ఎవరో తరుముతున్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చిన విక్కీ కదులుతున్న కామారెడ్డి బస్సును ఎక్కిండు. ఎగపోస్తూ ఒకసారి బస్సంతా కలియ జూసిండు. సగంకు పైగా ఖాళీగానే ఉంది. వెళ్లి చివరి సీట్లో కూర్చుండు. భయం భయంగా ఒకసారి కిటికిలోంచి బయటకి చూసిండు. తెలిసిన వారు ఎవరూ కనిపించలేదు.
బస్సు వేగాన్ని అందుకుంది. గట్టిగా దమ్ము పీల్చుకుని సీట్లో జారి కళ్లు మూసుకున్నడు. ఎంత స్థిమితంగా వుందామనుకున్నా గుండె దడగానే వుంది. ఏడాది జీవితం కళ్లముందు కదిలింది.
‘బావ వచ్చాడా..? అక్క ఎక్కడుంది…? అమ్మ ఏం చేస్తుంది..? నాకోసం వెతికారా…?’ విక్కీలో ఎన్నో ప్రశ్నలు. ఆలోచిస్తూనే జేబును తడిమి చూసుకున్నాడు. నోట్లకట్ట ఎత్తుగా తగిలింది. వీర ప్రతాప్ సార్, సునిత మేడమ్, రాజుడాక్టర్, శారదమ్మ, నారాయణరెడ్డి అంకుల్…. అందరు గుర్తుకొచ్చారు.
‘వాళ్లు తనకొరకు వెతుకుతున్నారా….?’ ఈ ఆలోచన రాగానే వెన్నులో వణుకు మొదలయింది.
‘విషయం వాళ్లకు తెలువకముందే ఊరుదాటాలి. లేకుంటే ప్లాన్ పాడవుతుంది. అనుకున్నాడు. అప్పుడే భుజం మీద చెయ్యి పడింది. ఉలిక్కిపడి తలెత్తి చూసిండు విక్కీ. ఎదురుగా కండక్టర్. కొద్దిగా తేలిక పడి జేబులోంచి ఐదువందల నోటును తీసి ఇస్తూ ‘గొల్లపల్లి’ అన్నాడు. అదెక్కడున్నది అన్నట్టుగా కొద్దిగా అనుమానంగా చూసిన కండక్టర్ లిస్ట్ లో పేరు చూసుకుని టికెట్ ఇచ్చి చిల్లర ఇచ్చిండు.
‘అదేంది… రెండువందల డెబ్బయి కదా… మూడువందలు తీసుకున్నవు…’ అడిగిండు విక్కీ.
చురుగ్గా చూసిన కండక్టర్ ‘అది యాడాదికింద. ఇప్పుడు రేట్లు పెరిగినయ్’ అన్నడు.
‘గొల్లపల్లికి ఎప్పుడు చేరుకుంటం’ అడిగిండు విక్కి.
‘ఎక్కింది ఇప్పుడేగదా… ఎనిమిదయితుంది. పొయ్యేవరకు పొద్దుగూకుతది’ అంటూ ముందుకు నడిచిండు.
సీట్లో వెనక్కువాలి కళ్లు మూసుకున్నడు విక్కీ. ఎన్నో ఆలోచనలు. ‘గొల్లపల్లి నాలుగు వరకు చేరుకుంటే బాగుండు. ఐదింటికి బడి బస్సు దొరుకు. ఈ గంటలోపల అమ్మకు అక్కకు బావకు బట్టలు కొంటుంటి. రేపే దీపావళి కదా’ అనుకున్నడు.
వెంటనే మరో ఆలోచన వచ్చింది. ‘ఎప్పుడు చేరినా సరే. బట్టలు కొనుక్కుని ఆటో తీసుకుని ఇంటికి పోవాలే. కొత్తబట్టలు లక్షరూపాయలు అమ్మచేతిల పెట్టాలి. అప్పుడు చూడాలె అమ్మ ఏమంటదో. చెప్పా పెట్టకుండా ఏడాది కనబడకుండా పోయినందుకు ఏడుస్తుందా… ఒక్కసారన్నా ఫోన్ చెయ్యనందుకు తిడుతుందా… డబ్బు తెచ్చానని మెచ్చుకుంటుందా… ఏమంటుందో చూడాలె’ అనుకున్నాడు.
