“ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు. ఇప్పటి వరకూ సాగిన ఈ జీవితంలో దుర్భర దారిద్యాన్ని అనుభవించాను. తగు మాత్రపు సుఖాలనూ అనుభవించాను. సాహిత్యం అంటే ఏమిటో తెలియని రోజులలో నన్నయ్య, శ్రీనాథుడు, వేమన, గురజాడలను చదివాను. ఇంకా ఆధునిక తెలుగు సాహితీ వేత్తలనూ, శ్రీ శ్రీ, పాణిగ్రాహి, చెరబండరాజు లాంటి విప్లవ రచయితలనూ చదివాను. కొన్ని గ్రంథాలకు అనువాదం చేసి, “శారద” లాంటి స్వతంత్ర రచనలను చేసి, జీవితాలను రాసి, విప్లవాత్మక ఉద్యమాలన్నింటికీ సహకరించి, స్వయంగా పాల్గొని, సంవత్సరాల తరబడి రహస్య జీవితాన్ని గడిపాను…” మరణించటానికి కొన్ని రోజుల ముందు తన డైరీ లో ఆలూరి భుజంగరావు గారు (నాన్నగారు) రాసుకున్న మాటలివి. 2013 జూన్ 20 వ తారీఖున ఆయన మనందరినీ వదిలి వెళ్ళి పోయారు. ఒక్కసారి ఆయనను స్మరించుకుందాము.
గుంటూరు జిల్లా పొన్నూరు లోని మధ్య తరగతి రైతువారీ కుటుంబం లో సీతారావమ్మ, వెంకటప్పయ్య గార్ల చివరి సంతానం భుజంగరావు గారు. తల్లి సీతారావమ్మ ఆయుర్వేద వైద్యురాలు. ఆమె ఎప్పుడూ అష్టపదులు, భక్తుల జీవిత చరిత్రలు చదువుతూ ఉండేది. తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతం వైపు ఆకర్షితురాలయ్యింది. చదువు పట్ల, సాహిత్యం పట్ల ఆసక్తి తల్లి నుండే ఆయనకు కలిగింది. “చంద్రిక” పత్రిక ప్రధాన నిర్వాహకులలో ఒకరు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త, ఆరు భాషలలో ప్రావీణ్యతను కలిగి ఉన్న అన్న ప్రకాశరావు నుండి కమ్యూనిస్ట్ దృక్పథాన్ని అలవరచుకున్నారు. తోటివారి బాధల్నీ, గాథల్నీ పరిశీలించటమే కాకుండా పత్రికలలో వచ్చే వార్తలను కూడా కథా వస్తువులుగా స్వీకరించి మట్టి మనుషుల మురికి జీవితాలను తన రచనలలో చిత్రించిన ఆప్త మిత్రుడు శారద (నటరాజన్) నుండి సాహితీ ప్రియత్వాన్ని అలవరచుకున్నారు. అనేక మంది సాహితీ మిత్రుల ప్రోత్సాహం ఆయనకు లభించింది. పదమూడు సంవత్సరాల హోటల్ జీవితం లోని దుర్భరమైన, క్రూరమైన అనుభవాలు చైతన్యాన్ని, అవగాహనను పెంపొందించాయి. ప్రపంచం పట్ల ఒక స్పష్టమైన వర్గ దృష్టి కోణాన్ని స్థిరపరచాయి. విజ్ఞానాన్నీ, విషయపరిజ్ఞానాన్ని పొందటానికి కొత్త విషయాలను తెలుసుకోవాలన్న తృష్ణ, కోర్కె ఆయనను సాహిత్య పరుణ్ణి చేసింది.
కథలు రాయటానికి పుష్కలమైన జీవితానుభవం, పఠనాశక్తి, నిరంతరం ధారాళంగా గ్రంథ పఠనాన్ని సాగించటం, తమ చుట్టూ ఉన్న మానవుల జీవితాలనూ, బతకటానికి వాళ్ళు చేసే పోరాటాన్నీ, సంఘర్షణనూ చూడటం, విన్నవీ, కన్నవీ, అనుభవించినవీ వాటి తాలూకు బాధలనూ, వేదననూ కథా రూపంలో వ్యక్తీకరించటం, భాషా జ్ఞానం తో పాటు సాహిత్య పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం. దాన్ని చమత్కారయుతంగా వాడుకోగల సామర్ధ్యమూ, కథా సంవిధానాన్ని నడపగల చాతుర్యం ఇవన్నీ ఉండాలంటారు భుజంగరావు గారు. తెలుగులో, హిందీలో వస్తున్న కథా పత్రికలను, ఆదివార అనుబంధాలను, తెలుగు అనువాదాలను, కథలూ, నవలలను చదివేవారు. జీవితం గొప్ప కళాత్మక, కథాత్మక వస్తువుని సామాజిక సందర్భానికి అనుగుణంగా సంస్కరించి పాఠకులకు అందించగలిగితే అదే గొప్ప సాహిత్యమవుతుంది భావించే వారు.
