(‘చెదరిన పాదముద్రలు’ నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్‌తో విమర్శకుడు ఎ. కె. ప్రభాకర్ చేసిన సంభాషణ)
ఉణుదుర్తి సుధాకర్ స్వస్థలం విశాఖపట్నం. సాహిత్యాభిలాషకు కారణం కుటుంబ వాతావరణం. స్కూలు చదువు – శ్రీకాకుళం జిల్లా. ఉన్నత విద్య యూరప్‌లో. వృత్తి రీత్యా మెరైన్ ఇంజినీర్. వీరి మొదటి నవల ‘యారాడ కొండ’ 2020లో ఆటా బహుమతి పొందింది. ‘తూరుపు గాలులు’, ‘చలిచీమల కవాతు’ వీరి కథా సంపుటాలు. వీరి కథల ఇంగ్లీష్ అనువాదం ‘ఈస్ట్ విండ్’ క్రిందటి ఏడాది విడుదల అయింది. 2024 వ సంవత్సరానికి ‘ఆటా బహుమతి’ పొందిన ‘చెదిరిన పాదముద్రలు’ నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్‌తో విమర్శకుడు ఎ. కె. ప్రభాకర్ చేసిన సంభాషణ. ***
ఎ. కె. ప్రభాకర్: ఉణుదుర్తి సుధాకర్ అనగానే మనకి ‘తూరుపు గాలులు’ కథలు గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత ‘యారాడ కొండ’ నవల. అటు కథలు, ఇటు నవల – ఈ రెండు ప్రక్రియలలోనూ ఆయన నిష్ణాతులయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ‘చెదరిన పాదముద్రలు’ కూడా మరో చారిత్రిక నవల. సుధాకర్ గారూ, చారిత్రక రచనలు చెయ్యడం మీకు అలవాటుగా మారిపోయిందా?
ఉణుదుర్తి సుధాకర్: అలా ఏం లేదండి. నేనూ చాలా నేర్చుకుంటున్నాను. మరో అడుగు ముందుకు వేసాను కానీ, అది సాహసం అనే చెప్పాలి. ప్రతిసారీ ఒక కొత్త ఆలోచన, కొత్త పరిశోధన, కొత్త ప్రయోగం – అలా నడుస్తూ ఉంటుంది.
ప్రశ్న: మీరు దాదాపు ఐదు దశాబ్దాల పాటు నౌకారంగంలో పని చేశారు. చరిత్ర పట్ల ఆసక్తి ఎలా కలిగింది? చరిత్రని సృజనాత్మక సాహిత్యంలోకి తర్జుమా చెయ్యడం మరో అడుగు. ఈ కళ పట్ల అభినివేశం ఎలా కలిగింది? సాహిత్యమూ, చరిత్రా ఈ రెండిటినీ మిళితం చేస్తూ రచనలు చేయాలనే ఆలోచన ఎలా కలిగింది? దానికేదైనా స్పూర్తి, ప్రేరణ ఉన్నాయా?
జవాబు: ఒక్క మాటలో చెప్పాలంటే మార్క్సిజం. ఇంకా వివరించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచీ సాహిత్యం పట్లా, చరిత్ర పట్లా ఆసక్తి అనేవి మా ఇంటి వాతావరణంలో ఉండేవి. నాన్నగారి స్నేహితులు కొంతమంది ఉండేవారు, పుస్తకాలు చదవడం, సంభాషించడం, చర్చించడం జరుగుతుండేది. ఒక ఆలోచన నాకు కలిగింది ఏమిటంటే, మన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే ఒక అడుగు వెనక్కి వెళ్లి, ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చామో తెలుసుకోవాలి, నేటి వరకూ ఆ ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఇప్పటి సమాజం మనకి అర్థం అవుతుంది. ఎటుపక్క వెళ్తున్నామో కూడా కొంతవరకూ అర్థం కావొచ్చు అని ఒక స్పృహ ఏర్పడింది. అది కాలేజీలో చదువుతున్న వయసులో అనుకోండి. అప్పటికే, చరిత్ర చదవడం, చర్చించడం నడుస్తూ ఉంది. ముఖ్యంగా నన్ను ప్రభావితం చేసిన రచయితలు డి.డి. కొసంబీ, తర్వాత దశలో ఈ.హెచ్. కార్. వీళ్ల రచనలు చదివినప్పుడు, అంటే అది చిన్నతనంలో కాదు, ఒక వయసు వచ్చిన తర్వాత చదివినప్పుడు – వీళ్లు ఏవో కొన్ని మూలాల్ని పట్టుకున్నారు, వాటి వెనుక ఏదో అంతరార్థం ఉంది. అని కొంచెం కొంచెంగా బోధపడటం మొదలయింది. ఆ తర్వాత ఇంకా ఆసక్తి పెరిగింది. ఎవరికైనా చరిత్ర అంటే నారో స్పెషలైజేషన్ ఉంటుంది, సాధారణంగా. నాకు మొదట్లో ఆసక్తి కలిగించింది యూరోపియన్లు మన దేశానికొచ్చిన తొలి దశ. అది ఏ విధంగా మన సమాజాన్ని మార్చింది? ఎంత వరకూ మార్చింది? లేదా మార్చలేకపోయింది? ఎందుకంటే మీరన్నట్టు నౌకారంగంలో ఉన్నవాణ్ణి కనుక, డచ్ ఈస్టిండియా కంపెనీ వాళ్లు, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వాళ్లు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఏం చేశారు? ఇక్కణ్ణించి ఏం తీసుకెళ్లారు? మన దేశానికి ఏం ఇచ్చారు? వాళ్ల నుంచి మనం ఏం నేర్చుకున్నాం? వాళ్లు ఇక్కడికొచ్చి ఏమి తెలుసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడం మొదలుపెట్టాను.
ప్రశ్న: అంటే మీరు మార్క్సిస్ట్ కాకపోతే చారిత్రిక రచనలు ఇలా చేసి ఉండేవారు కాదేమో కదా?
జవాబు: నిస్సందేహంగా. ఎందుకంటే చరిత్ర రచయితలకు కావొచ్చు, చరిత్రకారులకు కావొచ్చు, లేదా చరిత్రను సాహిత్యంగా మలుస్తున్న వాళ్లకు కావొచ్చు… ఒక దృక్పథం ఉంటుంది. కొంతమంది, ‘ఉన్నది ఉన్నట్టుగా మేం రికార్డ్ చేస్తున్నాం,’ అంటారుగానీ, రచయితకీ, చరిత్రకారుడికీ కూడా ఒక స్పష్టమైనటువంటి దృక్ఫథం ఉంటుంది. దేనిమీద దృష్టిపెట్టాలి? దేన్ని రికార్డు చెయ్యాలి? అనేదికూడా ఒక నిర్ణయమే కదా? ఎంచుకొనే ప్రక్రియల్ని కూడా దృక్పథమే నిర్దేశిస్తుంది.
ప్రశ్న: చరిత్రని ఘటనల సమాహారంగా చూసేవాళ్లకి, ఒక దృక్పథంతో చూసేవాళ్లకీ తేడా ఉంటుంది అనుకోవచ్చా?
జవాబు: తప్పకుండా ఉంటుందండీ. చరిత్రని అధ్యయనం చెయ్యడంలో తటస్థంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఏ చరిత్రను తీసుకుంటున్నాము? ఎవరి చరిత్రని తీసుకుంటున్నాము? చరిత్రని ఏ దృష్టితో మనం చూస్తున్నాము? – ఈ మూడు అంశాల మీద ఒక స్పష్టత ఉన్నప్పుడే మనం ఆ లోతుకు వెళ్లగలం. ఆ మూడింటికీ కూడా ఒక దృక్పథం అవసరం. ‘ఏ దృక్పథం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే రిపోర్టు చేస్తాను’ అనుకుంటే, దానిలో సారం ఉండదు, జీవితం ఉండదు, సమాజం ఉండదు. కొన్ని ఫాక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఆ ఫాక్ట్స్ మనకి అవసరమే. కానీ, అంతటితోనే మనం ఆగిపోకూడదు కనుక ఈ సమాజ గతి సూత్రాలని తెలుసుకున్నప్పుడే మనం ఏ దిశలో ప్రయాణిస్తున్నాం? ఎందుకిలా ప్రయాణిస్తున్నాం? అనేది మనకి ఎంతో కొంత బోధపడుతుంది. చరిత్ర అధ్యయనంలో కానీ, అలా తెలుసుకున్న చరిత్రలో కానీ ఒక జీవం, ఒక జీవశక్తి, కొన్ని గతిసూత్రాలు ఉంటాయి అని ముఖ్యంగా ప్రొ.ఆర్.ఎస్. రావుగారి దగ్గర నేర్చుకున్నాను.
ప్రశ్న: అంటే చరిత్ర గురించి నేర్చుకోవాల్సిన పాఠాల గురించి మాట్లాడుతున్నారు, వర్తమానానికి అన్వయించు కోవడం గురించి మాట్లాడు తున్నారు కదా. అదే సందర్భంలో నాకు శ్రీశ్రీ మాటలు – ‘ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలెవ్వరు, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు…’ గుర్తొస్తున్నాయి. ఈ దృక్పథంతోనే మీరు ఈ నవలకి ‘చెదరిన పాదముద్రలు’ అని పేరు పెట్టారా? ‘ఇతిహాసపు చీకటి కోణపు అట్టడుగున పడి కనిపించని కథలు కావాలిప్పుడు’ అంటాడు కదా శ్రీశ్రీ? అలా మీరు కూడా ఈ నవల రాయడానికి ముఖ్యంగా వలస కార్మికులు, బర్మా వెళ్లిపోయినటువంటి కార్మికులు, ఉపాధి కోసం వెతుక్కుంటూ వెళ్లిన వాళ్లు, వాళ్ళొక యుద్ధ ఉపద్రవంలో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని తిరిగి రావడం ఇలా అనేకరకాల జీవన పోరాటాలు వాటి పరిణామాలు ఇవన్నీ మీరు ఈ నవలలో ప్రస్తావించారు కదా. ఇక్కడ ‘చెదరిన పాదముద్రలు’ అనడం ద్వారా మీరు నిర్దిష్టంగా సామాన్యుల జీవితం గురించే రాయాలని అనుకున్నారా?
జవాబు: ఈ నవలలో పేర్కొన్న వ్యక్తులు రెండో ప్రపంచ యుద్ధం రోజులలో, జపాన్ వాళ్లు బర్మా మీద దాడి చెయ్యగానే ఇక వేరే మార్గం లేక వాళ్లు అక్కడి నుంచి వందల మైళ్లు నడిచి వచ్చారు. వాళ్లు ఏ దారులలో వచ్చారు, ఎన్ని అవస్థలు పడ్డారు అనేది నాకెప్పుడూ కూడా ఆసక్తి ఉండేది. అందువల్ల ‘పాదముద్రలు’ అనేది సరిపోతుంది అని అనుకున్నాం; అలాగే, ‘చెదరిన’ అని ఎందుకు అనుకున్నామంటే, వాటి ఆనవాళ్లు ఇప్పుడు స్పష్టంగా లేవు. ఇక్కడొక మాట చెప్పాలి. ఈ నవలకు నామరకణం చెయ్యడంలోనూ, కథనానికి మెరుగులు పెట్టడంలోనూ ఆటా సాహిత్య కమిటీ సభ్యుల తోడ్పాటు, చాలా ఉంది. వాళ్లెన్నో మంచి సలహాలిచ్చారు. సవరణలు సూచించారు. ఈ నవలలో తీసుకున్న దశాబ్దం 1941 నుండి 1951 వరకూ గడచినది. ఆ దశాబ్ద కాలంలో చాలా మార్పులు జరిగాయి – జాతీయంగా, అంతర్జాతీయంగా, స్థానికంగా. వాటి ఆనవాళ్లు కనుమరుగైపోతున్నాయి. ఆ ఉద్దేశంతో ‘చెదరిన పాదముద్రలు’ అనే పేరు సరిపోతుంది అనుకున్నాం. రెండో ప్రపంచ యుద్ఢం ఈ నవలకి నేపథ్యం మాత్రమే; ఇది ఒక యుద్ధ వర్ణన కాదు. ఈ నవల యుద్ధ బాధితులపైనే దృష్టి పెడుతుంది. ‘ఈ నవలలోని వ్యక్తులు పారిపోయి వచ్చేసారు, దాంట్లో ఏముంది విశేషం?’ అనుకోవచ్చు. అదికాక వాళ్లు ఎవరూ కూడా రికార్డులలో లేరు. ఎంత మంది బయల్దేరారు? ఎంతమంది ఇళ్లకి తిరిగివచ్చారు? ఎంతమంది దార్లో పోయారు? వచ్చినవాళ్లు ఏమైపోయారు? – ఇవేవీ ఎవరికీ తెలీదు. అంచేత కూడా ‘చెదరిన’ అని అనుకున్నాను. ఈ నవల రాస్తున్న క్రమంలో నాకు, ఈ నోట్లు రద్దు సృష్టించిన సంక్షోభం, అలాగే కోవిడ్ రోజులలో లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు వలస కార్మికులు ఏ విధంగా ఇళ్లకు వెళ్లిపోయారో – అవన్నీ గుర్తుకొచ్చాయి, సామాన్యులు ఎన్ని అవస్థలు పడ్డారో మన కళ్లముందే చూసాం. అది కూడా ఒక ట్రిగ్గర్ లాగా పని చేసింది. అంచేత, అది వర్తమానం అని నాకు అనిపించింది.