ఒక్కసారిగా తల్లిరూపం కళ్లముందు మెదిలింది. తండ్రి బాగా అప్పులు చేసి ఎటో వెళ్లిపోయిండు. ఐదారేండ్లవుతుంది. ఉన్నడో లేడో కూడా తెలువది. చిన్న గుడిసె నీడ తప్ప ఆస్తులంటూ ఏమిలెవ్వు. తల్లి ఏడుస్తూ తండ్రి కోసం ఎదురు చూసింది. రాడని రూడీ చేసుకున్నంక బతుకువేటలో పడింది. చెయ్యని కూలీ లేదు. మొయ్యని తట్టలేదు. అప్పులను అసలుకు అసలు సగం దాకా తీర్చడానికే ఏండ్లు పట్టింది. అప్పుడే కూతురుకు సంబంధం వచ్చింది. చేతిల పైసలేదు. అవతల అప్పు పుట్టలేదు. అయినా ధైర్యం చేసింది. అటో ఇటో పెళ్లయితే చేసింది కాని కట్నం పైసలు బాకీ పడ్డది. ఇయ్యాల్ల రేపని నెలలు గడిపింది.
దీపావళి వచ్చింది. ఆరోజు బాగా గుర్తు విక్కికి. అక్క బావ వచ్చిండ్రు. బావతో వాళ్లక్క రజిత కూడా వచ్చింది. పండగ నాడు రోజంతా ముభావంగానే ఉన్నడు బావ. పటాకులు కాలుద్దామని పిలిచినా రాలేదు. అక్క కూడా ఎందుకో బాధగానే ఉంది. బావను ఏదో బతిలాడుతుంది. ఎవరు లేనప్పుడు తోడుగా వచ్చిన రజిత తమ్ముడికి ఏదో నూరిపోస్తుంది. తల్లి అటూ ఇటూ తిరుగుతుంది. అప్పుడప్పుడు బయటకు వెళ్లి నీరసంగా తిరిగి వస్తుంది. ఆ రోజు రాత్రి కూడా భోజనం చెయ్యలేదు బావ.
తెల్లారింది. ఒక్కడే వెళ్లిపోతానంటున్నాడు బావ. నేనుకూడా వస్తానంటుంది అక్క. బావ ఒప్పుకోవడం లేదు.
‘ఒక్క ఆరు నెళ్లు ఆగు బాబు… ఒక్క పైస వోకుంట తేర్పుత…’ బతిమాలింది తల్లి. ‘సరే… ఇప్పుడు నేనేమంటున్న… ఆరు నెలలకే వచ్చి తోలుకపోత తియ్యి…’ కోపంగా అన్నాడు బావ.
‘మేము తెలువక బోర్లపడ్డం. ఇసొంటోల్లని తెలిస్తే ఇంటి దిక్కే రాకపోతుంటిమి. ఊరినిండ అప్పులే. ఇగ మాకేమిత్తరు… ఎన్నడిత్తరు’ దెప్పిపొడిచింది రజిత.
‘బాంచెను బిడ్డా… కాళ్లుమొక్కుత. మీ పైసలు పూలల్ల పెట్టి తేర్పుతగని జర ఊర్లె ఇజ్జత్ తియ్యకుండ్రి.’ ఇద్దరి కాళ్లు మొక్కింది తల్లి.
‘మీకు ఇజ్జత్ గూడా ఉందా. అదుంటే నాపైసలు ఎన్నడో ఇత్తురు. మీరో మనుసులు మీదో బతుకు… థూ…’ గట్టిగా ఊంచాడు బావ మల్లేశం. విక్కికి కోపం వచ్చింది.
‘బావా…. సూడూ…’ అంటూ ఏదో అనబోయాడు. తల్లి నోరు నొక్కింది.
మల్లేశం అగ్గిమీద గుగ్గిలమయ్యిండు. ‘ఏందిరా… ఉన్నదున్నట్టంటే లావు రేషం రావట్టె. అంత రేషమున్నోనివైతే పైసలు పారెయ్… తెలివి తక్వో ఆకలెక్వో…’ అన్నాడు.