రచయితల రచనలలోనే వాళ్ళ వ్యక్తిత్వం ద్యోతక మవుతుందంటారు. అద్భుతమైన అనువాదాలనూ, రచనలనూ దాదాపుగా విపరీతమైన శారీరిక, మానసిక బాధలలోనే, దారిద్రంలోనే రాశారు కానీ తనను మానవుడిగా, రచయితగా తీర్చి దిద్దింది ఈ దేశంలోని కూటికి, గుడ్డకు నోచుకోని కోట్లాది మానవులే అని గర్వంగా చెప్పుకున్నారు. సమస్త విజ్ఞానాలూ, ఐశ్వర్యాలూ సుఖాలూ, సంపదలూ అన్నీ మురికి ఓడుతున్న మడ్డి మనుషుల చెమట చుక్కల్లోంచే అని త్రికరణ శుద్ధిగా నమ్మారు. జీవితాన్ని పొగల్లో, సైగల్లో పంచాగ్నుల మధ్య భస్మీ పటలం చేస్తున్న “బ్రతకటం ఎట్లా” అన్న ప్రశ్నకే ప్రాధాన్యతనిస్తే, నా జీవిత చరిత్రగా పేరు పెడితే? అది నా దేశం లోని అసంఖ్యాకులైన మానవుల చరిత్ర అవుతుందని డైరీ లో రాసుకున్నారు. హాలాహలం లాంటి జీవితంలోంచి అమృతమనే సాహిత్యాన్ని రచించారు.
తనను స్పందింప చేసినవి, ఆలోచింప చేసినవి ఎదురైనప్పుడు వాటిని కథా వస్తువులుగా స్వీకరించి కథలు అల్లేవారు. మొదటి కథ “మారిపోయిన మనిషి ” 1947-48 లలో ప్రచురితమైనది. అన్న ప్రకాశం మృత్యువును ఆధారం చేసుకొని “సాలె గూడు” అన్న కథను రాశారు. శరపరంపరంగా కథలు రాయటానికి, ఇతర కళాత్మక పార్శ్వాలనూ తెలుసుకోవటానికి ప్రయత్నించేవారు. కథల ప్రచురణ గురించి బాధపడేవారు కాదు. పత్రికాధిపతులో, పత్రికా సంపాదకులో రచనలను తిప్పి పంపినంత మాత్రాన తమ రచనలు నిరుపయోగమైనవనీ, విలువ లేనివనీ ఎవరూ నిరాశపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదని, ప్రచురించలేక పోవటానికి వాళ్ళ కారణాలు వాళ్ళ కుంటాయన్న విషయాన్ని కొత్తగా రచనలు చేసేవారు గమనికలోకి తీసుకోవాలని అంటారు భుజంగరావు గారు. “కుక్క ఆత్మ కథ” ప్రచురించబడిన మొదటి నవల. అరణ్య పర్వం (కథల సంపుటి) తో సహా పది దాకా స్వతంత్ర నవలలను- ‘కుక్క ఆత్మ కథ’, ‘అంతా గమ్మత్తు’, ‘సాహిత్య బాటసారి’, ‘శారద’, ‘నైనా’, ‘ప్రజలు అజేయులు’, ‘గమనాగమనం’, ‘గమ్యం దిశగా గమనం’, ‘దిక్కు మొక్కు లేని జనం’ రాశారు. రాహుల్ సాంకృత్యాయన్ “తుమహారీ క్షయ్”, “సత్ మీ కె బచ్చే” అనే పుస్తకాలను 17, 18 ఏళ్ళ వయస్సులోనే ప్రజావాణి (రాత పత్రిక) కోసం అనువాదం చేశారు. అటు తర్వాత అనేక అనువాదాలు చేశారు. ఒక భాష నుండి మరొక భాష లోకి అనువాదం చేసేటప్పుడు మూల రచయిత భావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవాలనీ, భావం దెబ్బతినకుండా అనువాదం చేయాలనీ, మూల భాషా, అనువాద భాషా రెండు భాషల మీదా రచయితకు పట్టు ఉండాలని అనేవారు భుజంగరావు గారు. అలాగే ఒక భాష లోని ఉత్తమ గ్రంథాలను మరొక భాష లోకి అనువాదం చేయటం వలన పాఠకుల మేధో వికాసానికి దోహదం చేసినవారవుతారనే వారు. హిందీ నుండి తెలుగుకు ప్రేమ్ చంద్ (గబన్, రంగభూమి, నోరా), కిషన్ చందర్ (వాయు గుండం, పరాజయం), యశ్ పాల్ (సింహావలోకనం, రామరాజ్యం), సరోజ్ దత్తా రచనలు, రాహుల్జీ వి జయౌధేయ, విస్మృతయాత్రికుడు, లోకసంచారి, దివోదాసు, మధురస్వప్నం, భారతీయ దర్శనం, ప్రాక్పశ్చిమ దర్శనం) అనువాదం చేశారు. తెలుగు నుండి హిందీ కి ‘రాగో’, ‘బొగ్గుపొరల్లో’, ‘అతడు’, ‘నేల తల్లి విముక్తి కోసం’, ‘దండ కారణ్య అమరవీరులు’ అనే రచనలను అనువాదం చేశారు. సాహిత్యాన్ని పాఠకులకు మరింత చేరువగా చేయటం కోసం 1980 ప్రాంతాలలో “రాహుల్ సాహిత్య సదనం” అనే ప్రచురణా సంస్థను ప్రారంభించారు. “ప్రభాత్ “అనే హిందీ పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.
