ఆదివాసీ మహిళల జనజీవనం-వర్తమానం

భారత రాజ్యాంగంలోని 342 వ ఆర్టికల్ కింద ఇప్పటిదాకా నమోదైన ఆదివాసీ తెగలు 700 కి పైన ఉన్నాయి. నమోదు కాని వాటి సంఖ్య ఇంకా చాలా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆదివాసీ జనాభా మొత్తం జనాభాలో 8.6% గా ఉంది. అంటే దాదాపు 10.4 కోట్లు. భారత దేశంలో ఉన్న తెగలన్నీ ఒకేలాగా లేవు. కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ వారు నివసించే ప్రాంతాన్ని బట్టి అక్కడి భౌగోళిక, నైసర్గిక, చారిత్రక, రాజకీయ పరిస్థితిని బట్టి భిన్న సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు, ఆర్థిక జీవనం కలిగి ఉన్నారు. కాబట్టి కొన్ని ప్రధానమైన తెగల గురించిన సమాచారం మీద ఆధారపడి ఆదివాసీ మహిళల గురించి చర్చించుకుందాం.

ఆదివాసీ సముదాయం అని చెప్పడానికి కొన్ని సాధారణ లక్షణాలు ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే …1. ఒక భౌగోళిక భూభాగానికి పరిమితమై జీవించడం; 2. చాలా ప్రాథమికమైన ఉత్పత్తి విధానాన్ని కలిగి ఉండటం; 3. ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు వాటికి సంబంధించిన నియమాలు, కట్టుబాట్లు, ప్రత్యేకమైన భాష కలిగి ఉండటం. సాధారణంగా ఆ భాషకు లిపి లేకపోవడం; 4. తెగపెద్దల అధికారాన్ని సంపూర్ణంగా ఆమోదించే ఒక రాజకీయ కట్టుబాటు; 5. మొత్తం జాతి ఉత్పత్తి కోసం, సామాజిక అవసరాల కోసం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండకపోవడం – అంటే విస్తృత శ్రమ విభజన లేకపోవడం. సాధారణంగా ఈ నియమాలు ఇలాగే కొనసాగాలంటే ఏ ఉల్లంఘనలు జరగకుండా చూడాలి. అంటే సామాజిక సంబంధాల్లో తీవ్రమైన కట్టుబాట్లు ఉండాలి. సరిగ్గా అక్కడే స్త్రీల మీద అణచివేత మొదలవుతుంది.

ఆదివాసీ తెగలను అధ్యయనం చేయడానికి ఆంత్రోపాలజిస్టులు ఆ సమూహాలను కొన్ని ప్రాతిపదికల ఆధారంగా కొన్ని పద్ధతుల్లో విభజించారు. అందులో కొన్ని ప్రముఖమైనవాటిలో ఒకటి బి.ఎస్. గుహ చేసిన వర్గీకరణ. ఆయన భౌగోళిక ప్రాంతాల ఆధారంగా మూడు రకాలుగా విభజించారు. ఉత్తర, ఈశాన్య మండలం (జోన్), మధ్య మండలం, దక్షిణ మండలం. అయితే ఇందులో నాలుగవ మండలంగా అండమాన్ నికోబార్ దీవుల ఆదివాసీ సమూహాలను చేర్చవచ్చు అని ప్రముఖ ఆంత్రోపాలజిస్టు నదీమ్ హస్నైన్ అంటారు. జాతి ఆధారంగా ఉండే కొన్ని సాధారణ శారీరక లక్షణాలు తీసుకొని ఒక వర్గీకరణ, వారు ఉపయోగించే భాషకు మాతృకగా ఉండే ప్రధాన భాషల ఆధారంగా ఒక వర్గీకరణ కూడా ఉన్నప్పటికీ సౌలభ్యం కోసం నేను మొదటి రకమైన వర్గీకరణ ప్రాతిపదికగా ఒక్కొక్క మండలం కిందికి వచ్చే కొన్ని సమూహాలను ఎంచుకొని “ఆదివాసీ మహిళల జీవన చిత్రణ – వర్తమానం” అనే అంశాన్ని చర్చిస్తున్నాను.

ఆర్థిక జీవనం –ఉత్పత్తిలో మహిళల పాత్ర:
ఆదివాసీ సముదాయాలలో ప్రధానంగా ఉండే ఉత్పత్తి విధానం చాలా ప్రాథమికమైనది. వారి ఆహారానికి, జీవితావసరాలకు చేసే ఉత్పత్తి చాలా వెనుకబడినది. ప్రధానంగా 1. వేట, 2. ఆహార సేకరణ, 3. పశుపోషణ, 4.వ్యవసాయం 5. చేతి వృత్తులు మొదలైన కార్యకలాపాల చుట్టూనే ఉంటుంది. తరవాతికాలంలో, అంటే బ్రిటిష్ వలసగా మారిన క్రమంలో 6. వేతన శ్రమ కూడా మొదలయ్యింది.

వేట: తూర్పు కనుమలలో జీవించే ఆదివాసీ తెగలు – సవర, జాతాపు, కోందు, కోయ, నూక దొర, భగత, కొండరెడ్డి, పొరజ, రాణా, కొటియా, వాల్మీకి, దొర్ల మొదలైనవి. (కోందు, జాతాపు వేరువేరు తెగలు కావు. ఒకే తెగ. ఒక ప్రాంతాల్లో కోందుగా ఒక ప్రాంతంలో జాతాపుగా పిలుస్తున్నారు. అలాగే భగత, కొండరెడ్లు ఒకటే జాతి.) వీరిలో పురుషులు వేట చేస్తారు. మహిళలకు వేట నిషేధం. కనీసం విల్లు ముట్టుకున్నా పురుషులు సహించరు. స్త్రీలు విల్లు ముట్టుకుంటే ఇక ఆ విల్లు వేటకు పనికిరాదని భావిస్తారు. స్త్రీలు ప్రధానంగా చేపలు, పీతలు, బొడ్డెంగిలను ఈత చెట్టులో ఉండే పురుగులను వేటాడతారు. పురుషులు తుపాకితోను, బరిసెతోను వేట చేస్తారు. వేట అనగానే పెద్ద జంతువులనే వేట చేస్తారనుకోనక్కర్లేదు. లేళ్ళు, దుప్పులు, పందులు, కుందేళ్ళు, నెమళ్లు, ఇతర పక్షులు, ఉడుములు, చేపలు తదితర అనేకమైనవి ఉంటాయి. అయితే కొన్ని పండుగ రోజుల్లో స్త్రీలు పురుషులు కలిసి వేటకు వెళ్తారు. స్త్రీలు జంతువుల్ని తరిమితే పురుషులు జంతువుల్ని కొడతారు. అంతేకానీ స్త్రీలు ఆయుధాలు పట్టుకోరు. భగతల్లో , కొటియాల్లో, రాణాల్లో ఒక పండుగ సందర్భంలో ఆడవాళ్లు మగవాళ్ళని వేటకు తరమడం ఉంటుంది. పేడ నీళ్లు బురద వంటివి చల్లి మగవాళ్ళను వేటకు తరుముతారు. వేట పడకపోతే మగవాళ్ళు తలదించుకొని వస్తారు. వేట అయితే మాత్రం దురదగుండి ఆకును తీసుకువచ్చి మహిళలకు పూస్తారు. మహిళలు దాక్కున్నా కూడా వెతికి వెతికి వాళ్ల జాకెట్లు తీసేసి మరీ పూస్తారు. వారి విజయోత్సవం మహిళల పాలిట బాధాకర అనుభవంగా మారుతుంది. మాంసం కోసే ప్రాంతానికి కూడా మహిళలని వెళ్ళనీయరు. కోందులలో వండిన మాంసాన్ని కూడా పురుషులే కుటుంబ సభ్యులకు పంచుతారు. మధ్య ప్రదేశ్ లో నివసించే ‘బైగా’ మహిళలు పురుషులతో పాటు చేపల, పీతల వేటకు వెళతారు. ఒక్కొక్కసారి మహిళలు మాత్రమే బృందాలుగా కలిసి వెళతారు. వాటికోసం 30 కిలోమీటర్ల దూరాల వరకూ కూడా వెళ్తారు. వాగుల వద్ద మూడు నాలుగు రోజులపాటు మకాం వేస్తారు. జార్ఖండ్, ఒరిస్సా, అస్సాం, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో నివసించే సంథాలీ మహిళలకు కూడా వేట నిషేధం. వీళ్ళు బాణాలు ప్రయోగించరాదు. చెంచులు ప్రధానంగా ఎలకలు, చుంచులు వంటి వాటిని పడతారు. తమిళనాడు లోని నీలగిరి కొండల్లో నివసించే ‘తోడ’ జాతి ప్రజలు వేటలో అస్సలు పాల్గొనరు. వారు శాఖాహారులు.

స్త్రీలు ప్రకృతి సహజమైన పిల్లల్ని కనడం అనే బాధ్యత నిర్వహిస్తారు కాబట్టి తమ జాతిని విస్తరించే పనిలో ఉన్న స్త్రీల ప్రాణానికి ప్రమాదం వాటిల్లకుండా ఉండడానికి వారిని వేట నుండి మినహాయించి ఉంటారనీ, కానీ అది పరోక్షంగా పురుషులకు ఆయుధాల మీద అదుపు కలిగి ఉండడం ద్వారా సామాజిక వ్యవస్థలో కూడా వారికి పెత్తనం చేసే అవకాశం కలిగిందనీ, ఇది పిత్రుస్వామ్య గణాలుగా మారేందుకు మార్గం సులువు చేసిందని ఆంత్రోపాలజిస్టులు అంటారు. ఆదిమ సమాజాలలో పురుషులతో సమానంగా వేటలో పాల్గొన్న స్త్రీ క్రమంగా వేటలో సహాయకారిగా మారి ఆ తర్వాత వేట నుండి పక్కకు జరిగిపోయింది. అలా కొట్టడం, కోయడం అనేది ఆమెకు తెలియకుండా పోయింది.

ఆహార సేకరణ: భారత దేశంలోని దాదాపు అన్నితెగల్లోనూ ఆహార సేకరణలో ప్రధాన పాత్ర స్త్రీలదే. వేట, ఆహార సేకరణల్లో ఒక సాధారణ శ్రమ విభజనగా అది మొదలయ్యిందని చెప్పచ్చు. అడవిలో దొరికే అనేక ఆకులు, కాయలు, పువ్వులు వంటివి, వంట చెరకు వంటివి స్త్రీలు సేకరించుకొని వస్తారు. విప్పపువ్వులు ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఝార్ఖండ్, బెంగాల్ లలోని అడవుల్లో చాలా ప్రదేశాల్లో ఉంటాయి. (బీహార్, ఝార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో మహువా అంటారు) జనవరి నుండి ఏప్రిల్ నెల వరకూ విప్ప పువ్వుల సీజన్ ఉంటుంది. ప్రతి రోజూ తెల్లవారి మూడు గంటలకే ఏరడం మొదలుపెడతారు. సాధారణంగా తల్లి వెంట చిన్న పిల్లలు కూడా గంపలు పట్టుకొని వెళ్తారు. మే నెల వచ్చేసరికి విప్పకాయలు బాగా పండి గింజపడతాయి. ఆ విప్ప పండ్లు ఏరడానికి ఎర్రని ఎండలో కూడా తిరుగుతూనే ఉంటారు. ఈ గింజలతో నూనె తయారు చేస్తారు. దానిని కూడా సాంప్రదాయ పద్ధతుల్లోనే తయారుచేస్తారు. విస్తరాకులు కుట్టడానికి, దైనందిన అవసరాలకు వాడే డొప్పలు తయారు చేసుకోడానికి కూడా ఆకు తెంపుకురావడానికి వెళ్తారు. తునికాకు సీజన్ లో తునికి ఆకులు, తునికి పండ్లు, చింతకాయలు, కుంకుడు కాయలు ఇంకా అనేకమైన వాటిని సేకరిస్తారు. తూర్పు కనుమల్లో ఆదివాసీ మహిళలు ప్రధానంగా దుంపలు, ఆకుకూరలు సేకరిస్తారు. సంథాలి స్త్రీలు పుట్టగొడుగులు, వెదురు పొదలకు మాత్రమే వచ్చే ప్రత్యేకమైన పుట్టగొడుగులు, లేత వెదురు మొలకలు కొట్టుకొని వస్తారు. వీటిని ‘కరిల్’ అంటారు. దానితో కూర వండటం కానీ, ఊరగాయ గానీ చేస్తారు. బంజారాలలో స్త్రీలతో పాటు పురుషులు కూడా ఆహార సేకరణలో పాల్గొంటారు. మధ్యప్రదేశ్ లోని బైగా జాతి మహిళలు ఉసిరికాయలు సేకరించి ఉడకపెట్టి ఉప్పుచల్లి వాటితో ‘ఆమ్లా సుపారి’ తయారుచేసి అమ్ముతారు. ‘చరోట’ విత్తనాలు, పావురాకులు మొదలైనవి సేకరించి టేకేదార్లకు అమ్ముతారు. దక్షిణ ప్రాంతాల్లో తేనెపట్టు తేనె కోసమే కాకుండా, తేనెటీగ గుడ్ల కోసం కూడా పడతారు. వాటిని కాల్చి తింటారు. నీలగిరి కొండల్లో నివసించే కట్టు నాయకన్లు, కురుంబలు, తేనె సేకరణ ప్రధానంగా చేస్తారు. ఇరుళ జాతి వారు చెట్ల మందుతో వైద్యానికి ప్రసిద్ధులు. వాటికి కావల్సిన ఆకులు, బెరడు, వేర్లు, దుంపలు వంటివి సేకరిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా జిల్లాల్లో జీవించే చెంచులు కూడా ప్రధానంగా ఆహార సేకరణ మీదే ఆధారపడతారు. నల్లమల అడవిలో ఎన్నోశతాబ్దాలు అస్సలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించారని ఆంత్రోపాలజిస్టులు రాశారు. బ్రిటిష్ కాలం నాటికి చెంచు స్త్రీ పురుషులు ఇరువురు ఆకులు మొలకు చుట్టుకొని జీవించిన కాలం. అక్కడనుండి మెల్లగా గోచీల్లోకి మారారు. ఇప్పుడు బయట సమాజానికి దగ్గరగా ఉండే గ్రామస్తుల వేషధారణ ఉంటుంది. ప్రధానంగా ఆహారసేకరణ మీద సుదీర్ఘకాలం ఆధారపడ్డ జాతి ఇది. ప్రస్తుతం అంతరించిపోతున్న తెగలుగా గుర్తించిన 74 జాతులలో చెంచులు కూడా ఒకరు.

పశుపోషణ: భారతదేశంలో ఇప్పటికీ పశుపోషణ ప్రధాన వృత్తిగా జీవించే తెగలు చాలా ఉన్నాయి. తమిళనాడులోని నీలగిరి కొండల్లో నివసించే ‘తోడా’ జాతి ప్రజలు పశుపోషణ మీద జీవిస్తారు. ప్రధానంగా గేదెలను పెంచుతారు. వాటి పాలను, పాల ఉత్పత్తులను తయారుచేసి అమ్ముతారు. గేదెలను పూజిస్తారు. సాధారణంగా ఇవి సంచారంలో ఉన్న తెగలు. పచ్చిక బయళ్ళు ఉండే ప్రదేశాలకు వాటిని తోలుకుంటూ సంచార జీవనం చేస్తారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే ‘గడ్డీ’లు, హిమాచల్ ప్రదేశ్ లోని శివాలిక్ కొండల్లో శీతాకాలాలు గడిపి వేసవిలో స్పితి, లాహుల్ వంటి ప్రదేశాలకు పశువులను తీసుకొని పోతారు. జమ్ము కాశ్మీర్ లోని ‘గుజ్జర్ బకర్ వాలాలు’ మేకలు, గొర్రెలు, జడల బర్రెలను (యాక్) పెంచుతారు. లద్ధాక్ లో ‘చాంగ్ ప’ జాతి కూడా పశుపోషణ మీదే జీవిస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని గొల్ల, కురుమ, కురుబా, లంబాడీలు (సుగాలీలు, బంజారాలు) కూడా పశుపోషణ ప్రధానంగా చేస్తారు. బంజారాలు ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో కూడా ఉన్నారు. కుటుంబాలతో సహా సంచారంలో ఉండే ఈ తెగల్లో స్త్రీలు పశువులను కాయడంతో పాటు, పాలు పితకడం, వంట పని, ఇంటిపని, దూర దూరాలనుండి నీళ్ళు మోసుకు రావడం వంటి పనులన్నీ చేస్తారు. కానీ పశుపోషణతో వచ్చే ఆదాయంలో వారి దోహదం గురించి మాత్రం ఎక్కడా నమోదు కాదు. గొర్రెలను పెంచేవారు వాటి బొచ్చుని కత్తిరించి గొంగళ్ళు తయారు చేస్తారు. కత్తిరింపు పనులు మగవాళ్ళు చేస్తారు. స్త్రీలు గొంగడి నేసే పనిలో పాల్గొంటారు. సాధారణంగా పశుపోషణే వృత్తిగా జీవించే సమూహాల్లో పశుపోషణలో స్త్రీల భాగస్వామ్యానికి అసలు గుర్తింపు లేకపోవడం కనిపిస్తుంది. తూర్పు కనుమల్లో కొన్ని చోట్ల గుర్రాలను కూడా పెంచుతారు. కానీ స్త్రీలు వాటిని ఎక్కడం నిషేధం.

వ్యవసాయం: సాధారణంగా పోడు వ్యవసాయం ఎక్కువ. అంటే అడవిలో ఒక చోట కొంత భాగం ఎంచుకొని (సాధారణంగా వేసవి కాలంలో) చెట్లు నరికి వాటిని అలా వదిలేస్తారు. బాగా ఎండిన తరవాత వాటిని తగలబెట్టి ఆ బూడిద మీద విత్తనాలు చల్లుతారు. ఆ తరవాత వర్షాలు పడినప్పుడు వాటికవే మొలుస్తాయి. వచ్చిన పంటను తీసుకుంటారు. ఈ చెట్లు నరికి తగలబెట్టే పని పురుషులు చేస్తారు. ఆ తరవాత విత్తనాలు చల్లడం, పంట కొయ్యడం పంట కోశాక వాటిని వినియోగంలోకి తెచ్చే శ్రమ మొత్తం స్త్రీలదే. ఒక చోట ఒకటి రెండు పంటలు తీశాక ఇంక అక్కడ వదిలేసి మరొక చోట చేస్తారు. బ్రిటిష్ వారు రాకపూర్వం దాదాపు అన్ని తెగలు పోడు వ్యవసాయం లోనే ఉండేవి. ఆ తరవాత బ్రిటిష్ ప్రభుత్వం అడవుల మీద అదుపు సంపాదించడానికి పోడు వ్యవసాయాన్ని నిషేధించింది. అధికార మార్పిడి జరిగాక కూడా పోడు వ్యవసాయం మీద నిషేధం కొనసాగింది. అయినా కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పోడు వ్యవసాయం కొనసాగుతుంది. ఉత్పత్తి సాధనాలు లేకుండా, స్థిర వ్యవసాయం గురించి ఎక్కువ తెలియని ప్రజలు సుదీర్ఘ కాలం చాలా కష్టాలు పడ్డారు.

వివిధ ప్రాంతాలలో వివిధ పంటలు పండించినా ప్రధానంగా రాగులూ, సామలు, కొర్రలు వంటి చిరుధాన్యాల పంటలే ఎక్కువ. తూర్పు కనుమల్లోనూ, దక్షిణ ప్రాంతాల్లోనూ వరి కూడా పండిస్తారు. పండిన పంటను ఆహారంగా వినియోగం లోనికి తేవడానికి మహిళలు బాగా శ్రమ చేయాల్సి ఉంటుంది. రోలుని, తిరగలిని ఉపయోగించి చిరు ధాన్యాలని దంచి పిండి చేయడానికి లేదా ఒక కేజీ ధాన్యం తయారు చేయడానికి గంట గంటన్నర పడుతుంది.

స్థిర వ్యవసాయంలో కూడా చిన్న చిన్న ఉపకరణాలతో నేలను పెళ్ళగించి చేసే వ్యవసాయ పద్ధతులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని బైగా జాతి ప్రజలు నాగలితో దున్నడం అంటే భూమి తల్లి ఎదలో గునపాలు గుచ్చడం అని విలవిలలాడతారు. సుదీర్ఘకాలం పాటు నాగలి పట్టి దున్నలేదు. పోడు వ్యవసాయంలోనే ఉన్నారు. నాగలి పట్టి దున్నే చోటకూడా మహిళలు నాగలి పట్టకూడదనే నియమాలు ఉన్న తెగలే ఎక్కువ. బైగా మహిళలు నాగలి పట్టి దున్నడం తప్ప మిగతా అన్ని వ్యవసాయ పనుల్లోనూ పాల్గొంటారు. సంథాలీ మహిళలు కూడా నాగలి పట్టి దున్నడం నిషేధం. కోందు మహిళలు నాగలి పట్టుకోకూడదు. వైనాడ్ లోని (కేరళ) కురిచ్చియనుల్లో కూడా స్త్రీలు విత్తనాలు చల్లడం, కలుపు తీయడం, కోతలు కోయడం వరకే పరిమితం. కురిచ్చియనులలో మహిళలు ఈత కల్లు గీసే పనిచేస్తారు. దానిని తయారుచేయడం, అమ్మడం వంటివన్నీ మహిళలే చేస్తారు.

కోయ తెగల్లో వ్యవసాయంలో స్త్రీలు నాగలి పట్టి దున్నడం కూడా చేస్తారు. కోందుల కంటే కోయపురుషులు వేట ప్రియులు. కాబట్టి వాళ్లు వేటకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నాగలి మహిళల చేతిలో మిగిలి ఉంటుంది. అయితే ఈ వ్యవసాయపు పని మహిళలకు అదనపు భారంగానే ఉంటుంది. ఇక్కడ మహిళలు అర్ధరాత్రి నిద్రలేచి దంపుళ్ళు నీళ్లు వంట వగైరా ఇంటి పనులు ముగించుకొని ఉదయం ఐదున్నర గంటలలోపే పురుషులతోపాటు వ్యవసాయపు పనికి వెళ్తారు. పురుషులతో సమానంగా ఇంకా ఎక్కువగానే దుక్కులు దున్నడంతోపాటు అన్ని పనులు చేస్తారు. వ్యవసాయంలో ఇంత ప్రాధాన్యత కలిగి ఉన్నప్పటికీ మహిళలు వ్యవసాయపు పనిలో ఎదుర్కునే వివక్ష తక్కువ ఏమీ కాదు. దుక్కిలో సమానంగా ఉండే మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి నాగలి కట్టకూడదు. మొదటి నాగలి పురుషుడే కట్టాలి. ఒకవేళ పురుషులు ఎవరూ లేకుంటే ఆరోజు దుక్కులే ఆపేస్తారు. ఒకవేళ కుటుంబంలో మగవాళ్ళు చనిపోయి తల్లి కుటుంబ పెద్దగా మారిన పరిస్థితుల్లో ఆమె మొదటి నాగలి కడుతుంది. అయితే ఇది చాలా అరుదైన విషయమే. దుక్కులు దున్నే ముందు విత్తనాలు వేసే ముందు పండుగలు చేస్తారు కానీ ఆ పండుగలకు స్త్రీలను రానివ్వరు. స్త్రీలు తాము దుక్కి దున్ని చెమటను ధార పోసి పండించిన పంట కళ్ళాల్లోకి చేరిన తర్వాత ఆ కళ్ళంలోకి వాళ్లు వెళ్ళకూడదు.

కేరళలోని వైనాడ్ లో జీవించే కురిచ్చియనులు స్థిర వ్యవసాయంలో బాగా ప్రాచుర్యం పొందారు. వరి, రాగులు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పెండలం వంటి వాటితో పాటు, కాఫీ తోటలు, మిరియాలు, కూరగాయలూ పండిస్తారు. కురిచ్చియన్ స్త్రీలు కూడా నాగలి పట్టి దున్నడం తప్ప వ్యవసాయ పనులన్నీ చేస్తారు.
చేతి వృత్తులు: పశుపోషణలో ఉన్న కొన్ని జాతుల స్త్రీలు ముఖ్యంగా వెదురు వనాలు ఉన్న చోట్ల గంపలు, బుట్టలు వంటి అనేక రకాల వస్తువులను వెదురుతో తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని ఎరుకలలో కూడా ప్రధానంగా వెదురు బుట్టలు అల్లుతారు. ఎరుక మహిళలు “సోది” చెప్పడం (భవిష్యత్తు గురించి చెప్పడం) ద్వారా కూడా తమ నిత్యావసరాలను సంపాదించుకుంటారు. బంజారాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిష, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధానంగా జీవిస్తున్నారు. (ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం ఎక్కడా లేరు) వేరు వేరు రాష్ట్రాల్లో వేరు పేర్లతో వ్యవహరిస్తున్నప్పటికీ బంజారాలుగా ప్రసిద్ధి. అంతటా ఒకే భాష మాట్లాడతారు. గోర్ అంటే తమ వాళ్ళు. కోర్ అంటే పరాయివాళ్లు. గోర్, గోర్ బంజారా, లామన్, లంబానీ, లంబాడీ , గోర్ రాజ్ పుట్, నాయక్, బల్దియా, గౌరియా తదితర పేర్లతో ఉన్నారు. బంజారా స్త్రీలందరూ ఎంబ్రాయిడరీ చేస్తారు. లంబాడీ స్త్రీలు చేసే అద్దాలు, పూసలతో చేసే ఎంబ్రాయిడరీ గురించి తెలిసిందే. అలాగే గుజరాత్ లోని కచ్ ప్రాంత బంజారాలు చేసే కచ్ వర్క్, మరికొన్ని చోట్ల చిన్న చిన్న శంఖాలు కూడా ఉపయోగించి చేసే ఎంబ్రాయిడరీ, ఇలా వివిధ రాష్ట్రాలలో ఈ కుట్టుపని చాలా ప్రాచుర్యం పొందింది. తెలుగు రాష్ట్రాల్లోనూ, గుజరాత్ లోనూ చేసే ఎంబ్రాయిడరీ దేశ విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. లంబాడీ స్త్రీలు సాధారణంగా తమ శైలిలో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు.

గుజరాత్ లోని పశుపోషణలో ఉండే సంచార తెగల స్త్రీలు చేసే మరొకరకమైన ఎంబ్రాయిడరీ పేరు ‘కత్తి’. కాడ కుట్టు, అప్లిక్ వర్క్ లతో కూడుకుని ఉంటుంది. నీలగిరి కొండల్లో నివసించే తోడా స్త్రీలు (పురుషులు కూడా చేస్తారు) చేసే ఎంబ్రాయిడరీ కూడా చాలా విభిన్నమైనది. కేవలం ఎరుపు, నలుపు రంగు దారాలు మాత్రమే వాడి ప్రధానంగా శాలువాల మీద ఎంబ్రాయిడరీ చేస్తారు. దీనిలో చాలా జామెట్రి ఉంటుంది. ఎన్ని అంగుళాల తరవాత కుట్టు రావాలి, ఎన్ని కుట్లు పడాలి అనేదానికి ఒక లెక్క ఉంటుంది. స్థానికంగా ‘పుగుర్’ అంటారు. శాలువాల మీద కుట్టి అమ్మే దానిని ‘పూత్ కులీ’ అంటారు. పురాతన కాలంలో వీటిని నారతో చేసేవారు. ఇప్పుడు దారాలు వాడతారు. ప్రధానంగా స్త్రీలు పురుషులు ఒకే రకమైన వేషధారణలో ఉంటారు. లుంగీ కట్టుకొని, పైన చుట్టూ శాలువా కప్పుకొంటారు. వీరు కప్పుకొనే శాలువాలకి ఆ ఎంబ్రాయిడరీ ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా ఈ డిజైన్లు వాళ్ళు పొడిపించుకొనే పచ్చబొట్ల డిజైన్లను పోలిఉంటాయి. వీరి కుట్టుపనికి 2012 లో “భౌగోళిక సూచిక” (జియోగ్రాఫికల్ ఇండికేషన్) గుర్తింపు కూడా వచ్చింది. అంటే ఒక నిర్ధిష్ట భౌగోళిక మూలం కలిగి ఉన్న ఉత్పత్తిగా గుర్తింపు. ముఖ్యంగా బంజారా తెగలలో ఎంబ్రాయిడరీ నుండి వచ్చే ఆదాయం కుటుంబ ఆదాయంలో చాలా గణనీయమైనదిగా ఉంటుంది.

వేతన శ్రమ: బ్రిటిష్ ఆక్రమణ తరవాత 1823లో తేయాకును గుర్తించాక టీ కంపెనీలకు స్థానిక శ్రామికులు దొరకడం కష్టం అయ్యింది. దాంతో తేయాకు తోటలు పెంచే దగ్గర స్థానికంగా కానీ, చుట్టుపక్కల రాష్ట్రాల సరిహద్దుల్లోని ఆదివాసీ కుటుంబాలను, కొందరిని బలవంతంగానూ కొందరిని మిషనరీల సహాయంతోనూ తరలించారు. ప్రధానంగా అస్సాం తేయాకు తోటల్లో పని చేయడానికి సంథాలీ కుటుంబాలను చోటానాగపూర్ నుండి (ఉమ్మడి బీహార్, ప్రస్తుత జార్ఖండ్) అలా తరలించారు. బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని అటవీ చట్టాలను చేసి ఆదివాసులకి అడవి మీద ఉన్న హక్కులని లాగేసుకుంది. అధికార మార్పిడి తరవాత భారత ప్రభుత్వం కూడా అడవిని జాతీయం చేసింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అటువంటి చట్టాన్ని మొట్టమొదట చేసింది. దాంతో పోడు వ్యవసాయం నిషేధించబడింది. చాలా అటవీ ఉత్పత్తులను సేకరించడానికి ప్రభుత్వం ఏజెంట్లను పంపింది. లేదా ప్రైవేటు కాంట్రాక్టర్లకు లైసెన్సులు మంజూరు చేసింది. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రభావం పడ్డది మహిళల మీదనే. ప్రధానంగా ఆహారసేకరణ చేసేది వారే కాబట్టి వారిప్పుడు అటవీ ఉత్పత్తులను సేకరించే కూలీలుగా మిగిలిపోయారు. పట్టణాలతో సంబంధాలలోకి వచ్చిన అనేక ఆదివాసీ తెగల మహిళలు మహా నగరాలకి వలస పోయి ఎగువ మధ్యతరగతి, ఉన్నత తరగతి కుటుంబాలలో పని మనుషులుగా, పిల్లలను ఆడించే వాళ్ళుగా, వంట మనుషులుగా పనిచేస్తున్నారు. బీహార్ ఝార్ఖండ్ నుండి అట్లా సంథాలీ, ఒరాంవ్ యువతులు ఢిల్లీ, ముంబయి వంటి మహానగరాలకి ఇంట్లో చెప్పకుండా పారిపోతుంటారు. ఉత్తర భారత దేశంలోని సంపన్న కుటుంబాలు ఆదివాసీ యువతులను పనిమనుషులుగా పెట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. వాళ్ళు నిజాయితీగా, నమ్మకంగా పనిచేస్తారనేది ప్రధాన కారణం. అయితే ఝార్ఖండ్ నుండి వెళ్ళే ఇలాంటి యువతులు చాలా సార్లు పని చూపించే ఏజెంట్ల చేతిలో పడి మోసపోతుంటారు. కొన్ని సార్లు మహిళలు కూడా అలా ఏజెంట్లుగా ఉంటారు. మహిళలను తేలిగ్గా నమ్ముతారు కనక అలా వెళ్ళి వేశ్యా గృహాల పాలవ్వడం అనేది కూడా ఒక తీవ్రమైన సమస్యగా ఉంది. సుగాలీ స్త్రీలు, పురుషులు కంపలు నరికే పని వగైరా కాంట్రాక్టుకు తీసుకుని చేస్తారు. ఇందులో స్త్రీలు చాలా శ్రమ చేస్తారు. కానీ ఆ ఆదాయం మొత్తం పురుషుల చేతిలోకి వెళ్తుంది. ఎక్కడ పని ఉంటే అక్కడికి వలసపోతారు. కాంట్రాక్టర్లు వీరిని చాలా తిప్పలు పెడుతుంటారు. వ్యవసాయ కూలీలుగా కూడా గణనీయమైన సంఖ్యలో ఆదివాసీ మహిళలు పనిచేస్తున్నారు. రోడ్డు పనులు, తట్టలు మోసే పనుల్లో కూడా వివిధ ప్రాంతాల ఆదివాసీ మహిళలు పనిచేస్తున్నారు. తునికాకు, వెదురు కాంట్రాక్టర్లు ప్రభుత్వం దగ్గర లైసెన్సు తీసుకుని వచ్చినపుడు తునికి ఆకులు తుంచి తీసుకు వచ్చే పని ప్రధానంగా మహిళలు చేస్తారు. వంద ఆకులు కలిపి ఒక కట్ట. అలాంటి 100 కట్టలు ఒక షేకడా. తునిక చెట్లు ఉండే దగ్గర అంతా తునికాకు సేకరణలో పాల్గొనని ఆదివాసీ కుటుంబం ఉండదు. అలాగే వెదురు పొదలు నరికే పని ప్రధానంగా మగవాళ్లు చేస్తే మహిళలు వాటిని మోపులుగా (కూపులు) కట్టి మోసుకు వెళ్తారు.

వేతన శ్రమలో పాల్గొనే ఆదివాసీల్లో పురుషుల కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉందని 2011 లోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. సంవత్సరానికి 158 రోజుల పాటు వ్యవసాయ సంబంధిత పనుల్లో వేతన శ్రామికులుగానూ, 150 రోజులు అటవీ ఉత్పత్తుల సేకరణ పనుల్లో వేతన శ్రామికులుగానూ ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ఆదివాసీ పెళ్ళిళ్ళు:
స్త్రీల శ్రమకి ఆదివాసీ సమాజంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. వివాహం అయిన తరవాత తమ కుటుంబం నుండి ఒక స్త్రీ బయటికి వెళ్ళడం అంటే ఒక శ్రమ చేసే వ్యక్తిని కోల్పోవడం. కాబట్టి ఒక వ్యక్తిని ‘ఇవ్వడం’ ద్వారా పొందిన నష్టాన్ని పూడ్చుకోవడం కోసం మరొక ఆడపిల్లని అవతలి కుటుంబం నుండి తెచ్చుకొనే ‘హక్కు’ తమకు ఉందని భావిస్తారు. భారత దేశపు అన్ని తెగల్లోనూ అంతర్వివాహాలు, అందులోనూ మేనరికాలు ఉన్నాయి. కొన్ని చోట్ల రెండు వైపులా ఇచ్చిపుచ్చుకోడాలు ఉంటే కొన్ని చోట్ల ఒకవైపు మాత్రమే ఉన్నాయి. కన్యాశుల్కం కూడా అన్ని జాతుల్లోనూ ఉన్న ఆచారం. భర్త చనిపోయిన స్త్రీలకు పునర్వివాహం చేసుకోవడం కూడా సాధారణ విషయమే. విడాకులు తీసుకోవడం కూడా కష్టమైన పని కాదు. అంతర్వివాహ పద్ధతుల్లో కూడా మేనరికాలు అనేది సర్వ సాధారణమైన విషయం.
అంతర్వివాహాలు: అంతర్వివాహాల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మేనరికాలు (క్రాస్ కజిన్ మ్యారేజ్) ఒక స్త్రీ తన పిల్లలకి తన అన్నదమ్ముల పిల్లల్తో వివాహం చేయడం. రెండోది సమాంతర పిత్రిమ సంతతి వివాహాలు (పారలల్ కజిన్ మ్యారేజ్) అన్నదమ్ముల పిల్లల మధ్య వివాహాలు, లేదా అక్క చెల్లెళ్ల పిల్లల మధ్య వివాహాలు.

దేవర న్యాయ వివాహం (lavirate marriage): దేవర న్యాయ వివాహం అంటే ఒక స్త్రీ తన భర్త మరణానంతరం ఆయన సోదరుడిని వివాహం చేసుకోవడం. ఇది చాలా తెగల్లో సాధారణమైన విషయం. అయితే ఇందులో ఆ స్త్రీ తన భర్త తమ్ముడిని వివాహం చేసుకుంటే కనిష్ట దేవర న్యాయం. భర్త అన్నను చేసుకుంటే జ్యేష్ట దేవర న్యాయంగాను వ్యవహరిస్తారు. కానీ గడ్చిరోలిలోని మాడియా తెగ సాంప్రదాయంలో కనిష్టదేవర న్యాయ వివాహం మాత్రమే అమలులో ఉంది. జ్యేష్ఠ దేవర న్యాయ వివాహం నిషిద్ధం.

భార్య భగిని న్యాయవివాహం (sorarate marriage): పురుషుడు తన భార్య చెల్లెలిని రెండవ వివాహం చేసుకుంటే దానిని భార్య భగిని న్యాయవివాహం అంటారు. పురుషులలో ఈ వివాహం భార్య జీవించి ఉన్నప్పుడు గానీ మరణించాక కానీ చేసుకోవచ్చు. ఒక సోదరినే చేసుకోవాలనే నియమం కూడా ఏమీ లేదు, ఎందరు చెల్లెళ్ల నైనా చేసుకోవచ్చు. కానీ భార్య మాత్రం భర్త జీవించి ఉండగా మరో వివాహం చేసుకోకూడదు.

మేనరికాలు: అంతర్వివాహాల్లోని పై రెండు పద్ధతుల్లో గడ్చిరోలిలో కేవలం మొదటిది మాత్రమే అమలవుతోంది. అన్న చెల్లెల పిల్లల వివాహం అవడం మాత్రమే ఉంది తప్ప సమాంతర పిత్రిమ సంతతి వివాహం మాత్రం నిషేధమే. మాడియా తెగల్లో ఉండే మేనరికాలను ఫుటుల్ అంటారు. రెండువైపులా ఇచ్చిపుచ్చుకోడాలు ఉన్నప్పటికీ ఒక కుటుంబం వారు మరో కుటుంబానికి అమ్మాయిని ఇచ్చి ఆ తర్వాత ఆ అమ్మాయికి పుట్టిన ఆడసంతానాన్ని తిరిగి తమ కుటుంబాల్లోని మగసంతానానికి తెచ్చి పెళ్లి చేయడం హక్కుగా భావించడమే పుటుల్ పద్ధతి. మరో కుటుంబానికి వెళ్లిన స్త్రీ తన అన్నదమ్ముల బిడ్డలను తిరిగి తన కొడుకులకు తెచ్చుకోకూడదని నియమం ఏమీ లేదు. నిషేధం కూడా లేదు.

కోయ లేదా రాజ గోండులలో స్త్రీ తన కడుపున పుట్టిన పురుష సంతానానికి తన అన్నదమ్ముల సంతానాల్లో నుండి అమ్మాయిలను తెచ్చి వివాహం చేయడం మేనరికంగా చలామణి అవుతుంది కానీ ఆ స్త్రీ తన ఆడసంతానానికి అన్నదమ్ముల మగ సంతానానికి ఇచ్చి వివాహం చేయడం నిషేధం ఈ ఆచారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే మేనరికాలంటే కొన్ని తెగల్లో ఒకవైపు మాత్రమే ఉండగా కొన్ని తెగల్లో రెండువైపులా ఇచ్చి పుచ్చుకోడాలు ఉంటాయి.

కోయల్లో మేనమామ కొడుకులు ఉండగా మేనరికాన్ని కాదని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే పెళ్లి చేసుకునే హక్కు లేదు. మేనవాళ్లు వద్దని చెప్పిన తర్వాతనే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిస్తారు. ఒకవేళ మేనరికాన్ని కాదని వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని గర్భవతి అయినా, పిల్లల తల్లి అయినా మేనవాళ్లు వెళ్లి బలవంతంగా తీసుకు వచ్చే అవకాశం ఉంది. కోందు, నూక దొర, భగత, కొట్టియా, రాణా, పొరజల్లో హక్కుగా స్థిరపడనప్పటికీ మహిళ తండ్రి మేనరికం కాదనలేడు. ఎందుకంటే తన భార్యను ఆ ఇంటి నుండి తెచ్చుకున్నాడు కనుక ఆ ఇంటికి తన కూతుర్ని ఇవ్వడం న్యాయమని భావిస్తాడు. చాలా సందర్భాల్లో చిన్నప్పుడే ఓలి ఇస్తారు. ఓలి ఇచ్చాక ఇక మహిళ తమ సొంతమైనట్లే. సమాంతర పిత్రిమ వివాహాలు (పారలల్ కజిన్ మేరేజ్) చాలా చోట్ల నిషేధం. కొన్ని తెగల్లో మాత్రమే అమలులో ఉన్నాయని తెలుస్తోంది.

భారతదేశ తెగల్లో భాగస్వామిని ఎంచుకోవడానికి 9 ప్రధానమైన పద్ధతులు ఉన్నాయని నదీమ్ హస్నైన్ పేర్కొన్నారు.

  1. పరిగ్రహణం లేదా రాక్షస వివాహ పద్ధతి
    దండకారణ్యంలో అక్కడక్కడా ఈ పద్ధతి నేటికీ ఉనికిలో ఉంది. స్త్రీ ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ఆమెను అపహరిస్తారు. తనకు వరుస అవుతుందని తెలిసిన అమ్మాయిని మోజు పడిన యువకుడు తన మిత్రులతో కలిసి ఆ యువతి ఒంటరిగా ఉండే అవకాశాన్ని ఎంచుకొని బలవంతంగా అపహరించుకు పోతాడు. ఆ తర్వాత ఇంతలో సర్వసాధారణంగా తగినంత డబ్బు మొత్తాలు మాట్లాడుకుని అంటే కన్యాశుల్కం రాజీ కుదుర్చుకొని ఆ యువతి యువకునికి వివాహం జరిపిస్తారు. ఈ పద్ధతిని పోయేసి హత్తార్ అంటారు.

కోందు, కోయ, నూక, దొర, రాణా, కొట్టియ, పొరజ తదితర తెగల్లో మూడు కల్లు సీసాలను తీసుకెళ్లి మహిళ ఇంట్లో మూలకు పెడతారు. భగతల్లో అయితే పప్పు మూటను ఎత్తుకొని మహిళ ఇంటికి తీసుకెళ్తారు. మహిళ తండ్రికి ఇష్టముంటే వెంటనే ఒప్పుకుంటారు. పెళ్లి చేసుకోవాల్సిన మహిళ ఇష్టా ఇష్టాలతో గానీ ఆమె తల్లి ఇష్టా ఇష్టాలతో కానీ సంబంధం లేదు. ఆమె తండ్రి ఒప్పుకోగానే ఓలి నిర్ణయించుకుంటారు. ‘ధీసరి’, అంటే పూజారి ముహూర్తం పెడతాడు. ఆ ముహూర్త సమయానికి పెళ్లి చేసుకోదలచుకున్న పురుషుడు మరికొందరితో కలిసి గుంపుగా వచ్చి ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా ఎత్తుకొని పోతాడు.
ఈశాన్య రాష్ట్రాల్లోని నాగా జాతిలో ఒక గ్రామం ఇంకొక గ్రామం మీద దాడి చేసినపుడు యుక్త వయసు ఆడపిల్లల్ని అపహరించి పెళ్ళి చేసుకుంటారు. కాలక్రమేణ ఇది ఆడ శిశుహత్యలకి దారితీసింది. క్రమంగా ఈ రకమైన పెళ్లిళ్లు అంతరిస్తున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రంలోని ‘హో’ జాతిలో కూడా ఇటువంటి పెళ్ళిళ్ళు జరిగేవి. వీటిని ‘ఒపోర్ టిపి’ అంటారు. భూమిజ్, ముండారీ, సంథాలీ తెగల్లో ఇవి ఆచారాలుగా ఉన్నాయి. అంటే ముందే ఇరు కుటుంబాల వాళ్ళు అంగీకరించిన ప్రదేశంలో ఆమ్మాయిని పట్టుకొని ఎత్తుకెళుతున్నట్టుగా అబ్బాయి నటిస్తాడు. అమ్మాయి కూడా ఇష్టం లేనట్టు నటిస్తుంది. హో లలో ఈ బలవంతపు పెళ్ళిళ్ళకి కారణం చాలా హెచ్చుగా ఉండే కన్యాశుల్కం.

అస్సాంలోని ఆదివాసుల్లో ఈ రకమైన పెళ్ళిళ్ళు ఒక గ్రామం మీద మరొక గ్రామం దాడి చేసినపుడు జరుగుతుండేవి. మధ్య భారతంలోని జాతులలో పండగలప్పుడు, శుభకార్యాలప్పుడు బాగా తాగిన నషాలో జరిగేవి. వాటికి తర్వాత ఆడపిల్ల తల్లిదండ్రులకి పరిహారం చెల్లించడం ద్వారా కానీ, తెగ పెద్దలకి విందు ఇవ్వడంతో కానీ ఆమోదం దొరుకుతుంది.

  1. వినిమయ వివాహ పద్ధతి
    ఒక పురుషుడు తన చెల్లెలిని లేదా తన కుటుంబంలోని మరో అమ్మాయిని తన భార్యకి ప్రతిగా అవతలి కుటుంబంలోని పురుషునికి అప్పగిస్తాడు. కన్యాశుల్కం ఇవ్వకుండా ఉండడానికి సాధారణంగా ఈ ‘కుండమార్పిడి’ పద్ధతి అమలులో ఉంది. కానీ మేఘాలయాలోని ‘ఖాసీ’ జాతిలో ఈ కుండమార్పిడి నిషేధం.
  2. కన్యాశుల్క వివాహ పద్ధతి: ఇదే ప్రధానంగా కొనసాగుతూంది. వరుడు తగిన మొత్తంలో డబ్బు చెల్లించి వధువును తీసుకెళ్లాలి. డబ్బు ఆయా కుటుంబాల ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. అక్కడక్కడ లాంఛనంగా మాత్రమే ముట్ట చెప్పే సంప్రదాయం కూడా నేడు అమలవుతోంది. ఈ మొత్తాన్ని జీవ పారె లేదా బాబా పారె అంటే తండ్రి డబ్బుగా వ్యవహరిస్తారు. ఆదివాసి తెగలలో పెళ్లిళ్లన్ని వరుడు ఇంట మాత్రమే జరుగుతాయి. పెళ్లి ఖర్చులను వారి పక్షం వారే భరించాలి. నగదు రూపంలో జీవ పారె ఎంత చెల్లించారన్న అంశం ఎలా ఉన్నా వధువు పక్షం వారందరికీ కనీసం ఒక పూట భోజనాలు సమకూర్చి వధువుని తీసుకువెళ్లి తమ ఇంట్లో పెళ్లి జరిపించడం వరుడి విధి. ఇది సర్వత్ర అమలవుతున్న పద్ధతి. చెంచుల్లో కూడా కన్యాశుల్కం పద్ధతి ఉన్నా అది చాలా నామమాత్రంగా ఉంటుంది. సాధారణంగా అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయి కుటుంబంతో వెళ్ళి మాట్లాడమని తల్లిదండ్రులను అడుగుతాడు. వాళ్ళు కల్లు సీసా తీసుకుని వెళ్తారు. అమ్మాయికి ఆమె కుటుంబానికి నచ్చితే కల్లు తాగుతారు. అనుకున్న రోజు చాలా సాధారణమైన పద్ధతిలో పెళ్లయిపోతుంది.

కన్యాశుల్క పద్ధతి వల్ల బాగా ప్రభావితం అయిన జాతి ఝార్ఖండ్ లోని చోటానాగపూర్ ప్రాంతంలోని ‘హో’ జాతి మహిళలు. కన్యాశుల్కం ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఆర్థిక పరిస్తితి అంతంత మాత్రమే ఉన్న ఆ జాతిలో కన్యాశుల్కం చెల్లించలేని పురుషులు బలవంతపు పెళ్ళిళ్ళకి పాల్పడుతుంటారు. చాలా మంది యువతీ యువకులు అవివాహితులుగా ఉండిపోతారు. అవివాహిత మహిళలపై తరచూ మంత్రగత్తెలనే ఆరోపణలు జరిగి చిత్రహింసలపాలవుతుంటారు. చాలా మంది వివాహం చేసుకోవాలనే సహజమైన కోరికతో అప్పులిచ్చే షావుకార్ల మోసాలకి బలవుతూ ఉంటారు. అలా అవివాహితలుగా మిగిలిపోయిన మహిళలు మోసం చేసిన వ్యక్తులకు బానిసలుగా జీవించాల్సి వస్తుంది.

  1. సహ పలాయన వివాహ పద్ధతి
    పారిపోయి పెళ్లి చేసుకునే పద్ధతి భారతదేశంలోని తెగల్లో మరొక విలక్షణమైన పద్ధతి అంటాడు నదీమ్ హస్నైన్.
    చెంచుల్లో ఇలాంటి పెళ్లిళ్లు ఉన్నాయి. ముఖ్యంగా అబ్బాయి కన్యాశుల్కం చెల్లించలేననుకున్నపుడు తాను ఇష్టపడిన అమ్మాయి సమ్మతితో ఇద్దరూ కలిసి అడవిలోకి పారిపోతారు. కొన్ని రోజులు అక్కడే కాపురం చేస్తారు. ఈ లోపు తల్లిదండ్రులకి తెలిసి వెతికి తెచ్చుకుంటారు. అప్పుడు తెగ పెద్ద ఆధ్వర్యంలో పెళ్లి జరుగుతుంది. చెంచుల పెళ్లిళ్లలో పూజారి ఉండడు. కోందు, నూక దొర, రాణా, కొట్టియా, కొండరెడ్డి తెగలలో ఇష్టపడి పెళ్లి చేసుకునే అవకాశం ఒక మేరకు ఉంది. కానీ వాళ్ల పెళ్లి ఆ మహిళ తల్లిదండ్రులకు ఇష్టం లేకుంటే వెళ్లి ఆ మహిళను లాక్కొస్తారు. ఆ మహిళ మళ్ళీ అతని దగ్గరికి పారిపోతుంది. అలా రెండు మూడు సార్లు జరిగాక ఓలి కట్టించుకొని వాళ్ల పెళ్లిని ఆమోదిస్తారు. ఇష్టపడి పెళ్లి చేసుకోవడం కోయల్లో, భగతల్లో ఎంత మాత్రం లేదు. తల్లిదండ్రులు వెళ్లి లాక్కొచ్చి కొట్టి తన్ని అయినా సరే తమకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే కూతురు తమకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఆమె చనిపోయినట్టుగా ప్రకటించి కర్మకాండలు చేస్తారు. ఇక ఆమెతో సంబంధాలు పూర్తిగా తెంచుకుంటారు. కొడుకు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం సాంఘిక బహిష్కరణ చేస్తారు. ఇష్టపడి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్న తెగల్లో కూడా అదే తెగలో పెళ్లి చేసుకుంటే పట్టింపు ఉండదు. కానీ వేరే తెగవారిని చేసుకుంటే తల్లిదండ్రులు ఆమోదించరు. నూక దొరల్లో వేరే తెగవారిని చేసుకుంటే కర్మకాండలు చేస్తారు. కొండరెడ్లలో కూతురు వేరే తెగ వాళ్ళను చేసుకుంటే ఆమెతో సంబంధాలు తెంచుకుంటారు. కొడుకు చేసుకుంటే మాత్రం అంత కఠినంగా వ్యవహరించరు కానీ వారితో వెంటనే వేరు కాపురం పెట్టిస్తారు.

తల్లిదండ్రులు తాను ఇష్టపడ్డ యువకునితో తన పెళ్లి చేయడానికి ససేమిరా అంగీకరించే స్థితిలో లేనప్పుడు యువతులు తను ఇష్టపడిన వ్యక్తి పట్ల భరోసా కుదిరితే అతనితో దూరప్రాంతాలకు వెళ్ళిపోతారు. కొన్నాళ్లు అక్కడే ఉండి గ్రామ సమాచారం రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఊళ్లో పెద్దల కోపతాపాలు చల్లారినాయనే అంచనాకు వచ్చిన వెంటనే ఊరికి తిరిగివస్తారు. ఈ మధ్యలో కొన్ని రాయబారాలు చేస్తుంటారు. జీవ పారె (కన్యాశుల్కం) లాంఛనాలు షరా మామూలే. తాను ఎంచుకున్న యువకుడు తనను కూడా ఇష్టపడితే తమ వివాహం వల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులను తట్టుకోవడానికి అతను సిద్ధంగా ఉన్న సందర్భాలలో అతని అనుమతితో యువతి ఏదో ఒక రోజు ఇంట్లో నుండి వెళ్లిపోయి కాబోయే భర్త ఇంట్లో గుంభనగా వచ్చి చేరుతుంది. దీనితో భర్త తరపు వాళ్ళు అమ్మాయి ఇంటికి సదరు విషయం కబురు చేస్తారు. రెండు పక్షాల పెద్దలు సమావేశం అయి విషయాలు చర్చించుకుని పెళ్లి నిర్ణయించుకుంటారు. ఇందులో ఎవరి బలవంతాలు ఉండవు. ఈ పద్ధతిని ఆదిలాబాద్ గోండులలో ‘సిమ్ వర్ సొత్త’ అంటారు. గడ్చిరోలి గోండులు ‘హయ్ వర్ వాత్త’ అంటారు అంటే ఇల్లు చొర్రడం అని అర్థం. బస్తర్ లో ‘లోన్ హోడియాన’ అంటారు. ఈ రకం పెళ్లిళ్లు యువతీ యువకుల పరస్పర ఆకర్షణ, పరస్పర అంగీకారంతో జరిగే ప్రజాస్వామ్య పెళ్లిళ్లుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు జీవ పారె కూడా విప్లవ రాజకీయాల ప్రమేయంతో ఒక లాంఛనంగా మాత్రమే అమలవుతోంది. దండకారణ్యంలో విప్లవ రాజకీయాలు ఉనికిలోకి వచ్చి విప్లవ ప్రజా సంఘాల కార్యకలాపాలు ప్రజల జీవితాల్లో నిర్ణయాత్మక పాత్రను నిర్వహించడం ప్రారంభమైన తర్వాత ఈ పెళ్లిళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

  1. సేవా వివాహ పద్ధతి: కన్యాశుల్కం ఇచ్చుకోలేని అబ్బాయిలు తనకు కాబోయే భార్య ఇంట్లో ఆరేళ్ళపాటు ఉచితంగా సేవ చేయడానికి అంగీకరిస్తారు. ఆడపిల్ల కుటుంబం చెప్పే ఏ పనైనా చేయాలి. ఏ షరతు కైనా అంగీకరించాలి. అలా పనిచేసే అబ్బాయిలను ‘లామ్ డే’ అంటారు. వీళ్ళ పట్ల సాధారణంగా ఆ సముదాయంలో చాలా చిన్నచూపు ఉంటుంది. అలా ఆరేళ్ళు పనిచేసాక కచ్చితంగా ఆమ్మాయి అతన్నే చేసుకోవాలని నియమం ఏమీ లేదు. కానీ అలా అతన్ని కాకుండా వేరే వాళ్ళని చేసుకుంటే అపుడు అతనికి కొంత పరిహారం చెల్లిస్తారు. ఆరు సంవత్సరాలు అలాంటి సపర్యలు చేయాలనే నియమం ముఖ్యంగా గడ్చిరోలి జిల్లాలో అమలులో ఉంది. ఇప్పుడు ఇవి కొంత మేరకు కాలం చెల్లిన పెళ్లిళ్లు కింద లెక్క. అమ్మాయికి అబ్బాయి నచ్చితే లామ్ కాలం పూర్తికాకముందే వాళ్ళు పారిపోయి పెళ్లిచేసుకోవడం. లేదా ఇద్దరు తల్లిదండ్రులకు నచ్చచెప్పి లామ్ రద్దు చేసుకోవడం వంటి పరిణామాలతో మెల్లగా ఇవి తగ్గిపోయాయి. మణిపూర్ లో ‘పురుకు’ జాతిలో ఆమోదయోగ్యమైన వివాహ పద్ధతి ఇదొక్కటే. అందులో మగవాళ్ళు తప్పని సరిగా మూడేళ్ళ పాటు పెళ్లికూతురు ఇంట్లో పని చేయాలి. కుటుంబంలో ఒక కొడుకు నిర్వర్తించే బాధ్యతలన్నీ నిర్వర్తించాలి. అతని ఖర్చులన్నీ అమ్మాయి కుటుంబం భరిస్తుంది. బిర్హోర్ తెగల్లో కాబోయే అల్లుడికి మామగారు కన్యాశుల్కం ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అంత సొమ్ముని అప్పుగా ఇస్తాడు. దానిని అతను మామగారి ఇంట్లోనే ఉండి వాయిదాల పద్ధతిపైన తీర్చాలి. తీర్చే వరకు మామగారి ఇంట్లోనే ఉండాలి.
  2. అనాహుతి వివాహం: (marriage by intrusion) ఝార్ఖండ్ లోని ‘హో’ జాతిలో ఇలా అమ్మాయి ‘ఇల్లు జొచ్చడం’ అనే పద్ధతి ఉంది. తనకి నచ్చిన యువకుడికి తాను నచ్చక పోయినా బలవంతంగా ఇంటికి వెళ్ళి అన్ని పనులూ చేస్తుంది. ఈ పెళ్లిని ‘అనాదర్’ అంటారు. పేరుకు తగినట్టే అలాంటి అమ్మాయిలకు గౌరవం ఉండదు. నచ్చక పోతే చాలా అవమానిస్తారు. చిత్రహింసలు కూడా పెడతారు. ఆమె కొంతకాలం అలా నిలదొక్కుకోగలిగితే చివరికి ఆమెని కోడలిగా ఆమోదిస్తారు. బిర్హోర్ తెగల్లో కూడా ఈ పెళ్ళిళ్ళు అమలులో ఉన్నాయి.
  3. ప్రయోగ వివాహ పద్ధతి: పెళ్ళికొడుకు సాహసవంతుడై ఉండాలనేది ఇందులో ప్రధానం. చాలా జాతుల్లో ఉన్నప్పటికీ ప్రధానంగా భిల్లుల్లో ఇది అమలులో ఉంది. వీరు రాజస్థాన్, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్లో నివసిస్తున్నారు. సాధారణంగా హోలీ పండగ అప్పుడు ఒక సాంప్రదాయ నృత్యం చేస్తారు. ఒక స్తంభానికిగాని చెట్టుకు గానీ పైన కొబ్బరి కాయ, బెల్లం ఉట్టిలా కడతారు. దాని చుట్టూ ఒకరి చేతులొకరు పట్టుకొని అమ్మాయిలు నాట్యం చేస్తారు. వాళ్ళని దాటుకొని అబ్బాయిలు ఆ వలయంలోకి వెళ్ళి కొబ్బరికాయ పట్టుకొని పగలకొట్టాలి. వాళ్ళని లోపలికి పోనీయకుండా అమ్మాయిలు తీవ్రంగా అడ్డుకొంటారు. ఆ క్రమంలో దెబ్బలు తగలచ్చు. రక్తాలు కారే గాయాలు కూడా కావచ్చు. ఒకవేళ అతను సఫలుడైతే ఆ నాట్యం చేస్తున్న అమ్మాయిల్లో ఎవరినైనా అతను భార్యగా ఎంచుకోవచ్చు.
  4. పరస్పర అంగీకార వివాహ పద్ధతి: ఆదివాసులకు హిందువులతో ఏర్పడ్డ సంబంధాల వల్ల పరస్పర అంగీకార వివాహ పద్ధతి ఆచరణలోకి వచ్చిందని నదీమ్ హస్నైన్ అంటారు. సంబంధిత వ్యక్తులు పరస్పర సంప్రదింపులు సమ్మతిల ద్వారా యువతీ యువకుల మధ్య వివాహానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఇరు కుటుంబాల వాళ్ళు చేస్తారు. సాధారణంగా ఈ పెళ్లిళ్లు ఆర్థికంగా ఇతరుల కంటే ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలలో అమలవుతోంది.
  5. సహజీవన పద్ధతి: ఇష్టపడిన జంట అమ్మాయి ఇంట్లో కొద్ది కాలం సహజీవనం చెయ్యచ్చు. కలిసి ఉండగలం అనుకుంటే వివాహం చేసుకోవచ్చు. అలా అనుకుంటే పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారు. ఒకవేళ కుదరదు అనుకుంటే అతను అమ్మాయి కుటుంబానికి పరిహారం చెల్లించాలి. అరుణాచల్ ప్రదేశ్లోని కుకీలలో ఇది చాలా సాధారణం. చోటానాగపూర్ లో కూడా కొన్ని జాతులలో అమలులో ఉంది. అక్కడ దీనిని “రాజీ-ఖుషీ” అని పిలుస్తారు. దండకారణ్యంలో కూడా చాలా జాతుల్లో అమలులో ఉంది.
    బాల్య వివాహాలు సుదీర్ఘకాలం పాటు లేవు. కానీ కాలక్రమేణా చిన్నప్పుడే పెళ్లి నిర్ణయాలు చేయడం అనే రూపంలో మొదలయ్యి కొనసాగుతున్నాయి. ఒక ఆడపిల్ల పుట్టిన వెంటనే మేనరికం ఉన్న కుటుంబంతో కానీ, లేదా తల్లిదండ్రులు ఇష్టపడ్డ కుటుంబం కానీ కలిసి కల్లు తాగితే ఇక పెళ్లి నిర్ణయం అయిపోయినట్టే. అలాగే కొన్ని చోట్ల హిందూ మత ప్రభావం ఉన్న జాతులలో ఇప్పుడిప్పుడే, వరకట్నం, బాల్య వివాహాలు మెల్లగా మొదలయ్యాయి.

బహుభార్యత్వం: ఆదివాసుల్లో భూములు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో బహుభార్యత్వం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది భార్యలు ఉంటే ఎక్కువ భూమి సాగు చేసుకోవచ్చనే ఉద్దేశ్యమే ప్రధానం. చాలా తెగల్లో బహుభార్యత్వం అమలులో ఉంది.

బహుభర్తృత్వం: బహుభర్తృత్వం అమలులో ఉన్న తెగలు కూడా ఉన్నాయి. కానీ అవి చాలా తక్కువే. హిమాలయ పర్వత ప్రాంతాల నుండి అస్సాం వరకు ఉన్న ప్రాంతాల్లో జీవించే థియాన్, కోట, ఖాసా, లధాకీ బోటా తెగల్లో ఉంటుంది. అలాగే తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉండే తోడా జాతి ప్రజల్లో ఉంటుంది. అయితే ఈ రెంటికీ కొద్దిగా తేడా ఉంది. హిమాలయాల్లో ఉండే తెగల్లో అన్నదమ్ములందరికి కలిపి ఒకే భార్య ఉంటుంది. అన్నదమ్ములు కలిసే ఉంటారు. భార్య గర్భవతి అయినపుడు అన్నదమ్ములు మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చి తమలో ఎవరు తండ్రిగా ఉండాలనే నిర్ణయం తీసుకుంటారు. భార్యకు ఐదవ నెల వచ్చాక విల్లు – బాణం వేడుక జరిపి గ్రామస్తులందరి ముందూ తండ్రిని ప్రకటిస్తారు.

నీలగిరి కొండల్లో ఉండే తోడా జాతి ప్రజల్లో ఒక స్త్రీకి ఉండే భర్తలందరూ ఒకరికొకరు సంబంధం ఉండాల్సిన పని లేదు. ఆమె ఒక్కొక్కరి దగ్గరా కొంత కాలం ఉంటుంది. ఒకరి దగ్గర ఉన్నపుడు తక్కినవారికి ఏ హక్కూ ఉండదు.

ఉత్తరాఖండ్ లోని జౌంసార్ – బవార్ ప్రాంతంలోని జౌంసారి తెగలో ఇంకొంచెం భిన్నంగా ఉంటుంది. వీరిలోని ఖాసా తెగలో పెద్దకొడుకు మాత్రమే వివాహం చేసుకుంటాడు. ఆమె తక్కిన అతని తమ్ముళ్లందరికీ భార్య అవుతుంది. ఒక వేళ అందరికన్నా చిన్న సోదరుడు అప్పటికి చిన్నవాడైతే అతను యుక్తవయసు వచ్చాక తన వయసుకు తగిన అమ్మాయిని చేసుకోవచ్చు. ఆమె కూడా అందరికీ భార్యగానే ఉంటుంది. ఈ రకంగా ఇది పూర్తిగా బహుభార్యత్వం కానీ, పూర్తిగా బహుభర్తృత్వం కానీ కాదు. ఆంత్రోపాలజిస్టు మజుందార్ దీనికి పాలీజైనాండ్రి అనే పేరు పెట్టాడు. బహుభర్తృత్వం వెనుక ఉండగల కారణాలను పరిశీలిస్తూ ఒకటి కన్యాశుల్కం చెల్లించాల్సి రావడం ఒక కారణం అంటారు. పర్వత ప్రాంతాల్లో భూ కమతాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఖర్చు రీత్యా కానీ, శ్రమ రీత్యా కానీ వ్యవసాయం అనేది ఆర్థికంగా తలకు మించిన భారంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంకా చిన్న కమతాలుగా విభజించకుండా ఉండటానికి ఉమ్మడి పొత్తులో ఉంచుకోడానికి వీలుగా ఈ రకమైన వివాహ సంబంధాలు వచ్చి ఉండొచ్చు.

మొగనాలి: బలవంతపు పెళ్లిళ్లకు గురైన మహిళ కొన్నిసార్లు తనకు నచ్చిన పురుషుడితో వెళ్ళిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ మహిళ ప్రస్తుతం కలిసి ఉంటున్న పురుషుడి మీదకి ఆ మహిళ భర్త మరికొందరిని తీసుకొని కత్తులు, గొడ్డళ్లు పట్టుకొని దండయాత్రగా వెళతాడు. ఆ పురుషుని ఇంటి మీద పడి అడ్డం వచ్చిన కోళ్లను మేకలను గొడ్లను కోసేస్తారు. ఊరి పెద్దలు కల్పించుకొని వాళ్లను శాంతింప చేసి మహిళ భర్తకు ఆమె ప్రస్తుతం కలిసి ఉంటున్న పురుషుడు పరిహారంగా మొగనాలి కట్టే విధంగా నిర్ణయిస్తారు. సాధారణంగా ఈ మోగనాలి ఓలి కంటే కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది. ఒకసారి మొగనాలి ఇచ్చిన తర్వాత కోందుల్లో ఆ ఇద్దరు పురుషులు అరమరికలు లేకుండా కలిసి పోతారు. అన్నదమ్ములుగా భావించుకుంటామని ప్రకటించుకుంటారు. కానీ కోయల్లో ఇది హింసాపూరితంగా ఉంటుంది. కోయల్లో రాణాల్లో స్త్రీ పురుషులు ఇద్దరినీ నరికి వేయడం కూడా ఉంటుంది.

భర్త చనిపోయిన మహిళ వేరే పెళ్లి చేసుకుంటే కూడా భర్త ఇంటి వారికి మొగనాలి కట్టాల్సి ఉంటుంది. భర్త ఇంటి వారెవరు లేకుంటే అతని దూరపు బంధువులకైనా మొగనాలి కట్టాల్సి ఉంటుంది. భర్త చనిపోయిన స్త్రీలను భర్త తల్లిదండ్రులు కొన్ని రోజులు తమతోనే ఉండమంటారు. అలా వారు కోరినన్ని రోజులు వాళ్లకు పనులు చేస్తూ వారితోనే ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే ఆమెను మొగనాలి అడగరు. అంటే ఒక రకంగా వాళ్ళు ఇచ్చిన ఓలి కట్టించుకునే దాకా తమతో ఉండమంటారు.
చెంచుల్లో కూడా విడాకులు మహిళ కోరుకుంటే ఆమె తల్లిదండ్రులు కానీ ఆమె చేసుకోబోయే మరొక వ్యక్తి కానీ కన్యాశుల్కం భర్తకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. భర్త చనిపోయిన స్త్రీ ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు. పెళ్లి అంటూ ఏమి ఉండదు. భార్య చనిపోయిన పురుషుడు మాత్రం పెళ్లి చేసుకోవచ్చు.

పిల్లలు: విడాకులు తీసుకుంటే చాలా తెగల్లో పిల్లలు తండ్రికే చెందుతారు. భర్త చనిపోయిన స్త్రీకి సంతానం ఉంటే కూడా భర్త కుటుంబానికి పిల్లల్ని ఇచ్చేయాలి. పసిపిల్లలైతే 3,4 యేళ్లపాటు తల్లి దగ్గర వదిలేస్తారు. భర్త రక్త సంబందీకులు అడగకపోతేనే తల్లి దగ్గరుంటారు. చెంచు మహిళలు 12,13 యేళ్ళ వరకూ తల్లి దగ్గర ఉంచుకుని ఆ తరవాత తండ్రికి ఇచ్చేయాలి. సంథాలీ స్త్రీలకి కూడా పిల్లలపై హక్కు లేదు.

ఆస్తి హక్కు: ఏ ఆదివాసీ తెగలోనూ స్త్రీకి ఆస్తి పై హక్కు లేదు. వింటి బద్దలు, కత్తులు, గొడ్డళ్ళు, భూమి వంటి ఉత్పత్తి సాధనాలన్నీ పురుషుల అస్థిగానే ఉంటాయి. కోయల్లో నాగలి మహిళ చేతిలో ఉన్నప్పటికీ దానిపై హక్కు లేదు. బగతల్లో, నూకదొరల్లో ఆస్తికి వారసులైన మగపిల్లలు పుట్టనపుడు పురుషుడి అన్నదమ్ముల పిల్లలని పెంపకానికి తెచ్చుకుంటారు తప్ప ఆడపిల్లలకి ఇవ్వరు. కొందుల్లో, కోయల్లో మగపిల్లలు లేకపోతే ఒక పురుషుడిని ‘లాం’ తెచ్చుకుని రెండేళ్లపాటు ఇంట్లో ఉంచుకుంటారు. అతని పద్ధతులు నచ్చితే తమ కూతురినిచ్చి పెళ్లి చేసి ఆస్తి అతనికి ఇస్తారు. మరికొన్ని తెగల్లో వారసుడు లేకుంటే పురుషుడి అన్నదమ్ముల మగపిల్లలకి ఆస్తి చెందుతుంది. మేఘాలయాలోని ఖాసీ తెగలో (ఇవి మాతృ ప్రధాన తెగలు) భూమి, ఆస్తి ఆఖరి కూతురికి పోతుంది. ఈమెను ‘క్కుడు’ అంటారు. కురుచ్చియనులు కూడా మాతృ ప్రధాన తెగ. వీరిలో మహిళలకు కొంత ఆస్తి ఇస్తారు. పుట్టింటిలో ఆస్తికి మాత్రమే వారసత్వం ఉంటుంది. ఆమెకి పెళ్ళయి వెళ్ళిపోయినప్పటికి ఇది ఉంటుంది. కానీ ఆమెకు దానిని అమ్మే హక్కు లేదు. భర్త ఆస్తి మీద హక్కు ఉండదు. భర్త చనిపోతే అతని ఆస్తి అతని అక్కచెల్లెళ్ల పిల్లలకు పోతుంది. సంథాలీ మహిళలకు వివాహపూర్వం కొన్ని రకాలైన ఆస్తి హక్కులు ఉంటాయి. మేన మామ ఇచ్చిన ఆస్తి కానీ, తాత, అక్క భర్త బహుమతులుగా ఇచ్చినవీ ఆమెకే చెందుతాయి. తల్లి కానీ తండ్రి గాని చనిపోయి ఆమెకు ఆస్తి సంక్రమిస్తే వివాహం అయ్యేవరకూ ఉంచుకోవచ్చు. మైనర్ గా ఉన్నప్పుడు సంక్రమిస్తే అవసరాలకు అమ్ముకోవచ్చు కూడా. ఆమెకు వివాహం కావడానికి ముందే ఆస్తుల పంపకం జరిగితే ఆమెకు పశువులు కానీ కొద్దిగా భూమి గాని ఇస్తారు. తల్లి మాత్రమే చనిపోయి సోదరులు కూడా ఉంటే ఆస్తిలో వాటా ఇవ్వరు. ఇటీవలి కాలంలో స్త్రీలకు ఆస్తిలో హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలుసుకున్న కొందరు చదువుకున్న మహిళలు ఆస్తిలో వాటా కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే అది ఆర్థిక పరిస్తితి బాగా ఉన్నవాళ్లకు తప్ప తలకు మించిన భారంగా పరిణమిస్తోందనీ సోదరులు ఎంత ఖర్చయినా వాటా మాత్రం ఇవ్వకూడదనే పట్టుదలతో ఉంటున్నారని కొన్ని కేస్ స్టడీస్ తెలుపుతున్నాయి. విప్లవోద్యమ ప్రాంతాల్లో ముఖ్యంగా దండకారణ్యంలో జనతన సర్కార్ల (ప్రజా ప్రభుత్వం) ఆధ్వర్యంలో జరుగుతున్న భూమి పంపకాల్లో భార్య భర్తలు ఇద్దరి పేరు మీదా పట్టాలు ఇస్తున్నారు. వాళ్ళు విడిపోదలుచుకుంటే పిల్లలు ఎవరి దగ్గర ఉంటారనే విషయాన్ని బట్టి పంపకం జరుగుతుంది. పిల్లలు లేని పక్షంలో ఇద్దరికీ చెరిసగం చెందుతుంది.

సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు:
భారత దేశ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ అన్ని జాతులలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కూడా ఉన్నాయి. మహిళల విషయంలో అలా ఉన్నవాటిని పరిశీలిస్తే బాలికలకు యుక్త వయసు వచ్చినపుడు బహిష్టు సమయాలలో వేరుగా కూర్చోబెట్టడం, మగవాళ్ళ కళ్ళపడకుండా ఉంచడం వంటివి అన్ని తెగల్లోనూ ఉంది. ప్రసవ సమయాల్లో కూడా స్త్రీలను వేరుగా ఉంచడం అనేది కూడా అందరూ అవలంబించే పద్ధతి. అలాగే బాల్యవివాహాలు అనేవి లేవు. యుక్త వయసు వచ్చాకనే పెళ్ళిళ్ళు చేస్తారు, లేదా చేసుకుంటారు. చాలా తెగలలో పచ్చబొట్లు పొడిపించడం అనే ఆచారం ఉంది. చాలా కొద్ది తెగల్లో మాత్రమే పై విషయాల్లో అక్కడక్కడా మినహాయింపులు కలిగి ఉన్నాయి.

బహిష్టు సమయాల్లో ఆచారాలు: మధ్య జోన్ పరిధిలో ఉండే అన్ని జాతుల్లోనూ బహిష్టు సమయాల్లో స్త్రీలను ఇళ్ళకు దూరంగా అడవిలో ఉంచే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో మగవాళ్ళ కళ్ల పడినా, గ్రామ పెద్ద కానీ పూజారికి కనపడినా రాళ్ళతో కొడతారు. వాళ్ళకి రోజుకి ఒక పూట ఆహారం అడవిలోకి తీసుకుపోయి ఇస్తారు. అది కూడా సొంత కుటుంబ సభ్యులు ఇవ్వకూడదని ఆచారం. వేరే వాళ్ళతో చీకటి పడ్డాక పంపుతారు. గోండు తెగల్లో ఇలా అడవిలో వీటికోసం ఉండే ప్రత్యేక గుడిసెలను ‘కుర్మలోను’ అంటారు. తూర్పు కనుమల్లో ఉండే ఆదివాసీ తెగల్లో కూడా పెద్దమనిషి అయినపుడు అడవికి పంపే ఆచారం ఉంది. ఈ ఆచారాన్ని ‘గుప్పలోప దాయనా’ అంటారు. అంటే అడవిలోకి వెళ్లడం. ఈ ఆడపిల్లలు పగలంతా అడవిలో చెట్ల చాటునా, పుట్ల చాటునా గడిపి చీకటి పడ్డాక తన ఇంటి పరిసర ప్రాంతాల వరకూ వచ్చి తల్లి పెట్టిన అన్నం తిని ఇంటి బయటే గడిపి మళ్ళీ తెల్లవారే లోపు అడవిలోకి వెళ్లిపోతారు. వీరు కూడా పురుషుల కంటపడితే రాళ్ళతో కొట్టే ఆచారం ఉంది. తక్కిన చాలా తెగల్లో పూజా స్థలాలకి, వంట చేసే ప్రదేశాలకి వెళ్లకూడదనే ఆంక్షలు ఉన్నాయి. ఇంట్లో ఒక మూల కూర్చుని ఉండాలి. ఏవీ ముట్టుకోకూడదు. పశుపోషణలో ఉన్న తెగల్లో అయితే పొరపాటున అలా ముట్టుకుంటే పేడనీళ్లు చల్లి ప్రక్షాళన చేస్తారు. వైనాడు లోని కురిచ్చియన్లలో పెద్ద మనిషి అయిన అమ్మాయిని స్నానానికి తీసుకువెళ్ళినపుడు ఆ దారంతా పేడనీళ్ళ కళ్ళాపి జల్లుతారు. పెద్దమనిషి కావడంతో సంబంధం లేకుండా కొంచెం వయసు పెరుగుతుండడంతోనే ఇక గుళ్ళకు, పూజా స్థలాలకు, ఇంట్లో పూజ చేసే చోటుకి రాకూడదు. మళ్ళీ వయసు మళ్లిన తరవాతనే అనుమతిస్తారు. చెంచు బాలిక పెద్ద మనిషి అయినపుడు ఇంట్లో ఒక మూల శుభ్రం చేసి పేడతో అలుకుతారు. అక్కడ కూర్చోబెట్టి నిమ్మకాయకి పసుపు పూసి బాణానికి గుచ్చి చేతికి ఇస్తారు. మొదటి రోజు సాయంత్రం స్నానం చేయించి కొత్త బట్టలు పెడతారు. అంటుకోకపోవడం ఉండదు. కానీ బహిష్టు పూర్తయ్యే వరకు బయటికి వెళ్లకూడదు. దుష్ట శక్తులు ఆవహిస్తాయని నమ్ముతారు.

