ఆది ఆంధ్ర ఉద్యమం సంవాదాలు – సాహిత్యం-2

గోరక్షణ అంటే హిందూమత రక్షణ అని తెలిసి తమను నిమ్నజాతులుగా అవమానిస్తున్న ఆ హిందూమత రక్షణకు పంచములు పూనుకొనటం కొంచం విడ్డూరంగానే కనిపిస్తుంది. అది వాళ్ళ సహనలక్షణం. వాళ్ళు గోరక్షణ సభను పెట్టటం లో ఆయనకు అభ్యంతరం ఏమీ లేదుకానీ ‘ అగ్రజాతులు మిన్నకున్నాను గోమాంస భక్షకులని నిందారోపితులగు ఆదిమాంద్రులే ఇమ్మహా కార్యమునకు బూనుకొన్నారని’ గోరక్షణ సభవారు రాసుకొనటమే ఆయనకు అసలు నచ్చలేదు. అగ్రజాతులు చేయజాలని పనిని తాము చేస్తున్నామని అహంకరించి మాట్లాడు తున్నారని తప్పు పట్టాడు. ఇందులో మీ గొప్పేమీ లేదని,వాళ్ళ పనిని తక్కువ చేసిచెప్పాడు. గోరక్షణకు పని చేస్తున్న ఆగ్రజాతులవాళ్ళు ఎందరో వున్నారని చెప్పటానికి చాలా శ్రమ పడ్డాడు. “ పవిత్రవంతమగు అహింసావ్రతము నవలంబించి భూతదయాళురని ఖండాంతరాముల యందు ఖ్యాతి గొన్న భారతీయులు, హిందువులు (అందు అగ్ర జాతులవారు) పంచముల యంటరానితనమును తొలగించి వేదబహ్యులగు మతాంతరుల బారినుండి తప్పించిరేని గోహింసకు నిజమగు దుఃఖమును ,పశ్చాత్తాపమును వెల్లడించినవారు అవుతారు” అన్న మాటలు ఆ కరపత్రంలో ఉండరానివాని తీర్పు ఇచ్చాడు. చివరికి ఇలాంటి సంఘాలు, ఆశ్రమాలు అనేకం ఉన్నాయి వీటికి పత్రికలు ఉచితంగా పంపటం సాధ్యపడదు అని తేల్చి చెప్పాడు. పంచముల సామాజిక స్థాయి చాలా దిగువ స్థాయిది అని పదేపదే నిరూపించటంలో భాగమే వాళ్ళ ఆలోచనలను ఆకాంక్షలను , ఆచరణలను తక్కువచేసి మాట్లాడటం. నిర్లక్ష్యం చేయటం. మల్లాది రామకృష్ణ శాస్త్రి చయినులు వంటివారు ఆయన లాంటి వాళ్లే. ఆయన రాసిన ‘అస్పృశ్యతా నిరూపణము’ అనే సుదీర్ఘ వ్యాసం అభినవ సరస్వతి పత్రికలోనే అచ్చయింది.

కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షి శిష్యుడు ఒకాయన ఉన్నాడు. అయ్యలసోమయాజుల గణపతి శాస్తి ఆయన అసలుపేరు. 1878 లో పుట్టి 1936 వరకు జీవించాడు. 18 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి ధ్యాన మార్గంలో ప్రయాణించి బెంగాల్ లోని నవద్వీప్ లో సంస్కృతం అధ్యయనంచేసి ఆశువుగా సంస్కృతంలో కవిత్వం చెప్పే పరీక్షలో అత్యంత ప్రతిభను కనబరచి ”కావ్య కంఠ” బిరుదును పొందాడు. తపో మార్గం లో సాగుతూ 1907లో రమణ మహర్షి శిష్యుడు అయ్యాక మునిగా చెప్పబడుతూ వచ్చాడు. ఇంతగా చెప్పటం ఎందుకంటే ఆయన అస్పృశ్యత కు వ్యతిరేకి. పండిత సభలలోనూ వర్ణ సమానతను బోధించేవాడు. సంస్కరణ సభలకు హాజరయ్యేవాడు. 1927 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో భాగ్యరెడ్డివర్మ ఏర్పాటు చేసిన సభకు వచ్చి సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆయన చేస్తున్న సేవను కొనియాడాడు. ( కె. శ్రీనివాస్ – భాగ్యరెడ్డివర్మ, 2017) ఆ కావ్యకంఠ గణపతిముని 1925 మే 5న గోదావరి జిల్లా ఆలమూరులో జరిగిన పండిత సభకు అధ్యక్షుడుగా ఆయన చేసిన ఉపన్యాసానికి వ్యతిరేక ప్రతిస్పందనగా వచ్చిన వ్యాసమే మల్లాది రామకృష్ణ శాస్త్రి చయినుల ‘అస్పృశ్యతా నిరూపణము’.

దీనిని నిమ్నజాతి ఉద్ధరణం సంస్కృత భాషావిదులకు కూడా పట్టిందే అని వెక్కిరింతతో ప్రారంభించి ఆయన వాదం శాస్త్ర సమ్మతంకాదని రాసాడు. (అభినవ సరస్వతి,సెప్టెంబర్ 1924 ) దానిపై కావ్యకంఠ గణపతి ముని ఖండన వ్యాసం ఎక్కడ ప్రచురించబడిందో తెలియదు కానీ, ప్రతిఖండనగా మల్లాది రామకృష్ణ శాస్త్రి రాసిన ‘అస్పృశ్యతా నివారణ ఖండనము’ మాత్రం అభినవ సరస్వతిలో ప్రచురించ బడింది. అస్పృశ్యత పంచములకే కాదు అందరికీ అందరిలో ఉన్నదని, బ్రాహ్మణులకు కింది వర్ణాలవారితో, బ్రాహ్మణులలో మడి, మైల రజస్వల ,ప్రసవం, సూతకం వంటి సందర్భాలలో ఉంటుందని ఇంతెందుకు మాలలకు మాదిగలకు కూడా మధ్య అస్పృశ్యత ఉంటుందని ఇలా వితండవాదం చేసి అస్పృశ్యతా నివారణ అసంభవమని తేల్చాడు. దీనికి మద్దతుగా పత్రికా సంపాదకుడు జానపాటి ప్రబుద్ధాంధ్ర పత్రిక నుండి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన ‘పుల్లంరాజు’ కథను పునర్ముద్రించాడు. (అక్టోబర్ 1925).