2000 సంవత్సరం నుండీ 2013 దాకా దాదాపుగా 13 సంవత్సరాలు వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే కాకుండా మెదడుకు సంబంధించిన అనారోగ్యంతో కూడా చాలా బాధపడ్డారు. ఒక్కొక్కప్పుడు సమయ, సందర్భాలను ఆయన మెదడు స్వీకరించలేకపోయేది. తనకు వచ్చిన భావనను వెంటనే వ్యక్తపరచాలనుకునేవారు. తన మరుపు మాటలు ఆప్తులనూ, మిత్రులనూ బాధపెడుతున్నాయేమోనని కలవరపడి పోయేవారు అమితంగా బాధపడేవారు. ఒకరకంగా మెదడుకు సంబంధించిన అనారోగ్యం ఆయన మెదడును కబళించేసింది. ఐతే తాను నమ్మిన ఆదర్శం, సిద్ధాంతం ఆశయాల పట్ల చివరి దాకా పూర్తి జ్ఞాపక శక్తితో చాలా ఖచ్చితంగా చెప్పగలిగేవారు. తన సొంత రచనలూ, ఎంతో శ్రమకోర్చి అనువాదం చేసిన అనువాదాలు చాలా పోగొట్టుకున్నారు. అవి వెలుగు చూడాలనీ, ఆ ఆణిముత్యాలను తెలుగు పాఠకులకు అందించాలనీ తపన పడేవారు. సాహితీ పరుల బాధ్యతను గుర్తుచేస్తూ కవి ధరించవలసింది కలమా ఖడ్గమా అన్న మీమాంస వచ్చినప్పుడు సుబ్బారావు పాణిగ్రాహి లాగా కలంతో పాటు ఖడ్గాన్ని కూడా ధరించవలసిందే అని అనేవారు. భవిష్యత్తు తరాలు తప్పనిసరిగా “నాదీ -నాదీ”అనేది లేని సమాజాన్ని నిర్మించుకుంటారని విశ్వసించేవారు. “అక్షరం దిద్దటం పలకటం నేర్చిన దగ్గర నుండీ ఈనాటి వరకూ మానవ జీవితాన్ని, గ్రంథాల్నీ అధ్యయనం చేయటం వీడలేదు. ప్రగతి కాముక, విప్లవాత్మక ఉద్యమాలకూ, పోరాటాలకూ ఆహ్వానం పలకటం మానలేదు” అని “గమనా గమనం” పుస్తకంలో రాసుకున్నారు.
ఈ ప్రపంచాన్ని అర్ధంచేసుకోవటంలో తనకు తోడ్పడిన కమ్యూనిస్టు, మార్క్సిస్టు, మావోయిస్టు భావజాలానికీ, ఆలోచనా విధానానికీ, ఆచరణకూ అత్యంతగా కృతజ్ఞున్నయి, వినమ్రున్నయి తలవంచి అభినందనలు తెలియపరుచుకుంటున్నాననీ సగౌరవంగా చెప్పుకున్నారు. ఏ సిద్ధాంతాన్ని తాను నమ్మారో దాన్నే ఆచరించారు. 1980ల తర్వాత నుంచీ తనువు చాలించేదాకా విప్లవ రచయితల సంఘం సభ్యుడిగా నిజాయితీతో, నిబద్ధతతో తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు.
అశ్రు నయనాలతో…
భుజంగ రావు గారు జోహార్లు. మీ గురించి తెల్సుకున్నాం.
గొప్పగా రాశారు భుజంగరావు గారి వ్యక్తిత్వం, సాహిత్య కృషి గురించి. గురించి. ఆయన కుమార్తెగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న మీకు అభినందనలు.