అనేక్… ద మార్జినల్ మ్యాన్

కన్నడ మూలం : కే.వి. తిరుమలేశ్
తెలుగు అనువాదం : డా. నలిమెల భాస్కర్

హమ్మయ్య! గమ్యం చేరుకున్నాను. ఎట్టకేలకు గమ్యం చేరుకున్నాను. ఓహ్ గాడ్! దేవుడా !! నా స్వప్నం సాకారమైంది. ఈ నా జీవితం సార్థకమైంది. అచీవర్సు లిస్టులో నా పేరు రాయడం మాత్రమే మిగిలి వుంది. అదీ వాళ్ళే రాస్తారు. నేనేమీ చేయాల్సింది లేదు దీనికోసం. అంత దూరం నుంచి నాకు కనిపిస్తున్నది : దైవదూతలాగా వేషధారణ కల్గిన ఓ మనిషి నిచ్చెన ఎక్కి బంగరు రంగు పెయింటుతో ఒక్కొక్కరి పేరును విశాలమైన బోర్డు మీద రాస్తున్నాడు. నేను అటూ ఇటూ సంతోషంగా చూస్తున్నాను. అక్కడ ఇంతకుముందే నాకు పరిచితులైన కొందరున్నారు. వాళ్ళ ముఖాలకేసి చూసాను. కానీ వాళ్ళు నన్ను గుర్తిస్తున్నట్లు ఏ సూచనా లేదు. నన్ను గుర్తించడానికి ఇంకా ఏం కావాలి వీళ్ళకు అని ఆలోచిస్తున్నాను. మొదటి నుండీ నన్ను ఎటువంటి ప్రసిద్ది లేని పనికిరాని వాడని కడుహీనంగా చూసారు వీళ్ళు. నన్ను మెయిన్ స్ట్రీములోకి రానివ్వలేదు. నేను మార్జిన్ లోనే గొప్ప సాధన చేస్తూ వచ్చానిక్కడికి. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ నాకు స్ఫూర్తి. ఇక్కడికొచ్చి వీళ్ళు ఏ గమ్యం చేరారో అక్కడికి చేరుకున్నాను. ఇంక ఏం కావాలి? నేను వాళ్ళ ముఖాలకేసి చూడడం ఆపాను. వీళ్ళతో నాకేం పని? ఇక్కడంతా న్యాయబద్ధంగా నడుస్తుంది. అంతా పారదర్శకం. అహో! పేర్లు రాసే ఫలకం కూడా పారదర్శకం ! దానిగుండా అటువైపున్న అందమైన దృశ్యం భూగోళాన్ని చూడవచ్చు. చూసాను. అక్కడ ఏముంది? ఏమీ లేదు. మన ఆలోచనలూ, ఊహలే అన్నీ మన కళ్ళ ముందు ప్రత్యక్షం కావిస్తాయి. ఉదాహరణకు.. నేను ఓ పచ్చిక బయలు కావాలని ఆలోచించాను. లో ఎండ్ బిహోల్డ్! పచ్చిక బయలు ప్రత్యక్షం. పశువుల మంద గురించి ఊహించాను. అదీ వచ్చేసింది. గలగల పారే సెలయేరు? ఇదీ విచ్చేసింది. అక్కడ స్నానం కోసం దిగుతున్న ఓ సుందరి? ఛీ! ఏమిటిదంతా? నాది కోతి బుద్ధి. నాకు సిగ్గేసింది. ఆశకూ ఓ హద్దుండాలి. ఇంతదూరం చేరాక కాస్త సీరియస్ గా వుండటం నేర్చుకో అని నాకు నేనే చెప్పుకున్నాను. ‘సరే’ అని జవాబూ చెప్పుకున్నాను. గంభీరంగా వుండిపోయాను. మళ్ళీ నా కళ్ళు పరిచితుల వైపు తిరిగాయి. దొంగ దొంగతనంగా చూసాను. వాళ్ళు కూడా అప్పుడప్పుడు నన్ను చూస్తూ తమలో తాము ఏదో మాట్లాడుకొంటున్నారు. వాళ్ళు కాస్త గజిబిజికి గురైనట్లూ గాబరాకు లోనైనట్లు అనిపించింది. అదేమిటో గానీ, వాళ్ళల్లో అసంతృప్తి ఇంకా వుంది. అన్నీ సాధించి ప్రశాంతంగా ఉండాల్సిన చోటు ఇది. ఎందుకు అసంతృప్తిగా వున్నారు? నేనేమైనా వీళ్ళ కోసం చేయగలనా? వెళ్ళి అడగనా మరి? నా మనస్సు ‘వద్దు-ఆగు’ అంది. వీళ్ళు నిన్ను మొదటి నుండీ తృణీకరించినవాళ్ళు. ఇప్పుడు వెళ్ళి అడిగితే, అవమానానికి మరో అవకాశం కల్పించినట్లే ! కొన్నిసార్లు గమ్మున ఉండటమే మంచిది. ‘యు డోంట్ మీన్ ఎనీ హార్మ్. దట్స్ ఆల్. దట్స్ ఆల్’ వీటిని రిపీట్ చేసాను, నా మనశ్శాంతి కోసం. మాకు కూచోవడానికి చాలినన్ని కుర్చీలు, సోఫాలున్నాయి. చాలామంది గుంపులు గుంపులుగా కూచుని కబుర్లలో పడ్డారు. నేను ఏకాకిని అనిపించింది. ఓ సాదా కుర్చీ లాక్కుని కూచున్నాను. ట్రేలో అమ్మాయిలు తినుబండారాలు, పానీయాలు అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇస్తున్నారు. నాకు చాలా ఆకలిగా ఉన్నందువల్ల (కారణం నేను పరిశ్రమతో ఈ దారి దాటి చేరానిక్కడికి) చాలినంత తిని తాగాను. నా గురించి గుసగుసలు పోతున్న వాళ్ళల్లోంచి ఇద్దరు దిగ్గున ఎక్కడికో లేచి వెళ్ళారు.

సమయం ఎంత గడిచిపోయిందో తెలీదు. నా పంచేంద్రియాల్ని ఉన్నపళంగా తట్టి లేపగల్గిన ఓ వయ్యారి అమ్మాయి నా దగ్గరికొచ్చింది. యూనిఫారమ్ లో వుంది. అంటే ఈ ఎస్టాబ్లిష్ మెంటుకి సరిపోయినట్లుంది ఆ యువతి. (ఇక్కడంతా ఇటువంటి అందమైన యువతులదే కార్యభారం అనిపించింది) ‘నమస్కారం సార్’ అంది. ‘నమస్కారం ఎలా వున్నావమ్మా?” అన్నాను. అందుకామె బదులు చెప్పకుండా “ట్రైబ్యునల్ మిమ్మల్ని పిలుస్తున్నది” అంది. “ట్రైబ్యునల్? ఎందుకు?” అన్నాను. “ఏదో ఫార్మాలిటీ” అంది. “ఇక్కడ కూడా ఫారమ్ గీరమ్ నింపడం అనే ఫార్మాలిటీనా?” అన్నాను. “అదేం కాదు. కానీ ఆ ట్రిబ్యునల్ మీతో మాట్లాడుతారట” అంది. “సరే… ఎక్కడుంది ట్రిబ్యునల్?”. “అదుగో.. అక్కడ.. ఆ డోమ్ తరహా డేరా ఉంది కదా, నీలి రంగులో అక్కడ”. ఇదేదో స్పెషల్ ట్రీట్ మెంటు అనిపించి సంతోషమైంది నాకు. ఎందుకంటే వేరే ఎవరినీ ఇలా ట్రిబ్యునల్ ముందుకి పిలిచినట్లు తోచలేదు. నా సుదీర్ఘ కాలసాధనకి అదేదో స్పెషల్ సైటేషన్ కచ్చితంగా అయివుంటుంది. నేను ధరించిన షర్టుని కాస్త సరిచేసుకొని ముందుకి నడిచాను. ఆ అమ్మాయి నన్ను డేరా బయటి ద్వారం దాకా నన్ను తీసుకొచ్చి వదిలింది. ఒక్కడ్లో ఒంటరిగా ముందుకి కదల్లేక పోయాను. ‘నువ్వు రా, ట్రైబ్యునల్ దాకా, నువ్వొస్తే నాకు సంతోషంగా వుంటుంది” అన్నాను. ఆ అమ్మాయి చాలా మంచిది. మరోమాట ఎత్తకుండా నాతో వచ్చింది. డేరాలో చాలామంది కూచుని వున్నారు, ఒక రౌండ్ టేబుల్ ముందు అర్ధచంద్రాకారంలో కూచున్నట్లు. మన పార్లమెంటులో వుంటుంది కదా, అలా. మధ్యలో ముగ్గురు ప్రత్యేకంగా కూచుని వున్నారు. వాళ్ళ మధ్య ఓ మహిళ. ఆమెకి అటూ ఇటూ ఇద్దరు పురుషులు. ఓహో.. ఇదంతా కలిసి ట్రైబ్యునల్ అనుకున్నాను. ఈ ముగ్గురూ చక్కగా అలంకరించబడిన ఆసనాల్లో ఉపస్థితులై వుంటే, వాళ్ళ ముందు తెల్లని గుడ్డ పరచబడ్డ ఓ మేజాబల్ల వుంది. దానిపై ప్లవర్ వేజులూ, నీళ్ళ బాటిళ్ళూ, కాలింగ్ బెల్లూ, కార్డులెస్ మైకూ.. ఇవి ఉన్నాయి. మధ్యలో ఉన్న అధ్యక్షురాలి ముందర ఓ పెద్ద సుత్తి కూడా వుంది. ఓ మనిషిని ఒకే దెబ్బతో చంపగల్గినంత పెద్దగా ఉందది. కానీ నా దృష్టి మళ్ళింది, ట్రైబ్యునల్ వెనక వాళ్ళ కన్నా ఎత్తైయిన నల్లని ఆసనాల మీద కూచున్న కొంతమంది వైపు. వాళ్ళు మిడిగుడ్లతో నన్నే తీక్షణంగా చూస్తున్నారు. వాళ్ళు సజీవంగా మనుషులో లేక బొమ్మలో తెలియడం లేదు. సకలం ముకుళం పెట్టుకుని నిశ్చలంగా కూచున్న వాళ్ళని చూసి నాకు భయమైంది. ‘ఎవరు వీళ్ళు?” అని లోగొంతుకలో అమ్మాయిని అడిగాను. ఆమె అదే గొంతుకతో “మీకు తెలీదా? వాళ్ళు సరస్వతీ సన్మానితులు” అంది. “వాళ్ళ రెప్పలకు ఏమైంది?” అన్నాను. “కత్తిరించి పారేసారు. ఎందుకంటే.. వాళ్ళు మనువంశపు సాక్షీభూతులు – గొప్ప ప్రతిభావంతులు. కళ్ళు మూయరు. పొరపాటున మూసేస్తారేమోనని రెప్పల్ని కత్తిరించారు” అంది. దేవతలు అనిమిషులు అని నేను చదివింది అబద్దం కాదని అనిపించింది. “అన్ని మిథాలూ ఇక్కడ సత్యాలే!” అంది ఆ అమ్మాయి. ఈమె మైండ్ రీడరే అనుకుని నా ఒళ్ళు ఝల్లుమంది. నా ఆలోచనలన్నీ ఈమెకు తెలుస్తున్నాయి. ఈమే ఇలాగుంటే ఇక ఈ ట్రైబ్యునల్? నేను చాలా జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకున్నాను. కానీ, ఎలా? స్పాంటేనియిటీ నాకు పుట్టుకతో వచ్చిన గుణం. అంతలో నన్ను అక్కడ వదిలేసి ఆమె బయలుదేరి వెళ్ళింది.