నిజానికి ఈ కథ అస్పృశ్యతను సమర్ధించేది కాదు. అస్పృశ్యతనివారణ మొదలైన సంఘసంస్కరణ ఉద్యమాలలో హృదయంతో పని లేకుండా, సరైన అధ్యయనం, అవగాహన లేకుండానే అత్యుత్సాహంగా పాల్గొనే వర్గం పైన ,అదే సమయంలో సంస్కరణలు ఇష్టం లేనివాళ్ల ఆచరణ వ్యూహాలను విమర్శకు పెట్టటానికి రాసిన కథ. పుల్లంరాజు లాంటి జమీందారులు, సంపన్నవర్గం గుర్రపు పందాలలో పాల్గొన్నంత సులువుగా అస్పృశ్యతా నివారణా ఉద్యమాలలోకి కూడా రాగలరని, అటువంటి వాళ్ళను సులభంగా దారితప్పించగల రామచంద్రయ్య వంటి అధికారవర్గాన్ని గురించి హెచ్చరించటం ఈ కథ ఉద్దేశం. గోదావరి జిల్లాల్లో దుప్పలపూడి కి సర్వాధికారి పుల్లంరాజు. ఆయన మంత్రి రామచంద్రయ్య బ్రాహ్మడు. పుల్లంరాజు అస్పృశ్యతా నివారణకు చర్యలు చేపడతారన్న వార్త రాగానే ఆ ప్రాంతపు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరూ రామచంద్రయ్య దగ్గరకు వెళ్లి ఈ ఉపద్రవం రాకుండా చూడమని వేడుకున్నారు. ఆ రామచంద్రయ్య మాల, మాదిగల మధ్య ఉన్న అంటరానితనం సమస్య పుల్లంరాజు దృష్టిలో పడేట్లు చేసి అస్పృశ్యతా నివారణ ఉద్యమం నుండి తనంతట తానే వైదొలగేట్లు చేసిన కథ అది. అస్పృశ్యత నివారణ అనగానే దానిని వ్యతిరేకించే వర్గాలు అస్పృశ్యత అంతటా ఉంది, అది అనివార్యం అని చెప్తూ వస్తున్న వర్గానికి ప్రతినిధిగా జానపాటి పట్టాభిరామశాస్త్రికి, మాలలకు మాదిగలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని అడ్డంపెట్టుకొని వ్యూహం నడిపిన రామచంద్రయ్య పాత్ర ఆదర్శనీయంగా కనిపించి ఉంటుంది. అందుకు ఆయన ఈ కథను ఉద్దేశిత లక్ష్యానికి భిన్నంగా వ్యాఖ్యానించుకొని తన పత్రికలో తిరిగి ప్రచురించాడు.

మల్లాది రామకృష్ణ చయినులు రాసిన అస్పృశ్యతనిరూపణము, అస్పృశ్యతా నివారణ ఖండనము, అంటరానివాళ్ళు అనే శీర్షికతో పట్టాభిరామశాస్త్రి రాసిన పీఠిక తో కలిపి 1926లో పుస్తకంగా కూడా వచ్చింది.
ఇక్కడ మరొక ఉదంతం గురించి కూడా చెప్పాలి. 1925 నవంబర్ 10 న హైదరాబాద్ లో పంచములు -భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలోనే కావచ్చు ఒక సభ ఏర్పాటుచేశారు. కాశీనాధుని నాగేశ్వరరావు, రాయప్రోలు సుబ్బ్బారావు ఆ సభలో ప్రసంగించారు. రాయప్రోలు రెండు పద్యాలు కూడా చదివాడు. అవి – 1) “ మేఘగర్భము నుండి మేదిని బడ్డ చె
ర్వుల మంచినీళ్లేల క్రోలరాదొ
పందులు గాడిదెల్బాహాటముగ( బోవు
వీధులయందేల వెళ్లరాదొ
కాయకష్టము చేసి గంజి యంబలి ద్రావి
యూరి నడుమ నేలయుండరాదొ
భగవంతుడిచ్చిన పరమార్ధ వాక్యము
మనుజుడై యేటికి వినఁగ రాదొ

బోధ పడదీ విరుద్ధ ధర్మాధికార
సూత్రములకు సత్యర్ధమే మాత్రమిపుడు
చచ్చిపుచ్చిన యాచార శల్యములను
బట్టి పూజింతురయ్య త్త్వజ్ఞులెందు


2) సోమయాజి కొమార్తె సూతికయై సీమ
బ్రాందీని సుఖముగా ( ద్రావవచ్చు
అవధాని కొడుకు క్రైస్తవ కళాశాలలో
స్వేచ్చగా జెముద్దులీయవచ్చు
కోర్టులో వాయిదా కొఱకు హోటలు దూఱి
బహుముఖోచ్ఛిష్టమ్ము ( బ్రామవచ్చు
తన పెండ్లి కోసమాత్మ తనూజ ( దేగనమ్మి
వృద్ధవిరోధులు చరిమవచ్చు

ఏ స్మృతులనుజ్ఞుల మెసంగ నీ నికృష్ట
కర్మ పరిణామ సాంకర్య కాండకెల్ల
ధర్మశాస్త్ర ప్రమాణములు తడవనేల
ఆత్మవత్సర్వ భూతాని యనరె బుధులు.

