“ఒక ప్రయాణం ముగిసింది
ఆగిన చోటనే అడుగుజాడలు మొదలయ్యాయి
ఒక పక్షి గొంతు మూగవోయింది
ప్రతిధ్వని కొత్త రాగాలు సమకూర్చింది
ఒక చెట్టు నేల కూలింది
చివుర్లలో అడవులు మొలకెత్తాయి”
“ఆమె అస్తమించలేదని….” పుస్తకానికి నేనే సంపాదకుడిని. అయినప్పటికీ ఆ పుస్తకానికి నేనేం క్రెడిట్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అందులో “బందిపోట్లు” కవి సావిత్రిగారి గురించి ఒక పరిచయం రాయటం, ఆమె రచనల్ని, అలాగే ఆమె గురించి మిత్రులు రాసిన రచనలని సేకరించి, సంపుటీకరించటం వరకే నేను చేసింది. ఆ పుస్తకంతో నా మిగతా సంబంధం అంతా పుస్తకానికి-పాఠకుడికి వున్న సంబంధమే. అందుకే ఆమె గురించి నేనెప్పుడు మాట్లాడినా, రాసినా ఒక పాఠకుడిగానే స్పందిస్తాను. ఇప్పుడు, ఇక్కడ కూడా అంతే.
నాకు సావిత్రిగారు బతికున్నప్పుడు కంటే మరణించాకనే ఎక్కువ పరిచయం. ఆమె చివరి దశలో చావు పడకమీదున్నప్పుడు మాత్రమే ఆమెతో నాకు పరిచయం కలిగింది. (అది చావు పడక అని మిత్రులనుకునే వారు. కానీ ఆమె అనుకునేది కాదు. అది వేరే విషయం.) పరిచయం అయ్యే సమయానికే ఆమెది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం అన్నంతవరకే తెలుసు. 24 కిలోల బరువుతో బలహీనంగా కదిలే ఐదడుగుల శరీరంలో దాగివున్న ఆమె బలమైన వ్యక్తిత్వాన్ని చూసాను. నేను మరీ ఎక్కువగా మాట్లాడింది లేదు ఆమెతో. నిజానికి ఆమెతో కంటే ఆమె పిల్లలతో, ఆమె మంచి చెడుల్ని చూసే సోమయాజులుతో, ఆమెని చూడటానికి వచ్చే ఒకరిద్దరు మిత్రులతోనే ఎక్కువగా మాట్లాడేవాడిని. ఆమె మరణించిన అనంతరమే ఆమె గురించి నాకు ఎక్కువగా తెలిసింది. ఆమె మీద ఒక స్మృతి సంచిక తీసుకురావాలని మిత్రులు సంకల్పించి, ఆ బాధ్యతని నాకు కట్టబెట్టిన తరువాత ఆమె ముద్రితాలు అముద్రితాలు, మిత్రులకు రాసిన లేఖలు దొరికాయి. అవి చదివిన తరువాత ఆమె కీర్తి ఒక్క “బందిపోట్లు” కవితకే కుదించటం అన్యాయం అనిపించింది. సుమారు ఒక సంవత్సరం పాటు చేసిన అన్వేషణ ఫలితమే ఆమె రచనలు. ఎందరో సహకరించారు. అదే సమయంలో ఆమె గురించి మిత్రులు ఎన్నో విలువైన వ్యాసాలు, కవితలు రాసారు. అవన్నీ ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేవే. మిగతా అందరికంటే ఆమె రచనల్ని నేనే ఎక్కువగా చదివుంటాను ఒక పాఠకుడిగా. ఆమె రచనల ద్వారా ఆమె నాకు ఇంకా ఎక్కువగా పరిచయం అయ్యారు.
