ముంగుర్ల జుట్టు తో బక్క పల్చటి పొట్టి మనిషి వేదికనెక్కి పాడుతూ దుంకి ఎగురుతుంటే మేఘం వర్షించినట్లుంటుంది. ఎక్కడ బెసికి కింద పడతాడో అనే అనుమానం కాస్త భయంగా మారి బిక్కు బిక్కుమంటూ జనం అతని ప్రదర్శనను తిలకిస్తూ ఉంటారు. అతని జీర గొంతులో నుండి జాలు వారే రాగాల స్వరాలు ప్రజల దైనందిన సమస్యలను శ్రోతల మనసులకు తాకేట్లు పాడుతూ తల అటు ఇటు తిప్పుతూ ఉన్నట్లుండి ఒక్కసారే ఉరిమినట్లుగా ఎగిరి గంతేసి ప్రజలను లడాయికి సిద్ధం చేస్తాడు. ఇంతకీ ఎవరు ఆ బహు రుపుల కళాకారుడెవరు? ఊర్ల నుండి దూరంగా జరపబడ్డ వెలివాడలో తునకల సియ్య దండలతో పల్లె జనం పదాలను పోగేసి ఊరికి వాడకి పాటల దండను అల్లిన ఆదూరి బ్రహ్మయ్య అతను. సుదీర్ఘ విప్లవ రాజకీయ నేపథ్యం ఉన్న వెలిదండ గ్రామం లో 12 జనవరి 1970 నాడు ఆదూరి బంగారమ్మ – వెంకయ్య దంపతుల ఆరో కడుపు పంట మన బ్రహ్మయ్య.
వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి వెలిదండ గ్రామం కేంద్రంగా ఉండేది. నాటి నుండే ఆదూరి వెంకయ్య గారు కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా ఉంటూ దళాలకు ఆహారం అందించేవారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి ఇప్పటి వరకూ ఆ కుటుంబం ఎర్రజెండాకి అండగా ఉంటూ, ప్రజల సమస్యల పై గొంతు విప్పుతూ నూతన సమాజ నిర్మాణ కృషిలో భాగమై ఆదర్శంగా జీవిస్తున్నారు. బ్రహ్మయ్య పెద్దన్న, చిన్నన్నలు ఇద్దరి పేర్లు పెద్ద కోటయ్య, చిన్న కోటయ్య వరుసగా. పెద్ద కోటన్న నక్సల్బరీ రైతాంగ ఉద్యమ స్పూర్తితో ప్రారంభమైన సి.పి.ఐ (ఎం.ఎల్) పార్టీ తొలి తరంలో, నాయకుల్లో ఒకరు. బ్రహ్మయ్య చిన్ననాటి నుండే ఊళ్ళో జరిగే విప్లవకర చర్చల్లో పాల్గొంటూ తన పెద్దన్న దారిలో నడుస్తున్న క్రమంలో గ్రామంలో మిత్ర కమ్యూనిస్టు పార్టీ నుండి అనేక దాడులు జరుగుతుండేవి. ఈ దాడులను వ్యతిరేకిస్తూ అప్పటి వరకు మిత్ర బృందంలో ఉన్న వెంకయ్య గారు, చిన్న కోటన్నలు కూడా సి. పి . ఐ (ఎం. ఎల్) పార్టీ నిర్మాణంలో చేరి కుటుంబం అంతా పార్టీ కి ఆయువు పట్టు అయింది. కోటన్న ముప్పై సంవత్సరాలు గ్రామ ఎం.ఎల్ పార్టీకి కార్యదర్శి గా సేవలు అందించారు. ప్రస్తుతం తన జీవిత సహచరి పద్మక్క గ్రామ సర్పంచ్ (న్యూడెమోక్రసీ). హుజూర్ నగర్ తాలూకాలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమం, జీతగాళ్ల సమస్యల మీద, నాటు కూలీల సమస్యల మీద జరిగిన పోరాటాల్లో నిక్కరు తొడిగే వయసు నుండే బ్రహ్మయ్య భాగస్వామి అయినాడు.
ఈ గ్రామం నుండి అనేక మంది యువకులు విప్లవోద్యమంలోకి వచ్చారు. వారిలో కామళ్ల ప్రతాప్, రాయి కృష్ణ మట్టయ్య, కందుల జానయ్య, కామళ్ల జయరాజు, ధైర్నప్ప, వల్లపుదాసు రామస్వామి, రాజు, ఆదూరి శ్రీను, ఇలా చానా మంది ఆ గ్రామం నుండి అరుణోదయ బృందంగా రాష్ట్ర వ్యాపితంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఇస్తూనే ఉన్నారు. వెలిదండలో కామ్రేడ్ వి.కె రాసిన “అలజడి” తో మొదలైన బ్రహ్మయ్య అడుగులు ఆదూరి బ్రహ్మయ్య గా మరి పైలం సంతోష్ గా మార్పు చెందారు.
ఈ నాగరిక ప్రపంచంలోని అన్యాయాలతో యుద్ధం చేయటానికీ కవులు, కళాకారులు, రచయితలు ఎన్ని త్యాగాలకైనా సిద్ధం కావాలి అంటూ ఆప్టిన్ సింక్లెరు రచయితల కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. నిజానికి రాజాకీయ భావజాల ప్రచారంలో కవులు, కళాకారులు కీలకం. వారి ప్రమేయం లేకుండా మనం ప్రజల వద్దకు పోయి ఏ రాజకీయాలు చెప్పినా అంత సులువుగా అర్ధం కావు. కాలం మారిపోతున్నా, దోపిడీ రూపాలు మారిపోతున్నా సంతోష్ లో ఎక్కడా కొంచెమైనా అరమరికలు లేకుండా తన ” పాటల ఊట “తో జీవనం కొనసాగించారు. కళ విషయం ఎలా ఉన్నా, సమాజామే కళాకారున్ని సృష్టిస్తోంది అన్నట్లు సమాజం తన పురోగతి కోసం తన కష్టాలను చెప్పుకోటానికి బ్రహ్మయ్యని సృష్టించింది. దానికి మార్క్సిజం- లెనినిజం – మావో ఆలోచన విధానం ప్రామాణికం అయింది.
పెన్పహాడ్ మండలానికి ఆర్గనైజర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సంతోష్ అంచెలంచెలుగా ఎదుగుతూ అరుణోదయ సాంస్కృతిక సంస్థకి రాష్ట్ర కార్యదర్శి గా ఎదిగారు. అరుణోదయ రామారావు, విమలక్క, గద్దర్, నాగన్నలతో అనేక వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చారు. రాతగాడు, పాటగాడు, ఆటగాడు. నగరే నగారే, జజ్జనకారి జనారేతో పుల్లారెడ్డి ఏడని వెతుకుంటూ రంగవల్లి అమరత్వంతో సమరత్వాన్నికి సమయాత్తం కావాలని ఆడి పాడినాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కోదాటి శ్రీను రాసిన ‘‘ఉండు పైలం ఉండు అమ్మ మాయమ్మ..’’ పాటకి తన గొంతుతో జీవం పోశాడు. ప్రజా తెలంగాణ తన లక్ష్యం అది నూతన ప్రజాస్వామిక విప్లవంలో ఒకా భాగంగా చూసిండు కనుక ప్రజలను ‘‘ప్రజా తెలంగాణకై రండనో మీరు రండనో ప్రాణం అయినా ఇద్దాం మీరు లెండక మీరు లెండన్న…’’ అని తనదైన సహజ సిద్ధ ప్రజల భాషల్లో వారి హృదయానికి ఉద్యమ నేపధ్యం తాకేలా గంతులేసేవాడు.
సంతోష్ కి వెలిదండతో పాటు దుగినెల్లి గ్రామంతో కూడా అవినాభావ సంబంధం ఉంది. తన జీవన ప్రయాణంలో అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నాడు . ఎత్తు పల్లాలను చవిచూశాడు. అయినా ఎక్కడ ఎవరి మీద విమర్శ లేకుండా భౌతిక వాద దృష్టితో పరిశీలిస్తూ తన కార్యాచరణలో భాగం అయ్యాడు. తన సహచరి మంగతో కలిసి దుగినెల్లిలో 15 సంవత్సరాలుగా అక్కడే జీవిస్తున్నాడు. మంగక్క వాళ్ళది అదే గ్రామం. తానూ ఎక్కడ ఉన్న తన రాజకీయ కర్తవ్యమైన నూతన ప్రజాస్వామిక విప్లవం గురించి దాని మార్గంలో ఉన్న సంస్థలతో చెలిమి చేయటం, విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు. స్త్రీల సమస్యలైనా, విద్యార్థి-యువజనుల సమస్యలైనా, రైతు-కూలీలా సమస్యలైనా, జాతి విముక్తి పోరాటాలైన ప్రతి అంశం మీద చలించి , స్పందించి, రాసి పాడేవాడు. రాయటం, పాడటం, అభినయం చేయటం గద్దర్, వంగపండు తర్వాత మన సంతోష్ కే అబ్బింది.
బూర్జువా సమాజానికి ప్రాణ వాయువు “డబ్బు”. ఈ డబ్బు మనబోటి వారికి రోజు వారి కనీస అవసరాలు తీర్చటానికి నానాయాతన పడుతాము. తానూ నమ్ముకున్న విప్లవోద్యమం అనేక చీలికలు పీలికలు కావటం, స్తబ్దత నెలకొనటం, విశ్వాసం కలిగించే నాయకత్వం దొరక్కపోవటం అనేకానేక కారణాలతో సంతోష్ కూడా ఎంతో సంఘర్షణ కు లోనయ్యాడు. ఏమి చేయాలి, బతుకు బండి నడపటం కష్టమైంది. అనేక మంది మిత్రుల సూచనతో తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగిగా చేరి కుటుంబంతో ఉంటూ జీవితం సాగిస్తున్న సంతోష్అ నుకోకుండా అనారోగ్యానికి గురయ్యాడు. లాక్డౌన్ లో కరోనా సోక కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజల భాషలో పాట రాసి ఆల్బం చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు. ‘‘రాఖీ పండగ వచ్చే మీరందరు రావాలి’’ అని తన అక్క చెల్లెల్లను పాట రూపంలో కోరాడు. వలస కార్మికుల ఛిద్రమైన బ్రతుకులను తన పాటలో కండ్లకు కట్టినట్లు చూపించాడు. తానూ ఒక సహజ సిద్ద కళాకారుడు. పొడుస్తున్న పొద్దు మీద చిర్రా చిటికెన పుల్లతో దరువు వేస్తూ దండోరా వేస్తూ వెలిదండ నుండి నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన మట్టి పరిమళం. అనారోగ్యంతో ఉన్న సంతోష్ ని కాపాడుకోటానికి తన చిరకాల మిత్రులు విశ్వ ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. అనారోగ్యం తో అర్ధంతరంగా ఆగిపోయిన ఆ పాట, మాట ప్రజల మదిలో ‘పైలం’.
జోహార్లు పైలం సంతోషన్నకు. వర్ధిల్లాలి ప్రజా కళలు.