ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు చట్టసభల్లో ప్రతిబింబిస్తేనే పార్లమెంటరీ వ్యవస్థలు చిరకాలం మనగలుగుతాయి… లేకపోతే అవి కుప్పకూలిపోతాయి. ప్రజాస్వామ్యంలో చర్చకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. చర్చ లేకపోతే అది ప్రజాస్వామ్యం కాలేదు. ప్రథమ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ చేసిన హెచ్చరిక ఇది. ప్రజల బాగుకోసం ప్రభుత్వమూ విపక్షం కలిసి నడుస్తూ చట్టసభల గౌరవ ప్రతిష్ఠలను కాపాడుకోవాలని నెహ్రూ ఉద్భోధించారు. కానీ, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్నదేమిటి? రాజకీయ ప్రత్యర్థులుగా కాదు, పరస్పర శత్రువులుగా కొట్లాడుకుంటున్న అధికార, ప్రతిపక్షాలు కలిసి భారత ప్రజాస్వామ్యం పుట్టిముంచేస్తున్నాయి. డిసెంబర్ 13న లోక్‌సభలోకి ఆగంతకులు చొరబడిన అనూహ్య ఘటన దరిమిలా విపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ శీతాకాల భేటీలు దద్దరిల్లాయి. పర్యవసానంగా ఉభయ సభలకు చెందిన 146 మంది ప్రతిపక్ష ఎంపీలపై బహిష్కరణ వేటుపడింది. ఉభయసభల్లో అధికార పక్షానికి ఎదురాడే గొంతులు బాగా తగ్గిపోయాయి. ప్రజాకాంక్షలను పట్టించుకోకుండా, పట్టువిడుపులు లేకుండా ప్రవర్తిస్తున్న అధికార పార్టీ అతిప్రమాదకరమైన ఏకపక్ష ప్రజాస్వామ్యాన్ని దేశం నెత్తిన రుద్దుతుంది. ప్రతిపక్షాలు లేని పాలన కావాలనుకుంటే దానికి ప్రజాస్వామ్యమని పేరెందుకు?
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్వరూపం గురించి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవగాహనకు భిన్నంగా నేడు భారత పార్లమెంట్లో వ్యవహారాలు చోటు చేసుకుంటున్నట్లు ఆందోళన కలిగిస్తున్నది. భారత రాజ్యాంగ నిర్మాతలు వారి ఆలోచనల ప్రకారం అధికార పక్షంను జవాబుదారీ కావించడమే పార్లమెంట్ ప్రధాన కర్తవ్యం. పార్లమెంట్లో ప్రతిపక్షాలకు మొదటగా కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మౌలిక సూత్రం. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం అనూహ్యమైనది మాత్రమే కాదు, అది పూర్తిగా ప్రమాదకరం. దివంగత అమెరికా అధ్యకక్షుడు హ్యారీ ట్రూమాస్ అంతర్గత భద్రతా విషయాలపై అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగిస్తూ ప్రముఖంగా హెచ్చరించినట్లుగా, ‘ఒకసారి ప్రతిపక్షాల గొంతును నిశ్శబ్దం చేసే సూత్రానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటే, అది పౌరులందరికీ భయాందోళనలకు మూలంగా మారే వరకు, ప్రతి ఒక్కరూ భయంతో జీవించే దేశాన్ని సృష్టించే వరకు పెరుగుతున్న అణచివేత చర్యల మార్గం ఏర్పర్చుతుంది’.
చట్టసభల ద్వారా ప్రజలకు ఏ ప్రభుత్వమైన జవాబుదారీ కావాలి. సర్కారీ విధానాలను నిర్మాణాత్మకంగా విమర్శిస్తూ ప్రజాప్రయోజనాలకు విపక్షం కావలి కాయాలి. తొలినాళ్లలో పార్లమెంటులో అధికార ప్రతిపక్షాలు అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించేవి. నెహ్రూ హయాములో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరుగుతున్నప్పుడు ఆ ఉపన్యాసం నిర్జీవంగా ఉందని విపక్ష నేత అశోక మెహతా మండిపడ్డారు. ఆయన విమర్శల్లో వాస్తవముందని జవహర్లాల్ నెహ్రూ ఆపై వినమ్రంగా ఒప్పుకొన్నారు. తన ప్రత్యేక సహాయకుడు ఎం ఓ మథాయ్పై ప్రతిపక్షాలు సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సంబంధిత కమిటీకి దాన్ని పంపాలని నెహ్రూయే స్పీకర్‌కు సిఫార్సు చేశారు. ‘సభలో గణనీయంగా ఉన్న సభ్యులు కొందరు పలానా పని జరిగితే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు మెజారిటీ బలంతో వారి ఆకాంక్షలను అణచివేయకూడదు’ అని ప్రథమ ప్రధాని నెహ్రూ ఉద్ఘాటించారు. నాటితరం రాజనీతిజ్ఞతలోంచి ప్రాణం పోసుకున్న పార్లమెంటరీ సంప్రదాయాలు నేడు అవసాన థకు చేరుకున్నాయి. ఎన్.జి.గోరె, నాథ్ పాయ్, హీరెన్ ముఖర్జీ, మధు లిమాయే, రామ్ మనోహర్ లోహియా వంటి నాయకులు ప్రజాసమస్యలను పార్లమెంటులో హుందాగా గట్టిగా ప్రతిధ్వనింపజేసేవారు. నిర్మాణాత్మక విమర్శలతో ప్రభుత్వాలను ఇరుకున పెట్టేవారు.
కీలకమైన అంశాలపై లోతైన చర్చలు జరిపి, అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం నిర్మించే ప్రయత్నాలకు వేదికగా పార్లమెంట్ ఉండాలనే మౌలిక ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నారు. ఒకటి, రెండు గంటల వ్యవధిలో కీలకమైన బిల్లులు ప్రతిపక్షాల ప్రమేయం లేకుండా ఆమోదింప చేసుకుంటూ ఘనంగా చాటుకొనే దుస్థితికి చేరుకొంటున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, ఎన్నుకోబడిన నిరంకుశత్వానికి మధ్య ఉన్న తేడాను విస్మరిస్తున్నాము. గత కొంత కాలంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన కీలక అంశాలపై చర్చలకు నిరాకరించడం, ఆ అంశాలు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నారనే సాకుతో సమావేశాలను వాయిదా వేస్తుండటం, చివరి రెండు, మూడు రోజుల్లో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి తమకు కావాలనుకున్న బిల్లులను సరైన చర్చ లేకుండా ఆమోదింప చేసుకోవడం ఒక రివాజుగా మారుతున్నది. మణిపూర్‌లో హింస కావచ్చు, అదానీ కంపెనీలపై చెలరేగిన ఆరోపణలు కావచ్చు, మరే జాతీయ ప్రాధాన్యత గల అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తినా గుడ్డిగా చర్చకు, కనీసం ప్రభుత్వ పక్షాన ఓ ప్రకటన చేసేందుకు నిరాకరిస్తున్నారు.
నియంతృత్వ దేశాల్లో శాసన నిర్మాణ అధికారాలు పూర్తిగా నియంతల చేతుల్లో ఉంటాయి. మెజారిటీ పక్ష ప్రజాస్వామ్యాల్లో కూడా ఈ అధికారాలు సభలో ఎక్కువ బలం పొందిన వారికే ఉంటాయి. కాని మెజారిటీ సీట్లు సంపాదించుకొన్న పార్టీల పరిపాలన కొనసాగే దేశాల శాసనసభల్లో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉంటుంది. గణనీయమైన సంఖ్యలో కావచ్చు, పరిమిత సంఖ్యలోనే కావచ్చు. ప్రతిపక్షం ఉనికి ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదంగా ఉంటుంది. శాసనాధికారాలు పాలక పక్షం చేతిలోనే ఉన్నప్పటికీ ఆ శాసనాలను చేసేటప్పుడు పార్లమెంటులోనూ, శాసన సభల్లోనూ వాటిపై చర్చ జరగాల్సి ఉంటుంది. ఆ చర్చల్లో ప్రతిపక్షం వ్యక్తం చేసే భిన్నాభిప్రాయం చాలా విలువైనది. పాలక ప్రతిపక్షాలకు మధ్య చర్చ తప్పనిసరిగా జరిగినప్పుడు ఆ శాసనాలకు సంబంధించిన బిల్లుల మంచి చెడ్డలు ప్రజల దృష్టికి వస్తాయి. అది క్రమక్రమంగా పాలక పక్షంపై ప్రజాభిప్రాయం రూపుదిద్దుకోడానికి దోహదం చేస్తుంది.
అత్యంత విచారకరమైన విషయమేమంటే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపక్షాన్ని లేకుండా చేసి బిల్లులను ఏకపక్షంగా ఆమోదించడానికి అలవాటు పడిపోయింది. అందుకోసం ప్రతిపక్ష సభ్యులను మూకుమ్మడిగా పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడం అలవాటు చేసుకొన్నది. నిజానికి భిన్నాభిప్రాయాల కలబోతతో సాగాల్సిన ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఏకపాత్రాభినయంగా మార్చాలని చూస్తున్నట్లుంది. అందువల్లనే ప్రతిపక్షాలు లేని లోక్‌సభలో 18బిల్లులు, రాజ్యసభలో 17 బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. ఈ బిల్లులు సామాన్య ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనే కనీస చర్చ సభలో జరగకపోవడం విచారకరం. వలసవాద తరహా నియంతృత్వ పాలన కోరుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధోరణికి ఇది అద్దం పడుతుంది.
శీతాకాల సెషన్లో ఆమోదించబడిన బిల్లులలో శాంతిభద్రతలు, ఆర్థిక సమస్యలు, విశ్వవిద్యాలయాలు, మీడియా తదితర అంశాలు ఉన్నాయి. ఇంకా భావ ప్రకటన స్వేచ్ఛ, డిజిటల్ రంగంలోని సోషల్ మీడియా వంటి అంశాలపై కూడా ఈ నూతన చట్టాలు దాదాపు పూర్తిస్థాయి నియంత్రణ సాధిస్తాయి. దాంతో వ్యక్తుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హరింపబడే అవకాశం ఉంది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే లోక్‌సభలో మూడు బిల్లులు ఆమోదం పొందాయి. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టం (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లు, కేంద్ర వస్తువులు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు, తాత్కాలిక పన్నుల సేకరణ బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి)ని భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)గా, నేర శిక్షాస్మృతి (సిఆర్పిసి) భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎన్)గా, సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో భారతీయ సాక్ష్య (బిఎస్) బిల్లులను చట్టాలుగా మార్చుకునేందుకు ‘లోక్‌సభ’ ఆమోదించింది.
పోస్టాఫీస్ బిల్లుల సవరణలు ఇంకా దారుణంగా ఉంది. తపాలా సేవల్లో లోపాలకు వినియోగదారుల హక్కుల చట్టం-2019వర్తించదని జాతీయ వినియోగదారుల వివాదల పరిష్కార కమిషన్ చట్టం కూడా పేర్కొంటోంది. అలాంటప్పుడు, తపాలా సేవల్లో లోపాలకు, ప్రజలకు వాటిల్లే నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొరియర్ సర్వీసుల నియంత్రణకు భిన్న విధానాలు అమలవుతున్నాయి. ప్రైవేటు కొరియర్ సర్వీసులపై అజమాయిషీకి వినియోగదారుల రక్షణ చట్టం-2019 వర్తిస్తుంది. కొత్త బిల్లు ప్రకారం, వినియోగదారుడికి ప్రభుత్వ తపాలా సేవల్లో లోపాలను ప్రశ్నించే హక్కు ఉండదు. ఏదో కారణం చూపించి పోస్టాఫీస్ ద్వారా పంపించే ఉత్తరాలను చదివే అధికారం ప్రభుత్వం గుంజుకోవడం దేనికి నిదర్శనంగా నిలుస్తుంది? మనం పంపించే అతిముఖ్యమైన ఉత్తరాలు సరైన సమయంలో చేరకపోయినా, లేదా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఆపివేసినా కనీసం దానిపై నష్టపరిహారం కోరే హక్కును కూడా ప్రజలకు లేకుండా చేశారు. ఈ బిల్లులు దేశంలోని ప్రతి పౌరుని జీవన విధానంపై, స్వేచ్ఛపై ప్రభావాన్ని చూపుతాయి. ఇంకా మూడు కశ్మీర్ బిల్లులు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆప్ పీరియాడికల్స్ బిల్లు వంటి అన్యాయమైన బిల్లులను ఆమోదింపజేసుకున్నది. టెలి కమ్యూనికేషన్స్ బిల్లులో శాంతిభద్రతలు, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిస్థితులున్నాయని భావించినప్పుడు టెలికం నెట్వర్క్ మొత్తాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రజాప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం సందేశా(మెసేజీ)లను రహస్యంగా వినొచ్చు. ప్రసారాలను నిలిపివేయవచ్చు.
మరో ముఖ్యమైన బిల్లు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతరుల నియామక ప్రక్రియకు సంబంధించినది. పార్లమెంటులో రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం ద్వారా కమిషన్ సభ్యుల నియామకం జరిగిన ఎన్నికల కమీషన్ స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అన్న పొగడల్తి పక్కనపెట్టి గమనిస్తే ఎన్నికల ప్రక్రియ యావత్తూ ధన, భుజ, అధికార మదబలుల పూనక ప్రదర్శనగానే కళ్లకుకడుతోంది. ఓటర్ల జాబితాల్నే రిగ్గింగు చేసే అరాచకత్వం గజ్జెకట్టినా చోద్యం చూసే ఈసీ వల్ల ఎలెక్షన్లు అబాసుపాలవుతున్న దృశ్యం గుండెల్ని మెలిపెడుతోంది. ఆ తరహా పోకడలకు తావివ్వరాదన్న తపనతో ఈసీని సమర్థ స్వతంత్ర వ్యవస్థగా తీర్చేందుకు ఆయా నియామకాల్ని అమెరికాలో సెనేట్, యూకేలో దిగువ సభ ఆమోదించాలని నిర్దేశించారు. న్యూజిలాండ్‌లో ప్రతినిధుల సభ సిఫార్సుల మేరకు ఎలక్టోరల్ కమిషన్ సభ్యులు నియుక్తులవుతారు. ఎక్కడి దాకానో ఎందుకు? ఎన్నికల సంస్కరణలపై 1990లో దినేశ్ గోస్వామి కమిటీ నివేదికతో పాటు 2015లో న్యాయ సంఘం చేసిన సిఫార్సులనూ కేంద్రం పట్టించుకోలేదు.
ఎన్నికల కమీషన్ నియామకం సంబంధించింది రాజ్యాంగ నిర్మాణ సభలో విస్తృతంగా చర్చ జరిగింది. ఎన్నికల్లో గెలవాలనుకొనే అధికార పక్షం తన తాబేదారును ఆ కీలక పదవికి ఎంపిక చేస్తే వచ్చే ప్రమాదాన్ని 1949లోనే ఆచార్య సక్సేనా రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రస్తావించారు. దానికి విరుగుడు మంత్రంగా, ఉభయసభల్లో మూడింట రెండొంతుల మంది విశ్వాసం చూరగొనే వ్యక్తులనే నిర్వాచన్ సదన్‌లో నియమించాలనీ ప్రతిపాదించారు. పాలక పార్టీకి బంపర్ మెజారిటీ ఉన్నప్పుడు ఈ చిట్కా కూడా పనిచేయదు కాబట్టి, పార్లమెంటులో అడుగుపెట్టిన అన్ని పార్టీల ఏకాభిప్రాయమే ప్రాతిపదికగా ఎన్నికల సంఘం సభ్యుల ఎంపిక సాగాలి! శాసన నిర్మాణ వ్యవస్థ అధికారాన్ని కార్యనిర్వాహక వర్గం కబ్దా చేయరాదన్నదే ఇటీవలి ‘సుప్రీం’ తీర్పులోని స్ఫూర్తి! అయితే, తాజా సవరణలో మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ స్వేచ్ఛను, ఎన్నికల స్ఫూర్తిని పలుచన చేసింది. కొత్త సవరణతో ఎన్నికల కమిషన్ నిర్మాణం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళినట్టే. ప్రభుత్వంలో అధికారంలో ఉండే పార్టీలు నియమించే ఈ ఎన్నికల కమిషన్ నిర్ణయం కోర్టులో కూడా సవాలు చేయలేని సందర్భంలో ఎన్నికల కమిషన్ పైన, ఎన్నికల నిర్వహణపైన ప్రజలకు ఎలా విశ్వాసం ఉంటుంది?
మనువాదులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నచ్చదు కనుక జనస్వామ్య స్ఫూర్తిని కబళిస్తున్నప్పుడు! ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఉపాంగం కానేకాదని, అదొక రాజ్యాంగబద్ధ వ్యవస్థ అన్న స్పృహ దానికి లేదు. ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారని, పార్లమెంటు చేసే చట్టానికి లోబడి ఆ నియామకాలుంటాయని 324(2) అధికరణ స్పష్టీకరించినా కట్టుదిట్టంగా సంబంధిత చట్టాన్ని పట్టాలకెక్కించే సదాలోచన లేని ప్రభుత్వాల తీరు ప్రజాతంత్ర భావనను కరిమింగిన వెలగపండు చేసింది. స్వతంత్ర నిష్పాక్షిక ఎన్నికల సంఘాన్ని రాజ్యాంగ రూపశిల్పులు లక్షించినా నేటికీ అది సాకారం కాకపోవడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం ధర్మాసనం గత మార్చిలో ‘పార్లమెంటు చట్టం చేసేదాకా’ అంటూ ఈసీ నియామక సరళి నిబంధనలు నిర్దేశించింది. ఇక జాగు చేస్తే ప్రమాదమనుకొంటూ హడావుడిగా మోడీ సర్కారు మూజువాణి ఓటుతో ఆమోదింపజేసిన కీలక బిల్లు నిర్వాచన్ సదన్ నియామకాల్ని పాలక పక్షం ఇష్టారాజ్యం చేసేస్తోంది.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వ్యవహార సరళిని ఏ రకమైన ప్రజాస్వామ్యం అనుకోవాలి? ప్రజాస్వామ్య వేషంలో ఉన్న నిరంకుశత్వమే కదా! వి-డెమ్ అనే స్వచ్చంధ సంస్థ పరిశీలనలో భారత్‌లో కొనసాగుతున్నది ఎన్నికల నియంతృత్వ ప్రజాస్వామ్యం అని తెలిపింది. పార్లమెంటులో సభ్యుల సస్పెన్షన్ ఇటీవలిది కాదు. మూడవ లోక్‌సభ (1960వ థకం) నుంచి ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చేసిన సంప్రదాయం మనకున్నది. 1989లో ఇందిరా గాంధీ హత్యపై థక్కర్ కమిషన్ నివేదికను ప్రతిపాదించిన సమయంలో అభ్యంతరాలు తెలిపిన 63 మంది ఎంపిలను సస్పెండ్ చేశారు. బ్రిటిష్ కాలంలో ఆ ప్రభుత్వాలు తమ శాసన సంబంధ బిల్లులను ఆమోదింప చేసుకోడానికి ఈ సస్పెన్షన్ల మార్గాన్ని ఆశ్రయించినట్టు చరిత్ర చెబుతున్నది. కాని అదే దుష్ట సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్నది. బిల్లులపై లేదా ప్రభుత్వం తీసుకొనే ఇతర నిర్ణయాలపై సభలో చర్చ జరిగినప్పుడు తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసుకొనే ప్రతిపక్షాల స్వేచ్ఛను కాపాడడానికి తగిన నిబంధనలు లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది.
ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాలలో 146 మంది ఎంపీలపై… (లోక్‌సభకు చెందిన వంద మంది, రాజ్యసభకు చెందిన 46మందిని సభా హక్కులకు భంగం కల్గిస్తున్నారన్న సాకుతో సస్పెన్షన్ వేటు వేశారు. ఘనత వహించిన మోడీ పాలనలో 71 సందర్భాలలో సస్పెన్షన్లు, బహిష్కరణలు చోటుచేసుకోవడం గమనార్హం. 2019 నుండి సభ్యులను చీటికీమాటికీ సస్పెండ్ చేయడం సభాపతులకు ఆనవాయితీగా మారింది. శీతాకాల సమావేశాలలో ఈ ధోరణి పరాకాష్టకు చేరింది. ప్రతిపక్షాలు ఒక కీలకమైన ప్రజా సమస్యపై ప్రభుత్వం నుంచి సభలో ప్రకటనను కోరినప్పుడు అందుకు నిరాకరిస్తూ వారిని సస్పెండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దానిపై వొత్తిడి పెంచడానికే అనివార్యంగా ప్రతిపక్షాలు సభలో మూకుమ్మడిగా లేదా కొద్ది మంది సభ్యులకే పరిమితమై గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయి. వాస్తవానికి అది కూడా ఒక పార్లమెంటరీ ప్రక్రియంగా గుర్తింపు పొందదగినది. గతంలో బిజెపి మాజీ ఎంపి దివంగత అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ”సభ వ్యవహారాలను అడ్డుకోవడం సైతం సభ్యుల హక్కుల్లో భాగమే” అన్నాడు.
డిసెంబర్ 13న లోక్‌సభలోకి చొచ్చుకు వెళ్ళి రంగు పొగ గొట్టాలతో అలజడి సృష్టించిన యువకుల ఘటనను పురస్కరించుకొని పార్లమెంటు భద్రతపై హోం మంత్రి ప్రకటన చేయాలని కోరడమే ప్రతిపక్షాలు చేసిన నేరం! దీనినంతా ప్రజలు చూస్తున్నారు. పక్షం తాము ఎలా ప్రవర్తించినా తమకు సభలో మెజారిటీ ఉందన్న అహంకారంతో ఇలా ప్రవర్తిస్తున్నది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యాలు బిజెపి ప్రభుత్వాల ఏలుబడిలోనే ఎక్కువగా సంభవిస్తున్నాయి. 22 ఏళ్ల క్రితం పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రధానిగా వాజ్‌పేయి, హోం మంత్రిగా అద్వానీ ఉన్నారు. నాటి ఉగ్రదాడి వార్షిక దినం సందర్భంగా దాడులు చేస్తామంటూ ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్‌సింగ్ పన్ను ప్రకటించిన హెచ్చరికతో పూర్తిస్థాయి భద్రత ఉన్నప్పుడే, ప్రతి ఒక్కరినీ నాలుగైదు సార్లు శల్యపరీక్షలు చేసే యంత్రాంగం ఉన్నప్పుడే, మోడీ అమిత్‌షా నాయకత్వంలోని సర్కారు హయాంలోనే తాజా ఘటన జరిగింది.
నిరుద్యోగం, ధరల పెరుగుదల, మణిపూర్ మారణకాండను చర్చనీయాంశం చేయడమే లక్ష్యమంటూ ఆగంతకులు పొగ బాంబులు వేసి ఊరుకున్నారు. వారు తలచుకుంటే విషవాయువులు, తుపాకులు తేగలిగే వారేమో! గొప్పలు మావి.. ఘోరాలు కిందివారివి అన్నట్టు ఈ ఘటనలోనూ మోడీ జోడీ నాయకత్వం అఘోరించింది. లోక్‌సభలో చొరబడిన యువకులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు పెట్టిన పోలీసులు వారు సభలో ప్రవేశించేందుకు వీలుగా పాస్‌లు ఇచ్చిన బిజెపి ఎంపిని మాత్రం వదిలేశారు. ఎందుకంటే ఆయన తిలకధారుడు. నుదుటిపై విభూతి పెట్టుకుంటారు.
అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి అర్థం కాకపోవచ్చుగాని దాని ఈ వైఖరి ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు బలాన్ని పెంచుతున్నది. ప్రజల్లో పార్లమెంటరీ రాజకీయాల పట్ల అసహ్యాన్ని పెంచుతుంది. బిజెపి ప్రభుత్వ ఫాసిస్టు ధోరణి రేపటి లోక్‌సభ ఎన్నికల్లో ఏ విధంగా ప్రతిఫలిస్తుందో, ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుందో చూడాలి? ప్రజాస్వామ్యంలో అధికారం ఎల్లప్పుడూ ఒకరినే వరించదు. ప్రజలు చైతన్యవంతులయ్యే కొద్దీ పాలకుల విధానాలు, చర్యలలోని మంచి చెడ్డలను పాల నుంచి నీటిని విడదీసినంత స్పష్టంగా వేరు చేయగలదు. ఇది అధికారంలో ఉన్నవారికి తెలియని విషయం కాదు. కాని అధికారం వారిలో అహంభావం నింపి దానిని మరచిపోయేలా చేస్తుంది. ప్రజా చైతన్యాన్ని తక్కువ చేసి చూసే వారికి తిరుగులేని గుణపాఠం నేర్పుతుంది. సంఘ్ పరివార్ మనువాద ఫాసిస్టు వర్గాలకు ఇవేవి అసహజమైనదో, ఆశ్చర్యకరమైనవో కావు. ఈ దేశంలో హిందూత్వ మనువాద భావజాలాన్ని, మనువాద రాజ్యాన్ని, అంగీకరించని వారి పీకనొక్కే ఫాసిజాన్ని నెలకొల్పదలిచింది. స్త్రీలను అవమానించిన, లైంగిక వేధింపులకు గురిచేసిన, అత్యాచారానికి పూనుకున్న, హత్య చేసిన ఆర్ఎస్ఎస్ అనుయాయులపై కేసులుండవు. ఒకవేళ కేసు పెట్టిన సాక్ష్యం లేకుండా చేస్తారు. అంటే మనుధర్మాన్ని పాటించే నేరస్తులకు ప్రశంసలు, శిక్షల రాయితీలు, శిక్ష పడినా విడుదల చేయడం. విడుదల కాగానే జై శ్రీరామ్ నినాదాలతో ఊరేగింపులు జరుపడం మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని జరుగుతున్నా మోడీ మౌనం వీడదు. ప్రతిపక్షాలకున్న ప్రశ్నించే హక్కును కాదంటే, వాటి మాట వినాల్సిన పని లేదనుకుంటే ఇక చట్టసభల సమావేశాలకు అర్థం ఏముంటుంది? ప్రజా సమస్యల్ని గాలికొదిలేసే చట్టసభలతో ప్రయోజనం శూన్యం. ప్రతిపక్షమే లేని పాలన కావాలనుకుంటే దానికి ప్రజాస్వామ్యమని పేరేందుకు? ఈ దారుణ పరిస్థితుల్లో అంతరాలను, వివక్షను, పురుషాధిక్యతను, పరమత ద్వేషాన్ని అనుసరించే మనువాద పరివారాన్ని సైద్ధాంతికంగా, రాజకీయంగా ఓడించకుండా సహిస్తున్నామోనని పౌర సమాజం ఆలోచించుకోవాల్సిన సందర్బం ఇది.