ఆకాశం మేఘాలను పరచుకుని పందిరి వేసింది. సూర్యుడు నిద్రలేచి కొండపై నుండి పైపైకి వస్తున్నాడు. జారిపోయే లాగును పైకి గుంజుకుంటు పరుగెడుతున్నాడో బాలుడు, పడమటి గాలి దోలి అతని ముంగురులను మునివేళ్ళతో స్పృశించింది. అతని నుదుటి మీద స్వేదం ఒంటి మీద నుండి జారి పాదాల గుండా ఇసుక తిన్నెలలోనికి ఒలుకుతుంది. ఆయాసంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన కండ్ల ఎర్రజీరలో నుండి ఉద్భవించిన మంటలు ఎగసి పడుతుంటే ఆకలి పేగులను అనుచుకుంటూ ఒక చోటకు వచ్చాడు. “మల్లన్నా! ఓ… మల్లన్నా!” నిషీది సమయం నిర్మానుష్యమైన ఓ నిశబ్దాన్ని చీల్చుకొని దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచినాడు. ఆ అరుపుకు చుట్టూ ఉన్న కొండలు ప్రతిధ్వనించాయి.
ఊరికి దూరముగా ఓ పాడుబడిన గడి అనేక నెత్తుటి మరకల చరిత్రకు సాక్షంగా నిలిచిన రక్కసిభూతం. అక్కడ ఎప్పుడు పెత్తందార్లు, భూర్జ్వా వ్యవస్థే రాజ్యమేలేది. “దొరా నీ బాంచన్ కాల్మొక్కుతామ్” అంటు ఒంగి ఒంగి దండాలు పెట్టిన తాతలు, నాయనలు జూసిన గడి, ఇప్పుడు శిథిలావస్తపు బంగ్లా అక్కడ ఎవరు ఉండటంలేదు. దొరల పెత్తనపు కాళ్ళకింద నలిగిన దుఃఖపూరితమైన అనేకానేక కథలను పొదువుకున్న జ్ఞాపకాల విషలోగిలి ఈ గడి. కీచురాల్లు తప్ప ఎవరూ అటుగా వెళ్ళరు. అలాంటి బంగ్లా నుండి బక్కపలచని ఓ మానవ ఆకారం బయటకు వచ్చింది.
“ఏంది శివుడు గిట్లచ్చినవ్?” సందేహంగా అడిగాడు గడిలో నుండి వచ్చిన ఆకారం.
“నువ్ నాకోసం ఓ చోటుకు రావాలి”
“ఏడికి శివుడు? ఇంత అర్ధరాత్రి” ఆ వ్యక్తి మరింత దగ్గరకు వచ్చి అన్నాడు.
“రా చూపిస్తాను” అంటూ శివుడు మల్లన్న చేయిని గట్టిగా పట్టుకుని కదిలిండు.
ఓ మహా వృక్షం
ఊరందరిని అక్కున చేర్చుకుని తల్లిలా తన ఒడిలో కూర్చోబెట్టుకున్న రూపం. పసిపిల్లలు, బాలింతలు, ముసలివాళ్లు, స్త్రీలు, రైతులు, కోళ్లు, గొర్రెలు, మేకలు, కుక్కలు, ఆవులు, ఎద్దులు, బర్రెలు సమస్త జీవావరణం అంతా ఓ ఆర్తనాదపు దిగ్బంధనంలో బంధించబడిన దృశ్యం. నిరాశ్రయులైన భూనిర్వాసితులు, ఈ చీకటిలో చీకటైనా చిధ్రమైన బతుకులు.
ఆ ప్రాంతం జన శోకసంద్రంలా వుంది.
“శివుడు ఊరు ఏమైంది?” చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కలియ చూస్తూ జీరబోయిన గొంతుతో అన్నాడు.
“ఎవరో రాక్షసులు రాత్రికి రాత్రే పిడుగుల్లా ఊరిని మింగేసిండ్లు” శివుడు ఉద్రేకంగా ఊగిపోతు ఏడుస్తు అన్నాడు.
మల్లన్న నిశ్చేష్టుడై నిల్చున్నాడు.
“అయ్యో!నేను అనుకుంటూనే ఉన్నాను. ఈ పాపపు మనుషులు చెట్టు, గుట్ట, చెరువు చివరకు ఊరు దేనిని ఒదలరా? చెదిరిన గుండెలను చేయి చాపి నీడనిచ్చిన ఆ చెట్టుకున్న జ్ఞానం వాళ్లకు లేకపోయింది. బహుశా ఈ చెట్టు వాడి కంట పడలేదు కాబోలు లేకుంటే దీనిని పెరికేసేవారు.” విచార వదనంతో చూస్తు మనసులో అనుకున్నాడు.
“అదిగో అక్కడ గంగరేగు చెట్టు ఉండేది. దాని పక్కనే మా ఇల్లు, ఆ పక్కనే గుడి, దాని పక్కనే మా బడి ఉండేది. ఇప్పుడు మా బడి గుడి అంతా శూన్యం అయింది. నేను ఏ బడిలో కెళ్ళి నాది ఏ ఊరు అని చెప్పాలి?” మట్టి దిబ్బలని చూస్తూ ఏడుస్తున్న శివుడిని చూసి మల్లన్న కళ్ళు చెమర్చాయి.
“నిజమే ఈ పసివాడి ప్రశ్నలో ఎంతటి నిగూఢమైన ఆవేదన ఉంది. ఆ ఆలోచన దొర మెదడుకు ఎందుకు తట్టలేదు కాబోలు.” శివుని ఇంకాస్త దగ్గరగా తీసుకొని పాకుడురాళ్ళ బండ పైన కూర్చున్నాడు.
మసక చీకటిలో దూరంగా చెట్టు క్రింద గల్లంతైన ఊరు వైపు పిచ్చిపట్టినదానిలా చూస్తుంది ఓ నిండు చూలాలు.
కథలోకి వెళితే…
*
ఊరు
దాని పక్కనే గుట్ట. గుట్టంచున చెరువు. చుట్టూతా పరుచుకున్న పొలాలు గలగల నవ్వుల గిరకబాయి, ఊరందరి ముచ్చట్లకు నెలవైన చావడి గద్దె, దాని పక్కనే ఊరి నడిబొడ్డున బొడ్రాయి, కోయిల కూతలు పక్షుల కిలకిల రావాలతో ఊరు. అంటే ఓ ప్రకృతి. ఊరంటే ఓ సెలయేటి సందడి, ఊరంటే ఆకుపచ్చని వెన్నెల. ఆ వెన్నెల్లో ఓ ఆడపిల్ల స్వరాజ్యం.
స్వరాజ్యం ఉమ్మడి కుటుంబంలో మూడవ కోడలు. భర్త నరసింహంతో చక్కగా కాపురం చేసుకుంటుంది. వ్యవసాయం పనులలో తనకు చేదోడు వాదోడుగా కలిసి నడిచేది. వారిద్దరి ప్రతిబింబం శివుడు. వాడికి ఇప్పుడు పది సంవత్సరాలు చక్కగా ఊరి బడిలోకి పోయి ఐదో తరగతి చదువుతున్నాడు. తను కూడా కాస్త చదువుకున్న మహిళ కావడంతో ఊళ్లో తానంటే కొంత గౌరవం ఉంది.
ఏ కలతలు నలతలు లేని వసంతం పరచుకున్న ఆ ఇంట్లో స్వరాజ్యం కడుపులో మరో విత్తు నాటుకోవడంతో ఆ ఆనందం రెట్టింపయ్యింది. దేదీప్యమానమై వెలుగుతున్న ఆ ప్రాంగణంలో ఉరుమురిమి పిడుగు పడ్డట్లు అయ్యింది. అంత చక్కటి ఆ ఇల్లు అలా ఎలా అయిందా? అని అంతా నిశ్చేష్టులై చూశారు. నరసింహం గుండెపోటుతో మరణించాడు.
ఆ ఇల్లు చీకటి అయింది ఇప్పుడు గుడ్డి దీపం వెలుతురులో స్వరాజ్య మొహం చిన్నబోయింది. మాసికం కూడా పెట్టకుండానే ఆస్తులు – అప్పుల పట్టికను సిద్ధం చేసి ఉన్న భూమికి ఎసరు పెట్టిండ్లు యారాండ్లు,బావలు. నాకిది నీకిది వారికి వారే తర్జన పడ్డారు. చివరికి చిలికి చిలికి గాలి వానలా వారే బయటపడ్డారు. సందర్భము పాడు లేకుండా ఇదేం పాడు బుద్ది అని కొందరంటే ఇదే అదనుగా కొందరు బంధువులు వారిని రెచ్చ గొట్ట బట్టిండ్లు.
ఒకవైపు కొడుకు చచ్చిన దుఃఖంలో అత్తమామ, జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసినోడు మాట తప్పి తన గతినే మార్చేసి వెళ్లిండు. గోతికాడ గుంట నక్కలా పొంచి ఉన్న బంధువులు ఇదే అదునుగా భావించి అటు ఇటు పురికొలుపుతూ ఆజ్యం పోస్తున్నారు.
ఊరు మీద పెత్తనం జేసెటోళ్ళు ఇప్పుడు తన మీద పెత్తనం జేయజూస్తుండ్లు. అందుకే కుటుంబ సభ్యుల తీరు పెద్దమనుషుల వైఖరి కలచివేసింది. ఈ మనుషులు – ఆ మనుషులు స్వరాజ్యంకు బొత్తిగా ఎవరు నచ్చలేదు.
కడుపులో పెరుగుతున్న రూపం, కళ్ళముందున్న ఊహా ప్రతిరూపం ఆమెకు భవిష్యత్తును గుర్తు చేస్తున్నాయి. ఈ సమాజం మనుషులు ఎవరేమనుకున్నా పర్వాలేదు వారు ఎప్పుడూ కాకులే. ఎవరిని రక్కుదామా ఎవరిని నిందిద్దామా అని చూస్తుంటారు. తనకు తన బతుకు ముఖ్యం. అనుకుని అతికష్టం మీద ఊరందరి సమక్షంలో చావడికి చేరింది. స్వరాజ్యం సమస్యకు గ్రామ పంచాయతీలో పెద్దమనుషుల సమక్షంలో గొడవ జరిగి చివరకు తనకు రావలసిన రెండెకరాల పొలంతో పాటు లక్ష రూపాయల అప్పు జతచేసి ఒప్పంద పత్రం రాసి ఇచ్చినారు. తండ్లాడి తండ్లాడి కొట్లాడి తెచ్చుకున్న భూమి, ఇప్పుడది స్వరాజ్యం సొంత భూమి. దాని మీద సర్వహక్కులు తనవే. ఆ ఒప్పంద పత్రాన్ని తృప్తిగా చూసుకుంది ప్రేమగా కడుపుపై చేయి వేసుకొని రాలుతున్న కన్నీళ్లను ఆపుదామని మెల్లగా కంటి రెప్పలను మూసుకుంది. తన ఆత్మావలోకనం లోకి వెళ్లి భవిష్యత్ కార్యాచరణను అల్లుకుంది.
ఇల్లు నీడనిస్తుంది – భూమి బతుకు నిస్తుంది అని గట్టిగా నమ్మింది. చక్కగా వర్షాలు పడి కాలం కావడంతో పత్తి పంటను వేసింది. నరసింహం జ్ఞాపకాలలో నుండి తను, నేల పొరలలో నుండి పంట మొక్కలు బ యటకు వచ్చి స్వేచ్చగా గాలి పీల్చుకున్నాయి.
ఊరి బయట ఊడలమర్రి కింద ఒంటరిగా కూర్చున్నాడు ఓ ముసలి వాడు. పెరిగిన జుట్టు చిరిగి ముతక బారిన బట్టలతో ఓ చేతిలో కర్ర మరో చేతిలో సంచి దానిలో ఓసత్తుగిన్నే, గిలాస అవే అతని సరంజామా. అతడు ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడో గని ఈ ఊరు వచ్చిన కానుండి అందరి నోళ్లలోను తన మాటలే, తనపాటలే. కొందరైతే ఘంటసాల గారి పాత సినిమా పాటలు పాడించుకొనే వారు. చిన్న పిల్లలకైతే మంచి మంచి సామెతలతో కూడిన దేశభక్తిని పెంపొందించే కథలు, సుమతి, వేమన శతక పద్యాలు చెబుతూ అందరినీ మైమరిపిస్తాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరినీ ఏమీ ఆశించడు. పిడికెడు మెతుకులు బలవంతపెడితే తప్పతినడు. ఎలా వుంటున్నాడో ఏమో పాపం! అతని పాటతో ఊరు మేలుకుంటుంది, అతని మాటతో ఊరికి రోజు గడుస్తుంది. అతన్ని కొందరు పిచ్చివాడంటరు, ముసలివాళ్ళు అతని ముచ్చట్లకు మురిసి దేవుడంటరు. ఏది నిజమో! ఏది అబద్ధమో! గని రోజుకు ఒక్కసారైనా ఆ పల్లె గాలిలో తనపాట మమేకమౌతుంది.
ఒకరోజు బడికిబోయి వస్తున్న పిల్లలు అతన్ని చూసి రాళ్లు యిసురుతుంటే శివుడు అది గమనించి వాళ్లను వారించాడు.
ఆ ముసలాయన శివుడి వైపు కృతజ్ఞతగా చూశాడు.
“నీ పేరేంటిది?” శివుడు మర్రి ఊడలను జరుపుతూ అతని దగ్గరగా వెళ్లి అన్నాడు.
“మల్లన్నా” ఆ ముసలాయన తన పేరును గాంభీర్యంగా చెబుతూ నీ పేరేంటి అన్నట్టుగా చూశాడు.
“నా పేరు శివుడు మరి నీకు ఎవరూ లేరా?” అమాయకంగా అడిగాడు శివుడు.
ఆ ముసలాయన మౌనంగా ఆకాశం దిక్కు జూసి చెమ్మగిల్లిన కళ్లతో శివుడి వైపు తిరిగి చూసిండు.
“మరి నువ్వు ఎక్కడ ఉంటావు” ఎందుకు చెప్పాలి అన్నట్లుగా సంశయంగా చూశాడు కొద్దిసేపు చిన్న పిల్లాడిలా ముఖం పెట్టి ఆ తరువాత దూరంగా ఉన్న పాత బంగ్లాను చూపించాడు అది ఎనకట ఎప్పుడో దొర కుటుంబం ఇడిచిపెట్టి పోయిన గడి. అక్కడ దయ్యాలు ఉంటాయని అటు దిక్కుగా ఎవరూ పోరు. మాట ముచ్చట కలిశాక వారు ఇద్దరు మంచి మిత్రులయ్యారు వాళ్ళ నాన్న కు సంబంధించిన దుస్తూలు మల్లన్నకు తెచ్చి ఇచ్చిండు. ఊడల మర్రి దాని దగ్గర లోని పాకుడురాళ్ల బండ వారి ఆటపాటలకు వేదిక అయ్యింది.
ఒయ్యారమొలక పోస్తూ వాగుపారుతుంది. స్వరాజ్యం పంట ఎలా ఉందోనని చేనంతా కలియ తిరిగి చూసింది. పంట తీరు చూస్తే కొద్ది రోజులలో పంట తన చేతికి వస్తుందన్న ఆశ తన వాటాకి వచ్చిన అప్పులన్నీ తీరిపోతే ఏ రంది రౌసు లేకుండా ఉండవచ్చు అనుకుంది. పూడుకుపోయిన గుండె పొరల నుండి చీల్చుకుని ఊహలు చెకోర పక్షిలా తిరుగుతున్న వైనం. కడుపులో విత్తు – పంటలో విత్తు పురిటి దశకు ఒచ్చిన సంబరం స్వరాజ్యం కళ్ళలో కనిపిస్తుంది.
*
చావడి గద్దె
హారన్ మోగుతూ రెండు కార్లు వచ్చి ఆగినాయి. కళ్ళజోడు సవరించుకుంటూ ఎప్పుడో ఊరు ఒదిలి పట్నం పోయిన దొర జీపులో నుండి దిగినాడు. అతని వెంట తహశీల్దార్, పట్వారి దొర దిగిండ్లు. వాళ్ళు వచ్చారని పంచాయతీ అటెండర్ వారికి కుర్చీలు వేసి కూర్చోబెట్టాడు. రాత్రి వారు వస్తున్నారని ఊర్లో దండోరా వేసిండ్రు గని ఎందుకు, ఏమిటి అన్న వివరాలు చెప్పలేదు. దాంతో ఒక్కొక్కరుగా అక్కడకు చేరుకొని దొరకు దండం బెట్టి పక్కకువచ్చి చెవులు కొరుక్కుంటున్నారు. తాశీల్దార్ లేచి విషయాన్ని సవివరంగా ఆలకించి సహకరించవలసినదిగా కోరాడు.
దొర మీసాలు మెలేస్తూ జనం దిక్కు చూసిండు. జనమంతా తహశీల్దార్ ఏ విషయం చెబుతాడో అని నిశ్శబ్దంగా చూస్తున్నారు. చేతిలోని ఫైల్ నుండి ఓ కాగితం తీసి చదువుతున్నాడు.
వాగులో పారే అలలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనై ఆగిపోయినాయి. పశువులు, మేకలు ఇతర జంతువులు తిండి తినడం మానేసాయి. ఆ ఊరు చుట్టూ గాలి వీయాలా వద్దా అన్నట్లుగా చూస్తోంది. అంతా స్థాణువులా నిశ్చేష్టులై నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు.
స్వరాజ్యంకు కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. గుండె ఆగిపోయి తన ఆశలు ఆవిరై నేలపై కుప్పకూలింది. రెండు మోకాళ్ళ పైన కూర్చుని వట వట మనీ కన్నీళ్లు రాలుతుంటే ఆకాశం వైపు చూస్తూ బిగ్గరగా ఏడ్చింది. దేవుడు కనిపిస్తే గుంజుకొనచ్చి చావడి గద్దె మీద కూసుండబెట్టి తనకు న్యాయం చేయమని అడగాలనుకుంది.
“భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనము జూచి ధనము నవ్వు
కదనభీతు జూచి కాలుడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ!”
ఎక్కడో దూరంగా మల్లన్న గొంతులో నుండి వేమన చైతన్యవంతమైన పద్యం వినిపిస్తుంది.
మౌనం అంగీకార సూచకం అవుతుందనే ఆలోచన స్వరాజ్యం మనసులో మెదిలింది. చింతపిక్కలా ఎర్రగా మారిన కళ్ళను ఇంకాస్త పెద్దవి చేసుకొని బిక్క మొహలేసుకుని చూస్తున్న జనమందరిని దాటుకొని ముందుకు వచ్చింది.
పట్వారి దొర తన చేతికర్ర అడ్డంపెట్టిన వినలేదు. “దొర నువ్ కొనతలచుకుంటే ఇంకెక్కడైనా కొనవచ్చు గీ ఊరే ఏమన్నదయ్యా మీ తాతలు మీ నాయన అందరూ గీడబుట్టి ఈ నేలల్నేగదా కలిసిండ్లు ఒక్కసారి ఆలోచించడయ్యా మీరు ఇడిసిపెట్టిబోతెనే గదా మేం గట్టుకుంది”
దొర సంపెంగ నూనె రాసిన మీసాలను మరోసారి తిప్పుతూ కసిగా స్వరాజ్యం దిక్కు చూసిండు. “చెరువు శిఖం భూములు,ఈ ఊరు కింద భూమి అంతా నాదే. మీకు ఇల్లు కట్టుకోవడానికి దున్నుకోడానికి నా భూమే దొరికిందానే? భూమి ఇడిసి పెట్టగానే అదేమన్నా మీ అయ్య జాగీరి అనుకున్నారా?ఎక్కడో ఉన్న మీ ఇల్లు నా ఇంటి పంచన చేరడానికి మీరేమన్నా నా చుట్టమా? పక్కమా? ఇది నా భూమి గీడ నా కొడుకు కంపెనీ పెడతాండు. మర్యాదగా కాలిచేసిపోండ్రి లేకుంటే ఊరుకోను” అంటు పట్వారి చేతులున్న భూమివివరాల నక్షను చూపిస్తు దొర కోపంగా ఊగిపోతూ చెప్పిండు.
“ఎక్కడెక్కడో దొరలంతా జనం మీద ప్రేమతో ఊరు మీద మమకారంతోనో ఊళ్లకు బడులకు గుళ్ళకు లేనోళ్లకు ఈనామ్ ఇస్తూ పేరు తెచ్చుకుంటే మీరు ఏందయ్యా ఊరిని మింగుతామంటుండ్లు. గీభూమి మీపేరే ఉండొచ్చు ఊళ్ళే జనం పెరిగెటాళ్ళకు ఇండ్లు పెరిగినయ్. భూమి మీద బతుకడానికే గదయ్య అందరం వచ్చింది. ఇవాళున్నోళ్ళం రేపుంటామా? ప్రాణందెంత దొర గా ఇనాం ఇచ్చినోళ్ళల్ల మీరు దేవునిలెక్క మిగిలిపోండ్లయ్యా” దగ్గరకు బోయి బతిమాలింది.
“ఏందన్నా ఎడ్డి మొహం ఏసుకుని వాళ్ళతో గూసున్నవ్? నువ్ ఈ ఊర్లే బుట్టలేదా? ఈ ఊరి నీళ్ళు తాగిపెరుగలేదా? ఊరు మన కన్నతల్లి అన్నా వాళ్ళు మన తల్లినే మాయం జేస్తామంటున్నార్రా? అది నీకు సమజైత లేదా? లేక వాళ్ళుబెట్టే ఎంగిలి కూటికేమన్న ఆశబడినావా?” సర్పంచ్ చేయి బట్టుకుని అతని ముందు మోకరిల్లి దీనంగా అంది.
సర్పంచ్ ఏమి మాట్లాడకపోగా ఎప్పటి నుండో స్వరాజ్యం మీద కన్నేసిన అతను ఆమె ఎప్పుడో దుర్భాషలాడిందని గుర్రుగా పక్కకు తోసినాడు.
“సార్ ఇందుకు మేము ఒప్పుకోము. ఏండ్ల తరబడి వుంటున్న ఇండ్లు భూములను కాలిజేసి ఉన్నఫలంగా వెల్లమంటే మా గతి ఏంగాను” తలవెంట్రుకలను శిఖ ముడుచుకుంటు ఘంటా పదంగా చెప్పింది. తనతో పాటు ఒక్కొక్కరు గొంతు కలిపినారు.
“ఇండ్లు భూములు కోల్పోయిన వాళ్ళకు శాశ్వతమైన ఇండ్లను కట్టిచ్చేటట్టు మన దొర, నేను ప్రయత్నంజేస్తాం” సర్పంచ్ ఉపన్యాసం ఊదరగొడుతుండు.
*
ఎక్కడో అడవి సమీపంలోని నాలుగుకొండల మధ్య తల్లి పొత్తిల్ల మధ్య చంటి పిల్లలా ఒదిగినట్టుండే ఊరు. చిన్న పెద్ద తేడాలేకుండా ఊరంత దీక్ష శిబిరంల కూర్చుంది. పత్రికలవాళ్ళు మరియు కొందరు నేతలు వాళ్ళకు మద్ధతుగా నిలిచిండ్లు. ఒకటి, రెండు, మూడు ఇలా రోజులు గడుస్తునే ఉన్నాయి. దీక్షకొనసాగుతుంది. ఈ విషయం పత్రికలో పడి విషయం తెలుసుకున్న ఆర్డివో, కలెక్టర్ అక్కడకు వచ్చిండ్లు. దొరతో మాట్లాడిండు. దొర కలెక్టర్ మాటను కాతర్జేత్తలేడు. తన భూమి తనకే గావాల్నని గట్టిగా పట్టుబట్టిండు. కలెక్టర్ ప్రభుత్వానికి లెటర్ రాసి తను కంపెని పెట్టుకోడానికి వేరే స్థలం జూపిస్తనన్నడు. దొర కలెక్టర్ పైన గుసాయించిండు. కలెక్టర్ మనసు తల్లడిల్లింది.
“ఊరిడిసిపెట్టి బజారునపడిన బతుకులెలావుంటాయో నాకు తెలుసు. ఎందుకంటే నేను అలాంటి కష్టాలు కన్నీళ్ళు దాటుకుని ఓ రైతుకుటుంబం నుండి వచ్చినవాడినే, మీ పిల్లలు వృద్ధులు ఎంత ఇబ్బందులకు గురి అవుతున్నారో నేను చూస్తున్నాను. అందుచేత నామాటవిని ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించుకోండి. దొర మీ పిల్లలకు అందులో పని కల్పిస్తానని చెబుతుండు. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోక తప్పదు” జనం మధ్యలోకి వచ్చి గద్గదమైనస్వరంతో ఆర్ద్రమైన కండ్లను తుడుచుకుంటు స్వరాజ్యం దిక్కు జూసిండు.
“సార్ ! మొన్న ఈ కొండలు దాటుకుని కొండసిలువ లెక్క రోడ్డోటి వచ్చింది. రోడ్డుకు ఆ పక్క ఈ పక్క భూములను మింగింది. గదచ్చింది ఈ దొరకోసమే గావచ్చు మేం గా బాద నుండి తేరుకోకముందే ఇప్పుడు కంపెనీ పేరుతో ఊరును భూమిని మింగుతుంటే ఎట్లా సార్ రైతు బతికేది? మేము మట్టి తల్లిని నమ్ముకున్నోళ్ళము, మట్టి మమకారాన్ని – ఊరి పేగు బంధాన్ని తుంచేస్తామంటే తెంచుకోవడానికి మేం ఎలా ఒప్పుకుంటాము. మేం ఈ నేల తల్లి బిడ్డలసొంటోళ్ళము. తల్లిని బిడ్డను పాపడం తప్పు గదా సారు. ఊరు ఉసురు ఊరికే పోదు సారు. ఈ జనాన్ని నమ్మిచ్చి మోసం జేసెటోళ్ళందర్కి తగుల్తది” ఒక్కో మాట ఆవేశంగా అంటుంది స్వరాజ్యం.
“మీ బాదను నేను అర్ధం చేసుకున్నాను, కాని దొర ఈ భూమి తనదేనని ఆధారాలు చూపుతాండు, అందుకే వారి నుండి ప్రస్తుతం కొంత పరిహారం అందేలా చూస్తాను. ప్రభుత్వంతో మాట్లాడి ఇంకోచోట పక్కా ఇండ్లు మంజూరు చేయించి శాశ్వత నివాస స్థలాలు ఇప్పిస్తాను. అందరు సహకరించి దీక్ష శిబిరాన్ని కాలిచేయవల్సిందిగా కోరుతున్నాను.”
స్వరాజ్యం అతని కండ్లలో నిజాయితిని చూసింది. ప్రేమతో తడి అయిన అతని గుండె వె నుక బాధను అర్ధంచేసుకుంది. ఏలాగైన సహాయం చేయాలని వున్నా దొరకున్న పలుకుబడికి తాను ఏం చేయలేక పోతాండు. కలెక్టర్ కండ్లలో నిజాయితి – స్వరాజ్యం తెగింపు మాటలు దొరకు నచ్చలేదు.
పాపం! ఈ గ్రామానికి ఏదో ఒక సహాయం చేయాలనుకున్నాడు కలెక్టర్. కాని దొర అతనిపై కక్షగట్టి ఎక్కడికో బదిలి చేయించిండు. నిజాయితీకి ఈ లోకంలో చోటుండదు కదా!
ఏది ఏమైన దీక్ష విరమించేది లేదని గ్రామస్తులు పట్టుబట్టిండ్లు. మళ్ళీ రెండు రోజులు చావడిలోనే గడిపినారు. ఓ వైపు పసిపిల్లల ఆకలి ఏడుపులు, అరుపులు, ముసలివాళ్ళ ఆరాటం ఆవేదన నీరసించి అలసిన శరీరాలు పుట్టెడు ఊరు దుఃఖంతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా ఉంది. చివరకు గ్రామంలోని చాలమంది విడివిడిగాఎవరికి వారు ఆలోచించి ఇక లాభంలేదనుకొని దొర ఇచ్చిందే మహాభాగ్యమని తీసుకుని కొన ఊపిరితో ఆలి పిల్లలతో అక్కడ నుండి జారుకున్నారు.
స్వరాజ్యం ఒక్కతే టెంటు క్రింద కూర్చుంది. తనకు తల్లిలాంటి తన ఊరు కావాలి – బతుకునిచ్చే భూమి కావాలి. అందుకు తాను ఎంత కష్టాన్నయిన భరిస్తాను గాని ఎట్టి పరిస్థితులలోను దీక్ష విరమించేది లేదని మంగమ్మ శపథం జేసి కూర్చున్నది. నిండు చూలాలు చేస్తున్న న్యాయపోరాటం దేశమంతా తెలిసిపోయింది. ఈ స్వరాజ్యంతో తనకు ఇబ్బంది తప్పేలాలేదని ఆలోచించిన దొర అర్థరాత్రి తన అనుచరులతో ఆమెను టెంటు క్రింద నుండి బలవంతంగా లేపిచ్చినాడు.
స్వరాజ్య భారతావని కండ్లు చెమ్మగిల్లినాయి. ఇక్కడో ఊరుండేదన్న ఆనవాళ్ళు లేకుండా రాక్షసభూతంలా మిషన్లు ఊరిని కుప్ప కూల్చినాయి. అక్కడిప్పుడు ఊరు గల్లంతైంది.
కలెక్టర్ రాసిన లేఖతో ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది. ఆ ఊరిని ఏమి చేయవద్దని కాని అప్పటికే దొర తన మంది మార్బలంతో ఆ ఊరిని నేలమట్టం జేసిండు. దొర ముర్ఖత్వానికి ఊరు బలైంది. ఇప్పుడు ఆ కాగితంతో ఏప్రయోజనం ఈ జనంకు లేదు.
భూమిపుత్రులు – భూనిర్వాసితులుగా చీకటిలో చీకటై కలిశారు. ఆ చీకట్లను చీల్చుకుంటు భానుడు బయటకు వచ్చిండు. పురిటి నొప్పుల యాతనలో నుండి ఓ పసిగొంతుక పంచభూతాలను ఆవహించింది.
కొత్త కలం బాగానే వ్రాసింది కథ. ఆద్యంతం పాఠకుడి ని చదివించే విధం గా వ్రాసింది