ప్రశ్న: వర్తమానంతో అనుసంధానం చేయనటువంటి గతంలోకి చూపు పెద్దగా ఉపయోగపడదేమో అనిపిస్తూ ఉంటుంది. మీరు రాసినటువంటి చారిత్రక రచనలు ఏవి చదివినా – అవి కథలు కావొచ్చు, నవలలు కావొచ్చు. తప్పనిసరిగా వర్తమానంతో అనుసంధానించడం కనిపిస్తుంది. చరిత్రకారుడు కానీ, చరిత్రని సాహిత్యంగా మలిచేవాళ్లు కానీ, గతానికీ వర్తమానానికీ ఒక వారధిగా పనిచెయ్యాలని చెప్తారు కదా. అది మీ రచనలు చదువుతున్నప్పుడు చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే, ఇందులో ఒకచోట అంటారు మీరు – ‘ఆకలితో గోలపెట్టే పిల్లల్ని సముదాయించలేక అవస్థలు పడుతున్న ఆడవాళ్లను చూశాను, అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్న వయసు పైబడ్డ పెద్దవాళ్లను చూశాను, వాళ్లని వదిలిపెట్టలేక, వాళ్లకోసం ఆగిపోలేక సతమతమైన కొడుకులని, కూతుళ్లనీ చూశాను, నాన్నల్ని భుజాల మీద మోసిన కొడుకుల్నీ, పిల్లల్ని భుజాల మీద పెట్టుకుని వందల మైళ్లు నడిచిన అమ్మల్ని చూశాను, పిల్లల్ని మొయ్యలేక ఏడ్చే తల్లితండ్రుల్ని చూశాను,’ ఇలా మీరు వర్ణించినటువంటి – అంటే బర్మా నుంచి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాంబులు పడినప్పుడు ఇలా పారిపోయి వచ్చినటువంటి వాళ్లున్నారు. కానీ, నాకు వలస కార్మికులే కనిపించారు. అంటే, కరోనా వచ్చినప్పుడు, లాక్ డౌన్ చేసినప్పుడు, రైలు పట్టాల వెంట, రోడ్ల వెంట, మట్టి బాటల వెంట నడవలేక, కాళ్లు బొబ్బలెక్కిపోవడం… ఇదంతా ఈ దృశ్యం, ఆ దృశ్యంతో కలిపి చూడాలి అని అనిపించి ఈ వర్ణనలన్నీ వచ్చాయి అంటారా?
జవాబు: అవునండి. ఈ వర్ణనలు రావడానికి ఆధారం – అప్పుడు ఆ కాలంలో కొంతమంది రాశారు – ఉదాహరణకి భీశెట్టి లక్ష్మణరావుగారు వారి జ్ఞాపకాలు, వారి తల్లితండ్రుల జ్ఞాపకాలు రాసుకొచ్చారు. దానిలో చాలా వివరాలు ఉన్నాయి. అయితే వాటిని మనం విజువలైజ్ చెయ్యడానికి, దృశ్యమానం చెయ్యడానికి, కోవిడ్ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు ఉపయోగపడ్డాయి. రైలు పట్టాల మీద నడుస్తూ ఉంటే, రైలు చక్రాల కింద పడి మరణించడం, ఇటువంటి ఘోరాలు నిన్న కాక మొన్న జరిగాయి, మన కాలంలో, మన కళ్లముందే. అంటే, ఇంత తీవ్రంగా ఉంటుందా పరిస్థితి, ఇంత ఘోరంగా వాళ్లు సఫర్ అవుతున్నారా అని. దానిలో వాళ్ల ప్రమేయం లేదు. దానితో వాళ్లకి సంబంధం ఏమీలేదు. అయినా సరే, వాళ్లు అన్ని అవస్థలు పడ్డారు. ఈ రెండూ కనెక్ట్ అవుతాయి.
ప్రశ్న: మీకు యూరప్ తో సంబంధం ఉండటం వలన, ఈ నవలలో మీరు రెండో ప్రపంచ యుద్ధకాలంలో అంతర్జాతీయంగా జరిగినటువంటి ఘటనలని సైతం నవలలో చక్కగా చూపించగలిగారు. అలాగే జాతీయంగా ప్రత్యేకంగా స్వాతంత్ర్య ఉద్యమం, క్విట్ ఇండియా మూమెంట్, ఆ తర్వాత బెంగాల్ కరువు ఇవన్నీ కూడా వచ్చి చేరాయి. మీరు ఎన్నుకున్న కాన్వాస్, ఇంత పెద్దది కదా? దీన్ని నవలలోకి ఇమడ్చడంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? నిజానికి – మీ ‘తూరుపు గాలులు’ కథలో మీరు స్పృశించినది సుదూరమైనటువంటి గతం. ఈ నవలలోది సమీప గతమే. ఈ సమీప గతంలో కొంతమంది వ్యక్తులు, మీకు తెలిసినటువంటి వ్యక్తులే ఉన్నారా? ఆ వ్యక్తుల్ని సజీవమైనటువంటి వ్యక్తుల్ని రచనలోకి తీసుకురావడం ద్వారా రచనని సజీవంగా చేసేటటువంటి ఆలోచన వచ్చినా, ఈ కాన్వాస్ అంతటినీ ఇంత నిండుగా ఎలా చిత్రీకరించాలనుకున్నారు? ఇది ఎలా మీకు సాధ్యపడింది?
జవాబు: సమీప గతం కావడం వల్ల కొన్ని వెసులుబాట్లు కూడా ఉంటాయి. ఈ నవలలో ఉన్న చారిత్రక నేపథ్యం, రెండో ప్రపంచ యుద్ధం నాటిది. ఉదాహరణకి, జపాన్ వాళ్ల దాడి, నేతాజీ గురించిన సమాచారం – వీటన్నిటి మీదా మనకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, రకరకాల పరిశోధనా గ్రంథాలు ఉన్నాయి. వ్యాసాలున్నాయి. డాక్యుమెంటరీలు ఉన్నాయి. సుదూరమైన గతమైతే మనం చాలావరకూ ఊహించుకోవాలి ఇవాల్టి రోజులలో ఇంటర్నెట్ ద్వారా మనం వాటిని తెలుసుకోవచ్చు, చూడొచ్చు, చదవొచ్చు. కానీ, దీనివల్ల ఒక రకమైన ఇబ్బంది కూడా ఉంది. మనం ఏదో ఊహాగానాలు చెయ్యడానికి వీలు లేదు. మన కల్పన మితిమీరిపోయిందంటే బెడిసి కొడుతుంది. అంచేత, ఎంతవరకూ వాస్తవం, ఎంత వరకూ కల్పన – ఈ రెండిటినీ బాలెన్స్ చేసుకుంటూ రాయాలి. రెండోది, కాల చట్రం విధించిన నిర్దిష్టత ఏదైతే ఉందో, దాంట్లోనే ఈ నవల లోని సంఘటనలు జరగాలి. అంచేత, అవన్నీ కూడా నిర్దిష్టష్టమైన తేదీలు. ఆ తేదీలలో ఈ నవల కథ, డ్రామా ముందుకు వెళ్లాలి. అదొకటి నేను ఎదుర్కొన్న ఇబ్బంది. కానీ, ఇందాక చెప్పినట్టు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. అంచేత, కొన్ని సంఘటనలు తిరిగి రాసుకోవడమో, లేదంటే ఒకటికి పదిసార్లు వెరిఫై చేసుకోవడం, చెక్ చేసుకోవడం అదంతా చేస్తూ వెళ్లాను. పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఆటా మిత్రులు కూడా కొన్ని సూచనలు చేసారు. ఈ నవల యొక్క సృజనాత్మకతని, చారిత్రిక వాస్తవాలతో జోడిండచం, మరీ వ్యాసంలాగ మారిపోకుండా దానికి నవలా రూపం, కథా రూపం, ఆ హ్యూమన్ డ్రామా ఏదైతే ఉందో దాంట్లో రాజీ లేకుండా కథని ముందుకు నడిపించడానికి మనుషులే కావాలి. చారిత్రిక సంఘటనలు నేపథ్యంలో ఉంటాయి. ఆ మనుషులు, ఆ పాత్రలు, వాళ్ల యొక్క సంఘర్షణ, వాళ్ల అవస్థలు, వాళ్ల సంభాషణలు, వాళ్ల ఆలోచనలు, వాళ్లలో వచ్చిన పరిణితి ఇవే నవలకు ప్రధానం.
ప్రశ్న: నవలలో ఒక కేరెక్టర్ తీసుకున్నప్పుడు ఆ పాత్ర పరిణతి చెందాలి అంటే పరిణామశీలంగా, గతిశీలంగా ఉండాలి అంటారు కదా? రాంబాబు పాత్ర, ఇక్కడ ఉద్దానం నుంచి బర్మా వెళ్లి, రంగూన్ వెళ్లి, రంగూన్ నుంచి బెంగాల్ వచ్చి, మళ్లీ విశాఖ వచ్చి, విశాఖ నుంచి విజయవాడ – ఈ రూట్ మీరు, అంటే టోపోగ్రాఫికల్ రూటు ఉందికదా? ఈ రూటు తీసుకోవడానికి కారణం? నాకు ఏం అనిపించింది అంటే మీరు బెంగాల్ కరువుని చిత్రీకరించాలనుకున్నారు, అందుకేనా? ఈ పదేళ్లూ చరిత్రలో చాలా డైనమిక్ గా ఉన్నటువంటి పదేళ్లు కదా. ఈ పదేళ్ల ప్రయాణానికి, ఈ జయోగ్రాఫికల్ స్కీమ్ కి ఏమైనా లింక్ ఉందా?