“దయచేసి కూచో” అంది అధ్యక్షురాలు. ఆమె కళ్ళద్దాలు పొడవాటి ముక్కును సగం దాటి, ఇంకేం పడిపోతాయి అన్నట్లున్నాయి. పడకుండా వుంటానికి వాటి కాడలకు బంగరు గొలుసులు వేసి మెడకు ఓ ఆభరణంగా దిగేయడం జరిగింది.

కూచోవడానికి అక్కడ నాకోసం కుర్చీలేదు. బహుశః ఆమె దృష్టికి ఈ విషయం రానట్లున్నది. ఆమె నన్ను కళ్ళద్దాల మీదినుండి దూరదృష్టితో చూస్తున్నది. నేను నించునే వున్నాను. బహుశః ఆమెకు నేను కనిపిస్తూ వుండక పోవచ్చునేమో, నేను కూచున్నానని కూడా ఆమె అనుకుని వుండొచ్చు.

“పేరేమిటి?” బహుశః ఆమెకు పేరు తెలుసు. ఎందుకంటే నాకు సంబంధించిన ఓ మొత్తం ఫైలు ఆమె ముందున్నది. ఓ సెక్రటరీ అప్పుడప్పుడు పేజీలు చూపిస్తూ ఆమెకు సాయం చేస్తున్నది.

“పేరు అనేక్ అని. అమ్మానాన్నలు పెట్టిన పేరు ఏకనాథ్. నేను దాన్ని అనేక్ అని మార్చుకున్నాను” “ఏదైనా ప్రత్యేక కారణం వుందా?”

“ఏకనాథ్ అంటే ఒకటి అని అవుతున్నది కదా! నాకు బహుళత్వం ముఖ్యం . అనేక్ అంటే ఒకటి కన్న ఎక్కువ అని. అనేకుల్లో నేనూ, నాలో అనేకులూ.. అర్థాత్..” అన్నాను.

“అర్థాత్?”

“ప్రజాసమూహాల ప్రతినిధిని నేను. అలాగే నా గొంతూ ప్రజాసమూహం. ఈ రెంటికీ అవినాభావ సంబంధం”

“మిస్టర్ ఏకనాథ్ ఉరఫ్ అనేక్! ఇది మెయిన్ స్ట్రీముకు సంబంధించిన చోటు. నీవెలా ఇక్కడిదాకా వచ్చావో తెలీదు. ఒకవేళ వచ్చినా నువ్వు మార్జినల్ లోనే నిలుచోవాల్సి వుంది. పైగా మెయిన్ స్ట్రీముతో చేరే ప్రయత్నం చేసావు. దిస్ ఈజ్ ఇనప్రాప్రియేట్. నీకిది తెలియపరచడం కోసమే ఇక్కడ ట్రిబ్యునల్ కు పిలిచింది” ఇలా అనేసి ఆవిడ తనకు కుడివైపు తిరిగి చూసి “ప్రొఫెసర్ అయ్యంగారు సర్! యువర్ టర్న్ ప్లీజ్” అంది. తిరునామాలు ధరించి అలా కూచున్న ప్రొఫెసర్ దిగ్గున మెలకువ వచ్చినట్లు “సాపేక్ష సిద్ధాంతం గురించి నీకు తెలుసా?” అనడిగాడు.

నేను ఉక్కిరిబిక్కిరయ్యాను. ఈ సిద్ధాంతం పేరు తెలుసు కానీ వివరాలు తెలీవు.

“సర్! తెలీదు” అన్నాను.

“తెలుసుకోవాలి. ఎందుకంటే లోకంలో స్పీడ్ ఆఫ్ లైట్ కన్న అబ్సల్యూట్ ఐనది ఏదీ లేదు. మిగిలినవన్నీ దానికి సాపేక్షాలు. కనెక్షన్ ఏమిటో.. తొల్లుంగో. కనెక్షన్ రొంబా ఇరిక్కిరదు. ఈ మెయిన్ స్ట్రీము, మార్జినల్ స్క్రీము ఇవన్నీ ఇల్యూషన్స్. సరిగా చూస్తే రిలెటివ్స్”

“అవి పరస్పరం చూసుకుంటే మాట్లాడటమే వుండదు. ఇంక రిలెటివ్స్ కావడం ఎలా?” నేను ధైర్యం చేసి ప్రొఫెసర్ ను అడిగాను. (వారు ఇంకా పూర్తి మెలకువకు రానందువల్ల రిలెటివ్ కు బదులు రిలెటివ్స్ అని అన్నారా?)

“రిలెటివ్ ఐనవి రిలెటివ్స్ కూడా అవుతాయి. రిలెటివ్స్ ఐనటువంటివి రిలెటివ్ సైతం. వాంగొ.. వాంగా.. పరమాత్మ అనేవాడు ఏకాత్మ. ఇవాళ మార్జినల్ ఐనవాళ్ళు రేపు మెయిన్ స్ట్రీము అవుతారు. ఉదాహరణకు… ఇళంగో అడిగళ్”.

“ఎన్నో ఏండ్ల నుండి ప్రయత్నిస్తూ వున్నాను సార్, ఇవాల్టికీ కాలేదు. వంట చేసేవాళ్ళు చేస్తూనే వున్నారు. ఇంత పరిశ్రమ చేసి ఇక్కడిదాకా వచ్చాను. ఇప్పుడు ప్రవేశం నిరాకరిస్తే ఎలా?”

మధ్యలో కలగచేసుకున్న అధ్యక్ష స్థానంలో ఉన్నావిడ “ఎవరూ నీకు ప్రవేశం నిరాకరించడం లేదు. ఎవరికి ఏ అర్హత వుందో అది వారికి దొరుకుతుంది. బీ రెస్ట్ అస్యూర్థు” అంది అందరికీ విన్పించేట్లు. భయంకరమైన కరతాళ ధ్వనులు విన్పించాయి ఈ మాటలకు.

“ఉండండి! నీకు సైన్సు దారి వద్దు. ఆధ్యాత్మిక పథం?” అయ్యంగార్ కొనసాగించారు.

“ఆధ్యాత్మికత నాకు తెలీదు సార్. జీవితం కన్న అవతల ఏమీ తెలీదు. వాస్తవం ఏమంటే.. జీవితం కూడా ఓ మిస్టరీ అన్పిస్తున్నది”

“ఆధ్యాత్మికత తెలిసివుంటే నువ్వింత కష్టపడి వుండేవాడివి కావు, అన్నీ ఆ పరమాత్ముడే ఐనపుడు, మార్జినల్ ఏమిటి? మెయిన్ స్ట్రీము ఏమిటి? పార్తెయా?”

“పార్తె సార్, పార్తె. అందువల్లే అడుగుతున్నాను, నన్ను మెయిన్ స్ట్రీముకి తీసుకుంటే ఎవరికేమి నష్టం?”

అధ్యక్ష మహిళ మరోమారు మధ్యలో ప్రవేశించి “ట్రైబ్యునల్‌ను ప్రశ్నించడం అలౌడ్ కాదు” అంది. అనంతరం ఎడమ వైపున్న మహాత్ముని వైపు తిరిగి “డాక్టర్ నాయుడూ! నిమ్మ విట్నెస్” అంది.