వెంటనే రజిత అందుకుని ‘పోరడు జూసినావు… బావ మీదికే మర్రవడుతుండు. పెద్దలేదు చిన్నలేదా… ఇంత కావురమా… వీల్లకు మర్యాదగూడ తెలువనట్టుంది. వామ్మో ఇక్కడనే ఉంటే కొట్టి సంపేట్టున్నరు.’ అంటూ తమ్మున్ని ఎగేసింది. మల్లేశం ఇంకా గాయికెత్తుకున్నడు. తిట్టరాని తిట్లు తిట్టి అరిచి గీపెట్టి తినకుండానే వెళ్లిపోయారు.
అక్క అమ్మ ఏడుస్తూ కూర్చున్నరు. జమయిన చుట్టుపక్కలవాళ్లు చోద్యం చూస్తూ నిలబడ్డరు.
‘ఇదంత నీవల్లనే… నేను ఎట్లనో బతిమాలి కాళ్లు మొక్కుతుంటి… ఇప్పుడు జూడు ఎంత కథనో’ అమ్మ అన్నది బాధగా.
‘నేనేమన్న… ఆయిన్నే ఎగిరి దుంకవట్టె… వాళ్ల పైసలు వాళ్లకు పారేద్దాం…’ కోపంగా అన్నడు విక్కీ.
‘నీ బొంద… బస్సు కిరాయిలిద్దామని ఐదువందల కోసం మూడు రోజులనుంచి అప్పు కోసం తిరుగుతున్న. అయినా ఎక్కడ పుడుతలెవ్వు. లక్ష రూపాయలు యాడ తెస్తవు…? ఏడుపు అందుకుంది అమ్మ. అక్క లలిత కూడా ఏడుస్తుంది.
‘ఏడువకు బిడ్డా… రేపు పొద్దున్నే తోలుకపోయి ఏదో బతిలాడి తోలేసి వత్త.” తల్లి సముదాయించింది. పొద్దు గూకేదాక తిరిగి రెండురోజులు కూలికి వస్తనని ఎక్కడో ఐదు వందలు అప్పు తెచ్చింది.
రాత్రంతా నిద్రలేదు విక్కికి. ఏదో చెయ్యాలనే ఆరాటం. ఎవరిమీదో కోపం. మబ్బుతోనే నిద్ర లేచిండు. తనాబ్బి తెరిచి చూస్తే ఐదువందల నోటు కనిపించింది. తల్లి చూడకుండా జేబులో పెట్టుకుని బయటకు వచ్చిండు.
చీకటి విడిపోలేదు. ఇంకా మసకగానే ఉంది.బజారులో నడుస్తుంటే పాల మోటరు కనిపించింది. ఎక్కి గొల్లపల్లిలో దిగిండు. అప్పుడే భద్రాచలం బస్సు వచ్చింది. ఏది ఎక్కడికి అనికూడా చూడలేదు. ఎక్కి పొద్దుగూకుతుండగా భద్రాచలంలో దిగిండు.
సడన్ బ్రేక్ తో బస్సు ఆగింది. అందరు తూలిపడబోయి నిలదొక్కుకున్నరు. విక్కీ తల ముందు సీటుకు కొట్టుకుంది. ఒక్కసారిగా ఆలోచనలు తెగిపోయినయి. తలను రుద్దుకుంటూ ఎందుకు ఆగిందా అని ముందుకు చూసాడు. గుండె జల్లుమంది. చేతిలో బ్యాగుతో బస్సెక్కుతూ కనిపించిండు రవి సార్. అప్పుడప్పుడు సునిత మేడమ్ ఇంట్లో కనిపిస్తడు. కేశవరెడ్డి సార్ చిట్టిలో మెంబర్ కూడా. రెండు మూడు సార్లు ఇంటికి వెళ్లి చిట్టి డబ్బులు తెచ్చిండు కూడా. రవికి బైక్ ఉంది. రోజూ బైక్ మీదనే బడికి వెళ్తుంటడు. ఈరోజు బస్సెందుకు ఎక్కిండో అర్ధం కాలేదు.
