అమెరికాలో కోవిడ్ – వైద్యవ్యవస్థ వైఫల్యాలు

ఎప్పటిలాగే ఉరుకులు పరుగుల మీద బయలుదేరి ఆఫీస్ చేరాను. పొద్దున్నే ఆఫీస్ కు వెళ్ళి కంప్యూటర్ తెరవగానే కాన్సర్ తో పోరాడుతున్న నా పేషెంట్ 78 ఏండ్ల డేవిడ్ చనిపోయాడని మెసేజ్ కనబడింది. వారం రోజుల క్రితమే వీడియో కాల్ లో అతనితో మాట్లాడాను. కాన్సర్ అతని శరీరం మొత్తం పాకి లేవలేని స్థితిలో సోఫాలో పడుకునే మాట్లాడాడు. కాన్సర్ అతని అవయవాలను తినేసింది కానీ అతనిలోని హాస్యాన్ని ఏమీ చేయలేకపోయింది. అంత నొప్పిలోనూ అతని వ్యంగ్యంతో ఛలోక్తులతో నన్నూ, భార్యనూ నవ్వించాడు. డేవిడ్ ఆఖరి శ్వాస విడిచినపుడు అతని భార్య అతని చేతిలో చేయి వేసి అతని పక్కనే ఉండి ఉంటుంది. అట్లా కుటుంబసభ్యుల మధ్య చనిపోయే అవకాశం కూడా లేకుండా కోవిడ్ తో ఎంతమంది ఒంటరిగా ప్రాణం విడుస్తున్నారో ఈ దేశంలో…

డేవిడ్ గురించి చెమర్చిన కండ్లలోని నీళ్ళు ఇంకకముందే నిన్న నేను ఎమర్జెన్సీ కి పంపిన మరొక పేషెంట్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చూశాను. అతని పేరు డాన్. ఒక్క మనిషికే ఇన్ని రోగాలు ఎట్లా వస్తాయి అనిపించేలా అతనికి ఒకదానితో ఒకదానికి సంబంధం లేని అరుదైన వ్యాధులు ఉన్నాయి. చూస్తుండగానే గత సంవత్సర కాలంలో అతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇదొక్కటీ గట్టెక్కితే మిగతావి ఎట్లయినా అధిగమిస్తాను అన్నట్టు అనారోగ్యంతో పోరాడుతూ వస్తున్నాడు. ఇంతలో కోవిడ్. బతుకుతాడో తెలియదు. మనసులో దుఃఖం.

అంతలోనే జాయ్స్ అనే పేషెంట్ ని కోవిడ్ వల్ల వెంటిలేటర్ మీద పెట్టారనే మెసేజ్ కనబడింది. ఇంకో గంట తరవాత మరో కోవిడ్ పేషెంట్ కి శ్వాస ఆడడం లేదంటే ఎమర్జెన్సీ కి పంపాము. ఇక రోజుకి ఇద్దరో ముగ్గురో పేషెంట్స్ కి పాజిటివ్ రావడం, అయిదో, పదో మంది పేషెంట్లు వాళ్ళ ఇంట్లో ఎవరికో పాజిటివ్ వచ్చిందని టెస్ట్ కోసం ఫోన్ చేయడం అనేది గత నాలుగు వారాల్లో మామూలు అయిపోయింది. పోలిక కోసం చెప్పాలంటే ఫస్ట్ వేవ్ ఉధృతంగా ఉన్న ఏప్రిల్-మే నెలల్లో నా పేషెంట్స్ వారానికి ఒకరో, ఇద్దరో పాజిటివ్ వచ్చేవాళ్లు. అప్పటితో పోలిస్తే విపరీతంగా పెరిగిపోయింది ఈసారి.

వీటన్నింటి నుండీ ఎప్పటికప్పుడు తేరుకుంటూ ప్రతి ఇరవై నిమిషాలకూ అపాయింట్మెంట్ కోసం వస్తున్న పేషెంట్లను చూస్తూనే ఉన్నాను. పేషెంట్లను చూస్తూ మధ్యలో నా అసిస్టెంట్ జెసికా ను అడిగాను , ‘ఈరోజు ఎట్లా ఉన్నావు?’ అని. ‘కొంచెం తల నొప్పి, దిబ్బడ ఉంది అంతే’ అన్నది. ఆమెకి మొన్నే హాస్పిటల్ ఎంప్లాయీ హెల్త్ క్లినిక్ లో కోవిడ్ టెస్ట్ చేశారు. నెగిటివ్ వచ్చింది. వ్యాధి లక్షణాలు (దగ్గు, జ్వరం, తల దిబ్బడ, వగైరా…) మొదలవగానే ఉద్యోగులందరినీ ఎంప్లాయీ హెల్త్ కు ఫోన్ చేయమంటారు. వెంటనే మొదటిరోజే పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చే అవకాశాలే ఎక్కువ. అయినా అదే చేస్తున్నారు. నెగిటివ్ వస్తే వాపస్ పనికి. జెసికాకు పొడి దగ్గు మొదలయిన రెండో రోజు టెస్ట్ చేశారు. నెగిటివ్ వచ్చింది. ఆమెకి చాలా తేలికపాటి లక్షణాలు ఉన్నాయి కానీ ఆమెకి కోవిడ్ వచ్చిందనేది నా గట్టి అనుమానం. ఆమెను నా పేషెంట్ గా రెజిస్టర్ చేసి టెస్ట్ చేశాను. పాజిటివ్! ఆమెకి వ్యాధి లక్షణాలు మొదలై ఈరోజుకి నాలుగో రోజు. అందులో రెండు రోజులు క్లినిక్ లో పని చేస్తూనే ఉంది. రోజుకు ఇరవై పేషెంట్లకు బ్లడ్ ప్రెషర్, పల్స్ చెక్ చేసి అడగాల్సిన ప్రశ్నలు అడిగి రూమ్ లో కూర్చోబెట్టడం ఆమె పని. ఆమె నుండి ఎంతమందికి వచ్చి ఉంటుందో తెలియదు. మాస్క్ వేస్కుని పని చేసింది కాబట్టి, ఆమెతో కాంటాక్ట్ లోకి వచ్చినవాళ్లను కాంటాక్ట్ గా పరిగణించరు. అంటే ఆమెకు పాజిటివ్ వచ్చిందన్న సమాచారం ఆ పేషెంట్లకు అందించరు. అమెరికాలో కోవిడ్ విపరీతంగా వ్యాపించడానికి ఇలాంటి పాలసీలు కూడా ఒక కారణం.

జెసికా కి పాజిటివ్ రాగానే ఒక గంట సేపు ఆగమాగం. ఆమెను ఇంటికి పంపితే ఆమె స్థానంలో ఎవరు పని చేయాలి, ఆమె ఇంటి నుండి పని చేయొచ్చా, ఎంప్లాయీ హెల్త్ ను కాదని నా ఆఫీస్ లో మళ్ళీ టెస్ట్ చేసినందుకు ఏమయినా ఇబ్బంది వస్తుందా ఇవన్నీ మేనేజర్ తో చర్చ. జెసికా కు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ఇంట్లో చిన్న పిల్లలు, ఆమె భర్త గురించి మనసులో మెదిలిన ప్రశ్నలు, తనకు ఇంకా ఎన్ని రోజుల సెలవులు మిగిలి ఉన్నాయనే ఆలోచనలు ముసురుకున్నట్టున్నాయి. ముట్టుకుని ఓదార్చే పరిస్థితి లేదు. నాకు మూడు వారాల క్రితమే కోవిడ్ వచ్చి తగ్గిపోయింది కాబట్టి పర్లేదన్న ధీమాతో భుజం చుట్టూ చేయి వేసి ఓదార్చాను. నాలుగు వారాల క్రితం వరకూ మా హాస్పిటల్ సంస్థ లో కోవిడ్ వచ్చిన ఉద్యోగస్తులకు ఐసోలేషన్ లో ఉన్న పది రోజులు జీతం యధావిధిగా ఇచ్చారు. పాండెమిక్ సెకండ్ వేవ్ ఉధృతమై చాలా మంది జబ్బు పడడం మొదలవగానే ఇక అట్లా జీతాలివ్వలేమని, కోవిడ్ వచ్చిన వాళ్ళు సెలవు రోజులను వాడుకోవాలని చేతులెత్తేశారు. సెలవు రోజులు మిగిలి లేనివాళ్ళకు జీతం కోత తప్పదు. జీతం రాదనుకుంటే ఎంత మంది జబ్బు లక్షణాలున్నా దాచిపెట్టి పనికి వస్తారో ఎవరికి తెలుసు. తప్పని పరిస్థితి మరి. ఇంట్లో ఉండి రెండు వారాలు జీతం కోల్పోవడమా, లేక పని చేయగలిగే పరిస్థితిలో ఉంటే పనికి పోవడమా అంటే, బ్యాంక్ లో సేవింగ్స్ లేని మామూలు ఉద్యోగస్తులు ఏమి ఎంచుకుంటారో ఊహించడం కష్టం కాదు.

***

పైన చెప్పిందంతా డిసంబర్ 3 న ఒక్క రోజులో మా క్లినిక్ లో జరిగిన విషయాలే. అమెరికాలో మార్చ్ 2020 లో కోవిడ్ వ్యాప్తి మొదలయినప్పటి నుండి ఇట్లాంటి రోజులు ఎన్నో. రోజుకొక తీరు హై డ్రామా హెల్త్ కేర్ వర్కర్ల జీవితాల్లో. తెల్లారేసరికి ఉద్యోగాలు ఊడిన డాక్టర్లు, ఉద్యోగస్తుల లెక్క లేదు. అందరికీ ఏదో రకంగా జీతాల్లో కోత. మా హాస్పిటల్ సంస్థలో పని చేసే వాళ్ళందరికీ ఐదు నెలలు ఎంప్లాయర్ పెన్షన్ కట్ అయిపోయింది. కొన్ని సంస్థల్లో 10% జీతం కోత. అయితే మా సంస్థలో లాక్డౌన్ వల్ల పేషెంట్లు, ఎమర్జెన్సీలు కాని సర్జరీలు తగ్గిపోయినా జీతాలు తగ్గించమని హామీ ఇచ్చారు. మావరకు ఇదొక ఉపశమనమే అయినా అది మాకు హక్కుగా రావలసిందే కదా! దశాబ్దాలుగా డాక్టర్లు, ఇతర ఉద్యోగస్తుల కష్టంతో హాస్పిటళ్లు గడిస్తున్న లాభాలకు లెక్కలేదు. కొన్ని నెలలు మాత్రమే తగ్గిన రాబడికి ఇన్ని కోతలు. హాస్పిటల్స్ కు తాత్కాలికంగా రాబడి కొంత తగ్గినా ప్రభుత్వం నుండి కోవిడ్ రిలీఫ్ ఫండ్స్ కూడా వాటికి అందుతాయి. ఇది రాస్తుండగానే హాస్పిటల్ యాజమాన్యం నుండి ఒక కొత్త ఈమెయిల్ వచ్చింది. గత కొన్ని వారాలుగా తీవ్రతరమైన కోవిడ్ సెకండ్ వేవ్ లో జీతం గ్యారంటీ కావాలంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి పని చేయాలని దాని సారాంశం. ఉద్యోగంలో అభద్రత, జీతం కోత, పని వత్తిడి ఒకవైపు అయితే కోవిడ్ పేషెంట్లతో పని చేస్తూ ఎప్పుడు కోవిడ్ వస్తుందో అనే ఆందోళన ఇంకోవైపు. ఎప్పుడేమి జరుగుతుందో అనే అనిశ్చితి వైద్య రంగంలో పని చేసేవాళ్ళలో డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు అధికంగా కనిపిస్తుట్టు పరిశోధనల్లో తెలుస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో కోవిడ్ మరణాలు అత్యధికంగా ఉండడానికి కారణాలు ఏంటని ప్రపంచ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత పన్నెండేళ్లుగా ఈ దేశంలోని వైద్య వ్యవస్థ లో పని చేస్తున్న నాకు అది ఆశ్చర్యం కలిగించలేదు. నిజానికి అమెరికాలో కోవిడ్ ప్రవేశించకముందే చైనా లోని వూహాన్ లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చదివి అమెరికాకు కోవిడ్ వస్తే దాన్ని నిలువరించే పరిస్థితి లేదని నేను ఊహించాను. హుటాహుటిన కట్టిన మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్, వేరే ప్రాంతాల నుండి తరలించిన హెల్త్ కేర్ వర్కర్లు, కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్న వేల మంది ఎపిడెమియాలజిస్టులు, వేల సంఖ్యలో ECMO (కృత్రిమంగా గుండె, ఊపిరితిత్తుల పని చేసే మెషీన్) లతో చికిత్స, ఇవన్నీ అమెరికన్ హెల్త్ కేర్ సిస్టమ్ లో సాధ్యమయ్యే పనులు కాదని, నాకే కాదు, దానిని దగ్గరగా చూసినవాళ్లెవరికీ ఊహించడం కష్టం కాదు.

మార్చ్ నెలలో కోవిడ్ అమెరికాలో వ్యాపించడం మొదలవగానే అమెరికా వ్యవస్థ డొల్లతనం మాస్కులు, టెస్టుల కొరతతో బయటపడింది. గ్లోబలైజేషన్ లో భాగంగా లేబర్ వ్యయం తగ్గించుకునేందుకు అమెరికాలో చాలా కంపనీలు ఉత్పత్తులన్నీ ఇతర దేశాలకు తరలించాయి. వస్తువులు ఉత్పత్తి చేసే కర్మాగారాలు, కార్మికులు లేని దేశంలో హఠాత్తుగా వచ్చి పడిన కోవిడ్ విపత్తును ఎదురుకునేందుకు కావలసిన మాస్కులు, వెంటిలేటర్లు, టెస్టులు హుటాహుటిన తయారుచేసుకునే సామర్థ్యం లేకుండా పోయింది. మొన్నమొన్నటి వరకు కూడా కావాల్సినన్ని మాస్కులు గానీ, అవసరమున్న వాళ్ళందరికీ టెస్టులు చేయగలిగేటన్ని టెస్ట్ కిట్లు గానీ ఈ దేశంలో అందుబాటులో లేవు.

మా సంస్థ లో అవుట్‌పేషెంట్ క్లినిక్ లలో ఉన్న మాస్కులు, గౌనులన్నీ హాస్పిటల్ కి పంపించి మా క్లినిక్ లన్నీ మూసేయాల్సి వచ్చింది. ఐటీ ఉద్యోగులను చూసి, “మనం కూడా ఇంటి నుండి పేషెంట్లను చూడగలిగితే బాగుండు” అని నవ్వుకునే మేము అనివార్యంగా ఇంటి నుండి రోజుకు ఎనిమిది గంటలు వీడియో కాల్స్ లో, ఫోన్ కాల్స్ లో పేషెంట్లను చూడడం మొదలుపెట్టాల్సి వచ్చింది. ఇంటినుండి పని చేయగలిగిన అవుట్‌పేషెంట్ డాక్టర్లు కొంత కాలం కోవిడ్ నుంచి తప్పించుకోగలిగారు. నాలాగా హాస్పిటల్ ఉద్యోగిగా పని చేస్తున్న అవుట్‌పేషెంట్ డాక్టర్లు జీతం గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం రాలేదు. ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లకు వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ తో పని ఏమీ తగ్గకపోయినా వాటికి ఇన్షురెన్స్ కంపనీలు చెల్లించే డబ్బు చాలా తక్కువ కావడంతో చాలా ప్రైవేట్ ప్రాక్టీసులు మూత పడ్డాయి. అట్లానే చాలా మంది ప్రైవేట్ స్పెషలిస్ట్ లు ఎమర్జెన్సీలు తప్ప వేరే సర్జరీలు చేయలేని పరిస్థితి రావడంతో వాళ్ళ ప్రాక్టీసులు మూత పడ్డాయి. రెండు నెలలు మొత్తం ఇంటి నుండి పని చేశాక మళ్ళీ క్లినిక్ లో పేషెంట్లను చూడడం మొదలుపెట్టాము. రెండు మూడు నెలల కిందటి వరకు కూడా అందరికీ సరిపోయేన్ని ఎన్-95 మాస్కులు మాకు అందుబాటులో లేవు. ఎన్-95 మాస్కులు లేవనే కారణం చెప్పకుండా కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి సర్జికల్ మాస్కులు సరిపోతాయని, వాటితోనే కోవిడ్ పేషెంట్లను చూడవచ్చని మా హాస్పిటల్ సంస్థ లో చెప్పారు. గత్యంతరం లేక సర్జికల్ మాస్కులతో పని చేసి కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఎంతమందో. అమెరికాలో సామాన్య జనాభాతో పోల్చితే హెల్త్ కేర్ వర్కర్లకు కోవిడ్ వచ్చే అవకాశం మూడు రెట్లు ఉన్నట్టు ఒక పరిశోధనలో తేలింది. ఇప్పటివరకు అమెరికాలో సుమారు మూడువేల మంది హెల్త్ కేర్ వర్కర్లు కోవిడ్ తో చనిపోయారు. అందులో కనీసం మూడో వంతు మంది సరైన PPE లేకపోవడం వల్లనే చనిపోయినట్టు తెలుస్తుంది.

ఇక అమెరికా హెల్త్ కేర్ వ్యవస్థలోకి అడుగుపెట్టే పేషెంట్ల పరిస్థితి అయోమయంగా ఉంటుంది. నిజానికి అమెరికా వైద్య వ్యవస్థ అంటూ ఒకటి లేదు. ఇది ఎన్నో వ్యవస్థల కలగూర గంప. ఉద్యోగస్తులు, సీనియర్ సిటిజెన్ లు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవాళ్లు, సైన్యంలో పనిచేసిన వాళ్లు, ఇట్లా వేరు వేరు సమూహాలకు వేరు వేరు రకాల ఇన్షురెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ సమూహాల్లో లేనివాళ్లు సొంతంగా ఇన్షురెన్స్ తక్కువ ధరలకు కొనుక్కునే అవకాశాన్ని ‘ఒబామాకేర్’ చట్టం కల్పించింది. అయినప్పటికీ అమెరికాలో 18-64 వయసులో ఉన్నవాళ్ళలో 15% మందికి ఎలాంటి ఇన్షురెన్స్ లేదు. పాండెమిక్ లాంటి ప్రజారోగ్య విపత్తు వచ్చినప్పుడు దేశంలోని వైద్య వ్యవస్థనంతా సమన్వయపరిచి చర్యలు తీసుకోవడానికి ఇక్కడ విస్తారంగా ప్రభుత్వ వైద్యశాలల నెట్‌వర్క్ లేదు. ప్రభుత్వ వైద్యశాలల సంఖ్య చాలా తక్కువ.

ప్రైవేట్ వైద్యశాలలు ఇన్షురెన్స్ కంపనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఆ ఒప్పందాల ప్రకారం ఇన్షురెన్స్ కంపనీలు హాస్పిటల్స్ వేసిన బిల్లుల్లో కొంత శాతం మాత్రమే చెల్లిస్తాయి. ఇన్షురెన్స్ కంపనీల నుండి డబ్బులు రాబట్టడానికి హాస్పిటల్స్ అవి అందించే వైద్యసదుపాయాలకు విపరీతమైన చార్జీలు వేస్తాయి. హాస్పిటల్లు ఇన్షురెన్స్ కంపనీలకు వేసిన బిల్లుల్లో 70-80% శాతం వరకు కూడా ఇన్షురెన్స్ అడ్జస్ట్మెంట్ పేరుతో తగ్గించబడుతుంది. హెల్త్ ఇన్షురెన్స్ ఉన్నవాళ్ళు ఇన్షురెన్స్ అడ్జస్ట్మెంట్, ఇన్షురెన్స్ చెల్లించే డబ్బులు పోను మిగిలింది తమ జేబుల్లోంచి చెల్లిస్తారు. ఇక ఇన్షురెన్స్ లేనివాళ్ళకు ఇన్షురెన్స్ అడ్జస్ట్మెంట్లు ఉండవుకనుక హాస్పిటల్స్ వేసే బిల్లులను భరించే పరిస్థితి ఉండదు. మందుల విషయంలో కూడా ఫార్మా కంపనీలు, ఇన్షురెన్స్ కంపనీలు ఇదే ఆట ఆడుతాయి. ఈ మొత్తం ఆటలో ఒక మందుకు లేదా ఒక వైద్యసేవ కు, అసలు వ్యయం ఎంతో రోగులకు కానీ, డాక్టర్లకు కానీ తెలిసే అవకాశం లేదు. ఇలాంటి వ్యవస్థలో అరకొర ఇన్షురెన్స్ ఉన్నవాళ్ళు, అసలే ఇన్షురెన్స్ లేనివాళ్లు కోవిడ్ లాంటి అంటువ్యాధి సోకినప్పుడు వైద్యం కోసం డాక్టర్లను సంప్రదించకపోవడమో, లేదా ప్రాణం మీదకు వస్తే తప్ప హాస్పిటల్స్ కు వెళ్లకపోయే అవకాశాలు ఎక్కువ. అట్లా కూడా అమెరికాలో కోవిడ్ వ్యాప్తి అధికంగా జరిగింది.

కొన్ని వారాల క్రితం ఒక పేషెంట్ నాతో, “నిజంగా కోవిడ్ తో అంత ప్రమాదం ఉందా?”, అని అడిగింది. “ఈ వ్యాధితో లక్షల సంఖ్యలో చనిపోతున్నారు కదా”, అన్నాను. “అవుననుకో! కానీ చనిపోయేవాళ్ళందరూ ముసలివాళ్లు, డయాబెటిస్ (షుగర్) వంటి వ్యాధులు ఉన్నవాళ్లే కదా” అని చాలా మామూలుగా అనేసింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు పరాకాష్ట అయిన అమెరికాలో ఇలాంటి వ్యక్తివాదం ప్రబలమైన భావజాలం. సామాజిక సంక్షేమం అనే భావజాలానికి చాలామంది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. వ్యక్తివాదం ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో అమెరికాలో ప్రస్తుతం కోవిడ్ సంక్షోభంలో చూడవచ్చు. అందరూ మాస్కులు వేస్కోవాలని ఆదేశాలిస్తే ప్రభుత్వం తమ వ్యక్తిగత హక్కులను హరిస్తుందని ఎన్నో చోట్ల ప్రజలు నిరసనలు చేశారు. ఇలాంటి వింత పోకడలు అమెరికా లాంటి దేశంలోనే సాధ్యమవుతాయి. సమాజ శ్రేయస్సు కన్నా, మనుషుల ప్రాణాల కన్నా వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమనే భావజాలం వల్ల చాలా మంది మాస్కులను, లాక్డౌన్ లకు వ్యతిరేకిస్తున్నారు. పర్యవసానంగా కోవిడ్ దేశమంతటా అడవి మంటలా వ్యాపించింది.

పైన చెప్పిన కారణాలన్నీ అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా ఏదో ఒక స్థాయిలో కోవిడ్ వ్యాప్తిపై ప్రభావం చూపి ఉండేవి. వీటన్నింటిని తలదన్నే ప్రభావంగా ట్రంప్ పరిణమించాడు. కోవిడ్ అనే నిజాన్నే తిరస్కరిస్తూ, మొదట్లో కోవిడ్ అనే వ్యాధే లేదని ఒకవైపు, అసలు అది అమెరికాకే రాదని మరోవైపు ప్రచారం చేశాడు. ఆ తర్వాత వేలకొలది ప్రజలు చనిపోతుంటే ‘కోవిడ్ చూస్తుండగానే మాయమయిపోతుంద’ని అన్నాడు. సైంటిస్టులు, వైద్య నిపుణులు ఇచ్చే సలహాలను పెడచెవిన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించాడు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లా అమెరికాలో ఒక జాతీయ వ్యూహం గానీ, ఒక స్థిరమైన ప్రజారోగ్య సందేశం గానీ లేకుండా చేశాడు. అంటువ్యాధుల నియంత్రణలో అంతర్జాతీయంగా గొప్ప సంస్థగా పేరు తెచ్చుకున్న CDC (Centers for Disease Control and Prevention) ను నిర్వీర్యం చేసి ఎలాంటి ఆధారాలు లేని మందులను కోవిడ్ వ్యాధిని నయం చేస్తాయని ప్రచారం చేశాడు. సైంటిస్టులను ‘తెలివితక్కువవాళ్ల’ని గేలి చేశాడు. డాక్టర్లు డబ్బులకోసం పేషెంట్లకు కోవిడ్ లేకున్నా ఉన్నట్టు రికార్డ్ చేస్తున్నారని ప్రచారం చేశాడు. మాస్కులు వేస్కున్నా కోవిడ్ వ్యాప్తి పెద్దగా తగ్గదని, కోవిడ్ వస్తే అదే తగ్గిపోతుందని చెప్పి ప్రజలు కోవిడ్ ను, మాస్కులను సీరియస్ గా తీసుకోకుండా చేశాడు. ఇట్లా కోవిడ్ గురించి ట్రంప్ చేసిన అబద్దపు ప్రచారాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. కొంత తెలివితో కోవిడ్ సంక్షోభాన్ని ఎదురుకొని ఉంటే ట్రంప్ మళ్ళీ గెలిచి ఉండేవాడేమో కూడా! కానీ కోవిడ్ ను పట్టించుకోకపోతే తన అధికారానికే ముప్పు వాటిల్లుతుందని కూడా గ్రహించలేనంత మూర్ఖుడు ట్రంప్. ఎంత అభివృద్ధి చెందిన దేశమయినా శాస్త్రీయ పద్ధతులను విస్మరిస్తే ఎంత నష్టపోతుందో కోవిడ్ సందర్భంలో అమెరికా రుజువుచేసింది.

అస్తవ్యస్తమైన ఈ పరిస్థితుల్లో 10 రోజుల క్రితం మా హాస్పిటల్ సంస్థకు కరోనా వాక్సీన్ సరఫరా అయింది. మా సంస్థలో ఇప్పటికే వేయి మందికి పైగా వాక్సీన్ ఇచ్చారు. కోవిడ్ వల్ల రోజువారీ పని ఒత్తిడి, మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న హెల్త్ కేర్ వర్కర్లకు ఇదొక గొప్ప ఉపశమనం. ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా అమెరికన్లు కోవిడ్ వల్ల చనిపోయినా వాక్సీన్ లకు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారాలు జరుగుతున్నాయి. వాక్సీన్ పరిశోధనల్లో ఏ సమూహాలనైనా విస్మరించారా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాక్సీన్ లతో పెద్ద ఫార్మా కంపనీలు ఎంత డబ్బు చేసుకుంటున్నాయి, సంక్షోభాలను లాభాలు గడించడానికి ఎట్లా వాడుకుంటున్నాయి – ఇవి ఇప్పుడు అడగాల్సిన అసలు ప్రశ్నలు. వాటిని పక్కకు పెట్టి వాక్సీన్ లకు వ్యతిరేకంగా సూడోసైంటిఫిక్ సిద్ధాంతాలను ప్రచారం చేసేవాళ్లు కుప్పలుతెప్పలుగా బయలుదేరారు. వాళ్ళను తిప్పికొట్టడం కూడా ఇప్పుడు వైద్యరంగ నిపుణులకు అదనపు బాధ్యత.

అమెరికాలో ప్రస్తుతం కోవిడ్ మునుపటికన్నా వేగంగా ప్రజల ప్రాణాలను కబళిస్తున్నప్పటికీ వాక్సీన్ ల రాక అందరిలో ఒక ఆశను కలిగిస్తుంది. వాక్సీన్ లతో కొన్ని నెలల్లో కోవిడ్ సంక్షోభం నుండి కొంతవరకయినా బయటపడే అవకాశం ఉంది. అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాలను ఏదో ఒక రకంగా ప్రభావితం చేసిన ఈ సంక్షోభం, చాలా మందిలో దాని మూల కారణాలను అన్వేషించే దిశగా ఆలోచింపజేసింది. నా పేషెంట్లు చాలా మంది మనుషులు పర్యావరణాన్ని కాపాడకపోవడం వల్లే ఇలాంటి విపత్తులు వస్తాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సాటి మనుషుల పట్ల ఎలాంటి పట్టింపు లేనివాళ్లు ఒకవైపయితే ఎలాంటి సంబంధమూ లేని మనుషుల పట్ల ఎనలేని ప్రేమను, సోదరభావాన్ని కనబరచినవాళ్లు మరోవైపు. డాక్టర్ల గ్రూపుల్లో కోవిడ్ సందర్భంలో అమెరికా వైద్య వ్యవస్థ ఎట్లా మారాలన్న చర్చ వచ్చినప్పుడు అధికసంఖ్యలో డాక్టర్లు అమెరికన్లందరికీ ఉచిత వైద్యం అందించే వ్యవస్థను ఏర్పరచాలని అభిప్రాయపడ్డారు. సరైన మాస్కులు, గౌన్లు, సరిపోను స్టాఫ్ లేకుండా పనిచేయమని నర్సులు చాలా చోట్ల నిరసనలు చేశారు. ఈ దారుణమైన విపత్తునుండి నేర్చుకున్న గుణపాఠాలతో ఒక కొత్త సమాజం ఏర్పరిచే దిశగా కొందరయినా అడుగులు వేస్తారని, ముందు తరాలకు కొత్త దారిని చూపిస్తారని ఆశ కలుగుతుంది. యధాతథ స్థితిని ప్రశ్నించే ఏ చిన్న పరిణామాలయినా ప్రపంచం పట్ల నా ఆశావాహ దృక్పథాన్ని కోల్పోకుండా కాపాడుతుంటాయి. ఇక కోవిడ్ వచ్చిందని చెబితే, ‘అయ్యో ఎలా ఉన్నావ’ని అమాయకంగా కన్నీళ్లు పెట్టుకున్న రూత్ లాంటి పేషెంట్లు రోజూ నన్ను నా క్లినిక్ వైపు నడిపిస్తుంటారు.

(P.S: వ్యాసంలో పేషెంట్ల పేర్లు మార్చిరాశాను. హాస్పిటల్ లో చేరిన కొద్దిరోజుల్లోనే డాన్ చనిపోయాడు.)

(వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల కోవిడ్ అనుభవాలను రికార్డ్ చేయాలనే కృషి చేస్తున్న ఒక జర్నలిస్టు మిత్రుడు కోరితే రాసిన వ్యాసం ఇది.)

పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

15 thoughts on “అమెరికాలో కోవిడ్ – వైద్యవ్యవస్థ వైఫల్యాలు

    1. స్వియానుభవంతో వాస్తవ పరిస్థితిని తెలియచేస్తూ చాలా బాగా రాసావు.

  1. చాలా ఉపయోగకరమైన మెడికల్ ఆర్టికల్.అమెరికాలో కోవిడ్ వాస్తవ పరిస్థితులను బాగా చెప్పావు చైతన్యా.నా పిల్లలతో పాటు అమెరికాలో ఎంతో మంది భారతదేశ పిల్లలు ఉన్నారు. కొద్దిగా ఆందోళన తగ్గింది.కానీ ఈ వ్యాసం ఇంగ్లీష్ లో అనువాదం చేయాలి ఇండియా ,usa లో చాలా మంది కి ఫార్వార్డ్ చేసాను.అభినందనలు dr. చైతన్యా

  2. చాలా బాగా చెప్పావు చైతన్యా, అమెరికా సంగతి తెలుసుకున్న వారికి, మిగిలిన ప్రపంచంతో దానిని పోల్చి చూసుకుని అన్వయించుకోవడం, సత్యాన్ని గ్రహించడం తేలిక అవుతుంది.

  3. మీ వ్యాసంతో ట్రంపు, కెసియార్ ఇద్దరు ఇద్దరే అనిపించింది.

  4. చాలా బాగుంది. వైద్యవ్యవస్థ గురించి ఇంకాస్త వివరంగా మరో ఆర్టికల్ రాయండి

    1. Thank you, jyothi garu! తప్పకుండా ప్రయత్నం చేస్తాను.

  5. డాక్టర్ చైతన్య మీకు అభినందనలు.అమెరికా ఆరోగ్య విధానంలో ఉన్న వాస్తవ పరిస్తితులను చక్కగా వివరించారు.ఏ దేశంలోనైనా విద్య,వైద్య రంగాలపై ప్రభుత్వ బాధ్యత లేకపోతే వినాశకర పరిణామాలే సంభవిస్తాయి.

Leave a Reply