డాక్టర్ నాయుడు మొదట అధ్యక్షురాలిని పొగిడారు. అనంతరం ప్రొఫెసర్ అయ్యంగార్ని ప్రశంసించారు. ఇలాంటి మహనీయులున్న వైపు తనను ఓ సభ్యుడిగా నామినేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నారు. ఆ తర్వాత తనను ఓ పోస్టు కలోనియల్, పోస్టు మాడర్ను, పోస్టు డిజిటల్, పోస్టు రేషనల్, పోస్టు ఫిలాసఫికల్ లెఫ్టిస్టు థింకర్ డూవర్ అన్నారు (ఆయన మాటల మహాప్రవాహం ఓ రాజకీయ దాడిలాగా వుంది నామీద) ఓవైపు బ్రిటిషర్లను తిట్టారు. ఇంకోవైపు అమెరికాను. ఆపై భారతదేశాన్ని… చివరికి అందరినీ.

“నీవు ఓ ఏకతావాదివి అని తెలిసింది” అన్నారు.

“లేదు. లేదు. నేను ఏకతావాదిని కాను. అనేకతావాదిని. అందుకనే ఏకనాథ్ అనే పేరును అనేక్ అని మార్చుకున్నాను” అన్నాను.

“వ్యత్యాసం ఏమిటి? డికన్‌స్ట్రక్షన్ చేస్తే రెండూ ఒక్కటేనే!”

ఇప్పుడు ఆ అంశం వద్దు, సమయం లేదు అనే సూచన అధ్యక్షురాలు చేసినందువల్ల నాయుడు గారు “ఉండనీ! అదిప్పుడొద్దు. నాకు ఒక్కమాటలో చెప్పు. నువ్వు మార్జిన్ నుండి మెయిన్ స్ట్రీముకి ఎందుకు రావాలి?” అడిగారు.

“నిజం చెప్పాలా సార్? ఇక్కడికి రావడానికి ముందు నాకు మీ ప్రశ్నకు జవాబు తెలిసివుండింది. కానీ, ఇపుడు తెలీదు”.

“థింక్ అబౌటిట్, యంగ్ మ్యాన్. థింక్ అబౌటిట్. తర్వాత నాకు చెప్పు” నాయుడు నన్ను యంగ్ మ్యాన్ అని పిలిచినందువల్ల నేను పులకించిపోయాను. వాస్తవం ఏమంటే నేను యంగ్ ఏమీ కాను.

“మంచిది సార్! ఐ, విల్”

డాక్టర్ నాయుడి వంతు ముగిసాక అధ్యక్షురాలు రుద్రమదేవి (ఆమె పేరు అలాగని నాకు వాళ్ళ మాటల మధ్య తెలిసింది) ప్రశ్నోత్తరాలను తనే చేపట్టింది.

“నౌ, ఏకనాథ్….”

“అనేక్…”

“అనేక్! నువ్వెందుకు మెయిన్ స్ట్రీముకి రాలేదో ఏనాడైనా బాగా ఆలోచించావా?”

“నన్ను రానివ్వలేదు”

“ఆ ఆలోచనే మొదటి తప్పు. ఎందుకంటే ఎవరూ ఎవరినీ ఆపడం లేదు- ముందుకు తోయడం లేదు”

“కానీ.. గ్రౌండ్ రియాలిటీ అలా లేదు మేడమ్”

“నువ్వు నాకు గ్రౌండ్ రియాలిటీ గురించి నేర్పుతున్నావా?” ఫైలును పైకెత్తి పట్టింది. బల్లపై బలంగా కొట్టింది. “దీంట్లో నీ మొత్తం చరిత్ర ఉంది. నిన్ను హర్డు చేయడం నా ఉద్దేశం కాదు. నిన్ను నువ్వే హర్టు చేసుకుని ఇతరుల్ని నిందిస్తే ఎవరేమి చేయగల్గుతారు? అందుకే నుదుటిరాత అనడం” అంది కాస్త కోపంతో.

“అర్థం కాలేదు మేడమ్. ఇవాళ నా అతిగొప్ప రోజు అనుకున్నాను. కానీ అలా లేదు”.

“మొదటగా… ఈ కాలానికి విరుద్ధంగా నువ్వు నించున్నావు. ఇప్పుడు నీ సమకాలీనుల్నీ, యువకుల్నీ గమనించు. సమకాలీనుల్లో చాలామంది భక్తి మార్గం ఎంచుకున్నారు. కొందరు అక్కమహాదేవిని ఆశ్రయించారు. ఇంకా కొందరు అల్లమ ప్రభువును, బసవని మాదార మాచయ్యను, పురందర దాసుని, శరీఫ్ ను ఆశ్రయించారు. ఇంకా కొందరు బుద్ధునికి ఆకర్షితులయ్యారు. ఈ కాలపు అగత్యం యిది. నువ్వు వీళ్ళలో ఎవరినైనా స్వీకరించావా?”

“లేదు మేడమ్! నాకు అది తోచనే లేదు”

“కొందరు రామకృష్ణుని, మరికొందరు రమణ మహర్షిని, ఇంకా కొందరు అరవిందుణ్ణి! పోనీలే! కనీసం కర్ణాటకలోని ఏ లోకల్ స్వామీజీనైనా? ఎందరో ఉన్నారు కదా!”

“నేను ఇతర విషయాల్లో బిజీగా ఉన్నాను మేడమ్”

“ఇతర విషయాల్లోనా? ఏ ఇతర విషయాల్లో? ఇక్కడున్నాయి కట్టింగ్స్ అన్నీ”

“మనుషుల విషయంలో. ఆధ్యాత్మికత నాకు తెలీదు”

“మరి నువ్వు మెయిన్ స్ట్రీముకి రావడం ఎలా? ఓసారి నాకు కుడిఎడమల్లో కూచునివున్న వాళ్ళను చూడు. ఎంత గొప్ప మహానుభావులు! ప్రొఫెసర్ అయ్యంగార్ జ్ఞానభాండాగారం. నా పిహెచ్.డి. గురువు గారున్నూ. ఇరవై ఏండ్ల ముందు తిరువళ్ళువర్ గురించి లండన్‌లోని ఇండియా సొసైటీలో వారు చేసిన ప్రసంగాన్ని బీట్ చేసినవాళ్ళే లేరు. ఇక నాయుడు. కల్చరల్ కమీషన్ అధ్యక్షులు. లోకాన్ని పదిసార్లు చుట్టి వచ్చారు. బహరైన్ సుల్తాన్ ఈ నాయుడు గారిని ఓరోజు తన గదిలో కూచోబెట్టాడు. ఎందుకు? మీ వంటివారు నా దేశంలోంచి పోరాదు అని. తర్వాత… ఏడాదికో సారి భేటీ అయ్యే షరతుతో విడుదల చేసాడు. నాయుడు ఈ మీటింగ్ అవగానే బహరైన్ కు వెళతారు. అందువల్లే నేను వారిని డికన్స్ట్రక్షన్ గురించి మాట్లాడ్డానికి ఒప్పుకోలేదు. వారు దాని గురించి మాట్లాడ్డం ప్రారంభిస్తే దయ్యాలు పట్టినట్లు స్థల కాలాలు మరచిపోతాం. ఇటువంటి ఈ నక్షత్రద్వయం నీ ఎదురుగా వుండటం నీ అదృష్టం అని తెలుసుకో”.

నేనేమీ మాట్లాడలేదు.

“ఏమి చెబుతున్నానంటే, నేను మనుషుల గురించి ఆలోచిస్తున్నాను అనే కాలం ఇది కాదు. మనం మన కల్చర్ గురించి ఆలోచించాలి. ద స్లోగన్ ఈజ్ రిటర్న్”.

“రిటర్న్… ఎక్కడికి?”

“ఎక్కణ్ణుంచి వచ్చామో అక్కడికి. టు ద రూట్సు. కలోనియల్ కాలం నుండి ఇటీవలి కాలం దాకా అంతా రిజెక్టు చేయి. వెనక్కి వెళ్ళు. వెనక్కి వెనక్కి.. సాధ్యమైనంత వెనక్కి. గో బ్యాక్. ముందుకు వెళ్ళాలని కోరుకునేవాళ్లు వెనక్కి వెళ్ళేందుకు అభ్యసించాలి. వెళ్ళి ప్రోటోస్టేట్ చేరాలి. అదే మన పరమపదం. నా పిహెచ్.డి. సిద్ధాంతగ్రంథం చదివావా?”

“లేదు మేడమ్”

“ఇన్ సర్చ్ ఆఫ్ ప్రోటో స్టేట్. టుమారోస్ ప్రోగ్రాం ఫర్ యెస్టర్ డే”

“టుమారోస్ ప్రోగ్రాం ఫర్ యెస్టర్ డే?”

“ఇట్ వన్ ప్రెసిడెంట్సు మెడల్ ఫర్ ఎక్సలెన్సు” అన్నారు అయ్యంగారు గర్వంగా.

“యునెస్కో కూడా ఓ కాపీ కావాలంది” అన్నారు నాయుడు, చప్పట్లు చరుస్తూ.

“నాకైతే ఆ విషయం ముఖ్యం. నేను దాన్ని రాసాను అనుకోవడం లేదు. ప్రొఫెసర్ అయ్యంగార్, డాక్టర్ నాయుడు గారల మార్గదర్శకత్వం లేకుంటే నేనది రాయడం సాధ్యపడేది కాదు. లైఫ్ టైం అచీవ్ మెంటు అది. చదువు. నీకు తెలిసి వస్తుంది, నేను ఏమి చెబుతున్నానో అనేది”

“మంచిది మేడమ్”

“రెండోది… నువ్వు చాలా ఆత్రుతతో ఉన్నట్లు కన్పిస్తున్నది. నీ మొత్తం బాడీ లాంగ్వేజి తొందరపాటుతో వుంది. ఎందుకిలా?”

