“అందరిలా నా నిరీక్షణలో నీవు అలసిపోకు
నేను తిరిగి వస్తాను – నిరీక్షించు” – అంటారు వరవరరావు. నిరీక్షణ… అదో అంతులేని తృష్ణ. గుండెలోతుల్లోంచి పుట్టే తీవ్రమైన కోరిక. మృత్యువునూ ఎదిరించగలదు. మరణాన్నీ శాసించగలదు. నిర్భంధాన్ని నిశ్శబ్ధంగా నిర్వీర్యం చేయనూగలదు.
శిశిరం ఆకులతో పాటూ ఆశలనూ రాల్చాలని చూసినప్పుడు కూడా మనం నిరీక్షించాలని ఆదేశిస్తారాయన. ”ఇప్పుడు గాయపడ్డ నేలంతా సరికొత్త పాటలల్లుతోందంటూ, పోరాట గాథల్లో వాళ్లు మళ్లీ వస్తారంటూ” పల్లపు స్వాతి తన తొలి కవితా సంకలనం “మోదుగ పూల వాన”లో కవిత్వీకరిస్తోంది.
“వాళ్లు వస్తారు
తడారిన భూముల గుండెల్ని తడిపేందుకు
ఎండిన బతుకుల్లో వసంతాల్ని పూసేందుకు
వాళ్లు మళ్లీ వస్తారు
ఎర్ర సెలకల్లో కురిసే మోదుగుల వానలా”… అంటున్న స్వాతి కవిత్వం “తిరిగివస్తాను… తిరిగి లేస్తాను… నాకోసం ఎదురుచూడు” అని వాగ్దానం చేసిన విప్లవ కవి శివసాగర్ ని గుర్తుతెస్తుంది.
కారుమబ్బులు అవనిలోని వెలుతురుతోపాటూ నింగిలోని తారలనూ మింగేసినప్పుడు నిరీక్షణే మిణుగురవుతుంది. ఆశలు తోకచుక్కల్లా రాలిపోయే ఘడియల్లోనూ ఆ నిరీక్షణే మన గుండెగూటిలో నమ్మకవుతుంది. జీవితాలు పేకమేడల్లా కూలిపోతున్న సమయాల్లో ఆ నమ్మకమే మెదడులోకి జొరబడి ఎర్రసూరీడిని నిద్రలేపుతుంది. ఎదిరించే ధైర్యమవుతుంది. చీకటిలో చిరుదివ్వె అవుతుంది. నిశిధీలో వెలుగవుతుంది.
నిరీక్షణ ఓ నమ్మకం. నిరీక్షణ ఓ ఆయుధం. నమ్మకమే ఆయుధం. అది ట్రిగ్గర్ పై వేళ్లతో అట్టడుగు జీవితాల్లో అలుపెరుగని వెన్నెలై సెంట్రీకాస్తుంది. ఎర్రటి నిప్పురవ్వలా రూపాంతరం చెంది చీకటి బతుకుల్లో వెలుగుపూలు పూయిస్తుంది. ఎదురుచూపుల్లో ఉన్న బలమలాంటిది. నిరీక్షణలో ఉన్న సాంధ్రత అలాంటిది.
పోరాట శక్తులపై, నమ్మిన సిద్దాంతాలపై మనకున్న నమ్మకమే నెత్తురోడిన అడవుల్లో విత్తనమై మొలకెత్తుతుందని చెబుతుంది స్వాతి. రాజ్యరక్కసి కోరలు విరుస్తూ కోట్లాది ఎర్రమందారాలు వికసించేలా చేస్తుందంటుంది.
నిరీక్షణలో బలీయమైన ఆశ ఉంది. అలుపెరుగని ప్రగాఢ విశ్వాసముంది. సిద్ధాంత బలముంది. పోరుబాటపై చిందిన ప్రతి రక్తపు బొట్టూ పోరాట యోధుడిగా మారుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తూ విప్లవోద్యమాలపై తనకున్న గౌరవానికి అక్షర రూపమిచ్చింది స్వాతి.
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నేరమా? అని రాజ్యాన్ని ప్రశ్నిస్తూ…
“కుటిల కుతంత్రాల రాజ్యమా…
నీ చీకటి కుట్రలు సాగవిక
తూర్పున ఉషోదయమవుతోంది” అంటూ హెచ్చరిస్తుంది.
నిజమే, సముద్రాలకు నిర్బంధాలు కొత్తేమీ కాదంటుంది. కానీ సముద్రాన్ని ఎప్పటికీ నిర్భంధించడం నీకు సాధ్యమా? అని రాజ్యాన్ని ప్రశ్నిస్తుంది. ఉదయించే సూర్యుణ్నీ, ఉప్పొంగే కెరటాల్నీ ఆపగలరేమో ప్రయత్నించండి చూద్దాం అని సవాల్ విసురుతున్నట్టుగా ఉంటుందీ కవిత.
ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రజాగ్రహాలు, భీకర పోరాటాలు ఏళ్లుగా సాగుతున్న అణచివేతలకు, వెతలకు నిదర్శనం. వారి కన్నీటి సంధ్రాలు, నెత్తుటి ప్రవాహాలు, త్యాగాలు రేపటి బంగారు భవిత కోసం. ఏ స్వార్ధమూ లేని, ఏ పదవులూ ఆశించని అచ్చమైన, నిఖార్సైన త్యాగం వారిది.
అటువంటి త్యాగశీలులు ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలని కోరుతుంది స్వాతి. వ్యవస్థతో యుద్దమంటే పులిస్వారీ లాంటిది. ఈ స్వారీలో నిర్బంధాలను ఎదిరించాలి. అణచివేతలనూ తలదన్నే ఎత్తులు వేయాలి. మండే సూరీడి సాక్షిగా ఎర్రజెండా రెపరెపలాడించాలి. వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తూనే ఉండాలి. ఏమరుపాటుకు తావులేదంటుంది.
కళ్యాణరావు ఇంతకు ముందు చెప్పినట్టు స్వాతిది విప్లవ హృదయం. కవిత్వం ఊహల్లోంచి పుట్టుకొచ్చింది కాదు. ఉద్యమాల్లో పురుడుపోసుకుంది. పోరాటాలపట్ల ఆమెకున్న అంతులేని ప్రేమ, అవిభాజ్యమైన అనుబంధం ప్రతి కవితలోనూ కనిపిస్తాయి. ఎప్పుడైనా చేయాల్సింది రాజీలేని యుద్ధమే అని చెబుతుంది స్వాతి. పోరుబాటలో పయనించే విప్లవ వీరులు చల్లగా ఉండాలని కోరుతుంది. అలజడి లేకుండా ఉప్పెనలు పెల్లుబికవచ్చని హెచ్చరిస్తూనే… ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే అని కవితాత్మకంగా చెబుతుంది.
“నువ్వో
నేనో
ఎప్పుడో ఒకప్పుడు
ఏ అర్థరాత్రో మాయం చేయబడతాం”… చదువుతుంటే మన జీవితాలు ఇంత క్షణభంగురమా అనిపిస్తుంది. ఏ తెల్లవారుఝామునో రక్తసిక్తమైన నీ దేహం జిల్లా టాబ్లాయిడ్ లో సింగిల్ కాలం వార్తవుతుంది అన్న పంక్తి మనల్ని ఆలోచింపజేస్తుంది. మన బతుకులను తమ చేతుల్తో శాసించే వారిపై కోపం కట్టలు దాటుతుంది. పిడికిలి బిగుస్తుంది.
స్వాతికి అక్షరాలపై ఉన్న ప్రేమ అపారమైనది. విప్లవం కవిత్వమైన వేళ ఆ అక్షరాలకు ఎర్రసిరా అద్దింది స్వాతి. ఒక కవి అదీ విప్లవోద్యమంలో భాగమైన స్వాతి రాసే అక్షరాల్లో తీరని ఉద్వేగముంది. అవి మనల్ని పలకరిస్తాయి. ప్రశ్నిస్తాయి. బలహీనవర్గాల వెతలను కళ్లముందుంచుతాయి. కంటతడిపెట్టిస్తాయి. ఆలోచింపజేస్తాయి. నమ్మకాన్ని నింపుతాయి. పోరుబాటపై ప్రయాణించేలా చేస్తాయి.
“మా అమ్మ పగిలిన పాదాల్లో కన్పించే
మట్టి గుండెల అలజడి నాలో పొటెత్తే సంద్రమయింది” అంటుంది స్వాతి.
శివరాత్రి సుధాకర్ సాహచర్యానికి ముందు ఆమె భూమిబిడ్డ. మట్టిని అన్నంగా మార్చే కుటుంబ నేపధ్యం. భూమిపై తన ప్రేమ దాదాపు అన్ని కవితల్లో కనిపిస్తూనే ఉంటుంది. అచ్చమైన తెలంగాణా మాండలికంలో సాగే స్వాతి కవిత్వం చదువుతున్నంతసేపూ తొలకరి జల్లుల్లో తడిచిన వెచ్చటి భూమి వాసనేదో గుప్పున చుట్టేసినట్టుగా ఉంటుంది. ఆరుద్ర పురుగులు రేగడు భూములను వదిలి అలవోకగా కవితాక్షరాలలో ఒదిగిపోయినట్టూ మిణుగురులు రివ్వున ఎగురుతూ వెలుగులను కవిత్వంలో నింపినట్టూ అనిపిస్తుంది.
“కాగితంపై వాలిన
అక్షరమిప్పుడు
కన్నెర్రజేసింది
ధగాపడిన నేలలా
పేగుబంధం తెగిన తల్లిలా” అంటున్న స్వాతి అక్షరాలు బాధితవర్గానికి ప్రతీకలు. స్వాతి కవితల్లో ప్రకృతి ప్రేమతోపాటూ పీడిత వర్గాలపట్ల ఆవేదన మిళితమై ఉంది. సమకాలీన విప్లవోద్యమాలను అణచివేస్తున్న రాజ్యంపై ఆగ్రహం ఉంది. భూమిబిడ్జల వెతలున్నాయి. మాయమైపోతున్న అడవిబిడ్డల మూగ రోదనలున్నాయి.
స్వాతి అక్షరం ప్రజలది. బాధితపీడిత వర్గానిది. గొంతెండుతున్న జనం కన్నెర్రజేయాలంటుందీ అక్షరం. ధగాపడ్డ నేల అగ్గిపాటలందుకోవాలంటుంది. వెన్నెలదారుల్లో సాయుధ క్షేత్రానికి సాగాలంటూ పిలుస్తుంది. ధ్వంస విధ్వంసాల్లోంచి దిక్కులు పిక్కటిల్లేలా యుద్ధఢంకా మోగించాలని కోరుతుంది. గాయ పడ్డ గుండె ఏం చేయాలో చెబుతుంది.
“కాగితంపై గాయపడ్డ
అక్షరమిప్పుడు
సాయుధమై యుద్ధక్షేత్రానికి సాగిపోయింది”.
అవును, ఇప్పుడు చేయాల్సింది రాజీపడడమో రాలిపోవడమో కాదు. స్వాతి కోరుతున్నట్టు గాయపడ్డవారంతా ఏకమవ్వాలి. ఎదిరించాలి. తిరగబడాలి. మర్లబడాలి. మనం ఎప్పటికైనా చేయాల్సింది యుద్ధమే. రాజీలేని పోరాటమే.
(“మోదుగ పూల వాన” పల్లపు స్వాతి కవిత్వం. విప్లవ రచయితల సంఘం ప్రచురణ. పేజీలు: 50. వెల: రూ.30/-. ప్రతులకు: ప్రజాశక్తి, సహచర, నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్)