‘సాక’ పోసిన ఆత్మాభిమానం

ఇదొక చారిత్రక సందర్భం. రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల తొలగింపు మొదలైన ప్రకటనల మధ్య దేశవ్యాప్తంగా దళితులు అలజడి పరిస్థితుల్లో జీవిస్తున్న సమయం. ఒకవైపు ఆత్మ గౌరవంతో జీవిస్తుంటే పెరుగుతున్న మూకదాడులు, మరోవైపు వెంటాడుతున్న కులవివక్ష. దేశవ్యాప్తంగా ఈ రెండింటి మధ్య దళిత జీవితాలు నలిగిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో భౌగోళికంగా రెండుగా విడిపోయాయి. దళితుల పరిస్థితులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. సరిగ్గా ఈ సందర్భంలో వివిధ పత్రికలలో వివిధ కోణాలలో దళితులు రాసిన కథా సాహిత్యాన్ని ఒక దగ్గర పేర్చుతూ దళిత కథ పేరుతో ప్రతి సంవత్సరం వార్షిక తెస్తున్న జంబూ సాహితి సంస్థ కృషి భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తుందనడంలో సందేహం లేదు. జంబూ సాహితి సంస్థ మూలవాసుల అస్థిత్వ విశ్లేషణ అనే ఉపశీర్షికతో హైద్రాబాద్‌ కేంద్రంగా పనిచేస్తన్నా ఇది తెలుగు కథా సాహిత్య వేదిక. ఈ సంస్థను డా॥ సిద్దంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్‌, తప్పెట ఓదయ్య సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ఏటా ఆ సంవత్సరంలో పత్రికల్లో ప్రచురమైన దళిత కథలతో ఒక సంకలనం వేస్తుంది.

దళిత కథ అంటే దళితులు రాసిన కథ. వీరు దళితులు రాసిన దళిత స్పృహ ఉన్న కథలను ఆ సంవత్సరంలో వివిధ పత్రికల్లో వచ్చిన కథలను ఎంపిక చేసి ప్రచురిస్తారు. ఈ సంవత్సరం వేసిన దళిత కథా వార్షిక శీర్షిక “సాక”. సాక అంటే తెలంగాణ మాండలికంలో అర్పణం అని, కానీ నిజంగా దళిత సాహత్యానికి జంబూ సాహితి అర్పించిన అరుదైన అర్పణం ఇది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్ఛేరి కేంద్ర పాలిత ప్రాంతం యానాంకి చెందిన రత్నాకర్‌ పెనుమాక కథ ఉంది. ఈవిధంగా ఈ సంకలనం 70 శాతం దక్షిణ భారత దళిత కథా వార్షిక అనదగ్గ అర్హత సంపాదించుకుంది. ఇందులో మొత్తం 16 కథలున్నాయి. ఈ సంకలనం ప్రజా యుద్దనౌక గద్దరన్నకి అంకితమివ్వటం దళిత సమాజం పట్ల జంబూ సాహితికి ఉన్న కమిట్‌మెంట్‌కి ఓ ఉదాహరణ.

అసలు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా కుల వివక్ష మీద కథలు అవసరమా? సమాజంలో కుల వివక్ష ఉందా? సమాజం బుల్లెట్‌ ట్రైన్‌తో దూసుకుపోతుంటే దళిత సమాజం మను ధర్మ శాస్త్ర కాలానికి తిరోగమనమౌతుంది అనే వాదన విన్నాను. వాళ్ళందరికీ తెలియాల్సిన నగ్న సత్యమేంటంటే కుల వివక్ష తీవ్రత తగ్గిందని అనిపించవచ్చు. వివిధ రూపాల్లోకి మారింది కానీ సమసిపోలేదు. అది తన రూపం మార్చుకుంటుంది తప్ప సమానత్వ భావన రావడం లేదు. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా భారతీయుల కులసంఘాలు ఉండటమే దీనికి ఉదాహరణ. కుల అభిమానముండటం మంచిదే అయినా వివక్షుండటం బాధాకరం. ఈ నేపధ్యంలో దళిత వెతలను రికార్డు చేయాల్సిన అవసరముంది. అది ఎన్ని రూపాల్లో తన ప్రభావం చూపుతుందో నమోదు చేయాల్సిన ఆవశ్యకతుంది. దళిత కథా వార్షిక చేస్తున్నదదే! వాదన ఏకపక్షంగా విని తీర్పు ఇస్తే ఎలా ఉంటుందో అలా ముగ్గురున్న ఇంట్లో అగ్ర కులానికి చెందిన తండ్రి పక్షం తీసుకుని తల్లిని అంటరానిదాన్ని చేసిన పరిస్థితిని, ఆదర్శంతోనో, ఇష్టంతోనో పెళ్ళి చేసుకుని పెళ్ళి తర్వాత తన పుట్టుక, తన కులం కారణంగా భార్యని అంటరానిదాన్ని చేసిన భర్త కథ ‘యువరానర్‌’ మనుషులు తనకి సమస్యొచ్చినప్పుడు దాన్ని ఎదిరించే మానసిక స్థైర్యం లేనప్పుడు దానికి కారణమైన వాళ్ళమీద కక్ష కడతారు. ఇదోరకమైన మానసిక స్థితి. దీన్ని కళ్ళకు కట్టారు సతీష్‌చందర్‌. ఇందులో వాడిన కొన్ని వాక్యాలు కథాస్థాయిని పెంచాయి.

‘పద్దెనిమిదేళ్ళు కలిసి బతికేసాక అనిపిస్తుంది అతని మీద ప్రేమ కలిగివుంటే బాగుండునూ’ అని. ఇంకోచోట ‘ఏడుపులంటే ఇష్టమైన జ్ఞాపకాలేమో’ ఇవి గుర్తుండిపోయే వాక్యాలు. జూపాక సుభద్ర గారి ‘అప్పు వడ్డది సుమీ’ కథలో ఆరోల్ల పూలమ్మ నిజంగానే బొంతల వెట్టిన అంబేద్కర్‌ యూత్‌ పోరగాండ్లకు అప్పువడ్డది. ఆళ్ళకే కాదు బాగున్నప్నుడు చీదరించుకున్నది. ఈ కథలో నాకు దళిత స్పృహ కంటే మానవీయ కోణమే కదిలించింది. కథ మొత్తం ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘నీ ఆత్మ ఎంతేడుస్తుందో నీ ఊరోళ్ళొక్కరు రాకపాయే గీల్లసావులు మన సావులకొత్తన్నాయి. గీల్లు మనకు తరాలు తంతెల కాన్నుంచి బడ్డరునము బాకీ యెన్నడు దీరుస్తరో’ అంటా కథ మొత్తం ఒక్క వాక్యంలో చెప్పేసారు సుభద్ర.

భూతం ముత్యాలు ‘పచ్చ నాకు సాక్షిగా’ కథ అర్ధం చేసుకోటానికి కసరత్తు చేయాల్సిందే, కానీ కుల దొరతనం ఎంత దుర్మార్గమో చెప్తుంది.

డా॥ జిలుకర శ్రీనివాస్‌ ‘బురదగుంట’ కథ విభిన్నంగా ఆఖరివాక్యం మొదటివాక్యం ఒకటే కావటం కథకుడి విశిష్టత. ఒక కుక్కని చంపాలంటే అది పిచ్చిది అని ప్రచారం చేయాలి అనేది సూత్రం! పల్లెల్లో కులాల మద్య సాధారణంగా కనిపించే అంశం. ఎవరైనా దళితుణ్ణి వెలి వేయాలన్నా, వాడిని ఒంటరిని చేయాలన్నా వాడు చేతబడి చేస్తున్నాడని ప్రచారం చేస్తే ఇంట్లోవోడు కూడా వ్యతిరేకం అయిపోతాడు. ఇది చాలా గ్రామాల్లో కనిపించిన సమస్య, చాలాసార్లు విన్నదే కానీ కొత్తగా చెప్పడం బాగుంది.

చల్లపల్లి స్వరూపరాణి గారి ‘సాము’ కథ సత్యాలు లాంటి వాళ్ళు మనకి పేటల్లో చాలామంది కనిపిస్తారు. సమాధిమీద పడుకోడంలాంటివి పేటల్లో చదువుకోకపోయినా హేతువాదాన్ని నమ్మేవాళ్ళు మాదిగ మాల పేటల్లోనే కనిపిస్తారు. ఆడపిల్లలపై జరిగే లైంగిక దోపిడి మీద వందల కథలొచ్చినా ఇందులో తిరుగుబాటు కొసమెరుపు.

పసునూరి రవీందర్‌ ‘ఒక నేల మూడు ముఖాలు’ దళితులకు వ్యక్తిస్వేచ్ఛ, తిరుగుబాటు నేర్పిన కమ్యూనిజం ప్రభావం, విసరబడ్డ దళితుల్ని అక్కున చేర్చుకున్న క్రైస్తవ్యం ప్రభావం, పెద్దోళ్ళ పాతనమ్మకాలు ఈ మూడింటి మధ్య అయోమయానికి గురౌతున్న నేటితరం కన్పిస్తుంది.

చరణ్‌ పరిమి కథ ‘అతిధితో అక్కడిదాకా’ అర్ధం చేసుకోవడానికి కష్టపడాలి. పైకి సాదాసీదాగా అనిపించినా అంతర్లీనంగా మరో కథలో పర్యావరణం పట్ల బాధ్యత అర్ధమౌతుంది.

‘అమ్మలంతే గుండెల్లో అగ్ని పర్వతాలను ప్రార్ధనలో కప్పిపెడతారు’ ‘రోజంతా ప్రియుడికోసం ఎదురు చూసిన ప్రేయసిలాగా అనిపిస్తుంది వర్షం. కానీ ఇవ్వాళ మా బాధని పంచుకుంటున్న మా మార్తక్క స్నేహితుల్లాగా అనిపించింది దాని రొద’ ఆణిముత్యాల్లాంటి ఈ వాక్యాలు మెర్సీ మార్గరెట్‌ ‘వర్షం సాక్షిగా’ కథలోనివి. క్రైస్తవ్యంలో ఉన్న డినామినేషన్ల గోల, మతం దాని విశ్వాసాలు ఎంత తీవ్రంగా వుంటాయో ఈ కథలో వివరించారు. క్రైస్తవ సమాధి తంతు అంతా తెలుసుకోవచ్చు. ఇంకోవైపు ఎంత చదువుకున్నా మతం మనిషిని ఎలా నిర్వీర్యం చేస్తుందో కూడా అర్ధం చేసుకోవచ్చు.

తాళ్ళపల్లి యాకమ్మ గారి ‘వెన్నెల గొడుగు’ దోపిడీని దళితుల అమాయకత్వాన్ని గుర్తుచేస్తాయి. దళిత కథ ఇంకా లందగోళెం దగ్గిర వెన్నెల గొడుగు దగ్గిరే ఆగిపోయిందనిపించింది.

కెంగార మోహన్‌ ‘సమిధలు’ దళితుల అనాలోచిత ఆవేశానికి దుర్వినియోగమౌతున్న అట్రాసిటి చట్టానికి అద్దం పడుతుంది. కథ పూర్తిగా రాయలసీమ యాసతో సొగసుగా సాగింది. నిజాయితీకి వేసిన శిక్ష గా బోధపడతూంది.

దళిత అనే పదానికి అనేక అర్ధాలు పరమార్ధాలు నిర్వచనాలున్నాయి. పుట్టుక కారణంగా వివక్షకు అణచివేతకు గురికాబడ్డ సమూహాలన్ని దళితులే! అనొచ్చు.
హిజ్రా గా పుట్టిన కారణంగా వివక్షకు అణచివేతకు అవమానానికి గురికాబడ్డ రమణి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. రత్నాకర్‌ పెనుమాక రచన కదిలిస్తుంది.

అనిల్‌ డ్యానీ ‘వీకెండ్‌ కథ’ దళితుల ఆహార సంస్కృతి పట్ల ఉన్న ప్రేమకు అద్దం పడుతుంది. ఎండుముక్కల్ని మల్లెమొగ్గలుగా వర్ణించడం బాగుంది.

దశాబ్దాల తర్వాత కూడా దళిత కథ గొడ్డుమాంసం దగ్గిర లందగోళం దగ్గిర ఆగిపోకూడదు. దోపిడీకి, అణచివేతకి, అవిద్యకి ఆధారమైన కులం రూపాంతరం చెంది తన ప్రభావాన్ని చూపుతున్న కులానికున్న అనేక వికృత ముఖాల్ని కథల ద్వారా బయటపెట్టాల్సిన అవసరముంది.

జి. హైమవతి గారి ‘బొందలగడ్డకు దూరంగా’ అనే కథ మనిషి చచ్చిపోయాక ఆచరించే అంధవిశ్వాసాల ద్వారా స్త్రీ చావును ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో కళ్ళకు కడుతుంది. ఆలోచింపజేసే కథ ఇది.

సోలోమోన్‌ విజయకుమార్‌ ‘ఊరు గాసిన కానుపు’ కూడా ముందుకథకి పోలిక ఉంది. కానీ దీంట్లో వస్తువు కానుపుకి, మృత్యువుకి సంబంధించింది. చనిపోయిన గర్భవతి కడుపు కోసి మృత శిశువును తీయడమనేది చదువుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. దళితుల యొక్క అంధ విశ్వాసాల చిత్రణ ఇందులో కూడా కర్కషంగా కన్పిస్తాది.

గుడిపల్లి నిరంజన్‌ ‘తప్పెట సిటుకు’ దళిత శ్రామిక స్త్రీ స్వభావాన్ని చూపెడుతుంది. కాలికమ్మ మానవత్వానికి, మార్పుకి, మారుపేరుగా నిలిచి కోమటి కళావతికి నీడనిస్తుంది. దళిత వాడలు ఇలాంటి ఎందరికో నీడనిచ్చే మానవత్వ నిలయాలని ఈ కథ రుజువు చేస్తుంది.

డా. సిద్ధెంకి యాదగిరి ‘రుణం’ కథకి సినిమా కథకున్నంత పెద్ద కెన్వాస్‌ ఉంది. కథని మలుపు తిప్పి గుండెల్లో చెమ్మని తడిమే సన్నివేశాలున్న కథ. తప్పక చదవాల్సిన కథ. బహుమతికి అర్హమైన కథ. ఇలా ఈ కథలన్నీ దళిత జీవితాల వివిధ కోణాల చిత్రణ. దళిత కథ ఇంకా అనేక కోణాల్ని స్పృశించాల్సి ఉంది.

కులజాఢ్యం ఎప్పటికప్పుడు రూపాంతరం చెంది బలం పుంజుకుంటుంది. దానికి అనుగుణంగానే కళారూపాలు ఎప్పటికప్పుడు దళితుల్ని జాగృత పరచాల్సివుంది. సాహిత్య రంగంలో జంబూ సాహితి ఆ పని నిరవధికంగా కొనసాగిస్తుందని ఆశిస్తూ… అభినందిస్తూ… వీరి అంబేడ్కర్ బాటలో కృషి నిరాటంకంగా కొనసాగాలని కోరుతున్నాను.

పుట్టింది కుతులూరు. కవి, కథకుడు, సామాజిక కార్యకర్త. బి. ఎస్సీ, ఎమ్.బి.ఏ చదివాడు. వివిధ బహుళ జాతి కంపెనీల్లో హెచ్. ఆర్. మేనేజర్ గా పనిచేశాడు. తర్వాత పూర్తికాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. యానాంలో 2005లో స్వచ్ఛంద సేవాసంస్థ నెలకొల్పాడు. సొంత నిధులతో నిర్విరామంగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. 11 కథలతో మొదటి కథా సంపుటి "గౌతమీ తీరం " (2022) ప్రచురితమైంది. అముద్రిత రచనలు: 60 కథలు, 30 కవితలు, 5 నవలలు రాశాడు. వివిధ కథా పోటీలలో 16 పురస్కారాలు వచ్చాయి. ఈ సంవత్సరం 12 బహుమతి కథలతో "గౌతమీ ఒడ్డున " అనే రెండవ కథా సంపుటి ఆవిష్కరించ బోతున్నాడు.

Leave a Reply