జవాబు: ఉందండీ. ఎందుకంటే, వాళ్లు ఏదో వెళ్లారు, వచ్చేసారు, అన్నట్టు కాకుండా, అప్పుడున్న చారిత్రిక సంఘటనల్నీ, ఆ పీరియడ్‌ని మనం తీసుకున్నప్పుడు, ఆ బెంగాల్ కరువు అనేది కూడా యుద్ధం మూలంగానే వచ్చింది. బ్రిటిష్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వచ్చింది. ఈ నవలలో చూపించాను. లేకపోతే కొంచెం అసంపూర్ణంగా ఉండిపోతుంది. బెంగాల్ కరువు, అంత భయంకరమైన కరువు మూలంగా రకరకాల ప్రభావాలు, పరిణామాలు ఉన్నాయి. దాని మీదకూడా దృష్టి పెట్టాలి అన్న ఉద్దేశంతో కలకత్తా అనుభవాలు నవలలో చోటుచేసుకున్నాయి. ప్రధాన పాత్రలు అక్కడికి చేరుకోవడం సహజంగానే జరిగిపోయింది. ఎందుకంటే, అక్కడ అధికారులు, తెల్లవాళ్లు – దొరలు కలకత్తా వెళ్తున్నప్పుడు వాళ్లతో పాటూ వెళ్లిపోయారు. అదీగాక, నాయుడు ఖరగ్‌పూర్ వాడు. ఆ విధంగా, ఆ పరిస్థితులని కళ్లకి కట్టినట్టుగా చెప్పాలన్న ఉద్దేశంతో ఆ దారి ఎంచుకున్నాను. అది అక్కడ బాగానే కుదిరింది అని అనిపించింది.
ప్రశ్న: అది చాలా బాగా కుదిరిందండి. అంటే గాంధీ మరణం కావొచ్చు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఘటనలన్నీ చెప్పడానికి, విభజన తర్వాత జరిగిన అల్లర్ల గురించి చెప్పడానికి, గాంధీ మరణించిన తర్వాత జరిగిన ఘటనల గురించి మాట్లాడటానికి, నాయుడు పాత్రను మలచడంలో బాగా ఉపయోగపడింది. నాకెందుకో మీరు నాయుడు పాత్రను కమ్యూనిస్టు పార్టీకి ఒక ప్రతీకగా స్వీకరించారేమోనని అనిపించింది. ఎందుకంటే ఆ పార్టీ కార్యకర్తగా పనిచెయ్యడంతో పాటూ, పార్టీ చేసేటువంటి ప్రతి యాక్టివిటీలోనూ అతను ఉన్నాడు. బెంగాలలో ఉన్నాడు, నావికుల తిరుగుబాటు జరిగినప్పుడు బొంబాయి వెళ్లాడు. తర్వాత తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నాడు. దేశమంతా పార్టీ ఎంత విస్తృతంగా ప్రయాణం చేసిందో దాన్ని మీరు నాయుడులో చూపించారేమో, రక్తసంబంధం కంటే వర్గసంబంధం గొప్పది అని చెప్పటానికి ఆ పాత్రని అలా మలిచారేమో అనిపించింది. నాకలా అనిపించడం ఎంత వరకూ కరెక్ట్ అంటారు?
ఉణుదుర్తి సుధాకర్: నా ఉద్దేశ్యం కూడా అదే. నాయుడు కూడా డ్రైవర్‌గానే మొదలవుతాడు; మొదట్లో ఆయనేం కమ్యూనిస్ట్ కాదు. ఆయనలో పరిణితి వచ్చి, ఒక దశలో పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. నల్లదారిలో నడిచి వచ్చినప్పుడే ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఊరికే చనిపోవడం కంటే, ఏదొక పోరాటంచేసి చనిపోవడం నయం అనుకున్నాడు. పోరాటంలో ప్రాణం పోయినా ఫరవాలేదు అనుకున్నాడు. అంచేత, ఈ నవలలో నాయుడు పాత్ర కమ్యూనిస్టు పార్టీకి ఒక ప్రతీక అని చెప్పుకోవచ్చు. నాయుడిలో ఆ చైతన్యం ఎక్కడనుంచి వచ్చిందంటే, పార్టీ నుంచే వచ్చింది. రాంబాబులో, భవానీలో ఆ చైతన్యం ఎక్కడ నుంచి వచ్చింది అంటే నాయుడు ద్వారా వచ్చింది. ఈ విషయం చెప్పడానికి రాష్ట్రస్థాయి నాయకుడినో, స్థానిక నాయకుడినో ఒక పాత్రగా సృష్టించి చెప్పొచ్చు. నాకది ఇష్టం లేదు. ఒక కార్యకర్త ఎలా ఎదిగాడు, అతని నేపథ్యంతో మొదలుపెట్టి, అతనిలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది చూపించాలి అనుకున్నాను. ‘వ్యూ ఫ్రం బిలో’ అంటారు. అంటే కింది నుంచి పైకి చూడడం – పైనించి కిందికి చూడటం కాకుండా. అప్పుడే క్షేత్రస్థాయిలో ఉండే వివరాలు, సంఘర్షణలు ఇంకా బలంగా బయటపడతాయి అని నేను అనుకున్నాను.
ప్రశ్న: అలాగే, రాంబాబు భవానీ దంపతులు ఉన్నారు కదా? ఆ దంపతులలో రాంబాబు కంటే కూడా భవానీ ఎవాల్వ్ అవ్వడం నన్ను చాలా అబ్బురపరచింది. ఒక సాధారణ గృహిణి నుంచి ఒక కార్యకర్తగా, అలాగే కరువు ప్రాంతాలలో చేపట్టినటువంటి సహాయచర్యలు చేస్తూ పరిణితి చెందిన ఆమె పాత్ర, ఒకానొక దశలో రాంబాబునీ, నాయుడినీ కూడా గైడ్ చేసే పాత్రగా ఆమె రూపొందింది. ఇది ఎలా సాధ్యమయింది ఆమెకి?
జవాబు: ఈ నవలలో అన్నిటికంటే బలమైన పాత్ర భవానీదే. ఆమెలో వచ్చిన చైతన్యం, మానవీయమైనది. ఆమె నేపథ్యం మూలంగా ఆమెకి సిద్ధాంతాలు, రాజకీయాలు ఏమీ తెలీవు. కానీ, వాస్తవంలో జరుగుతున్న వాటిని చూసి ఆమె మానవతావాదిగా స్పందిస్తుంది. ఆ తర్వాత రాజకీయాలు, సిద్ధాంతాలు వస్తాయి. ఈ క్రమం స్వభావసిద్ధంగా జరగాలని అనుకున్నాను.
ప్రశ్న: అది చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే, ‘కమ్యూనిస్టులు జీవితం నుంచి రూపొందుతారు, సిద్ధాంతాల నుంచి కాదు’ అనేది భవానీ పాత్ర ద్వారా నాకు అందిన సందేశం. మీరు కావాలని రూపొందించారా ఆ పాత్రని అలా? లేక ఆ పాత్ర తనంత తాను ఎవాల్వ్ అయ్యిందా?
జవాబు: కావాలనే రూపొందించానండి. కొన్ని వివరాలు మాత్రం వాటంతట అవే అక్షరరూపం తీసుకున్నాయి. ఉదాహరణకి కొన్ని సంఘటనలు – కాళీఘాట్ దగ్గర శవాలు కొట్టుకుపోతుంటాయి. సాధువు ఒకడు ఉద్రేకంగా, ఉన్మత్తంగా కేకలేస్తూంటాడు. భవానీ చలించిపోతుంది. అలాగే, ఆమెకి సంగీతంలో, పాటలలో ఆసక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా స్వభావరీత్యా వచ్చిచేరిన లక్షణాలు, ఆవిర్భావాలు. ఒక సందర్భంలో ఆమె ‘మనవాళ్లంతా మంచివాళ్లే’ అని భర్త రాంబాబుతో అంటుంది.
ప్రశ్న: అవును, ‘పార్టీ వాళ్లు చాలా మంచోళ్ల’ని అంటుంది ఆమె.
జవాబు: ఆమెలో వచ్చినటువంటి సహజమైన ప్రతిస్పందనలు ఇవన్నీ కూడా. ఆమెకి ఎవరూ పాఠాలు చెప్పలేదు. ఆమె రాజకీయ తరగతులు అటెండ్ కాలేదు. మొత్తంమీద సహజంగా వచ్చిన మార్పులే అవన్నీ. అటువంటి వాళ్లే ఆ రోజులలో, ఆ తర్వాత దశలో కూడా పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. అది సిద్ధాంతపరంగా కాదు, మానవ సంబంధాల ద్వారా జరిగింది.
ప్రశ్న: ఈ పాత్రలు, అంటే ఇటువంటి పాత్రలు మీకు నిజజీవితంలో ఎక్కడైనా తారసపడ్డాయా? ఈ నవలలో వచ్చినటువంటి పాత్రలు ఎవరైనా మీకు ఆనాటి కథ చెప్పడానికి తోడ్పడ్డారా?
జవాబు: ఒక్క రిచర్డ్ పాత్రకి మాత్రం నిజ జీవితంలో ఆధారం ఉంది. నా ఫ్రెండ్ కేప్టెన్ లారీ అనే ఒకాయన ఉండేవాడు బొంబాయిలో. తెలుగువాడే. భీమిలివాడు, బొంబాయిలో సెటిల్ అయ్యాడు. అతను నాలాగే మర్చంట్ నేవీలో పని చేసి రిటైర్ అయ్యాడు. వయసులో నాకన్నా పెద్దవాడు. మా ఇద్దరి మధ్యా స్నేహం బాగా కుదిరింది. ఆయన భీమిలి గురించి ఎన్నో కథలు చెప్తుండేవాడు. భీమిలికి చెందిన క్రిస్టియన్ ఇతను. వాళ్ల నాన్నగారు బర్మా ఆయిల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ రంగూన్లో ఉండేవాడు. వాళ్ల నాన్నగారి కథలు చాలా చెప్పేవాడు. చాలా ఆప్యాయంగా ఉండే మనిషి. ఆయన కిందటి సంవత్సరం చనిపోయాడు. అంచేత ఈ నవల ఆయనకి అంకితం ఇచ్చాను. ఆయన చెప్పిన కథలు చాలా ఉన్నా, ఈ పుస్తకంలో వచ్చినవి తక్కువే. వాళ్ల ఇంట్లో బర్మా టేకుతో చేసిన కుర్చీ ఉండేది. నన్ను దానిమీద కూర్చోమనేవాడు. బొంబాయిలో ఉన్నన్నాళ్లూ ప్రతీ క్రిస్‌మస్‌కీ నేనతనికి ప్రత్యేక అతిథిని; న్యూ ఇయర్ విందు మా ఇంట్లో. ఆ రోజులలోనే రిచర్డ్ పాత్ర నాలో ప్రవేశించింది. ఈ నవలలో రిచర్డ్ పాత్రకి రాలేదు కానీ, లారీ తండ్రిగారికి మెడల్ వచ్చింది. 1942 లో జపాన్ వాళ్లు బాంబులు వేస్తారని భయపడి పారిపోయి వచ్చిన వాళ్లలో ఆఖరున బయలుదేరిన ఓడలో లారీ తల్లిదండ్రులు ఇండియాకి తిరిగివచ్చారు. ఆ ఓడపైన కూడా జపాన్ విమానాలు బాంబు దాడులు చేశాయి. అప్పుడు లారీ, తల్లి గర్భంలోనే ఉన్నాడు లారీ నాన్నగారిని నేను చూడలేదనుకోండి, కానీ ఆ పాత్ర అక్కడివరకూ కనెక్ట్ అవుతుంది. ఇక భవానీ అంటే, శ్రీకాకుళం జిల్లాలో పెరిగాను కాబట్టి, అక్కడ నేను కొంతమంది స్త్రీలని చూశాను. వాళ్లు ఎన్ని కష్టాలు వచ్చినా నిబ్బరంగా, మొండిగా ఎదుర్కొంటారు, ధైర్యంగా నిలబడతారు. ముందుకు దూసుకుపోయే స్వభావం వాళ్లలో నేను చూశాను. మనలాగా బాగా చదువుకున్నవాళ్లు పెద్ద సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, చర్చలూ చేస్తారు కానీ, వాళ్లు ఒక్క మాటలో తేల్చేస్తారు. ‘ఇదే సరైనది, అది అది తప్పు,’ అని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. వాళ్ల జీవితావగాహన చాలా లోతైనదని నాకనిపిస్తూ ఉంటుంది. వాళ్ల భాష, వాళ్ల మాటతీరు కూడా పట్టుకోవాలి అని నేను అనుకున్నాను. అలా భవానీ పాత్ర వచ్చింది.
ప్రశ్న: అయితే, భవానీ పాత్రకు మీరు ఉత్తరాంధ్ర మాండలికం పెట్టారు. రాంబాబుకి పెట్టలేదు. భవానీ పాత్ర ఎవాల్వ్ అయ్యే క్రమంలో ఆమె అదే భాషని కాపాడుకోవడం మనం నవలలో గమనిస్తాం. భాష విషయంలో ఆమె అలాగే ఉండటానికి కారణమేమైనా ఉందా? మిగతా విషయాలలో చాలా మారింది కదా ఆ కేరెక్టర్.
జవాబు: ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంది, బెంగాలీ నేర్చుకుంది. ఇంగ్లీష్ వాళ్లతో సమానంగా ఇంగ్లీష్ మాట్లాడింది. బెంగాలీ వాళ్లతో సమానంగా బెంగాలీ మాట్లాడింది. కానీ, తెలుగు మాట్లాడేటప్పుడు మాత్రం అలానే మాట్లాడింది. ఆమె రంగూన్ వెళ్లింది, అక్కడ నుంచి కలకత్తా వచ్చింది. చదువుకున్నవాళ్లు మాట్లాడే తెలుగు ఆమె అనుభవంలో లేదు. అంచేత కావాలనే అలా ఉంచాను. తర్వాత మారి ఉండొచ్చు. విజయవాడలో కొన్నాళ్లు ఉన్నప్పుడు మారిందేమో నాకు తెలీదు, అయితే అది వేరే విషయం.
ప్రశ్న: (నవ్వుతూ…) బాగుంది. మీరు ఈ నవల రాసేటటువంటి క్రమంలో, దీన్ని ఒక రాజకీయ నవలగా మార్చారేమో అనిపించింది. అంటే రెండు అంశాలు అనిపించాయి నాకు. చారిత్రిక నవల రాజకీయ నవలగా పరిణమించింది. ఆ రాజకీయ నవల పీరియడ్ నవలగా, అంటే 1941 నుంచి 1951 మధ్యకాలానికి సంబంధించినది. అక్కడ ఉన్నటువంటి సజీవమైన వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు అంటే, పుచ్చలపల్లి సుందరయ్య, బి.టి. రణదివే, జ్యోతిబసు, ఇంకా .. సుభాష్ చంద్రబోస్ రెండవ ప్రపంచ యుద్ధం సంగతైతే చెప్పక్కర్లేదు, కల్పనా దత్, పి.సి. జోషి ఇలాంటి కేరెక్టర్స్ అన్నీ కూడా మీరు ప్రవేశపెట్టారు. ఈ కేరేక్టర్స్ ప్రవేశపెట్టడం ద్వారా వాళ్ల ఆలోచనా ధోరణి మీరురికార్డ్ చెయ్యడానికి కాకుండా, ఒక వాతావరణాన్ని క్రియేట్ చెయ్యడానికి మీరు ఎంచుకున్నారా?
జవాబు: అవునండి. ఆ నేపథ్యాన్ని, ఆనాటి వాతావరణాన్ని క్రియేట్ చెయ్యడమే వాళ్ల ప్రస్తావన వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. మీకు మరొక విషయం చెప్పాలి. మీరు అడిగారు కదా, ఈ పాత్రల్ని నిజజీవితంలో ఎక్కడి నుంచైనా తీసుకున్నారా? అని. బి.టి. రణదివేగారికి ఒకే ఒక కుమారుడు. ఆయన బొంబాయిలో నా కొలీగ్; నిజానికి నా బాస్. నాకన్నా ఐదారేళ్లు పెద్దవాడు; ఆయన కూడా మెరైన్ ఇంజినీరు. నేను బొంబాయిలో ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు రణదివే అనే పేరు చూసి, ‘బి.టి. రణదివే మీకు చుట్టమా?’ అని అడిగాను. ‘అవునండీ, ఆయన మా నాన్నగారు’ అన్నాడు. అప్పటినుంచి మాకు పనికి సంబంధించిన చర్చలతో బాటుగా ప్రైవేట్ సంభాషణలు చాలా జరిగేవి. ఆయన నన్నూ, నా భార్యనీ, వాళ్ల ఇంటికి భోజనానికి పిలుస్తుండేవాడు. ఆఫీస్‌లోనే కాకుండా, బయిట కూడా కలుసుకుంటూ ఉండేవాళ్లం. ఆయన చాలా విషయాలు చెప్పాడు. పబ్లిక్‌కి తెలీని చాలా విషయాలు ఉంటాయి కదా? అవన్నీ చెప్పినప్పుడు, ఆ రోజులలో లీడర్‌షిప్ అంత క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉండేదా అని చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన చెప్పిన విషయాలు కూడా ఆ నాయకుల్ని ఊహించడానికి కొంతవరకూ ఉపయోగపడ్డాయి. తర్వాత మీరు రాజకీయ నవల అన్నారు, ఇది నిస్సందేహంగా రాజకీయ నవల. 1940లనాటి పీరియడ్‌ని మనం తీసుకున్నప్పుడు అది రాజకీయ నవల అయితీరాలి; ఇంకో మార్గం లేదు. రెండోది ఏంటంటే, ఇది ఫాసిస్ట్ వ్యతిరేక నవల కూడా. నేను ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని చూస్తున్నప్పుడు ఆనాటి రాజకీయ పరిస్థితులను, మూడ్‌నీ ఒడిసిపట్టుకొని ఒక నవల రాయాలని బలంగా అనిపించింది. అప్పుడున్న ఐడియలిజం కావొచ్చు, అప్పుడున్న ఆశావాదులైన నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు కావొచ్చు; అప్పుడున్న సంఘర్షణలు కావొచ్చు. వాటిని గుర్తుచేసుకోకపోతే, వర్తమానంలో రోజువారీ జరుగుతున్న సంఘటనలలో మనం కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. వెనక్కి వెళ్లి మనం ఆలోచించుకోవాలి అని నాకు బలంగా అనిపించింది. ‘ఇది ఒక రాజకీయ నవల, ఇదంతా ప్రాపగాండా’ అని అనేవాళ్లు ఉంటారు; దానికి నేనేం చెయ్యలేను. ఈ నవలలో చెప్పిన విషయాలను నేను బలంగా నమ్ముతున్నాను, ధైర్యంగా రాయాలి, ఎవరేం అనుకున్నా సరే, అనుకుని, ఆ నమ్మకంతోనే రాశాను.
ప్రశ్న: ఈ నవలలో మీరు అంతర్జాతీయంగా, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బలపడిన అమెరికా ఆధిపత్యం గురించి ప్రస్తావించారు. అలాగే, నాయుడు ఒక మాట అంటాడు. నాయుడు అంటే ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ అనుకోవాలి, లేదా ఆ భావజాలం అనుకోవాలి. ‘పెట్టుబడిదారులు, మతవాదులు అవకాశాల కోసం కాచుకుని ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చాకా వాళ్లు గనుక ఏకం అయితే సోషలిజం, సెక్యులరిజం రెండూ మంటగలిసిపోతాయి’ అంటాడు. ఇది చదువుతున్నప్పుడు – చారిత్రిక రచన అంటే గతానికి వర్తమానానికి వారధి కట్టడం అనుకున్నాం కదా, అది గుర్తుకొచ్చింది. అలాగే నాయుడు అన్న గురుమూర్తి – సోషలిజం, లౌకికవాదం ఆచరణలోకి వస్తాయని, పబ్లిక్ సెక్టార్ పెరుగుదల ఆధారంగా దేశం ఆధునిక ప్రజాస్వామ్యంగా అవతరిస్తుందని అంటాడు. గురుమూర్తి కేరెక్టర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి, నాయుడు కేరెక్టర్ కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలకి ప్రతీకలుగా నాకు అనిపించాయి. ఈ ప్రతీకల నించి మనం, వర్తమానానికి వచ్చినప్పుడు, అప్పుడు ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు, ఇప్పుడు ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు ఎలా ఉన్నాయి? అంటే కమ్యూనిస్టులు ఈ రోజు ఎక్కడ నిలబడ్డారు?
జవాబు: ఇది చాలా కష్టమైన ప్రశ్నే. కమ్యూనిస్టు పార్టీల తరఫున మాట్లాడే అర్హత నాకు లేదు, అది కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అంటే, వాళ్లనే అడగాలి. కానీ, నేనునుకోవడం ఏంటంటే, ఆ రోజులలో అంతర్జాతీయంగా తీసుకున్నట్టయుతే ఒక సోవియట్ యూనియన్ ఉండేది. ఒక ఆశావాదం ఉండేది. అందుకనే రేడియో మాస్కో అనే ప్రత్యేకమైన ఛాప్టర్‌ని ప్రవేశపెట్టాను. అంతర్జాతీయ ఆశావాదం ఉండేది. ఆ సోవియట్ యూనియన్, జర్మనీపై విజయం సాధించింది. అది చారిత్రాత్మక విజయం; చాలా గొప్ప విజయం. అప్పటికీ, ఇప్పటికీ కూడా. అలాంటి పరిస్థితులలో భారతదేశంలో ఒకే కమ్యూనిస్టు పార్టీ ఉండేది. ఆనాటి పార్టీ నాయకత్వం గురించి కూడా మనం చర్చించుకోవచ్చు. ఆ చర్చని కాసేపు పక్కన పెట్టి, మహత్తరమైన ఉత్సాహం, ఉద్వేగం నిండి ఉన్న రోజులవి అని ముందుగా గుర్తుంచుకోవాలి. ఆ రోజులలా ఉన్నాయి అన్నప్పుడు, అయితే మనం ఇప్పుడెక్కడున్నాం? అన్న ప్రశ్న పాఠకులలో రావాలి అని నేను అనుకున్నాను. దానికి సమాధానాలు నా దగ్గర లేవు. ఈ నవలలో చర్చించే అవకాశం లేదు. ఇవాళ సోవియట్ యూనియన్ లేదు, చైనా కూడా ఇంకొక దారిలో వెళ్లిపోయింది. రకరకాల వెనుకంజలు జరుగుతున్నాయి. అంచేత ఇవాళ్టి రోజుల గురించి పరిమితంగానే చెబుదాం అనుకున్నాను. ‘అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యింది?’ అనే ఆలోచన పాఠకులలో కలగాలి అని మాత్రం నేను అనుకున్నాను.
ప్రశ్న: ఉద్ధానం నుంచి బయల్దేరిన రాంబాబు బర్మా వెళ్లాడు, బర్మా నుంచి బెంగాల్ వచ్చాడు, మళ్లీ విశాఖపట్నం వచ్చాడు. ఆ తర్వాత విజయవాడ వైపు వెళ్లాడు. అంటే, అక్కడ ఒక పాయింట్ కూడా వస్తుంది. ‘ఎలక్షన్లా, సాయుధ పోరాటమా అనేది కాదు ప్రశ్న. ప్రజల్ని సమీకరించాలి, పోరాటాలు కొనసాగించాలి’ అంటాడు నాయుడు తెలంగాణ సాయుధపోరాటం గురించి మాట్లాడుతూ. అప్పుడు మీరు, ‘పోరాటాలు వెనుకంజ వేసినా అవి రగిల్చే చైతన్యం ముందుకే పోతుంది’ అంటారు. ఈ స్టేట్‌మెంట్ ప్రకారం ముందుకు పోవలసినటువంటి రాజకీయాలు విజయవాడ వైపు ఎందుకు కదిలాయి? దానికేమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా?
జవాబు: 1950ల నాటి పరిస్థితులు తీసుకుంటే, 1952 ఎన్నికలలో వాళ్లు పాల్గొన్నారు అన్నది మనకు తెలుసు. అప్పుడు ‘విశాలాంధ్ర’ పత్రికను స్థాపించారు. 1951, 52 నాటి పరిస్థితులలో వాళ్లు తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదా అన్న చర్చలోకి ఈ నవల అయితే వెళ్లదు. విజయవాడ అంటే అప్పటి ఉమ్మడి తెలుగు ప్రదేశాలకు సంబంధించి, పార్టీకి కేంద్రం విజయవాడే. నాయుడి ప్రోద్బలంతో అక్కడికి వెళ్లడం, పత్రికలో పనిచెయ్యడం అన్నది అప్పటికి రాంబాబు జీవితంలో సహజంగా జరిగే పరిణామం. అయితే తర్వాత ఏం జరిగింది అన్నది చెప్పాలనుకుంటే ఇంకో నవల రాయాల్సి వస్తుంది. ఈ నవల వరకూ అక్కడితో సరిపోతుంది. నేను రాజకీయ విశ్లేషకుడ్ని కాదుగానీ, ఉద్యమంలో వెనుకంజ, ముందంజ, రెండూ ఉంటాయి అన్నంత వరకూ తెలుసు.
ప్రశ్న: ఎందుకంటే ఆ రోజులలో రెండు వర్గాలు ఉన్నాయి. పోరాటవిరమణ చెయ్యాలి అని ఒక వర్గం, పోరాటం విరమించకూడదు, కొనసాగించాని అని ఒక వర్గం. రాంబాబు పోరాటవిరమణ జరిగిన తర్వాత, ఎన్నికలలో పాల్గొనే దిశలో పార్లమెంటరీ రాజకీయాల వైపు నడిచాడు కదా. ఈ క్రమం పార్టీ నడకను కూడా సూచిస్తుందా?
జవాబు: కొంతవరకూ సూచిస్తుంది. ఏందుకంటే, నాయుడు, ‘నేను వ్యక్తిగతంగా పోరాట విరమణకి అనుకూలం కాదు. ఎందుకంటే, ఆ పోరాటంలో మేం సాధించిన విజయాలు, పంచిపెట్టిన భూములూ, ఆస్తులూ వాటిని ప్రజలు పోగొట్టుకుంటారు, భూస్వాములు తిరిగి వచ్చేస్తారు,’ అని అంటాడు. భూస్వాములు ఏదో రూపంలో తిరిగి వచ్చారు కూడా. అందువల్ల, అదొక చర్చనీయాంశంగా పెట్టి వదిలేద్దాం అనుకున్నాను కానీ, ఆ చర్చలోకి అయితే ఈ నవల వెళ్లదు. ఈ నవల యొక్క పరిధి అది కాదు. అప్పటికి అది సరైనదా కాదా అనేది మనం చర్చించుకోవచ్చు. ఆ చర్చ జరగాలి అనే నా కోరిక. ఇంకొక మాట, ఇది రాయడంలో, ఆనాటి పరిస్థితుల పట్ల, ముఖ్యంగా ఇప్పటి యువతరానికి ఎంతో కొంత ఆసక్తి కలగాలి. బర్మా విషయంలో కానీ, రెండో ప్రపంచ యుద్ధం, స్టాలిన్ గ్రాడ్, బెంగాల్ కరువు, నావికుల తిరుగుబాటు, తెలంగాణ సాయుధ పోరాటం – వీటన్నిటినీ వాళ్లంతట వాళ్లు తెలుసుకుని, ఇంకా లోతుగా వెళ్లి చర్చించుకోవడానికి అవకాశం కలగాలి అని అనుకున్నాను. అది జరిగితే సంతోషమే. కానీ, కొన్ని సమస్యలు, రాజకీయ విశ్లేషణ – ఇటువంటివన్నీ ఈ నవలకు బయిటే ఉంచాను కావాలని. కొన్నికొన్ని హింట్స్ అయితే ఉన్నాయి రాంబాబు మాటలలో కానీ, నాయుడు మాటలలో కానీ.
ప్రశ్న: ఆ హింట్స్ నుంచే నేను మాట్లాడుతున్నాను. అంటే, ఆ రోజులలో ఉన్నటువంటి భిన్న పంథాల గురించి కూడా మీరు చెప్పకుండానే ప్రస్తావించారు చాలా చోట్ల. అది ప్రస్తావిస్తూ రాంబాబుని విజయవాడ వైపు ఎందుకు నడిపించారనేది నా ప్రశ్న, అంతే. ఉద్దానంలోనే ఉంటే, శ్రీకాకుళం ఉద్యమానికి మీకు కేరెక్టర్ దొరికేదేమో, దీనికి కొనసాగింపు నవల, దీని సీక్వెల్ నవల ఏర్పడుతుందేమో కదా. విజయవాడ నుంచి ఉద్దానం రావొచ్చు అనుకోండి, పెద్ద దూరమేం కాదు.
జవాబు: జరిగి ఉండునేమో. కానీ, 1952 నుంచి 1966-67 నాటికి అంటే, అది ఇంకా పదిహేనేళ్ల తర్వాతి నాటి మాట. అది ఈ నవల పరిధిలోకి రాదు. అది ఎలా జరిగింది? రాంబాబు, భవానీ, అలాగే నాయుడు ఎటువైపు మొగ్గారు? అనేది పాఠకుల ఊహకు విడిచిపెట్టొచ్చు ప్రస్తుతానికి. ఉద్దానం ప్రాంతం వాడు కాబట్టి, ఇప్పటికే కొంత ఎక్స్ పోజర్ కలిగి ఉన్నవాడు కాబట్టి, ఆయన ఎవరి పక్క నిలబడే వాడు, ఏం లైన్ తీసుకునే వాడు అనేది మనం ఊహించుకోవచ్చు కానీ, అది ఊహకి వదిలేద్దాం అనుకున్నాను.
ప్రశ్న: థాంక్యూ. మంచిమాట చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకొక మాట కూడా మీతో నేను పంచుకోవాలని ఇంది. మిల్లర్ అనే కేరెక్టర్ ఉంది కదా. అతను వామపక్ష ఉద్యమాలలో, యూరప్ నుంచి వచ్చినటువంటి సోషలిస్టు ఉద్యమాలతో దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, స్టాలిన్ ప్రసక్తి వచ్చినప్పుడు అతను ఒక కామెంట్ చేస్తాడు. ‘శ్రామికవర్గాల గొంతు వినబడాలంటే కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండాల్సిందే. కానీ, వాళ్లు అధికారం లోకి వస్తే మాత్రం ప్రజాస్వామ్యం సర్వనాశనం అయిపోతుంది’ అని. ఇది స్టాలిన్‌ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి వ్యాఖ్య. దీన్ని ఎలా చూడాలి? విప్లవం విజయవంతం కావడం అంటే ఏంటి? ఉత్పత్తి శక్తులు నిర్ణాయక పాత్రగా అధికారాన్ని చేపట్టడమే కదా. మరి అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రజాస్వామ్యం సర్వనాశనం అయిపోతుంది అనే స్టేట్ మెంట్ ఏంటి?
జవాబు: మిల్లర్ అనేవాడు బోల్షెవిక్ సానుభూతిపరుడుగా మొదలు పెట్టినటువంటి లిబరల్. ‘నేను సోషలిస్ట్‌ని’ అని స్వయంగా చెప్పుకుంటాడు. అసలు కమ్యూనిస్టుల పాలనను మొత్తంగా తీసుకున్నట్టయితే పోరాడే కమ్యూనిస్టు పార్టీ వేరు, అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ వేరు. ఈ రెండిటికీ పూర్తిగా భిన్నమైన స్వరూపాలు, స్వబావాలు ఉంటాయనేది చరిత్ర ద్వారా మనం తెలుసుకున్న విషయం. సోవియట్ యూనియన్ కావొచ్చు, చైనా కావొచ్చు, ఉత్తర కొరియా కావొచ్చు, కాంబోడియా కావొచ్చు, క్యూబా కొంతవరకూ ఒక ఎక్సెప్షన్ అనుకోవచ్చు కానీ, ఎక్కడా కూడా వాళ్లు విజయవంతంగా ప్రత్యామ్నాయ రాజకీయ పాలనా వ్యవస్థని ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించిన దాఖలాలు లేవు. లిబరల్ వ్యూ కూడా అదే. ఒకప్పుడు వాళ్లు ఎంతో ఉత్సాహంగా సమర్థించిన ఉద్యమం, ఆ సిద్ధాంతాలు ఆచరణలోకి వచ్చేసరికి నిరంకుశత్వం, నియంతృత్వ ధోరణులు పెచ్చుమీరిపోయాయి. వ్యక్తులు జీవితకాల నాయకులుగా అవతరించారు. కమ్యూనిస్టుల పాలనలో భిన్నాభిప్రాయాలకు అవకాశంలేకుండా పోయింది. ఆ దశలో లిబరల్ సెక్షన్ మొత్తం పార్టీ నుంచి దూరం అయింది. వాళ్లు పార్టీ సభ్యులుకాదు కానీ, వాళ్ల సానుభూతిని పార్టీ కోల్పోయింది.
ప్రశ్న: ఇది అంతర్జాతీయంగా జరిగినటువంటి మార్పు. అది భారతదేశంలో ఎలా ప్రతిఫలించింది అని అనుకుంటున్నారు? అంతర్జాతీయమైనటు వంటి ఘటనలే చెప్పారు చెప్పినవన్నీ. అంటే భారతదేశంలో, కమ్యూనిస్టు పాలన ఏర్పడలేదు అనుకోండి. కమ్యూనిస్టు పాలన ఏర్పడినటువంటి ఫెడరల్ సిస్టమ్ లో రెండు మూడు రాష్ట్రాలు అప్పుడప్పుడు కొంతకాలం ఉండటం, అప్పుడు కూడా ఈ ధోరణలు, పార్టీ లోపల కూడా ఇటువంటి ధోరణులు బలపడటం వలన పార్టీలో విభేధాలు, చీలికలు రావడానికి కారణం అవి కూడా అయ్యి ఉండొచ్చు అంటారా?
జవాబు: అంతర్జాతీయ వైఫల్యాల మూలంగా జాతీయ స్థాయి పార్టీలు పూర్తిగా నష్టపోయాయి అనేది వాస్తవం. నిర్మాణరీత్యా కానీ, వాళ్ల చర్యల వల్ల కానీ, కొంతమంది నాయకుల దుశ్చర్యల వల్ల కానీ ఉద్యమం, పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నవి. ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు, చైనా తప్పుదోవలో నడుస్తుంది. సమసమాజం అనేది ఒక నమూనాగా కళ్ల ఎదుట ఇవాళ లేదు. మరోవైపు లిబరల్ సెక్షన్, పార్టీ రాజకీయాల నుంచి దూరం అయింది. అందుకనే మిల్లర్ దొర, ఇండియా వదిలి వెళిపోతూ, జార్జ్ ఆర్వెల్ రాసిన ‘ఏనిమల్ ఫామ్’ పుస్తకం ఇస్తాడు రాంబాబుకి. దాన్ని రాంబాబు ఎప్పుడు చదివాడు, ఎంత వరకూ, ఏ విధంగా అతనికి అది అర్థం అయింది అనేది పక్కన పెడితే, అది కూడా ఒక సింబాలిక్ యాక్ట్ – ఈ నవలకు సంబంధించి.
ప్రశ్న: అలాంటి ప్రతీకలు చాలా తీసుకొచ్చారు మీరు నవలలో. అలాగే, లెనిన్ చెప్పిన మాటలను కూడా పేర్కొన్నారు, చిత్త ప్రసాద్ బొమ్మలు గురించి మాట్లాడుతూ. అలాగే ఫైజ్ అహ్మద్ కవితని కోట్ చేస్తూ, నాయుడుకి, ముస్లిం అమ్మాయి ఫరీదాపై ప్రేమ కలగడం, ఆ ప్రేమ విఫలమవ్వడం, మత కల్లోలాల మూలంగా వాళ్లు విడిపోవడం వంటి ఘటనలు చిత్రించారు- ఇంత చిన్న నవలలో, అంత పెద్ద కాన్వాస్‌ని ఎన్నుకున్నప్పుడు, ఈ నవల ఇంకొంచెం విస్తృతం అయితే మరిన్ని విషయాలు చెప్పగలిగే వారని నాకు అనిపించింది. గాఢత అంటామే, ఆ డెన్సిటీ ఎక్కువ కనిపించింది నవలలో. వీటన్నిటినీ నవలలోకి తీసుకురావడానికి మీరు చాలా కష్టపడ్డారని అనిపించింది. అదే సమయంలో మానవ ఉద్వేగాలకి సంబంధించినటువంటి విషయాలు, రంగూన్‌లో కొత్తగా పరిచయమైన నాయుడు అనే వ్యక్తి, గర్భవతి అయిన భవానీని, ఆమె భర్త రాంబాబునీ తెల్లదారిలో పంపించి, అతను స్వయంగా నానా పాట్లూ పడుతూ నల్లదారిలో ప్రయాణించడం, భార్యా భర్తలు అతని కోసం ఆతృతగా ఎదురుచూడ్డం, భవానీ అతన్ని అన్నయ్యగా భావించడం, ఇదంతా కూడా నాయుడు కమ్యూనిస్టు అవ్వడం వల్లే సాధ్యపడిందని అనిపించింది నాకు. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం చాలా గొప్పగా ఉంటుందని, భవానీ, నాయుడు కలిసినప్పుడల్లా – వాళ్లిద్దరి మధ్యా సోదర-సోదరీ అనుబంధం, వాత్సల్యం చూస్తే ప్రతిసారీ కన్నీరు వచ్చింది నాకు. ఈ మానవీయ ఉద్వేగాలని, ఒక చారిత్రిక నవలలో చాలా బాగా చిత్రించారు. నిజానికి చారిత్రిక నవల కాదిది, ప్రధానంగా రాజకీయ నవల. నేను ఆ ఉద్వేగాలతో, అనుభవాలతో చాలా రిలేట్ చేసుకోగలిగాను. యుద్ధం కావొచ్చు, కరువు కావొచ్చు. అవన్నీ రాజకీయ ప్రేరిత అంశాలే అని మీరు బలంగా చెప్పగలిగారు. ఈ ఉద్వేగాలని తీసుకురావడానికి మీకు ఉన్నటువంటి దృక్పథం, అంటే జీవితం పట్ల ఒక అవుట్‌లుక్ ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. ఇవి, ఈ నవలలోకి రావడం ద్వారా నవలకి చాలా నిండుదనం వచ్చిందని నాకు అనిపించింది. వీటిని రాస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు?
జవాబు: నా వైపు ప్రయత్నం అయితే చేశాను. మీలాంటి వాళ్లు ఈ మాట అన్నప్పుడు, ఆ ప్రయత్నంలో కొంతవరకూ విజయం సాధించానని నాకు అనిపిస్తుంది. అయితే, ఆడా-మగా, వాళ్లమధ్య రొమాన్స్ – విరహం, కలయక – ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి. ఈ నవలకి అది ప్రధానం కాదని నేను అనుకుంటాను. శ్రామికులలో ఏర్పడే సోదరభావం అని అన్నారు కదా, అది అటువంటి వర్గంలో సహజంగానే ఏర్పడిపోతుంది అని చూపించడానికి ప్రయత్నం చేశాను. తర్వాత, ఎప్పుడైతే బర్మాలో, రంగూన్లో ఉండగానే నాయిడు, రాంబాబుని రెడ్ క్రాస్ సంస్థకి తీసుకెళ్లి, ‘ఇతన్ని పంపించండి, ఇతని భార్య గర్భవతిగా ఉంది, నేను తప్పుకుంటాను, తర్వాత వేరే వస్తాను అని చెప్పి పంపిస్తాడో, అప్పుడే రాంబాబు, ‘ఇతడు నిజమైన కమ్యూనిస్ట్,’ అని గుర్తిస్తాడు. ఏదో గొప్ప త్యాగం చేస్తున్నామని వాళ్లెవరూ అనుకోలేదు. అత్యంత సహజంగా చేశారు ఈ పనులన్నీ కూడా. మనుషులుగా వాళ్లు చెయ్యాలి అనుకున్నారు, చేసారు. భవానీ కూడా అంతే, మేమేదో ఉద్ధరిస్తున్నాం, కష్టపడుతున్నాం అని అనుకోలేదు. అటువంటి వ్యక్తుల మధ్యన ఒక అనుబంధం, ఒక సంబంధం పుట్టుకతో కాకపోయినా, వాళ్లు చూస్తున్న సమస్యలు, పడుతున్న కష్టాలలోంచి ఏర్పడుతుంది. నాయుడు, రాంబాబు, భవానీల మధ్య ఆ అనుబంధం ఏర్పడాలి అని బలంగా నేను అనుకున్నాను.
ప్రశ్న: ఆ తరంలో ఉన్నటువంటి ఆదర్శాలు, ఈ తరంలోకి కొనసాగుతున్నాయా? కొనసాగకపోతే కారణాలు ఏంటి? అంటే, కేవలం మానవ సంబంధాలే కాదు. సెక్యులరిజం మతవాదాన్ని అడ్డుకుంటుందని, సోషలిజం పెట్టుబడిని కట్టడి చేస్తుంది అని ఆ తరం నమ్మింది. ఈ రోజున వాటిని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేయడం ఈ నవల ప్రధాన ఉద్దేశంగా నేను భావిస్తున్నాను. మీరు ఎంతవరకూ ఏకీభవిస్తారు?
జవాబు: ఇప్పుడు అవసరమే. గతాన్ని తెలుసుకోవడం, మనం పోగొట్టుకున్న అప్పటి విలువలు, ఆదర్శాలు – వాటిని లోతుగా తెలుసుకుని, మనకి ఉపయోగకరమైనవి ఏమైనా ఉంటే, ఆచరణలో పెట్టడం అవసరమని నేను భావిస్తాను.
ప్రశ్న చరిత్రని ఘటనలుగా కాకుండా. కార్యకారణ సంబంధంగా చూడాలనేది బలంగా చెప్పారు ఈ నవలలో మీరు. అంటే అది బెంగాల్ కరువు కావొచ్చు, మానవ ప్రేరితమైన కరువుగా దాన్ని చెప్పారు. జనరల్ గా ప్రకృతి చేసిన బీభత్సం కంటే, మానవ బీభత్సమే ఎక్కువ అనే విషయాన్ని కరువు విషయంలో, యుద్ధం విషయంలో చెప్పారు. గతంలో జరిగినటువంటి ఈ ఘటనల్ని కేవలం రికార్డ్ చెయ్యడం కాకుండా, అప్పటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి? అప్పుడు మార్పుకి కారణమైనటువంటి శక్తులు, ఆ రోజులలో ఆ మార్పులో భాగంగా ఉండిన వ్యక్తులు ఇవాళ ఎక్కడ నిలబడ్డారు?
జవాబు: నవల యొక్క పరిధిని దాటి మనం చర్చిస్తున్నాం అనిపిస్తోంది కానీ, విషయం ఏంటంటే అనేక ఆభిప్రాయాలు, ఆలోచనలు, ఊహాగానాలు రావొచ్చు. కానీ, ఇది ఓపెన్ టు డిస్కషన్. ఈ నవల స్పష్టంగా ఏదీ చెప్పదు ఈ విషయం మీద.
ప్రశ్న: ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ నావి కాదు సుధాకర్‌గారూ! ‘గతాన్ని తలచి వగచుట ఈ నవల లక్ష్యం కాదు. రెండో ప్రపంచ యుద్ధంతో మానవ సమాజం త్వరితగతిన మారిపోయిందని, ఈ మార్పులను కొన్ని శక్తులు నడిపిస్తున్నాయని, వాటి పట్ల జాగరూకత కలిగి ఉండాలని హెచ్చరించడం దీని ముఖ్య ఉద్దేశ్యం’. ఇవి నా మాటలు కాదు, మీవే!
జవాబు: నేను కాదనడం లేదు. కానీ, ముఖ్యంగా నవలలో ప్రధానమైనటువంటి సంక్షోభాలు – ఒకటి యుద్ధం, రెండోది కరువు. ఈ రెండూ కూడా సామ్రాజ్యవాదం తీసుకొచ్చి మన నెత్తిన మోపినవే. సామ్రాజ్యవాదానికీ, ఫాసిజానికీ వ్యతిరేకంగా అనాడు జరిగిన పోరాటాలలో ఒకపక్క, అంతర్జాతీయంగా సోవియట్ యూనియన్ ఉంది. రెండోది, అమెరికన్ సామ్రాజ్యవాదం ఇంకా బలపడలేదు; బ్రిటిష్ సామ్రాజ్యవాదం వెనకంజ వేసింది. అసలు జపాన్ కూడా సామ్రాజ్యవాద దేశమే కానీ, బ్రిటన్‌తో పోలిస్తే భిన్నమైనది. పూర్తిస్థాయి మధ్యయుగ భూస్వామ్య దేశం జపాన్. బ్రిటన్‌ది ఒక ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ. ఈ తేడాను గురించి రాంబాబు బావ టైలర్ కనకరాజు వివరిస్తాడు. కనకరాజు పాత్ర చాలా కీలకమైనది – నవలకు నేపథ్యాన్ని ఏర్పరచడంలో. అతనేం చదువుకున్న వాడు కాదు కానీ, ఆయన జీవితానుభవాల నుంచి తెలుసుకున్న విషయాలు ఎన్నో చెప్తుంటాడు, రాంబాబుకి. అయితే దానికి కొనసాగింపుగా ఇదే నవల నుండి మనం చెప్పుకోవాలంటే, మిల్లర్, అతని భార్య లీసాల మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకోవాలి. ‘ఇప్పుడుగనక మార్క్స్-ఏంగెల్స్‌లు మానిఫెస్టోని మళ్లీ రాస్తే, ‘ఆసియా ఖండాన్ని భూతం ఆవహించిందని రాస్తారు,’ అని వాళ్లు అనుకుంటారు, ఛలోక్తిగా. వాళ్ల అబ్జర్వేషన్‌ల్ లోతైన నిజం ఉంది. యూరప్‌లో వస్తాయి విప్లవాలు ఆసియాలో రావడం మొదలుపెట్టాయి. ఎవరూ ఊహించని విధంగా వర్గపోరాటాల యుద్ధభూమి స్థలమార్పిడి చెందింది. వాటిని నిలువరించే బాధ్యత – రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి – బ్రిటన్ చేతిలోంచి అమెరికా చేతిలోకి వెళ్లిపోయింది. మిల్లర్ ఆ మాట కూడా చెప్తాడు. ఇవన్నీ అంతర్జాతీయంగా జరిగిన కీలకమైన పెనుమార్పులు. మరోపక్క జాతీయంగా, స్థానికంగా జరుగుతూన్న పోరాటాలున్నాయి. బోస్‌లాంటి ప్రముఖ నాయకుడు ఉన్నాడు, అత్యున్నత జాతీయ నాయకుడిగా గాంధీజీ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య పోరాటం నడుస్తోంది. ఆ దశాబ్దంలోనే క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఆనాటి సామ్రాజ్యవాద వ్యతిరేకత పోరాటాలకు ఎన్నో ఆప్షన్స్ ఉండేవి. స్థానికమైన భూస్వామ్య శక్తులు, సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన శక్తులు అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ వర్గాల ఆధిపత్యం ఎటుపక్క తిరిగింది అనేది మనం చూశాం – మన దేశంలోనూ, అలాగే పాకిస్తాన్‌లో కూడా. ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక్కోసారి పెత్తందారీ శక్తులతో కలుస్తూ, ఒక్కోసారి వ్యతిరేకిస్తూ రకరకాలుగా చీలిపోయింది. ఆ ప్రమాదం, ఉద్యమాలను అవసరానికి వాడుకొని వదిలేసే పాలకవర్గాల నుండే ఉంటుంది. ఆ ప్రమాదంలోంచి బయటపడుతూనే, పాలకుల నాలుగు స్తంభాలాటలో ఇరుక్కుపోకుండా, స్వయంగా ప్రత్యామ్నాయాలను, మాస్ బేస్‌ను సృష్టించుకోవాల్సి ఉందని నాకనిపిస్తోంది. ఈ ఫంథానే కరెక్టు, ఇది కరెక్ట్ కాదు అని అనుకోవడానికి నాకు అంత కన్విన్సింగ్ గా లేదు. ఎందుకంటే, పార్లమెంట్ వ్యవస్థ ఉంటుంది, మీడియా ఉంటుంది, మేధావులు ఉంటారు, చర్చలు ఉంటాయి, యూనివర్సిటీలు ఉంటాయి. ఎక్కడికక్కడ పోరాటాలు జరుగుతూనే ఉంటాయని నేననుకుంటాను. మన దేశంలాంటి విశాలమైన, విభిన్నమైన దేశంలో ఉద్యమాలకు, పోరాటాలకూ కూడా మల్టిప్లిసిటీ (బహుళత్వం) ఉండాలి అని నా ఉద్దేశ్యం. అనేక స్థాయిలలో, అనేక రకాలుగా, అనేక ప్రదేశాలలో – అవసరాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి వివిధ రకాల పోరాటాలు, ప్రొటెస్టులు జరుగుతూనే ఉంటాయి అని నేను అనుకుంటాను.
ప్రశ్న: ఒక చిన్న హైపోథెసీస్. రాంబాబుని దళితుడిగా చిత్రీకరించారు మీరు. రాంబాబు దళితుడు కాకుంటే, అతను అగ్రవర్ణంలో పుట్టి ఉంటే బర్మా వెళ్లేవాడా? లేక ఇక్కడే అతనికి మంచి ఉపాధి అవకాశం దొరికేదా? అంటే అతను ఎస్.ఎస్.ఎల్.సి పాస్ అయ్యాడు. 1930లలో ఎస్.ఎస్.ఎల్.సి. పాస్ అయినటువంటి వాళ్లకి, ఇక్కడ అతనికి ఉపాధి లభించకపోవడానికి అతని కులం కూడా ఏదైనా కారణం అయి ఉంటుందా? మీరు ఆ దృష్టితో ఏమైనా ఆ కేరెక్టర్ని దళితుడిగా పెట్టారా? లేదా సామాన్యుని జీవితం నుంచి చూస్తున్నారు కాబట్టి మీరు అతన్ని దళితుడిగా చూపించారా?
జవాబు: లేదండి. రాంబాబు ఎస్.ఎస్.ఎల్.సి పాస్ అయినప్పటికీ అతనికి అవకాశాలు రాలేదు. అతని ఫ్రెండ్ ఒకరు ఉంటాడు, పట్నాయక్ అని. వాళ్లిద్దరికీ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అంటే ఆసక్తి. పట్నాయక్ అనేవాడు మద్రాస్ వెళ్లి డిప్లోమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేస్తాడు. రాంబాబుకి కూడా సీట్ వచ్చేదేమో, అప్లై చేసిఉంటే. కానీ, మద్రాసు పంపించి చదివించేంత స్తోమత వాళ్లకి లేదు. అంచేత, ఏదో ఒక పని చేసుకోవాలి అని అప్పుడే అనుకుంటాడు. అతని ఇంట్రెస్ట్ కొద్దీ మెకానిక్ అవుతాడు. అప్పుడు రిజర్వేషన్లు లేవు. అందువల్ల వీళ్లకి అవకాశాలు ఉండే అవకాశం తక్కువ. ఇన్స్టిట్యూట్స్ కూడా పెద్దగా లేవు. విద్యా సంస్థలు కూడా చాలా తక్కువగా ఉండేవి. పై ఊరు వెళ్లి చదువుకోవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.
ప్రశ్న: ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ రాంబాబు బర్మా వెళ్లాడు. అప్పటి రోజులకి, ఇప్పటి ఉపాధి అవకాశాలు, మెరుగైనటువంటి జీవితం కోసం అమెరికా వెళ్తున్న వలసలకీ తేడాలు, పోలికలు మీరు ఎలా చూస్తారు?
జవాబు: విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యం ఇవన్నీ కూడా శ్రమ మీద పెట్టుబడి చేసే ఒత్తిడికి స్పందనలు. ప్రపంచీకరణ తరువాత, పెట్టుబడి చేతుల్లో శ్రమ పూర్తిగా కమోడిటైజ్ అయిపోయింది. ఇందువల్ల కేపిటల్‌కి ఎంట్రీ, ఎగ్జిట్ ఆప్షన్లు పెరిగిపోయాయి. శ్రమకి అభద్రతని కల్పించారు; అదే వాళ్ల బలం. ఇటువంటి స్కిల్ ఉన్నవాళ్లు నాకు వందమంది కావాలి అంటుంది, పెట్టుబడి. సి ప్లస్ ప్లస్ లేదా జావా వచ్చిన వాళ్లు ఒక ముప్పయి మంది కావాలంటుంది. సి ప్లస్ ప్లస్, జావా వచ్చి, మేల్ నర్స్ అయిన వాళ్లు ఒక 50 మంది కావాలంటుంది. ఈ మూడూ వచ్చి, వెటర్నరీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు అయితే మంచిది, ఆడవాళ్లు అయితే మరీ మంచిది అంటుంది. దానికి మనం సిద్ధపడతాం; అమీర్‌పేట్ వెళ్లి ట్రైనింగ్ అయిపోతాం. అవసరం మనది కాబట్టి. ఈలోగా మనకి పోటీగా వేరే దేశం నుంచి కూడా వస్తుంటారు. వాళ్లని కూడా ఎదుర్కోవాలి మనం. అంచేత మన చదువు, మన నైపుణ్యాలు ఇవన్నీ కూడా కేపిటల్ యొక్క అవసరాలు తీర్చడం కోసమే. పెట్టుబడి సంక్షోభంలోకి వెళితే మన అవకాశాలు కూడా పోతాయి. అంచేత అది ఉండాలి, కొనసాగాలి అనే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మనకి. అలాగే బంగ్లాదేశ్ వాళ్లో, చైనా వాళ్లో వచ్చి మన ఉద్యోగాలు కొట్టేస్తున్నారు, వాళ్ల ములంగా మనం నష్టపోతున్నాం, చైనావాళ్లు కూడా ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకుంటున్నారు. ఇటువంటి కంప్లైంట్స్ వస్తుంటాయి. ఎందుకంటే లేబర్ రిక్వైర్మెంట్ అనేది కేపిటల్ అవసరాలని బట్టి రూపాంతరం చెందుతూ ఉంటుంది. నిరుద్యోగం కొనసాగడం పెట్టుబడికి అవసరం. శ్రామికుల మధ్య పోటీ ఉన్నప్పుడే పెట్టుబడి బలంగా నిలబడి, శ్రమని నిర్దేశిస్తుంది. నీకింతే ఇస్తాము, పదేళ్లు పని చేస్తే నీకింకేదో ఇస్తాము, అని ఏదో ఒకటి చెప్తారు. నువ్వు కాకపోతే ఇంకొకడు ఉన్నాడు మాకు అని కూడా బెదిరిస్తారు. వాళ్లు నష్టపోయినప్పుడు కంపెనీ మూసేస్తారు. మళ్లీ మనం రోడ్డున పడతాం. ఇదంతా ఎక్కడైనా జరుగుతుంది. ఈ సందర్భంలో ఒక మాట చెబుతాను. పెట్టుబడి, శ్రమ, నిరుద్యోగం – ఈ మూడింటికీ ఉండే సంబంధాన్ని చర్చిస్తుంటే ఒకసారి ఒక మిత్రుడు – ‘మేం లేబర్ ఎలా అవుతాం? మేం ఇంజినీర్లం. లేబర్ వేరు,’ అన్నాడు. ‘లేబర్ అనే మాట ఇష్టం లేకపోతే, హ్యూమన్ రిసౌర్స్ అని అందాం,’ అన్నాను. ‘అది బాగుంది,’ అన్నాడు. పేరేది పెట్టుకున్నా సరే జరుగుతున్నది ఒక్కటే. శ్రమ – పెట్టుబడి – ఉద్యోగావకాశాలు, సంపద సృష్టించడం. ఇవన్నీ మూలసూత్రాలు. ఇవి మాత్రం మారవు.
ప్రశ్న: అయితే, తమ శ్రమ దోపిడీకి గురవుతుందనేది గ్రహించేటటువంటి చైతన్యం ఈ కొత్త వలసలలో ఉందా?
జవాబు: ఒక్క మాటలో చెప్పాలంటే – లేదు. అందుకు పెద్ద సంక్షోభం రావాలి. వస్తుంది కూడా. సంక్షోభాలు పెట్టుబడిదారీ విధానంలో అంతర్భాగం.
ప్రశ్న: ‘నేను ఇంజినీర్‌ని, లేబర్‌ని కాదు,’ అని మీ మిత్రుడు అన్నారు. అంటే, ఉత్పత్తి విధానాలు కూడా మారాయి. దోచుకుంటున్నటువంటి పద్ధతులు మారాయి అని కదా! దోచుకోబడుతున్న వాళ్లకి, ఇలా మనం దోచుకోబడుతున్నామే అనే విషయం గ్రహింపుకి వచ్చే అవకాశం ఉందా? అంటే మొత్తం మారిపోయింది. పాత కమ్యూనిస్టు సూత్రాలలో ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి వలసల్ని, పెట్టుబడుల్ని, శ్రమని చూడగలుగుతామా?
జవాబు: స్థూలంగా చూస్తే, అదేం మారలేదు. కానీ, ఒక మాట నేను చెప్తాను. కేపిటల్ నేర్చుకున్నంత చక్కగా శ్రమ నేర్చుకోలేదు. కేపిటల్ చాలా నేర్చుకుంది, చాలా ముందుకు పోయింది. ఎప్పుడు ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో వాళ్లు కనిపెట్టుకున్నారు. తర్వాత శ్రామికవర్గాల పోరాటాల ద్వారా వాళ్లలో కొన్ని సర్దుబాట్లు, సవరణలు, వ్యూహాల్లో మార్పులు వచ్చాయి. అది కూడా ఈ నవలలో ప్రస్తావిస్తాను ఒకచోట. దాన్ని ఇంకా రిఫైన్ చేసుకోవడానికి అవి వాళ్లకే ఉపయోగపడ్డాయి. కానీ, శ్రమవైపు అంతగా నేర్చుకున్నట్టు కనబడ్డం లేదు నాకు. ‘ఇది నిజంకాదు, మీరు పొరబడ్డారు, ఇవాళ వాళ్లు చాలా నేర్చుకున్నారు,’ అని మీ బోటివాళ్లు చెబితే సంతోషిస్తాను.
ప్రశ్న: అంటే దానికి పార్టీల వైఫల్యం ఏమైనా కారణమంటారా? లేదా ఎదుటి బలం ఎక్కువైందంటారా? ఎలా చూడాలి?
జవాబు: బలం ఒకసారి ఒక పక్షానికి ఎక్కువ అయితే, ఒక్కోసారి తక్కువ అవుతుంది. అసలు యుద్ధ వాతావరణం ఇదంతా. మనం మాట్లాడుతుందంతా యుద్ధానికి కొనసాగింపే. కొన్నిసార్లు ఒకరిది పై చెయ్యిగా ఉంటుంది, ఒకరిది కింది చెయ్యిగా ఉంటుంది. ఇదంతా మామూలే. కానీ, అసలిప్పుడు మారుతున్న పరిస్థితులను సరిగా అంచనా వెయ్యడం ఒకటి, రెండోది దానికి తగినటువంటి వ్యూహం రూపొందించడం. ఈ రెండు విషయాలలోనూ, ఎవరినీ బ్లేమ్ చెయ్యడటం నాకు ఇష్టం లేదు కానీ, కొన్ని కొన్ని వైఫల్యాలు జరిగాయి. ఇది శ్రమవైపున జరిగిన వైఫల్యం. అంటే పెట్టుబడికి విజయం అన్నమాట.
ప్రశ్న: మీ నవలలో ఫైజ్‌ని తీసుకొచ్చారు, చిత్త ప్రసాద్‌ని తీసుకొచ్చారు, చిత్త ప్రసాద్ బొమ్మల వెనుకున్నటువంటి తాత్వికతని తీసుకొచ్చారు, అలాగే అక్కడ ఒక చిత్రకారుడి ఇంటికి వెళ్లి అక్కడ బొమ్మలు కొనుక్కోవడం, ఇవన్నీ, బెంగాల్ వాతావరణం, ఈ నవలలో రాజకీయ నేపథ్యం చూపించడంతో ఆగిపోకుండా సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా చక్కగా పట్టుకోగలిగారు. దీని ద్వారా నవలకి ఒక రూపపరమైన అందం కూడా ఏర్పడింది. ఒకచోట ‘కవులైనా, విప్లవకారులైనా మొదట ప్రేమికులై ఉండాలి,’ అంటారు. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా నవలలో ఇమిడేటట్టు చెయ్యగలిగారు. దీనికి ఎలా స్కీమ్ ఏర్పాటు చేసుకోగలిగారు మీరు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరెంతో ఆలోచన చేసి ఆ నవల రాసేరు. కనిపించేది ఈ నూట ఆరవై పేజీలే కానీ, దీని వెనక కొన్ని వేల పేజీల పరిశోధన ఉంది అని అనిపించింది. అలాగే, ఆనాటి వలస కార్మికుల ప్రయాణాల గురించి, ఆ తెల్లదారి, నల్లదారికి సంబంధించిన పరిశోధన కూడా చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ పరిశోధన ఎలా జరిగింది? ఇంత పెద్ద విషయాన్ని, ఇంత చిన్న ఫ్రేమ్ లోకి ఎలా ఇమడ్చగలిగారు?
జవాబు: ఈ పరిశోధన అనేది ఎంతో కాలంగా సాగుతున్నది. అవకాశం దొరికినప్పుడల్లా రెండవ ప్రపంచ యుద్ధం గురించి కానీ, స్టాలిన్ గురించి కానీ, లేదంటే పార్టీ విషయాలు కానీ, జపాన్ యుద్ధాలు కానీ, జపాన్ వాళ్ల పాత్ర కానీ దాదాపు ఇరవై, ముప్పయి ఏళ్లుగా చదువుతూనే వస్తున్నా. ఈ నవల గురించి మాత్రం ప్రత్యేకంగా ఒక ఏడాదిన్నర పాటు చదవడం, చర్చించడం, కొంతమందితో మాట్లాడటం జరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు కెప్టెన్ లారీ వాళ్ల నాన్నగారి గురించి బర్మా కథలు చెప్పడం, భీమిలి కథలు చెప్పడం అవి నాకు మంచి మార్గం చూపించాయి. గత ఏడాదీ, ఏడాదిన్నర నుంచీ ఇంకా నిర్దిష్టంగా పరిశోధన జరిగింది. పరిశోధన చేశాంకదా అని మొత్తం తీసుకెళ్లి నవలలో ఎక్కించ కూడదు. ఎంతవరకూ వివరాలు ఇవ్వాలి అంటే కథని ముందుకు తీసుకెళ్లేవరకూ ఇవ్వాలి. ఎక్కడ విడిచిపెట్టాలంటే, ఎవరికైనా ఆసక్తి కలిగితే ఇంకొంచెం ముందుకు వెళ్లే అవకాశం ఉండేటట్టుగా విడిచిపెట్టాలి. ఇప్పుడు ఫైజ్ ప్రస్తావన ఉంటుంది. మఖ్దూం ప్రస్తావన ఉంటుంది. ఎవరు వీళ్లంతా అని ఎవరైనా అనుకుంటే వాళ్లు వెళ్లి చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. అలాగే, చిత్త ప్రసాద్ ప్రస్తావన ఉంటుంది. వాళ్ల యొక్క మానిఫెస్టేషన్స్ మాత్రమే ఈ నవలలో ఉంటాయి. వాళ్ల చరిత్ర ఉండదు. వాళ్లు ఏ ప్రాసెస్ లో అక్కడికి వచ్చారనేది ఉండదు. అది ఎవరి మటుకు వాళ్లు వెతుక్కుని తెలుసుకోవాల్సిందే. అలాగే, ఖాన్ అనే వ్యక్తి ఒకడు ఉంటాడు. అసలు అతను ఈ నవలలో చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. అతను బర్మా కమ్యూనిస్టు పార్టీ కోసం పని చేస్తున్న వ్యక్తి. బర్మా కమ్యూనిస్టులు, బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా అడవులలో సాయుధ పోరాటం చేస్తున్నవాళ్లు. అందువల్ల ఆయనకి అనుభవం ఉంది. కానీ, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిపోయాడు. అక్కడ చాలా కాలంగా ఉంటున్నాడు, వాళ్లతో పని చేస్తున్న వ్యక్తి. అక్కడి నుంచి ఇండియా వచ్చి, ఇక్కడ వీళ్లతో చేరుతాడు. అదొక అంశం. కొన్నికొన్ని ఎక్కువగా చెప్పలేకపోయినా – ఈ కథ నడిపించడానికి ఇది అవసరం అనిపించడం వల్ల చెప్పాను. ఆసక్తి ఉన్నవాళ్లు ఇంకొంచెం ముందుకు వెళ్లి తెలుసుకోవచ్చు. పరిశోధన చెయ్యొచ్చు. ఆ సాధనాలు అవీ మనకి ఉన్నాయి.
ప్రశ్న: అందుకనే గాంధీ మరణం, నేతాజీ మరణం కూడా అలా ప్రసక్తమయి వెళ్లిపోయాయి తప్పితే, వాటిని మళ్లీ లోతుగా వెళ్లి చూడటానికి మీరు ప్రయత్నించలేదు. అది కథకి ఆటంకం అవుతుందని కూడా భావించినట్టున్నారు.
జవాబు: ఈ నవల రాసినప్పుడు నేను ఎదుర్కొన్న పెద్ద సమస్య విస్తరణ కాదు; నన్ను నేను నియంత్రించుకోవడం. లేకపోతే అత్యుత్సాహంతో అదీ, ఇదీ రాసానంటే నవల కాస్తా పరిశోధనా గ్రంథం అయిపోతుంది. అది ఒక కథగానే ఉండాలి, నెరేటివ్ గానే సాగాలి అనుకున్నాను. అంచేత, చాలా కంట్రోల్డ్ గా చేసిన పని అది. నిజానికి మూడు ఛాప్టర్లు తొలగించాను. అవి సరిగ్గా ఇమడ్డం లేదు అనిపించింది.
ప్రశ్న: నాయుడు, ఫరీదాల మధ్య స్నేహమూ, ప్రేమా, ఆ తర్వాత మత కలహాల కారణంగా వాళ్లు విడిపోవడం, అతను ప్రత్యేకంగా ఉర్దూ నేర్చుకోవడం ఇదంతా కూడా, ఈ రెండు కమ్యూనిటీల మధ్యా ప్రేమను చూపించడం ద్వారా – అంటే ఇప్పుడు ‘ద్వేషం బజార్లో నిలబడి ప్రేమను పంచాలి, ప్రేమ దుకాణం తెరవాలి’ అనేటువంటి ఇప్పటి నినాదానికీ అవసరానికీ అనుగుణంగా సృష్టించినటువంటి పాత్రలేనా అవి?
జవాబు: అవునండి. దానిలో సందేహం లేదు. నాయుడు మెటియాబురుజ్‌లో ఉందామని అనుకున్నప్పుడు, రాంబాబు అంటాడు – ‘అదంతా ముస్లిం ఏరియా కదా, అక్కడికి ఎందుకు వెళ్తున్నావ్?’ అని. ‘ఎవరైతేనేం, మనకేంటి?’ అంటాడు నాయుడు. నేను కలకత్తాలో కొంతకాలం ఉన్నాను. నాకు చాలా ఇష్టమైన నగరం. ఎన్నో కారణాల వల్ల. అయితే, దాన్ని కూడా చూపించాలి అని ఒక స్వార్థం అనుకోండి, ప్రేమ అనుకోండి, మీ ఇష్టం. కలకత్తాలోని చాలా ప్రదేశాల యొక్క ప్రస్తావన ఉంటుంది.
ప్రశ్న: చివరిగా తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి మాట స్వీకరిస్తాన్నేను. ‘చరిత్రలో కొన్ని మర్చిపోవాలి, కొన్ని గుర్తు పెట్టుకోవాలని ఒక ప్రసిద్ధ ఇరాకీ రచయిత అంటాడు.’ ఈ నవల ద్వారా మనం మర్చిపోవాల్సినవి ఏమిటి? గుర్తు పెట్టుకోవాల్సినవి ఏమిటి? నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి?
జవాబు: గుర్తు పెట్టుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అది, ఇందాక మనం అనుకున్నట్టు ఈ సంక్షోభాల్ని సామ్రాజ్యవాదం ఎలా తీసుకొచ్చి, రకరకాల సమాజాల మీద మోపుతుంది, వాళ్లని ఎలా బాధితుల్ని చేస్తుంది, అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ రోజులలో అది ఎలా రూపాంతరం చెందింది, దాని కొనసాగింపు ఏ విధంగా ఉంది అనేది ముఖ్యమయిన విషయం. ‘ఇంత క్రూరమైనటువంటి వ్యవస్థ ఎలా ఏర్పడింది? అంతమంది దాని మూలంగా సామాన్యులు ఎలా బాధితులుగా మారారు? ఎన్ని అవస్థలు పడ్డారు? దానిని ఎక్కడో చోట ఎలా అడ్డుకోవాలి?’ అనే ప్రశ్నలు పాఠకులకు కలగాలి అని నేను అనుకుంటున్నాను. అయితే, దానికి ఏం చెయ్యాలి? అనేది ఎవరి మటుకు వాళ్లు ఆలోచించుకుని, చర్చించుకుని, రేపు పొద్దున్న డైవర్జన్స్ లోంచి కన్వర్జన్స్ మోడ్ లోకి రావాలి, ఈ ఆలోచనాపరులు, ఇటువంటి ఆచరణ కోరుకునే వాళ్లు, ఇటువంటి సమాధానాలు, పరిష్కారాలు కోరుకునే వాళ్లు, వీళ్లందరిలో కూడా ఒక కన్వర్జన్స్ వస్తుంది, ఒక కామన్ గోల్ వైపు ప్రయాణం చేస్తారు – అని ఎక్కడో ఒక ఆశాభావం ఉంది నాకు. అది ఇవాళ కాకపోతే, రేపు అయినా జరుగుతుంది. ఇప్పుడైతే ముక్క చెక్కలైనట్టుగా ఉంది కానీ, అది త్వరలోనే మారుతుంది, ఆ మార్పుకి శత్రువు కూడా తోడ్పడతాడు. ఇవాళ్టి పరిస్థితులలో ప్రగతిశీలశక్తులు విభేదాలను మర్చిపోయి, ఐక్యత మీద, బహుముఖ ఆచరణమీద దృష్టి పెట్టాలంటాను.
గమనిక:
1. ‘చెదరిన పాదముద్రలు’ నవలను కొనడానికి: https://www.telugubooks.in/products/chedarina-paadamudralu
2. రచయితతో ఆడియో ఇంటర్వ్యూ వినడానికి:
(ఈ సంభాషణని ఇలా అందించడానికి సహకరించిన ‘హర్షణీయం’ అనిల్ కీ, మణిదీప్ కొవ్వాడకీ కృతజ్ఞతలు)