నంబూరి పరిపూర్ణ కథా రచయిత్రి, నవలా కారిణి, వ్యాస రచయిత్రి. 1931 లో పుట్టినా ఈ కాలపు సాహిత్య ప్రపంచంతో సజీవ సంబంధంలో ఉన్న రచయిత్రి. ఆమె జీవించిన పద్ధతి పట్ల ప్రేమాభిమానాలు, ఆమె సాహిత్య సృజన శక్తులపట్ల గౌరవం గల పరిణత మనస్కులు, సాహిత్య కారులు కూడా అయిన ఒక కూతురు దాసరి శిరీష , ఇద్దరు కొడుకులు దాసరి అమరేంద్ర , శైలేంద్ర ల మద్దతు కారణంగా ఆమె సాహిత్యం అధ్యయనానికి అందుబాటులో ఉంది.
పరిపూర్ణ బాల్యం సాహిత్య నాటక కళారంగాలతో ను , విద్యార్థి జీవితం కమ్యూనిస్టు రాజకీయాలతోనూ ముడిపడి గడించింది. నటనను , పాటను కమ్యూనిస్టు రాజకీయాల ప్రచార సాధనాలుగా సమర్ధవంతంగా నిబద్ధతతో ఉపయోగించుకొన్నది. కానీ రచన మాత్రం ఆమె జీవితంలో తరువాత కాలానికి సంబంధించినది. ముఖ్యంగా 1958 లో గ్రామ విస్తరణాధికారిగా ఉద్యోగం ప్రారంభించి, మరో నాలుగేళ్లకు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో లైజాన్ ఆఫీసర్ గా చేరి పనిచేసిన జీవితకాలపు తొలినాళ్లలో పట్టుబడిన విద్య అది.( ఉంటాయి మాకుషస్సులు ,ముందుమాట) గుర్తింపు దశకమైన 1960 లలో ఒక స్త్రీగా తన అనుభవాలను , ఆలోచనలను, అభిప్రాయా లను స్త్రీలందరి సాధారణ అనుభవాలతో సంవదిస్తూ చేసిన సృజన విమర్శన సంభాషణ ఆమె సాహిత్య వ్యాసంగం. 1965 నుండి స్త్రీ సమస్యల పైనా, దళిత జీవన సమస్యల పైన ఆమె వ్యాసాలు ప్రతిభ, ప్రగతి , వార్త వంటి పత్రికలలో ప్రచురించ బడ్డాయి. మాకు రావు సూర్యోదయాలు నవలిక తో 1985 లో సృజన సాహిత్య రచన ప్రారంభం అయింది. 1998 లో ఉంటాయి మాకుషస్సులు కథా సంపుటి ప్రచురించబడింది. మరొక పన్నెండు కథలు ముప్ఫయి అయిదు వ్యాసాలతో 2016 లో శిఖరారోహణం పుస్తకం వచ్చింది. 86 ఏళ్ల పరిపక్వ దశలో 2017 లో స్వీయ చరిత్రను, 2018 లో పొలిమేర అనే నవలను వ్రాసి ప్రచురించింది. వెయ్యి పున్నములు చూసిన నంబూరి పరిపూర్ణ సాహిత్య జీవిత గమనం షష్టి పూర్తి కి చేరువలో వుంది. ఆమె సాహిత్య జీవిత ప్రస్థానం ఏ వెలుగుల వైపు సాగిందో అంచనా వేయ వలసిన సందర్భం ఇది.
1
నంబూరి పరిపూర్ణ సాహిత్య అధ్యయనం ఆమె స్వీయ చరిత్రతో ప్రారంభించాలి. ఆమె స్వీయ చరిత్ర శీర్షిక ‘వెలుగుదారులలో…..’ చీకట్లను ఛేదించుకొంటూ చేసిన బతుకు పయనం. చదువుతుంటే అసాధారణ అనూహ్య అనుభవ పరంపరల మధ్య కాగి కాగి, కరిగి ఘనీభవించిన ఉక్కు మనిషి విశ్వరూపం, దానివెనుక వున్నతెలుగు సమాజం,దానిని నడిపిస్తున్న మనువాద సంస్కృతి , తలకిందుల సమాజాన్ని సరిచేసి నిలబెట్టాలన్న సంకల్పంతో సాగిన ఆర్ధిక రాజకీయ పోరాటాల గమనం -అన్నీఅర్ధమవుతాయి. దానితో పాటు అవి ఆమె జీవిత దృక్పథాన్ని రూపొందించిన తీరు తెలిసి వస్తుంది. ఆ వెలుగులో ఆమె సాహిత్య అధ్యయనం మరింత సారవంతంగా , ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ స్వీయ చరిత్రలో అధ్యయాలు ఆరు. తొలి అధ్యాయం ‘చిన్ననాటి ముచ్చట్లు’. ఆమె పుట్టుక , పుట్టిన మాల వైష్ణవ కుటుంబ పౌరాణిక సాంస్కృతిక నేపధ్యం, తల్లి తండ్రుల వృత్తి, తోడబుట్టిన వాళ్ళ వివరాలు, తన బడి చదువులు నాటకాలు , పాటలు, పది పదకొండేళ్ల వయసులో పౌరాణిక సినిమాలో ప్రహ్లాద పాత్ర ధరించటానికి వచ్చిన అవకాశం, సినిమా అనుభవాలు ఇందులో చెప్పబడ్డాయి. పరిపూర్ణ తల్లి లక్ష్మమ్మ. తండ్రి లక్ష్మయ్య. ఆయనది అందమైన రూపం.కమ్మగా పాడగల మంచి కంఠం. నటనాకౌశలం వున్నాయి. నాటకాలు వేయటం, వేసేందుకు యువకులకు శిక్షణ ఇయ్యటం, వైద్యం, వ్యవవసాయం తో పాటు ఆయన బొమ్ములూరు లో గ్రాంట్ స్కూల్ నిర్వాహకుడు. మాల మాదిగ పల్లెల్లో బళ్ళు పెట్టి పాఠాలు చెప్పటానికి అయిదవతరగతి వరకు చదువుకున్న వ్యక్తులను గుర్తించి వాళ్లకు ఆరునెలలు లోయర్ గ్రేడ్ ఉపాధ్యాయ శిక్షణను ఇచ్చి ఏడాదికి ఇంతమొత్తం అని బడి నిర్వహణకు నిధులను నిర్ధారించి ఏర్పరచిన ఏకోపాధ్యాయ పాఠశాలలనే గ్రాంట్ స్కూళ్ళు అనేవాళ్ళు. పరిపూర్ణ తండ్రి లక్ష్మయ్య అలాంటి శిక్షణ పొందే బొమ్ములూరులో బడిపెట్టి నడిపాడు. పుట్టింటి ఆధ్యాత్మిక చింతనా వారసత్వం వల్ల పన్నెండేళ్ళకే భగవద్గీత, రామాయణ పారాయణం చేయగల పరిజ్ఞానం పొంది, రెండవ తరగతి చదివిన లక్ష్మమ్మ భర్తకు సహాయకురాలుగా ఆ బడి నిర్వహణలో భాగస్వామి అయింది. ఆ రకంగా ఆమె తల్లి దండ్రులు మాల దాసరి కుల కుటుంబ సంస్కృతుల కారణంగా, బతుకుతెరువుకు ఎంచుకొన్న ఉపాధ్యాయవృత్తి వల్ల విద్యా విజ్ఞానాలను వారసత్వంగా పొందింది.
పరిపూర్ణకు ఇద్దరు అన్నలు , ఇద్దరు అక్కలు . ఒక తమ్ముడు.ఆమె కు ఊహ తెలిసే వయసుకే పెద్దన్న శ్రీనివాస మూర్తి కమ్యూనిస్టు రాజకీయాలలో ,చిన్నన్న దుర్వాస మహర్షి స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములు. ఆమె పుట్టేనాటికి ఆంధ్రా లో దళిత ఉద్యమ చైతన్యం సాహిత్య సృజనరంగాన్ని కుదుపుకు లోను చేస్తున్నది. అంటు దోషం మానాలంటూ కుసుమధర్మన్న , జాలా రంగస్వామి వంటివాళ్ళు రచనను శక్తి మంతమైన ఆయుధంగా పదునెక్కిస్తున్నారు. జాలా రంగస్వామి భార్య జాలా మంగమ్మ కూడా రచనలు చేసినట్లు తెలుస్తున్నది కానీ అవి అలభ్యాలు. గొట్టుముక్కల మంగాయమ్మ , చుండూరి రమాదేవి, తాడినాగమ్మ నంబూరి పరిపూర్ణ పుట్టిన 30 వ దశకపు దళిత రచయిత్రులు. ఈ దేశకాలాల చైతన్య శక్తి నంబూరి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస కారకం.
రెండవ అధ్యాయం తొలి అడుగులు. సినిమాలలో నటించటానికి మద్రాస్ ఆ తరువాత బొంబాయి వెళ్లి కొన్ని నెలలు ఉండాల్సి రావటం వల్ల ఆగిపోయిన పరిపూర్ణ బడి జీవితం కమ్యూనిస్టు రాజకీయాలలో జైలు జీవితం గడుపుతున్న పెద్దన్న శ్రీనివాసరావు కారణంగా దర్శి చెంచయ్య బాధ్యత తీసుకొనటంతో మద్రాసు లో తిరిగి మొదలైంది. సేవాసదనం అనే హైస్కూల్లో చేర్చి అనుబంధ వసతిగృహంలో ఆమెను చేర్చారు. అక్కడ ధనిక పేద వర్గ విద్యార్థుల పట్ల అమలవుతున్న వివక్ష నచ్చక ఆ విషయం చెంచయ్యగారికి చెప్పింది. దానితో ఆమె చదువు రామకృష్ణ మిషన్ వారి శారదా బాలికా పాఠశాలకు మారింది. అక్కడ ఉండగానే రేడియోలో పాడటానికి, నాటకాలలో నటించటానికి ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయి. రెండవ ప్రపంచయుద్ధం (1939-1942) జరుగుతున్న ఆ రోజులలో నేషనల్ వార్ ఫ్రంట్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న జాషువా యుద్ధ అనుకూల ప్రచార సాంస్కృతిక బృందంలో చేరమని పరిపూర్ణను కోరాడు. ప్రపంచాధిపత్యం కోసం బ్రిటన్ వంటి సామ్రాజ్యవాద దేశాల కూటముల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని భారత దేశం బలపరచవలసిన, సహాయ సహకారాలు అందించవలసిన అవసరం లేదని పదమూడు ఏళ్ల వయసులోనే స్పష్టమైన అభిప్రాయం కలిగిన పరిపూర్ణ ఏ మాత్రం మొహమాటం లేకుండా జాషువా ప్రతిపాదనను తిరస్కరించటం విశేషం.
ఆ తరువాత ఆమె చదువు రాజమండ్రికి మారింది. రాజమండ్రి జైలులో ఉన్న అన్నగారిని కలవటానికి తల్లితో పాటు రాజమండ్రి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో వున్నప్పుడు రంగ స్థల భయం లేక చక్కగా చొరవ తో పాడగల పరిపూర్ణ సంగతి తెలిసి ఆమె చేత జన సమూహాలను సమీకరించిన చోటల్లా పాటలు పాడించటం మొదలు పెట్టారు. పార్టీ వారి కోరికపైన తల్లి తిరిగి వూరికి వెళ్ళిపోయినా ఆమె రాజమండ్రిలోనే ఉండిపోయింది. ఆ క్రమంలోనే పార్టీ ఆమె చదువు బాధ్యత స్వీకరించింది. హైస్కూల్ చదువు అక్కడే పూర్తి చేసింది. పార్టీ అనుబంధ మహిళా సంఘం పనులు చేసింది. విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో భాగమైంది. మహీధర రామమోహనరావు వంటి వాళ్ళ ఆదరాభిమానాలు లభించాయి. ఆ కాలంలోనే కమ్యూనిస్టు సిద్దాంత అవగాహన అభ్యుదయ సాహిత్య పఠనం మరింత పెరిగాయి.
మూడవ అధ్యాయం ‘ఉద్యమాలు – ఉద్వేగాలు’ కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంటర్మీడియట్ లో చేరటంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. కాకినాడ జిల్లా విద్యార్థి ఫెడరేషన్ లో చురుకుగా పనిచేస్తూ 1949 డిసెంబర్ లో రాష్ట్ర మహాసభల కోసం పనిచేసింది. ఆ సందర్భంగానే దాసరి నాగభూషణ రావు తో ఆమెకు పరిచయం అయింది. ఆ పరిచయమే పెళ్ళికి దారి తీసింది. అప్పటికి ఆమెకు పద్ధెనిమిదేళ్ళు. అయిదేళ్లుగా విప్లవ విద్యార్థి ఉద్యమంలో పని చేస్తున్న పరిపూర్ణకు ఉద్యమం పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తి నుండి పెళ్లి ప్రతిపాదన వచ్చినప్పుడు అది తన ఆదర్శాలకు ,ఆచరణకు బలం చేకూర్చేదిగా అనిపించటం సహజం. ఏదో ఒకమేరకు కులవివక్షను ఎదుర్కొన్న జీవిత వాస్తవికత, కమ్యూనిస్టు సాంస్కృతిక అవగాహన ఆమెకు వర్ణాంతర వివాహాన్ని ఆదర్శం చేశాయి. అన్న శ్రీనివాసరావు ఆమోదంతో కమ్యూనిస్టు పార్టీ పరిపూర్ణ నాగభూషణరావుల పెళ్లి చేసింది.
పార్టీ పై ఉన్న నిషేధాల కారణంగా కాపురం అజ్ఞాతవాసంలోనే సాగింది. 1951 మే నెలలో కూతురు శిరీష పుట్టింది.ఇక అక్కడి నుండి కుటుంబ బాధ్యత ను పరిపూర్ణ ఒంటరిగానే మోయవలసి వచ్చింది. బిడ్డతో మద్రాసు లో ప్రవాస జీవితం గడిపింది.1952 ఎన్నికలలో పార్టీ ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నది. ఏలూరు లో రెండవ బిడ్డ అమరేంద్ర పుట్టాక బతుకు తెరువు వెతుకులాటలో ఉపాధ్యాయ శిక్షణ పొందటం ,ఆదిపూర్తయ్యేసరికి మూడవ సంతానం శైలేంద్ర కలగటం -వాళ్ళ పోషణ కోసం ఉద్యోగాల వెతుకులాట- ఈ క్రమంలో ఆమె కమ్యూనిస్టు కార్యరంగం లో కనిపించకుండా పోయింది. పరిపూర్ణ కమ్యూనిస్టు దాసరి అఖిల భారత విద్యార్థి నాయకుడిగా ,ఆ తరువాత పార్టీ పూర్తికాలపు కార్యకర్తగా ,నాయకుడిగా ఎదుగుతూ ముందుకు సాగుతుంటే పరిపూర్ణ అదే వేగంతో వెనక్కి ,ఇంట్లోకి నెట్టబడింది.మగవాళ్ల జీవితానికి ,ఎదుగుదలకు ఏ రకంగానూ అవరోధం కాని పెళ్లి, పిల్లలు ఆడవాళ్ళ ‘సహజ బాధ్యత’ అయి జీవితాన్ని కుంచింప చేయటం లో పనిచేస్తున్న శక్తి పితృస్వామిక అసమ సాంఘిక న్యాయం తప్ప మరొకటి కాదు. దాసరి ఏ కమ్యూనిస్టు క్రియాశీల సౌందర్యాన్ని పరిపూర్ణలో చూచి ఇష్టపడి పెళ్లాడాడో ఆ క్రియాశీలత ను ఆమెలో సదా నిలిపి ఉంచటం గురించిన చింతన ఇంతైనా ఆ తరువాత కనబరచ లేకపోయాడంటే అది కమ్యూనిస్టులు కూడా గుర్తించలేకపోయిన లేదా గుర్తించ నిరాకరించిన ఆ పితృస్వామిక దురహంకార లక్షణం వల్లనే అనుకోవాలి.
పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే దాసరి భార్యాపిల్లలను పలకరించటానికి ఒక నిమిషం సమయాన్ని కూడా వెచ్చించక పోవటం ,నిర్లిప్తంగా, నిష్పూచీగా ఉండటం, భార్యా బిడ్డలకు బొత్తిగా చనువివ్వక పోవటం ఇలాంటివన్నీ -పరిపూర్ణ ను అసంతృప్తికి ,బాధకు గురిచేశాయంటే సహజమే మరి. భార్యాబిడ్డల బాధ్యత ఏ మాత్రం పట్టక పోగా భార్య జీవితం పైన,జీతం పైన అధికారాన్ని చూపే అతని అహంభావం ఆమెకు సహించరానిదే అయింది .ఇవన్నీ అతని భూస్వామ్య కుటుంబ లక్షణాలని పరిపూర్ణకు తెలుసు. కానీ ఒక కమ్యూనిస్టుగా వాటి నుండి బయట పడటానికి అతను ఏ ప్రయత్నమూ చేయక పోవటం ఆమెను ఎంతో గాయపరిచింది. అన్నిటా సమత్వాన్ని కాంక్షించే ఆదర్శ కమ్యూనిస్టు నేతకు అవే భూస్వామ్య రీతులు ,అవే నీతులా అన్నది ఆమె ఆవేదన.
నాలుగవ అధ్యాయం ఉద్యోగ ప్రస్థానం. ఇందులో పరిపూర్ణ 1958 నుండి 1961 వరకు బంటుమిల్లి సమితి సోషల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా, 1961 నుండి స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అనుబంధంగా లైజాన్ ఆఫీసర్ గా కృష్ణాజిల్లాలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తూ పనిచేస్తూ 1981 లో అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ ఆఫీసులో విధి నిర్వహణకు హైద్రాబాద్ తరలి వెళ్ళింది. 1989 లో రిటైర్ అయింది. ఆ కాలపు విజయవాడ తదితర నగరాల ముఠా రాజకీయ వ్యవహారాలు, ఘటనలు ఉద్యోగ జీవిత అనుభవాలు , ముగ్గురిపిల్లల చదువులు, ఉద్యోగాలు , మొదలైన విశేషాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి.
‘బతుకు పయనం – కొత్తతరాలు’ అయిదవ అధ్యాయం. పిల్లల పెళ్లిళ్లు , వాళ్ళ పిల్లలు, తన పిల్లల సాహిత్య సామాజిక కార్యకలాపాలు, బంధుత్వ సంబంధాలు మొదలైన అనేకవిషయాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. సాహిత్యమూ – నేనూ – నాకుటుంబమూ అనే అధ్యాయంలో తన రచనా వ్యాసంగానికి వాసిరెడ్డి సీతాదేవి ఇచ్చిన ప్రొత్సాహం గురించి, స్త్రీ సంబంధ సమస్యలను వ్యాసాలుగా వ్రాయటం కంటే కథలుగా వ్రాస్తే పాఠకులు ఆసక్తిగా చదువుతారని అనిపించి కథారచనకు పూనుకొన్న విషయాన్ని చెప్పుకొన్నది. తన కథలు తన ఉద్యోగ జీవితానుభవాల నుండి వచ్చాయని సూచించింది. మొదటి కథల సంపుటి ప్రచురణ,ఆవిష్కరణ మొదలైన అనేక సాహిత్య సందర్భాలను, సభలను, సాహిత్య కరువులతో తన స్నేహాలను తనపిల్లల సాహిత్య వ్యాసంగాలను, 75 వ జన్మదినం సందర్భంగా తన రచనలతో శిఖరారోహణం సంపుటిని ప్రచురించి పిల్లలు చేసిన వేడుక సభ ఇచ్చిన సంతృప్తిని గురించి ఈ అధ్యాయంలో చెప్పుకొచ్చింది. అనుబంధంగా ఉన్న ఏడవ అధ్యాయంలో పరిపూర్ణ గురించి, ఆమె సాహిత్యం గురించి ఇతరులు ప్రస్తావించిన విషయాలు , వ్రాసిన వ్యాసాలు, తల్లి గురించి, చండ్ర రాజేశ్వర రావు దంపతుల గురించి, బాలాంత్రపు రజనీకాంతరావు, సాలూరు రాజేశ్వర రావులతో తనకున్న సంగీత సంబంధాలను గురించి నంబూరి పరిపూర్ణ వ్రాసిన జ్ఞాపకాలు ఉన్నాయి.
స్త్రీలు మాట్లాడటం వ్రాయటం మొదలు పెడితే ఎన్ని జీవన వాస్తవాలు వెలికి వస్తాయో, సామాజిక జీవిత చరిత్రను ఎంత సమగ్రం చేస్తాయో, పితృస్వామిక అసమ సమాజానికి ఎన్ని సవాళ్లు విసురుతాయో నిరూపిస్తుంది నంబూరి పరిపూర్ణ స్వీయ చరిత్ర. జీవితం పట్ల ప్రధానంగా ఆమెది సానుకూల వైఖరి.తన కష్టాలకు కారకులని ఎవరినో తిడుతూ కూర్చోటం కాక తన జీవితాన్ని తాను నిర్మించుకొనటం కోసం ఉద్యోగాన్ని ఊతగా చేసుకొని1960 నుండి జీవితంలో రెండవ పర్వం ప్రారంభించింది. ఉద్యోగం చేస్తూ తల్లి సహాయంతో పిల్లల ను పెంచి ప్రయోజకులను చేసింది. కమ్యూనిస్టు కార్యాచరణలో లేకపోయినా అది మిగిల్చిన సంస్కారం వల్ల ఉద్యోగ నిర్వహణలో భాగంగా గ్రామీణ మహిళల సంక్షేమం గురించి శ్రద్ధ పెట్టటం దళితుల గురించి ప్రత్యేక సామాజిక కార్యకలాపాలను చేపట్టగలిగింది. సాహిత్య కృషి సాగించగలిగింది.
ఈ క్రమం అంతటిలో వెలుగునే చూడటం పరిపూర్ణ ప్రత్యేకత. తన ఎనభై ఆరేళ్ల బతుకు పుస్తకానికి ‘వెలుగు దారులలో’ అని పేరు పెట్టటం దానినే సూచిస్తుంది. వివేకవంతులైన మనుషుల గమనం ఎప్పుడూ వెలుగు లక్ష్యం గానే సాగుతుంది. సాగాలి. వెలుగు వైపే తీసుకువెళుతుంది అనుకొని తొక్కిన దోవ ఒక్కొక్కసారి చీకటి గుయ్యారాలలోకి ఈడవవచ్చు,ఊబిలోకి లాగవచ్చు. అలాగని వెలుగే లేదనుకొనటం కానీ,దారుల మీద అపనమ్మకంతో నడకే వద్దనుకొనటంకానీ అభివృద్ధికర ఆలోచనలు కావు.చిన్నప్పటి నుండి సామాజిక అభ్యుదయానికి అభివృద్ధికి సంబంధించిన సమిష్టి చేతనతో పెనవేసుకొని పెరిగిన వ్యక్తిత్వం పరిపూర్ణను అలా అనుకోనియ్యలేదు. చీకట్లను ,చికాకులను అధిగమిస్తూ వెలుగువైపు చేసే నిరంతర ప్రయాణమే బతుకు అన్న తాత్విక పరిణితి ఆమెది.
2
నంబూరి పరిపూర్ణ కథలు పన్నెండు -1985 నుండి 1998 మధ్యకాలం లో వ్రాయబడినవి- ‘ఉంటాయి మాకుషస్సులు’ అనే సంపుటంలో కూర్చబడ్డాయి. 1998 లో పరిపూర్ణ పబ్లికేషన్ పక్షాన ప్రచురించబడిన ఈ సంపుటిని తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన పెద్దన్నయ్య నంబూరి శ్రీనివాస రావు కు అంకితం ఇచ్చింది. 1914 లో పుట్టిన ఆయన పరిపూర్ణ కన్నా పదిహేడేళ్లు పెద్దవాడు. 1969 లో మరణించాడు. అబ్బూరి ఛాయాదేవి ‘పరిపూర్ణత దిశగా’ అనే శీర్షికతో ఈ కథలకు ముందుమాట వ్రాసింది. ‘సమాజ జీవన స్రవంతిలో ఓ బిందువు నవ్వాలని’ అనే శీర్షికతో పరిపూర్ణ వ్రాసిన ముందు మాట కూడా ఉంది. ఇందులో ఆమె ‘మాకు రావు సూర్యోదయాలు’ అనే తన మొదటి రచనను నవలికగా పేర్కొన్నది. కనుక పొలిమేర నవలతో కలిపి దానిని చర్చించటం ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల దీనిని మినహాయిస్తే మిగిలినవి పదకొండు కథలు. 2016 లో ప్రచురించబడిన శిఖారారోహణం లోని పన్నెండు కథలు 1997 నుండి 2016 మధ్యకాలానివి. రెండు సంపుటాలను కలిపి చూస్తే 1985 నుండి 2016 వరకు మూడు దశాబ్దాల కాలం మీద నంబూరి పరిపూర్ణ వ్రాసిన కథలు ఇరవై మూడు.
ప్రారంభంలో పరిపూర్ణ కథా వస్తువు అత్యాచారాలు. బాలికలపైన, స్త్రీల పైనా జరుగుతున్న లైంగిక దాడులు. వయసుతో , వరుసతో, స్థలంతో సంబంధం లేకుండా జరుగుతున్న అత్యాచారాలు సమకాలపు ఆందోళనకర సమస్య అనుకొంటున్నాం కానీ 80 లనాటికే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో పరిపూర్ణ పరిశీలన నుండి వచ్చిన ఆ పాపదేమి తప్పు (డిసెంబర్ 1985), వీలు దొరికితే ( డిసెంబర్ 1989) కథలు చెప్తాయి. సినిమాలలో దృశ్యం చేయబడే అత్యాచారం,వార్తలలో ప్రతిరోజు కనిపించే అత్యాచార కథనాలు, అక్క, తల్లి , పొరుగింటి ఆవిడ చెప్పే జాగ్రత్తలు అన్నీ కలిసి పసివయసులోనే ఆడపిల్లలకు మగవాళ్ళను నమ్మరాదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్న విషయాన్ని స్కూల్ నుండి బస్సు దిగి ఇంటి వైపు నడుస్తున్న అమ్మాయి అంతరంగ ఆలోచనల ముఖంగా చూపిన కథ ‘ఆ పాపదేమి తప్పు’. పిల్లలకు వ్యక్తిగత శారీరక అవయవాల గురించి స్పృహ కలిగించటం, ఎవరైనా తమను ముట్టుకొంటే స్పర్శ మంచిదా చెడ్డదా అని గ్రహించే శిక్షణ ఇయ్యటం జరుగుతున్నదంటే మనుషులలో పరస్పరం ఉండవలసిన నమ్మకం వెలిసి పోతున్నదన్నమాటే. ఆడవాళ్లకు మగవాళ్ల పట్ల నమ్మకం పోవటం, మగవాళ్ళు నిత్య అనుమానితులుగా మిగిలటం ఆరోగ్యకరమైన సమాజ లక్షణం కాదు. అది నంబూరి పరిపూర్ణ వేదన. ఆ వేదన నుండి వచ్చిన కథ ఇది. పసి పిల్లలు సైతం మగవాళ్ళను అనుమానించే స్థితికి కారణాలు తెలిసి పరిష్కరిస్తే తప్ప సమాజానికి ఆరోగ్యకరమైన మనుగడ లేదని ఈ కథ ద్వారా సూచించింది ఆమె.
వీలు దొరికితే కథలో ఎందరికో ఉపకారం చేయగల పేరు ప్రఖ్యాతులు పొందినవాళ్లు కూడా స్త్రీల విషయంలో అపకారులుగా మారటానికి తమకున్న అన్ని అవకాశాలను వినియోగించు కోవటం వస్తువు. ఉద్యోగావకాశం కల్పించగల తన హోదాను ఉపయోగించుకొని ఒక బడుగు బలహీన వర్గాల స్త్రీపై జరిపిన అత్యాచారంలోని హేయత భాస్కర్ కు తనకూతురిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన సందర్భంలో గానీ అర్ధం కాలేదు. చదువు సంధ్య లేని వెధవలు, సెక్స్ సినిమాలు చూసి వికృత బుద్ధితో కనిపించిన ఆడపిల్లలమీద అత్యాచారం చేసే కిరాతకుల జాబితాలో చేర్చి ఆటో డ్రైవర్ ను తిట్టుకొంటూ ఆవేదన పడుతున్న తరుణంలో అతనికి తన తప్పు తెలిసి రావటం ఈ కథకు ముగింపు. ఏమైనా చదువులకు, ఉద్యోగాలకు బయటకు వెళ్లే స్త్రీలకు భద్రత లేని సమాజం పట్ల, పురుష లైంగిక అహంకార అధికారాలపట్ల పరిపూర్ణ ఆవేదన యొక్క ప్రతిధ్వనిని వింటాం ఈ కథలో.
అనుభవం తనదాకా వస్తే గానీ బాధ తెలియని భాస్కర్ లాంటివాళ్లు కాదు ఈ సమాజానికి కావలసినది. బాధాకరం , అవమానకరం అయిన అనుభవాలు చుట్టు పక్కల సమాజంలో ఎవరికి ఎదురైనా గమనిస్తూ బాధితుల పక్షాన బాధ్యత వహించి కారకులను గుర్తించి నిలదీయ గల చొరవ , కారణాలను గుర్తించి పరిష్కరించగల చేవ మానవ సంస్కారంలో భాగం అయినప్పుడే పీడన, దుఃఖం లేని సమాజం సాధ్యం అవుతుంది అన్నది పరిపూర్ణ అభిప్రాయం. ఆ కోణం నుండి వ్రాయబడిన కథ ఏమైతే మనకేమిటి?(డిసెంబర్ 1987) బస్సులో ఆడవాళ్ళ కు కేటాయించబడిన సీటులో మగవాళ్ళు కూర్చొనటం దగ్గరనుండి, ఆడపిల్లలను అల్లరిపెట్టే మగపిల్లలను పట్టుకొని మందలించటం వరకు అన్నీ పౌర సమాజంలో అందరి బాధ్యత అని నమ్మే చారుమతి పక్కవాళ్ళకు ఏమైతే మనకేమిటి అన్న నిర్లిప్తలో గడిపేస్తున్న సమాజం గురించి దిగులు పడుతుంది. అలాంటి నిర్లిప్త దృష్టి ఆరోగ్యకరమైనది కాదని వేదన పడుతుంది. మద్రాస్ వెళ్ళినప్పుడు బస్సులో పక్క సీటులో కూర్చున్న యువతి పట్ల అసభ్యంగా , అవమానకరంగా ప్రవర్తిస్తున్న మగవాణ్ణి ఆమె పక్కనే కూర్చొన్న పెద్దావిడ చెప్పు తీసి కొట్టి బుద్ధి చెప్పిన ఘటన చారుమతి కి సంతోషం కలిగిస్తుంది. అన్యాయం, హక్కుల ఉల్లంఘన ఎంత చిన్న స్థాయిలో జరుగుతున్నా స్పందించే సంస్కారం ఆచరణ వైపు వేసే అడుగు సమాజాన్ని మంచికి మారుస్తాయనే నమ్మకాన్ని ప్రకటించటమే ఈ కథ పరమార్ధం.
ఆ పాపదేమి తప్పు కథ లో పది పదకొండేళ్ల ఆడపిల్ల కోణం నుండి కథ నడిపిన పరిపూర్ణ ‘శ్రీనుగాడి తత్వ మీమాంస’ ( నవంబర్ 89 ) కథను పది పన్నెండు ఏళ్ల శ్రీనుగాడి కోణం నుండి నడిపింది. ఆ కథలో ఆడామగ మధ్య వైరుధ్యం కీలకాంశం అయితే ఈ కథలో ఉన్నవాళ్లకు లేనివాళ్లకు మధ్య వైరుధ్యాన్ని కేంద్రంలోకి తీసుకురావటం జరిగింది. బడిపంతులు , ఎకరం నేల వ్యవసాయం తో పెద్దకుటుంబాన్ని ఈదుకొచ్చే తండ్రికి కొడుకు శ్రీను . శ్రీనుతో చదువుకొనే దొరగారి మనవడు పండు బాబు కు ఉన్నదేమిటో , తనకు లేనిదేమిటో శ్రీనుకు అనుభవంలో తెలుస్తుంటుంది. వాడు తినే తిండి, వాడికి ఉన్న విశాలమైన లోగిలి ఇల్లు తనకు లేవు. వాడికి ఉన్నన్ని ఆటబొమ్మలు తనకు లేవు. తండ్రి లాగా , వూళ్ళో మిగిలిన వాళ్ళలాగా దొరగారి కుటుంబీకులు ఎవరూ బయటకు వచ్చి ఏ పనీ చేయకపోయినా వాడికి ఇవన్నీ ఎలా ఉన్నాయి? తనకు ఎందుకు లేవు అన్న ప్రశ్న శ్రీనును వేధిస్తుంటుంది. పుణ్యం , అదృష్టం అని తల్లి చెప్పే కారణాలు వాడిని సంతృప్తి పరచలేకపోయాయి. వడ్డీలకు అప్పులిచ్చి ,బాకీలు తీర్చలేనివాళ్ళ ఇళ్ళు , పొలాలు లాగేసుకొనే దొరగారి పుణ్యం ఏమిటో వాడికి అంతు పట్టదు. అలాగే దేవుడు, నైవేద్యం, మోక్షం వంటి మాటలను కూడా తల్లి చెప్పే అర్ధంలో స్వీకరించలేకపోవటం చూస్తాం. ఇవన్నీ పిల్లలలో ఉండే సహజ హేతు వివేచనను, న్యాయబుద్ధిని సూచించేవి. ఈ సహజ హేతు వివేచనను, న్యాయబుద్ధిని కుటుంబం , సమాజం అనేక విధి నిషేధాలతో చంపేసి అసమానతలకు , అన్యాయానికి సమ్మతి దారులుగా తయారు చేస్తుంటాయి. వర్గవైరుధ్యాల కు మూల కారణాలు గ్రహించే లోగా పుణ్యం, అదృష్టం వంటి భావాల మాయలో పడిపోవటానికి దేవుడు, మతం, పరలోకంలో పొందే సౌఖ్యం గురించిన భ్రమలు కారణం అవుతాయి. శ్రీనుగాడి తత్వ మీమాంస కథ ఆ రకంగా చిన్నపిల్లలలో నవనవలాడే సహజ న్యాయ ఆకాంక్షలను చూపించిన ఆహ్లాదకరమైన కథ. అదే సమయంలో శ్రీనుగాడిని శ్రీనుగాడి గా మిగల్చని వర్గ సమాజ వికృతిని గురించిన హెచ్చరిక కూడా.
