(తెలంగాణ ప్రజా కవి గూడ అంజన్న సుమారు అయిదు దశబ్దాలు ప్రజా ఉద్యమాల్లో మమేకమైన ధిక్కార స్వరం, పాటల ప్రవాహం. తన మాట పాటలతో జనసంద్రాన్ని హోరెత్తించిన చెమట చుక్కల ప్రభంజనం అతడు. కడదాక ప్రజల కోసమే బతికిన గూడ అంజన్న 21/06/2017 నాడు తుదిశ్వాస విడిచాడు. ఈ ప్రజా గాయకుని స్మృతిలో సాక్షి పత్రికలో జూన్ 2017 లో అరుణోదయ రామారావు రాసిన వ్యాసం ‘కొలిమి’ పాఠకుల కోసం…)
కడు పేదరికంలో ఉన్నా గూడ అంజయ్య తన కలాన్ని, గళాన్ని మాత్రం ఆపలేదు. ‘దొర ఏందిరో, దొర దోపిడేందిరో’ అని గర్జించిన గళం మూగవోయింది. అంజన్న పాట చిరంజీవి, అంజన్న చిరంజీవి.
అది తీవ్రమైన ఎండల కాలం. నల్లగొండ జిల్లా కోదాడ పట్టణంలో ప్రగతిశీల ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (పీడీ ఎస్‌యూ) మొదటి మహాసభ తర్వాత అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మునుగోడ తాలుకా పల్లివెల గ్రామానికి నడచి వెళుతున్నాము. కాలినడకన తిరగడం వల్ల అప్పటికే చాలామంది కళాకారుల ఆరోగ్యం దెబ్బతింది. అయినా మొదటి అరుణోదయ నాయకుడు పి. చలపతి రావు ఆధ్వర్యంలో, పట్టుదలతో కార్యక్రమాలు ఇస్తూ వెళుతున్నాం.
ఇంతలో అల్లంత దూరాన మోరం కొడుతున్న ఒక రైతు, ‘‘ఊరు మనదిరా, వాడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనంరా…’’ ఇలా పాడుతున్నంతట్లో గూడ అంజయ్య మమ్మల్నందరినీ ఆపి మకుటం ఉన్నదున్నట్లుగా తీసుకుని ‘‘దొర ఏందిరో, వాని జులుం ఏందిరో, నడుమ జాలిం కౌన్‌రే, ఇస్క జులుం క్యాహైరే’’ అని రాసి మిగతా భాగం పూర్తి చేసి ఆ రోజురాత్రి పల్లివెల గ్రామంలో పాడితే వేలాది జనం ఆ పాటను వింటూ ఉర్రూతలూగారు.
విప్లవ సాంస్కతికోద్యమంలో వచ్చిన మొదటి పాట అది. ఆ పాట ఇప్పటికీ, ఎప్పటికీ జనం గుండెల్లో మారుమోగుతూనే ఉంది. అనేక మంది ప్రజా కళాకారులకు జవం జీవం ఆ పాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వందలాది గ్రామాల్లో వేలాది సందర్భాల్లో ఆ పాట ప్రజా హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. తెలంగాణలో అయితే ఆ పాట వినని, స్పందించని, ఆవేశంప్రదర్శించని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు.
మా సాంస్కృతిక ప్రస్థానంలో భాగంగా జూన్ 24, 1975న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో కార్యక్రమం ఇచ్చాము. ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో పీడీఎస్‌యూ నాయకుడు జంపాలప్రసాద్, కె. లలిత, అనూరాధ, అంబిక, స్వర్ణలత, రామసత్తయ్య, ప్రసాదు, బీఏవీ శాండిల్య తదితరులు ఉన్నారు. జూన్ 25వ తేదీ కాకినాడ పట్టణంలో సినిమావీధిలో కార్యక్రమం. దోమాచారి, జనార్ధనరావు, కాశీపతి ఆ సభలో ఉపన్యాసకులు. అదే సమయంలో జోరున వర్షం కురుస్తోంది. తడుస్తున్న జనం ఒక్కరొక్కరుగా లేస్తున్నారు.
ఆ సందర్భంలో గూడ అంజయ్య ‘ఊరు మనదిరా’ అనే పాటను, నేను ‘ఓ అమర కళా వేత్తలారా…’ అనే పాటను గళమెత్తి పాడితే జనం అంత వర్షంలో కూడా కిక్కురుమనకుండా నిలబడిపాటలు విన్నారు. ఆనాటి విప్లవ పరిస్థితి, దానికి అనుగుణంగా పుట్టిన పాటలు జనాన్ని ఎంతగా చైతన్యం చేసి కదిలించాయో ఈ ఘటన తెలుపుతుంది. ఆ రోజు శివసాగర్ రాసిన ‘చెల్లీచెంద్రమ్మా’ నృత్య రూపకాన్ని కూడా ప్రదర్శించాము. సీనియర్ కళాకారుడు, కవి గాయకులు కానూరి వెంకటేశ్వరరావు రాసిన ‘ప్రగతి’ కూచిపూడి యక్షగానం తదితర కళా రూపాలు జనాన్నిఆకట్టుకున్నాయి. కాకినాడలో ప్రదర్శన 25 రాత్రి ముగిసింది. కళాకారులందరం ఒక విద్యార్థి నాయకుని రూంలో పడుకోబోతున్నాం. సరిగ్గా 12 గంటలకు జంపాల ప్రసాద్ వచ్చి ‘‘కామ్రేడ్స్! దేశంలో ఇప్పుడే ఎమర్జెన్సీ విధించింది ఇందిరా గాంధీ. ప్రతిపక్షాలను, విప్లవకారులను, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేస్తున్నారు. కామ్రేడ్ సోమచారిగారిని ఇప్పుడే అరెస్టు చేశారు. ఇక అరుణోదయ కార్యక్రమాలన్నీ వాయిదా పడినట్లే. కాబట్టి మిమ్మల్ని అరెస్టు చేస్తారు. జాగ్రత్తగా వెళ్లండి, తర్వాత కలుద్దాం’’ అని చెప్పి వెళ్లిపోయాడు.
దాంతో కాశీపతి, గూడ అంజయ్య, నేను తదితరులం రైల్లో హైదరాబాద్ బయల్దేరాం. దారిలోనే గూడ అంజయ్యను అరెస్టు చేసింది ప్రభుత్వం. కాశీపతి అనంతపూర్ వెళుతూఅరెస్టయ్యాడు. మిగతావాళ్లం తప్పించుకున్నాం. కామ్రేడ్ గూడ అంజయ్య జైల్లో ఉంటూనే అనేక పాటలు రాశాడు. ఉదాహరణకు ‘‘ఇగ ఎగబడుదామురో ఎములడ రాజన్న’’, ‘‘చుక్కలాంటిచుక్కాలో లక్షలాది చుక్కల్లో, ఏ చుక్క లున్నా వయ్యా శ్రీపాద శ్రీహరి’’, ‘‘నల్లగొండ జిల్ల ఇది విప్లవాల ఖిల్లా, ఎర్రజండా, ఎగరాలి మల్లి మల్లి’’ లాంటి అనేక పాటలు రాశాడు.
ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత అరుణోదయ, పీడీఎస్‌యూలో కొనసాగాడు. తర్వాత కొంతకాలానికి ప్రభుత్వ ఉద్యోగిగా మారాడు. అయినా తన కలానికి రాపిడి పెడుతూ నిన్నటి తెలంగాణ ఉద్యమంలో అంజన్న నిర్వహించిన పాత్ర మరువలేనిది. ‘‘అవ్వోనివా, నువ్వు అయ్యోనియా’’ లాంటి పాటలు రాసి, పాడి నూతన రాష్ట్ర ఆవిర్భావంలో తనవంతు బాధ్యత నిర్వర్తించాడు.
ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతంలోని దళిత కుటుంబంలో పుట్టిన అంజన్న ప్రపంచం గుర్తింపు కలిగిన కవి, గాయకుడిగా ఎదిగిన తీరు ఎంతో ఆదర్శవంతమైనది. ఊరుమనదిరా, ఈ వాడ మనదిరా వంటి గొప్ప పాటలతో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు విప్లవ సాహిత్యం అందించారు. ‘పుడితే ఒక్కటి, చస్తే రెండు, రాజిగో ఓరి రాజిగా ఎత్తర తెలంగాణ జెండరాజిగో ఓరి రాజిగా’ అంటూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. కవిగా, రచయితగా సాంస్కృతిక రంగ నాయకుడిగా జీవిత కాలం నిబద్ధతతో ప్రజాపక్షాన నిలిచిన అంజన్నజ్ఞాపకాలు చిరస్మరణీయంగా ఉంటాయి.
కుటుంబం మొత్తం కడు పేదరికంలో ఉన్నా, గూడ అంజయ్య తన కలాన్ని, గళాన్ని మాత్రం ఆపలేదు. మంచాన పడేవరకు కళాకారుడిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నాడు. ‘దొర ఏందిరో, దొర దోపిడేందిరో’ అని గర్జించిన గళం మూగవోయింది. గళానికి నా వందనం. తెలంగాణ ప్రజాగాయకుడు అంజన్నకు ఒక ప్రియ మిత్రుడుగా, అరుణోదయ కళాకారునిగాఅశ్రు నయనాలతో జోహార్లు అర్పిస్తూ, అంజన్న పాట చిరంజీవి, అంజన్న చిరంజీవి.