స్త్రీ పురుష సంబంధాలు: ఆదివాసీ సమాజంలో యువతీ యువకుల మధ్య స్వేచ్ఛాపూరితమైన లైంగిక సంబంధాలు చాలా సహజంగా ఉండేవి. ఇందులో బలవంతం కానీ రహస్యంకాని ఏమీ ఉండదు. ముఖ్యంగా మధ్య భారత దేశంలోని తెగల్లో యువతీ యువకులు కలుసుకోవడానికి సామూహిక నిద్రశాలలు ఉంటాయి. వీటిని గోటుల్ అంటారు. ప్రతి గ్రామంలో ఇలాంటి ఒక వేదిక ఉంటుంది. దానిని యుక్తవస్కులైన బాలికలు పరిశుభ్రంగా ఉంచే పని చేస్తారు. పెళ్లికాని యువతీ యువకులకు మాత్రమే ప్రవేశం. ఇక్కడ సామూహిక నృత్యగానాలు నడుస్తాయి. రాత్రి కూడా అక్కడే గడుపుతారు. ఒక అమ్మాయి ఒక యువకుడిని ఎంచుకుంటే ఇంక వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టరు. అయితే అక్కడ విడిగా ఉండే అవకాశం కానీ, చాటు కానీ ఉండదు. ఇది గుంపు పెళ్ళికి ఒక అవశేషం కావచ్చు. ఇందులో ఎవరు ఎవరినైనా ఎంచుకోవచ్చు. అవి కొనసాగించాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఈ సంబంధాల వల్ల యువతి గర్భం రాకుండా చూసుకోవాలి. అలా వస్తే చాలా అవమానంగా భావిస్తారు. అలా గర్భం దాల్చిన యువతిని, ఆమె తల్లిదండ్రులను కూడా అవమానిస్తారు. ఆమె బిడ్డకు తండ్రి ఎవరనేది చెప్పగలిగితే అతనిని బతిమిలాడి కన్యాశుల్కం పూర్తిగా తగ్గించేసి నామ మాత్రంగా తీసుకొని పెళ్లి చేస్తారు. అయితే కాలక్రమేణా గోటుల్ లో విచ్చలవిడి తనం పెరిగి యువతులను ఒకరి కంటే ఎక్కువ మంది యువకులు వెంట బడి వేధించడం చాలా వత్తిడి చేయడం వంటివి పెరిగాయి. వేరే పనుల మీద ధ్యాస లేకుండా అక్కడే గడపడం వంటివి యువతులకు ప్రాణాంతకంగా పరిణమించాయి. దాంతో గోటుల్ సంస్కృతికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడాల్సి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా గోటుల్ సంస్కృతి బందయ్యింది. వివాహ పూర్వ సంబంధాలు ఉంటాయి కానీ ఇలా కాదు. ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని నాగా తెగల్లో కూడా ఈ సాంప్రదాయం (ఇటువంటి వేదికలు) ఉంది.

ఒకసారి వివాహం జరిగాక ఇక వివాహేతర సంబంధాలను అస్సలు సహించరు. చాలా తీవ్రంగా తీసుకుంటారు. మాడియా తెగలోనయితే భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలిస్తే హత్యల దాకా పోతారు. భార్యని అతనినీ కూడా చంపేస్తారు. గత రెండు మూడు దశాబ్దాలలో చెంచులలో కూడా వివాహేతర సంబంధాలుంటే భార్యలను చంపెయ్యడం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని థారూ తెగలో మాత్రమే భార్యకు వివాహేతర సంబంధం ఉంటే పట్టించుకోరు.

గర్భిణీ స్త్రీల విషయంలో ఆచారాలు: ఆదిమ సమాజం మొత్తం ప్రధానంగా ఉత్పత్తి, పునరుత్పత్తి చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఆదివాసీ సమాజాలలో కూడా అంతే. తమ సంతతిని కాపాడుకోవాలనే కాంక్షతో గర్భిణీ స్త్రీల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకొంటారు. ఇవే ఆచారాలుగా మారి ఆంక్షలుగా అమలవుతాయి. ఒక ఉదాహరణగా సంథాలీ మహిళల విషయం చూస్తే గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడూ, ప్రసవ సమయంలోనూ దుష్ట శక్తులు ఆవహించే అవకాశం ఉంటుందని బలంగా నమ్ముతారు. కాబట్టి గర్భిణీలు ఎవరైనా చనిపోయినపుడు ఏడవకూడదు, శవాన్ని చూడడం కానీ, తాకడం కాని చేయకూడదు. ఆమె చిన్న జీవిని కూడా చంపకూడదు. సగం దున్నిన పొలం మీదుగా నడవకూడదు. నదులు, వాగుల దగ్గర కూడా దుష్ట శక్తులు తిరుగాడుతుంటాయని భావిస్తారు కనక అక్కడికి వెళ్లకూడదు. ఆరుబయట నిదురించకూడదు. ఆమె ఆరు బయట పడుకొని ఉన్నప్పుడు ‘పుని శరీ’ అనే పిట్ట ఆకాశంలో ఆమె మీదుగా ఎగిరితే గర్భానికి హాని కలుగుతుందని భావిస్తారు. ఉరుముల శబ్దం వస్తే వెంటనే లోపలికి పోయి చెవులు మూసుకొని కూర్చోవాలి. పుట్టబోయే బిడ్డకు చెముడు రాగలదు అనుకుంటారు. పనస పువ్వు తల్లో పెట్టుకుంటే పనస పువ్వు ఎండి పోయినట్టు గర్భంలో బిడ్డ శుష్కించిపోతుందనుకుంటారు. పసుపు కొమ్ము పాతిపెట్టడం కానీ, విరక్కొట్టడం కానీ చేస్తే ఆరోవేలు వస్తుందని నమ్ముతారు. రొట్టెలు చేస్తే (‘పీఠా’ అంటారు వీటిని) గర్భస్థ శిశువు చెవి వంకర పోతుందని నమ్ముతారు. ఏనుగును చూస్తే చేట అంత చెవులు పొడుగైన నాలుక ఉన్న పిల్లల్ని కంటారని అంటారు. వేరు వేరు తెగల్లో వేరు వేరు నమ్మకాలు, నియమాలు ఉన్నాయి.

వైనాడు లోని కురిచ్చియనులలో గర్భిణీ స్త్రీని విడిగా ఒక ప్రత్యేకమైన గుడిసెలో ఉంచుతారు. ఈ గుడిసెను ‘ఒరక్కోత్తిల్’ లేదా ‘ఎరక్కొట్టుపురా’ లేదా ‘తీడాపురా’ అంటారు. ఆమెకు నొప్పులు ప్రారంభం అయ్యాక ముగ్గురు మంత్రసానులు ఆమెకు తోడుగా ఉంటారు. వాళ్ళు కచ్చితంగా కురిచ్చియనులు అయిఉండాలి. ఈ గుడిసె పరిసరాలలో పురుషులకు అనుమతి ఉండదు. ప్రసవం కష్టతరం అయితే పూర్వజులు ఆగ్రహించారనీ లేకపోతే చేతబడి జరిగిందనీ, లేదా ఆ స్త్రీకి వివాహేతర సంబంధం ఉందనీ విశ్వసిస్తారు. కారణం నిర్ధారించడానికి పూజారి దగ్గరికి వెళ్తారు. అతను కానీ ఆ స్త్రీకి వివాహేతర సంబంధం కారణం అని తేలిస్తే ప్రసవం తరవాత ఆమెను బహిష్కరిస్తారు.

కురిచ్చియన్ స్త్రీ ప్రసవం అయిన 40 రోజుల వరకూ ఆమెను మగవాళ్ళు చూడకూడదు. 60 రోజుల వరకు పనుల నుండి మినహాయింపు ఉంటుంది. ప్రసవం తరవాత 9 రోజుల వరకూ బియ్యం గంజి, జావ వంటి తేలికపాటి ఆహారం ఇస్తారు. తూర్పు కనుమల్లోని జాతులలో ప్రసవం అయిన రెండో రోజునుండీ మహిళలు పనుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.

అత్యంత వెనుకబడిన తెగ అని అందరూ భావించే చెంచు మహిళలకి గర్భ నిరోధానికి, గర్భ విచ్ఛిత్తికి చెట్ల మందు వాడటం తెలుసు. అయితే వాటి పేర్లు రహస్యంగా ఉంచాలనీ లేకపోతే దేవుడు శిక్షిస్తాడని బలంగా నమ్ముతారు. 9 నెలలకు ప్రసవం అయితే మగపిల్లవాడు పుడతాడని, 10 నెలలు నిండితే ఆడపిల్ల పుడుతుందని నమ్ముతారు. ప్రసవం అయ్యే టైము వరకూ అడవిలో సేకరణ పనులు చేస్తూనే ఉంటారు. బొడ్డు కోసాక మాయతో పాటు దానిని ఎలుకలు, పందికొక్కులు పెట్టె కలుగులలో వేస్తారు.

రాజకీయాలలో ఆదివాసీ మహిళల స్థానం: ఆదివాసీ గ్రామాల్లో రాజకీయ స్థలం రచ్చబండ. లేదా గ్రామ సభ. అక్కడికి మహిళలను రానివ్వరు. పురుషులే అన్నీ అక్కడ నిర్ణయిస్తారు. మైదాన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పరిమిత సెక్షన్ కు చెందిన బగత, కొండరెడ్డి, వాల్మీకి తెగల మహిళలు రాజకీయాల్లో అరుదుగానైనా కనిపిస్తారు. ఆదివాసీ మహిళలకు కేటాయించిన రిజర్వేషన్ల వలన దేశంలో కొన్ని తెగల మహిళలు ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, ఎం‌ఎల్‌ఏ, మంత్రులు వంటి పదవుల్లోకీ కూడా వస్తున్నారు. రిజర్వేషన్ వాడుకోవడానికి కొంతమంది మహిళలను నిలబెట్టి వెనుక నుండి భర్తలు తెగ పెద్దలు పెత్తనం చేయడం ఒక వైపు కనిపిస్తుంది. ఇంకొక వైపు సామాజిక కారుయాకలాపాల్లో చాలా క్రియాశీలకంగా పని చేసే ఆదివాసీ మహిళలకు చాలా సార్లు ఆయా పార్టీలు టిక్కెట్లు నిరాకరించడం లేదా తెగ పెద్దలు వత్తిడి చేసి పోటీ చేయనివ్వకపోవడమూ కనిపిస్తుంది. అధికార మార్పిడి జరిగిన 75 యేళ్ళకి ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అయ్యారు. ఆమె ఒదిశాకి చెందిన సంథాలీ ఆదివాసీ తెగకు చెందుతారు. లోక్ సభ సభ్యులుగా ఎన్నికయిన ఆదివాసీ స్త్రీల సంఖ్య 2019 వరకూ కూడా సింగిల్ డిజిట్ లో ఉంది. మొదటి సారి 2019-2024 లో 11 మంది ఆదివాసీ మహిళా సభ్యులు ఉన్నారు. ఎన్నికయిన 78 మంది మహిళల్లో 11 మంది ఆదివాసీ మహిళలు. రాష్ట్రాలలో కూడా అక్కడక్కడా ఉన్నారు. తెలంగాణా లో ఒక ఆదివాసీ మహిళా ఎం‌ఎల్‌ఏ (కోవ లక్ష్మి), ఒక ఆదివాసీ మహిళా మంత్రి (దనసరి అనసూయ ఉరఫ్ సీతక్క) ఉన్నారు. దండకారణ్యంలో విప్లవోద్యమ నేతృత్వంలో ఏర్పడుతున్న జనతన సర్కార్లలో గ్రామ స్థాయి నుండి కూడా రేంజ్ స్థాయి లేదా ఉన్నత స్థాయి అన్ని కమిటీలలోనూ మహిళలు 50 శాతంగా ఉన్నారు. అసలు కమిటీలు ఏర్పరిచేటప్పుడే కచ్చితంగా సగం మంది మహిళలు ఉంటారు. అంటే ఏ రచ్చబండ దగ్గరకు రావడానికి కూడా అనుమతి లేదో అక్కడ న్యాయ శాఖ అధ్యక్షులుగా ఇప్పుడు వందల పంచాయితీలలో తీర్పులు చెబుతున్నారు. జనతన సర్కారు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీలో సంథాలీ తెగకు చెందిన మహిళ షీలా మరాండీ సభ్యురాలిగా ఉండి ప్రస్తుతం ఝార్ఖండ్ లో జైలు జీవితం గడుపుతున్నారు. రాష్ట్రస్థాయిలో కూడా సంథాలీ, ముండారీ తెగలకు చెందిన మహిళా నాయకత్వం ఉన్నారు. దండకారణ్యంలో వివిధ స్థాయిలో ఆదివాసీ మహిళా నాయకత్వం పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి వరకూ నాయకత్వంలో స్థానిక ఆదివాసీ మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది.

పోరాటాలలో ఆదివాసీ మహిళలు:
భారతదేశంలో ఆదివాసీల పోరాటాలది చాలా అపూర్వమైన చరిత్ర. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఎదుర్కొన్న మొట్టమొదటి ప్రతిఘటన ఆదివాసులనుండే. బ్రిటిష్ వాళ్ళు, ఆదివాసీల సాంప్రదాయ వ్యవసాయ క్రమానికి తీవ్రమైన ఆటంకం కల్గించడం, అడవి మీదా అటవీ వనరుల మీద హక్కు లేకుండా చేయడంతో వారి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నాం అయ్యింది. ముఖ్యంగా రైల్వేలకు, ఇతర అవసరాలకు పెద్ద ఎత్తున అవసరం పడిన కలప కోసం, తాము దోచుకుపోదల్చుకున్న సహజ వనరులకు అడవులు ప్రధానమైన వనరు కావడంతో అటవీ చట్టాలు తెచ్చి ఆదివాసీల జీవితాలను ఛిన్నాభిన్నం చేయడం మొదలయ్యింది. దాంతో ఎక్కడికక్కడ తిరుగుబాట్లు జరిగాయి. దాదాపు ఆణి ఆదివాసీ తిరుగుబాట్లకూ ఇదే ఒక ఉమ్మడి అంశంగా ఉంది. అప్పుడు బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో అయినా ఇప్పుడు కార్పొరేతీకరణకు భారత ప్రభుత్వానికీ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో అయినా మనకి సాధారణంగా కనిపించే డిమాండ్లు – అటవీ భూమిపైన హక్కు, అటవీ వనరుల పైన హక్కు, స్వయం పరిపాలన. ఈ అన్నీ తిరుగుబాట్లలోనూ మిఒదటి నుండీ కూడా ఆదివాసీ ప్రజలు యావత్తూ కుటుంబాలతో సహా పాల్గొన్నారు. కాబట్టి స్త్రీలు ప్రతి పోరాటంలోనూ మినహాయింపు లేకుండా పాల్గొన్నారు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలలో వారి సాహసాల గురించి స్వయంగా బ్రిటిష్ అధికారులే రికార్డుల్లో నమోదు చేశారు. 1776 లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన చూ అర్ తిరుగుబాటులో కానీ, 1774 నుండి 1910 మధ్య బస్తర్ లో జరిగిన పది తిరుగుబాట్లలో కానీ 1820-1837 వరకూ ఛోటా నాగ పూర్ (ఝార్ఖండ్) లో జరిగిన కోల్ తిరుగుబాటులో కానీ, 1854 ప్రాంతంలో సంతాల్ ఆదివాసీలు సిద్దూ, కానూ సోదరుల నేతృత్వంలో జరిపిన హూల్ (తిరుగుబాటు) లో కానీ, భాగీరథ్ నాయకత్వంలో జరిగిన ఖర్ వార్ ఉద్యమంలో కానీ 1890-1900 మధ్య బిర్సా ముండా నాయకత్వంలో జరిగిన ‘ఉల్ గులాన్’ లో కానీ పెద్ద ఎత్తున ఆదివాసీ మహిళలు పాల్గొన్నారు. 1922-1924 లో ఆల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన తిరుగుబాటులో కూడా తూర్పు కనుమాల్లోని ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ మహిళలు పాల్గొన్నారు. హైదరాబాద్ లో నిజాం పాలనకు వ్యతిరేకంగా కొమురం భీం నాయకత్వంలో జరిగిన తిరుగుబాటులో ఆదిలాబాద్ గోండు మహిళలు పాల్గొన్నారు.

పెద్ద పెద్ద డ్యాంల నిర్మాణం వలన అనేక ప్రాంతాల ముంపుకు గురైనపుడు కూడా ప్రతిచోటా ఆదివాసీలు మహిళలతో సహా వాటికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. నర్మదా బచావ్ ఆందోళనలో దాదాపు రెండు దశాబ్దాల పాటు సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఆదివాసీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఝార్ఖండ్ లో బిర్సా ముండా పుట్టిన ఖుంటీ జిల్లాలో 300 గ్రామాల ప్రజలు అటవీ చట్టాలలో ప్రభుత్వం చేసిన సవరణలని వ్యతిరేకిస్తూ రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా గ్రామసభలకు అధికారం ఉండాలని పథల్ గడీ ఉద్యమాన్ని చేపట్టినపుడు కూడా మహిళలు ఈ ధర్నాలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ ఉద్యమాలన్నిటితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విప్లవోద్యమంలో కూడా నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల దగ్గర నుండి ప్రస్తుతం నడుస్తున్న విప్లవోద్యమంలో ఆదివాసీ మహిళల పాత్ర చాలా ప్రముఖమైనది. నల్లమల ప్రాంతంలో కావచ్చు, తూర్పు కనుమల్లో కావచ్చు, దండకారణ్యంలో కావచ్చు. ఆదివాసీ మహిళలు మార్క్సిస్టు అవగాహనతో కేవలం తమ హక్కుల కోసం మాత్రమే కాక మొత్తం సమూల మార్పు కోసం సమసమాజం కోసం జరుగుతున్న సాయుధ పోరాటంలో పాల్గొని, నాయకత్వం వహిస్తున్నారు. నల్లమల ఉద్యమంలో అలా చెప్పుకోదగ్గ స్థాయిలో నాయకత్వ స్థాయిలో పనిచేస్తూ అమరత్వం పొందిన చెంచులక్ష్మి ని ఈ సందర్భంగా తప్పక స్మరించుకోవాలి. అలాగే దండకారణ్యంలో ఇప్పటివరకూ వివిధ స్థాయి నాయకత్వ స్థానాల్లో పనిచేస్తూ అమరులైన వందలాది మంది ఆదివాసీ మహిళలను స్మరించుకోవాలి.

అలాగే ఆదివాసీ సమాజంలో అంతర్గతంగా ఉన్న పితృస్వామ్య వ్యతిరేక పోరాటాలు కొన్నిటిని గురించి కూడా తెలుసుకుందాం. ఆదివాసీ సమాజంలో చాలా మెల్లగా మార్పు జరుగుతుంది. దానికి ప్రధాన కారణం అక్కడ కట్టుబాట్లకి చాలా విలువ ఉంటుంది. దేనినీ బలవంతంగా అమలు చేయలేరు. చైతన్యం పెంచడం ద్వారా మాత్రమే మార్పు సాధ్యం.

ప్రధానంగా దండకారణ్యంలో ఇలాంటి పోరాటాలు చాలా జరిగాయి. ‘కుర్మలోను’ (బహిష్టు సమయాల్లో దూరంగా అడవిలో గుడిసెలో ఉంచే ఆచారానికి) వ్యతిరేకంగా ఆదివాసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో చాలా ప్రచారం, పోరాటాలు జరిగాయి. చాలా చోట్ల ఈ ఆచారం ఇప్పుడు లేదు. అలాగే మహిళలు విత్తనాలు చల్లకూడదు అనే ఆచారానికి వ్యతిరేకంగా కూడా జరిగాయి. చివరికి జనతన సర్కార్ ఏర్పడిన ప్రాంతాల్లో మహిళలతో విత్తనాలు చల్లించినపుడు పంట బాగా రావడంతో మరిన్ని చోట్ల ఈ ప్రయోగాలు జరిపి ఒప్పించారు. అలాగే స్త్రీలకు పెళ్ళయిన తరవాత జాకెట్టు తీసెయ్యలనే ఆచారానికి వ్యతిరేకంగా కూడా చాలా పోరాటమే చేయాల్సి వచ్చింది. వ్యక్తిగత పోరాటాలే కాకుండా కొన్ని చోట్ల సామూహికంగ కూడా చేశారు. మొదటి సారి ఒక గ్రామంలో 300 మంది మహిళలు జాకెట్లు కుట్టించుకొని వేసుకొని ర్యాలీ తీశారు. వాళ్ల భర్తలు వాళ్ళని కొట్టి జాకెట్లను చించేశారు. 30 మంది మాత్రమే ఉంచుకోగలిగారు. కానీ ఆ పోరాటం కొనసాగి విప్లవ పార్టీ మద్ధతుతో మహిళలు ఆ ఆచారాన్ని వదిలించుకోగలిగారు. అలాగే కన్యాశుల్కం కూడా ఆచారంగా మాత్రమే అమలవుతోంది. సంఘంలోనూ, విప్లవ పార్టీలోను చేరిన ఆదివాసీ మహిళలు తమ స్వీయ ఎంపికతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. చాలా మంది యువతులు స్వేచ్చా ఎంపిక కోసం చాలా పోరాటం చేసారు. చిన్నప్పుడే తమ అంగీకారం తీసుకోకుండా తల్లిదండ్రులు కల్లు తాగి నిర్ణయించే పెళ్ళిళ్ళను కాదంటున్నారు. అనేక మంది యువతులు విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితం కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణంగా ఉంది. స్త్రీలు విల్లు, బాణాలు ముట్టుకోకూడదనే కట్టుబాటు కూడా విప్లవోద్యమ ప్రాంతాల్లో సమసి పోయింది. ఇప్పుడు మిలీషియా మహిళలు విల్లు బాణాలతో తమ గ్రామాల రక్షణ చేస్తున్నారు. శత్రువుతో పోరాడుతున్నారు. దండకారణ్య ఆదివాసీ మహిళల్లో ఇలాంటి మార్పు ఎలా సాధ్యమైంది అనే విషయం అర్థం చేసుకోవడానికి తప్పక “దండకారణ్య మహిళా ఉద్యమ చరిత్ర’ పుస్తకాన్ని చదివి తీరాలి.

ఇప్పుడు కార్పొరేటీకరణ చేస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా అనేక చోట్ల జరుగుతున్న పోరాటాలలో మహిళల భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉంటోంది. అంతే కాదు భారత రాజ్యం తమ మీద చేస్తున్న ‘యుద్దానికి’ వ్యతిరేకంగా కూడా మహిళలు సాయుధంగా పోరాడుతున్నారు. భారత ప్రభుత్వం అత్యంత వెనుకబడిన, అంతరించిపోతున్న తెగలుగా 74 జాతులను గుర్తించింది. వారికోసం ఎన్నో పథకాలను, నిధులను కేటాయించింది. ఆ తెగల్లో చెంచులు, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోని అబూజ్ మాడియా, బైగా, కోలామ్, మాడియా గోండులు ఉన్నారు. ఆయా జాతుల పరిరక్షణకు పూనుకోవాల్సిన ప్రభుత్వం ఆచరణలో ఏమి చేస్తుందంటే ఇటీవలే మాడ్ ప్రాంతంలో భారత మిలిటరీకి 1,35,000 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి మావోయిస్టులని అణచిపెట్టడానికి ఏమీ సంబంధం లేదు అంటోంది. అసలు అంత అటవీ భూమిని అక్కడ సైనిక కార్యకలాపాలను అభ్యాసం చేసుకోవడానికి కేటాయిస్తుందంటే దాని పర్యవసానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత పర్యావరణ విధ్వంసానికి, ఆదివాసీ హననానికీ పాల్పడటారో చెప్పనవసరం లేదు. దీన్ని కూడా తెగించి పోరాడుతున్న ఆదివాసీలు సమర్థవంతంగా ఎదుర్కొంటారని వారికి మద్ధతుగా మన బాధ్యతను మనం కూడా నిర్వర్తించాలనీ కోరుతున్నాను.
***
ఈ ప్రసంగ పాఠానికి ఉపకరించిన పుస్తకాలు, వ్యాసాలు :

దండకారణ్య మహిళలు-నిన్న, నేడు- బయ్యా వేలాది (పోరు మహిళ మార్చి 2006.)
పెళ్ళి-గెరిల్లా పెళ్ళి- నీలిమ (పోరు మహిళ మార్చి 1997)
బైగా మహిళల జీవన విధానం (పోరు మహిళ అక్టోబర్ 1998)
ఇప్పనూనే తీయడంలో మహిళల పాత్ర –ఇడిమే (పోరు మహిళ ఏప్రిల్-డిసెంబర్ 2004)
ఆదివాసీ జీవితాలు –పితృస్వామ్య రూపాలు –బద్రి (పోరుమహిళ మార్చి-అక్టోబర్ 2002)
దండకారణ్య మహిళా ఉద్యమ చరిత్ర (1980-2009) విరసం ప్రచురణ
లంబాడీ ప్రజల జీవన విధానం –స్త్రీలు (పోరుమహిళ –మార్చి 2001)
మహిళ లేని చరిత్ర లేదు – ఉద్యమాలలో భారత మహిళలు – వి.గార్గి (మహిళామార్గం ప్రచురణ.)
Tribal India- Nadeem Hasnain (Palaka prakashan Delhi)
Ethno History, Ethnography and Cultural Aspects of the Chenchu tribe of AP Dr. P.Kalyan Kumar
Work participation of Tribal women in India- A development perspective-Gummadi Naresh
Santhali women under the shadow of long silence-Nayan Jyoti Das
The Role and status of Tribal women in Kerala- A case study of Kuruchians in Wayanad- P.R.G.Mathur
(అనేక వెబ్ సైట్లు)

(‘ప్రజాస్వామిక  రచయిత్రుల వేదిక’ 2024 సెప్టెంబర్ 8 నుండి అక్టోబర్ 6 వరకు ఆదివాసీ జనజీవన చరిత్ర – వర్తమానం’ అనే శీర్షికతో నిర్వహించిన అంతర్జాల ప్రసంగాల పరంపరలో ఒకటి ( సెప్టెంబర్ 22) )

కథా రచయిత, అనువాదకురాలు, యాక్టివిస్ట్.

Leave a Reply