“నేనిక్కడికి రావడం చాలా కష్టమైంది మేడమ్. మొత్తం దారికి, వాకో వేలు పెట్టారు. ఏర్ పోర్టుల్లో పెడతారు కదా, అలాంటివి. మధ్యలో మెయిన్ స్ట్రీము వాళ్ళు మాత్రం వెళ్ళే వాక్ వే. దానికి అటూఇటూ పార్శ్వాల్లో నావంటి మార్జినల్ జనం వెళ్ళే వాక్ వేలు. మెయిన్ స్ట్రీము వాక్వో ప్లేట్లు ముందుకి తిరుగుతున్నాయి. అందువల్ల అందులో ఉన్నవాళ్ళకు ఎటువంటి కష్టమూ కలగడం లేదు. పక్కల్లో ఉన్న వాక్వలు వ్యతిరేక దిశల్లో చలిస్తున్నాయి. వాటిల్లో ముందుకెళ్ళడం కష్టసాధ్యం. నేను అలాంటి ఓ వాక్ వేలో ఎంతో శ్రమించి వచ్చాను. అందువల్ల చాలా అనారోగ్యం పాలయ్యాను. నా కాలి కండరాలు కృశించినట్లున్నాయి”.

“ఎందుకింత శ్రమ పడ్డావ్?”

“నేను ప్రధానస్రవంతి సమకాలీనులతో ఇక్కడికి చేరుకోవాలి కదా, అందుకే”

“అంటే, నువ్వు వాళ్ళతో పోటీ పడ్డావ్?”

“నేనేం చేయాలి మేడమ్?”

“ఏమీ చేయవద్దు. నీ మానాన నువ్వుంటే చాలు. సంతోషంగా, ఆనందంగా, ఖుషీఖుషీగా, విశ్రాంతంగా, ప్రశాంతంగా, వీటన్నింటిని బలి యిచ్చి లభింప చేసుకున్న సాధన అంటే అచీవ్మెంట్ ఓ సాధనేనా?”

“మీరు అనేదాంట్లో వాస్తవం వుంది మేడమ్. నాకిక్కడికి వచ్చాక తెలుస్తోంది. ఐనా మీ అందరినీ చూసే భాగ్యం కలిగింది కదా! అలా కాకుంటే నా మెయిన్ స్ట్రీము సమకాలీనులు చెప్పినదాన్నే నేను నమ్మాల్సి వచ్చేది. వాళ్ళు నాతో వాస్తవాలు చెప్పడం లేదు”

“ఆయా కాలాల్లో ఏ కారణానికి ఎవరు ఏం చెబుతారో అదే సత్యం. అందువల్ల అంతా సత్యమే, ఏకనాథ్”.

“అనేక్”

“సరే! అనేకే కానీ! అయితే, నువ్వో సంగతి అర్థం చేసుకోలా. ఇది చాలా ముఖ్యమైనది”.

సభ అంతా ఈ ట్రిబ్యునల్ కార్యక్రమాన్ని అత్యంత ఆసక్తితో వీక్షిస్తున్నది. అలాగే దాన్ని పూర్తిగా వీడియో తీయడం అవుతున్నది. బహుశ! రానున్న రోజులకు ఇదొక మాడల్ గా వుంటుందేమో! చరిత్రలో ఓ భాగంగా మారుతుందేమో!

“అదేమిటంటే ఈ రెండు రకాల వాక్ వేలు ఉన్నాయి కదా! అవును.. అవి వాస్తవాలూ, అవును రూపకాలున్నూ. గమ్యానికి అనుకూలంగా ఏర్పరచిన వాక్ వే.. మెయిన్ స్ట్రీము జనాల కొరకు. అది ఆ జనాలకు ఉదారంగా ఏర్పరచింది కాదు, వారి ప్రతిభకు అమర్చింది. గమ్యానికి వ్యతిరేకంగా వున్న వాక్ వే.. నువ్వు మార్జినల్స్ ది అంటున్నావు కదా, మా దృష్టిలో మార్జినల్ జనాలని విడిగా లేరు. అది జన్మతః ప్రతిభ లేక, కేవలం పరిశ్రమతో సాధన చేసే వాళ్ళకోసం వాడేది! నువ్వు ఈ రెండో కాటగిరీ వాడివి. అందుకే ఈ తొందరపాటు, పరుగు, అసహనం, అసూయ. నిజమైన ప్రతిభావంతులు చక్కటి గ్రంథాలు రచిస్తారు. వాళ్ళ కవితల్లో కావ్యాత్మికత ఉంటుంది, అంటే కావ్యాత్మ. రసానుభూతి ఉంటుంది. ఉపమ, ఉపమానం, ప్రతీకలు, రూపకాలూ ఉంటాయి. వీళ్ళందరు ఓ ఆధునిక కవి చెప్పినట్లు మాధ్యమ మహాశయులు”

“అర్థం కాలేదు”

“అంటే నేరుగా చెప్పడం ఆపేసి, ఓ మాధ్యమంగా తన్నుతాను అనుకునే వినయవంతులు. ఒక్కో రూపకమూ ఒక్కో పొట్లం. వెంటనే తినొచ్చు, అథవా ఇంటికి తీసికెళ్ళవచ్చును. కవి తానే ‘మూలం’ కాదు. కేవలం ఓ ‘మాధ్యమం’, కవి నిమిత్తమాత్రుడు. అర్థమైందా? మన కుమార వ్యాసుడు కూడా ఇలాగే అన్నారు”

“అవునవును.. లిపికారుడు” ప్రొఫెసర్ అయ్యంగారి చేర్పు.

“ప్రతిభాసంపన్నులు ఏనాడూ తమనుతాము పొగడుకోరు. వాళ్ళ ప్రతిభే వాళ్ళను పొగడుతుంది. అందువల్ల వాళ్ళ మధ్యలో వున్న వాక్ వేలో ఉంటారు. వాళ్ళు కష్టపడాల్సింది ఏమీ లేదు. ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రతిభ లేకుండా కేవలం ఆశ మాత్రమే ఉన్నవాళ్ళు రాత్రింబవళ్ళు శ్రమించాల్సి వస్తుంది. మార్జినల్ వాక్ వేలు వాళ్ళకోసం”.

ఇటువంటి విశ్లేషణ విన్నాక నేను అధ్యక్ష స్థానీయ డాక్టర్ రుద్రమదేవి అభిమాని కాకుండా వుండటం ఎలా సాధ్యం ? అన్నాను.

“ఫైనల్ గా తమరు నాకు ఏం చెప్పదలచుకున్నారు?” అనడిగాను.

“రిటర్న్”

“రిటర్న్?”

“అవును… రిటర్న్.. అంటే… యూటర్న్!”

“ఎక్కడికి?”

“నీ ఊరికి-సంస్కృతికి-నీ మూలాల్లోకి-ప్రోటోఫార్మ్ కు-ప్రోటో స్టేటుకి”

“అలాగైతే నేనిక ఏనాడూ ఇక్కడికి రాకుండా పోతాను”

“ఎందుకు రారు? హండ్రడ్ టైన్సు రావచ్చును. కానీ, మెయిన్ స్ట్రీముకి నిన్ను చేర్చడం గానీ వదలడం గానీ మా చేతుల్లో లేదు”

“మరెవరి చేతుల్లో?”

“నీ చేతుల్లోనే. ఇప్పుడు వెళ్ళు, కొత్తగా జీవితం ప్రారంభించు. లీనమై పో బతుకులో. మునిగిపో. వదిలేసెయ్. ధ్యానం చెయ్”

“ఓ సందేహం మేడమ్”

“ఏమిటది?”

“ఒకవేళ నేను మునుపటిలాగే తొందరతో పరుగులు తీస్తే నాకెలా తెలిసేది?”

“నిజమైన సందేహం. దానికి ఓ ఉపాయం ఉంది” అని మేడమ్ బెల్ ఒత్తారు. ఇద్దరు మహాకాయులు ఎక్కణ్ణించో ప్రత్యక్షమయ్యారు.

“ఇతనికి నంబర్ టూ ఫిక్స్ చేసి వదిలేయండి” అంది.

“ఇక వెళ్ళిరా, అనేక నాథ్. నీకు పరిపక్వత వచ్చాక పిలుపు వస్తుంది. అప్పుడు వచ్చేసెయ్. అందాకా వేచి వుండాలి. తొందరవద్దు. ఆత్రుత వద్దు- ప్రశాంతంగా ఉండు. తెలిసిందా? ద సెషన్ ఈజ్ ఓవర్” అని ఆమె సుత్తిని కొట్టారు. అది నా తలమీద బాదినట్లు అనిపించి శరీరం వణికింది. ఫైనాలిటీ అంటే ఇదే కదా?!

వెంటనే మహాకాయులు నన్ను శారీరకంగా ఎత్తుకొని కాస్త దూరంలో ఉన్న వర్కుషాపులోకి ప్రవేశించారు. అక్కడో ఎత్తైన కర్ర బెంచీ మీద పడుకోబెట్టి చేతులూ కాళ్ళకూ స్ట్రాప్ గట్టిగా బిగించారు. “ఏం చేస్తున్నారు? ఏమిటి ఇదంతా? నన్ను వదలండి” అని గాబరాపడి అరిచాను. వాళ్ళు మాట్లాడలేదు.

వీళ్ళు నా కాళ్ళకు గాగ్రాల్లాంటి రెండు సాధనాలు జోడించి వెల్డింగ్ చేసారు. ఇక… నేను వాటిని యథేచ్ఛగా వదులుకోలేను. వీటితో నాకు నొప్పి ఏమీ లేదు, కానీ అనీజీ అనిపించింది. క్రమంగా అంతా సర్దుకుంటుంది అనుకున్నాను. ఇక ఆలసించకుండా ఆ మహాకాయులు నన్ను అక్కణ్ణుండి విడుదల చేసారు. నేను వాళ్ళకి “థ్యాంక్స్” అన్నాను. అందుకు వాళ్ళు రెస్పాండే కాలేదు.

ఇప్పుడు నేను తిరుగుముఖం పట్టే దారికోసం మళ్ళీ మార్జినల్ వాకో ్వ మీద నించున్నాను. వాక్ వే ఊరి దిక్కు వెళుతున్నందువల్ల నా ప్రయాణం సులభంగా వుంది. ఇక తిరుగుముఖం పట్టడం కష్టంగా వుండటం అంటే మెయిన్ స్ట్రీము వాళ్ళకే అయి వుంటుంది. ఎందుకంటే మధ్యలో వున్న వాక్ వే గమ్యం వైపు కదులుతుంది. కానీ, మెయిన్ స్ట్రీము జనాలు వెనక్కి తిరిగి వెళ్ళడం అనేదే లేదు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా ఏర్పరచబడిందని నాకు స్పష్టమైంది. మధ్య వాక్వలో మెయిన్ స్ట్రీము జనాలు కొందరు నాకు వ్యతిరేక దిశలో కదలడం చూసి వాళ్ళ వైపు చేయి వూపాను. వాళ్ళెవరూ నావైపు దృష్టి పెట్టలేదు. సహజంగా వాళ్ళంతా చాలా ఉత్సాహంగా వున్నారు. నాకిప్పుడు ఏ ఆత్రుతా లేదు. నేను ఊరు వదిలి ఎంత కాలమైంది? ఊరు ఎంత దూరంలో వుంది? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియడం లేదు. మామూలుగా భూమండలానికి అవతలివైపు నేనున్నట్లు తోస్తున్నది. కానీ, క్రమేణా నేను పరిచిత వలయంలోనికి ప్రవేశించాను. నా వాక్ వే కు ఓ పక్కన సముద్రమూ, దాని పక్కన బండలూ; ఇంకోవైపు బయలు ప్రదేశం గుట్టలూ, పొలాలూ, ఇళ్ళూ, గుడిసెలూ, పశువులూ, తోటలూ, కంచెలూ, పూలమొక్కలూ, కూరగాయల చాళ్ళూ, వీధులూ, కొట్లూ, చిన్నాచితకా మోటర్లూ, ఎడ్లబండ్లూ, బడి నుండి వచ్చే పిల్లలూ… వీళ్ళందరూనూ. నా దారి రైలుపట్టాలకు సమాంతరంగా సాగుతున్నది. అందువల్ల కొన్నిసార్లు రైలుబండ్లు కూడా వస్తున్నాయి. ఈ బండ్ల శబ్దం మీకు తెలిసి వుంటుంది. అది లయబద్ధంగా ఉంటుంది. ఏదోలా అది చెవిన పడితే చాలు, అదే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది. కొడక్ బిడక్, ధడక్ బడక్, లండన్, ఢిల్లీ, హరప్పా మొహంజోదారో ఇలా. నా చెవుల్లో ఇప్పుడిప్పుడే ‘రిటర్న్’ అనే పదం ప్రవేశించి బైఠాయించింది కదా, అందుకని ఈ బండ్లు వెళ్ళే శబ్దం ‘రిటర్న్’, ‘యూటర్న్’ అని విన్పించసాగింది, వేరే శబ్దమే విన్పించనివ్వనట్లు! రిటర్న్ యూటర్న్, రిటర్న్ యూటర్న్ ఎడ్ ఇఫినిటమ్, మా లెక్కల సారు చెబుతున్నట్లు !! బండ్లు వచ్చి దూరంగా వెళ్ళినా ఈ చప్పుడు మాత్రం చెవుల్లో మోగుతూనే వుంది, కాసేపట్లో అది ‘లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్’ అయ్యింది. తర్వాత ‘అబౌట్ టర్న్!’. అన్నింట్లోనూ ఈ టర్న్ మాత్రం ఉండనే వుంది.
దారంట వెళ్ళే వాళ్ళు ఇప్పుడు నన్ను దూరం నుండే చూసి మాట్లాడించడం మొదలు పెట్టారు. ఎందుకంటే నేను దేశాంతరం వెళ్ళినవాణ్ణి కదా! “ఎక్కణ్ణించి వస్తున్నారు” అని కొందరు ప్రశ్నిస్తే, “చేతులు వదిలేసి నిలబడకండి, పడిపోతారు” అని హెచ్చరించేవాళ్ళు మరికొందరు. ఈ జనాలు నా పట్ల చూపే ప్రేమను గమనించి నా హృదయం కరిగిపోయింది. వీళ్ళెందుకు నన్నిలా గమనిస్తున్నారు ప్రేమగా! నేను ఇందుకు అర్హుణేనా? వీళ్ళకోసం నేనేం చేసాను? ఎల్లవేళలా నా గురించే ఆలోచించిన వాణ్ణి కదా నేను? అలా అంటారు నన్ను చూసి కొందరు గిట్టనివాళ్ళు. కానీ, వాస్తవం అది కాదు. నేను నా గురించి ఆలోచిస్తున్నప్పుడున్నూ వీళ్ళ గురించే ఆలోచించడం. ఎందుకంటే వీళ్ళతో నాది అవినాభావ సంబంధం. సింపతీ మాత్రం కాదు, ఎంపతీ వుంది. దీన్ని నేను మెయిన్ (స్టీము జనాల మనసులకు పట్టేట్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జనాలకు తెలుసు, నాకు తెలుసు. సమానమైన ఒకే మోస్తరు అనుభవాల్లో భాగస్వాములం మేము. అది చాలు. మాధ్యమ మహాశయులూ, రూపక మహాశయులూ కావలసింది చేసుకోనీ! అలంకార ప్రియులు అలంకారం చేసికొని తిరగనీ !! వయస్సు పైబడ్డవాళ్ళు తెల్లని వెంట్రుకలకు నల్లని డై చేసుకొని అసహ్యంగా కన్పించనీ!!! నేను మాత్రం నా ఇచ్చ మేరకే ఉంటాను. వాళ్ళను అనుసరించే అగత్యమే లేదు. అనుసరిస్తే నేను పదిమందిలో పదకొండోవాణ్ణి అవుతాను. అది వద్దు. దాంతో సంఖ్య పెరుగుతుందే తప్ప కొత్తది ఈ లోకానికి చేర్చినట్లు కాదు. పదిమందిలో పదకొండోవాడు అనగానే నా హృదయ నరం ఒకటి లాగినట్లు అవుతున్నది. ఏంజెల్ అనే అమ్మాయి గుర్తుకొస్తున్నది. ఎక్కణ్ణించో వాళ్ళ కుటుంబం మా ఊరికి వచ్చి కొత్తగా ఉంటోంది. నేపాలీ తల్లి, గోవా క్రశ్చియన్ తండ్రీ.. ఈ ఉభయులకు పుట్టింది ఆ పిల్ల. తల్లితోపాటు ఉండేది. తండ్రి హెవీ ట్రక్ డ్రైవర్. ఆల్ ఇండియా, కొన్నిసార్లు నేపాల్ కు కూడా ట్రక్ డ్రైవ్ చేస్తూ వెళ్ళేవాడు. అతడు ఊళ్ళో కన్పించిందే లేదు. ఈ కారణం చేతో ఏమిటో ఏంజెల్ గురించీ, వాళ్ళ అమ్మ గురించీ ఊరి వాళ్ళకు అనుమానాలు, కానీ, ఏంజెల్ ఎంత అందమైన పిల్ల అంటే ఇటువంటి అనుమానాలు మావంటి యువకులు లెక్కలోకి తీసుకోలేదు. ఏంజెల్ని
ప్రేమించే వాళ్ళు మా వూళ్ళో పదిమంది దాకా వున్నారు. నేను పదకొండో వాణ్ణి! మా కాలేజీలో మోకాళ్ళు కన్పించేలాగా స్కర్టు వేసుకున్నది ఆమె ఒక్కతే! కొన్నిసార్లు ఫ్లోరల్ డిజైన్, కొన్నిసార్లు చెక్స్. కారిడార్లో టప్ టప్ టక్ టక్ అని శబ్దం చేస్తూ నడిచేది. ఏంజెల్ కు నేనూ ఓ పుష్పగుచ్ఛం ఇవ్వవద్దా? పదిమందిలో పదకొండో వాణ్ణి అయివుండి. బొకే ఎక్కడ దొరుకుతుందో తెలీదు. మాది అంత పెద్ద పేటలాంటి ఊరు కాదు. పూలు అమ్మే మార్కెటు వైపు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాను ఓనాడు. మల్లె, గులాబీ, చేమంతి, మొగిలి, గన్నేరు, కనకాంబరం… ఇంకా నాకు పేర్లే తెలియని ఇతర పూలను కూడ అమ్ముతున్న స్త్రీలు దారి పక్కన వరుసగా కూచుని ఉన్నారు. మల్లెలు కడుతూ, కబుర్లాడుతూ, పూలమీద అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతూ, ఛాయ్ సప్లై చేసే పిల్లాడి నుండి ఛాయ్ తీసుకుంటూ ఉన్నారు. “ఇక్కడ బొకే దొరుకుతుందా?” అని ఒకావిడను అడిగాను. ఆ పూలమ్మే వాళ్ళందరూ ఒక్కసారి హుషారుకొచ్చారు. “రండి, రండి మాదగ్గరికి” అంటూ అందరూ బలవంతం చేయసాగారు. నిజానికి బొకేను వాళ్ళెవరూ తయారు చేయడం లేదు. బహుశః ఆ శబ్దం కూడా వాళ్ళు విని ఉండరు. ఐనా వచ్చిన గిరాకి, ఏదో ఒకటి అమ్మివేయాలనే ఆరాటం వాళ్ళది.