విక్కీకి భయమయింది. తను దొరికిపోయినట్టే. రవి సార్ చూసి కేశవరెడ్డిసార్ కు చెప్పుతడు అనుకున్నడు. కాని రవి డోర్ వద్దనే ఎవరితోనో మాట్లాడుతూ నిలబడ్డడు. ఓర కంట అతడినే చూస్తూ సీటు పక్కన దాక్కున్నడు.
‘పిల్లికి పిడుసెయ్యడుగనీ మొత్తం నీతి సూత్రాలే జెప్పుతడు’ అంటూ రవి చాటుకు మిగతా మిత్రులు మాట్లాడుకునే మాటలు గుర్తొచ్చినయి. కాని తనకు మనిషి మంచివాడిగానే అనిపించాడు. సునిత మేడంతో తిరుగుతడని గుసగుసలు పెట్టుకునేవారు. వాళ్లిద్దరి చనువును చూసి మొదట్లో తనుకూడా అలాగే అనుకున్నడు. కాని రాఖీ పున్నమనాడు తనకొకటి రవి సార్ కొకటి రాఖీ కట్టినంక ఆ ఆలోచనే రాలేదు.
ఎందుకయినా మంచిదని సీట్లో అలాగే నక్కి కూర్చున్నడు విక్కి. మూడు స్టేజీలు దాటినంక రవి దిగిపోయిండు. కొద్దిగా ఊపిరి పీల్చుకుని తేలిగ్గా కూర్చుంటూ ఫోన్ మోగడంతో చూసుకున్నడు. చేసింది కేశవ రెడ్డిసార్. అప్పటికే మూడు మిస్డ్ కాల్లు, ఆరు మెసేజ్లున్నయి.
ఎత్తకుండా ఆగి మెసేజ్లు చూసుకున్నడు. ఒకరు పాలపాకెట్ తెమ్మని, ఒకరు చిట్టి డబ్బులు తీసుక పొమ్మని. మూడో మసేజ్ సునిత మేడంది. మూడురోజుల దాకా ఇంటికి రావద్దని ఉంది. భర్త బెంగులూరులో ఉంటడు. ఈమె ఇక్కడ మండలాఫీసులో పని చేస్తది. ఐదేండ్ల కొడుకు. భర్త నెలకు ఒకటి రెండు సార్లు వచ్చి పోతుంటడు. వచ్చినప్పుడు రెండు మూడు రోజులుంటడు. ఉన్నన్ని రోజులు ఆమె దిగులుగా వాడిపోయినట్టుగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏడుస్తుంది. తన అక్కను చూసినట్టుగానే అనిపించేది.
కేశవరెడ్డి నుంచి మల్లీ ఫోన్. విక్కి గుండె దడదడ కొట్టుకుంది. సారుకు గాని తెలిసిపోయిందా… ఊకె చేస్తండు’ అనుకున్నడు. తెలిసిపోతే తన ప్లానంతా పాడయినట్టే అన్న భయం మొదలయింది.
‘తెలిసిపోతది. ఎందుకు తెలువది. ఇటు నాకు డబ్బులియ్యంగనే చిట్టి డబ్బులు పంపుతున్న అని అటు శారదక్కకు ఫోన్ చేసి ఉంటడు. ఇంక రాలేదని ఆమె చెప్పిఉంటది. ఇంతసేపయినా ఎందుకు పోలేదని భయం పుట్టి నాకు చేసి ఉంటడు. ఒక్కరూపాయా రెండు రూపాయలా… లక్ష పది వెయిల రూపాయలాయె.’ అనుకున్నడు.
‘ఫోన్ మోగి మోగి ఆగిపోయింది. వెంటనే ఒక మెసేజ్. చూడాలంటేనే భయమయింది. ధైర్యం తెచ్చుకుని చూసిండు.’ ఒరేయ్… ఇంట్ల టిఫిన్ కూడా చెయ్యకుంట ఆగమాగం పోయినవటగదా. అమ్మ చెప్పింది. శారదకు చెప్పిన. కనీసం అక్కడయినా చెయ్యి. లేకుంటే పగటిపూట దాక కడుపెండి చస్తవ్ వెదవా…. అన్నట్టు పగటి పూట తిండికి ఇంటికే వెళ్లు. వంట చేసుకోకు. అసలే నీకు మొహమాటమెక్కువ…” బస్సు కదలికలలో కూడబలుక్కుని చదివిండు.
ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరిగినయి విక్కికి. ఏడుపు తన్నుకొచ్చింది. ఫోన్ చేస్తుంది. ఇందుకా అనుకున్నడు. వెంటనే బస్సు దిగి చేసిన తప్పును చెప్పుకోవాలనిపించింది. కాని అక్క యాదికచ్చింది.
కళ్లముందు కేశవరెడ్డిసార్ రూపం కదిలింది.
ఏడాదికింద భద్రాచలంలో బస్సుదిగిండు విక్కి. అప్పటికి పొద్దు గూకుతుంది. కింద మీద ఒక్కటే వాన. ఆకలిగా ఉంది. ఎవరు తెలువది. ఎక్కడుండుడో కూడా తెలువది. పాత పేపర్లు చుట్టుకొని రాత్రంతా బస్టాండులోనే ఉన్నడు. తెల్లవారి వాన కొంత తెరిపినిచ్చింది. జేబులో కొద్దిపాటి చిల్లర ఉన్నయి కాని ఖర్చు పెట్టాలనిపించలేదు. ఆకలితో హెూటల్ దగ్గర నిలబడి చూస్తుంటే మార్నింగ్ వాకింగ్ కు వచ్చిన కేశవరెడ్డి చూసి పిలిచిండు. టీ తాగించిండు. ఎక్కడి నుంచి వచ్చినవని ఆడిగిండు. విక్కి కావాలనే ఓ కట్టు కథ చెప్పి ఆదిలాబాద్ అని అబద్దం చెప్పిండు. రెండు వందలిచ్చి ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పిండు. అప్పటి మందం తలూపిండు కాని వెళ్లలేదు విక్కి.
పొద్దంతా అదే హెూటల్లో పనిచేసిండు విక్కి. యజమాని ఇచ్చిన రెండొందలు తీసుకుని వెతుక్కుంటూ సాయంత్రం కేశవరెడ్డి ఇంటికి వెళ్లి డబ్బు ఇచ్చిండు. అలా అతనితో పరిచయం ఏర్పడింది. ‘ఇక్కడే ఏదో పని ఇప్పించండి సార్… ఇంటికి వెళ్తే మా పిన్ని బతుకనీయది” అంటూ బతిమిలాడిండు. విక్కి మాట తీరు నిజాయితి నచ్చి ఒక హెూటల్ లో పని ఇప్పించిండు కేశవరెడ్డి.
ఒకనాడు పొద్దున ఏదో ఊరికి వెళ్తూ చూసిండు కేశవరెడ్డి. విక్కీ పేపర్ వేస్తూ కనిపించిండు. మరొకనాడు పొద్దున మార్కెట్లోకు వెళ్తూ చూసిండు. విక్కి కూరగాయల సంచులు మోస్తూ కనిపించాడు. పగటి పూట వెళ్లే హెూటల్ లో సర్వ్ చేస్తూ కనిపించిండు.
విచిత్రమనిపించి ‘ఏంరా… మబ్బుల ఓపని పొద్దున ఓపని పొద్దంత ఓపని… రాత్రిపూటనే గదరా నువ్వు వట్టిగుండేది…’ అడిగిండు కేశవరెడ్డి.
‘అయ్యో… వాని అసలు సంపాదన ఆ రాత్రిపూటప్పుడే సార్… ఎనిమిదినుంచి పదకొండుదాక మల్లెపూలమ్ముతడు…’ హెూటల్ యజమాని చెప్పిండు.
‘వాని మొఖం… రాత్రి పూట మల్లె పూలెవలు కొంటరురా… లాస్ ఆయితవు. ఆసలే మల్లెపూలు మరీ రేటెక్కువ. పొద్దున పూట అమ్ముకో… ఊరికో పల్లెకో పోయేటోళ్లు కొంటరు.’ అన్నడు.
విక్కి నవ్వుతూ ‘పొద్దున పూటయితే ఆడోళ్లు కొంటరు సార్… గీచిగీచి బేరమాడి మూరనో అరమూరనో కొంటరు. అదే రాత్రి పూటయితే మొగోళ్లు కొంటరు. మూరెడు రెండు మూరలుకాదు… దండలకు దండలే… కాకపోతే జర కాకవట్టాలె.’ అన్నడు.