మే 18, 1949న పుట్టి, 4 అక్టోబర్, 1991న జీవితాన్ని హడావిడిగా ముగించుకొని వెళ్ళిపోయిన సావిత్రిగారి రచనల, స్మృతి రచనల సంపుటి 21 నవంబర్, 1992న రాజమండ్రిలో చేకూరి రామారావు గారి చేతుల మీదుగా విడుదల అయింది. ఈ పుస్తకంలో రెండు భాగాలున్నాయి. ఒకటి సృజన – అంటే ఆమె రచనల విభాగం. రెండు స్మృతి – ఆమె గురించి మిత్రుల రచనలు. ఆమె స్వీయరచనల విభాగమైన “సృజన”లో 23 కవితలు, ఒక కథ, ఒక గల్పిక, 7 సమీక్షలు, 9 వ్యాసాలు వున్నాయి. కృష్ణాబాయి, చిన వీరభద్రుడు, సతీష్ చందర్, అద్దేపల్లి, శిఖామణి వంటి ప్రముఖులు ఆమె స్మృతిలో రాసిన 13 రచనలతో పాటు చేకూరి రామారావు గారు రాసిన “బందిపోట్లు” కవిత విశ్లేషణ, బందిపోట్లు కవితకి ఇంగ్లీష్ అనువాదం కూడా వున్నాయి.
సావిత్రిని వామపక్ష స్త్రీవాదిగా చెప్పొచ్చు. వామపక్ష దృక్పథంలో స్త్రీకి స్థానం లేదా? ప్రత్యేకంగా స్త్రీవాది అని చెప్పడమెందుకు అనే ప్రశ్నలు రావొచ్చు. మానవజాతిలో సగభాగంగా వున్న స్త్రీల మీద జరిగేంత భావజాల పరమైన అణచివేత మరే ఇతర ప్రజా సమూహంపైన వుండని కారణంగా స్త్రీ సమస్యల పైన, స్త్రీలకే ప్రత్యేకమైన దాస్యం నుండి విముక్తి పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని సావిత్రి వంటి స్త్రీవాదులు ఎక్కువగా గుర్తిస్తారు. వారి ఫోకస్ నుండి వామపక్షీయులు కూడా తప్పించుకోలేరు. రక్తంలో ఇంకిపోయిన, భాషలో కలిసిపోయిన, ఆచరణలో పట్టించుకోని మనువాద పోకడల్ని గురి చూసి కొట్టే తత్వం ఆమెది. అందుకు ప్రబల సాక్ష్యం “బందిపోట్లు” కవిత.
“పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళి చేస్తాన”ని
పంతులుగారన్నప్పుడే భయం వేసింది
“ఆఫీసులో నా మొగుడున్నాడు
అవసరమొచ్చినా సెలవివ్వడ”ని
అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది
“వాడికేం మగ మహారాజ”ని
ఆడామొగా వాగినప్పుడే అర్ధమైపోయింది
“పెళ్ళం”టే “పెద్ద శిక్ష”ని
“మొగుడం”టే “స్వేఛ్ఛా భక్షకుడ”ని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తుందని”
1984లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈ కవిత ప్రచురించబడినప్పుడు కవిత్వం మీద ఏ మాత్రం ఆసక్తి లేని సుమారు ఓ ఇరవయ్యేళ్ళ కుర్రాడు ఈ కవిత చదివి ఉలిక్కిపడ్డాడు. అది నేనే. మనం అతి సాధారణంగా మాట్లాడుకునే మాటల ద్వారా కూడా పురుషాధిపత్యం అనే వైరస్ ని మన మెదళ్ళలోకి ఎక్కించేస్తుంటాం. మనం పట్టించుకోనంతగా నిబిడీకృతమై వున్న అంశాన్ని ఎంతో సూటీగా, ప్రభావవంతంగా బైట పెట్టిన కవిత. సావిత్రి గారి కవిత్వంలో మహా అయితే నుడికారపు ఆధారితమైన ఉపమానాలు వుంటాయేమో కానీ జిలుగు వెలుగులు, సొబగు సొగసులూ, పదచిత్రాలు, వైవిధ్యమైన వాక్య నిర్మాణాలూ వుండవు. చాలా సూటీగా వుంటుంది ఆవిడ కవిత్వం. ప్రతి కవిత కందిపోయేలా తొడపాశం పెట్టినట్లుంటుంది. సృజనాత్మకత అంటే ఊహ ప్రధానం కానవసరం లేదు. సమాజం గురించి, వైయుక్తిక జీవితం గురించి ఒక వైరుధ్య కోణాన్ని సూటీగా చెప్పగలగటం కూడా కవిత్వమే. కవిత్వం భాషలోనే కాదు ఒక కొత్త దృష్టి కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయటంలో కూడా వుంటుంది. స్త్రీ మీద అమలయ్యే హింస, చిన్న చూపు, వివక్ష వంటి అంశాలు స్పష్టంగానే కనబడతాయి. కానీ స్త్రీని కీర్తిస్తున్నట్లుగానే కనబడుతూ వెన్నుపోట్లు పొడిచే భావజాల వ్యూహాల్ని, అందుకు సంబంధించిన వాచాలత్వాన్ని పట్టుకోవటం కష్టం. వాటిని ఆమె తీవ్రంగా ఎండగడతారు. అది కవిత్వమైనా, వ్యాసమైనా, కథైనా, సినిమా రివ్యూ అయినా, పుస్తక సమీక్ష అయినా పదునైన వ్యంగ్యం, కసితో కూడిన అధిక్షేపణ ఆమె స్వంతం. ఇక్కడే ఆమెలోని ఆర్టిస్ట్ కనబడుతుంది. భాష మీద పట్టు, నుడికారం మీద అధికారం ఆమెకున్న అదనపు బలాలు.
రాసింది తక్కువైనా ఆమె కవిత్వంలో వస్తు వైవిధ్యం బాగా కనబడుతుంది. ఏదీ ఫీలవకుండానే తెగ వా(గి)డి పడేసే మన బాషా పటాటోపం మీద రాసిన “తప్పదు మరి” అనే ఈ కవిత చూడండి.
“పదాలన్నీ భలేగున్నాయ్
భ్రమల్లో పడేస్తున్నాయ్
ఇదిగొ ఇది “ప్రేమ”
పరిమళాల పొదల వెనుక భయంకర కాలసర్పం
బుసబుసల్లా గుసగుసలు
అదిగో అది “అనుబంధం”
సగం బిగిసి ఆగిన ఉరి
తన్నేసిన బల్ల కాలికి తగులుతూనే వుంటుంది
ఇవేమో “అవకాశాలు”
చేతకానితనానికి
చేవలేనితనానికి సంకేతాలు
అవేమో “సంస్కృతి”, “ప్రగతి”
ఒలకబోసి ఎత్తుకుంటూ
ఒరగబెట్టేస్తామంటూ
ఏమైనా సరే – కవీ
పుట్టేసిన నిరపరాధుల్ని ఇలాగైనా జోకొట్టు
ఇంకొక్క క్షణమైనా”
ప్రజా సంక్షేమం మరిచిపోయిన ప్రభుత్వాల పాలనలో సామాన్య ప్రజలకి శాంతి, విశ్రాంతి రెండూ కరవవుతాయి. అందుకే ఆమె “నా గడియారం గవర్నమెంటెత్తుకు పోయింది” అంటూ ప్రభుత్వాల మీద నేరారోపణ చేస్తారు. మనిషి పోరాటం మరిచిపోతే సహజ శక్తులు కూడా ధ్వంసం అయిపోతాయన్న దృక్పథం నుండి రాసిన కవిత “ఆచరణ” అందుకే ఆ కవిత చివరిలో “గాఢమైన ఆశయం గోడల్ని కూలమంది” అంటారు. మన సావిత్రి గారికి మరో సావిత్రి అంటే మహాభిమానం. అదే మహానటి సావిత్రి! ఆమె గురించి ఎంత వేదన చెందారంటే
“కొండంత వేదనను గుండెలో దాచుకొని
మోసాల మనుషులను మైకాన మన్నించి
…………
తరలిపోయిన తార తరుణి మా సావిత్రి
ఇకనైన పొందుమా విను వీధి విశ్రాంతి”
చెరబండరాజు నిప్పులాంటి కవి కాదు. దోపిడీ ప్రభుత్వాల మీద తానే నిప్పైన కవి. మన చెరబండరాజు కవిత్వానికి అగ్గిరాజు. ఆయన మరణించినప్పుడు సావిత్రి గారు మంచి కవిత రాసారు. “కాలం చావునిస్తే కార్యం మార్పుని తెస్తుంది / రాజుకుంటుంది నువ్వు రగిలించిన నిప్పు / ముంచుకొస్తుంది దోపిడీకి పెనుముప్పు”.
సావిత్రిగారి సమీక్షలు ఒక ప్రత్యేక పంథాలో సాగుతుంటాయి. ఆమె ఒక పుస్తకం తనకి ఎందుకు నచ్చిందో, ఏ అంశం పఠితలపై ఏ విధంగా ప్రభావం చూపించగలదో స్పష్టంగా చెప్పగలరు. రచయితల అనుభవంలోకి, ఊహల్లోకి, థాట్ ప్రాసెస్లోకి ఆమె సులువుగా ప్రయాణం చేయగలరు. సరళమైన పదాలతో పాఠకుల్ని వేలు పట్టుకొని తీసుకెళ్ళగలరు. ఉప్పల లక్ష్మణరావు గారి “బతుకు పుస్తకం” మీద ఆమె రాసిన సమీక్ష ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ 9వ తరగతి విద్యార్ధులకి తెలుగు పాఠ్యాంశంగా వుంది. నవీన్ “అంపశయ్య” మీద రాసిన సమీక్ష కూడా విలువైనదే.
స్త్రీల తరపున ఇంతగా ఎలుగెత్తే బలమైన గొంతుకలు చాలా అరుదు. ఆమె అక్షరాల్ని నిప్పులు చేసి చల్లుకుంటూ వెళ్ళిపోయింది. అందుకు కావలిసిన అగ్నిని తన జీవితం నుండే జ్వలింపచేసింది. తన సాహిత్యానికి, వ్యక్తిత్వానికి తేడా లేకుండా జీవించింది. మరీ చెప్పాలంటే తన సాహిత్యం కంటే ఉన్నతమైన వ్యక్తిత్వంతోనే జీవించింది. అందుకు ఆమె రాసిన ఇతర వచన రచనలు “స్వాతంత్ర్యానంతరం స్త్రీ స్వేఛ్ఛ”, “స్త్రీల కోసం అంటే”, “అపర వశిష్టులు”, “వంటింటి సహిత్యం”, “కోడరికం – ఇల్లరికం”, “మగవాళ్ళ సమస్యలు”, “సాహిత్య పోలీసులు” తార్కాణంగా నిలుస్తాయి. ఈ వ్యాసాల్లోని తిరుగులేని తర్కం ఆమె వ్యక్తిత్వం నుండి, హృదయ సంస్కారం నుండి వచ్చినవే అని మనకి అర్ధం అవుతుంది.
మానవసంబంధాల పట్ల ప్రేమ ఆమె ప్రేమ అపారం. అక్షరాల్లో ఎంత నిప్పులు కక్కినా ఆమె గొప్ప స్నేహశీలి అని, మంచి హాస్య చతురత కలిగిన వ్యక్తి అని, తాను నవ్వకుండా ఇతరుల్ని నవ్వించగలరనీ ఆమెని బాగా ఎరిగిన మిత్రులు చెబుతుంటారు. తన తల్లి గురించి బాగా మాట్లాడేవారని కూడా మిత్రులు చెబుతుంటారు. సావిత్రిగారు తన తల్లి జీవితగాధని రాయటానికి పూనుకున్నారు కానీ పూర్తి చేయలేక పోయారు. ఆమె అది పూర్తి చేసి వుంటే నిజంగా తెలుగు సాహిత్య లోకానికి గొప్ప క్లాసిక్ లభించి వుండేది. ఆ అసంపూర్ణ రచన కూడా ఈ పుస్తకంలో వుంది. సావిత్రిగారి సాహిత్యానికి ప్రధాన ప్రేరణ పితృస్వామ్యపు పదఘట్టనల కింద నలిగిపోయిన ఆమె తల్లి జీవితమే. తన వ్యక్తిగత జీవితంలో చేసిన పోరాటమే కాదు తల్లి జీవితం మిగిల్చిన వేదన కూడా ఆమె అక్షరాల్లో ప్రతిఫలించేది. తల్లితో తన అనుబంధాన్ని ఆమె ఒక చోట ఇలా వివరించారు.
“మనిషికి వుండల్సిన కనీసపు అవసరాలు వేటికీ నోచుకోక, మధ్య యుగపు బానిస కంటే హీనాతిహీనంగా కోడరికంలో, తప్పించుకునే మార్గం లేని మాతృత్వపుటూబిలో కూరుకుపోయి కూడా చిన్నప్పటి పెదబాలశిక్షనీ, రింగురింగుల బొంగరాన్నీ, పంతులు గారికి చాడీలు చెప్పడానికి ఆయనింటి మీదకి పల్టీలు కొట్టుకుంటూ బయల్దేరిన గాలిపటాన్నీ కమ్మని కంఠంతో పిలుస్తూ ప్రతి రాత్రీ పలక పట్టుకొని బళ్ళోకెళ్తున్నట్లు కలలు కనే మా అమ్మ – బుచ్చి సీతయ్యమ్మ గారు- ఐదో ఏడు వచ్చేటప్పటికి అక్షరాలన్నీ నేర్పించి – అది మొదలు అనుదినం నా మంచి, సుఖమూ, శాంతి కోరుకున్న నా కన్నతల్లి నా తొలి గురువే కాదు నా తొలి నేస్తం, తొలి భ్రాత, తొలి గ్రంధం, తొలి పాట, తొలి బొమ్మ కూడా మా అమ్మే నాకు.
అలసి పోయేటప్పుడు పట్టే నిద్ర, గుండె భారమైనప్పుడు వచ్చే కన్నీరు, అవమనం కలిగినప్పుడు నా నిరసన తెలపడానికి వచ్చే జ్వరమూ, దాన్ని తగ్గించుకోవాలని నేననుకుంటే ఔషధమూ, లేచి తిరగాలనుకుంటే అన్నమూ, అది సహించదనుకుంటే అనుపానమూ, ఆ తర్వాత నిద్ర రాకుండా చెప్పించుకునే కథా – అన్నీ మా అమ్మే.”
చూసారు కదా తన హృదయాన్ని బహిర్గతం చేయగల వచనం ఆమె స్వంతం. ఈ సంపుటిలో ఇంకా సావిత్రిగారిని బాగా తెలిసిన మిత్రులు రాసిన నివాళి వ్యాసాలు కూడా వున్నాయి. ఆమెతో వ్యక్తిగత అనుబంధం వున్న వాడ్రేవు చిన వీర్భద్రుడు, కృష్ణాబాయి వంటి వారు, ఆమెకి చివరి రోజులలో ఆశ్రయమిచ్చిన టి. శ్రీనివాసరావు వంటి వారు రాసిన వ్యాసాల ద్వారా ఆమె గొప్ప వ్యక్తిత్వం ఆవిష్కృతమౌతుంది. ఈ పుస్తక పరిచయాన్ని సావిత్రి గారి గురించి టి.శాంతకుమారిగారు రాసిన నివాళితో ముగిస్తున్నాను.
“సావిత్రీ!”
“యమధర్మరాజా!”
“నీ నిజాయితీకి మెచ్చితిని….
ఏదేని ఒక్క వరము కోరుకొనుము
ప్రసాదించెదను”
“స్త్రీ విముక్తి ప్రసాదించండి స్వామీ”
“అహో! అసాధ్యము. అది దక్క వేరొక్క వరము కోరుకొనుము”
“అయిన పురుషాధిక్య నాశనము స్వామీ!”
“అబలవనీ, క్షయరోగివనీ మిన్నకున్న
పురుషుడినని మరచి నన్నునూ అవమానించుచుంటివా?
అయిననూ నీ సాహసమునకు మెచ్చి ఒక్క వరమిచ్చెదను. కోరుకొనుము.
అదియునూ స్త్రీ విముక్తి దక్క!
“యమధర్మరాజా!”
“ఏమి సావిత్రీ?”
స్త్రీ విముక్తి ప్రసాదించలేని మీకు నేనే ఒక వరమిచ్చుచున్నాను. స్వీకరించుడు.”
“ఏమది సావిత్రీ?”
“నా విముక్తి స్వామీ!
నా ప్రాణములనే మీకు ప్రసాదించుచున్నాను.”
(“ఆమె అస్తమించ లేదని… ” కవి సావిత్రి స్వీయ రచనల, స్మృతి రచనల సంపుటి. సంపాదకుడు: అరణ్య కృష్ణ. వెల: రూ.150/-)