“మల్లెలున్నాయి తీసుకోండి స్వామీ, ఎంత ఘుమ ఘుమగా ఉందో వాసన చూడండి!” అని పిడికిట్లోకి తీసుకుని ఇవ్వబోయారు. నేను వీళ్ళ చేతుల్లో చిక్కిపోయినట్లు అన్పించింది.

“నాకు కావాల్సింది పుష్పగుచ్ఛం. బర్తుడేకి ఇస్తారు చూడండి అటువంటిది” అన్నాను. “ఓహో” అని రాగం తీసారు. నా ఇబ్బంది చూసిన ఓ పాదచారి “చూడండి! మీక్కావల్సింది అదుగో అక్కడ ఆ కొట్లో దొరకొచ్చు” అని చేయి చూపించారు అటుకేసి. నేను సైకిల్ నెట్టుకుంటూ వెళ్ళాను. అది ఒక పూలు అమ్మే పక్కా కొట్టు. ఫుట్ పాత్ మీదిది కాదు. “నాకో బొకే కావాలి” అన్నాను. అక్కడ రెడీమేడ్ బొకేలు అమ్మకానికి లేవు. ఆర్డర్ ఇస్తే మర్నాడు యిస్తారని తెల్సింది. యాభై రూపాయలు అడ్వాన్సుగా తీసుకున్నారు. రేపు పొద్దుటి పూట రండి అన్నారు. ఎటువంటి బొకే కావాలో ముందు అనుకోలేదు. బహుశః వాళ్ళు ఒకే రకమైన బొకేలు తయారు చేస్తారేమో అనుకున్నాను. నాకూ అమ్మాయికి యిచ్చే బొకే ఎలా వుండాలో తెలీదు. బొకే అంటే బొకే. దాంట్లో ఉండే పూవులేవో వాస్తవమే! కానీ, అంతకన్నా ఎక్కువగా అందులో నింపిన భావనలేవో అవి నిజం. పైగా ముఖ్యం. భావాలకు కొరతేమీ లేదు. సరే! మర్నాడు సుమారు ఎనిమిదికి కాలేజికి బయల్దేరిన వాణ్ణి దార్లో బొకే కలెక్టు చేసుకున్నాను. దాన్ని అందరికీ కన్పించేలా ప్రదర్శించకూడదని ఓ పేపర్లో చుట్టాను. బొకేతో కాలేజీ కి వస్తుంటే, దీన్ని ఏంజెల్ కు ఎలా ఇవ్వడం అనే సమస్య ఎదురైంది. పుష్పగుచ్ఛం ఇవ్వడం అలా ఉండనీ.. నేనింతవరకూ ఆమెను మాట్లాడించిందే లేదు. గుండె దడ దడమంది. మనుషులకు ఉండే భయాల్లో దారుణమైన భయమంటే తిరస్కార భయం. అది నన్ను వేధించసాగింది. కానీ, దాన్ని అధిగమించకుండా నేను జీవితంలో ముందుకి వెళ్ళడం సాధ్యం కాదు. అధిగమించాలంటే… ప్రయత్నించి చూడాలి. ఏంజెల్ సమయానికి సరిగ్గా కాలేజికి వస్తుంది. ఆమెకు పెద్దగా స్నేహితులెవరూ లేరు. అందువల్ల కాలేజీ గేటు దగ్గర ఆవరణలో వేచి ఉన్నాను. వాచ్మెన్ చూస్తున్నాడు. అతనికి ఏం జరుగుతున్నదో తెలుస్తున్నది. తమాషా చూస్తున్నట్లుగా ఉన్నాడు. ఏంజెల్ లోన అడుగిడగానే, నా పని ముగించుకునే వాడిలాగా ఆమెకు బొకే యిచ్చి “ఇది మీకు” అన్నాను. దాన్ని చేత పట్టుకుని వాసన చూసి నాకు వాపస్ ఇచ్చింది. ఆమె సాధారణంగా ఇలా చేయడమనేది నాకు వేరేవాళ్ళ మాటలతో ముందే తెలిసింది. అందువల్ల నేను బేజారై పోలేదు కూడా. ఆమె పూగుత్తిని చేతికి తీసుకుంది కదా – వాసన చూసింది కదా – అది చాలు నాకు. ఇంకా ఆ గుత్తిని ఎవరిచ్చారో వారికి తిరిగివ్వడం ఆమె హక్కున్నూ. అలా కాకుండా, ఇది అనేక్ ఇచ్చాడని చెబుతూ రోజంతా వుంచుకుని ఇంటికి తీసికెళ్ళడం ఆమెకు శోభను కల్గిస్తుందా? కచ్చితంగా కల్గించదు. నేను దాన్ని ప్రసాదంలాగా తిరిగి అందుకుని ఇంకా ఏం చేద్దామని ఆలోచించే లోపే ఏంజెల్ నోటి నుండి “యాక్సీ… హాచ్” అనే చప్పుడు. భయంకరమైన తుమ్ము. దాని వెన్వెంటే అంతకన్నా జోరుగా మరో తుమ్ము. తుమ్ము మీద తుమ్ము. సీరియల్ తుమ్ములు పదో, ఇరవయ్యో, ఎన్నో! నేను లెక్కించలేదు. ఆమె కళ్ళు ఎర్రని గులాబీలయ్యాయి. కన్నీరు బయటికొచ్చింది. ఏంజెల్ తుమ్ములు ఆపే విశ్వప్రయత్నం చేస్తున్నది. కానీ.. అవి ఆగే తుమ్ములు కావు. ఎహ్ ఎహ్ ఎహ్ అంటూనే తుమ్ము కూడా బయటికి దూసుకొస్తోంది. ఈమెకు ఇంత శక్తి ఎక్కణ్ణించి వస్తుందబ్బా అని చూసేవాళ్ళు ఆశ్చర్యపడేలాగా. కానీ అది శక్తి కాదు. ఏదో బయటి శక్తి లోన ప్రవేశించి ఆమె యావద్దేహాన్ని కుదిపి కుదిపివేస్తున్నది. ఆమె అలసి సొలసి ఎగపోత దిగపోతలోకి వచ్చేసింది. ముఖమంతా పాలిపోయి ఓ రకంగా అయ్యింది. బొకేలోని ఏదో ఓ పువ్వు ఆమెకు ఎలర్జిక్ రియాక్షన్ కల్గించింది. దీనికంతటికీ కారకుడనైన నేను ఆమెను వీపు నిమిరి ఊరడించాలా, వద్దా? కానీ, ఆ ఆలోచనే అప్పట్లో నాకు రాలేదు. అంతేకాకుండా కారణం ఏదైనా అమ్మాయిలను తాకడం మన దగ్గర నిషిద్ధం. నేను మూగ ప్రేక్షకుడిలా నించున్నాను. ఈ తుమ్ముల గొడవ మొదలై ఒకటి రెండు నిమిషాలు అయ్యాయో లేదో, అది ఎలాగో మొత్తం కాలేజీకి తెలిసిపోయింది. కాలేజీలోని మొత్తం మూడు ఫ్లోరుల్లోంచీ అబ్బాయిలు, అమ్మాయిలు, ఆయాలు, అధ్యాపకులు కిందికి తొంగి మావైపు చూడసాగారు. వాచ్ మన్ తన స్పెషల్ విజిల్ ఊదాడు.

నా వాక్వ తనదైన వేగంతో నన్ను తీసుకుని పోతున్నది. అదెందుకో గాని ఊరికి చేరుకోవాలన్న తమకం నన్ను ఆవరించింది. నేను ముందుకి పరుగిడితే పడిపోతానేమో! కిందికి దిగితే కాలు విరగొచ్చు!! కనుక.. వాక్ వేకి నన్ను నేను సమర్పించుకుంటేనే తప్ప వేరే దారి లేదు. పక్కన ఉన్న మెయిన్ స్ట్రీములో నాలాగా ఊరికి తిరిగి వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు. మెయిన్ స్ట్రీములో పాస్ అయినవాళ్ళు వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. వాళ్ళు నేరుగా రాజధానికి పంపించబడి రాజధానికి సంబంధించిన కవులో, కథారచయితలో, నాటక కర్తలో అవుతున్నారు. రాజధాని మొత్తం ప్రతిభావంతులతో నిండిపోయింది. నేను మార్జినల్ మనిషిని కావడం వల్ల ఎంపిక చేయబడడంలో విఫలుణ్ణి అయ్యాను. నేను చేసిన తప్పులు రెండు! ప్రతిభ లేకుండా కేవలం శ్రమను నమ్ముకుని ఎంపిక చేయబడతానని ఆశించడం ఒకటి. తొందరపడింది ఇంకొకటి. ఈ రెండింటినీ త్యజించి నా మానాన నేను ఉండేందుకు నాకు సలహా దొరికింది. అందువల్ల ఊరికి చేరిపోవాలని తాపత్రయ పడుతున్నాను. ఊళ్ళో ఏంజెల్ వేచి చూస్తూ వుందని కాదు. ఆమె ఎవరికోసమూ నిరీక్షించదు. వాస్తవం ఏమంటే ఆమె ఊళ్ళోనే లేదు. అవును, మూడో సంవత్సరమే ఆమె కుటుంబం ఎవరికీ చెప్పాపెట్టకుండా ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది. ఎక్కడికి, ఎందుకు అని తెలియరాలేదు. బొకే సంఘటన తర్వాత నేనెంతగా క్రుంగిపోయానంటే నేను ఎవరి ముఖం కేసి సరిగా చూడ్డమే లేదు. ఎన్నోసార్లు ఏంజెల్ని కలిసి క్షమాపణ కోరాలనుకున్నాను. కానీ, ఈ సంఘటనతోనే ఆమెకు చాలినంత అవమానం కల్గింది. ఏవిధంగా రెస్పాండ్ అవుతుందో ఏమో అని ఆందోళన పడ్డాను. అదయ్యాక మూడురోజులు ఆమె కాలేజీ కి రాలేదు. ఆమెకి అలర్జీ జ్వరం వచ్చిందని తెల్సింది. ఆ తర్వాతి రోజులు ఇలా గడుస్తున్నాయి. మరుసటి ఏడు ఆమె కళాశాలలో కన్పించకపోయేసరికి నాకు తెలిసింది ఏమంటే ఆమె మరో ఊరికి వెళ్ళిందని. ఆమె వెళ్ళడంతో మా ఊరి కళ వెళ్ళిపోయిందని అన్పించింది. అయినా మరోరకంగా చూస్తే నాకు కాస్త తేలికయినట్లు తోచింది. అలా తోచకూడదు. కానీ, తోచింది మాత్రం నిజం.

తర్వాత నేను ఏ అమ్మాయిని ప్రేమించడానికి ప్రయత్నించలేదు.

డిగ్రీ ముగించిన నేను పై చదువులు చదవడానికి ఆర్థిక పరిస్థితుల్లేని కారణంగా ఏదో ఓ పని చూసుకోవాల్సి వచ్చింది. నేను చేయని పనంటూ లేదు. ఐనా, ఈ సాహిత్యపు పిచ్చి ఒక్కసారి పడితే ఆ తర్వాత మనిషి బహుశః ఇంక దేనికీ కొరగాకుండా పోతాడని అన్పిస్తున్నది. పని చేస్తూ చేస్తూనే అమాంతం అన్యమనస్కుణ్ణి అయ్యేవాణి! కానివ్వండి! ఇప్పుడు ఆ సోది అంతా చెప్పడం ఏమి ఉపయోగం? ఎట్టకేలకు
నేను మా తమ్ముడూ కలిసి ఊళ్ళో ఓ ‘ఇంగ్లీషు కోచింగ్ సెంటర్’ తెరిచాం. దాంతో మా పొట్టతిప్పలు పోయినై. ఇవన్నీ ఊరకనే చెబుతున్నాను. ఆ పాత విషయాలు తెలిసినవాళ్ళకు ఇది కూడా తెలియాలని. ఎందుకంటే, అమ్ముడుపోయే పుస్తకాలు ఏవీ నేను రాయడం లేదు కదా!

నేను ఊరికి తిరిగి రావడం నా విద్యార్థులకు అనిర్వచనీయమైన ఆనందం కల్గించింది. వాళ్ళు నా చుట్టూ చేరి గంతులేసారు. ఇది సహజం నేనైనా అలాగే చేస్తాను. ఉదాహరణకు.. ఏంజెలో తిరిగొస్తే, ఐనా, ఆ పిల్ల తిరిగిరాదు. నేను మాత్రం వస్తున్నాను. రిటర్న్ ! “ఎక్కడికి వెళ్ళారు సార్? ఏం కథ? ఎలా ఉన్నారు? మమ్మల్ని వదిలి వెళ్ళొచ్చా?” అని అడుగుతున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు. వాళ్ళ మధ్య కొందరు వివాహిత మహిళలూ, పురుషులూ వున్నారు. ఎందుకంటే మా ఇంగ్లీషు కోచింగ్ క్లాసుకి ఎవరైనా రావచ్చు. ఈ విద్యార్థులందరూ నన్ను చాలా అభిమానిస్తారు. వర్కింగ్ డే రకరకాల బ్యాచులుంటాయి. నేను వాళ్ళకి ఆంగ్లం నేర్పిస్తూ, వారికి మాట్లాడ్డానికీ, రాయడానికీ, చదవడానికి శిక్షణ ఇస్తూ, ఉంటాను. “ఓ అదంతా పెద్ద కథ… ఇంకోసారి చెబుతాను” అని వాళ్ళ నోళ్ళు మూయిస్తున్నాను. కానీ, నన్ను చూసినవాళ్ళు నా కాళ్ళ గాగ్రాలూ చూస్తున్నారు. “ఇదేంటి సార్, కాళ్ళకు?” ఈ ప్రశ్నకు బదులు చెప్పాలి. నేను “ఇది ఓ రకమైన మీటర్ వంటిది” అన్నాను. “స్పీడోమీటర్ అమెరికాలో జాగింగ్ చేసే వాళ్ళు కట్టుకుంటారు కదా, అలాంటిదా?”

“కాదు- ఇది స్పీడోమీటర్ కాదు, స్పీడ్ బ్రేకర్. వేగ నిరోధకం. మనం అతివేగంతో వెళ్ళకూడదు అని. నేనెక్కడికో వెళ్ళాను కదా, అక్కడ కట్టారు. వాళ్ళ దృష్టిలో నా వేగం ఎక్కువైందట! ఇంత వేగంతో దేన్నీ సాధించలేరన్నది వాళ్ళ అభిప్రాయం. ఇదంతా నా మంచి కోసమే ఇలా చేస్తారు”.

కానీ ఇది కాస్త ప్రిమిటివ్ అయ్యింది సార్. మీరిది ధరించి పరుగెత్తడం సరైందని నాకు అన్పించడం లేదు” అన్నాడు ఓ విద్యార్థి.

“ఏది ప్రిమిటివ్? ఏది మాడర్న్? ట్రైబ్యునల్ చెప్పింది మరిచిపోయారా? వి మస్ట్ గో బ్యాక్. ఎంత వెనక్కి వీలైతే అంత వెనక్కి, ముందుకు వెళ్ళే దారి వుండేది, వెనక్కి వెళ్ళడంలోనే! వెనక్కి వెళుతుంటే మనం ప్రోటో స్టేట్ చేరుతాం. అణు విశ్లేషణలో విద్యుదుత్పత్తి తరంగాలు చేరినట్టు. తరంగాలో అణువులో అని కూడా తెలీదు మనకు. ప్రతి ఒక్క కల్చరకూ ఇలాంటిదే ఓ స్థితి ఉంటుంది. దాన్ని ఆయా సంస్కృతులకు సంబంధించిన వాళ్ళు కనుక్కోవాలి. పైగా ఆ స్థితిలో జీవించాలి. అదే… అదే… కోశావస్థ. మనుషుల నిజమైన దశ… కోశస్థ దశే! అదే మూలం. కానీ…

“కానీ…. ఓ మాట గుర్తుంచుకోవాలి. మనం మూలాల్ని చేరుకున్నా మనమే మూలం కాదు. మరైతే మనం ఎవరం? మనం ఆ మూలం కనుగొనే మాధ్యమాలం. అంటే మీడియాలం. మన మూలంగా, మనం మాధ్యమాలుగా అదేమిటో ఒకటి ఆవిష్కృతం అవుతుంది. ఆదిమ శక్తి అది. మనం కేవల నిమిత్త మాత్రులం. ఆ ఆదిమశక్తిని ఓ కవి అమృతవాహిని అన్నారు. అది ప్రతిభావంతులకే తెలుసు. అందువల్ల వాళ్ళు ఏనాడూ తమను తాము మూలాలు అని అనుకోలేదు. తాము కేవలం అక్షరబద్ధం చేసే లిపికారులు అని తెలుసుకుంటారు. అది ఆనాడూ అంతే నిజం. ఈనాడూ ఇంతే నిజం… ఈనాడు ఇంకా ఇంకా డబ్బల్ నిజం. అందువల్ల మనకు వినయం కావాలి. తామే మూలం అని అనుకునేవాళ్ళు వినయవంతులు కారు, అహంకారులు. వాళ్ళు ఏనాడూ మెయిన్ స్ట్రీముకి రావడం అసాధ్యం. వాళ్ళకు మార్జినే గతి. మార్జిన్లో జాగ దొరకాలన్నా వాళ్ళు చాలా శ్రమించాలి. ప్రతిభావంతులు శ్రమించనక్కర్లేదు. వాళ్ళు సహజంగా వుంటే చాలు. రాజధానిలో బ్రహ్మాండంగా స్వీకరించబడతారు, స్వాగతించబడతారు. ఇదంతా ఆరంభంలోనే తెలుసుకోవటం మంచిది. నేను చేసిన తప్పు మీరు చేయవద్దు అనే చెబుతున్నాను.”

“రాజధానిలో ఏం జరుగుతుంది సార్?” ఒకామె చాలా అమాయకంగా అడిగింది.

“అక్కడ ఏం జరగడం లేదు అని నువ్వు నన్ను అడగాల్సింది. వాస్తవంగా మీకెంత తెలుసో, నాకు అంతే తెలుసు. నేనైనా అక్కడికి ఎప్పుడు వెళ్ళానని? కానీ, మీడియాల్లో వింటూ వున్నాం. చూస్తూ వున్నాం. ప్రతి వారమూ పుస్తకావిష్కరణలు జరుగుతాయి. ఇటీవల వాటిని లోకార్పణం అంటున్నారు. వీటి ఆహ్వాన పత్రికలు చూస్తే మనం మూర్ఛపోవాలి. అంత గొప్ప గొప్పవాళ్ళ పేర్లుంటాయి. ఒకరు ఆవిష్కరిస్తారు. ఇంకొకరు రచయిత పరిచయం చేస్తారు. ఇంకొకరు పుస్తక సమీక్ష కావిస్తారు. ఇంకా కొందరు విశిష్ట, ప్రత్యేక, గౌరవ, ఆత్మీయ అతిథులు”.

“గొ… అంటే గొప్పవాళ్ళ సార్?”

“ఔను అన్పిస్తున్నది. కానీ… ఆ పదాన్ని వెనకనించి తప్పితే ముందు ఉపయోగించరు. అదలా ఉండనీ! ఈ ఆవిష్కరణ లోకార్పణం గురించి చెబుతున్నాను కదా! వేదిక మీద ఉండే ఈ గొప్పవాళ్ళకు
పుస్తకం ఒక్కో ప్రతి ఇస్తారు. అనంతరం వాళ్ళంతా ఆ పుస్తకాలు పట్టుకుని ఫోటోకి ఫోజు ఇస్తారు”.

“అది పోలీస్ స్టేషన్లో దొంగల చేత ప్లేట్లు పెట్టి తీసిన ఫోటోలాగా కన్పిస్తుంది సార్”.

“కరెక్టు” అవి చాలా చాలా గొప్పగొప్పవాళ్ళ పుస్తకాలు. అలాగే గొప్ప రచయితల ప్రతి జన్మదినమూ ఆడంబరంగా ఆచరించబడుతుంది. పుస్తకావిష్కరణ, పుట్టినరోజు జరుపుకోవటం ఇటువంటి సమావేశాల్లో ఆహూతులకు తిండీ తీర్థాలు కూడా దొరుకుతాయి అని విన్నాను మరి! ఆ తిండి తీర్థాలు లేకుంటే జనాలు అంతగా రారట! జనాలు తగ్గితే కేవలం వేదిక మీద వరుసగా కూచున్న చాలా చాలా గొప్పవాళ్ళ ఫోటోలు మాత్రం మీడియాల్లో వస్తాయి. మర్నాటి పత్రికల్లో పుస్తకావిష్కర్త మాటల్లోంచి ఓ ముఖ్య వాక్యపు హెడ్ లైన్ కింద అతని కొన్ని మాటలు వార్తగా వస్తాయి. మనం ఇవన్నీ దూరం నుంచే చదివి జ్ఞానం గడిస్తాం. ఇది ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వంటిది అన్నట్టు. ఆ
గొప్పవాళ్ళు ప్రతిరోజూ కురిపించే ఆణిముత్యాల్ని మనం అనుభవిస్తూ వున్నాం. మనం కృతజ్ఞులమై వుండాలి వాళ్ళకి…”

“ఇదొక క్లబ్ కల్చర్. ఒకరిని మరొకరు పొగడుతూ ఉంటారు. అలా చేయకుంటే క్లబ్ నుంచి బయటికే! ఇలాంటి క్లబ్బులు చాలా ఉన్నాయి. మనం ఇక్కడ ఏమంటున్నాం… ప్రశ్నించండి అంటున్నాం. కానీ ప్రశ్నించేవాడు…..”

“చెప్పేందుకు ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ, కొన్ని విషయాలు మనకు మనమే స్వయంగా తెల్సుకోవటం ఉత్తమం. అప్పుడవి ఫ్రెష్ గా మన అనుభవంలోకి వస్తాయి, గాఢంగా మిగిలిపోతాయి, కొత్త వానకి మొలకెత్తే గింజల్లాగా. నాకు ఈ గాగ్రాల అనుభవం అలాంటిదే…”

ఇలా నేను విద్యార్థుల్ని ఉద్దేశించి ఆ రోజు అన్నప్పటికీ నా మాటాలతో నేనైనా కన్విన్సు అయ్యానా? ఈ గాగ్రాలు నిజంగా నాకు కిరికిరి అయిపోయాయి. వాటిని ఎవరూ విప్పదీయరాని విధంగా నా కాళ్ళకి ఫిక్స్ చేయబడ్డాయి. ఏ లోహంతో తయారయ్యాయో తెలీదు. చాలా బరువుగా ఉన్నాయి. వీటి జాయింట్లు ఎక్కడ అని ఎంత వెతికినా నాకు కన్పించలేదు. బహుశః వీటికి జాయింట్లే లేవేమో! మొదలు నన్ను చూసిన వాళ్ళందరూ నా ముఖం కేసి చూడక కాళ్ళనే చూసేవాళ్ళు. ఇదేం, ఇలాగని కొందరు ప్రశ్నించారు కూడాను. వాళ్ళకి సత్యమే చెప్పేవాణ్ణి! నా వేగం నిరోధించడానికి వుండే సాధనాలివి అన్నా జనం నమ్మలేదు. ఇది అబద్ధం అనే తెలుసుకుంటున్నారు. సత్యం కన్న నిజమైన సత్యాన్ని నేనెక్కణ్ణించి తేవాలి? వాస్తవం ఏమంటే కాలక్రమేణా నాకూ ట్రైబ్యునల్ మీద విశ్వాసం సడలిపోతున్నది. దీని వెనక ఓ పెద్ద తిరకాసూ మతలబూ వుందని అనిపించింది. నేను మళ్ళీ ప్రయాణం ప్రారంభించాలి, మళ్ళా ట్రైబ్యునల్ ముందు హాజరై నా కేసు వాదించాలి. వాళ్ళు చెప్పేదాన్ని నేను విని గమ్మున వుండటం కన్నా నేను చెప్పేది వాళ్ళు వినేలా చేయాలి. ఎవరికి తెలుసు… ఈ పాటికి ట్రైబ్యునల్ కూడా మారివుండొచ్చు, నియమాలు మారి వుండొచ్చు. నేనిక్కడే వుండిపోతే నాకూ తెలుస్తుంది? ఆహ్వానం అందుతుందని చెప్పారు. కానీ, ఇంతవరకూ రాలేదంటే ఏమిటర్థం? నేను దీన్ని కూలంకషంగా తెలుసుకోవాలి. ఇలా అనిపించాక ఆలస్యం చేయకుండా ఓ రోజు నేను నా మార్జినల్ వాకో ్వ మళ్ళీ ఎక్కాను. ఈసారి నేను ఏ తప్పూ చేయకూడదని నిశ్చయించుకున్నాను. తొందరపాటు వద్దు. పరుగు వద్దు. నిదానం, కానీ, సమస్య ఏమంటే నా వాకో ్వ గమనం నా గమనానికి వ్యతిరేకంగా వుంది. అందువల్ల ముందుకేగడం చాలా చాలా శ్రమించాలి. మరిప్పుడు నాలో మునుపటిలా చైతన్యం లేదు. వయస్సు అయ్యిందా? ఐనా శ్రమ చేయక వెనక్కి వెళ్ళేలానూ లేదు. ఈ విచిత్ర స్థితిలో నేను ముందుకు సాగుతూ నా ఇరుగుపొరుగును వెనకాలా జనం కన్పిస్తారా అని చూడసాగాను. జనానికి నా గురించి ఏ కన్సెర్నూ ఉన్నట్లు తోచలేదు. బహుశః ఇది కొత్తతరం కావచ్చును అనుకున్నాను. నాక్కూడా ఎవరితోనూ మాట్లాడాలనే కోరికా లేదు. నా పరిశ్రమతో నాకు చెమటలు పోస్తున్నాయి. నిజం… ఓ గ్లాసు చెరకు రసమో శర్బతో చిక్కితే బాగుండేది! కానీ, వాటికెలాంటి అవకాశమే లేదు. ట్రెడ్ మిల్ మీద నడిచినట్లు ముందుకెళ్ళాను. ఇలా నడవాలంటే ఒక్కసారిగా నా గాగ్రాలు కీచుమని చప్పుడు చేస్తున్నాయి. అది అచ్చం ఇనుప సంకెళ్ళు లాంటి కర్కశమైన మెటాలిక్ శబ్దం. ఈ శబ్దం వస్తుందంటే, ఒకవేళ గాగ్రాలు కిందపడ్డాయేమో అని గమనించాను. అలాంటిదేమీ లేదు. నేను వేగ పరిమితిని మీరినట్లు అవి అలాంటి శబ్దంతో సూచించాయి. వెంట వెంట ఇంకో విచిత్రమూ అద్భుతంగా కన్పిస్తున్నది. నేను ఒక అడుగు ముందుకేస్తే అంతే దూరం వెనక్కి వస్తున్నాను, ముందుకెళ్ళడం సాధ్యమే కాదింక అన్నట్లుగా. నాకూ ఇదంతా చాలుచాలైపోయిందిప్పుడు. వెనక్కి తిరిగి వెళదామంటే సగం దూరమొచ్చాక వెనక్కి వెళ్ళే ఏర్పాటే లేదు. అంటే ఏమిటి? ముందుకి వెళ్ళలేను, వెనక్కి రాలేను! నా అత్యంత ప్రమాదపు అవగాహన పిడుగుపాటు అయ్యింది నాకు. మెయిన్ స్టీములో వెళ్ళే కొందరు చూసారు, తమలో తాము నవ్వుకున్నారు. ఏమైందని అడగనూ లేదు, సానుభూతీ చూపలేదు. చివరికి నేను దేవునికి మొర పెట్టుకున్నాను. హే భగవాన్! నాకు మెయిన్ (స్టీమూ వద్దు – సబ్ స్ట్రీమూ వద్దు. మా ఊరి ఫ్రెష్ వాటర్ స్ట్రీము చాలు. అదెంత పారదర్శకం అంటే చేపల నీడలు కూడా అడుగున కనిపిస్తాయి.

Leave a Reply