సాహిత్యం మానవ జీవితంలోని సకల విధ్వంసాల గురించి మాట్లాడాలి: అరసవిల్లి కృష్ణ

  1. మిమ్మల్ని కవిగా మలిచిన స్థల కాలాల గురించి చెబుతారా?

విశాఖ జిల్లా నగరప్పాలెం గ్రామంలో 1967లో పుట్టాను. గోస్తనీ నదిని అనుకుని కొండల దరిని మా ఊరు ఉండేది. కలకత్తా జాతీయ రహదారిని ఆనుకొని ఉండేది. ప్రాథమిక విద్య మా ఊరిలోనే. ఆరవ తరగతి పక్కన ఉన్న తాటితూరు గ్రామంలో. ఎనిమిది నుండి తొమ్మిదవ తరగతి వరకు భీమిలి. తొమ్మిదవ తరగతిలో చదువు ముగిసిపోయింది.

సాహిత్య ప్రపంచంలోకి తొలి అడుగులు…
నిజానికి సాహిత్య ప్రపంచం గురించి తెలియని గ్రామీణ పిలగాణ్ని. ఆరవ తరగతి నుండి పుస్తకాల పట్ల ఇష్టం ఏర్పడింది. మా వూరి పంచాయతీ ఆఫీసుకు ఆంధ్రప్రభ దినపత్రిక వచ్చేది. ఆరోజుల్లో చందమామ, బుజ్జాయి, బాలజ్యోతి వంటి పిల్లల పత్రికలను, చతుర, స్వాతి మాసపత్రికలను కొంతమంది తెప్పించుకునేవారు. వారు చదివిన తరవాత నేను తీసుకునే వాణ్ణి.

చిననాటి నుండి చదవడం వ్యాపకంగా ఉండేది. బాల్య దశలో అప్పారావు మాస్టారు కథలు చెప్పే విధానం. భీమిలీలో చదువు కున్నప్పుడు క్లాస్ రూమ్ నుండి కనబడే సముద్రం, మత్స్యకార పిల్లల సాహచర్యం, తెలిసీ తెలియని కాలంలో చిన్ని చిన్ని కవితలు రాయడం. 1982లో మా కుటుంబం బెజవాడ వలస వచ్చాక విజయవాడలోని గ్రంథాలయాలు, పాత పుస్తకాలు అమ్మే దుకాణాల ద్వారా చదవడం విస్తృతమైంది. కరెంట్ లేని ఊరి నుండి నగరానికి వచ్చాక నగర జీవితంలోని చికాకు,పెనుగులాట, బీదరికం, విశ్రాంతి లేని జీవితం ఇవన్నీ. ఇక రచయితలతో పరిచయాలు, ప్రగతి శీల సాహిత్య సంస్థలతో ప్రయాణం. మా ఊరి నోస్టాల్జియా, అన్నిటికి మించి బతుకు భయం కవి కావడానికి దోహదకారి అయినాయి. నన్ను అత్యంత ప్రభావితం చేసిన రచయితల గుడిపాటి వెంకట చలం. ప్రారంభంలో అన్ని దినపత్రికలకు రాజకీయ లేఖలు రాసేవాన్ని. విశాలాంధ్ర ఆదివారం సంచికలో ‘దర్జీ’ అనే కవిత ప్రచురితమైంది. మొదటట్లో సృజన అనే కలం పేరు ఉండేది. ఆ తర్వాత ఆ పేరును వదులుకున్నాను.

  1. విరసంలో ఎప్పుడు చేరారు? విరసంలో చేరాక మీ కవిత్వంలో ఎలాంటి వైవిధ్యం సాధించారు?

2008 జనవరి గుంటూరు మహాసభల్లో విరసంలో చేరాను. విరసం బయట, విరసంలో చేరేక అనే విషయంలో నా అవగాహన చెప్పలేను. దాదాపుగా మూడు దశాబ్దాలుగా రాస్తున్నాను. నేను రాసే కవిత్వం, దాని చుట్టూ విప్లవకర రాజకీయాలు ఉన్నాయి.

  1. తడి ఆరని నేల నేపథ్యం వివరిస్తారా?

నా మొట్ట మొదటి కవితా సంపుటి. చాలా కవితలు ఉన్నప్పటికీ ఒక నలభై కవితలు ఎంపిక చేశాను. ‘తడి ఆరని నేల ‘రావడానికి నా ఆర్థిక పరిస్థితి సహకరించక పదిహేనేళ్ళ కాలం పట్టింది. అందుకనే కాలానికి నిలబడని కవితలను అందులో చేర్చలేదు. కవిత్వం గురించి తెలియని చేతి వృత్తి కార్మికుడు పెద్దగా చదువుకోనివాడు రాసిన కవిత్వం. నా మొదటి కవిత్వ సంపుటి గురించి ఇవాళ ఆలోచిస్తే అనిపిస్తుంది. కాలం, బతుకు వెతుకులాట, రేపటిరోజు ఎలా నడుస్తుందనే భయం, దేశ, స్థల కాలాలు… వీటిన్నిటికీ మించి మాకుటుంబంలో మా చెల్లి బలవన్మరణం చాలా విషాదాలు నాలోఇంకిపోయాయి. తడి ఆరని నేల వెనుక దాగిన విషాదం కవిత్వ ధారగా వెలువడడానికి కారణమైంది.

  1. సమాజంలో ఎనభై శాతానికి పైగా ఉన్న చదువు లేని ప్రజలకు కవిత్వం ద్వారా విప్లవ రాజకీయాలను ఎట్లా చేరవేస్తారు?

సాహిత్య సృజన ఆలోచనా పరుల తండ్లాట. ఇంకా ముందుకు వెళితే మేధోపరమైన ఒక వాహిక. ప్రజల సుఖ దుఃఖాలను, రాజకీయార్ధిక విషయాలను రచయితలు వ్యక్తం చేస్తారు. ఉద్యమాలకు, ఆందోళనకు ఊ తం ఇస్తారు. ప్రజల కోసం పనిచేసే బుద్ధి జీవులను ప్రభావితం చేస్తారు. ప్రజలు, రచన, రచయితలు వేరు వేరు అంగాలు. ప్రజలు ఏ కళ ద్వారా ప్రభావితం కారు, కాలేరు. ప్రజలను ప్రేమించేవారు తమ సృజనాత్మకత ద్వారా ఒక భావ జాలాన్ని ఏర్పరచగలుగుతారు. ఆ భావజాలం ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. విప్లవ భావజాలం ప్రజలకు చేరుతుంది గాని విప్లవ సాహిత్య సృజన ప్రజలకు చేరదు.

  1. విప్లవ రాజకీయాల ప్రచారానికి ఏయే సాహిత్య ప్రక్రియలు అనువుగా ఉంటాయనుకుంటున్నారు?

విప్లవ సాహిత్య సృజనలో కవిత్వం నిర్వహించిన భూమిక సామాన్యమైనది కాదు. కవిత్వం ప్రభావశీలమైనది. కారణం కవిత్వం కాలానుగుణంగా నూతన రచయితలను తయారు చేసుకుంటుంది. కొత్తగా రాస్తున్న కవులు ప్రగతిశీల కవిత్వం పట్ల సహజంగానే మొగ్గు చూపుతున్నారు. కాలం గడిచే కొలది సాహిత్యంలో భిన్న ప్రక్రియలను ఎన్నుకోవొచ్చు. కవిత్వం విప్లవోద్యమానికి బీజం. ఈ ఐదు దశాబ్దాల కాలం దీనినే రుజువు చేసింది. అయితే విప్లవ పాట స్థానం ఏమిటి ? అనే సందేహం రావచ్చు. పాట యొక్క పరిమితిని గుర్తిస్తే కవిత్వ స్థానాన్ని అంచనా వేయగలుగుతాం. కవిత్వం, పాట, కథ, వ్యాసం, నాటకం ప్రభావితం చేయ గలిగినా కవిత్వమే ఇవాల్టికి జన బాహుళ్యాన్ని పట్టించుకుంటుంది.

  1. ‘ఉద్దానం పసిపాప’ కవిత రూపొందడానికి మీలో ఎలాంటి సంఘర్షణ జరిగింది?

నేను ఎక్కడ ఉన్నా నామూలాలు ఉత్తరాంధ్రతో ముడిపడి ఉన్నాయి. ఈ కవిత రావడానికి శ్రీకాకుళ ప్రాంతంలో జరిగే అభివృద్ధినమూనా ఒక ప్రాంత విధ్వంసానికి పూనుకోవడమే స్టేట్ ఉద్దేశం. ఉత్తరాంధ్ర ముఖ్యంగా శ్రీకాకుళ, విజయనగరం జిల్లాల నుండి వలసీకరణ. కాకరాపల్లి, సోంపేట వంటి ప్రాంతాల్లో అణువిద్యుత్ ప్లాంట్ల నిర్మాణం. ప్రజా పోరాటాల క్రమం పోలీసు కాల్పులలో ఉద్యమ కారులు మరణించడం… ఇవన్నీ ఉద్దానం పసి పాపకు ప్రేరణ.

  1. ఆ సామాజిక విషాదాన్ని కవిత్వంగా అల్లిన తర్వాత ఎలాంటి స్పందన వచ్చింది?

కవిత్వం చదవడం ద్వారా పాఠకుడు తనకు తెలిసిన అనుభవాన్ని జీవిస్తాడు. కవిత్వం చదివిన తర్వాత జరిగే రసాయన క్రియ పాఠకుణ్ణి సెన్సిటివ్ చేస్తుంది. తన కుటుంబంలో, సామాజికావరణలో మానవునిగా తన ప్రయాణం విస్తృతమవుతుంది. కవిత్వం చదివిన పాఠకుని ప్రతిస్పందన కవిత్వం హృదయగతం కావడమే. కవిత బాగుందనే మెచ్చుకోలకు అర్థం లేదు. మానవ ప్రయాణంలో సాహిత్యం అనేక జీవన విధ్వంస వలయాలను రికార్డ్ చేస్తుంది. సినిమా, నాటకం చూసినట్లుగా ప్రేక్షక స్పందన వుండదు. సాహిత్యం చదివే పాఠకునికి స్పష్టమైన విభజన ఉంటుంది. రచన క్షాళన చేస్తుంది. ప్రజా పక్షం ఉండాలనే ఉద్దీపనను కలగజేస్తుంది.

  1. వర్గ పోరాట రాజకీయాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలంటే ఎలాంటి రచనలు రావాల్సిన అవసరం ఉన్నది?

ఇవాల్టి రచయితలు వర్గ పోరాట రూపంలోనే రచనలు చేస్తున్నారు. వర్గ, కుల, మత అస్తిత్వం అనేది ఆయా రచనల వస్తువు అయింది. అంతిమంగా ఇవాల్టి రచనలలో వర్గ స్పృహ ప్రధాన భూమిక వహిస్తుంది. ఏ రచన కైనా ఒక ప్రయోజనం ఉండాలి. రచయితలు వర్గ స్పృహతో రాస్తున్నామా అనే ఎరుక లేకుండానే ఇవాల్టి సాహిత్యం వర్గ రాజకీయాల గురించి మాట్లాడుతుంది. అయితే వర్గం, రూపం మారుతున్న క్రమంలో వర్గ రాజకీయాలను అవగాహన చేసుకునే లోచూపు వుండాలి. సమాజంలో వచ్చిన మార్పులు, మానవ జీవితాన్ని ప్రేమించడం దగ్గర నుండి మానవ జీవితంలో సకల విధ్వంసీకరణ గురించి సాహిత్యం మాట్లాడుతుంది. అనేక మూలలకు సాహిత్యం విస్తరిస్తుంది. ఖాళీలను సాహిత్యం పూరిస్తుంది. ఇవన్నీ వర్గ పోరాటంలో భాగమవుతున్నాయి.

  1. ‘ఆమెలోకి వెళుతున్నా’ లాంటి కవిత రాయడానికి ఏయే పరిస్థితులు, సంఘటనలు ప్రేరణ ఇచ్చాయి?

నేను స్త్రీ పక్షపాతిని. బాల్యంలో మా ఊరి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న నా చిననాటి స్నేహతురాలు రాధ వాళ్ళమ్మ, నా మొదటి జ్ఞాపకం. నాతోపాటు చదువుకొని కిరోసిన్ పోసుకొని బలవర్మరణం చెందిన కృష్ణవేణి, ఆరేడు తరగతులలో నేను చదివిన పాఠశాల టీచర్ హెలినా రాణి కుటుంబ విషాదం నాలో ఇంకిపోయాయి. ఇన్నేళ్ల జీవితంలో మహిళలపై మగవాని పెత్తనం, స్త్రీల ప్రతిఘటన నన్ను ప్రభావితం చేశాయి. మా కుటుంబం పరిసరాలు ప్రపంచ సాహిత్యం, స్త్రీల ప్రాధాన్యతను గుర్తించడం ఇవన్నీ. స్త్రీ హృదయంగా మార్పు చెందాలని, పురుషునిగా నా అస్తిత్వాన్ని కోల్పోవాలని, ఒక ఆలోచనగా ఉంది. కాని ఆచరణలో సాధ్యపడదు. ఆ సందిగ్ధత ‘నేను ఆమెలోకి వెళ్తున్నా’ కవితకు పునాది. పురుషాధిక్య సమాజంలో స్త్రీ పెనుగులాట దగ్గరగా చూసాను. పురుషునిగా నేను ఫెయిల్ అయినానని నిరాశ నుండి ఆ కవిత రూపొందింది.

  1. ‘తడి అరని నేల’ నుంచి ‘ఈ వేళప్పుడు’ దాకా మీ కవిత్వంలో ఎలాంటి వైవిధ్యం సాధించారు?

నాకైతే ఈ వైవిధ్యం గురించి ఎవరైనా బయటవారు మాట్లాడితే బాగుంటుంది. కవిత్వ రచన ముఖ్యంగా రాజకీయ కవిత్వం. ఆయా సంఘటనలని కాలాన్ని కవిత్వం ద్వారా రికార్డ్ చేస్తున్నాను. వస్తు, శిల్ప సమన్వయం ప్రధానమవుతుంది. కవిత్వ రచనను ఇంకా శిల్ప పరంగా బలంగా చెప్పాలి అనిపిస్తుంది. నేను రాసుకుంటూ వెళ్తాను. సాహిత్యాన్ని నిశితంగా గమనించినవారు ‘ఈ వేళప్పుడు’ను తగురీతిలో అంచనా వేశారు. ‘ఈవేళప్పుడు తర్వాత కవిత్వం రాయడంలో తగ్గించాను. మళ్ళీ కొత్తగా నాదైన డిక్షన్ నుండి రాయాలి.

  1. ‘బిజిలీ’ లాంటి అద్భుతమైన ప్రేమ లేఖ రాసిన మీలో మంచి కథకుడు కూడా ఉన్నాడనిపించింది. ఇంత సున్నితమైన, అందమైన భావాల్ని రాసిన మీరు, కథా రచన వైపు ఎందుకు ఆలోచించ లేదు?

పిల్లల కథలు ప్రజాశక్తి సంచికలో, పిల్లల నవల ప్రజాసాహితిలో అచ్చు అయినాయి. కొన్ని కథలు రాశాను. కథలు రాయడంలో నా వృత్తి మిగిల్చే సమయం సరిపోదని అనిపించి నాకున్న మిగులు సమయాన్ని కవిత్వం రాయడం కోసం మాత్రమే వెచ్చించ గలిగాను. నిజానికి ‘బిజిలీ’ గురించి ఎప్పుడు రాశాను? ఏమి రాశాను? అనేది తెలియదు. నాపై కుట్ర కేసు మోపినప్పుడు ఎక్కడ సంపాదించాడో క్రాంతి, ఆ రచనను సామాజిక మాధ్యమాలలో ఉంచాడు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైందనే విషయమే తెలియదు. కథలు రాయడానికి కావాల్సిన సామగ్రి నాదగ్గర లేదు. అయితే కథానికా రచన నా వ్యాపకాల్లో ఒకటిగా భావిస్తాను ఎప్పటికైనా.

  1. కొత్త తరం కవులపై మీ అబ్జర్వేషన్ ?

నా ముందటి తరం కవులు శివారెడ్డి, వరవరరావు, అద్దేపల్లి, దేవీప్రియ ఇంకా ఎందరో వారితో ఉన్న దగ్గర తనం కొత్త తరం కవులతో లేదు. కొత్త తరం నుండి వస్తున్న కవిత్వాన్ని చదువుతాను. వారితో మాట్లాడతాను. ఎంతో కొంత మేర, మా తరం కవిత్వాన్ని జీవితంలో ఒక భాగం చేసుకుంది. నూతన తరం కవులు వెల్లువ వుంది. రాజకీయ కవిగా రూపొందుతున్నారు. జీవితంలో తలెత్తిన ఆటుపోట్లు మధ్య జీవన చట్రం చేయిపెట్టి ఆపుతుంది. ఇవాల్టి జీవితంలో వేగం, కుటుంబం, పిల్లల భవిష్యత్తు వారి ముందు నిలబడి ఉంటుంది. ఒకనాటి తరం ఆలోచనకు, ఇవాల్టి తరం ఆలోచనకు తేడా ఉంది.

  1. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఫాసిజాన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి రచనలు రావాల్సిన అవసరముంది?

ఫాసిజం అనే మాట భారత సమాజానికి కొత్త మాట. ఈ దేశంలో అంతర్గతంగా ఫాసిజం అమలవుతుందన్న అవగాహనకు మనమింకా రాలేదు. మన కల్చర్లోనే ఫాసిజం అంతర్భాగం. పురాణ, ఇతి హాసాల నుండి విస్తరిస్తుంది. భారత సమాజం భిన్నమతాల కలయిక. అయితే ఇక్కడ పొలిటికల్ ఫాసిజం ఆధిపత్య రూపంలో అమలవుతుంది. భిన్న సంస్కృతులు ఏక కాలంలో ఈ దేశంలో కలగలిసి జీవించగలగాలి. ముఖ్యంగా తొంభైల తర్వాత మార్కెట్, మతం సమాన పాత్రలు పోషిస్తున్నాయి. భారత సమాజంలో సంస్కృతిలో మొత్తం ఫాసిజానికి దారి వున్నది. మన మేధస్సు, సృజనకి అందకుండా ఫాసిజం మన మూలాల్లోకి ప్రవేశించింది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఫాసిజాన్ని అర్థం చేసుకోవడం, దానిని నిర్వచించడం ఈ రెండు ఈనాటి రచయితల అవగాహనలో భాగం కావాలి. ప్రపంచ సాహిత్యంలో ఫాసిజాన్ని ఆనాటి రచయితలు ఎలా అర్థంచేసుకున్నారు. దానిని నిరోధించడానికి వారి రచనల సాంద్రతను అర్థం చేసుకొని వర్తమాన కాలానికి అనువర్తింప జేసుకోవాలి. హిందూ పురాణాలను, ఇతిహాసాలను అధ్యయనం చేయాలి. ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల తాత్విక కుట్రలను అర్థం చేసుకోవాలి. ఇవన్నీ రచయితల అనుభవంలోకి రావాలి. ఇవాల్టి ప్రపంచం భయకంపితంగా వుంది. అదే సమయంలో వర్తమాన కాలం బుద్ధి జీవులను హెచ్చరిస్తుంది. ఒకానొక సంక్షుభిత కాలంలో రచయిత, కళాకారుడు ఎక్కడ ఉన్నాడనేది భవిష్యత్తు మనల్ని ప్రశ్నిస్తుంది.

  1. ప్రస్తుత తెలుగు కవిత్వం ఎట్లా వున్నది? ఎట్లా వుంటే బాగుంటుంది?

మన దగ్గర కవిత్వాన్ని తూచే తూనిక రాళ్లు లేవు. దేశంలో, లేదా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలకు స్పందిస్తున్నారు. ఇవాళ్టి కవిత్వ వస్తువు గాజా. రేపటి కవిత్వ వస్తువు మారవొచ్చు. కవిత్వమే కాదు, సృజనాత్మక కళారంగాల వ్యక్తీకరణలు మూసగానే ఉంటున్నాయి. కవిత్వ రచన అనేది కేవలం సృజన మాత్రమే కాదు. వాస్తవం.

  1. సాహితీ సృజనలో దండకారణ్య రచయితల ప్రత్యేకతలు ఏమిటి?

యుద్ధరంగంలో వుంటూనే దండకారణ్య రచయితలు యుద్ధక్షేత్రాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేస్తున్నారు. యుద్ధం, సహజ వనరువుల దోపిడిని, ఆదివాసి జీవన సంస్కృతిని రికార్డు చేస్తున్నారు. రచనలో శిల్ప పరిణితిని సాధించారు. దండకారణ్య రచయితల ప్రత్యేకత యుద్ధం మధ్య జీవిస్తూ తమ అనుభవాన్ని తెలుగు సాహిత్య ఆవరణలోకి అనువర్తింప చేయడం గమనించ వలసిన విషయం. దండకారణ్య సాహిత్యం గుణాత్మకమైన రూపం తీసుకున్నది‌. మైదాన ప్రాంత రచయితలు చూడని తమ అనుభవంలోకి రాని అనేక అంశాలను తమ అనుభవ పరిధిని దాటి సాహిత్యం ద్వారా వెలుపల ప్రపంచానికి అందిస్తున్నారు‌. భారతదేశ విధ్వంసీకరణను, మానవ సంబంధాలను సాహిత్యంలోకి తీసుకు వస్తున్నారు. కథ, కవిత్వం, వ్యాసం ద్వారా దండకారణ్య రచయితలు విప్లవోద్యమం వివిధ దశలను చిత్రించారు. దండకారణ్య భాషను, ఆదివాసీ పెనుగులాటను తమ కథలు, రచనల ద్వారా ప్రచలితం చేస్తున్నారు.

  1. సాయుధ విప్లవ సందేశం ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలంటే రచయితలుగా ఎలాంటి కృషి చేయాల్సి వుంది?

విప్లవోద్యమాన్ని, దాని ఆవరణను విశాలం చేసే బాధ్యతను రచయితలు సమర్థవంతంగా చేస్తున్నారు. విప్లవ భావజాల ప్రచారంలో మైదాన, దండకారణ్య సాహిత్య కృషి విస్మరణకు గురి అయింది. విప్లవోద్యమం దాని నిర్మాణం, ఎదుగుదల, దీర్ఘకాల యుద్ధం వీటన్నిటిని గమనంలో ఉంచుకొని సృజనాత్మక తలం కొనసాగుతున్న దశ ను మనం చూస్తున్నాం. ఉద్యమ నిర్మాణాన్ని, భారత ప్రజాస్వామ్య వైఫల్యంలో సాయుధ పోరాట పటిమ కొన సాగుతుంది‌. సాయుధ పోరాట అవసరాన్ని ప్రజల ఆకాంక్షల వైపు నుండి విప్లవకర దశలను సాహిత్యం రికార్డ్ చేస్తుంది. రచయితలు సృజనాత్మకంగా అంచనా వేస్తూ రాస్తున్నారు. ఇది సరిపోతుందా అంటే చాలదు. ఇవాళ రచయితలపై, నిర్బంధం, జైలు, పోలీసు సోదాల మధ్య రాజ్యానికి తలవంచ కుండా సాహిత్య సృజన చేస్తున్నారు.

  1. ఏభై ఏళ్ల విప్లవ కవిత్వంలో ఎన్ని తరాల రచయిత్రులు వున్నారు? వారి ప్రత్యేకత ఏమిటి?

ఏభై ఏళ్ల కాలంలో దాదాపు ఇవాళ నాలుగో తరం రచయిత్రులు విప్లవ సాహిత్యం రాస్తున్నారు. ప్రజాస్వామ్య వైఫల్యతను ప్రశ్నిస్తూ ఐదు దశాబ్దాలుగా విప్లవ రచన కొనసాగుతున్నది విప్లవోద్యమం. కవిత్వం ప్రధాన స్రవంతిగా కొనసాగుతున్న ఈ ఐదు దశాబ్దాల కాలాన్ని అంచనా వేసే క్రమంలో ప్రతి తరం విప్లవ రచనతో మమేకం అవుతుంది. కాలంతోపాటు అన్ని సాహిత్య ప్రక్రియల నుండి రచనలు వస్తున్నాయి. ఇక ప్రత్యేకత అంటారా… ఇటీవల వచ్చిన ఏభై ఏళ్ల అజ్ఞాత రచయిత్రుల కథలు వియుక్క తాజా ఉదాహరణ. అయితే కవిత్వం కూడా ఇలా రికార్డ్ కావాల్సి వుంది. మహిళా రచయితలు చూసే దృష్టి కోణం వేరు. కథ, నవల, వ్యాసం ద్వారా విప్లవోద్యమ దశలను సాహిత్యంలోకి తీసుకు వస్తున్నారు. అయితే రచన కంటే వచనం వైపు మొగ్గు వుంది. అయితే సాహిత్యంలో ధిక్కార స్వరాన్ని వినిపించినప్పుడు ఒక్కోసారి బలమైన, లేదా బలహీనంగా సాహిత్యం వ్యక్తం కావొ చ్చు. ఈ ఏభై ఏళ్ల కాలంలో మైదాన ప్రాంత మహిళా రచయిత్రుల మాటేమిటి? అనే ఆలోచన కలగవొచ్చు. రెండు పరిస్పర ప్రభావాలు. దండకారణ్య, మైదానప్రాంత రచయిత్రుల ఉమ్మడి ప్రయాణమే సాహిత్యం.

  1. విప్లవ కవిత్వం వస్తు, శిల్పాలలో ఎలాంటి పరిణితి సాధించింది?

ఈ అంశంపై మనం మాట్లాడు కున్నాం. విప్లవోద్యమ కవిత్వం ఒక మూల మలుపు. కారణం కవిత్వం భావావేశమే కాదు, మానవుని అంతిమ భాష. మనం మాట్లాడుతున్నది విప్లవ కవిత గురించి. నూరేళ్ల తెలుగు కవిత్వం ఎప్పటికప్పుడు శిల్ప పరమైన ప్రయోగాలకు కేంద్రం. విప్లవ రచయితలు, మైదాన ప్రాంత కవులు కలగలిసిన సాహిత్యావరణలో శిల్ప ప్రయోగం విశాలమైనది. విప్లవకవి ఏది రాస్తున్నారు? అదే వస్తువు చాలా మంది కవులు రాస్తున్నారు. శిల్ప, సాంద్రతను ఇవాల్టి కవులు సాధన ద్వారా సాధించారు.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ); సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు). ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

One thought on “సాహిత్యం మానవ జీవితంలోని సకల విధ్వంసాల గురించి మాట్లాడాలి: అరసవిల్లి కృష్ణ

  1. మా సత్యం
    కొలిమి నిర్వాహకులు విరసం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ గారితో నిర్వహించిన ఇంటర్వ్యూ లోని ప్రశ్నలు చాలా ఆసక్తిగా ఉన్నాయి.
    మీ ప్రశ్నలకు తనదైన శైలిలో చాలా సూటిగా మాట్లాడారు.
    తన జీవితంలోని పచ్చి అనుభవం- చేదు నిజం. క్రియాశీలతలో పుట్టి, చరిత్ర నుండి అర్థాన్ని గ్రహిస్తూ శ్రామికుల నుండి ప్రేరణ పొందుతూ, మాట- చేత-చైతన్యం ఈ మూడు కలగలిసిన కవి. ఈ యొక్క ఇంటర్వ్యూ విరసం చరిత్ర లో భాగంగా ఒక రికార్డుగా భావిస్తున్నా. బాల్యదశలో ఎదురైన సంఘటనలు, వారి జీవితం డైలక్టికల్ తో (dialectical) ముడిపడి ఉంది. పీడిత ప్రజల ప్రేరణతో, ప్రజల నుండి ప్రజలకు అనే గతి తార్కికత తో సాహిత్యంలోకి విప్లవ రచయితల సంఘంలోకి ప్రవేశించిన నేపథ్యాన్ని నేటి యువతరానికి ఒక స్ఫూర్తి. ఇంటర్వ్యూలో వారి అన్న మాటలు మరోసారి పాఠకులకు గుర్తు చేస్తూ… “సాయుధ పోరాట అవసరాన్ని ప్రజల ఆకాంక్షల వైపు నుండి విప్లవ కర దశలను సాహిత్యం రికార్డ్ చేస్తుంది. రచయితలు సృజనాత్మకంగా అంచనా వేస్తూ రాస్తున్నారు. ఇది సరిపోతుందా అంటే చాలదు. ఇవాళ రచయితలపై, నిర్బంధం, జైలు, పోలీసు సోదాల మధ్య రాజ్యానికి తలవంచకుండా సాహిత్య సృజన చేస్తున్నారు.” కొలిమి నిర్వాహకులకు ఒక మనవి విరసం ఆవిర్భావం నుంచి విరసంలో ఉన్నవారు కొందరు బతికే ఉన్నారు
    వారందరివి ఇంటర్వ్యూ తీసుకుని ఒక చారిత్రాత్మక అవసరం గా చరిత్ర రికార్డుగా ప్రజల ముందుకు తీసుకువస్తే బాగుంటుంది.

Leave a Reply