సాహిత్య విమర్శ – కొన్ని సవాళ్లు

తెలుగులో సాహిత్య విమర్శ, సాహిత్య సిద్ధాంతం ఎదుర్కొనే సవాళ్ళలో అతి ప్రధానమైనది తాత్విక , ఈస్థటిక్ మూలాలకు సంబంధించినది. ప్రతి సాహిత్య సిద్ధాంతానికీ సాహిత్యాన్ని అధ్యయనం చేయడంలో అర్ధం చేసుకోవడంలో , సాహిత్య స్వభావాన్ని సిద్ధాంతీకరించడంలో దానిదైన తాత్విక, ఈస్థటిక్ మూలాలు ఉంటాయి. ఏయే సాహిత్య సిద్ధాంతాలు ఏయే తాత్విక, కళాత్మక మూలాలనుంచి నిర్మితమయ్యాయో ఆ నేపథ్యంలోనే వాటిని చూడటం, ఆ పరిధిలోనే అవి అందించిన పరికారాల్నీ సూత్రాల్నీ సాహిత్య విమర్శలో అప్లై చేయడం జరుగుతుంది. దీని వల్ల ఏక సత్తా వాదం తలెత్తి విభిన్నత, వివిధతా మరుగునపడే ప్రమాదం ఉంది. అన్నీ మా సిద్ధాంతంలోనే ఉన్నాయి, అన్ని రకాల సాహిత్యాలకీ మా సిద్ధాంతమే వర్తిస్తుంది, అది అందించిన పరికరాలే సర్వ సాహిత్య విమర్శకు సరిపోతుంది అనే ధోరణి వల్ల పలు ధోరణుల సముచ్చయత కనిపించదు. ఇతర భాషల్లో కనిపించే ఇంటర్ డిసిప్లినరీ ధోరణి మనలో లేదు. ఉదాహరణకు ముస్లిం వాద సాహిత్యాన్ని విశ్లేషించే పరికరాలు మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతంలో పుష్కలంగా ఉన్నట్లు ఆ విమర్శకులు చెబుతారు. లేదూ బహుజన సాహిత్య సిద్ధాంతం లోనే ఉన్నాయని బహుజన సాహిత్య విమర్శకులు చెబుతారు. నిజానికి ఈ రెండు సిద్ధాంతాలూ వేటికవే ముస్లిం వాద సాహిత్యాన్ని అన్ని కోణాలనుంచీ సంపూర్ణ విశ్లేషణ చేయలేవు. ఒక దాని నుంచి ఒకటి ఇచ్చిపుచ్చుకుంటూ ఇంకా సైకలాజికల్ దృక్పధాన్నీ, స్త్రీవాద దృక్పధాన్నీ కలిపి ప్రయోగించినప్పుడే అవి విశ్లేషణకు న్యాయం చేయగలుగుతాయి. కనుక ఏక సిద్ధాంతం కంటే ఇంటెగ్రేటెడ్ అప్రోచ్ వల్ల ఎక్కువ ఫలితాలు వుంటాయని గుర్తించలేకపోవడం సాహిత్య విమర్శకు పెద్ద ప్రతిబంధకం.

సాహిత్యం మారినట్లే, సాహిత్యానికి ప్రేరణగా నిలిచే జీవితం మారినట్లే సాహిత్యాన్ని అర్ధం చేసుకునే పద్ధతులూ, విశ్లేషణా పరికరాలూ మారుతూ ఉంటాయి. ఇది గమనించి ఆయా సాహిత్య సిద్ధాంతాలూ, విమర్శా ధోరణులూ తమను తాము అప్డేట్ చేసుకోవాలి. సామాజిక వ్యక్తిగత నేపథ్యం సాహిత్య రచనకే కాదు సాహిత్య అధ్యయనానికి కూడా ఉంటాయని గమనిచలేకపోవటం కూడా విమర్శకు ఒక ప్రతిబంధకమే. నిర్ణయ రహిత సందిగ్దత ఎంత తప్పో ఈజీ జెనరాలైజేషన్స్ కూడా అంతే ప్రమాదం. పాక్షిక సత్యాలతో, పాక్షిక బంధాలతో నిండిన జీవితాన్ని సంపూర్ణ సత్య దర్శనంగా అవిష్కరించడంలోనే పెద్ద తప్పిదముందని డోన్నా హెరావే అంటుంది. We can only argue for a position of unstable constellations of partial truths and partial connections అంటుంది హారావే. జీవితాన్ని ఒక ప్రధాన వైరుధ్యానికి చెందిన సంపూర్ణ సత్య దర్శనంగా అర్ధంచేసుకోవటంలో ఉన్న పరిమితే జీవితంలోని వైరుధ్యాలన్నీ సమానమే, అన్ని సమస్యలూ సమాన ప్రాముఖ్యత కలిగినవే అనడంలోనూ ఉంది. ఈ తప్పిదాన్ని సాహిత్యం తో పాటు సాహిత్య విమర్శ, సిద్ధాంతం కూడా చేస్తున్నాయి. సాహిత్యాన్ని ఎవరు రాస్తున్నారు, ఎవరు చదువుతున్నారు, ఎవరు విశ్లేషిస్తున్నారు- ఈ పనుల్ని వీరంతా ఏ కులంలో, ఏ వర్గంలో, ఏ జెండర్ లో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో ఉండి చేస్తున్నారనే దాన్ని బట్టి సాహిత్యమూ, సాహిత్య విమర్శలు ఇలా ఎందుకున్నాయో అర్ధమౌతుంది. వివరించబడటం, వ్యాఖ్యానించబడటం వల్లనే వాస్తవాలు వాస్తవాలయ్యేది. ఈ వివరించేది ఎవరు, వ్యాఖ్యానించేది ఎవరు అనేదే వివరణ స్వభావాన్ని నిర్ణయిస్తుంది. ఇది సాహిత్య విమర్శకు సంబంధించిన మరో సవాలు. అంటే విమర్శలో వస్తుగతానికీ, వ్యక్తిగతానికీ మధ్య ఉందనుకునే సంబంధానికీ, ఉన్న సంబంధానికీ ఉన్న ఎడం అన్నమాట.

తెలుగులో సాహిత్య విమర్సే లేదని చాలామంది తేలిగ్గా అంటూ ఉంటారు. సాహిత్య విమర్శను సరిగా స్వీకరించే సాహిత్య వాతావరణం ఇక్కడ ఏమాత్రం ఉందో వీరు చెప్పరు. 90 శాతం రచయితలకూ కవులకూ వారి పుస్తకాలకు సంబంధించిన విశ్లేషణ కాదు కావాల్సింది. వారిని గురించిన పొగడ్తలు, భజనలూ కావాలి. అదే వారి దృష్టిలో గొప్ప విమర్శ. విషయ ప్రాముఖ్యత తో ఫ్రాంక్ గా నిజాయితీగా రాసే విమర్శకులను మొగ్గలోనే తుంచే మన సాహిత్య వాతావరణం సాహిత్య విమర్శకు పెద్ద సవాలు. కొంచెం అవసరమైన గ్రహణ శక్తితో, నూతన అభిరుచితో, సమకాలీన పరిజ్ఞానంతో విమర్శ రాయడం మొదలు బెట్టిన వాళ్ళను బుట్టలో వేసుకోజూడటం, లొంగని వారిని ఏకాకుల్ని చేయడం ఒక ట్రెండ్ గా నడుస్తుందంటే ఆశ్చర్యం లేదు. విశ్వ విద్యాలయాలలో తెలుగు సాహిత్యం మీద జరిగే నాసిరకం పరిశోధనా, సమకాలీన సాహిత్య విమర్శకు చెందిన పరిజ్ఞాన లోపం కూడా మన విమర్శ పరిమితికి మరో కారణం.

కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.

24 thoughts on “సాహిత్య విమర్శ – కొన్ని సవాళ్లు

  1. విమర్శ ను స్వీకరించే సాహితీ కారులు బహు కొద్ది మంది

  2. లక్ష్మి నరసయ్య గారి సాహిత్య విమర్శ చాలా పార్శ్వాలు ను విశ్లేషణ గావిస్తుంది ఆధునిక సాహిత్యం కు ఆయనో మైలురాయి

  3. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎంత ప్రధానమో బాగా చెప్పారు..మంచి విశ్లేషణ

  4. విమర్శ సిద్ధాంతాల పాక్షికత, విమర్శకుల నేపథ్యం, విమర్శకులకు ఎదురయ్యే సవాళ్ళను గురించి మంచి చూపును అందించారు సర్….

  5. విషయ ప్రాముఖ్యత తో ఫ్రాంక్ గా నిజాయితీగా రాసే విమర్శకులను మొగ్గలోనే తుంచే మన సాహిత్య వాతావరణం సాహిత్య విమర్శకు పెద్ద సవాలు….. True sir. Thanks for the thoughtful message.

    M.Krishna Kishore

  6. దాచుకోవాల్సిన వ్యాసం. భజనలు, భోజనాలుగా మారిన తెలుగు సాహిత్యానికి ఈ వ్యాసం చక్కని మార్గదర్శనం చేసింది. తెలుగులో సాహిత్య విమర్శ సరిగా లేకపోవడానికి ముఖ్య కారణాన్ని సూటిగా చెప్పడం ఈ వ్యాసం ప్రధాన ప్రయోజనం అయినా విన్నూతన అంశాలను సైతం ప్రస్తావన చేశారు .
    నిజమే…వ్యాసంలో పేర్కొన్నట్టుగా…
    “అన్ని రకాల సాహిత్యాలను అర్ధం చేసుకోడానికి ఒకే సూత్రం ఎలా ఉంటుంది?,
    “సామాజిక వ్యక్తిగత నేపథ్యం సాహిత్య రచనకే కాదు సాహిత్య అధ్యయనానికి కూడా ఉంటాయని గమనిచలేకపోవటం కూడా విమర్శకు ఒక ప్రతిబంధకమే. ” ఇలాంటి ఆసక్తికర అంశాలను సమగ్రంగా చెప్పారు. వ్యాస రచయితకు అభినందనలు. వేదిక నిర్వాహకులకు కృతజ్ఞతలు.
    👏👏👏

  7. Very well written. Now a days in telugu literature writers only need appreciation. This point is well brought over.

  8. ఇది చదివైనా తెలుగులో విమర్శ లేదు అనే వాళ్ళు ఎందుకు లేదో.. అందుకు ఎవరూ కారణమో తెలుసుకుంటారు అని ఆశిస్తున్నా

  9. నిజాయితీగా రాసే విమర్షకులను మొగ్గలోనే తుంచే వాతావరణం…నిజం!

  10. విమర్శకు విశ్లేషణ కు అంతరం బాగా వివరించిన వ్యాసం సార్. మీరు అన్నట్టు విమర్శకు స్వీకరించే సహృదయత కలిగిన వారు అరుదుగా ఉన్న కాలం ఇది. పొగడ్తలతో వెల్లదీస్తున్న కాలం

  11. మీరు లేవనెత్తిన అంశాలపై గమనింపు లేకపోవడమో, గుర్తించకపోవడమో కాదేమో. అది కొందరికే వర్తిస్తుందనుకుంటా. గ్రహింపు ఉన్నా నేపధ్యం పరిమితుల్లోనే స్పందనలు చర్యలు ఉంటటమే ప్రధానంగా కనిపిస్తుంది అన్ని వర్గాల సాహిత్యకారుల్లో కూడా. అందు వల్లే ఏ రెండు సమూహాలు కూడా కలిసి నడవ లేక పోవడాన్ని చూస్తున్నాం.

  12. మీరన్నది అక్షరాలా నిజమే.విమర్శ, విశ్లేషణలు,కొత్తగా రాస్తున్న వాళ్ళు కూడా స్వీకరించరు.పొగడ్తే కావాలి.అందువల్లే సాహిత్య విమర్శకులు కూడా కొందరు ఆ మూసలో కి వెళ్ళిపోవాలని వస్తోంది.

  13. నిజం సాహిత్య విమర్శను సరిగా స్వీకరించే సాహిత్య వాతావరణం అసలే లేదు. అత్యధికులైన రచయితలకూ కవులకూ వారి పుస్తకాలకు సంబంధించిన విశ్లేషణ కాదు కావాల్సింది. వారిని గురించిన పొగడ్తలు, భజనలూ కావాలి. 100% మీతో నేను ఏకీభవిస్తున్నాను. విమర్శకు ఊపిరి పోసే క్రమంలో మీ సూచనలు శిరోధార్యం.

  14. ఆఖరి పేరా అదిరింది… వ్యాసాన్ని రెండు సార్లు చదవాల్సి వచ్చింది… 👌🏼

  15. విమర్శను సానుకూలంగా స్వీకరించగలిగినప్పుడే వ్యక్తీకరణలోని పొరపాట్లు గుర్తించగలం. తద్వారా మరింత నాణ్యమైన సాహితీ సృష్టి జరుగుతుంది.
    విమర్శను స్వీకరించగలిగే పరిణతి వస్తుందని ఆశిస్తున్నాను.

    సర్… మీరు రాసే ప్రతి వ్యాసం మా తరానికి గొప్ప పాఠం.
    విమర్శ చేసేందుకు విమర్శకులు పెంచుకోవాల్సిన అవగాహన ఎలా ఉండాలో… అవసరమైన అంశాలను స్పృశిస్తూ మరీ చెప్పారు.

    ధన్యవాదాలు 🙏💐

  16. వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు సర్. అందరూ భుజాలు తడుముకుంటారు…ఇంతముక్కుసూటిగా రాసే మీరు తెలుగు సాహిత్యానికి అవసరం…

  17. Wonderful article Sir… You called a spade a spade👍👍After reading this i just recollected Sri RaRa (Rachamallu Ramachandra Reddy) who aka “kroora vimarsakudu” for his unsparing literary criticism.I wish every literary crytic should usher into the foot steps of the great RARA… Regards

  18. నేటి విమర్శ విధానం గురించి సూటిగా చెప్పారు సర్

  19. G.L GARU —1OO% TRUE SIR —-TO DAY WRITERS THEY WANT ..THEY NEED POGADTHALU -BHAJANALU —PLUS GROUPISM —-GURTHIMPU KOSAM — SHAALUVALU KAPPINCHUKOVADAM KOSAM —DABBU KOSAM —NAANA GADDI KARUSTHOO —-RAASEDHI OKATI —CHEPEEDHI OKATI —-BUT THEY LIVE – ACT DIFFERENTLY —
    THE BUCK STARTS FROM YOU —- THEY DONOT FOLLOW
    RAA RAA LU AVASARAMU SIR

  20. విమర్శకీ సంబంధించిన వాస్తవాల్ని కుండబద్దలు కొట్టారు..సర్..ఊరికే గుడ్డ గాల్చి మీదేసేవాళ్ళకు ,వాస్తవాల్ని వాస్తవంగా స్వీకరించలేన్ని వాళ్లకు,కేవలం పొగడ్తలు మాత్రమే కోరుకునేవాళ్లకు..సూటిగా గుచ్చుకున్న వివరణ .ములిగర్రలాంటి వ్యాసం.
    థాంక్యూ సర్..

Leave a Reply