చలం అచంచలం: అరుణ

‘అరుణ’ చలం రాసిన ఆరో నవల. ఈ నవలని చలం 1935లో రాశాడు.   చలం రాసిన అన్ని నవలల్లానే ఇది ఒక చిన్న నవలే.  ఈ నవలని కూడా చలం ఉత్తమ పురుష (ఫస్ట్ పర్సన్)లో రాయడం జరిగింది.  కథ చెబుతున్న పాత్ర పేరు పీటర్.  “అరుణ” రాసినప్పుడే లేదా రాస్తున్న కాలంలోనే చలం  బహుశా అరుణాచలం వైపు దృష్టి సారించాడేమో అనిపిస్తుంది.  అందుకు సంబంధించిన హింట్ మనకి ఈ నవల ముగింపులో కనిపిస్తుంది.  స్త్రీ పురుష సంబంధానికి సంబంధించిన సున్నితమైన, తడియారని, హృదయాన్ని మురిపించే అందమైన, అద్భుతమైన భావోద్వేగాలకు గొప్ప అక్షర రూపం ఈ నవలలో మనకి కనిపిస్తుంది.  అంత మహాద్భుతమైన చిత్రణ మనకి మరో చోట దొరకదు కాక దొరకదు.

కథ:

ఈ నవల మొత్తం ఒకట్రెండు రోజుల కాలంలో జరిగే సంఘటనల సమాహారం.  కథగా చూస్తే చాలా చిన్నది.  చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు.  ఒక స్త్రీ తన “సోల్ మేట్” కోసం చేసే ఒక విఫల, నిష్ఫల ప్రయాణంగా చెప్పొచ్చు.  ఆమె అనిశ్చితి నుండి, అశాంతి నుండి, అసంతృప్తి నుండి డెస్పరేట్ గా బైటికొచ్చి శాంతి కోసం, ప్రేమ కోసం అన్వేషణ చేసేదాన్లా వుంటుంది.  ఆ ప్రయాణంలో ఆమె సౌందర్యం వల్ల ఆకర్షితులైన ప్రేమికుల వంటి ఆరాధకులు, ఆమెని అర్ధం చేసుకొని, ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించినా చివరికి సమాజానికి, దాని కట్టుబాట్లకి తలవంచే కథానాయకుడు…మనకి ఈ నవలలో కనిపిస్తారు. వారితో ఆమె ఇంటరాక్షనే ఈ నవల సారాంశం.  ఆమె అరుణ.  

ఈ కథని పీటర్ చెబుతుంటాడు.  (ఈ పేరుని చలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తాడు.  మిగతా నవల మొత్తం అతన్ని ఆ పేరుతో ఎవరూ అతన్ని పిలవరు.  ఆ పేరుకి పెద్ద ప్రాధాన్యత లేనట్లుగా మనకి అనిపిస్తుంది కానీ చలం ఒక మతానికి చెందిన ఆ పేరుని ఎంతో భావ స్ఫోరకంగా ఉపయోగించాడు.)   అతను ఓ టీచర్.  అవివాహితుడు.  అతనికి పుస్తక పఠనం, సినిమాలు మంచి కాలక్షేపం.  అతనికి గతంలో అరుణ పరిచయమే కాదు ఆమెతో ఒకానొక అందమైన రాత్రి ఒక గొప్ప శృంగారానుభవం వుంటుంది.  ఆమె అతనికి హఠత్తుగా దర్శనమిస్తుంటుంది.  మళ్లీ వెళ్లిపోతుంటుంది.  “ఇదుగో వస్తానని – వొదలలేక వొదలలేక బండి ఎక్కుతుంది.  మళ్లీ ఏ రెండేళ్లకో దర్శనం. – ఏ ఆరు నెలలకో ఉత్తరం” అంటాడు పీటర్.  కానీ ఆమె సాన్నిధ్యం అతనికి ఎప్పుడూ తాజాగానే అనిపిస్తుంటుంది. పీటర్  కి ఆమె అంటే ఎంత గౌరవమో ఆమె సౌందర్యం పట్ల అతనికున్న ఆరాధనాభావం కూడా చెబుతుంది – “జీవితమంతా ముళ్లలోంచి, దుమ్ములోంచి, ద్వేషాల్లోంచి, నిందల్లోంచి, అపనిందల్లోంచి ఇంత నిర్మలంగా నడిచి శుభ్రంగా, పవిత్రంగా ఉండగలిగే వారు అరుదు.తామరాకు మీది నీటి బొట్టు.  ఆకుల్లోంచి కిందకి జారే వెన్నెల రేఖ! నడిచిన చోటనల్లా హృదయాల మీద అడుగులు పెడుతూ వెడుతుందంటే ఒక చింతా!  తీవ్రమైన వాంఛ నా కళ్లకి పొరలు కప్పక పోవడం చేత ఆమె అందాన్ని చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను” అంటాడు. ఆమెతో మొదటిసారి గడిపినప్పటి విషయం జ్ఞప్తికి తెచ్చూంటూ “ఆ మొదటి రాత్రి ఆమె నా కళ్లల్లోకి కాక, బృహస్పతి వైపు చూడడం, ఆమె కనుపాపాపల్లో ఆ నక్షత్రకాంతి ప్రతిఫలించడం భరించలేకపోయాను – ఆ రెండో పక్కన పట్టు జంపఖానా ఆమె వీపుని తాకడం సహింపలేక, అన్ని వైపులా నేనే కావడానికి ప్రయత్నించాను” అంటాడు.  ఆమెకి ప్రేమికులు అనేకులు.  కానీ ఆమెకి ఎవరూ వున్నట్లు కనిపించదు.  కానీ పీటర్ అంటే అభిమానం.  ఆమె అతన్ని హత్తుకున్నప్పుడు “ఇదంతా కొత్తగా మొదటిసారి కాకూడదా?  కానీ ఎన్ని సార్లైతేనేం?  ఆమె రొమ్ముకి వొత్తుకోవడం?  కృతజ్ఞత!  యెండరు తపస్సు చేస్తున్నారో ఆ అదృష్టం కోసం.  నేనెరిగిన వాళ్లని లెక్క పెట్టనా?  మేము ఎక్కుతున్న మెట్టుమెట్టుకీ ఒక్కరు చొప్పున!” అంటాడు.  ప్రేమలో నిజాయితీతో కూడిన కాంక్ష అనండి లేదా భావోద్వేగం అనండి – దాని తీవ్రత ఎంతటి శక్తివంతమైన పాత్ర పోషిస్తుందో ఈ వాక్యాలు తెలుపుతాయి.   

కథ ఇలా మొదలవుతుంది.  ఒక రోజు తన దోవన తను తలుపు గడియ పెట్టుకొని పుస్తకం చదువుతుండగా అరుణ వేరే వూరు నుండి వచ్చి సరాసరి అతని గదిలోకి ప్రవేశించి అతన్ని నిర్ఘాంతపరుస్తుంది.  తాను తలుపు మూసి వుంచినా ఆమె వచ్చినందున ఆ వచ్చింది దెయ్యమేమోనని అతను సంశయిస్తాడు.  అప్పుడు అరుణ స్పష్టపరుస్తుంది తలుపు గడియ పెట్టుకోకుండానే అతను పైన వున్న తన గదిలోకి వచ్చినందున తాను లోపలికి రాగలిగానని.  ఆమెలోని అతన్ని ఆశ్చర్యపరిచే డైనమిజానికి, అనుహ్య స్వభావానికి ఆమె ప్రవేశ ఘట్టమే సాక్ష్యం.  ఆమె అతని వెనుకగా వచ్చి నవ్వుల్ని వినగానే, ఆమె రాసుకున్న నూనె పరిమళాల్ని ఆస్వాదించగానే చూడకుండానే ఆమెని పసిగడతాడు. “గంటల గంటల మోస్తరు నవ్వు-సహారాలో వొంటెల మెళ్లో గార్డెన్ ఆఫ్ అల్లా సినిమాలో విన్న గంటల చప్పుడు జ్ఞాపకం తెచ్చే నవ్వు” అని వర్ణిస్తాడు (అదీ 1935లో).   స్త్రీకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఒక అనుభూతిగా, భావోద్వేగంగా మార్చుకోవడమే కదా ఒక పురుషుడి ప్రేమంటే అనిపిస్తుంది ఈ వర్ణన చదివాక. ఆమె ఎంత నిస్సంకోచ ధోరణిలో సన్నిహితంగా మెలిగినా పీటర్ ఆమె పట్ల అబ్బురంగా చూస్తాడే తప్ప, ఆమె అనూహ్య ప్రత్యక్షానికి, సద్యస్ఫూర్తికి ఫిదా అవుతాడే తప్ప ఆమె పట్ల చలించడు.  మనిషి వచ్చీ రాగానే తనకి పరిచయం వున్న ఒక వ్యాధిగ్రస్తుడైన స్నేహితుడికి ఉత్తరం రాసి పోస్టు చేయమని పీటర్ కి ఇస్తుంది.  మరికొద్ది సేపట్లో మరో వ్యక్తి వస్తాడు.  అతను వచ్చినా తలుపు తీయొద్దని ముందుగానే చెబుతుంది.  ఆ వచ్చినతని అసలు పేరు ఏమిటో కానీ అరుణ అతనికి పెట్టిన పేరు బీస్ట్.  అతను అరుణ ప్రేమికుడు.  తానిక్కడ వున్నట్లు అరుణ చెప్పకపోతే అతనెలా రాగలడు?  తెల్లవారిన తరువాత నైజాం నుండి అమీరుద్దీన్ అనే మరొకతను కూడా దిగబడతాడు. అతన్ని అరుణ “నాగన్” అని పిలుస్తుంటుంది.  అతనూ అరుణ ప్రేమికుడే.  నవలలో చాలా భాగం బీస్ట్ కి నాగన్ కి మధ్యన అసూయతో జరిగే తగాదాలుంటాయి.  ఇద్దరికీ అరుణ తననే ప్రేమిస్తుందని ఎవరికి వారు అనుకుంటారు.  చిత్రంగా వారికి పీటర్ మీద అనుమానం రాదు.  ఇద్దరూ ఎవరికి వారు తమ అరుణ గురించిన తమ ప్రేమ గోడు పీటర్ కి వెళ్లబోసుకుంటుంటారు.  

పీటర్ కి లిల్లీ అనే స్నేహితురాలుంటుంది.  ఆమె వివాహిత.  ఏదో ట్యూషన్ చెప్పించుకోడానికి పీటర్ దగ్గరకు వస్తుంటుంది.  ఆమె భర్తకి పీటర్ మీద నమ్మకం.  అందుకే ఆమె ట్యూషన్ చెప్పించుకోడాన్ని అభ్యంతర పెట్టడు.  కానీ సాయంత్రం చీకటి పడ్డాక పీటర్ ఆమెని దిగబెట్టడానికి ఆమెతో వెళ్తుంటాడు కానీ దారిలో ఆమె ముందు నడుస్తుంటే పీటర్ కొన్ని అడుగుల దూరంలో వెనక నడుస్తుంటాడు ఎవరికీ అనుమానం రాకుండా.  లిల్లీకి అరుణ రావడం వల్ల ఏర్పడిన బీస్ట్, నాగన్ల హడావిడి నచ్చదు.  చిరాకు పడుతుంది.  వెంటనే వెళ్లిపోతుంది.  బీస్ట్, నాగన్ ఇద్దరూ చేసే పోటీ హడావిడి లోలోపల పీటర్ కి కూడా నచ్చదు.  నిజానికి అతనిది పోసెసీవ్నెస్ ని జయించిన ప్రేమ అనుకుంటాడు.  కానీ వీరి హడావిడితో తాను ఇరిటేట్ అవడం, అరుణని మళ్లీ కోరుకోవడం వల్ల తనది జెలసీని వదులుకోలేని తత్వం అని నిర్ధారించుకుంటాడు.  సాహిత్యంలో ఒక పాత్ర తన అంతరంగ లోతుల్ని ఇంతగా ఆవిష్కరించడం చలం సాహిత్యంలో మాత్రమే సాధ్యం. 

ఆ తరువాత ఆ ఇంటికి అరుణ కుటుంబం కూడా దిగబడుతుంది.  ఆమె భర్త, అత్త, మామ అరుణని వెతుక్కుంటూ వస్తారు.  ఆమెని తమతో వచ్చేయమంటారు.  ఆమె తాను రానంటుంది.  ఆమె భర్త జయరావుకి పీటర్ ఇంతకు ముందే తెలుసు.  అందరిలానే జయరావుకి కూడా పీటర్ “శీలం” మీద బోలెడు నమ్మకం.  జయరావు ఆమె తనతో వచ్చేయమని బలవంతం చేయబోతే అప్పటివరకు శత్రువుల్లా పోట్లాడుకునే బీస్ట్, నాగన్ ఒక్కటై అడ్డం పడతారు.  బీస్ట్ అయితే జయరావుని చితకబాదేస్తాడు కూడా. అప్పుడు “కౌరవ సభలో ద్రౌపది వలె రొమ్ము వగరుస్తూ కళ్ల నిప్పులు రాలుస్తూ నుంచుంది అరుణ.  ఆ సభలో దుశ్శాసనుణ్ని చంపి వుంటే ద్రౌపద్దికి వచ్చే సంతుష్టి కనబడ్డది ఆమె కళ్లల్లో కొంటెగా.” అంటాడు రచయిత. కానీ అసలు విషయం ఏమంటే బీస్ట్ కి, నాగన్ కి జయరావు ఆమె భర్తే అని తెలియదు.  తెలిసిన మరుక్షణం క్షమాపణ చెప్పి మౌన ప్రేక్షకులవుతారు. తప్పుకుంటారు.  “ఆ భర్త అన్న ఒక్క మాటతో తమ బాధ్యతల్ని ఒదులుకొని, సంబంధాల్ని కోసేసుకొని, ధర్మపరులు, మర్యాదస్తులు, ఉద్యోగస్తులు వారిద్దరూ తప్పుకున్నారు” అని రాస్తాడు చలం.   పీటర్ కూడా గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తాడు.  కానీ అతని లోలోపల కూడా అరుణ భర్తని, కుటుంబాన్ని వదిలేసి రావడాన్ని హర్షించలేకపోతాడు.  ఆ తెగింపు అతనికి జీర్ణం కాదు.  అతనూ సమాజానికి బానిసే.  నిజమైన సవాళ్లు ఎదురుకానంత వరకే కొంతమంది సిద్ధాంతాలు వల్లె వేస్తుంటారు.  సవాళ్లు ఎదురై భయపెట్టినప్పుడు రక్షణ ఛత్రాల కిందకి వెళ్లిపోతుంటారు.  ఈ సందర్భంగా “అదే మొగాళ్లకీ, మొగాళ్లకీ వుండే కన్వెన్షన్.  అదే ఫెయిర్ ప్లే.  ఆ ‘ప్లే’లో ఆడది చేరదు.  అన్నీ మొగవాళ్ల క్లబ్బులు.” అంటాడు రచయిత.  

అరుణ తన కుటుంబీకులతో వెళ్లడానికి సంసిద్ధమైపోతుంది. సిద్ధమవక ఏం చేస్తుంది మరి?  అవసరమైనంత మద్దతేది ఆమెకి?  భర్త అనగానే ఆమె కోసం తామున్నామని ముందుకొచ్చిన చేతులు వాలిపోతాయి. ఈ సందర్భంలో భర్తత్వం ఎంత శక్తివంతమైనదో చలం ఇలా చెబుతాడు – “ఆ ‘భర్తా అనే పవిత్ర పదం అన్ని దౌర్జన్యాలనూ, అసహ్యాలనూ, క్రౌర్యాలనూ, కడిగివేసే మంత్రాక్షరం వలె.  భర్త!  ఆ మాట ముందు యిష్టాలు, ధర్మాలు, హృదయాలు, స్వేచ్ఛలు, ప్రేమలు, పాపాలు – అన్నీ తలలు వొంచి తప్పుకోవలిసిందే!”   

తమ ఊరు వెళ్లడానికి బైటకి వెళ్లినవారు తిరిగి వచ్చేస్తారు రైలు వెళ్లిపోయి వుంటుందని.  మరుసటి రోజు వెళ్దామని అందరూ పడుకున్నాక పీటర్, అరుణ మాట్లాడుకుంటారు.  మరలా ఏకాంతంలో సన్నిహితమైపోతారు.  పీటర్ ఆమెని ధైర్యం తెచ్చుకొని తనతో వుండిపొమ్మని అడుగుతాడు.  కానీ అరుణ ఒప్పుకోదు.  తెల్లవారి అందరూ లేస్తారు.  కానీ అరుణ కనబడదు.  మాయమైపోతుంది.  అందరూ అక్కడే వుండి వారం రోజులు ఎదురుచూసినా రాదు. అరుణ చనిపోయిందని అనుకోలేక పోతాడు పీటర్.  “అరుణ చచ్చిపోలేదు.  నాకు తెలుసు.  మబ్బుల్లో, చిన్న బిడ్డల చేతి మడమల మీద, కందిన ప్రియురాలి పెదవి మీద, రోజాపువ్వు రేకుల్లో, పద్మాల నడుమ, తాగిన మా కళ్ల కొలుకుల్లో, ఎరుపు జీరల్లో నశించలేదు.  జీవితంలో ఈ దేహానికి, నా శృంగార భావాలకి ఎట్లా స్వర్గ ద్వారాలు తెరిచిందో, అట్లానే నా ఆత్మకి, నా ఆధ్యాత్మిక సందేహాలకీ ఎప్పుడో, ఏ అశ్రమం నించో స్వర్గ ద్వారాలు తెరుస్తుందని నా నమ్మకం” అంటాడు.  దీనితో నవల ముగుస్తుంది.  

*

అరుణ వంటి వ్యక్తి నిజంగా వుంటుందా?  లేక చలం అరుణ ద్వారా తాను కోరుకున్న స్త్రీని ఒక పాత్రగా సృష్టించాడా అనే సందేహం కలిగింది నాకైతే!  ప్రేమామృతమయమైన హృదయం కలిగిన ఓ స్త్రీ నిజంగా తాను కోరుకున్న ప్రేమని పొందగలదా?  ప్రేమిస్తున్నామనుకునేవారు, ఉన్నతమైన సంస్కారం తమకి వున్నదనుకునే వారు ప్రేమ తాలూకు సర్వ సమగ్ర సంపూర్ణ అనుభవాన్ని ఇవ్వగలరా?  లేదూ అలా ఇస్తే తీసుకోగలరా?  ఆ స్థాయి వున్నవారెవరైనా వుంటారా వాస్తవానికి?  చివరిలో తాను నిష్క్రమించే ముందు అరుణ పీటర్ తో ఇలా అంటుంది – “నీతో ఒక రహస్యం చెబుతా.  నేనింతవరకు ఎవరినీ ప్రేమించలేదు.  ఇప్పుడు తలుచుకు చూసుకుంటే!  నా హృదయంలో గొప్ప ప్రేమ వుంది.  ప్రేమించాలనే ఆశ అపారంగా వుంది.  అందువల్లనే యివన్నీ.  కానీ నా ఆదర్శమే అతి వున్నతం.  నా పురుషుడు ఒక్కడే.  నా కలల్లో బతుకుతున్నాడు.  నిరంతరం నాకేసి చేతులు జాస్తో.  ఈ మనుషుల్ని చూస్తే, వాళ్ల లోపాలు, దేహ లోపాలూ, గుణ లోపాలూ అన్నీ కనబడతాయి.”  

కథానాయకికి అరుణ అనే పేరు పెట్టడంలోనే ఒక ప్రతీకాత్మకత కనిపిస్తుంది.  అరుణ అంటే ఎరుపు.  అది ఆశకి, ఆకాశానికి, వెలుగుకి, మార్పుకి సంకేతం.  ఈ నవలలో ముఖ్యపాత్రలైన పీటర్, బీస్ట్, నాగన్ (అమీరుద్దీన్)లకి అరుణ అంటే కేవలం ఇష్టమే కాదు.  వారు ఆమెని తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తుంటారు.  ఆమె సాంగత్యాన్ని బలంగా కాంక్షిస్తుంటారు.  ఆమె వ్యక్తిత్వాన్ని అమితంగా గౌరవిస్తుంటారు.  మన శరీరం మీద ప్రసరించే తొలి అరుణ కిరణం మనల్ని కోరుకోకుండానే భూమిని తాకబొయే సెకనులో లక్షోవంతు ముందుగా మన శరీరాన్ని తాకుతుంది.  ఈ అరుణ కూడా అంతే. అరుణ కిరణ లక్ష్యం భూమి కాగా మన కథానాయకి లక్ష్యం ప్రేమ.  గమ్యం మధ్యలో ఆమె ప్రేమ అచ్చు అరుణ కిరణంలానే ఎవరో ఒకరిని తాకుతుంటుంది.  ఎవరూ పూర్తిగా ప్రేమించదగ్గ స్థాయిలో ఎదురవరు కనుక తాను మాత్రం తామరాకు మీది నీటిబొట్టులా మిగిలిపోతుంటుంది.  ఒక్క పీటర్ని మాత్రం ఎంతోకొంత ప్రేమిస్తుంది.  అది కూడా దోబూచులాటగానే వుంటుంది. ఆమె ప్రేమాకాంక్షలకి అతను కొంత దగ్గరగా వస్తాడు.  అతనంటేను కూడా వల్లమాలిన మోహం ఏమీ లేదు ఆమెకు.  కానీ అదో నమ్మకం అతను తన మనిషిగా వుండగలిగే స్థాయిఎంతో కొంత వున్నవాడని! అతను మాత్రం ఆమెని “అపురూపంగా దొడ్లో నిమ్మ చెట్టు మీద రెండు నిమిషాలు వాలే అడవిపిట్ట” అనుకుంటాడు.   ఆమె సౌందర్యం గురించి చెబుతూ పీటర్ “ఒక్కొక్క స్త్రీ రతీ దేవి నించి ఒక్కొక్క వరం పొంది పుడుతుంది.  కానీ అరుణ మాత్రం పది వరాలు తెచ్చుకుంది” అంటాడు.

అరుణ జీవనోత్సాహం పుష్కలంగా వున్న హుషారైనన మహిళ. ఆమె ప్రవర్తనలో మంచి స్పాంటేనిటీ వుంటుంది. ఆమె దేన్నీ, ఎవరినీ తృణీకరించదు.  అలాగని ఆమోదించదు.  తానున్న ఆ క్షణంలో బతుకుతుంటుంది.  మనుషుల పట్ల అపారమైన కరుణ, కృప, అనురాగం చూపిస్తుంటుంది.  ఒక చిలిపి స్వభావం, కొంత అల్లరి, ఎంతో మాటకారితనం, ప్రతి మాటలోనూ తొణికిసలాడే హాస్యస్ఫూర్తి ఆమె స్వంతం.  పీటర్ని తోటి ఆడపిల్లని పిలిచినట్లు “ఏమే”, “పిచ్చిముండా” అని ఆట పట్టిస్తుంటుంది.   అరుణ ఏమనుకుంటే అదే చేస్తుంది.  ఆమెని ఎవరూ ఒప్పించలేరు.  ఆమె ధోరణి నుండి ఆమెని తప్పించలేరు.  ఆమె అల్లరి చిలిపి స్వభావం వెనుక ఒక గొప్ప వ్యక్తిత్వం దాగుంది.  అందుకే పీటర్ ఇలా అనుకుంటాడు ఆమె గురించి “అరుణని బతిమాలాడ్డం, ఆకాశంలో యెగిరి చిలకని పిలిస్తే యెంత లాభం, అంతే.  ఆమె స్వేచ్ఛగా వరాలు కురిపించాలి.  ప్రార్ధనలూ, కన్నీళ్లూ పనిచేయవు.  కానీ తనకి యిష్టమైనప్పుడు ప్రార్ధనలకి, కన్నీళ్లకి లొంగిపోయినాననే ఇల్యూజన్ కల్పిస్తుంది.” 

అరుణ అంటే పీటర్ కి ఒక అపురూపం.  ఒక అబ్బురం.  ఆమె స్వభావం, ప్రవర్తన, మాటలు, నవ్వులు, కదలికలు…ఇలా ఆమెకు సంబంధించిన ప్రతి విషయమూ అతనికి ఎంతో ఇష్టం.  అలాగని అనునిత్యం ఆమె గురించి తపించడు.  ఆమెతో అనుభవం అతనికి ఓ అద్భుతమైన జ్ఞాపకం.  ఆ జ్ఞాపక పరిమళాన్ని ఆస్వాదిస్తుంటాడే కానీ ఆ అనుభవ పునరావృతం కోసం పరితపించడు.  అరుణకి సంబంధించి చలం ఎన్నో అద్భుతమైన వ్యక్తీకరణలు చేస్తాడు చలం.  గతంలో ఆమెతో తనకున్న ప్రేమానుబంధం గురించి పీటర్ ఇలా అంటాడు – “పదిహేనేళ్ల కిందట ఆమె నన్ను ప్రేమించింది.  ఆ పది రోజులూ – కాదు ఆ మూడు రోజులే.  కానీ అప్పుడైనా ప్రేమించిందా?  ఏమో మరి ప్రేమ అయితే పది రోజుల్లో – నన్ను, చేతులు జాచి యేడుస్తున్న నన్ను – పిల్లని మరిపించి చెరువుకి వెళ్లే తల్లిలాగు నవ్విస్తూ వెళ్లిపోతుందా?  కానీ పది రోజుల ప్రేమ అనేది వుండకూడదా?  ఆజన్మాంతమూ అనే పురాణ పవిత్ర పదం పని చెయ్యడం మానదు కదా మనసుల్లో!  నాకు కావలసినా, అక్కర్లేకపోయినా నా కోసం కాచుకొని పడి వుంటే అది ప్రేమ? …. ఏది ప్రేమ? ఎవరిది ప్రేమ?  ఒక్క రాత్రి తృప్తి పడ్డ తరువాత, మళ్లీ రక్తకణాలు వీర్యాన్ని సమకూర్చిందాకా, చచ్చిపోయేది ప్రేమా!?”  ఎంతటి గొప్ప అవగాహన ఇది నిజంగా!  అవతలి మనిషి పరిమితుల్నో, ప్రయారిటీస్నో అర్ధం చేసుకొని, సహించి, ఆమోదించే ఒక అత్యున్నత ప్రజాస్వామిక సంస్కారం కాదూ ఇది?  సౌందర్యం, గుణం గురించి వల్లమాలిన నీతి కబుర్లని పీటర్ భలే ఈసడిస్తాడు ఇలా “‘శరీర సౌందర్యం ఏముంది?  నాలుగు రోజుల్లో నశిస్తుంది.  గుణం ప్రధానం’ అని విమర్శించుకుంటూ తిరుగుతారు.  గుణం?  ఏమిటా గుణం?  దెబ్బలకి జడిసి వొంట వొండే గుణం – గతిలేక, దిక్కులేక, యింటి దూలాన్ని పట్టుకొని వేళ్లాడే నిర్జీవ గుణం, నగలు చీరలు మోసే గాడిద గుణం.  ఇవీ వీళ్లు మురిసి బోర్లపడే గుణాలు!  గుణాలు చూసి మోహించేటంత అసహజ జీవులు వున్నారా ఈ లోకంలో?”  సమాజపు హిపోక్రసీని కడిగి పారేసే వజ్ర స్ఫటికం వంటి మాటల్ని పీటర్ చేత అనిపిస్తాడు చలం. మరోచోట పాతివ్రత్యం గురించి ఇలా అంటాడు- “యీ పశువు, యీ పురుషుడు దేవతని, కిన్నెరని, కోయిలని, తనకి వొండి, తన కాళ్లు కడిగి, తలంటి పోసి, తన మనసు మళ్లితే మళ్లీ తాను నవ్విందాకా ఏడుస్తూ కాచుకొని కూచోమంటాడు.” పురుష ప్రయోజనార్ధం, పురుష ప్రాయోజితమైన పాతివ్రత్యం గురించి సంస్కారవంతమైన చలం మగ పాత్ర మినహా మరెవరు ఇలా అనగలరు?  ఇంతటి గొప్ప అవగాహన నిజంగా తొంభై ఏళ్ల తరువాతైనా ఈ సమాజానికి ఆవగింజలో అరభాగమైనా నేటి సమాజం అలవర్చుకున్నదా?  అందుకే చలం రిలవెన్స్ నానాటికీ పెరుగుతున్నదనిపిస్తుంది. 

మరో చోట మొగుళ్ల మగబుద్ధి గురించి అరుణ ఇలా అంటుంది “తమ యింట్లో పెద్ద దీపం పొరుగింటి గోడ మీద పడుతూందని కిటికీలు మూసుకుంటారు.  తమకి గాలి రాక చచ్చినా సరే..  వాల్లకి కాంతి – తమ కాంతి స్వంతం ఆక్కర్లేక మిగిలింది – అది మాత్రం ఇంకోళ్లకెందుకు పోవాలి?  కొంద్రు దీపం ఆర్పేసుకునే వాళ్లు కూడా వున్నారు మహానుభావులు.  కసితో నేలకేసి కొట్టి బద్దలు కొట్టేవారు.  ఛీ పాడులోకం.  మళ్లీ అందమంటే మొగాళ్లకి ఎంత కక్కుర్తి!  కంటబడితే చాలు! …. ఏ స్నేహితుడి కళ్లల్లోనో ఆరాధనని చూసి అప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటారు భార్య అందమైనదని.  అక్కణ్నుంచి అనుమానాలు మొదలు.  ఈ అందానికి అధికార్లు కావడం ఎంత నీచం- ఎంత బాధ -ఎంత యీర్ష్య – కానీ ఆ బాధ్హంతా పడతామంటారు.  ఒక్క రవ్వ అనుభవించరు.  కానీ వొదలరు.”  అరుణ అడిగిన ఈ ప్రశ్నలన్నీ ఎంతో వాస్తవికమైనవి.  ఈ ప్రశ్నలకి సమాజం దగ్గర, సమాజ సమర్ధకుల దగ్గర సమాధానాలుండవు.  కానీ విలువల పేరుతో ఆధిపత్యం చేస్తూ, త్యాగాలు చేయాలని డిమాండ్ చేస్తుంటారు.  విలువలన్నీ స్త్రీ ప్రధానమవడమే కుట్ర.  ఆ కుట్రని చలం తన రచనల్లో బట్టబయలు చేస్తుంటాడు. 

చలం మూడు నవలల్లో (అమీనా, మైదానం, అరుణ) ముస్లీం ప్రధాన పాత్రలుంటాయి.  ఆయనకి ముస్లీం సమాజమంటే ఎంతో ఆసక్తిలా వుంది.  ఆ సమాజ సంస్కృతి ముస్లీముల ప్రవర్తన మీద చూపించే ప్రభావం ఆయనకి ముచ్చట కలిగేలా చేస్తుంటుందేమో.  ఈ నవలలో కూడా అమీరుద్దీన్  (నాగన్) గురించి చెబుతూ “మర్యాదలో మహమ్మదీయుల్ని మించిన వాళ్లు లేరు.  తలుచుకుంటే అమర్యాదలో కూడా!  “యానిమల్ ఇన్స్టింక్ట్స్” ఎంత రిఫైన్ కావాలో అంత రిఫైన్ ఐనాయి వాళ్లల్లో.  ఎంత రూడ్ గా వుంటాయో చూడాలన్నా వాళ్లల్లో వుంటాయి.  మర్యాదలోనే కాదు, అనుభవంలో కూడా, అనుభవించడం -పంచేంద్రియాలతో-ఒక పర్పస్ లాగు, డ్యూటీ లాగు చూసుకుంటారు.  గొప్ప ఆధ్యాత్మికాంచలాల్ని అందుకున్న సూఫీ వేదాంతులూ, కవులూ కూడా ఆ యీశ్వరుణ్ని తమ ఆనందానుభవానికి ఒక ఆభరణంగా చేసుకున్నారా అనిపిస్తుంది” అంటాడు.  ఈ నవలలో గమనించాల్సిన మరో విషయముంది.  అరుణని ప్రేమించిన ముగ్గురు పురుషులూ మూడు మతాలకు చెందినవాళ్లు.  నాగన్ ముస్లీం, పీటర్ క్రైసవుడు, బీస్ట్ హిందువు.  ఒక మతాతీతమైన ప్రేమని పొందడానికి, ఇవ్వడానికి ప్రతీకగా అరుణని చూపించడం కోసం చలం ఈ పాత్రల్ని సృష్టించాడనిపిస్తుంది.  ఈ విషయం ప్రత్యేకంగా ఏమీ చెప్పడు కానీ మనకి అర్ధమవుతుంది.   

చలం రచనలు అనుభవ ప్రధానమైనవి.  అనుభూతి ప్రధానమైనవి.  మానవ హృదయ ప్రధానమైనవి.  చలం మార్క్సిస్టు కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా దోపిడీని బలంగా వ్యతిరేకించిన వాదు.  అందుకే మార్క్సిస్టులెవ్వరూ ఆలోచించ లేనంత ఎత్తులకు చేరి స్త్రీల గురించి ఆలోచించి రాశాడు.  “అరుణ” నవలలో ఇది స్పష్టంగా కనబడుతుంది.  నిజమైన ప్రేమ మూర్తి ఐన ఒక స్త్రీని దక్కించుకునే అర్హత లేని “మొగవాళ్ల క్లబ్బు” ఐన పురుష సమాజాన్ని ఈసడిస్తూ ఈ నవల రాశాడనిపిస్తుంది.  నిజమైన ప్రేమ మనుషుల్లో దొరకదని, దాన్ని కేవలం ఆధ్యాత్మిక మార్గంలోనే సాధించుకోవాలనేది బహుశా చలం అభిప్రాయం అయుండొచ్చు.  అదే ఈ నవల ముగింపులో కనిపిస్తుంది.  

చదవండి “అరుణ” నవలని.  చలం సాహిత్యంలో శిఖరాయమానమైన రచన ఇది.  మనుషుల మనసుల్లో, రక్తంలో ఇంకిపోయి మాటల్లో, చూపుల్లో, కదలికల్లో అసంకల్పితంగా లేదా ఒక వ్యసనంగా బైటపడి, అన్ని రకాల స్వేచ్ఛా భావనల్ని, వ్యక్తిత్వ ఆకాంక్షల్ని, న్యాయమైన కోర్కెల్ని అణగదొక్కే ఆధిపత్యం, అధికారానికి సంబంధించిన పురాతన భావజాలాల పునాదుల మీద లేచిన మన కుటుంబ వ్యవస్థ అర్ధమౌతుంది.

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

6 thoughts on “చలం అచంచలం: అరుణ

  1. ఏంటో చలం గారి నవలల్లోని స్త్రీ పాత్రలు నాకసలు అర్థం కావు. స్త్రీ అంటే వంటింటి కుందేలు కాదు, లైంగిక కోరికల కోసం ఎటు పడితే అటు వెళ్ళే మనిషి కాకూడదు. ఒక వ్యక్తిగా విద్య, బాధ్యతలు, సామాజిక అవగాహన కలిగి, స్ఫూర్తివంతంగా జీవించాలని కోరుకుంటాను. అలా జీవించడానికి ముందు నుంచే తెగింపు ఉంటే బావుంటుదని, కానీ చిన్న వయసులో అంత అవగాహన ఉండదేమోనని సందేహం. అందుకే జీవితంలో వచ్చే మార్పులను మెరుగు పరుచుకుంటూ వెళితే బావుతుందంకుంటాను.

    1. చలం గారి స్త్రీ పాత్రలు లైంగిక వాంఛలతో ఎటు పడితే అటు వెళ్లలేదు. లోకం అర్ధం చేసుకున్నట్లే మీరూ అర్ధం చేసుకున్నారు. మీరన్నట్లు “ఒక వ్యక్తిగా విద్య, బాధ్యతలు, సామాజిక అవగాహన కలిగి, స్ఫూర్తివంతంగా జీవించాలని కోరుకున్న” స్త్రీలు వారు. ఈ జాబితా నుండి లైంగికతని వేరుగా చూడటం కరెక్ట్ కాదు. అవగాహనతో తలొగ్గి నరకాల్ని భరించడం కంటే అనుభవంతో జీవితాన్ని కొనసాగించడం ఉత్తమం అని నేననుకుంటాను.

  2. ఆఖరి రెండు concluding paragraphs చాలు అరణ్య కృష్ణ గారు ఈ పుస్తకం చదవాలి అనిపించడానికి, ఎంత నిజాయితీ తో విశ్లేషణ చేశారో. మీరు కాక ఇంకెవరు అయినా సరే చలం గారిని వారి వారి అలోచనలకు / ఆశయాలకు అనుగుణంగా చలం గారి రచనను డిఫైన్ చేసేవారు, అది నేను అయినా సరే
    Hat’s off to you అండి 😊

Leave a Reply