ఆ సభలో వాళ్ళు ఇద్దరు ఏమి మాట్లాడారో గానీ దానిని సవాల్ చేస్తూ చివుకుల అప్పయ్య శాస్త్రి, చివుకుల వేంకటాచల శాస్త్రి, నారాయణ రాజనరసింహ శాస్త్రి, ముదిగొండ బుచ్చయ్యలింగ శాస్త్రి, చిర్రావూరి సీతారామశాస్త్రి, జాగర్లపూడి అమరనాథ శాస్త్రి, మల్లాది బలరామ సిద్ధాంతి, కాండూరి సీతారామాచార్యులు, పమిడి శ్రీశైలము, కప్పగంతు మార్కండేయ శర్మ, శ్రీ. పం. మార్కండేయశాస్త్రి, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి —మొదలైన 22 మంది సంతకాలతో వెలువడిన ఒక ప్రకటన ను అభినవసరస్వతి పత్రిక (1926, జనవరి) ప్రచురించింది.

అస్పృశ్యత శాస్త్రాచారమగు ధర్మం, దానిని అధర్మం అనుకొని గాంధీ అస్పృశ్యతా నివారణమును బోధిస్తుంటే కాశీనాథుని నాగేశ్వరరావు వంటి అనుయాయులు దాని వ్యాప్తికి ప్రచారం చేస్తున్నారని అది లోకరిష్టదాయకం కనుక వాళ్ళు ఆ పనిని విరమించుకోవాలని కాశీనాథుని నాగేశ్వరరావును, రాయప్రోలు సుబ్బారావును నవంబర్ 12 న ఏర్పాటుచేస్తున్న ఖండన సభలో ప్రతక్ష వాదనకు రావలసినదని సవాల్ విసురుతూ రాసిన కరపత్రం అది. ఆ సవాల్ ను వాళ్ళు పట్టించుకున్నట్లు లేదు. మరి ఆ సభ జరిగిందో లేదో తెలియదు. కానీ డిసెంబర్ 12 మాత్రం వంగపల్లి నీలకంఠంగారింట శ్రీశంకర హరిహర తీర్ధదండి స్వాములు సనాతన ధర్మోపన్యాసం చేసిన సందర్భంలో పంచముల సభలో కాశీనాథుని నాగేశ్వరరావు, రాయప్రోలు చేసిన వాదనలను ఖండించారు. చండాలురయందంటరాని తనము కూడదని వాదించు ఇతరులు పూర్వం అనేక జన్మలయందు చండాలురై ఉంటారని, పుణ్యవశమున ఉత్తమజాతులలో జన్మించినను పూర్వజన్మ వాసనలు పోకుండుటచే చండాల పక్షపాతులై వాదించు చున్నారని చెప్పి కసి తీర్చుకొని తృప్తి పడ్డారు.

రాయప్రోలు సుబ్బారావు రాసిన పద్యాలకు సమాధానం అన్నట్లు చివుకుల వేంకటాచల శాస్త్రి ‘శాస్త్ర దూషక నిరూపణం’ అనుపేర 7 పద్యాలూ, అస్పృశ్యత అనే శీర్షితో మరో మూడు పద్యాలూ, చివుకుల అప్పయ్య శాస్త్రి 3 పద్యాలూ రాశారు. అభినవ సరస్వతి వంటి పత్రికలు ఇలా అస్పృశ్యత నివారణ ఉద్యమాన్ని నీరు గార్చటానికి శతవిధాల ప్రయత్నిస్తుంటే దానిని నిలబెట్టి ముందుకు నడిపించటానికి దళిత దళితదళితేతర శక్తుల ప్రయత్నాలు నిరంతరాయంగా సాగాయి.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply