అన్నమయ్య పదకవితలు – లౌకిక విలువలు

భక్తి, వేదాంత తాత్విక జిజ్ఞాస ఏదైనా లౌకిక జీవిత ప్రాతిపదికగానే సాగుతుంది. తాము నివసిస్తున్న ప్రపంచంతో, సామాజిక వ్యవహారాలలో, మానవ సంబంధాలలో ఎక్కడ పేచీ వచ్చినా ప్రపంచంతో సర్దుకుపోవటం, ప్రపంచాన్ని సంస్కరించటం, మార్చటం, నిరాకరించటం అనే నాలుగు దశలలో మనిషి పడే ఘర్షణలో భాగమైన అన్వేషణా క్రమంలో అవి రూపొందుతాయి. అందువల్ల భక్తి కావచ్చు, వేదాంత తాత్విక చర్చ కావచ్చు వాటిలో ఇహలోక సుఖ వైముఖ్యం ఎంత ఉంటుందో అదే సమయంలో అవి లౌకిక జీవితం పట్ల అంత విమర్శనాత్మకంగానూ, వ్యాఖ్యాన ప్రాయంగానూ ఉంటాయి. వేదాంత తాత్విక చర్చలో కంటే భక్తి విషయంలో ఇది ఎక్కువ. వేదాంతం వలే అది జ్ఞానంతో బరువెక్కింది కాకపోవటమే అందుకు కారణం.సాంసారిక యాతనలకు ఒక సమాధానం ఇయ్యలేకపోతున్నజ్ఞాన కర్మ మార్గాలకు సమాంతరంగా సాధారణ జనులకు ఆశ్రయమైంది భక్తి మార్గం. భక్తి కి కూడా అంతిమ గమ్యం ముక్తే అయినా ఆ దిశగా సాగే ప్రయాణంలో లౌకిక జీవితపు అందాలు, అనుబంధాలు, అవకతవకలు భిన్న పార్శ్వాల నుండి దర్శనమిస్తుంటాయి భక్తి మార్గంలో.

వ్యక్తిగత లౌకిక జీవిత సమస్యల నుండి విముక్తికి స్వయంగా ఎంచుకొన్న దైవం కేంద్రంగా సాగే సాధన భక్తి. వ్యక్తి స్వేచ్ఛతో, ఇష్టంతో, ఉదార భావాలతో ప్రమేయం ఉన్న ఆత్మీయ అనుభవ సాంద్రత ఇందులో కీలకం.దాని సృజనాత్మక హృదయ స్పందనే అన్నమయ్యలో పదకవితల రూపు తీసుకున్నది.15 వ శతాబ్దివాడైన అన్నమయ్య వ్రాసిన వేలకొలది ఆధ్యాత్మిక శృంగార పదకవితలలో లౌకిక జీవన విలువలు ఏ రకంగా ఎలా భాగమయ్యాయో పరిశీలించటం, ఎందుకలా జరిగిందో చర్చించటం ఆసక్తికరంగా ఉంటుంది. లౌకిక జీవితం , లౌకిక విలువలు అన్న రెండు తలాల నుండి ఈ పరిశీలన చేయటం అవసరం.

భక్తి లో ఐహిక విషయ విరక్తి – ముక్తి కాంక్ష కీలకమైనవి. అందులో సామాజిక లౌకిక జీవిత వాస్తవానికి ఉన్న ప్రమేయం ఎంత అన్నకోణం నుండి లౌకిక జీవిత విలువలు అన్నమయ్య పదకవితలలో ప్రతిఫలించిన తీరును పరిశీలించటం ఒకటి. రెండవ తలంలో లౌకిక విలువలు అంటే ఆధునిక రాజ్యాంగం ప్రస్తావించినవి. సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక విలువలు. సమానత్వం ప్రాతిపదికగా వికసించినవి. ప్రజల అనుష్టానంలో అతి సహజంగా భాగం అయినవి. మన సమాజంలో ఎన్ని అసమానతలు, వివక్షలు ఉన్నప్పటికీ అట్టడుగు ప్రజా జీవితంలో స్వేచ్ఛ, సహకారం, లౌకిక భావన ఉన్నాయి. ప్రజలు వ్యక్తిగత, సాముదాయక జీవితంలో కట్టుబాట్లకు, విశ్వాసాలకు లోబడి ఉన్నప్పటికీ ఇతరులతో ప్రజాస్వామికంగా వ్యవహరించేవారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దైనందిన జీవితంలో ఉన్న అనేక సామూహిక విలువల్ని ఉన్నతీకరించుకోడానికి ప్రజలు పోరాడారు. వాటిని కొత్త భావనలుగా అభివృద్ధి చేసుకున్నారు.భక్తి ఉద్యమాలు అందుకు చేసిన దోహదం గొప్పది. అందువలన భక్తి ఉద్యమవాగ్గేయకారుడిగా అన్నమయ్య సాహిత్యంలో కనబడే కులమత ప్రసక్తిలేని లౌకిక జీవన విలువల గురించి చర్చించవలసిన సందర్భం ఇది.

1

శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వేంకటేశ్వరస్వామి, అహోబిల నరసింహస్వామి, హనుమంతుడు ఇలా ఎన్ని పేర్లతో ఎంతమంది దేవుళ్లను మానవజాతి సృష్టించుకొన్నదో తలచుకొంటే ఆ సృజన శక్తి ఆశ్చర్యంగా తోచక మానదు. ఆయా దేవుళ్ళు కారణం జన్ములన్నా, స్వయంభువులే అన్నా, వరప్రసాదులు అన్నా, సాధారణ మానవులుగా తల్లి యోని నుండి జనించినవాళ్లు కాక అద్భుతమైన పుట్టుక కలవాళ్ళన్నా అదంతా వ్యాసవాల్మీకాది ఆది కవుల నవనవోన్మేష శాలిని అయిన ఊహాశక్తి సంజనితమే.
మనుషులు దేవుడిని ఎందుకు సృష్టించుకొన్నారు?

ఆకటి వేళల నలపైన వేళలను
తేకువ హరినామమే దిక్కు మఱి లేదు. // పల్లవి//

కొఱ మాలి ఉన్నవేళ కులము చెడినవేళ
చెఱవడి వొరులచే ( జిక్కినవేళ
వొరపైన హరినామమొక్కటే గతిగాక
మఱచి తప్పినదైన మరిలేదు తెరఁగు //ఆక //

ఆపదవచ్చినవేళ యారడి బడినవేళ
పాపపు వేళల భయపడిన వేళ
ఓపినంత హరి నామమొక్కటే గతి గాక
మాపు దాఁకా ( బొరలిన మరి లేదు //ఆక//

సంకెళ( బెట్టిన వేళ చంపఁ బిలిచినవేళ
అంకిలిగా నప్పుల వారా( గిన వేళ
వెంకటేశు నామమె విడిపించ గతిగాక
మంకు బుద్ధి ( బొరలిన మరిలేదు తెఱఁగు // ఆక //

(తాళ్ళపాక పదసాహిత్యము – సంపుటం 1- 158, తిరుమల తిరుపతి దేవస్థానములు , ద్వితీయ ముద్రణ 1998)

భౌతిక బాధలు కలిగినప్పుడు అవి తొలగించుకొనే సాధనాలు సమకూర్చుకోలేని నిస్సహాయస్థితిలో మనుషులు దేవుడిని సృష్టించుకొన్నారు. ‘ఆకటి వేళలో, అలపైన వేళలో’ చేయవలసినది అన్నం వండుకొని తినటం, విశ్రాంతి తీసుకొనటం. అందుకు కావలసిన వనరులు, అవకాశాలు అందుబాటులో ఉంటే హరినామం ప్రసక్తికి రాదు. వంటకు పొయ్యి మీదకు,పొయ్యి కిందికి సరుకు సమకూర్చుకోలేని పేదరికం, విశ్రాంతికి అవకాశం లేని జీవితం నిస్పృహకు గురిచేసిన సందర్భాలలోనే దేవుడు దిక్కు అవుతాడు. జీవితంలో ఏదీ సాధించలేని స్థితిలో కలిగే దిగులు, కుల గౌరవ హాని వల్ల కలిగే అవమానం, నింద వల్ల కలిగే ఆవేదన, పాప కార్యాలు చేయటం వల్లనో , జరుగుతున్నవి చూడవలసి రావటం వల్లనో కలిగే భయం, సంకెళ్లు పడటం, మరణ శిక్ష పడటం, అప్పులవాళ్ళు అడ్డగించి అవమానపరచటం ఇలా జీవితంలో ఎదురయ్యే క్లిష్ట సందర్భాలు కొన్ని ఈ పాటలో చెప్పబడ్డాయి. మానవ ప్రయత్నంతో అధిగమించటానికి వీల్లేని సందర్భాలలో సమస్యల ముందు నిస్సహాయు లైన మానవుల అవసరంగా హరినామం అనివార్యమైన వాస్తవం అంటాడు అన్నమయ్య. ఇవన్నీ అన్నమయ్య ఒక్కడి అనుభవ విషయాలే కాకపోవచ్చు.కానక్కర లేదు. లోకంలోని అనేకుల బాధను తనదిగా చేసుకొన్న కవి అంతరంగ ఆవిష్కరణ ఇదంతా.

“కాలవిశేషమో లోకము గతియో సన్మార్గంబుల
కీలు వదలె సౌజన్యము కిందయిపోయినది”
అనే పల్లవితో ప్రారంభమయ్యే సంకీర్తన( తాళ్ళపాక పదసాహిత్యము – సంపుటం 1- 63,) పూర్తిగా లౌకిక జీవన విలువల పతనం పట్ల అన్నమయ్య వేదనకు అద్దం పడుతుంది. సన్మార్గం బలహీనపడి, మంచితనం పట్టువదలటం కాలం లక్షణమా అని సందేహపడ్డాడు. ధర్మహాని, విజ్ఞానానికి తావు లేకపోవటం, శాంతం సందుగొందులకు తొలగిపోవటం, వివేకం తగ్గిపోవటం, మంచితనం మందుకు కూడా లేకపోవటం గమనిస్తూ ఇదేమి ప్రపంచమని వాపోయాడు. ఎరుక తగ్గటం, సంతోషానికి స్థానం లేకపోవటం, నిజం కరువవటం, సత్యం కొండెక్కటం, ఆచారాలు వెనకబడటం వంటి సామాజిక అవలక్షణాల గురించి ఆందోళన పడ్డాడు. దీనిని బట్టి భక్తి కవుల సంవేదన పూర్తిగా వ్యక్తిగత నిబద్ధతకు మాత్రమే సంబంధించింది కాదని స్పష్టం అవుతున్నది. భక్తి ఆలంబనగా వ్యక్తమయ్యే స్వీయవిముక్తి ఆకాంక్షలో సామాజిక దుర్మార్గాల నుండి విముక్తి అనే సామూహిక విముక్తి ఆకాంక్ష అన్నమయ్య పదకవిత్వంలో అతి సహజంగా భాగం కావటం గమనించవచ్చు.

సుఖదుఃఖాలు జీవితంలో భాగం. దుఃఖం లేని సుఖ సంసారం మనిషికి ఆదర్శం. అది వాస్తవం కావాలంటే దుఃఖ కారణాలు గుర్తించి నిర్మూలించటం అవసరం. అయితే ఆ దిశగా జరిగిన ప్రస్థానంలో దుఃఖ కారణాలు స్పష్టంగా తెలియకపోవటం వల్లనో, తెలిసిన మేరకైనా వాటిని నిర్మూలించే సత్తా వ్యక్తులుగా తమకు లేదన్న ఎరుక వల్లనో గతి భగవంతుడే అని రకరకాలుగా చెప్పుకొచ్చారు భక్త కవులు. ఆ కోవలోనే అన్నమయ్య సుఖ దుఃఖ స్వరూప స్వభావాలను వివరిస్తూ శ్రీ వేంకటేశ్వరుడే ఉద్ధారకుడని చెప్తూ వచ్చాడు. “సుఖమును దుఃఖమును జోడు కోడెలు” ( తాళ్ళపాక పదసాహిత్యము – సంపుటం 1-505) అని మొదలు పెట్టిన కీర్తనలో సంసారం ఉన్నన్నాళ్ళు లంపటాలు, శరీరం ఉన్నన్నాళ్లు ఆశలుపోవు అని చెప్తూ అప్పులు, దాని మీద పెరిగే వడ్డీ దుఃఖకారణాలలో ఒకటిగా చెప్పటం గమనించవచ్చు.

“అప్పుల వారే అందరును
కప్ప ( గఁ దిప్ప(గ గర్తలు వేరీ”
అని మొదలయ్యే సంకీర్తన( తాళ్ళపాక పదసాహిత్యము – సంపుటం 1-81) జీవితంలో సంబంధాలన్నీ రుణానుబంధాలే అని సూచిస్తుంది. ఎక్కడ చూచినా ఈ ప్రపంచంలో చిక్కులు, కష్టాలు, తత్ఫలితమైన దుఃఖాలే అని పేర్కొన్నాడు అన్నమయ్య. ఏదీ సరళంగా లేకపోవటంతో, ఉపద్రవాలు వచ్చి పడుతుంటే చింతిస్తూ బ్రతుకు యీడ్చటం దుర్భరం అయిన వాళ్లకు దేవుడు కాక దిక్కెవ్వరు అన్నది ఆయన ప్రశ్న. ఈ పదం లోనే సుఖాలను ‘సూదుల మూటలు’ అని రూపకం చేసి చెప్పాడు.

“ఏది సుఖము మరి యేటి సుఖము వొక
మాట మాత్రమున నటమటమైన సుఖము”
అనే పల్లవితో ప్రారంభించిన పదంలో(తాళ్ళపాక పదసాహిత్యము – సంపుటం 1-135) సుఖం సుఖం అనుకుంటామే కానీ సుఖం అన్నది అసత్యం అని చెప్పి దాని మూలాలు అంత గౌరవకరమైనవి కావని లోకానుభవం నుండి గ్రహించి చెప్పాడు. “కొనసాగు దురితములె కూడైన సుఖము” అని మొదలయ్యే మొదటి చరణంలో కొందరి సుఖం వెనుక ఎందరినో బాధించే దుర్మార్గం , అందువల్ల కలిగే పాపం, పని లేని ఆశ ఉన్నాయని, అందువల్లనే సుఖ కామనకు, సుఖసాధనకు వెనకముందుల ప్రయత్నాలు, పనులు తరచి చూస్తే సుఖము దురితమూలం అని తెలిసి ఆశ్ఛర్యం కలుగుతుందని చెప్పగలిగాడు అన్నమయ్య. “ నిందలకు లోనైన నీరసపు సుఖము/ బొందికిని లంచంబు పుణికేటి సుఖము/ కిందుపడి పరుల ముంగిలి గాచు సుఖము/ పందివలె తను( దానె బ్రతికేటి సుఖము” అన్న చరణంలో ఐహిక సుఖాల కోసం నిందలు పడటానికి, శరీర సుఖ సౌకర్యాల కోసం లంచాలు తీసుకొనటానికి, ఆత్మగౌరవాన్ని మరచి బానిసత్వానికి సిద్ధపడటాన్ని గురించి ప్రస్తావించటంలో సాధనాలు అనైతికమైనప్పుడు సాధించబడే సుఖము విలువ ఏ పాటిది అన్న ప్రశ్నను సంధించటం వినబడుతుంది.

“సమబుద్ధే యిందరికి సర్వవేద సారము” (2-409) అని మొదలయ్యే కీర్తనలో, చీమకు , దోమకు ఈగకు కూడా తమ తమజన్మలు సుఖమే అనిపిస్తాయి. దేనిలోనైనా మనుషులు పొందే ఎక్కువ సుఖాలు ఏమున్నాయి అని తర్కిస్తాడు. జంతురాసులన్నిటికీ పుట్టుక, మరణం, ఆహార నిద్రలు స్త్రీ సుఖం అన్నీ సాధారణమే. ఇంతకంటే ఎవరు పొందిన సుఖం మరేముంది? అని మానవుడి సుఖ లాలసకు ప్రత్యేకమైన విలువ ఏదీ లేదని తేల్చేసాడు. సుఖం అంటే ‘వెంకటపతినందముగాఁ దలచిన దది’ మాత్రమే అంటూ పాటను ముగిస్తాడు. సర్వ జీవరాసులు లౌకిక జీవితానుభవాలలో పొందే సుఖం సమమే అయినప్పటికీ మనిషి హరినామ స్మరణలో పొందే సుఖం ఎక్కువ విలువైనది అని చెప్పదలిచాడు అన్నమయ్య.

సుఖ లాలస ఆద్యంతాలు లేనిది. ఎప్పటికీ ‘చాలు’ అనిపించనిది. దానికోసం మనిషి మోహాలలో చిక్కి, బంధాలు పెంచుకొని నిత్య దుఃఖితుడు అవుతాడని అన్నమయ్య అభిప్రాయం. ‘ఏది తుద దేనికేదిమొదలు’ అనే సంకీర్తనలో ఆ తత్వాన్నే బోధించే ప్రయత్నం చేసాడు. “ ఎన్నిబాధలు తనకు నెన్ని లంపటములు / యెన్ని వేదనలు, మరి యెన్ని దుఃఖములు / యెన్ని పరితాపంబులెన్ని తలపోతలు/ యెన్ని చూచిన మరియు నెన్నయిన కలవు( 1-102) అని కోరికల అనంతత్వమే మోహకారణం అని సూచించాడు. తనను మించినవాడు లేడన్న గర్వం,కోరినవన్నీ దొరకక పడే అసంతృప్తి రెండూ దుఃఖకారణాలని సూచించాడు. ఆశించటం, తిరగటం, హర్షించటం, దుఃఖించటం అనే వాటిమధ్య నలిగిడి పడే జీవి గురించి జాలిపడే సున్నిత మానవుడుగా కనబడతాడు అన్నమయ్య ఈ పాటలో. ఆ క్రమంలోనే సంసారాన్ని జడధి లోపలి ఈత , జము నోరి లో బ్రతుకు (1-199) అని చెప్పాడు. సముద్రపు ఈత ,యముడి నోటపడి బతకటం రెండూ అసాధ్యమైనవి. చంపేసే పెను రోగం సంసారం అని, యుద్ధభూమి నివాసం సంసారం అని సంసారం అంటే ప్రాణాంతక వ్యవహారమని నొక్కి చెప్తాడు.

సంసారం మీద వైరాగ్యపు మరొక ముఖం శరీరం మీద రోత. ఒడలు మాంసపురము అని కడలేని మలమూత్ర గర్హితమది అని చెప్పి లోపల కడగలేము… ఎంత కడిగినా పోదు అని చెప్పటంలో శరీరాన్ని తక్కువచేయటమే ఉంది. చంచలం అని మనస్సుని కూడా నిరాకరించి జీవుడికి వీటి నుండి రక్షణ కల్పించే వాడు వెంకటనాథుడే అని తీర్పు ఇస్తాడు. ఈ క్రమంలోనే స్త్రీ శరీరం కూడా పురుషుడికి ఏవగించుకోవలసినదే అయింది. “లలనల జవ్వనాలు లక్కపూసక పురులు” , “కడు మోవి తీపు చింతకాయ కజ్జము” (2- 268) వంటి ఉపమానాలతో స్త్రీ శరీరం, పొందు అంత శాశ్వతమైనవి , సుఖకరమైనవి ఏమి కాదని సూచించాడు. పొలతుల వలపులు తొలుకారు మెరుపుల్లా కనబడి పోయేవే కానీ నిలబడేవి కావని చెప్తాడు. (1-220) అతివలను సర్పాలతో, మహాభూతాలతో పోల్చి ప్రమాదకారులని హెచ్చరించాడు.(3- 356) మొత్తం మీద ‘సారపు లౌకిక విమోచనమె ముక్తి’ ( 1-370) అన్నది ఆయన గాఢమైన విశ్వాసం.

ఆశ , కామక్రోధాలు, రుచులు, పేర్ల మీద, దేహం మీద అభిమానం, సుఖ దుఃఖ భయాలు మొదలైన లౌకిక మోహాల నుండి విముక్తి క్రమమే ముక్తి మార్గానికి చేరువ చేస్తుందని పదేపదే చెప్పాడు. దానిని బలంగా స్థాపించటానికి సాధారణ లౌకిక నీతులను అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అనుకూల వ్యతిరేక ముఖాలనుండి ఉపమలుగానో , ఉదాహరణాలుగానో ఉటంకించటం చూస్తాం. వెంకటపతిని కొలవకపోవటం రోత అయినపని అని చెప్పదలచుకొన్నాడు. అందుకు “ అనుమానపు బ్రతుకది రోతా / తన మనసెనయని కూటమి మరి రోతా”( 1-26) అన్న పల్లవితో ఒక కీర్తన ప్రారంభించాడు. ఇతరులు అనుక్షణం తనకేదో అపకారం , ద్రోహం చేస్తున్నారన్ననిత్య చింత, మనసుకు నచ్చని నిర్బంధ సాంగత్యం లౌకిక జీవితంలో ఎవరికైనా రోత కలిగించే విషయాలే. వాటితో మొదలుపెట్టి తన సంగతులన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పటం, వనితల ముందర వదరటం, గర్వం వంటివి అన్నీ గొప్ప రోతయిన విషయాలు అంటూ లోకాన్ని ఒప్పిస్తూ “వెంకటపతినవిరళముగ గొలువని దది రోతా” అని ముక్తాయించటం ద్వారా దానికి కూడా తిరుగులేని సమ్మతిని సంపాదించటం అన్నమయ్య వ్యూహం. మనుషులు జీవితంలో అసహ్యించుకొని విసర్జించవలసినవి యేవో చెప్పటం ద్వారా అన్నమయ్య వంటి భక్తి కవులు లౌకిక తలంలో విలువలు గల జీవిత నిర్మాణానికి వ్యక్తులను ప్రేరేపించారు.

‘వెంకటపతిని చేరే భవమే చాలు’ అది ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది అని చెప్పటానికి లోకంలో అనుభవానికి వచ్చే సంతృప్తులను ఎన్నింటినో ప్రస్తావిస్తూ అల్లిన సంకీర్తన “ అప్పులేని సంసారమైన పాటే చాలు / తప్పు లేని జీతమొక్క తారమైన జాలు”( 1-114) పెచ్చు పెరిగిన కోరికలను అంటుకొని అసంతృప్తి, అశాంతి జీవితాన్ని దుర్భరం చేస్తాయి. ముక్తిమాట తరువాత. బతికినంతకాలం మనిషి ఎలా బతకాలి అన్నది ముఖ్యం. విలువలతో కూడిన బతుకులో కష్టం ఉన్నా ఆత్మ సంతృప్తికి ఆస్కారం ఉంటుంది. లౌకిక జీవితంలో దానిని ఆశిస్తాడు అన్నమయ్య . అప్పు లేని సంసారం లో అవసరాల కోసం తడుములాట ఉంటుంది. శ్రమఉంటుంది. అయినా అప్పు లేకుండా ఉన్నదానితోనే సరిపెట్టుకొని జీవించటంలో సంతృప్తి ఉంటుంది కనుక అదే కోరదగినది అన్నది అన్నమయ్య అభిప్రాయం. తప్పులేని జీతం అంటే అక్రమార్జన కానిది. లంచాల తో కలుపుకొని అది జీతం అనుకొంటే అది తప్పుచేయటం వల్ల పొందిన జీతం అవుతుంది. తారము అంటే నాలుగు కాసుల నాణెం. తప్పుడు దోవలు తొక్కకుండా సంపాదించే పని ప్రతిఫలం నాలుగు కాసులైనా నాణ్యమైనదే అని తాత్పర్యం. అలాగే కంత లేని గుడిసె ఒక గంపంత ఉన్నా మంచిదే. దిగులులేని కూడు ఒక ముద్దయినా సరిపోతుంది. అని ఈ కీర్తనలో సుఖ జీవితం అంటే సంతృప్తికరమైన జీవితం అని నొక్కి చెప్పాడు. అంతరాత్మ ముందు అపరాధ భావంతో తలవంచుకోవలసిన అవసరం రాని జీవితమే జీవితం అన్నది అన్నమయ్య భావం. “వింతలేని సంపదొక్క వీసమె చాలు” అనటంలో సంపదల సమీకరణ వెనక ఉండే దోపిడీ , హింస లనే అన్నమయ్య సంబోధించాడా అనిపిస్తుంది. వింతగా వికృతంగా పెరిగే సంపదలు భయావహమైనవి. అశాంతికి లోను చేసేవి. అందుకే అవసరాలకు సరిపడ సంపద మాత్రమే కోరదగింది. ఈ విధంగా జీవితంలో అల్పవనరుల నుండి అధిక సంతృప్తిని, సంతోషాన్ని పొందగల సంస్కారం విలువల తో కూడిన జీవిత విధానం నుండి వికసింప చేసుకోవాలన్నది అన్నమయ్య సందేశంగా వినబడుతుంది.

“ఎంత విభవము గలిగెనంతయును నా పదని / చింతించినిది గదా చెడని జీవనము”(1-181) – ఇదొక సంకీర్తన పల్లవి. ఎంత సంపదఉంటే అంత ఆపద అని తెలిసినవాళ్ళది, తెలుసుకోగలిగిన వాళ్ళది చెడిపోని జీవన వ్యాపారం అంటాడు అన్నమయ్య. సంపద పెరిగేకొద్దీ మనిషిలోని సర్వసద్గుణాలను హరిస్తూ అహంకారిని, అధికారిని చేసి వదులుతుంది. ఆ హెచ్చరికతో ప్రారంభించి ఈ పదంలో తన చాంచల్యం, తన కోపం తనకు శత్రువులని తెలుసుకొనటం, పరనింద మృత్యువని తెలిసి మానటం, మెరిసే నగలే మెడ ఉరులని ఎరుక పొందటం మంచి జీవనానికి అవసరమని చెప్పాడు అన్నమయ్య.

రూకలై మాడలై రువ్వలై తిరిగీని / దాకొని వున్నచోట( దానుండ దదివో అనే పల్లవితో ప్రారంభమయ్యే కీర్తన ‘బంగారం’ గురించి వ్రాసింది. రూక, మాడ, రువ్వ బంగారానికి డబ్బు రూపాలు. విలువలలో వ్యత్యాసం కల మారకపు ప్రమాణాలు. వ్యత్యాసాల సమాజానికి డబ్బే మూలమని సామాన్యలౌకిక జ్ఞానం నుండి అద్భుతంగా చెప్పాడు అన్నమయ్య. “ వొకరి రాజుఁ జేసు నొకరి బంటుగ( జేసు” , వొకచోట నున్న ధాన్యమొక చోట వేయించు” అదీ డబ్బు స్వభావం. అది ఉన్న వాడు రాజు లేనివాడు పేద. అది ఉన్నవాడు మార్కెట్ ను నియంత్రించగలడు. ఉత్పత్తి స్థానం నుండి ధాన్యాన్ని తరలించగల శక్తి డబ్బు. కొందరిని పుణ్యాత్ములుగా, కొందరిని పాత్ములుగా చలామణి చెయ్యగలిగింది కూడా డబ్బే అంటాడు అన్నమయ్య. ఆరకంగా సంపదలు కలిగి ఉండాటానికి, లేకపోవటానికి కారణాలుగా చెప్పబడే పూర్వజన్మ పుణ్య పాప భావాలను గురించిన ఆలోచనలను మనలో రేకెత్తిస్తాడు.

లౌకిక జీవితాన్ని ఉన్నంతలో సుఖకరం చేసుకొనటానికి అత్యాశ, అహంకారం, అధికారం అవరోధాలన్న ఎరుకను కలిగించటం ద్వారా విలువలతో కూడిన జీవిత నిర్మాణానికి మనుషులు ప్రయత్నపరులు కావాలన్నది అన్నమయ్య ఆకాంక్షగా వ్యక్తం అవుతుంది. “మహి నుద్యోగి గావలె మనుజుడైనవాడు / సహజి వలె నుండేమి సాధింపలేడు” (1- 212) మనుషులు ప్రయత్నపరులుఁ కావాలన్న అన్నమయ్య సందేశం నిత్య నూతనం. సహజి అంటే పుట్టినవాడు పుట్టినట్లుగా ఉండటం. అందులో మనిషి ప్రమేయం లేదు. సంకల్పంతో సాధనతో సాధారణ మానవులు మహోన్నత స్థాయికి చేరగలరు. అది తెలిసిన వాడు కనుకనే అన్నమయ్య మనిషైనవాడు ఐహిక ప్రయోజనాలనుండి ఆముష్మిక ఫలాలవరకు దేనిని పొందటానికైనా ప్రయత్నపరులు కావాలని పిలుపునిచ్చాడు.

“కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై/ పడని పాట్ల నెల్లపడి పొరలనేల” (1-302)అనే కీర్తనలో పరుల మనసుకు ఆపదలు కలుగచేయు బ్రతుకు, ఇతరుల మేలు చూసి సహించలేనితనం పరితాపకరాలని చెప్తాడు అన్నమయ్య. ఎదుటివాళ్ళ హితవు కోరటం తనకు మేలన్న సంస్కారం అభివృద్ధి చేసుకోవలసిందిగా హితవు చెప్పాడు. ఆ క్రమంలో ఆయన “సంసారమే మేలు సకల జనులకు” ( 3-447) అని చెప్పటానికి కూడా సందేహించలేదు. ఐహిక జీవితంలో శ్రీకృష్ణ భక్తితో పాటు వినయపు మాట, విద్యార్జన, అప్పులు చేయకపోవటం, కోపం వదిలెయ్యటం అవమానకరమైన యాచనకు దిగకపోవటం,జీవహింస, పరనింద చేయకపోవటం, పరకాంతలను భంగపరచకపోవటం మొదలైనవి మేలైన విషయాలు అని పేర్కొన్నాడు.

ఆశ, అసంతృప్తి, అనుమానం, కామక్రోధాలు, గర్వం, పరనింద, పరులకు హాని, పరస్త్రీలపై అత్యాచారాలు ధర్మహాని, జ్ఞానహాని, లంచగొండితనం, యాచన, బానిసత్వం, సామాజిక సద్గతికి, మానవ సంబంధాలలో స్నేహ సౌజన్యాలకు అవరోధం అవుతాయని అన్నమయ్య పడిన ఆందోళన ఆధ్యాత్మిక కీర్తనలకు కొత్త రంగును ఇచ్చింది. అప్పు లేని సంసారం,తప్పులేని జీతం, వింతలేని సంపద ఆశించాడు అంటే వాటి దుష్పరిణామాలను సమాజంలో ఆయన దగ్గరగా చూసి ఉండటం వల్లనే అన్నది స్పష్టం. ‘ఇతరులు’ గా కొందరిని వేరుచేసి చూసే ద్వేష పద్ధతిని ఆయన గర్హించాడు.ఇతరులను పట్టించుకోకుండా తనబతుకు తాను బతికే మానవ ప్రవృత్తిని పశుప్రవృత్తితో పోల్చి నిరసించాడు. (పందివలె తను( దానె బ్రతికేటి సుఖము)

మనిషికి తోటి మనుషులపట్ల ఉండవలసిన బాధ్యతను గుర్తించి చెప్పటంలో అన్నమయ్య లౌకిక జీవితానికి, సంఘజీవితానికి ఇచ్చిన ప్రాధాన్యత కనబడుతుంది. “తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద -/ వెలుఁగు లోపలి వెలుఁగేలా”(1-18) అనే పల్లవితో ప్రారంభమయ్యే కీర్తన భగవంతుడు నిజంగా ఆడుకోవలసినవాళ్లెవరు అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నట్లుగా సాగుతుంది. అయితే అదే సమయంలో ఆ పాట లౌకిక జీవిత సంబంధంలో ఎవరు ఎవరి వైపు ఎందుకు నిలబడాలో సూచిస్తున్నట్లుగా కూడా ఉంటుంది. “అదయ నాపన్నునికభయ మీ వలే ( గాక /ఇరవైన సుఖి (గావనేలా /” అన్న తొలి చరణంలో ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకోవాలి గాని,సుఖంగా ఉన్నవాళ్లను కాపాడటానికి , వరదలో బడి కొట్టుకుపోయేవాణ్ణి తొందరగా బయటపడెయ్యాలి కానీ ఒడ్డున కూర్చున్నవాణ్ణి ఉద్ధరించటానికి తానేలా అని నిలదీస్తాడు. ఆ తరువాతి చరణం లో దుర్బలుడికి అన్నం పెట్టాలి కానీ కడుపు నిండినవాడికి పెట్టటానికి తానేలా అని అన్నాడు. ఇక్కడ తాను అంటే భగవంతుడు. శ్రీవేంకటేశ్వరుడు. భగవంతుడు ఆదుకోవలసింది ఆపదలో ఉన్నవాళ్లను, వరదలో కొట్టుకు పోతున్నవాళ్లను, తిండి లేక బలహీన పడ్డవాళ్లను. అంతే కానీ సుఖంగా ఉన్నవాళ్లకు, ఒడ్డున క్షేమంగా ఉన్నవాళ్లకు, కడుపునిండినవాళ్లకు ఆయన చెయ్యాల్సింది ఏమీలేదు అని అన్నమయ్య అభిప్రాయం. హీనులను, దీనులను కృపచూడటం దైవధర్మం అని అన్నమయ్య భావిస్తున్నాడన్నమాట. వేంకటేశ్వరుడి స్థానంలో ఈనాటి రాజ్యాన్ని, ప్రభుత్వాలను నిలిపి చూస్తే అన్నమయ్య చెప్పిన ధర్మం తలకిందులు కావటం అర్ధం అవుతుంది. సామాన్య ప్రజల జీవికను భగ్నం చేస్తూ ఆదివాసీలను, రైతులను గురి చూసిన ప్రభుత్వ విధానాలు ఆదానీలకు అంబానీలకు సకల వనరులను, మార్కెట్ ను అధీనం చేసేవిగా ఉండటం తెలుస్తున్నదే. లేనివాళ్లు కొట్టుకు పోయే వరదగేట్లను తెరుస్తూ ఉన్నవాళ్ల సంపద మరింతపెరగటానికి రాజ్యం ఎందుకు అన్నదే ఇప్పటి ప్రశ్న. అన్నమయ్య జగత్తును మిధ్య అని నిరాకరించలేదు. అసహాయులకు అండగా నిలబడే దేవుడిని ఆయన కోరుకున్నాడు. అసమానతలను కనిష్ఠం చేసే మానవ నైతిక ప్రవృత్తిని ఆశించాడు. సామాజిక నైతిక జీవితపు పాదు నుండి శ్రీవెంకటేశ్వరుడి పట్ల భక్తి భావనకు పందిరివేసాడు.

2

భారత రాజ్యాంగం శాసన దృష్టిలో సమానత్వాన్ని ప్రజాస్వామ్య విలువగా ప్రతిపాదించింది. మత జాతి కుల లింగభేద జన్మస్థాన కారణాలను బట్టి ఎవరూ ఎవరికంటే ఎక్కువా కాదూ , తక్కువా కాదు. ఆ కారణాలతో వివక్ష చూపటానికి వీలు లేదు. అవకాశాలు అందరికీ సమానం. ఇవి వ్రాసుకొని, ఆమోదించి, అమలులోకి తీసుకువచ్చి డెబ్బై ఐదేళ్లు కావస్తున్నది. కానీ సహజ సంస్కారంగా భారతీయ సామాజిక జీవితధర్మం లోకి అది ఇంక లేదు. ఏదో ఒక రూపంలో అస్పృశ్యత, కులాన్ని బట్టి ఆధిక్య న్యూన స్థాయి, కులం హద్దులు దాటిన సంబంధాలు పరువు పోగొట్టేవిగా భావించటం, పరువు హత్యలు, మతాన్ని బట్టి మనుషులకు, సంబంధాలకు ప్రాధాన్యతలు,మత అసహనం, విద్వేషం సామాజిక రాజకీయాలలో ప్రధానపాత్ర వహిస్తుండటం మనం చూస్తున్న వర్తమాన విషాదం. పాలకులు మనుమార్గ ప్రవర్తకులుగా, వర్ణాశ్రమ ధర్మ పరిరక్షకులుగా వున్న రాచరిక భూస్వామ్య వ్యవస్థలలో ‘సమానత్వం’ వూహించరానిదే. కానీ ఆ వ్యవస్థలలో కూడా మనుషులు సమానత్వం గురించి పడిన ఆరాటం తక్కువది కాదు. అన్నమయ్య పదకవితలలో అది కనబడుతుంది. వెంకటేశ్వర భక్తి గీటురాయిగా అసమానతలను త్రోసిరాజనటం చూస్తాం.

12, 13 శతాబ్దాలలో శైవభక్తి ఉద్యమ చరిత్ర, సాహిత్యం శివభక్తి లేనివాళ్ల సామాజిక స్థాయి ఎంత ఉన్నతమైనది అయినా వాళ్ళను ధిక్కరించే అవకాశం శివభక్తి కల్పించింది. అలాగే శివభక్తులైన వాళ్ళ సామాజిక ఆర్ధిక స్థాయి ఎంత తక్కువవి అయినా వాళ్ళు గౌరవానికి పాత్రులే అని నిరూపించింది. ఆ చరిత్రకు కొనసాగింపు అన్నమాచార్యుడు.

“ఏ కులజుడేమి యెవ్వడైన నేమి/ ఆకడ నాతడే హరినెఱిగిన వాడు” అనే కీర్తనలో మనిషికి కులంతో నిమిత్తం లేకుండా హరిని తెలుసుకొనటం ఒక్కటే గుణంగా చెప్పబడింది. హరినితెలుసుకొనటం అనేది మనిషిలో సర్వసుగుణాలను మేల్కొల్పుతుంది. సత్య సంపన్నులై పరనిందకు పాల్పడకుండా ఉంటారు. భూతదయ కలిగి ఇతరులను కూడా తనవలెనే భావించే స్థాయికి చేరుకుంటారు.ఆత్మనియతి కలిగి ధర్మతత్పరులై ఉంటారు. ప్రపంచంలో అందరికీ హితంగా జీవిస్తూ ఎవరి యందు శత్రుత్వం లేకుండా వుంటారు. ఏ పరనింద కూడనిది అని, అది భగవంతుడిని చేరటానికి పెద్ద అవరోధమని అన్నమయ్య పదేపదే ఆ నాడు హెచ్చరించాడో అది ఈనాడు ట్రోల్ అనే అంతర్జాల సాంకేతిక వ్యవస్థగా పరాకాష్ఠ దశకు చేరుకొన్నది. సనాతన హిందూ ధర్మం పేరిట, శ్రీ రాముడి పేరిట జరిగే వికృత క్రీడది అందులో సింహ భాగం కావటం గమనించవచ్చు. ఇతరులను తనవలె చూడటం సమభావానికి, సంస్కారానికి సరిఅయిన వ్యక్తీకరణ , అన్నమయ్య ప్రబోధించిన ఈ విలువ పూర్తిగా లుప్తమై మేము , మీరు , మనమూ ఇతరులు అనే విభజనరేఖ కొండచిలువగా కదలటం ఈ నాటి దృశ్యం.

“ఎక్కువకులజుడైన హీనకులజుడైన / నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు” ( 1- 318) అనే కీర్తన ఉంది. కులంలో ఎక్కువతక్కువ అనే భేదంతో పనిలేదు. సత్యం తోనే సంబంధం. ఏ కులంలో పుట్టినా సత్యం తెలిసినవాళ్ళే ఘనులు అంటున్నాడు అన్నమయ్య. నిక్కము అంటే ఏమిటి? విష్ణువును తెలుసుకొనటం, సేవించటం. అది ముఖ్యం కానీ కులం ముఖ్యం కాదు. “వేదములు చదివియును విముఖుడై హరిభక్తి / యాచరించని సోమయాజి కంటే / యేదియును లేని కులహీనుడైనను విష్ణు/ పాదములు సేవించు భక్తుడే ఘనుడు” కులం పెద్దదే, బ్రాహ్మణుడు. వేదాలు చదివాడు. జ్ఞాని. యజ్ఞాలు చేసాడు. కర్మిష్ఠి కానీ హరి భక్తి విముఖుడు. అప్పుడిక అతని కర్మజ్ఞాన శ్రేష్ఠత అంతా వ్యర్ధమే. కులం తక్కువ. శూద్రుడొ , పంచముడో … వేదజ్ఞానం లేదు. కర్మజ్ఞానం లేదు. అయినా విష్ణుపదసేవనం వలన బ్రాహ్మణుడికంటే అతనే గొప్పవాడు అని అన్నమయ్య అంతరార్ధం. రెండవ చరణం లోనూ అంతే. వేదాంత పఠన పాఠనాలు ఉన్న హరిభక్తి లేని సన్యాసి కంటే విష్ణువును వెతికే అంత్య జాతి కులజుడైనా గొప్పవాడే అని చెప్పాడు. ఆ రకంగా సామాజిక గౌరవహోదాల గుర్తింపు కు ప్రధాన ప్రాతిపదిక అయిన కుల వ్యత్యాసాల పట్ల అన్నమయ్య కోపం దానిని తగ్గించగల, నిరాకరించగల ప్రత్యామ్నాయంగా భక్తిని ప్రతిపాదించటంలో కనబడుతుంది. హరిభక్తి ఆధిక్యత ముందు కుల ఆధిక్యత నిలవదు అని నొక్కి చెప్పాడు.

“కొంచెమును ఘనము ( గను ( గొన నేల హరి దలయ/ పంచమహాపాతకుడే బ్రాహ్మణోత్తముడు”( 1-329) అనే సంకీర్తనలో అదే మరొక కోణం నుండి చెప్పబడింది. సమాజం బ్రాహ్మణత్వాన్ని ఉత్తమమైనదిగా చెప్తున్నది. బ్రాహ్మణత్వం కన్నా భక్తి గొప్పది , భక్తి వల్ల సామాజికంగా దిగువకులాలుగా చెప్పబడేవాళ్లు కూడా బ్రాహ్మణుల కంటే అధికులు అనే వాదం సమాజంలో అందరికీ ఆమోదయోగ్యం కాకపోవటం ఒక వాస్తవం . దానిని ఎదుర్కొనటానికి కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చాడు అన్నమయ్య. విష్ణు భక్తులు బ్రాహ్మణులకంటే ఎక్కువ వాళ్ళు అంటే భరించలేకపోతున్నారు కదా! అసలు బ్రాహ్మణోత్తములు అంటే విష్ణు భక్తులే అంటూ వ్యూహాత్మకంగా తన వాదాన్ని వినిపిస్తాడు. “ఎక్కువకులజుడైన హీనకులజుడైన / నిక్కమెరిగిన మాహానిత్యుడే ఘనుడు” అనే పాటలోని చరణం.“వేదములు చదివియును విముఖుడై హరిభక్తి / యాచరించని సోమయాజి కంటే / యేదియును లేని కులహీనుడైనను విష్ణు/ పాదములు సేవించు భక్తుడే ఘనుడు” ఇదే “కొంచెమును ఘనము ( గను ( గొన నేల అని మొదలయ్యే పాటలోనూ చరణంగా పునరావృతం అయింది. “విష్ణు/ పాదములు సేవించు భక్తుడే ఘనుడు”అన్న పాదం ‘విష్ణు/ పాదసేవకుడువో బ్రాహ్మణోత్తముడు’ అని చిరు మార్పుకు లోనైంది. మిగిలిన చరణాలలోనూ అంతే. విష్ణు పాదసేవనం వలన కులహీనుడు , ‘పసురము దినెడి మాల ’, అధముడు బ్రాహ్మణోత్తములు అయినారని అన్నమయ్య నిర్ధారణ. బ్రాహ్మణ్యం గొప్పదే అని అంగీకరిస్తూ బ్రాహ్మణ్యం అంటే వైష్ణవ ధర్మాచరణే అని విపులమైన నిర్వచనం ఇచ్చాడు మరొక పాటలో ( 2- 486 ). ఏ జాతివాడికైనా హరిని కొలిస్తే వచ్చే మోక్షం ఒకటే అయినప్పుడు జాతి భేదాలు, అందులో హీనాధికాలు ఎక్కడ? అని ప్రశ్నిస్తాడు అన్నమయ్య. లేవు అన్న నిశ్చయ బుద్ధి కనుకనే ‘వైష్ణవ కుల మతమెల్లా నొకటే’ అని చెప్పగలిగాడు.

“విజాతులన్నియు వృథా వృథా / అజామిళాదుల కది యే జాతి” (2-383) అనే సంకీర్తనలో లోకంలో విభిన్నమైన జాతుల ఉనికి, వాటిలో అధికమూ హీనమూ అనే లెక్కింపులు పూర్తిగా వృథా అంటాడు అన్నమాచార్యుడు. ఎందుకంటె అధిక జాతిలో పుట్టినా, అధమజాతిలో పుట్టినా యెట్లా జీవించారు అన్నది ముఖ్యం కదా అని అజామిళుడిని ప్రస్తావించి చెప్పాడు. అజామిళుడి ఇతివృత్తం భాగవతంలో ఉంది. బ్రాహ్మణకులంలో పుట్టి జాతిధర్మం మరిచి దుర్వ్యసనాల పాలై రోగ గ్రస్తుడై మరణించాడు. అయితే మరణ సమయంలో కొడుకుని నారాయణా అని పిలిచిన కారణాన విష్ణు సాన్నిధ్యం పొందాడని ప్రసిద్ధి. అజామిళుడికి విష్ణులోకం బ్రాహ్మణ పుట్టుక వల్ల కాక అసంకల్పంగా నైనా చేసిన హరినామస్మరణ వల్ల లభించింది. కనుక మంచి జాతి, నీచ జాతి అనే వివాదాలు వ్యర్థం అంటాడు అన్నమయ్య. హరివిజ్ఞానపు దాస్యం ఒక్కటే మంచి జాతి అని చెప్పదగినది అని భావించాడు.

“తందనాన అహి తందనాన భళా తందనాన పురె / తందనాన భళా తందనాన” (2- 385) సంకీర్తన లోనూ జాతి హీనాధికాలను తిరస్కరించాడు అన్నమయ్య. అనుభవంలో హీనాధికాలు లేవని అనేక అంశాల ఉల్లేఖనంతో నొక్కి చెప్పాడు. నిద్ర రాజుకైనా బంటుకైనా ఒకటే, బ్రాహ్మణుడు, చండాలుడు నడిచే భూమి ఒకటే, కామసుఖం దేవతలకైనా పశువులకు కీటకాలకు అయినా ఒకటే,పగలు రాత్రి ధనికుడికైనా నిరుపేదకైనా ఒకటే. రుచికరమైన ఆహరం తీసుకొనే వాడి ఆకలి, ఏదో దొరికింది తినే వాడి ఆకలి ఒకటే. చెడు వాసనలపదార్ధాలపైనా, సుగంధా లీనే పదార్ధాలపైన వీచే గాలి ఒకటే. ఎండ ఏనుగు మీద కుక్క మీద ఒకేరకంగా ప్రసరిస్తుంది- ఇవీ అన్నమయ్య ఉదాహరించినవి.ఆకలి, నిద్ర, కామం- మూడూ సహజాతాలు. భూమి, వాయువు, ఎండా ప్రకృతి సహజాలు. సహజాతాలు అయినా ప్రకృతి సహజ గమనమైనా భేదభావ ప్రమేయం లేనివి. ఈ లౌకిక వాస్తవాలను చెప్పటం ద్వారా అన్నమయ్య ఒక తలంలో హీనాధికాలు, వాటిని బట్టి అవకాశాలలో , అనుభవాలలో వివక్ష అసహజం అని చెప్తున్నాడు. మరొక తలంలో వేంకటేశ్వరుడి కృప కూడా భేదభావం లేని ప్రకృతి సత్యమని చెప్తున్నాడు.

లోకంలో అసమానతలు ఎక్కడికక్కడ కనబడుతూనే ఉన్నాయి. అవి లేవని మొహం తిప్పుకోలేని అచ్చమైన మనిషి అన్నమయ్య. “మేలు లేదు తీలు లేదు మించీనిదే హరిమాయ” (2- 78) అనే సంకీర్తనలో అది కనబడుతుంది. మొదటి చరణంలో సురులును జీవులేనసురులును జీవులే అని చెప్పి ఇది ప్రకృతి భేదమే కానీ సురులకు స్వర్గం, అసురులకు నరకం కేటాయించబడటం అందుకు వాళ్ళవాళ్ళ పుణ్య పాపాలను కారణంగా చెప్పటం లోని మాయ ను సూచిస్తాడు. రెండవ చరణంలో పొలతులు జీవులే పురుషులు జీవులే అని చెప్పి అవి భావభేదాలే కానీ పురుషులకు స్వతంత్రం, స్త్రీలకు అస్వతంత్రం ఒకళ్ళను అధికులను, మరొకరిని హీనులను చేస్తున్నాయి కదా అని ఆలోచనలకు ప్రేరణ ఇస్తాడు. మూడవ చరణంలో రాజులు జీవులే బంట్లూ జీవులే కానీ సంపద ఉండటంలో వ్యత్యాసం గుర్తించి చెబుతాడు. అయితే రాక్షసుల దేవతల పాపపుణ్యాలు, స్త్రీపురుష న్యూనతా ఆధిక్యాలు, సంపద ఉండటం లేకపోవటం అనేవి స్పష్టంగా సామాజిక వ్యత్యాసాలే అని అన్నమయ్యకు తెలుసు. అవి ఉండకూడనివి అన్న స్పృహ కూడా ఉంది. వాటిని లేకుండా చేయగల భౌతిక కార్యాచరణ అతని ఊహలో లేనిదైనా కావాలి. ఊహకు అందనిదైనా కావాలి. మరి అవి ఉండకుండా పోవాలంటే అతనికి తోచిన మార్గం వేంకటేశుని శరణు వేడటమే. అది చెప్పే పదం పూర్తిచేసాడు.

అన్నమయ్య ప్రస్తావించిన కుల వర్గ అసమానతల వ్యవస్థ రాచరిక వ్యవస్థలు అంతమై లౌకిక సోషలిస్టు ప్రజాస్వామ్య వ్యవస్థగా దేశం పరివర్తన చెందటానికి సంకల్పించుకొని 75 ఏళ్ళు పూర్తయిన తరువాత ఏ మాత్రం మారింది అన్నది ఇప్పుడు మనముందు ఉన్న ప్రశ్న. సనాతన సంప్రదాయం పై మక్కువ మనుస్మృతి దగ్గరే ఎందుకు ఆగిపోయింది? భక్తి సంప్రదాయంలోని ప్రజాస్వామిక ఉదార భావజాలాన్ని సంస్కృతిలో భాగంగా ఎందుకు చూపలేకపోయింది ? వంటి ప్రశ్నలకు జవాబులు వెతకాలి ఇప్పుడు. సమాజంలో అనుస్యూతంగా వస్తున్న సమత్వ సహన సంస్కృతిని భిన్న వ్యక్తీకరణలతో నమోదుచేసిన అన్నమాచార్యుడు వంటి దేశి కవుల, వాగ్గేయకారుల సాహిత్యాన్ని అధ్యయనానికి పెట్టటం అందుకు అవసరమైన నైతిక బలం ఇస్తుంది.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply