అండా సెల్ నుండి పాలస్తీనా దాకా: కవితో సంభాషణ

“From the River to the Sea. Palestine is Free” అనే నినాదాన్ని గొంతెత్తి పలికినా, సోషల్ మీడియాలో ఆ నినాదాలకు మద్దతుగా like, comment, share ఏది చేసినా జర్మనీ ప్రభుత్వం అక్కడి పౌరులకు సిటిజన్ షిప్ రద్దు చేస్తుందనేది వార్త’. నేను ఈ వార్తను సాయితో చెప్పగానే నాకు ఇంకో విషయం చెప్పాడు సాయి. అదేమిటంటే.. పాలస్తీనా యుద్ధక్షేత్రంలో అక్కడి జనం మన సాయి కవితలు చదువుతున్నారు. నినాదాలుగా పలుకుతున్నారు. “నేను చావును నిరాకరిస్తున్నాను” “I Refuse to Die” అనే కవితాత్మకమైన, రాజకీయమైన స్టేట్మెంట్ ను ఎత్తి పడుతున్నారు.
“ఆ పసిపిల్లాడికి
కాళ్ళు కదలవు
కవిత్వాన్ని పాలపుంత నిండా నింపేస్తాడు”
సాయి జైల్లో ఉన్నప్పుడు నేను రాసిన ఈ కవిత గుర్తొస్తుంది.
సాయి కవిత్వానికి సరిహద్దుల్లేవు. ఒక RSS మిత్రుడు సాయి కవిత్వ పుస్తకం కావాలని అడుగుతున్నాడు. ఒక గాజా లోని చిత్రకారుడు సాయి గురించి యోగక్షేమాలు తెలుసుకోవడానికి తాపత్రయ పడ్డాడు. సాయితో సంభాషణ మొదలైన కొద్ది సేపటికే అర్ధం అయ్యింది. సాయి కోరుకున్న మానవీయత పాలస్తీనాతోనే మొదలవుతుందని.

పాలస్తీనా నేపథ్యంలో మానవీయత గురించి మాట్లాడినప్పుడు సాయి కారల్ మార్క్స్ గురించి ఒకటి చెప్పాడు. అదేమిటంటే..”యంగ్ మార్క్స్ రచనల్లో మానవీయత ఉంది కాని తర్వాతి దశలో మానవీయత తగ్గిపోయింది అనే వాదన ప్రపంచవ్యాప్తంగా కొందరు మేధావులు అంటున్నది సరైనది కాదు. మార్క్స్ జీవితం మొత్తం మానవీయత కోసమే రాసాడు. యువకుడిగా ఉన్నప్పుడు కంటే తర్వాతి దశలో చేసిన రచనల్లో రచనా శైలి మాత్రమే మారింది కాని మానవీయత ఏమాత్రం తగ్గలేదు”.
•••

జై భీమ్, తంగళాన్’ సినిమాలు చూసి రివ్యూ రాయమని పా. రంజిత్ ఒక సినిమా జర్నలిస్టుతో కబురు పంపాడని ఆ సినిమాల గురించి అడిగి తెలుసుకున్నాడు. తప్పకుండా చూస్తా అన్నాడు. కాని ఆ సినిమాలు చూడకుండానే సాయి కన్నుమూసాడు. జై భీమ్ సినిమాలో ఉన్నవి అనుభవించే పోయాడు. ఎవరైనా ఆ సినిమా దర్శకుడు పా.రంజిత్ కు చెప్పండి అతనా సినిమాలు చూడకుండానే వెళ్లిపోయాడని. ప్రభుత్వమే చూడనివ్వకుండా చేసిందని.

ఇలా సినిమాల గురించి మాట్లాడుతూ ‘అంకురం’ సినిమాను గుర్తు చేశాడు సాయి. నాకు మాత్రం అంతగా గుర్తు లేదని అన్నాను. వెంటనే మొదటి సీన్ నుంచి సినిమా మొత్తం కొద్ది సేపట్లోనే కళ్ళకు కనిపించేలా చెప్పాడు. ఆ సినిమాలో ఉన్నవన్ని శ్రీకాకుళ పోరాట సమయంలో ఎన్నో గ్రామాల్లో జరిగిన నిజమైన సంఘటనలు అని చెప్పాడు.

ఒకవేళ నేను మాత్రం సినిమా తీస్తే, మీ జీవితంలోంచి రెండు సన్నివేశాలు కచ్చితంగా పెడతానని సాయితో చెప్పాను. ‘ఒకటి తల్లి చనిపోతే చివరి చూపు కూడా చూడనివ్వకుండా చేయడం. రెండవది వసంత ములాఖాత్ కి వచ్చినప్పుడు, తెలుగులోనే మాట్లాడతా అని జైల్ అధికారులో కోట్లాడి తెలుగు మాట్లాడటం. సాయికి మాత్రం అలాంటి అవకాశం ఇవ్వకుండా ఇంగ్లీష్ లో మాట్లాడేలా చేసి ఇద్దరి ప్రేమికుల మధ్య భాషల నిబంధన అనే కారణంతో వ్యక్తీకరణలో సహజత్వాన్ని చంపిన తీరు గురించి.’
•••

వరవరరావుకూ సాయికీ ఉన్న స్నేహం గురించి చెప్తున్నప్పుడు సాయి మొఖం ఆనందంతో వెలిగిపోవడాన్ని చూసాను. ఆ కదలికలు ఇంకా నా కళ్ళల్లో కదుల్తూ ఉన్నాయ్. “HCU లైబ్రరీ లో కెన్యా రచయిత గూగీ వా థియోంగో పుస్తకం కోసం వెతుకుతున్నాడు వివి. అదే పుస్తకాన్ని నేను చదువుతూ కూర్చున్నాను. అప్పుడే మా ఇద్దరి మొదటి పరిచయం. అప్పటి నుంచి ఇక వదల్లేదు.” ఇలా చెప్పిన సాయిబాబా మొఖంలో ఒక సంతోషం కనిపించింది నాకు. ముఖ్యంగా ‘అప్పటి నుంచి ఇక వదల్లేదు’ అనే వాక్యాన్ని పలికేటప్పుడు. ఒక మిత్రుడు సాయిని బండి మీద కూర్చోబెట్టుకొని సర్ప్రైజ్ గా వివి వాల ఇంటికి తీసుకెళ్లాడట. అది రెండవ సారి కలవడం.

“నాకు చాలా ఇష్టమైన కవి చెరబండరాజు” అని చెప్పాడు. చెరబండరాజు, బొజ్జా తారకం రాసిన కవితలతో పాటు వివి కవితల గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా అతనికి వుండే జ్ఞాపక శక్తి గురించి. “నాకు ఆశ్చర్యం వేసేది అసలెలా గుర్తు పెట్టుకుంటాడో అనన్ని విషయాలు తేదీలతో సహా” అని చెప్తూ.. ఆ జ్ఞాపక శక్తిని ఓడించడం కోసమే కదా రాజ్యం అతన్ని జైల్లో వేసింది. అయినా కూడా మళ్ళీ తన శక్తిని తాను పొందగలిగాడు” అన్నాడు వివి గురించి. ‘నాకు జైలు డైరీలు చదవడమంటే చాలా ఇంట్రెస్ట్. కాని ఇప్పటి వరకు గూగీ వా థియోంగో, వరవరరావు రాసిన జైలు అనుభవాలే చదివాను. Next మీరు రాస్తే అది చదవడానికి ఎంతో ఎదురుచూస్తున్న.’ అని చెప్పినప్పుడు నాతో సాయి అన్నాడు తప్పకుండా రాస్తానని. అవేవీ రాయకుండానే వెళ్ళిపోయాడు. పదేండ్ల కాలంలో జైళ్లో అతను చూసినవి అనుభవించినవి ఈ సమాజానికి తెలియకపోవడం కూడా పెద్ద నష్టమే. ఆఫ్రికా జైలులో గూగీ ఉన్న ఎదురుంగ గదిలో ఒక ఖైదీ అనేక రోజుల పాటు అతని మలాన్ని అతనే తినేవాడట. జైళ్లు మనుషుల్ని అలాంటి స్థితిలోకి తీసుకెళ్తాయని నాకు అప్పుడే తెలిసింది. 
•••

Pakistani-British Political activist, Writer, Journalist, Film maker Tariq Ali గురించి మాట్లాడుకున్నాం. అతనితో పరిచయం ఉంది అన్నాడు. నాకు మాత్రం వివి ఉపన్యాసంతోనే తారిఖ్ అలీ పేరు పరిచయం అయ్యింది. ఈ మధ్యే తారిఖ్ అలీ ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు ఎక్కువగా వింటున్నాను. అతను లండన్ లో ప్రతి నిరసన కార్యక్రమాల్లో ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితలు చదువుతున్నాడు.

“నేను జైల్లో ఉన్నప్పుడు ఫైజ్ అహ్మద్ ఫైజ్ వి చాలా కవితలను తెలుగులోకి అనువాదం చేసాను. అందులో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. హాస్పిటల్ పనులు అవ్వగానే ఆ పని మీదే కూర్చుంటా. అవన్నీ మళ్ళీ చూడాలి. అచ్చు వేయించాలి.” అన్నాడు సాయిబాబా.

“భూమినే వదలని వాడు, చందమామను వదులుతాడా”
చందమామను హిందూ దేశంగా ప్రకటించాలనే హిందుత్వ వాదుల మాటలు విని సాయిబాబా రాసిన కవిత గురించి చెప్తూ, ‘హాస్పిటల్ మీద కూడా జైళ్లో ఉన్నప్పుడు కవిత రాసాను. ఈ రెండు కవితలే కాకుండా ఇంక చాలా కవితలుంటాయి ఇంగ్లీష్ పుస్తకంలోకి అచ్చు కానివి. అవన్నీ వెతికాలి.’

పదేళ్లు వెనక బడ్డాను కదా అంటూ ఎవరెవరు కవులున్నారు అని అడిగి తెలుసుకున్నాడు. శివారెడ్డి గారు ఇంకా కవితలు రాస్తున్నారా అని అడిగాడు. ఈ మధ్యే ఓ కొత్త పుస్తకం కూడా వచ్చింది అన్నాను. మెర్సీ, తగుళ్ళ గోపాల్ పేర్లు వినప్పుడు ఫోటో చూపించు అని నా ఫోన్ లో ఫోటోలు చూసాడు. గీతాంజలి గారు రాస్తున్నారా అని అడిగాడు. యాకూబ్ ను గుర్తు చేసుకున్నారు. ‘దేవగన్నేరు’ బడి పిల్లల కవితల పుస్తకం గురించి కాసేపు మాట్లాడుకున్నం. నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకున్న పిల్లలు రాసినవి. వాళ్లు ఎంచుకున్న అంశాలన్నీ మానవీయ, సామాజిక అంశాలు. పన్నెండేళ్ళు ఒకే స్కూల్ లో టీచర్ గా పని చేసిన తగ్గుళ్ళ గోపాల్ ఈ పనికి పూనుకున్నాడు అని చెప్తే ఆనందపడ్డాడు. అతను చాలా మంచి పని చేశాడని అన్నాడు.

పాలస్తీనాలో బాంబులు పడుతుంటే పసిపిల్లలు బొమ్మలు గీస్తూ నిరసన తెలుపుతున్నారు. ఆ బొమ్మలన్నిటినీ హైదారాబాద్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం అని కొన్ని ఆలోచనలు పంచుకున్నాను. ఆ సందర్భంలోనే నాకు నచ్చిన నిరసన రూపాల్లోంచి ఒకటి చెప్పాను పాలస్తీనాకు సంఘీభావంగా హైదరాబద్ లో ఒకమ్మాయి హిందూ సాంప్రదాయ దుస్తుల్లో భరతనాట్యం వేసి తనకున్న స్కిల్ తో సంఘీభావం తెలిపింది అని. ‘నిరసన రూపాలు దేనికవే ప్రత్యేకమైనవి. కాని అన్నింటిలో మీకు ఎక్కువగా నచ్చిన నిరసన ఏది’ అని అడిగాను. “రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఓ కళాకారుడు దేశంలో చాలాచోట్ల వీణ వాయిస్తూ పాటలు పాడటం. వీణను ఉద్యమాల్లోకి తేవాలనే అతని ఆలోచన బాగా నచ్చింది నాకు. రెండవది మట్టి మనిషి పాండు రంగారావు మెడలో ‘రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి’ అనే బోర్డు వేసుకొని అనేక చోట్ల తిరగడం.” అని ఈ రెండు విషయాల గురించి చెప్తూ.. ఉద్యామాలకు ఎంత సృజనాత్మకత జోడైతే అంత మంచిదన్నాడు.

సాయీ.. ఆదివాసీ పోరాటాలకు పెద్ద ఎత్తున అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగట్టాలి అని చెప్పిన నీ మాటలే గుర్తొస్తున్నాయి. ICU గదిని రాజకీయ కవిత్వ పాఠశాలగా చేసి ఎన్నో విషయాలు చెప్పావు. నీ చివరి రోజుల్లో నీతో జరిగిన స్నేహం ఎప్పటికీ మరవలేనిది.

(జి.ఎన్.సాయిబాబా హాస్పిటల్ లో ఉన్నప్పుడు మా ఇద్దరికీ జరిగిన సంభాషణ గురించి)

పుట్టిన ఊరు వింజమూరు, నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. ఎనిమిదో తరగతి నుంచే కవిత్వం రాస్తున్నాడు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం  ప్రాచ్య కళాశాల(నల్లకుంట, హైదరాబాద్)లో డిగ్రీ చదువుతున్నాడు.

2 thoughts on “అండా సెల్ నుండి పాలస్తీనా దాకా: కవితో సంభాషణ

  1. సంభాషణ ఈ తరానికి ఊపిరి

Leave a Reply