిర్గతం కావటం ఎప్పటికప్పుడు గమనిస్తూ, బాధపడుతూ, బాధిత స్త్రీలకు మద్దతుగా తన గొంతుకను ఇస్తూ వచ్చింది ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. 

ఆధునిక సమాజాలలో స్త్రీలద్వారా జరుగుతున్న మతవ్యాప్తి గురించి హెచ్చరికతో వ్యాసం వ్రాసినందుకు మాలో ఒకరు అలా ట్రోలింగ్ కు గురైన సందర్భం- సంస్థగా దీనిని  గురించి ఆలోచించవలసిన, పని చేయవలసిన అవసరాన్ని గుర్తుచేసింది.  సమకాలీన సామాజిక రాజకీయ అంశాల మీద పని చేస్తున్న అనేకమంది మిత్రులు తరుచుగా ట్రోలింగ్ కి, బెదిరింపులకి గురవడం రచయితలుగా మమ్మల్ని కలవరపెట్టింది. ఈ సందర్భాలను అర్థం చేసుకుని వారికి మద్దతు ప్రకటిస్తూ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 2024 ఫిబ్రవరి 10&11 తేదీలలో జరిగే  ఏడవ మహాసభల  సందర్భంగా ట్రోలింగ్ పైనే సభలు జరపాలని నిర్ణయం తీసుకుంది. ట్రోల్ కు గురైన స్త్రీల అనుభవాలతో పుస్తకం తీసుకు రావాలన్న ఆలోచన వచ్చింది. ‘మలుపు’ ప్రచురణ సంస్థ ముందు ఈ ప్రతిపాదనని ఉంచాము. ఇది తప్పక రావలసిన పుస్తకమని ఎంచి, బాల్ రెడ్డిగారు సహ ప్రచురణకర్తగా ముందుకు వచ్చారు. దాని ఫలితం ఈ పుస్తకం. 

ట్రోల్ వస్తువుగా పుస్తకం అనుకున్నప్పటి నుండి దాని చరిత్ర ఏమిటి, తత్వం ఏమిటి, ట్రోల్ నేపథ్యంలో  ఎలాంటి సాహిత్యం వచ్చింది అన్న ప్రశ్నలతో కుతూహలంతో అధ్యయనం ప్రారంభించాం. సంప్రదాయ స్కాండినేవియా కథలలో కొండలమీదనో, గుహలలోనో అసహ్యకరమైన చిత్రరూపాలతో ఉండే మాంత్రికశక్తి గల చిన్నాపెద్దా జీవులు ‘ట్రోల్’ అన్న పేరుతో చెప్పబడ్డాయి. జానపద మానవుల భావనాత్మక ఊహాత్మక సృజనశక్తి మూలం ‘ట్రోల్’. మానవులలోని  బలహీనతలతో ఆడుకొనే ఆ జీవులను వీరోచితంగా ఎదుర్కొని విజయం సాధించటం గురించిన కథలు అక్కడినుండే పుట్టాయి. 1980లలో అంతర్జాలం మానవ జీవితంలో నిశ్శబ్ద విప్లవం తెచ్చింది. ప్రపంచం చిన్నదయింది. వినియోగదారుల మధ్య మొదలైన వెక్కిరింపులు, వేధింపులతో కూడిన సంభాషణకు- దాని ప్రత్యేక స్వభావాన్ని బట్టి- ట్రోల్ అనేమాట వాడుకలోకి వచ్చింది. అల్లరి, దురుద్దేశం, తప్పుడు సమాచారం, ఆధార రహిత ఆరోపణలు, విద్వేషం, విధ్వంసం మొదలైన వాటితో రాను రాను ఇది హానికర ప్రక్రియగా మారిపోయింది. అసాంఘిక చర్య అయింది. అహం కేంద్రీకృత భావాలు, మోసం,  విషయాలను తారుమారు చేసే ధోరణి, సానుభూతి రాహిత్యం, మొహమాటం లేకపోవటం, ఇతరులను మాటలతో చేతలతో బాధపెట్టి ఆనందపడే తత్వం, విధ్వంసంలో సంతృప్తి- ట్రోలింగ్ కారకాలుగా గుర్తించబడ్డాయి. పేరును, ముఖాన్ని దాచుకొని అంతర్జాలం వేదికగా ఆడే విద్వేష క్రీడ ట్రోలింగ్.

అయితే ట్రోలింగ్ వ్యక్తులను, భావజాల సమూహాలను ఉద్దేశించింది మాత్రమే కాదు. కార్పొరేట్ ప్రయోజనాలకు విస్తృతమైన మార్కెట్లను అంతర్జాలం నిర్మించింది. ఇందులో గ్లోబల్ మార్కెట్ ను ప్రభావితం చేసే  ట్రోల్ ప్రపంచం కూడా ఉంది. అమ్మకపు కొనుగోలు వేదికలమీద ఆయా ఉత్పత్తుల గురించి వినియోగ దారులు చేసే సమీక్షలు, వ్యక్తం చేసే సందేహాలు ఆయా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని వినిమయం చేయటం ద్వారా కొనుగోలుదారులను పెంచటానికో, తగ్గించటానికో ఉపయోగపడతాయి.  అదే సమయంలో వినియోగదారుల  అసందర్భ సమీక్షలు, అసంగత ప్రశ్నలు, అసభ్యకర, అసాంఘిక వ్యాఖ్యలు అమ్మకందారులను ఇరుకున పెట్టేవిగా, వేధించేవిగా ఉండటం కూడా తరచు జరిగేదే. 

ట్రోల్ చేసే అవకాశాలను గుర్తించే నేర్పు, మెసెజ్ ని చక్కగా తయారు చేసి పెట్టే సామర్ధ్యం, సమయోచిత, సందర్భోచిత స్పందన వున్నప్పుడు అది ఒక వినోదాత్మక క్రీడగా ప్రయోజనకరం అన్న  అభిప్రాయం కూడా ఉంది. వ్యక్తీకరణలో వైవిధ్యం అంటూ అందుకు సమ్మతిని సమకూర్చే ప్రయత్నం చూస్తాం. మార్కెట్ మనుగడ, అవసరాలు, ప్రయోజనాల దృష్ట్యా ట్రోలింగ్ అక్కడ ఆమోదయోగ్యమే అవుతుంది. 

ఇంటర్నెట్- మనిషి జీవితంలో, చదువులలో, వృత్తి వ్యాపార వ్యవ హారాలలో విడదీయరాని భాగం అయిన తరువాత ఆన్లైన్ లో ఉండే పిల్లలనుండి పెద్దలవరకూ ఏదో ఒక సమయంలో,  సందర్భంలో ట్రోలవడానికి అవకాశాలు ఎక్కువ అని ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు, పరిశోధనలు చెప్తున్నాయి. అందువల్ల భయానికి, మానసిక ఒత్తిడికి, అనారోగ్యాలకు గురవుతూ,  ఒక్కొకసారి తమ జీవనరంగాల నుండి దూరం అవుతూ ఒంటరితనంలోకి కుంగిపోతున్న వాళ్ళ గురించి ఆందోళన పడుతూనే దానిని ఎదుర్కొని నిలబడటం గురించి హెచ్చరించాయి. వాటిని పట్టించుకోకపోవటం, స్పందించకపోవటమే మంచిదని చెప్పాయి. ‘Don’t feed the Troll’ అన్నది సుప్రసిద్ధ ఉపదేశవాక్యం. 

ట్రోల్ ను ఉపేక్షించవలసిందే కానీ వాటితో యుద్ధం చేయాలనుకొంటే అవి ద్విగుణం, త్రిగుణం, బహుళం అవుతాయని  వివరించి ఒప్పించటానికి  ‘seven ways to Trick a  Troll’ (Lise Lunge – Larsen) వంటి చిత్రపటాలతో కూడిన పుస్తకాలు వచ్చాయి. ట్రోల్స్ జానపద గాథల ప్రకారం ఆకారంలో పెద్దవి, అసహ్యకరమైనవి , ప్రమాదకరమైనవి కావచ్చు.  కానీ వాటి మెదడు వాల్నట్ కన్నా చిన్నది అన్న విషయం అర్థం చేసుకొంటే విద్వేషపూరిత ట్రోల్ ను ఎదుర్కొనటం సులభం అని,  సహనం, దయ, ధైర్యం, సత్వర ఆలోచన ట్రోల్స్ ను ఎదుర్కొనే ఉత్తమ మార్గాలని చెప్తాయి ఇలాంటి పుస్తకాలు. ఈ విషయంలో  పిల్లలను సంసిద్ధం చేయటానికి వచ్చిన బొమ్మలతో కూడిన చిన్న కథల పుస్తకాలు అనేకం ఉన్నాయి. 

ఇంటర్నెట్ రావటానికి ముందుకూడా ఇతరులను వేధించడం, బాధించడం, హాని తలపెట్టడం వుంది. అది సాంస్కృతిక సమస్య. సమాజంలో స్థిరపడివున్న పితృస్వామిక, మనుధర్మ విలువల సాపేక్షతలో సాహిత్య చరిత్ర పొడుగునా రచయితలు, సాహిత్య సందర్భాలు వేధింపులకి గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. స్త్రీల విషయానికి పరిమితమై చూసినా రామాయణ కవులలో మొల్లను అల్ప ప్రజ్ఞురాలిగా పదేపదే చెప్తూ అధ్యయనానికి దూరం పెట్టటం, తెలుగులో తొలి సాహిత్య చరిత్ర కారుడైన వీరేశలింగం పంతులు ‘రాధికా సాంత్వనం’ వ్రాసిన  ముద్దుపళని వేశ్య అనీ ,  కనుకనే  పచ్చి శృంగారాన్నిఅలా  వ్రాయగలింది అనీ,   ‘అది’  అంటూ ఆమెను సంబోధిస్తూ  న్యూన పరచి మాట్లాడటం వంటివి ఈ తరహాలోవే. తెలుగునాట స్త్రీవాద కవిత్వ ఉద్యమపు సమిష్టి వ్యక్తీకరణగా 1993లో ‘నీలిమేఘాలు’ కవితా సంకలనం వచ్చినప్పుడు దానిని నీలికవిత్వం అంటూ అవమానకరంగా రాసినవన్నీ ఈ  పరిధిలోకే వస్తాయి.

 స్వీయ అనుభవం నుండి వ్యక్తులుగా  పాత్రికేయ రంగానికి చెందిన ఇద్దరు స్త్రీలు పరిశోధన చేసి వ్రాసిన  పుస్తకాలు ఇచ్చిన  అవగాహన ఈ పుస్తక సంపాదకత్వ పనిలో మాకు బాగా ఉపయోగపడింది. ఆ ఇద్దరు స్త్రీలలో ఒకరు స్వాతి చతుర్వేది. భారతదేశపు పాత్రికేయురాలు. ఆమె వ్రాసిన పుస్తకం  I Am A Troll ; Inside the Secret world of the BJP’s Digital Army (జనవరి 2017).  మరొక స్త్రీ  ఆస్ట్రేలియా దేశపు పాత్రికేయురాలు జింజర్ గొర్మన్ (Ginger Gorman). ఆమె వ్రాసిన పుస్తకం Troll Hunting; Inside the world of online Hate and its Human Fallout ( ఫిబ్రవరి 2019) . 

కాశ్మీర్ లో  తీవ్రవాదాన్ని అణచివేయటం పేరుతో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్థానికులకు ప్రమాదకరం, ప్రాణాంతకం అవుతుండటాన్ని విమర్శకు పెడుతూ వ్రాసిన   కథనాల కారణంగా స్వాతి చతుర్వేది అంతర్జాలంలో విపరీతమైన ద్వేషపూరితమైన ట్రోల్ కు గురైంది. ఆ విషయంలో పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టింది. అసలీవిధమైన ట్రోల్ ఎందుకు జరుగుతున్నది? ఎవరు కారకులు? ఎవరు ప్రేరకులు అని లోతుగా పరిశోధించి అనేకమందిని ఇంటర్వ్యూ లు చేసి ‘I Am A Troll’ పుస్తకం రాసింది. ఈ పరిశోధనలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ రహస్య డిజిటల్ సైన్య నిర్మాణ వ్యూహాలు బయటపెట్టింది. 

జింజర్ గొర్మన్  2013 లో  ఇంటర్వ్యూ చేసిన స్వలింగ సంపర్కుల జంట – తమ ఇంట్లోని ఆరేళ్ళ పిల్లాడిని లైంగికంగా హింసించి, అరెస్టయి జైలుశిక్ష పొందారు. సమాజంలో వెలివేతకు, హింసకు, నిస్పృహకు  గురవుతున్న ఏక  లింగ, స్వలింగ   సంపర్కులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల గురించి గొర్మన్ అంతకు మూడేళ్ళ ముందు వ్రాసిన వ్యాసాన్ని పై ఉదంతంతో ముడి పెడుతూ అంతర్జాలంలో విపరీతంగా వేధింపులకు గురిచేశారు. చంపుతామని బెదిరించారు. ఆ సందర్భంలో మొదలు పెట్టి అంతర్జాల విద్వేష కారకులను, కారణాలను గుర్తించటానికి అయిదేళ్ల పాటు ఆమె చేసిన పరిశోధన ఫలితం ‘Troll Hunting.’ 

ఈ పాత్రికేయులు ఇద్దరూ తమపై జరిగిన ట్రోలింగ్ గురించి చెప్పుకొనటంతో పాటు, దానికి కారణమైన వ్యవస్థల ఉనికిని గుర్తించి వివరించటంపై శ్రద్ధ పెట్టారు. అంతర్జాల గుండాల వెనుక, అశ్లీల రాతగాళ్ల వెనుక, అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసే వాళ్ళ వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఉన్నదని, అది ముస్లిముల పట్ల విద్వేషాన్ని, ప్రభుత్వ రాజకీయార్ధిక విధానాల పట్ల భిన్నాభిప్రాయం ఉన్నవాళ్ళ పట్ల అసహనాన్ని వెళ్లగక్కటానికి అంతర్జాల సైన్యంతో ట్రోలింగ్ లు జరిపిస్తున్నదని స్వాతి చతుర్వేది అనేక ఆధారాలతో నిర్ధారించి చెప్పింది.

దేశంలో పెరిగిపోతున్న అసహనాన్ని గురించి ఆందోళన వ్యక్తంచేసిన షారూక్ ఖాన్, దానికి కొనసాగింపుగా అసహనం అభద్రతకు కారణమవుతున్నదని చెప్పిన  అమీర్ ఖాన్ సినిమారంగ ప్రముఖులు.  అయినప్పటికీ  ముస్లిములు కావటం వల్ల అంతర్జాలంలో విద్వేషపు వేధిపులకు  గురి కావలసి వచ్చిన విషయాలను వివరిస్తూ స్వాతి చతుర్వేది, వాళ్ల సినిమాల విడుదలను అడ్డుకొనటానికి, వాణిజ్య ప్రకటనల నుండి వాళ్ళను తప్పించటానికి బిజెపి రాజకీయ శక్తులు చేయించిన అల్లరిని, వాణిజ్య కంపెనీల మీద తెచ్చిన ఒత్తిడిని గురించి చెప్పింది. ఆమె చెప్పిన విషయాలు   ట్రోల్ అన్నది నిరపేక్ష విషయం కాదని రాజకీయ ప్రయోజనాలతో నిర్వహించబడుతూ ఆర్థిక ఆధిపత్యాన్ని కూడా స్థాపించగల వ్యవస్థ అని సూచిస్తాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలను గణనీయంగా ప్రభావితం చేయగల ట్రోలింగ్ గురించి మాట్లాడటం ఎంతమాత్రం ఎలీట్ వ్యవహారం కాదు.   

కార్పొరేట్ దిగ్గజాలు, హిందుత్వ వాదులు, స్వయంగా బిజెపికి చెందిన ప్రజాప్రభుత్వ ప్రతినిధులు ట్రోల్ సామ్రాజ్య బలమని తెలిసినప్పుడు దిగ్భ్రాంతి కలగక మానదు. ప్రతిపక్షపార్టీల ప్రతినిధులు కూడా ట్రోల్స్  కు మినహాయింపు కాదు. అటువంటప్పుడు స్వతంత్ర భావాలు గల  మహిళలు ట్రోలవడంలో ఆశ్చర్యం ఏముంది? లైంగిక ప్రతీకలతో అవమానించటం, అగౌరవకరంగా చూడటం  మహిళలు ఎదుర్కొనే అదనపు ఆరళ్ళు.  

ప్రభుత్వమే ట్రోల్ ను యుద్ధ వ్యూహంగా చేసుకున్నప్పుడు పోలీసు న్యాయ వ్యవస్థలు దానికి బలైన వాళ్ళ పక్షాన చర్యలు తీసుకొంటాయని ఆశించటం అత్యాశే.  ట్విట్టర్, ఫేస్ బుక్ మొదలైన సంస్థలు తమ  వినియోగదారులకు వాగ్దానం చేసిన న్యాయపరమైన హామీలను నెరవేర్చగల స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి, ఆర్థిక ప్రయోజనాల స్వార్థంతో పాలకుల చేతిలో తోలుబొమ్మలు అవటం చూస్తున్నదే. వాటన్నిటినీ పౌర సమాజం దృష్టికి తెచ్చింది స్వాతి చతుర్వేది. 

జింజర్ గొర్మన్- స్వాతి చతుర్వేది వలెనే  ట్రోల్ కు గురయిన వాళ్లను, ట్రోల్ చేసేవాళ్లను, వాళ్లకు చెందిన సమూహాలను, న్యాయ సంబంధమైన వ్యక్తులను, మనస్తత్వ వేత్తలను, విద్యావేత్తలను కలిసి మాట్లాడి వ్రాసింది ‘Troll Hunting’ పుస్తకాన్ని. ఆ క్రమంలో తనకు చాలా భ్రమలు తొలిగి పోయాయి అంటుంది. ట్రోల్స్  చేయటానికి ప్రపంచమంతా విస్తరించిన వ్యవ స్థీకృత సిండికేట్లు ఉన్నాయని, ఆ సిండికేట్లకు పరస్పర సంబంధాలు ఉండటమే కాదు మొత్తంగా అంతర్జాతీయ నేర వ్యవస్థలతో అనుసంధానించబడి ఉంటాయని గుర్తించి చెప్పింది. 

స్వాతి చతుర్వేది పరిశీలనలో ట్రోల్ చేసేవాళ్లు ఎక్కువ చదువుకున్నవాళ్ళు కాదు, ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేరు. ఆత్మ న్యూనతతో ఉంటారు. కానీ జింజర్ అనుభవంలో వాళ్ళు బాగా చదువుకొన్నవాళ్ళు. అమాయకులసలే కాదు. ట్రోల్ అంతర్జాల వాచాలత్వమే కానీ భౌతికంగా దెబ్బతీయవని అనుకొనటం సరి కాదంటుంది. ట్రోల్ చేసేవాళ్ల చిత్తశాంతిని భగ్నం చేస్తూ వాళ్ళ పెంపుడు జంతువుల మీద దాడులు చేయటాన్ని కూడా ఆమె గుర్తించింది. 

నోరున్న ఫెమినిస్టులు మాత్రమే ట్రోల్ కు గురవుతారన్నది కూడా భ్రమే అని ఆస్ట్రేలియాలో 34 శాతం పురుషులు, 44 శాతం స్త్రీలు ఆన్ లైన్ వేధింపులకు గురవుతున్నారని ఉదహరిస్తూ  చెప్పింది. మగవాళ్ళు మత, జాతి, రాజకీయ విశ్వాసాలకు ట్రోలవుతుంటే స్త్రీలకు తరచు లైంగిక వేధింపులు, అవాంఛిత సెక్స్ మెసేజ్ లు ఎదురవుతూ వుంటాయి. వ్యక్తిగత జీవితం పబ్లిక్ చర్చకు పెట్టబడుతుంది. ట్రోల్స్ వాటంతట అవి పుట్టవని, మనం నివసిస్తున్న సమాజ లక్షణాలే వాటిని ఉత్పత్తి చేస్తాయని జింజర్ అభిప్రాయం.

హింసామయ, నిర్లక్ష్యపూరిత కుటుంబ వాతావరణం, చిన్నతనం నుండే ఇంటర్ నెట్ మీద ఒంటరిగా వదిలివెయ్యబడటం వంటివి కోపం, కసి, ద్వేషం వంటి లక్షణాలతో  వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయని,  అలాంటివాళ్ళు సులభంగా ట్రోలర్స్ అవుతారని ఆమె భావిస్తుంది. బహుముఖ పౌర సమూహాల ప్రతిస్పందనలు, చట్టాన్ని, న్యాయాన్ని, ఆమలుచేయవలసిన యంత్రాగం, సోషల్ మీడియా కంపెనీలు ట్రోల్స్ నియంత్రణకు సహకార వ్యవస్థలుగా అభివృద్ధి చెందాలని ఆశించింది.  కానీ అదే సమయంలో అవి బాధితుల పక్షాన నిలబడటం లేదన్న వాస్తవాన్ని కూడా గుర్తించి చెప్పింది. 

ఇలా ఈ ఇద్దరు –   ఒకరు దేశం నుండి, మరొకరు విదేశం నుండి -ఒకటి రెండేళ్లు ముందు వెనకలుగా ట్రోల్ కు గురయి , స్వీయాత్మక అనుభవాన్ని సాధారణీకరించి,  వస్తుగత దృష్టితో విశ్లేషించిన మహిళలు. ఈ మార్గంలో తెలుగు సమాజంలో ట్రోల్ కు గురైన మహిళల అనుభవ కథనాలను సమీకరించి పుస్తకం తీసుకొని రావటం సమకాలపు అవసరంగా, ట్రోల్ బాధిత మహిళలకు నైతికమద్దతు ఇవ్వడంగా భావిస్తున్నది ప్రరవే. 

 3  

చాలాసార్లు ట్రోల్స్ ప్రత్యేక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని జరిగేవే అయినా అవి వ్యక్తిగతం కాదు. వ్యక్తిగతం అనుకొనటం, అనటం ప్రశ్నించే గొంతును ఒంటరి చేసి, న్యూనపరచి నిష్క్రమించేలా చేయటమే. ట్రోల్స్ వెనక ఉన్న పితృస్వామిక కౌటుంబిక, కుల, మత, ఆర్థిక, అధికార రాజకీయాలను గురించిన చర్చను ప్రారంభించటానికి ట్రోల్ కు గురైన మహిళల అనుభవ కథనాలు ఒక దగ్గరకు తీసుకురావటం అవసరం అని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక భావించింది. ఇది సమకాలపు సమస్య.  తెలుగు సమాజంలో ట్రోలవుతున్నవాళ్ళు చాలావరకు మాకు తెలిసినవాళ్లు, స్నేహితులూ అయినప్పటికీ జాబితా సిద్ధం చేయడానికి కొంత కసరత్తు అవసరం అయింది. సాహిత్య, పత్రికా, సామాజికోద్యమ రంగాలలో పని చేస్తూ ట్రోలయిన వారిని అడగాలని అనుకున్నాం. అందులో మా పరిధి మేరకు కొన్ని పేర్లు గుర్తించి అడిగాము. చాలావరకు అందరూ అంగీకరించారు. ఇద్దరు ముగ్గురు వ్యక్తిగత కారణాలతో కాదన్నారు.  

అనుసరించిన పద్ధతి: ఎవరి అనుభవాలు, వాటి వ్యక్తీకరణలు  వారివే అయినా పుస్తకంగా తీసుకు రావాలనుకొన్నప్పుడు సాధారణ ఏకసూత్రత అవసరం కనుక  అందుకు సహాయకారిగా ఉంటుందని ప్రశ్నావళిని రూపొందించాం. అందులోని ప్రశ్నలు ఇవి : 

  • మీ సాహిత్య, సామాజిక, వృత్తి రంగాల నేపథ్యం, చేస్తున్న కృషి. 
  •   మీ మీద మొదటిసారి ట్రోలింగ్ ఎప్పుడు జరిగింది, ఏ అంశంలో జరిగింది?
  • ఎటువంటి దాడిని ఎదుర్కొన్నారు, కొనసాగుతూ వస్తున్నదా, ముగిసిందా?
  • ట్రోలింగ్ మీకు కలిగించిన ఆందోళన ఎలాంటిది, దానికి మీ తక్షణ స్పందన ఏమిటి?
  • ఆ సమయంలో కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి?
  • మిత్రులు, వృత్తిపర సంఘాలు స్పందించిన తీరు ఏమిటి?
  • ఆ తరువాత మరెప్పుడైనా ట్రోలింగ్ కు గురయ్యారా, ఆ సందర్భాలు ఏమిటి?
  • ట్రోలింగ్ వలన కలిగిన అలజడిని ఎలా సంబాళించుకొన్నారు?
  • మీ మీద జరిగిన ట్రోలింగ్ కి తక్షణ కారణాలు, మూలాలు ఏమై  ఉంటాయి?
  • వ్యవస్థీకృత కారణాలు ఏమై  ఉండవచ్చు?
  • మీలా ట్రోలింగ్ కు గురైనవాళ్ళ పట్ల మీ స్పందన, ఆచరణ ఎలాంటివి?
  • పురుషులు కూడా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు కదా, స్త్రీలపై ట్రోలింగ్ దీనికన్నా ఎలా భిన్నమైనది?
  • ట్రోలింగ్ ను అరికట్టటం సాధ్యమేనా, సాధ్యమే అనుకొంటే అందుకు మార్గాలు ఏమిటి?

ఇవి అవగాహన కోసం రూపొందించినవే కానీ ఎవరికి వారు తమ అనుభవ వ్యక్తీకరణ సమగ్రం కావడం కోసం అనుబంధంగానో, అదనంగానో కొత్త అంశాలు చేర్చుకోవచ్చని సూచించాం. అలా వచ్చిన వాటిని చదివి కొన్ని కొత్త ప్రశ్నలు, సందేహాలు, సూచనలను వాళ్లకు తెలియచేస్తే ఇష్టంగా వివరణలు వ్రాసి పంపారు. వాటిని చేర్చి, అనుభవ కథనాలుగా ఎడిట్ చేశాం. తుదిప్రతిని ఎవరిది వాళ్లకు పంపి ఆమోదం పొందిన తరువాతి రూపం ఈ పుస్తకం. ఈ పుస్తకం పనిక్రమంలో తెలుగు సమాజంలో  ట్రోల్ కు గురవుతున్న పురుషుల అనుభవాలను, ట్రోల్ పట్ల, ప్రత్యేకించి మహిళలపై జరుగుతున్న ట్రోల్ పట్ల ప్రజాస్వామిక వాదుల, రచయితల  అభిప్రాయాలు సంక్షిప్తంగా అయినా సేకరించి చేర్చాము.

ఈ పుస్తకంలో పదిహేనుమంది స్త్రీల అనుభవ కథనాలు ఉన్నాయి. వాళ్ళు భిన్న సామాజికవర్గాలకు ప్రతినిధులు. కులం, జండర్, మత మైనారిటీల సమస్యలపై  పని చేస్తున్నవాళ్ళు, వివక్షారహిత లోకాన్ని ఆకాంక్షిస్తున్న వాళ్ళు,  ప్రజాస్వామిక భావ చైతన్య ప్రసారానికి అవరోధం అవుతున్న వాటిని తొలగించుకొంటూ పోవాలని ఆశిస్తున్నవాళ్ళు, అందుకొరకే మాట్లాడుతున్నవాళ్ళు, వ్రాస్తున్నవాళ్ళు,  సృజన సాహిత్యకారులు, పత్రికా రచయితలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు. వ్యక్తిగతం కూడా రాజకీయమైన చోట- ఎద మెదడులను ఏకకాలంలో వేధించే బాధ ఏదో వాళ్ళను ఈ పనులకు తరుముతున్నది. వాళ్ళు అంతర్జాల వేదికలను ఉపయోగించుకొనటం కూడా ఆ పనులకు విస్తరణగానే చూడాలి. అయితే వాళ్ళు అందుకు చెల్లిస్తున్న మూల్యం ఏమిటో ఈ కథనాలు చెప్తాయి. ఇవి  ప్రధానంగా చర్చకి పెట్టిన అంశాలు –

  • సమకాలీన ఘటనల నుండి, సందర్భాల నుండి స్త్రీల నిత్యజీవితంలో ఆచారాలు, నోములు, వ్రతాలు, కట్టు బొట్టు పేరిట కనిపించకుండా అమలవుతున్న పితృస్వామిక అధికార రూపాలను గుర్తించి విమర్శకు పెట్టటం.
  •  స్త్రీల లైంగికత, లైంగిక సంబంధాల గురించి చర్చించటం.
  • దళిత స్త్రీ బయట నుండి, లోపలి నుండి ఎదుర్కొంటున్న వివక్షగురించి చర్చించటం.  
  • మనుషుల మధ్య నిచ్చెనమెట్ల అధికార సంబంధాలను కుటుంబం పేరిట, కులం పేరీటా , మతం పేరీటా , రాజ్యం పేరీట స్థిరీకరించిన మనుస్మృతిని ప్రశ్నించటం.
  • మనువాదుల వాదనలను తిప్పికొట్టటం.
  • అశాస్త్రీయభావాలను, ఆచరణలను విమర్శించటం, వ్యతిరేకించటం. 
  • ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను, కార్యక్రమా లను విమర్శిస్తూ సరైన అవగాహనను కల్పించే ఆచరణలో ఉండటం. 

రాజ్యాంగం ప్రకారం సమానత ప్రాతిపదికగా నూతన సమాజం వికసించటానికి ఇవన్నీ అడగవలసినవే. చేయవలసినవే. కానీ మాట్లాడవలసినవే మాట్లాడుతున్నందుకు, వ్రాస్తున్నందుకు వీళ్ళు ఎందుకు  ట్రోలవుతున్నారు? అందరికీ అన్ని అవకాశాలు సమంగా ఉండే సమాజం అవసరం లేదనుకొనే అప్రజాస్వామిక మూకలతోనే దేశం నిండి ఉన్నదని సమాధానం. ఓటు వేయటానికి  లభించిన  సమాన అవకాశం సరిపోదు. రాజ్యాంగబద్ధమైన హక్కులన్నీ  అందరికీ జీవిత వాస్తవం కావాలని అంబెడ్కర్ ఆశించాడు. అందుకు  రాజ్యాంగ నైతిక దృక్పథాన్ని ప్రజాసమూహాలలో కలిగించటం స్వతంత్ర భారత ప్రభుత్వాల బాధ్యత అని   నొక్కి చెప్పాడు. అయితే  అది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని ట్రోల్ సందర్భం మరొకసారి గుర్తుచేస్తున్నది. 

ట్రోల్ కు గురయిన మహిళల కథనాలలో కొంతమంది ఒక విషయంలో ఆందోళన పడటం కనిపిస్తుంది. అప్రజాస్వామిక మూకదాడులను, ముఖం లేని దాడులను ఊహించవచ్చు. అవసరం అనుకొంటే ప్రతి సమాధానం చెప్పవచ్చు. కాదనుకొంటే ఉపేక్షించవచ్చు. కానీ ఊహించని మూలల నుండి, మిత్ర సమూహాల  నుండి, భావజాల ఐక్యత గల వర్గాల నుండి  ట్రోల్ తరహా వేధింపులు జరుగుతుంటే తట్టుకొనటం ఎలా అన్నది వాళ్ళ వేదన. ఆర్థిక, రాజకీయ అధికార ప్రయోజనాల కొరకు అంతర్జాల వేదికలను ఆక్రమించిన పెత్తందారీ వర్గాలు చేరదీసి శిక్షణ ఇచ్చి వదిలిన అప్రజాస్వామిక అతి బలహీన స్వార్థపర ఏకాక్షి మూకలో, ఆ అధికార సంస్కృతి మాయ కమ్మిన వ్యక్తులో   చేసే విచక్షణా రహిత నిందారోపణలకు, అసంబద్ధ, అసహన వ్యాఖ్యలకు – ప్రజాస్వామిక ఆచరణలో ఉన్నవాళ్ళ సంభాషణకు మధ్య గీత చెరిగి పోవటం ప్రమాదకరం కాదా అన్నది ప్రశ్న. స్థూలంగా ప్రజాస్వామిక చైతన్య చట్రంలో ఇమడగలిగిన వాళ్లే అప్రజాస్వామిక సంభాషణకు ఉత్సాహపడితే అది ఫాసిస్టు శక్తులు పండగ చేసుకొనటానికే ఉపయోగపడుతుంది. 

అనేక వైరుధ్యాల మధ్య, సంక్లిష్టతల మధ్య జీవిస్తున్న మనుషులందరి చైతన్య స్థాయి, ఆచరణ ఒకే రకంగా ఉండటానికి వీలుందా? ఉండాలని ఆశించటం, స్వీయ కొలమానాలతో తీర్పులు ఇయ్యటం బహుళత్వాన్ని చిదిమేసే రాజకీయాలకు బలం చేకూర్చటమే అవుతుంది కదా!? ఆ కొలమానాలు కూడా  అందరి విషయంలో సమానంగా అన్వయించబడుతున్నాయా?   విడివిడి వ్యక్తుల ఆచరణలను అంచనా వేయడం మొదలు పెడితే అది అనేక ద్వంద్వాలకు కారణం అవుతుంది. అలాగని ఈ కథనకర్తలు  తాము విమర్శకు అతీతులమని కూడా అనుకొనటం లేదు. తమ భావాలు, వ్యక్తీకరణలు, ఆచరణలలో  లోపాలు ఉంటే స్నేహపూర్వకమైన విమర్శకు, ఇంత చర్చకు చోటు మిగుల్చుకొందాం అంటున్నారు.  

ట్రోల్ కు గురైనవాళ్లు కూడా తమ భావజాలానికి అటో ఇటో కాస్త జరిగారనో,  వ్యతిరేకించారనో ఇతరులను ట్రోల్ చేయటం, సామాజిక మాధ్యమాలలో వేధింపులకు గురవుతున్న ప్రగతిశీలురు- తాము మనువాద మత రాజకీయాలను  వ్యతిరేకించేటప్పుడు కూడా ట్రోల్ భాషనే ఆశ్రయించటం ఇప్పటి వాస్తవమే కావచ్చు.   కానీ అది కొనసాగించవలసిన సంప్రదాయం మాత్రం కాదు. అభిప్రాయాల మీద చర్చ ఎప్పుడూ కోరదగినదే. కానీ అభిప్రాయాలను వ్యక్తం చేసిన వ్యక్తులను ఎద్దేవా చేసి మానసికంగా, నైతికంగా గాయపరచడం వలన  ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని అభివృద్ధి పరచగలుగుతున్నామా అని ఆత్మవిమర్శ చేసుకొనవలసిన సందర్భం ఇది.  అదే సమయంలో పీడితులు తమకి జరిగే అన్యాయాలకి స్పందనగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసేటపుడు సంయమన పూర్వక భాష ఉండాలని కోరుకోవడంలో అర్థం లేదు. కానీ అది పాటించవలసిన ఆదర్శం కాదనీ, నిస్సహాయ క్రోధాన్ని వెలికి తీసే ఒక అవుట్లెట్ మాత్రమేనన్న ఎరుక మిగతావారికి ఉండాలి. 

ఈ పుస్తకంలోని స్త్రీలు ప్రశ్నించారు. మతతత్వానికి ఎదురుగా నిలబడి లౌకికత సంగతి ఏమిటన్నారు. స్త్రీల శరీరాలపై స్త్రీలకే హక్కు లేదా అన్నారు. మైనార్టీలు కూడా మనుషులే వారికి హక్కులు ఉంటాయన్నారు. కొన్ని కులాలకి ఆధిక్యం ఎందుకు అనడిగారు, రాజకీయ పార్టీల ప్రహసనాలను కళ్ళకి కట్టారు, మూఢ నమ్మకాలు వద్దు, సైన్స్ ని నమ్మమన్నారు, ఎవరి ఆహారం వారిష్టమని  అన్నారు. వీరంతా భిన్నత్వాన్ని కోరుకున్నారు. వ్రాశారు, మాట్లాడారు, చర్చించారు. అందుకుగాను  తీవ్రమైన ట్రోలింగ్ కి గురయ్యారు.పోర్న్ సైట్లలో అమ్మకపు సరుకుగా మార్చబడ్డారు. కేసులు, బూతులు, బెదిరింపులు, అవమానాలు, అవహేళనలు, నిరంకుశ ఉపదేశాలు- అన్నీ భరించారు. బాధ, దుఃఖం, ఆగ్రహానికి గురవుతూ కూడా తాము నమ్మిన విలువలు, విశ్వాసాల వ్యాప్తి కోసం, నిలిచి పోరాడుతున్న స్త్రీలతో సంభాషణకు తలుపులు తీస్తుంది ఈ పుస్తకం. ఏక మత రాజ్యస్థాపన కోసం భిన్నాభిప్రాయాలను బుల్డోజ్ చేసుకుపోతున్న వర్తమాన అధికార రాజకీయాల అంధకారంలో ఒక ఆశను వాగ్దానం చేస్తుందీ పుస్తకం.  

(ఖమ్మంలో 2024 ఫిబ్రవరి 10 & 11తేదీలలో  జరుగుతున్న ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 7 వ మహాసభలో ఆవిష్కరించబడుతున్న ‘ట్రోల్’  పుస్తకం ముందుమాట.)      

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply