వాళ్లంతా ఆరోజు సూర్యుడి కన్నా ముందు నిద్రలేచారు. కళకళలాడే మొహాలతో.
త్వర త్వరగా పనులు చేసుకున్నారు. అమ్మ, రమా పిన్ని, లక్ష్మీ అత్త, సుందరమ్మ గారు, వగైరాలంతా తొందర తొందరగా తలలు దువ్వేసుకుని, ఉన్న చీరల్లో మంచిది కట్టుకుని, పర్సులు చేతపట్టుకుని అందులో ఆధార్ కార్డులు, బ్యాంకు పుస్తకాలు, ఎందుకైనా మంచిదని. రేషన్ కార్డులు కూడా వేసుకుని బయల్దేరారు. స్వర్ణ కి తెలుసు కిందటి రోజు ప్రభుత్వం వేస్తున్న అమ్మ ఒడి డబ్బులు బ్యాంకులో పడ్డాయని. స్వర్ణ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం లోకి వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఈ డబ్బుల్లో కొంచెం అయినా తనకు ఇస్తే చెప్పులు, రెండు డ్రెస్సులు కొనుక్కోవాలి అనుకుంది. ఇప్పుడు తనువేసుకుంటున్న డ్రస్సులు ఎవరెవరో ఇస్తే సైజ్ చేయించుకున్నవే. ఉతికి ఆరేసినప్పుడు ముడతలు పడి చూడడానికి బాగుండవు అందుకని ఒక ఇస్త్రీ పెట్టె కొనుక్కుంటే బావుంటుంది అనుకునేది. తను చేరింది ప్రభుత్వ కళాశాలలో నే కనక అక్కడ అంతా తనలాంటి పిల్లలే. పర్వాలేదు ఒకరి కష్టాలు ఒకరికి అర్థం అవుతాయి అందుకే తనకి పదో క్లాస్ లో మంచి మార్కులు వచ్చినా కొంచెం ఖరీదైన కాలేజీలో చేరడానికి తను ఇష్ట పడలేదు. అమ్మ చెప్పినట్టు బాగా చదువుకుంటే ఎక్కడైనా ఒకటే. అమ్మ బాధలు తనకి అర్థం అవుతాయి. అమ్మ రాగానే అడగాలి కొంచెం డబ్బులు ఇవ్వమని. నాన్న కూడా ఆ డబ్బుల కోసమే ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడు ఆయనకి అప్పులు ఉన్నాయి. కనీసం ఆ పదిహేను వేలలో ఒక పది వేలు అయినా తనకు ఇస్తే బాగుండును అనుకుంటున్నాడు. అనుకోకుండా వచ్చిన డబ్బు మీద అందరికీ ఆశలు ఉంటాయి. అమ్మ ఏమనుకుంటుందో తెలియదు ఆవిడకీ అప్పులు ఉన్నాయి. చీటి కిస్తాలు ఉన్నాయి. చేబదుళ్ళు ఉన్నాయి. ఈ ఇంటర్ గట్టెక్కితే ఏ ఫిజియోథెరపీ నో ల్యాబ్ టెక్నాలజీ నో నర్స్ కోర్సో చదువుకుంటే ఒక ఉద్యోగం సంపాదించుకోవచ్చు. తనకి బాగానే మార్కులు వస్తున్నాయి కచ్చితంగా పాస్ అవుతుంది. పోన్లే పాపం అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం! ఉన్న బట్టలు చాలవా! పోనీ ఒక ఇస్త్రీ పెట్టె కొనుక్కుంటే బాగుండు అనుకుంది స్వర్ణ. అమ్మ తీసుకున్న డ్వాక్రా అప్పు తో కొన్ని పాత అప్పులు తీర్చాడు నాన్న. అమ్మేమో ఇంకా డ్వాక్రా అప్పు తీరుస్తూనే ఉంది. ఇప్పుడాయన ఇంకేం అడుగుతాడో తెలీదు. నాన్న మంచివాడే రమా పిన్ని వాళ్ళ ఆయన కన్నా చాలా రెట్లు మంచివాడు. ఆయన పిన్ని ని కొడతాడు. వచ్చిన డబ్బులు ఇంటికి ఇవ్వడు. అయినా పిన్ని ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. మొగుళ్ళు అన్నాక కొట్టరా అని కాబోలు. రమా పిన్ని డ్వాక్రా అప్పు తో ఆయన ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొన్నాడు. ఏం పని చేస్తాడో తెలీదు గానీ పిన్ని ఒంటి మీద ఉన్న బంగారం సూత్రాల గొలుసు ఎప్పుడూ కుదువ పెడతాడు. అది మళ్ళీ పిన్నే విడిపించుకోవాలి. వాళ్ళ అమ్మ పెట్టిన కూసింత బంగారం అది. ఆయన్ని అసలు డబ్బులు అడక్కూడదు. ఇస్తే తీసుకోవాలి లేకపోతే అంతే! అప్పుడప్పుడు అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. పిల్లలు తండ్రి కోసం ఏడుస్తారు. పిన్ని వెళ్ళి బ్రతిమిలాడి తీసుకురావాలి. పిల్లలతో బాగుంటాడు కబుర్లు చెప్తాడు. అప్పుడప్పుడు ఐస్ ఫ్రూట్ లో చాక్లెట్లో కొనిస్తాడు. ఇష్టమైనప్పుడు బడి దగ్గర దించుతాడు. మొగపిల్లలకి క్రాప్ చేయిస్తాడు. పిల్లల చదువు గురించి నిర్ణయాలు తీసుకునేది అతనే. ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చేర్పించాడు. తనకి ఇంగ్లీష్ రాదు. పిన్నికి రాదు. ఆ బడిలో ఏం చెప్తున్నారో ఇద్దరికీ తెలియదు. నెలనెలా ఫీజులు కట్టాలి. యూనిఫామ్ లు కొనాలి. నోట్సులు కొనాలి. అందులో పిల్లలు ఏం రాశారో ఇద్దరికీ తెలియదు. పిన్ని అప్పుడప్పుడు వాళ్లని తన దగ్గరికి పంపిస్తుంది. తనకి మాత్రం ఏమి ఇంగ్లీష్ వచ్చు? తను చదివిందంతా తెలుగు మీడియంలోనే! ఇప్పుడు చదివేది తెలుగు మీడియమే. ఇదే నయం. వాళ్లు చెప్పేది మనకు అర్థం అవుతుంది. ఆ విషయంలో నాన్నని మెచ్చు కోవాలి. అక్కర్లేని ఆర్భాటాలకు పోడు. పైగా ఆడపిల్లలని బడికి పంపించిందే పదివేలు అని ఆయన ఉద్దేశం కావుచ్చును. పాపం ఆయనకి ఇద్దరూ ఆడపిల్లలే! తను, చెల్లి. ఇద్దర్నీ అమ్మ ప్రభుత్వ బడిలోనే చేర్పించింది. పిన్ని వాళ్ళ ఆయనకి స్కూటర్ మీద తన పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్ దగ్గర దించడం కాస్త గర్వం. వాళ్ళు యూనిఫాం వేసుకుని లంచ్ బాక్స్ లు పట్టుకుని స్కూల్ దగ్గర దిగుతుంటే బోలెడు సంతోషం. ఆ యూనిఫాంలు ఉతకడం ఇస్త్రీ చేయించడం పిన్నికి శ్రమ. డబ్బు ఖర్చు. వాళ్ల చదువులకే చాలా డబ్బు అవుతుంది. మేడ మీద మూడో అంతస్తులో వుంటుంది వెంకటేశ్వర కాన్వెంట్. ఐదో ఆరో గదులు. ఒక ఆయా, ఒక బస్సు, దానికి ఒక డ్రైవర్, కావాల్సినంత అట్టహాసం. డాడీ అని పిలిస్తే అబ్బో పట్టలేం ఆయన్ని. డబ్బులు అడిగితే మాత్రం ఇంటి చుట్టుపక్కల ఉండడు. ఏదో పని ఉందని బండేసుకుని వెళ్ళిపోతాడు. పాపం రమా పిన్నికి వచ్చిన అమ్మ ఒడి డబ్బులు ఏం చేస్తాడోమరి! ఏవో బెట్టింగ్ లు ఉన్నాయంట చెబుతున్నాడు పక్కాయనతో నిన్న.
“ఏదైతే అదే అవుతుంది.నాకెందుకు? కాలేజీ కి పోవాలి,”అని బట్టల్ని చేతులతో సాఫు గా రుద్ది, అలా ఇస్త్రీ చేసుకుని కాలేజీకి బయలుదేరింది స్వర్ణ. సాయంత్రం ఇంటికి వచ్చాక అన్నీ అవే తెలుస్తాయి. తెల్లవారాక మధ్యాహ్నం కాకపోతుందా! అలాగే సాయంత్రమూ కాకపోదా? అన్నీ మామూలు ప్రకారం జరిగిపోతాయి. కొండ మీద ఇళ్ళు అద్దె తక్కువ. ఉసూరుమంటూ అన్నేసి మెట్లెక్కి అందరూ కొంప చేరుతారు. బడి పిల్లలు, పనులు చేసుకునే తల్లులు, తండ్రులు, అమ్మమ్మలు, నాయనమ్మ లు తాతలు, అందరూ. ఏదో ఒక పని చేసుకునే వాళ్ళే. టీ కొట్టు దగ్గర సందడి. ఇంటిదగ్గర వండి వడ్డించే ఫలహారాలేమీ వుండవు. అమ్మ దగ్గర డబ్బులు ఉంటే టీ కొట్టు దగ్గర ఏదో ఒకటి కొనుక్కొని తినాలి, లేకపోతే అమ్మ ఏదో ఒకటి సృష్టించి పెట్టాలి. పిల్లల కడుపులు మాడ్చడం అమ్మలకు చేత కాదు. స్వర్ణ ఎప్పుడూ నాన్నని డబ్బులు అడగదు. ఆయన తిట్టడు, కొట్టడు. కానీ భయం! నాన్నని చూసి భయపడాలి. అదేంటో మరి! అసలు చనువు ఇవ్వడు. కబుర్లు చెప్పడు. రమా పిన్ని వాళ్ళ ఆయన పిల్లలతో కబుర్లు చెప్తాడు, కానీ డబ్బులు ఇవ్వడు. వాళ్ల అవసరాలు చూడడు. పెద్ద ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నానని పోజు. మాట్లాడకపోతే నేం నాన్నే నయం.
ఇళ్ల దగ్గర బాగా సందడిగా ఉంది. అన్ని ఇళ్ళు ఒక చోటే! రమా పిన్నిది, లక్ష్మీ అత్తయ్యది సుందరమ్మ గారిది. సుబ్బయ్య గారిది. రమా పిన్ని వాళ్ళ ఆయన గొంతు బాగా వినపడుతోంది. మంచి మాటల గొంతు కాదు. తిట్లు బెదిరింపులు అరుపులు కేకలు! ఎందుకోసమో తెలుస్తూనే ఉంది. రమా పిన్ని ఏటీఎం కార్డు ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటుంది. ఈసారి దాచేసినట్టుంది. లక్ష్మీ అత్త మధ్యాహ్నమే డబ్బులు తీసుకుని తనకు ఒక చీర, పిల్లకి బంగారం చెవి పోగులు, పిల్లవాడికి లాగూ చొక్కా కొనుక్కొని వచ్చేసింది. పిల్ల పదో క్లాసు చదువుతోంది. అది ఇంగ్లీషులో బాగా పూర్. క్లాసులో చెప్పేది అర్థం కావడం లేదు ట్యూషన్ పెట్టించమని ఎప్పటినుంచో అడుగుతోంది. డబ్బులు లేవని తల్లి తండ్రి పెట్టించటం లేదు. దానికి లెక్కలు కూడా రావు. లెక్కలు కూడా ట్యూషన్ పెట్టించుకోవాలి. డబ్బులు వచ్చిందేమో ఆ పిల్ల కోసం. “ఆడపిల్లకి బంగారం చెవిపోగు లైనా లేకపోతే ఎట్టా” అంటుంది లక్ష్మి అత్త. తల్లీ పిల్లా పోట్లాడుకుంటున్నారు అరుచుకుంటున్నారు. పిల్ల ఏడుస్తోంది తల్లి అరుస్తోంది తిడుతోంది. తండ్రి విసుక్కుంటున్నాడు. “ఇప్పుడు నువ్వు పదో క్లాసు పాసు కాకపోయినా పరవాలేదు సాంబం మామయ్య కొడుకు కిచ్చి పెళ్లి చేసేస్తాను” అంటోంది తల్లి. పైగా “నీకు చదువు రాదు. ఆ స్వర్ణ చూడు ఎట్టా చదువుతుందో! దానికి మాత్రం ట్యూషన్ వుందా?” అంది. స్వర్ణ తో పోలిస్తే ఆ పిల్ల కి బాగా కోపం వచ్చింది. గట్టిగా అరుస్తూ గది లోకి వెళ్ళి తలుపు వేసుకుంది.
పిన్ని వీపు మీద దెబ్బలు పడ్డాయి. ఏటీఎం కార్డు ఏడ్చుకుంటూ వాళ్ళాయన చేతుల్లోకి పోయింది. “బెట్టింగులో లాభంవస్తే బోలెడు డబ్బులు! నీ మొహాన పారేస్తా ఇంతకు ఇంత” అంటున్నాడు. ఆయన పేరు సాయిబాబు. రమా పిన్ని మామూలు ప్రకారం కళ్ళు తుడుచుకుని పమిట చెక్కుకుని సాయంత్రం వంట కోసం కాలేజీ లో పనిచేసే హిస్టరీ లెక్చరర్ గారి ఇంటికి బయలుదేరింది. అమ్మ నాన్న కూడా ఏదో ఘర్షణ పడుతున్నారు. వాళ్ళు కొట్టు కోరు గట్టిగా తిట్టుకోరు. నాన్న చెల్లెలు రాధమ్మత్త పెళ్లి కి చేసిన అప్పులు, ఆమె సీమంతానికి చేసిన అప్పులు, కాన్పు కోసం చేసిన అప్పులు, అట్లా పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కగానొక్క చెల్లెలు, “ఎవరు చూస్తారు దాన్ని, మనమే కదా ఉన్నాము” అని అన్ని వేడుకలు బాగా చేశాడు నాన్న. చీటీ కట్టి కొన్ని అప్పులు తీర్చారు. ఇప్పుడు చీటికీ వాయిదాలు కట్టాలి. అమ్మకి కూడా ఆడపడుచు మీద కోపం ఏమీ లేదు. తను సంపాదించిన డబ్బు కూడా అప్పులు తీర్చడానికి వాడుతుంది. స్వర్ణ పుష్పవతి అయినప్పటి వేడుకలు మాత్రం తక్కువా? వద్దంటే “పెద్ద చెప్పావులే నోరు మూసుకో ” అంది అమ్మ. షామ్యానా యేనా! రికార్డులేనా! కుర్చీలు, బల్లలేనా! పేపర్ ప్లేట్లేనా, క్యాన్ లతో నీళ్ళేనా! భోజనాలో! చికెనూ మటనూ గులాబ్ జామూ! వచ్చిన వాళ్ళకి స్టీలు బాక్సులు. స్వర్ణ కూర్చోడానికీ సింహాసనం కుర్చీ వేశారు. మంచి లంగా జాకెట్ ఓణీ తెచ్చారు. అమ్మ కూడా మంచి చీర కొనుక్కుంది. ఇంటికి పెద్ద పిల్ల, ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే అందరూ ఏమనుకుంటారు? నలుగురు నవ్వరా? ఆడపడుచుకు ఘనంగా పెళ్లి చేశాం. దానికి సీమంతం చేసాం. కాన్పుకి తీసుకొచ్చాం. పిల్లవాడికి బారసాల చేసాం. మన పెద్ద పిల్లకి ఈ మాత్రం చేయకూడదా అని అమ్మ గొడవ చేసింది. అమ్మ కూడా బాగా కష్టపడుతుంది. అయినా అప్పుల మీద అప్పులు. అత్త పెళ్లి అప్పట్నుంచి అప్పులు తీర్చడమే సరిపోయే. ఇప్పుడు వచ్చిన ఈ ఈ పదిహేను వేలు అప్పులకే పోతాయి.
కొండమీద దీపాలు వెలిగాయి. బయటికి వెళ్ళిన వాళ్ళంతా ఇంటికి వచ్చారు. అరిచి పోట్లాడి ఏడ్చి అలసి పోయిన వాళ్ళు నిర్లిప్తంగా కూర్చున్నారు. పోట్లాటలో గెలిచిన వాళ్ళు కులాసాగా ఉన్నారు తాగుడు తిండి అయిపోయింది. కళ్ళల్లో తడి ఆరిపోయింది. అంతా మామూలే. ఇంటర్ పాసై ఏదో ఒక కోర్సు నేర్చుకుని ఒక ఉద్యోగం చూసుకుని ఉన్న అప్పులు తీర్చి ఇంటిని కాస్త తీర్చిదిద్దుదామని ఆకాశం వంక చూస్తూ అనుకుంది స్వర్ణ. ఆకాశం లో నిండుగా ఉన్న చుక్కలు ఆశాదీపాలలా కనపడుతున్నాయి.
రమా పిన్ని ఏమనుకుంటోందో పాపం! బహుశా వాళ్ళ ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడేమో! తను ఇలాగే ఉండాలేమో! ఇదంతా సహజమే నేమో! అనుకుంటుందేమో మరి. లక్ష్మీ అత్త ఏమనుకుంటుంది? ఆడపిల్లల్ని కాపాడుకోవడం కష్టం. పరీక్షలు తప్పి సెల్ ఫోన్లు పట్టుకుని చెవుల్లో ప్లగ్గులు దూర్చుకొని మెలికలు తిరుగుతూ నడుస్తూ అమ్మాయిల చుట్టూ తిరిగే ఆకతాయిల నుంచి పిల్లలని కాపాడుకోవాలంటే త్వరగా పెళ్లి చేసి పంపడమే రైటు. సాంబన్నయ్య కొడుకు పదో క్లాసు నాలుగు సార్లు తప్పాడు. ఇది గాని పాసయిందంటే చేసుకుంటాడో లేదో? తప్పినా ఫర్వాలేదు. ఒకింటి దాన్ని చేస్తే చాలు. మరి పెళ్లి అంటే మాటలా? ఒక తులం బంగారం అయినా పెట్టాలి. చెవిపోగులతో ఎట్టా సరిపెడతాం? ఇదేమైనా కొత్త విషయమా? ఎప్పటి నుంచో అనుకుంటున్నదే!
సుబ్బయ్య గారి తల్లి కి నెల రోజులుగా వంట్లో బాగా లేదు. సుబ్బయ్య గారి అమ్మాయి కి కూడా అమ్మ ఒడి డబ్బులు పడ్డాయి. ఆ పిల్ల ఉసూరుమంటూ వుంటుంది. ఒక్కడి సంపాదన! పెద్ద కూతుర్ని పురిటికి తీసుకు రావాలి. ఏ దేవుడో పంపినట్టు సమయానికి వచ్చినయ్ డబ్బులు!
స్వర్ణ పుస్తకం తీసుకొని చదువుదామని కూర్చుంది. మళ్లీ లోపల అమ్మ ఏం చేస్తోందో అని వంటగదిలోకి తొంగి చూసింది. ఆవిడ ఒక మూలన కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. స్వర్ణ వెళ్లి పక్కన కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుంది. అది ఒక్కటే అసలైన అమ్మ ఒడి.
అమ్మవొడి మీద బాగా రాశారు. “స్వర్ణ పుస్తకం తీసుకొని చదువుదామని కూర్చుంది. మళ్లీ లోపల అమ్మ ఏం చేస్తోందో అని వంటగదిలోకి తొంగి చూసింది. ఆవిడ ఒక మూలన కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. స్వర్ణ వెళ్లి పక్కన కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుంది. అది ఒక్కటే అసలైన అమ్మ ఒడి.”
చాలా బాగుంది మేడమ్.