సామాజిక వికృతి పిల్లలను తప్పుడు త్రోవలకు ఎలా నడిపిస్తున్నదో నంబూరి పరిపూర్ణ ‘ ఉంటాయి మాకుషస్సులు’ ( 1997) కథలో చూపింది. అసమానతలు వాటికి సమ్మతిని సమకూర్చిపెట్టే మతభావజాలానికి తోడు తొంభైయ్యవ దశకంలో నూతన ఆర్ధిక సంస్కరణలు సమాజంలోకి, సంస్కృతి లోకి , నిత్యజీవితంలోకి ప్రవేశపెట్టిన దుష్ట శక్తులు అనేకం. టీవీ నట్టింట్లోకి వచ్చింది. థియేటర్ కు వెళ్ళవలసిన అవసరం లేకుండానే సినిమా నిత్యజీవితంలోకి చొచ్చుకు వచ్చింది.వీరోచిత చర్యల రూపంలో ఎదుటివాడిని చావగొట్టి చెవులు మూసే కార్యక్రమాలు కళా రూపం తీసుకొని ఆకర్షణీయం చేయబడ్డాయి. మతం ఒక్కటే కాక మత్తు లోకి దించి వాస్తవాలను మరచి భ్రమా ప్రపంచంలో తేల్చే మాదక ద్రవ్యాల అంతర్జాతీయ మార్కెట్ బడి చదువుల కాలేజీ చదువుల యువతను లక్ష్యం చేసుకొన్నది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవాళ్ళు అవసరానికి తగిన డబ్బు ఇళ్ళ నుండి వచ్చే మార్గం లేక దొంగతనాలకు ఎగబడే స్థితి వచ్చింది. ఈ విస్తృత నేపథ్యంలో అయిదేళ్ల వయసునుండి పదిహేడు ఏళ్ల వయసు వరకు చైతన్య అనే పిల్లవాడి జీవితం లో పడిన ప్రభావాలు, పరిణామాల చిత్రణ ‘ఉంటాయి మాకుషస్సులు’ కథ. తప్పుడు త్రోవన పొయ్యే పిల్లలను సరైన దారికి మళ్లించటం లో విద్యాలయాలు , తల్లి దండ్రులు నిర్వహించవలసిన పాత్ర గురించిన చర్చ కూడా అక్కడక్కడా పాత్రల సంభాషణల రూపంలో ఇందులో భాగం అయింది. చేదు అనుభవాలనుండి జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్న తపన పిల్లలలోనే మొదలైతే అది వాస్తవం అయి తీరుతుందన్న భరోసాను కల్పించే విధంగా కథను నిర్వహించింది రచయిత్రి.
90 వదశకపు మరొక లక్షణం సంపాదనల మీద యావ. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, అధిక మొత్తాలలో జీతాలతో మధ్యతరగతి వర్గం నుండి కొత్త సంపన్నవర్గం పైకి లేచినట్లే కొత్త కొత్త మార్కెట్ అవసరాలకు డబ్బు సమీకరణ మార్గాలు తెరుచుకొనటం మొదలైంది. చిట్ ఫండ్ కంపెనీలు , ఫైనాన్స్ కంపెనీలు అలా పెరిగినవే.అభివృద్ధి కి అప్పులు కొత్త నినాదం అయింది. ఇది వ్యక్తిగత స్థాయిలోనైనా , దేశాల స్థాయిలోనైనా బలం కాక అనారోగ్యకరమైన బలుపు అయి విధ్వంసానికి కారణం అవుతున్నదన్న అవగాహన నుండే పరిపూర్ణ బంగారు లేడి కథ వ్రాసింది. బంగారు లేడికి ఆశపడిన సీత కారణంగా జరిగిన యుద్ధాన్ని , విధ్వంసాన్ని ప్రాతిపదిక చేసి సంపదలకైన పరుగులు పతనానికే అని ఈ కథలో ఆమె సరళమ్మ నారాయణరావు దంపతుల కొడుకు రవీంద్ర అనుభవం నుండి నిరూపించింది.
3
దళిత సమస్యపై నంబూరి పరిపూర్ణ వ్రాసిన కథలు నాలుగు. 1998 లో వచ్చిన ‘ఆదర్శాలూ – అన్వయాలూ’, 2003 లో వచ్చిన ‘ఆధునికతా నీ పేరు అమానుష్యత’ అన్న రెండు కథలలోనూ దళితయువకులను పెళ్లాడిన అగ్రవర్ణ యువతుల కుల అహంకార మనస్తత్వం, దాని పరిణామాలు చిత్రితం అయ్యాయి. ఆదర్శాలూ -అన్వయాలూ కథలో ఆడంబరంగా కొడుకు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనటానికి సిద్ధమవుతున్న ప్రమీలారాణికి అత్తగారి అక్కగారు తమఇంటికి రావటం ఆపాల్సిన విషయం అయింది . ఎందుకు? ఆమె వస్తే తమ వర్ణాంతర వివాహం సంగతి నలుగురికీ తెలిసిపోతుందేమోనని .. ఆమె పెళ్లాడింది వర్ణాంతర వివాహం చేసుకొన్న దంపతుల కొడుకును. అది ప్రేమ వివాహం ఏమీ కాదు. పెద్దలు చూసి చేసిందే. కట్నకానుకలు ఇచ్చి చదువు సంపాదన ఉన్న వరుడిని కూతురికోసం సంపాదించగల స్థోమత లేని చిరుద్యోగి తండ్రి కుల పట్టింపు వదులుకొని చూసి చేసిన ఆదర్శ వివాహం. ప్రమీలారాణి భర్తను, చదువుకొని సంస్కారం పొంది ఉద్యోగస్తురాలైన అత్తగారిని అవసరంకొద్దీ ఆమోదించింది కానీ అతని వైపు బంధువులను ఆమోదించి తనవాళ్లు అనుకోగల సంస్కారం పెంచుకోలేదు. తనది అగ్రవర్ణం, అతనిది నిమ్న కులం అన్న సంప్రదాయ భావం నుండి బయట పడలేదు కనుకనే అతని కులం ఏదో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. పదిపన్నెండు ఏళ్ల దాంపత్య జీవితంలో,కుటుంబంలో ఒక కనబడని విభజనరేఖను గీసింది. రేఖ చెరిగిపోకుండా అనుక్షణం అప్రమత్తంగానే ఉంది. అది ఆత్మవంచన అని గానీ , భర్తను అవమానపరచటం అనిగానీ అనిపించనంతగా మొద్దుబారిపోయింది, కనుకనే ఇంట్లో అత్తను మరీముఖ్యంగా పెద్దత్తను అస్పృశ్యులుగానే చూసింది. కులాంతర వివాహం ఆదర్శమే కావచ్చు కానీ అది జీవితానికి అన్వయించుకోగల వాస్తవం కానప్పుడు, జీవితానికి అన్వయించుకొనే చిత్త సంస్కారాలు అభివృద్ధి చేసుకోలేనప్పుడు దాంపత్యాలైనా , కుటుంబాలైనా నటనాలయాలుగా మిగిలిపోతాయి. ఈ నటనలకు స్వస్తిపలకాలనీ కులాంతర వివాహంలో కింది కులాలు అనబడేవాళ్లు ఆత్మగౌరవాన్ని చంపేసుకొని బతకవలసిన పరిస్థితి పోవాలని వేణు వంటి వాళ్ళు పూనుకొనటం ఆధునిక అస్తిత్వ చేతనా లక్షణమే.
ఆధునికతా నీ పేరు అమానుష్యత కథ పూర్ణిమా , విజయ అనే స్నేహితురాళ్ల మధ్య సంభాషణ గా ప్రారంభమైంది. పూర్ణిమ తన కొడుకు పవన్ బ్రాహ్మణ వైష్ణవ కుటుంబపు పిల్లను ప్రేమించాడని ఆందోళన పడుతూ అది సకారణమేనంటూ తమ వీధి చివరి ఇంటి దంపతుల కథ చెప్పింది. సూర్యారావు పేద చేనేత కుటుంబానికి చెందినవాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి చిన్నచిన్న పనులు చేస్తూ కష్టపడి అతనిని పెంచింది. సావిత్రి సంపన్న వర్గపు చౌదరి బిడ్డ. ఇద్దరూ క్లాస్ మేట్స్ ప్రేమించి పెళ్లిచేసుకొన్నారు. మంచి ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారు. ఉన్నత కుల అహంకారంతో ఆమె అత్తగారు తనఇంటికి వస్తే అతని కులం అందరికీ తెలిసిపోతుందన్న భయంతో ఇంటి గుమ్మం ఎక్కకుండా జాగ్రత్త పడింది. సూర్యారావు కూడా ఆమెకు అనుకూలంగా తనకులం సంగతి రహస్యం చేసి పిల్లలకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఉద్యోగంలో బదిలీ కారణంగా సావిత్రి వేరేఊరు వెళ్లాల్సి వచ్చినప్పుడు పిల్లల తిండి తిప్పల అవసరానికి సూర్యారావు తల్లిని పిలిపించుకున్నారు. అప్పటినుండి ఆమె ఆ పనిలో వాళ్ళతోనే ఉండి పోయినా మరణించాక ఆమెను రెండో మనిషినైనా పిలవకుండానే ఎలక్ట్రిక్ దహనవాటికలో బూడిద చేసి ఊరుకొన్నారు. నలుగురినీ పిలిచి ఉత్తర క్రియలు చేయకపోవటానికి అప్పుడామె కులం ఏదో అందరికీ తెలుస్తుందని , అది తనపిల్లల పెళ్లిళ్ల మీద ప్రభావం చూపిస్తుందని అనుకొనటం వల్లనే అని పూర్ణిమ ఆ కథను ముగించింది. ఇటువంటి అనుభవాలు చూస్తూ సమాజంలో శూద్రులుగా పేరుబడ్డ కులంలో పుట్టిన కొడుకు బ్రాహ్మణ వైష్ణవ కుటుంబానికి చెందిన పెళ్లి చేసుకొంటే తమకు కాకుండా పోతాడన్న అనుమానం వల్లనే ఆందోళన పడుతున్నది. పూర్ణిమకు కొడుకు ఇష్టం కాదనాలనీ లేదు. కట్న కానుకల మీద కోరికా లేదు. కులాంతర ప్రేమలు, పెళ్లిళ్లు చివరకు నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో కింది మెట్టు వాళ్ళను అస్తిత్వానికి పరాయీకరిస్తున్నందువల్లనే.
ఈ కథలో విజయ చెప్పిన మరొక కథ కూడా వుంది. మరో దిక్కులేక తన దగ్గర వచ్చి ఉన్న కన్న తండ్రినే సరిగా చూడని కూతురి కథ అది. డబ్బు , స్వప్రయోజనాలు తప్ప బంధాలు, బాధ్యతలు మనుషులు మరిచిపోవటం గురించిన ఆందోళన అందులో వ్యక్తమైంది. అది అలా ఉంచితే ఈ రెండు కథలలోనూ సమస్య కులాంతర వివాహాలు -వాటి పరిణామాలు. రెండింటిలోనూ స్త్రీలు అగ్రవర్ణులు పురుషులు దళిత శూద్ర కులాలవారు. యువతీ యువకులు కలిసి చదువుకొనే ఉద్యోగాలు చేసే అవకాశాల వల్ల సమకూడిన ఒక ఉదార ప్రజాస్వామిక వాతావరణంలో కలిగే పరస్పర ఆకర్షణలు, మోహాలు, అవసరాలు కులాన్ని అధిగమించి పెళ్లిళ్లకు దారితీస్తున్నా భావజాల పరంగా ఎక్కువతక్కువల మనువాద సంస్కృతి నుండి బయటపడలేకపోవటం వల్ల, బయటపడాలన్న ఆలోచనే లేని అవకాశవాద తత్వం వల్ల ఆ పెళ్లిళ్లు అమానవీయ సంబంధాలుగా కొనసాగుతున్నాయనేది పరిపూర్ణ ఆరోపణ.
ఆదర్శాలూ – అన్వయాలు కథలో అసలు కథ ప్రమీలా రాణీ వేణుల కథ అయినా , ప్రమీల రాణి తన ఇంటికి ఏ వేణు పెద్దమ్మ తల్లిని రానీయకుండా చేయాలనుకొన్నదో ఆమె వేణుకు , వేణు తల్లికి ఎందుకు ముఖ్యమైనదో చెప్పటానికి వేణు తల్లి జ్ఞాపకాల నుండి ఆమె ఔన్నత్యం చెప్పబడింది. వేణు తల్లి శకుంతల. నిజానికి ఆమె జ్ఞాపకాల నుండి తెలిసేది ఆమె కులాంతర వివాహ వైఫల్య క్రమం. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన శకుంతలను పెంచి పోషించింది ,ఆమె అభిరుచిని కనిపెట్టి చదువు చెప్పించి సంబర పడిందీ ఆ ఆ పెద్దక్కే . చదువుల కాలంలో విద్యార్థి రాజకీయాలలో పాల్గొంటూ విద్యార్థి నాయకుడు ప్రసాద్ ను ప్రేమించి పెళ్లిచేసుకొన్నది శకుంతల. నిమ్న జాతి పిల్లను పెళ్లి చేసుకున్నాడని భర్త తల్లి దండ్రులు దూరం పెట్టారు. రాజకీయాలలో మునిగి అతను సంసారం పట్టించుకోలేదు. శకుంతల ఇద్దరు బిడ్డల తల్లి అయి సంసారం బరువు వంటరిగా మోయాల్సి వచ్చింది. ప్రసాద్ ఆమెను వదిలి తల్లిదండ్రుల దగ్గరకు చేరి , వారు చూపిన కులమిటి స్త్రీని పెళ్లిచేసుకొన్నాడు. ఆ సమయంలో చెల్లెలిని ఆదుకొని ఆసరాగా నిలబడి ఒక ఉద్యోగం సంపాదించుకొని తనబతుకు తాను బతకాటానికి సహాయపడిందీ ఆ అక్కే .
ప్రమీలారాణి , వేణు జంటలో నైనా , సావిత్రి సూర్యారావు జంటలోనైనా స్త్రీలు అగ్రవర్ణాలకు , పురుషులు నిమ్న కులాలలకు చెందినవాళ్లు. ఇలాంటి పెళ్లిళ్లలో దిగువ కులాల పురుషులు స్వీయ అస్థిత్వాన్ని కోల్పోయి అగ్రవర్ణాల భార్యల నీడలో మిగిలిపోవటాన్ని చెప్పిన పరిపూర్ణ వేణు తల్లి శకుంతలమ్మ అనుభవముఖంగా దళిత స్త్రీకి అగ్రవర్ణ పురుషుడికి పెళ్లి జరిగితే నష్టపోయేది దళిత స్త్రీ యేనని స్పష్టం చేసింది. భార్యను నిర్లక్ష్యం చేయటానికి , అగౌరవపరచటానికి అన్ని అవకాశాలు , అధికారాలు పురుషులకు ఇయ్యబడిన సామాజిక సంస్కృతిలో భార్య కులం సామాజికంగా తక్కువది అయితే ఆమెను బాధించటానికి, వేధించటానికి , తిరస్కరించటానికి మగవాడికి సర్వ హక్కులు ఉన్నాయి. మొత్తం మీద ఈ మూడు కథనాల సాధారణ సూత్రం కులాంతర వివాహాలలో పురుషులైనా , స్త్రీలైనా సాపేక్షంగా తక్కువ సామాజిక స్థాయి లో ఉన్న వాళ్లే హింసకు, అవమానానికి గురవుతారు అన్నది గమనం లో ఉంచుకోవాలి.
అనల్ప పీడనం ( ఫిబ్రవరి 2002) కథ లో అంటరానితనం సమస్య చిత్రితమైంది. దళిత వర్గాలు చదువు అసమానతలను అధిగమించటానికి మంచి సాధనమని తెలిసి మాలమాదిగ పల్లెలను వదిలి ఉన్నత విద్యను, ఉద్యోగాలను పొంది సామాజిక ఉన్నతిని సాధించినా అస్పృశ్యులు గా అవమానాలకు గురి అయ్యే పరిస్థితులు మారలేదన్న వేదన ఈ కథలో కనబడుతుంది. ఆర్డీవో స్థాయి ఉద్యోగి ని హరిజనుడని ఇల్లు ఖాళీ చేయించిన ఘటన ను వార్త గా పేపర్ లో చూసిన ఒక కలెక్టర్ స్వాతంత్య్రం వచ్చిన యాభై అయిదేళ్ల తరువాత కూడా దళిత ఉద్యోగులకు అద్దెకు ఇల్లుదొరకక పోవటం గురించి ఆలోచనలో పడటం దగ్గర కథ మొదలవుతుంది. అంటే ఈ కథ ప్రవర్తించిన కాలం కథా రచనా కాలం ఒక్కటే నన్నమాట. (1947+55=2002) దళిత అస్తిత్వ చైతన్యం పెరుగుతూ , కుల పీడనకు వ్యతిరేకంగా చట్టపర చర్యలను అపేక్షిస్తున్న కాలం అది. రాజ్యాంగం లో అస్పృశ్యత నేరం అని చెప్పబడినప్పటికీ ఆచారంగా అది అమలు అవుతూనే ఉంది. అందుకనే ఆర్డీవో తనపట్ల సమాజంలో అమలవుతున్న నేరాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసు కూడా వేసాడు. ఈ వార్త చదివిన కలెక్టర్ ను గతానికి సంబంధించిన తన అనుభవాలు జ్ఞాపకాలు కలత పెడతాయి. హాస్టల్ లో ఉండి ఫోర్త్ ఫారం పరీక్షలు వ్రాసి మేనత్తగారి వూరికి వెళ్ళినప్పుడు నాటకం చూడటానికి ఊరి వాళ్లకు , మాలవాడలకు ప్రత్యేక స్థలాలు కేటాయించబడటం విభజనరేఖ దాటిన వాళ్లపట్ల సమాజం కర్కశంగా ఉండటం అనుభవానికి వచ్చినవాడు ఆ కలెక్టర్. కలెక్టర్ అయి కూడా ఆ పరిస్థితి లో ఏమీ మార్పులేకపోవటం,రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతుండటం అతనికి వేదన కలిగించటం చూస్తాం. దీనికి పరిష్కారాన్ని సంఖ్యలోనూ సృజన ఉత్పత్తి ప్రక్రియలలోనూ అధికులు అయిన దళిత బహుజనుల ఐక్యతలో ఉందని కలెక్టర్ భావనగా సూచించింది రచయిత్రి.
ఎర్రలచ్చుప్ప (1998) దళిత మహిళా సాధికారతను నిరూపించే కథ. తరతరాలుగా వస్తున్న సామాజిక వివక్షను ఎదుర్కొనటానికి దళితులకున్న చట్టబద్ధమైన మార్గం పెద్ద చదువులు చదవటం , ఉన్నతోద్యాగాలలోకి ప్రవేశించటం రాజకీయాధికారం చేపట్టటం. దళితులలో అందులోనూ స్త్రీలలో ఉండే సహజ మానవీయ సంస్పందనా లక్షణం వల్ల, క్రియా శీల స్వభావం వల్ల అవకాశం వస్తే వాళ్లే నిజమైన ప్రజాప్రతినిధులుగా పనిచేయగలరని లక్ష్మమ్మ జీవితం ద్వారా నిరూపించిన కథ ఇది. రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీగా ఎన్నికైన గ్రామసర్పంచ్ లక్ష్మమ్మ. ఆమె అనుభవాల జ్ఞాపకాల సమాహారం నుండి ఈ కథ ఇతివృత్తం రూపుదిద్దుకొంది. పది హేనేళ్ళ వయసులో పెళ్లి , పద్దెనిమిది ఏళ్లకు వైధవ్యం, కోతకూలీలకు పొరుగూరు వెళ్ళటం, అక్కడ ఒక పై కులాల యువకుడి ఆకర్షణలో పడటం, అతనితో 20 ఏళ్ల పైబడ్డ సహజీవనం, తల్లిదండ్రులను , ఆస్తి ని తనకోసం వదులుకొన్న సహచరుడు మరొక స్త్రీతో సంబంధం ఏర్పరచుకొని పెళ్లి చేసుకొనటం వల్ల కలిగిన విరక్తి తో జీవితం చాలించాలనుకొనటం, జీవితం నలుగురికి ఉపయోగకరంగా గడపవలసిందే కానీ విసర్జించ వలసినది కాదు అన్న అవగాహనకు రావటం , వూళ్ళో ఇల్లిల్లు తిరిగి పిల్లలను బడులకు పంపించాలని అందుకు అవసరమైన పనులకు ముందుపడటం దగ్గరనుండి గ్రామ అభివృధ్ధికోసం పాటుపడటం, పరిణామంలో సర్పంచ్ కావటం ఇవన్నీ లక్ష్మమ్మ జీవితంలో ఘట్టాలు.
ఈ క్రమంలో 1950ల నాటికి కృష్ణా జిల్లాలలో మాలదాసరి కుటుంబాల సాంస్కృతిక జీవితం, మారు మనువు మానెయ్యటం , ఆడపిల్లలను బడికి పంపకపోవటం, వ్యవసాయ రైతు కూలీ జీవనం, బావుల లో నీళ్లు తోడుకొనటానికి వీలు లేని అస్పృశ్యత, బిందెడు నీళ్ల కోసం బావుల దగ్గర పైవాళ్ళ దయాదాక్షిణ్యాల కు ఎదురు చూస్తూ పడిగాపులు పడవలసిన దైన్యం, కులాంతర వివాహాలు , సహజీవనాలు వెలివేతకు గురికావటం, మాల మాదిగ స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నా కులమింటి పిల్లను పెళ్ళాడి కుటుంబ గౌరవాన్ని నిలపాలనుకొనటం, ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి పధకాలు మొదలైన సామాజిక విషయాలు లక్ష్మమ్మ జీవిత పరిణామాల నేపథ్యంలో భాగమై కనిపిస్తాయి. శ్రమకు లొంగని తత్వం, చంచల స్వభావం, స్వంత ఆస్తులు, వ్యాపారాలు ,స్వప్రయోజనాలు తప్ప మరొక సామాజిక జీవితం లేని నాగభూషణ చౌదరి అనామకంగా చనిపోతే అతనితో కొన్నాళ్ళు సహజీవనం చేసి అతను పెళ్లితో ఒక స్త్రీకి కట్టుబడి పోతే ఒంటరిగా మిగిలిన దళిత మహిళ లక్ష్మమ్మ ఊరందరి మనిషిగా ఎదిగి సర్పంచ్ గా సార్ధక జీవితం గడపటం రచయిత్రి ప్రత్యేకంగా పాఠకుల దృష్టికి తీసుకు వచ్చిన విషయం.
ఈ కథ రావటానికి మూడేళ్ళ ముందు 1995 లో చైనారాజధాని బీజింగ్ లో జరిగిన నాలుగవ అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రపంచ వ్యాపితంగా మహిళా సాధికారత ను చర్చలోకి తెచ్చింది . సామాజిక ఆర్ధిక రాజకీయ సాధికారత కు ఆచరణ యోగ్యమైన కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. అదే సమయంలో భారతదేశం పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించటం జరిగింది. ఆప్రయోగం తొలిదశలో ఉండగానే మహిళలు అందులోనూ దళిత మహిళలు గ్రామ అభివృద్ధి గురించి పట్టించుకొనటం ప్రారంభిస్తే అదెంత సృజనాత్మకంగా ఉంటుందో , ఎంతటి విజయాలను తెచ్చి పెడుతుందో వూహించటంలో , దర్శించటంలో ఉంది రచయిత్రి ప్రతిభ. రెండు దశాబ్దాల తరువాత పంచాయతీ రాజ్ రాజకీయాలలో ఈ నాటి మహిళల పరిస్థితి ని గమనిస్తే ఆనాటి ఆమె ఆశలకు , ఆదర్శానికి వర్తమాన ఆచరణకు మధ్య అంతులేని అగాధం కనబడుతుంది. అది ఎందుకు ఎలా వచ్చిందో ఆలోచించమని, అధిగమించే మార్గాలను అన్వేషించమని హెచ్చరిస్తుంది ఈ కథ.
4
ఈ క్రమంలో స్త్రీలలో ని చైతన్య శక్తి స్వావలంబన దిశగా వికసించటానికి జరుగుతున్న పెనుగులాట నంబూరి పరిపూర్ణ కథా వస్తువు అయింది. శిఖరారోహణ (జనవరి 1999) కథలో తాగుబోతు అయినతండ్రి తల్లిని వేధిస్తూ బాధ్యతలు విస్మరించి తిరుగుతున్న పరిస్థితులలో తన ఇంటర్ చదువుతో ఉద్యోగం సంపాదించి తమ్ముడి చదువు కొనసాగటానికి , తల్లి బతుకుకు భరోసాగా నిలిచిన కూతురు భార్గవి కథ ఇది. ఉద్యోగం, స్వంత సంపాదన ఇచ్చిన ధీమా భార్గవికి తల్లిని కొట్టటడానికి వస్తున్న తండ్రిని హెచ్చరించి నిలవరించ గల అవకాశాన్ని అధికారాన్ని ఇయ్యటం చూస్తాం. అయితే ఆడపిల్ల స్థానం అణగిమణిగి ఉండటం2003 లోనే, పెళ్లి చేసుకొని ఒదిగి జీవించటంలోనే అని అనుక్షణం గుర్తు చేయటానికి , విభజన రేఖలు , హద్దులు చెరిగిపోకుండా కాపాడటానికి ఇంటాబయటా సిద్ధంగా ఉండే శక్తులతో ఆడపిల్లలకు యుద్ధం ఎప్పుడూ అనివార్యమే అవుతుంటుంది. తమ్ముడిని మగవాడిగా తయారు చేసిన జెండర్ సంస్కృతి అతని నుండి అక్క పై పెళ్లిని ఒత్తిడిగా తెచ్చింది. తల్లి దానికి మద్దతు పలికింది. ఆ కుటుంబం నిలబడటానికి కారణమైన భార్గవి ఉద్యోగం కుటుంబ అవసరాలు తీరిపోయాయి కనుక అనవసరం , తప్పని సరిగా మానెయ్యవలసినది అయింది. తనకు ఒక శక్తిని , ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన ఉద్యోగం వదిలి విధేయ స్త్రీగా బతికెయ్యటం ఇష్టం లేని భార్గవి ఇల్లు వదిలి హాస్టల్ లో చేరి దూరవిద్య ద్వారా చదువుకొని ఉన్నతోద్యోగి కావటం శిఖరారోహణం కథ. స్త్రీలు ఎలాంటి పరిస్థితులలోనూ ఆర్ధిక స్వావలంబన ను ఇచ్చే ఉద్యోగం వదులు కోరాదు అన్నది పరిపూర్ణ దృష్టి.
పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎవర్ని చేసుకోవాలి అన్నవి ఆడపిల్లల నిర్ణయంతో పనిలేకుండానే జరిగిపోతుంటాయి. చదువు , ఉద్యోగం ఉన్న భార్గవి వంటి అమ్మాయిలు ఆ పరిస్థితిని అధిగమించగలిగిన కాలం వచ్చింది. కానీ సావిత్రి వంటి పేదింటి కుటుంబాల పిల్లలకు అది ఇంకా అందరానిదే. పదిహేనేళ్ల అమ్మాయికి నలభై ఏళ్ల పైబడ్డవాడు , కనుముక్కు తీరు సరిగా లేనివాడు, రెండవ పెళ్ళివాడు మిలటరీ సర్వీస్ నుండి రిటైర్ అయి ప్రభుత్వ పింఛను , పదెకరాల పొలం వున్నాయి కనుక కోరదగిన మంచి సంబంధం అయింది. తిట్టీ కొట్టీ కూతురిని ఆ పెళ్ళికి ఒప్పించేట్లు చేసింది. అలా పెళ్లి గురించిన సహజమైన సావిత్రి కల ఒకటి చెదిరిపోయినా భర్త పదెకరాల భూమిలో చేయబోయే వ్యవసాయం కూడా ఒక కలే కావటం విషాదం. ప్రభుత్వాలు ఇచ్చే పట్టాలకన్నా ( నవంబర్ 2003) భూములను ఆక్రమించి హక్కుదారులను వెళ్లగొట్టగలిగిన భూస్వామ్య శక్తులు బలవంతమైనవి కావటం వల్ల చెదిరిన కల ఇది. సావిత్రికి భూమి మీద హక్కు కోసం ఇదేమి అన్యాయం అని భూస్వామిని ప్రశ్నించగల సహజ ధిక్కార స్వరం కోర్టుకు వెళ్లాలన్న చైతన్యం ఉన్నాయి కానీ తగిన వాతావరణం, సహకారం లేక సన్నగిల్లిపోయాయి. పొగాకు కంపెనీ కూలీగా జీవితం గడిపి అనారోగ్యాల పాలై ప్రసవించి మరణించ వలసి వచ్చింది. ఆమె కన్న కొడుకు ఇరవైఏళ్ళ వాడై భూకామందులు ఆక్రమించిన పొలాలలను విముక్తం చేయటానికి నినాదాలతో , జెండాలతో బయలుదేరిన యువకులలో ఉన్నాడని చెప్పటం ద్వారా భూమికి సంబంధించిన సావిత్రి కల సాకారం కాబోతున్నదన్న సూచన ఉంది. శ్రామిక వర్గాల స్త్రీల సమస్య చదువులకు , ఉద్యోగాలకు , సమానత్వానికి మించి భూమికి సంబంధించినది అని ఈ కథలో రచయిత్రి చెప్పినట్లయింది.
శృతి తప్పిన రాగం ( అక్టోబర్ 2007) కథలో చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వాళ్ళను స్వయం సిద్ధలుగా రూపొందిస్తున్న తీరును చిత్రించింది పరిపూర్ణ. ఇందులో శారద తనను తోడబుట్టిన వాళ్ళిద్దరిని చదివిస్తూ ఒంటరిగా సంసారాన్ని ఈదుకొస్తున్న తల్లికి ఆసరా కావటానికి ఉద్యోగంలో చేరిన అమ్మాయి. డీప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న చంద్రమోహన్ తో కలిగిన పరిచయం రెండేళ్లలో స్నేహంగా వికసించి ప్రేమగా పరిణమించి పెళ్లి వరకు వెళ్ళినప్పుడు వచ్చిన సమస్య కట్నం. శారద తల్లికి కట్నం ఇచ్చే స్థోమత లేదనటంకన్నా ఇయ్యకూడదన్న ఆదర్శం ఉంది. శారదకు కూడా ఆ ఆదర్శాలే పట్టుబడ్డాయి. అయితే కట్నం లేని పెళ్లి కలిగించిన అసంతృప్తి నుండి తల్లిదండ్రులు చేసే వాదనలు వినీ వినీ చంద్రమోహన్ కూడా ఏదో రెండులక్షలో , మూడులక్షలో కట్నమని ఇస్తే బాగుంటుందని శారదకు చెప్పినప్పుడు శుభలేఖలు అచ్చయి , బంధువులకు వెళ్ళిపోయి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఆ సమయంలోనూ పరువు గురించో, ఇది తప్పి పోతే పెళ్ళికాదేమో అన్న భయమో లేకుండా ఊసరవెల్లిలా రంగులు మార్చిన చంద్రమోహన్ తో పెళ్లి అనవసరం అని తేల్చేసుకోని ప్రకటించగలిగిన పరిణితి శారదది. మనిషికి ఆత్మ గౌరవం, ఆదర్శాన్ని ఆచరించగలిగిన ఆత్మ స్థైర్యం ఆధునిక మహిళ అభివృద్ధి చేసుకొనవలసినవి అన్న రచయిత్రి దృక్పథం ఈ కథలో జీవశక్తి.
5
స్త్రీపురుష సంబంధాలు సేవిక స్వామి సంబంధాలుగా మారిపోవటంగురించిన వేదన పరిపూర్ణది. పౌరాణిక గాధలు అలాంటి సంబంధాలను , ఆ సంబంధాలలో స్త్రీలు పడిన హింసను సహన సౌశీల్యాలు, పాతివ్రత్య లక్షణాలు అని కీర్తించింది. 1990 తరువాత స్త్రీవాద భావజాల ప్రభావాలనుండి పెరిగిన అధికార రాజకీయాల స్పృహ నుండి వీటిని తిరిగి చదవటం , స్త్రీలపట్ల చరిత్ర చేసిన అపచారాలను విశ్లేషించటం, కొత్త దృష్టితో ,కొత్తకోణాలనుండి ఆ కథలను వ్యాఖ్యానించటం , అనుసృజించటం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పరిపూర్ణ వ్రాసిన కథలు నా కుటిలత్వాన్ని మన్నించవా శకుంతలా!( అక్టోబర్ 1997) , ద్వాపరలో ఒక ద్రౌపది -కలియుగంలో వేల ద్రౌపదులు ( నవంబర్ 2003) ఇంకెన్నాళ్లీ ఆత్మహననం రామా ( ?).
శకుంతల , సీతా ఇద్దరూ భర్తృ పరిత్యక్తలు. రాజులకు , రాజవంశాల ప్రతిష్టలకు లొంగి ప్రేమించిన వాళ్ళను, పెళ్లాడినవాళ్లను వదిలెయ్యటానికి తెగించిన వాళ్ళు దుష్యంతుడు , శ్రీరాముడు. పిల్లలను కని, పెంచే బాధ్యత శకుంతల , సీతా ఒంటరిగానే మోశారు. వంశ వారసులుగా , రాజ్య వారసులుగా ఆ పిల్లలు కావలసివచ్చినప్పుడే దుష్యంతుడయినా శ్రీరాముడు.అయినా తమ జీవితంలోకి భార్యలను ఆహ్వానించారు. స్త్రీలకు ఇది అవమానకరమైన అనుభవం. కారకుల పట్ల కోపం , నిరసన న్యాయమైనవే. అయితే శకుంతలలో అది కాస్త తక్కువ స్థాయిలో ఉంది కనుక నలుగురూ నచ్చ చెప్పేసరికి సర్దుకుపోయి కొడుకుతో పాటు దుష్యంతుడి రాజ్యానికి తరలిపోయినట్లు , సీతలో అవి తీవ్రస్థాయిలో ఉండటం వల్ల ఆత్మాభిమానాన్ని వదులుకొనటానికి ఇష్టపడక అతని ఆహ్వానాన్ని తిరస్కరించి భూగర్భంలోకి వెళ్లిపోయినట్లు ఆ కథలకు ముగింపు నిచ్చింది ఆమె.
ద్రౌపది కేంద్రంగా కథ వ్రాయటంలో రెండు ప్రయోజనాలను ఆశించింది పరిపూర్ణ. కురుపాండవ యుద్ధం తుది ఘట్టానికి వస్తుండగా గుడారాలలో నిద్రపోతున్న ఉప పాండవులను అశ్వత్థామ చంపటం దగ్గర ప్రారంభమైన కథ దుఃఖిత అయినా ద్రౌపది అంతరంగ ఆలోచనల స్రవంతిగా సాగుతుంది. గతానికి సంబంధించి కౌరవ సభలో జరిగిన వస్త్రాపహరణ ఘట్టంలో , అరణ్య వాస కాలంలో సయింధవుడు ,అజ్ఞాతవాసకాలంలో కీచకుడు కామించి వెంటపడిన ఘట్టాలలో స్త్రీగా ఎదుర్కొన్న అవమానాలను ప్రస్తావించి వర్తమాన సమాజంలో స్త్రీల పట్ల అమలవుతున్న అత్యాచార పర్వాన్ని సూచించటం ఒక ప్రయోజనం అయితే మరొక ప్రయోజనం మొత్తంగా యుద్ధం స్త్రీలకు ఎంత దుఃఖకరమైనదో సూచించటం. యుద్ధంలో విజయం ఎవరిదైనా స్త్రీలు బానిసలుగా చెరబట్టబడటం, ఆత్మహత్యలు చేసుకొనటం, వీరుల భార్యలుగా , తల్లులుగా దుఃఖాన్ని మోయటం సర్వ సాధారణం కదా అనుకొంటుంది. యుద్ధాలు ఆస్తుల రాజ్యాల వారసత్వం కోసం జరిగేవే. ఆస్తులు, రాజ్యాలు పురుషులవి కనుక యుద్ధ కారకులు పురుషులే. లక్షల ప్రజల బ్రతుకులను , వారి ఉత్పత్తి శక్తులను సర్వనాశనం చేసే యుద్ధం పట్ల ద్రౌపది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ కథ ముగించటంలో రచయిత్రి యుద్ధవ్యతిరేక దృక్పథం కనబడుతుంది. అది కమ్యూనిస్టు దృక్పథంలో భాగం. ‘యుద్ధం స్త్రీల ప్రకృతికి విరుద్ధం’ వంటి పుస్తకాల ప్రభావం కూడా ఈ కథపై ఉండవచ్చు.
6
నంబూరి పరిపూర్ణ కథలు కుటుంబంలో స్త్రీ పురుష సంబంధాల లోని అసమానత్వాన్ని భిన్నపార్శ్వలనుండి ప్రదర్శించాయి. అసమానతను , పీడనను , ఆవేదనను ప్రధానంగా చిత్రించినా ప్రతి కథలోనూ స్త్రీలు వాటిని అధిగమించటానికి చేసే పోరాటం ఉంటుంది.స్ఫూర్తి , (జులై 1993), నిష్కృతి ( జనవరి 2016) రెండు కథలలోను సాధారణాంశం భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు కావటం , బయటపని తో పాటు ఇంటి పనిభారం అంతా స్త్రీలమీదే పడటం, మగవాళ్ల బాధ్యతా రాహిత్యం, జల్సాలకు ఖర్చు పెట్టటం, అది చాలదన్నట్లు భార్యల మీద పెత్తనం చలాయించటం , హింసించటం. స్ఫూర్తి కథలో విమల ప్రసాద్ ఉద్యోగాలు ఒకేచోటా , కలిసే వెళతారు, వస్తారు. వెళ్లేముందు , వచ్చాక వంటా, వడ్డన , పిల్లల పని అన్నీ ఆమెవే. ఆఫీసులో పని తరువాత అలసిపోయి వచ్చి ప్రసాద్ ముఖం కడుక్కొని పడక కుర్చీలో వాలి పేపర్ చదువుకొనటం అయితే వంటిట్లోకి పరుగెత్తి కాఫీలు పెట్టటం , టిఫిన్లు చేయటం , రాత్రి భోజనపు ఏర్పాట్లు , పిల్లలను చదివించటం అన్నీ విమల వంతు. అతను టిఫిన్ తిని కాఫీ తాగి మిత్ర బృందంతో గడపటానికి వెళ్తే వచ్చేది ఏ రాత్రికో .. ఈ పరిస్థితి విమల లో కలిగించిన అసంతృప్తి తీవ్రత తనకు ఇంటి పనిలో సహాయంగా వచ్చే మస్తానమ్మ మొగుడి తాగుడు , మాంసం ఒండిపెట్టలేదని వంగదీసి కొట్టటం మొదలైన వ్యవహారం వినగానే “ మొగుడు ! మగాడు!! రిక్షా వాడైతేం! ఆ ఒక్క మాటలో ఎన్ని అధికారాలు దఖలు పడ్డాయి మగమనిషికి “ అనిపించింది. తన జీతం తాగుడుకు , జల్సాలకు ఖర్చు పెడుతూ సంసారం బరువంతా భార్య మీదికి నెట్టి కూర్చున్న ప్రసాద్ కు ఆమె మాత్రం తనకు తెలియకుండా పొదుపు కోసమైనా స్వంత సంపాదన నుండి మదుపు పెట్టటం భరించరానిదై కొట్టాడంటే ఈ సమాజం , ఈ దాంపత్యాలు స్త్రీ జీవితం మీద మగవాడికి ఎంతటి అధికారం దఖలు పరిచాయో, స్త్రీల నిర్ణయాధికారం ఎంతగా భంగపడుతున్నదో విమలకు తెలిసివచ్చింది. శారీరక మానసిక హింసల మధ్య అతనితో జీవితం భరించరానిదై తనభర్తకు తానేమిటో తెలియ చెప్పటానికి ప్రయత్నం చేసిన మస్తానమ్మ చొరవ నుండి స్ఫూర్తి ని పొంది అతని నుండి విడిపోయి స్వతంత్రంగా బ్రతకటానికి నిర్ణయం తీసుకొనటం దగ్గర ఈ కథ ముగింపుకు వస్తుంది.
నిష్కృతి కథలో దంపతులు భవానీ వెంకట్రావు . వెంకట్రావుది ప్రసాద్ నమూనానే. భవానీదీ విమల వేదనే. భార్య ఉద్యోగం చెయ్యకుండా ఇంటి పట్టున ఉండాలన్నది అతని అభిప్రాయం. ఆమె ఉద్యోగం చేయటం తన దయా ధర్మ లక్షణం వల్లనే అనుకొనే అహంకారం. ఆమె జీతమంతా తనకు ఇచ్చి బస్సు చార్జీలు అడిగి తీసుకొంటున్నదని తృప్తి పడతాడు. ఇల్లు ఇద్దరి సంపాదనతో , చేసిన అప్పులతో కట్టిందే అయినా దాని మీద అప్పు తెచ్చుకొనటానికైనా , అమ్మటానికైనా భార్యను సంప్రదించాలి అన్న కనీస ఆలోచన లేని అతనితో జీవించటం అవమానంగానూ అభద్రతగానూ అనిపించిన భవానీ అతని నుండి విడిపోయి స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకొనటం చూస్తాం. భవానీకీ స్నేహితురాలు శారదకు జరిగిన సంభాషణ నెపంగా సాపేక్ష భేదాలు ఉంటె ఉండవచ్చు కానీ ఇంటిపని , బరువు బాధ్యతలు స్త్రీలవి కావటం వల్ల స్వీయ అభిరుచుల ఆకాంక్షల పరిపూర్తికి సమయమే మిగలకపోవటం, స్నేహాలు విస్తరించటానికి అభిరుచులు , ఆకాంక్షలు నెరవేర్చుకొనటానికి మగవాళ్లకు పుష్కలంగా అవకాశాలు అందుబాటులో ఉండటం చర్చకు వచ్చాయి. శక్తి స్వరూపిణులని, సహనవంతులని చేసే పొగడ్తలు ఆడదానిని అడ్డమైన చాకిరికీ సేవలకు కట్టిపడేసే మాయలో భాగమన్న అవగాహన కూడా కనబడుతుంది. ఈ పరిస్థితి స్త్రీలను ఎంత నిస్పృహకు గురి చేస్తుందంటే చదివి ఉద్యోగాలు చేయటం వల్ల తమకు సంకెలగా, వికాసానికి అవరోధంగా ఉన్న ఏ అధికారాలను తప్పించుకోలేనప్పుడు, ఉద్యోగాలు లేకుండా ఇంటి పట్టున ఉండి మొగుడు సంపాదించి పెడుతుంటే సుఖపడితే సరిపోదా అన్న నిర్ణయానికి వచ్చేట్లు చేసే ప్రమాదం ఉంది. శారద ఆ అభిప్రాయాన్నే వ్యక్తం చేసినప్పుడు మన అనుభవానికి రానంత మానాన ఆర్ధిక స్వాతంత్య్రం కోసం , సాధికారత కోసం చైతన్యంతో సాధించుకొన్న హక్కులను వదులుకొనటానికి సిద్ధపడటం తిరోగమనం కదా అని హెచ్చరిస్తుంది భవాని. ఇలాంటి స్థితిని అధిగమించటానికి భావానికి తోచిన పరిష్కారం భర్త నుండి విడిపోవటం. మరొకళ్ళు మరొక పద్ధతిలో ప్రయత్నించవచ్చు.
సరికొత్త దృశ్యం ( ఏప్రిల్ 2007) కథలో దాదాపు ఇదే సమస్య ప్రేమ పెళ్లితో ముడిపెట్టి చర్చించబడింది. సుజాత ప్రేమించింది తల్లిదండ్రులను ఒత్తిడి పెట్టి పెళ్లాడింది మేన బావ ప్రకాష్ నే. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా అవసరాలలో ఉన్న తల్లిదండ్రులకు పంపుతున్నానని ఇంటి బరువు బాధ్యతలు భార్య మీదకు నెట్టెయ్యటమే కాదు తండ్రిని అడిగి డబ్బు తెమ్మని వేధించటం , నిరాకరించిందని కొట్టటం మొదలయ్యాక ప్రేమి కుడు భర్త అయ్యాక మిగిలేది అధికారం , దౌర్జన్యమే అని అర్ధమవుతూ ప్రేమ భ్రమ అని తెలిసి వచ్చింది సుజాతకు. తాగివచ్చి తిట్టి కొట్టే భర్తను, ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలను అంటగడుతూ అవమానపరిచే భర్తను ఇక భరించటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చి సుజాత అతని నుండి వేరుగా వచ్చి బతకటానికి సిద్ధపడటం, పనిచేసేచోటా , వీధుల్లో తనను అవమానపరిచి , హింసించి తన అధికారం నిరూపించుకొనటానికి ఆ భర్త చేసే ప్రయత్నాలను, భౌతిక దాడులను అడ్డుకొనటానికి ఆమె కరాటే కూడా నేర్చుకొనటం ఆచరణలో పెట్టటం ఈ సమాజంలో సరికొత్త దృశ్యమే. దానిని స్వాగతించటానికి అవసరమైన ఒక సంస్కారం సమాజంలో వికసిస్తున్నదన్న సూచనతో ఈ కథ ముగుస్తుంది.
నిరంతర శాకుంతలం ( అక్టోబర్ 2009) కథలో రెండు కథలు ఉన్నాయి. ఒకటి శ్యామల కథ. ఇది వర్తమానం. రెండవది ప్రమీల కథ. అది గతం. ఈ రెండింటికీ మధ్య వారధి యశోద. మహిళా సంక్షేమ అధికారి ఆమె. మహిళల తో స్నేహం , వాళ్ళ వికాసానికి అవసరమైన నైతిక ధైర్యాన్ని అందించటం ఆమె వృత్తే కాదు ప్రవృత్తి కూడా . పక్కింటి అన్నపూర్ణమ్మ క్షేమ సమాచారాలు , వాళ్ళ ఆమ్మాయి శ్యామల కాపురం వివరాలు అడిగి తెలుసుకొనటంలో, ఆరోగ్యం దెబ్బతినేంతగా ఆమె అత్తింట్లో భర్త పెట్టె మానసిక శారీరక బాధలను ఎదుర్కొంటున్నదని తెలుసుకొని ఆ పిల్లను తీసుకువచ్చి తగిన వైద్యం చేయించమని ప్రాణానికే ప్రమాదకరంగా మారిన సంసారాన్ని వదులు కొనటం ప్రాధమిక వివేకమని అన్నపూర్ణమ్మకు నచ్చ చెప్పటంలో , శ్యామలను తీసుకువచ్చాక ఆమెకు వాస్తవాల ఎరుకను కలిగించి కర్తవ్యాన్ని ఎంచుకొనే ప్రేరణ ఇయ్యటంలో కనబడేది అదే.
శ్యామల డిగ్రీ మూడవ సంవత్సరంలో ఉండగా ప్రేమించి, కుల హద్దులను దాటి పెళ్ళికి తొందర పెట్టి, కట్నంలేని పెళ్లి చేసుకొన్న యువకుడు అతికొద్దికాలానికే ఆదర్శాలు మరిచి సంపాదన లేక సంసారం సాగించలేక తల్లిదండ్రుల దగ్గరకు చేరి, చేస్తున్న ఉద్యోగంతో తృప్తి పడక మోటార్ బైక్ కావాలని , స్వంత ఇండస్ట్రీ పెట్టుకుంటానని తల్లిదండ్రుల నుండి డబ్బు తెమ్మని ఒత్తిడి చేయటం మొదలు పెట్టాడు. తల్లి దండ్రులకు అంత స్థోమత లేదని, తాను వాళ్ళను డబ్బు అడగనని శ్యామల నిరాకరిస్తే తల్లిదండ్రులు చూసిన పిల్లను పెళ్లిచేసుకొని లక్షల కట్నం సంపాదించగలనని బెదిరింపులకు వేధింపులకు దిగాడు. దానితో ఆందోళనకు లోనై అనారోగ్యం పాలైంది శ్యామల. తల్లిదండ్రులు వెళ్లి కూతురి జబ్బు నయం చేయించి పంపుతామని నయాన చెప్పి తీసుకురావటం, స్వేచ్ఛ ఆప్యాయతల మధ్య తేరుకొని శ్యామల యశోద ఇచ్చిన స్ఫూర్తి తో అవమానకరమైన సంసారం లోకి తిరిగి వెళ్లనని , లా చదివి న్యాయవాదిగా స్త్రీల సమస్యల కోసం పనిచేస్తానని నిర్ణయించు కొనటం వర్తమాన కథా విషయం.
శ్యామల కు జీవితం గురించి గురించి సరైన అవగాహన కల్పించటానికి , జీవించటానికి అవసరమైన ప్రేరణ కలిగించటానికి యశోద చెప్పిన కథ ప్రమీల ది. అది ఒక వాస్తవ జీవితానుభవం. కథలో ని కథ. 1946 నాటి కథ. అరవైయేళ్ల గతం. ఇంటెర్మీడియేట్ లో చేరి విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ప్రమీలకు విద్యార్థి సంఘనాయకుడు ప్రసాద్ తో కలిసిన స్నేహం ప్రేమగా మారి పెళ్లివరకు వెళ్ళింది. రాజకీయాలలో తలమునకలై ప్రసాద్ సంసారాన్ని పిల్లల కనీస అవసరాలను నిర్లక్ష్యం చేస్తూ తిరుగుతుంటే ఆమె రాజకీయాలకు దూరమై ఒంటరిగా సంసార బాధ్యతలు మోసింది. రాజకీయాలలో పైకి ఎదగాలన్న మొహమే కాదు అగ్ర వర్ణ అహంకారం కూడా అతనిని తనపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించేట్లు చేస్తున్నాయని ఆమెకు అర్ధమవుతూ వచ్చింది. చివరకు అతను కులమింటి అమ్మాయిని పెళ్ళాడి తనను ఒంటరిగా వదిలేస్తే చదువు కొనసాగించి ఉద్యోగం చేస్తూ పిల్లలను ప్రయోజకులను చేసింది. అది తన ఆత్మీయ స్నేహితురాలి ఆత్మకథ అని చెప్తుంది యశోద. నలుగురికీ ఆదర్శంగా ఉండవలసిన ప్రజా నాయకులూ , రాజకీయ నాయకులూ వాస్తవ ఆచరణలో స్వార్ధపరులుగా, స్త్రీలపట్ల , భార్యా పిల్లలపట్ల బాధ్యతా రహితులుగా ఉంటారన్న నిరసన స్వరం , అలా ఉంటూ కూడా లోక సేవకోసం సంసారాలను వదిలేసే త్యాగమూర్తులన్న కీర్తిని మూటగట్టుకొంటున్నారన్న వ్యంగ్యం యశోద కథనంలో ఉన్నాయి.
ఆ తరంలో ప్రమీల, ఈ తరం శ్యామల వాళ్లకు ముందూ వెనుక మరెందరో స్త్రీలు తరతరాలుగా మగవాడి ప్రేమ మాటలకు లొంగిపోయి భంగపడుతున్నారన్న రచయిత్రి వేదన నిరంతర శాకుంతలం అన్న కథా శీర్షికలో ధ్వనిస్తుంది. దుష్యంతుడి అనురాగానికి , వాదనకు లొంగి తండ్రి వచ్చేవరకు కూడా ఆగక గాంధర్వ పద్ధతిలో అతనిని పెళ్లాడిన శకుంతల నిండు సభలో నువ్వెవరో నాకు తెలియదు అన్న దుశ్యంతుడి తిరస్కారాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. రాజే అన్యాయం చేస్తుంటే న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియక అడవుల పాలైంది. ఆ శకుంతల పౌరాణిక యుగాలది అయినా ఆధునిక ప్రజాస్వామిక యుగాలలో కూడా స్త్రీల పరిస్థితి శకుంతల వారసత్వంగా కొనసాగుతున్నదన్న వ్యధ రచయిత్రిది. అందులో భాగంగానే ఈ కథలో వర్తమానంలోని శ్యామల కథ ను పోలిన గతానికి చెందిన ప్రమీల కథ పరస్పర సంబంధంలో కూర్చబడింది.
ఆదర్శాలు – అన్వయాలు కథలో వేణు తల్లి శకుంతల కథ కూడా ప్రమీల కథను పోలిందే. దాదాపు ఒకే కథ రెండు కథలలో పునరావృత్తం కావటం ఎందువల్ల? అది నంబూరి పరిపూర్ణ జీవితానుభవం కావటం వల్ల. ఆమె స్వీయ చరిత్ర వెలుగు దారులు చదివితే ఈ విషయం తెలుస్తుంది. 1946 నాటికి కమ్యూనిస్టు రాజకీయాలలో ఎదిగి కాకినాడ కాలేజీలో అనుబంధ విద్యార్థి సంఘ కార్యదర్శి అయిన దాసరి నాగభూషణరావు తో కలిసి విద్యార్థి మహా సభల నిర్వహణలో భాగమై 1950 నాటికి జీవిత భాగస్వామి కూడా అయిన నంబూరి పరిపూర్ణ ముగ్గురి బిడ్డల తల్లి అయి పదేళ్ల దాంపత్య జీవితంలో భర్త తనపట్ల నిర్లక్ష్యంగా , న్యూనంగా ప్రవర్తించటానికి స్త్రీగా, దళిత స్త్రీగా తనకు ఆపాదించబడిన సామాజిక న్యూనత అగ్రకుల పురుషుడిగా అతనికి వారసత్వంగా వచ్చిన ఆధిపత్య స్థాయి కారణమని గ్రహించగలిగింది. అంతకు ముందే పెళ్లి అయిందన్న విషయాన్ని దాచి తనను పెళ్లాడిన అతను ఇన్నేళ్లకు ఆస్తులతో వచ్చే ఆ భార్యను స్వీకరించి తనను వంటరిగా వదిలేస్తే ఆ నమ్మక ద్రోహం కలిగించిన దుఃఖాన్ని , ఆదర్శాలు భగ్నమై స్వార్ధపూరిత వాస్తవం వికృతంగా బయటపడేసరికి కలిగిన దిగ్భ్రమను లోలోపలికి నెట్టేసుకొని తనను తాను నిలబెట్టుకొనటానికి , పిల్లలను పెంచి పెద్దవాళ్ళను , ప్రయోజకులను చేయటానికి జీవన యానం కొనసాగించింది. అంతరాంత రాలలో అగ్నిపర్వతంగా ఘనీభవించిన ఆనాటి అవమానాలు, వేదనలు, దుఃఖం కథలు వ్రాయటం ప్రారంభించాకనే కరగటం మొదలై ఈ రకంగా కథలలోకి ప్రవహించి ఉంటాయి.
1985 లో కథలు వ్రాయటం ప్రారంభించినా 2003 నాటికి గానీ కథకు కావలసిన సంఘర్షణాత్మకమైన ముడిసరుకు తన జీవితంలోనే ఉందని ఆమె గుర్తించలేకపోయింది. గుర్తించినా కథలో తానుగా బయటపడటం ఎలా ఉంటుందన్న విచికిత్స వల్లనైనా తటపటాయించి ఉండాలి. ఆ సంకోచం నుండే ఆదర్శాలు – అన్వయాలు కథలో శకుంతల కథను ఆమె కొడుకు వేణు తన కులాన్ని , బంధువులను తక్కువగా చూచే భార్యపట్ల తన వైఖరిని స్పష్టం చేయవలసిన ఒక అనివార్య పరిస్థితికి తెచ్చిన సందర్భ కారకంగా కనీ కనబడకుండా భాగం చేసిందని అనుకోవచ్చు. ఆ తరువాత నాలుగేళ్లకు వ్రాసిన శృతి తప్పిన రాగం కథలోనూ శారద తల్లి అరుంధతి కూడా ప్రేమ పెళ్లి విఫలమై పిల్లల కు విద్యాబుద్ధులు చెప్పించుకొంటూ కొన్ని విలువలతో బతుకుతున్న ఒంటరి తల్లి అన్న సూచనలు ప్రసక్తాను ప్రసక్తంగా కనబడతాయి. ఆ తరువాత రెండేళ్లకు వ్రాసిన నిరంతర శాకుంతలం కథ లో ప్రేమపెళ్లిళ్ల కు తగిన నూతన ప్రజాస్వామిక భావజాలాన్ని పురుషులు అలవరచుకొనలేనప్పుడు అవి వైఫల్యానికే దారితీస్తాయని, అలాంటప్పుడు ఆడపిల్లలకు తమ జీవితం మీద తాము అధికారం నిలబెట్టుకునే నైతిక ధైర్యాన్ని ఇయ్యగల ఒక ఉక్కుమనిషి నమూనాగా ప్రమీల జీవితాన్ని నిలబెట్టి చూపించటం జరిగింది. ప్రమీల కథను చెప్పిన యశోద కూడా రచయిత్రి లోని ఒక భాగమే.
వ్యక్తిగతమైన అనుభవాల వేదన ఎడమెదడుల మీద చేసే ఒత్తిడి నుండి విముక్తికి రచన ఒక వాహిక. వ్యక్తి గత విముక్తి ఈ నవలకు ప్రేరణ అని బుచ్చిబాబు చివరకు మిగిలేది నవల ముందు మాటలో అంటాడు. అయినా ఇందులో దయానిధి అనుభవాలన్నీ రచయితవే అనుకోవద్దు అని ఒక మాట కూడా అంటాడు. అస్తిత్వ ఉద్యమాలు వ్యక్తిగత అనుభవాలను సాహిత్య వస్తువును చేయటానికి ఉన్న మొహమాటాలను తొలగించాయి. వ్యక్తిగతమంతా రాజకీయమే అన్న అవగాహన కలిగాక వ్యక్తి జీవిత అనుభవాలు సాహిత్య వస్తువు కావటానికి ఉన్న అవరోధాలు తొలగిపోయినట్లే. జీవితం వ్యక్తులదే అయినా దానిని శాసించే అధికార రాజకీయాలు సాధారణమైనవే. అవి నిర్వహిస్తున్న పాత్ర అర్ధం అయ్యే క్రమంలో వ్యక్తిగతం భ్రమ అని తేలిపోతుంది. ఆ రకంగా నంబూరి పరిపూర్ణ 2003 నుండి తన కథలలో స్వీయ జీవిత అనుభవాలను రాజకీయాలను సూక్ష్మ స్థాయిలో అక్కడక్కడా భాగం చేస్తూ వచ్చి 2017 లో స్వీయ చరిత్ర ప్రకటించటంద్వారా తనదంటూ ఏదీ లేదని అంతా సమాజానిదే అని తనను తాను బహువచనంగా ప్రకటిచుకొన్నది. అది ఆమె సాహిత్య జీవిత విజయం.