కేశవరెడ్డి విచిత్రంగా ‘మొగోళ్లకు మల్లెపూలెందుకురా… ఇంతకు ఎక్కడ అమ్ముతవు.’ అడిగిండు.
‘రసోయి బార్ ముందు సార్.’ చెప్పిండు…
‘నీ బొంద… బార్ ముందు ఎవరు కొంటరురా…’
‘తాగినంకనే సార్… మొగోళ్లకు ఎక్కువ ప్రేమ పుట్టుకస్తది. తాగుడుకు ఇంత ఖర్చు పెట్టిండ్రు… అమ్మగారికి ఒక్క పది రూపాయలు ఖర్చుపెట్టలేరా సార్ అంటే చాలు… పొంగిపోయి కొంటరు. కొనేప్పుడే మనకు తెలిసిపోతది భార్యకు కొంటండా బయటకు కొంటండా…’ అన్నడు నవ్వుతూ.
‘అబ్బా… నీదిరా తెలివంటే. ఒరే బాబూ… నా చిట్టి డబ్బులు ఇస్తలేరురా. ఎత్తుకుంటన్నరు ఎగవెడుతున్నరు. అడుగుదామంటే మళ్లీ కనిపిస్తలేరు. ఏదయినా ఉపాయం చెప్పురా…’ అడిగిండు కేశవరెడ్డి.
‘ఇంకొకలింకొకలయితే వట్టిగ చెప్పక పోదు సార్…’ అంటూ దగ్గరగా వచ్చి చెవిలో చెప్పినట్టుగా ‘ఇంట్ల మొగోళ్లు లేనప్పుడు పోయి ఆడోళ్లను నసిగినట్టుగా… బజార్ల అడోళ్లు ఉన్నప్పుడు మొగోళ్లను అరిచినట్టుగా అడుగాలె… దెబ్బకు వసూలయితయి’ అన్నడు.
‘అయితే రెండు మొండి పద్దులు చెప్పుత వసూల్ చేసుకరారా. నీకు మంచి కమీశనిత్త.’ అంటూ బండిమీద తీసుకెళ్లి ఇద్దరు వ్యక్తులను పరిచయం చేసి ఇండ్లు చూపించిండు.
‘వారం తిరక్కముందే డబ్బు వసూలు చేసిండు విక్కి. ‘ఏం పోరడయ్యా… నక్షత్రకుడు నయం. యాల్లలేదు పాల్ల లేదు. ఇంటి ముంగట పొయ్యి పెట్టుకున్ననట్టే చేసిండు…’ అంటూ బాకీ తీర్చిపోయిండ్రు.
అప్పటినుంచి విక్కికి కరంటు బిల్లు కట్టడం చిట్టి డబ్బులు అడుక్క రావడం కిరాణా సామాను తేవడం లాంటి చిన్నచిన్న పనులు చెప్పిండు కేశవరెడ్డి. నెలా రెండు నెలల్లో విక్కి పనితీరు నిజాయితీ చూసినంక కేశవరెడ్డికి పూర్తి నమ్మకస్తుడైపోయిండు.
అందరు కేశవరెడ్డి దగ్గర చిట్టిలు వేసి ముందుగా ఎత్తుకుంటుంటే తనుగూడా అలా చేసి ఇంటికి పంపితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది విక్కికి. వెంటనే చిట్టి వేసిండు. కాని ఎంత నమకం కుదిరినా గ్యారంటీ లేకుంట ఎత్తుకోవడం కుదురదన్నడు కేశవరెడ్డి. బతిమిలాడినా వినలేదు. చిట్టి ఎప్పుడు నిండాలె డబ్బులు ఎప్పుడు చేతికి రావాలె అని చూస్తున్న విక్కికి అనుకోకుండా ఓ అవకాశం వచ్చింది.
శారద మార్కెట్లో కూరగాయలు అమ్ముతుంది. కూతురు పెళ్లి చేసింది. దీపావళికి అల్లునికి బండి కొనియ్యాలని కేశవరెడ్డి దగ్గర చిట్టి ఎత్తింది. స్కూల్ కు వెళ్లే ఆగంలో లక్షా పది వెయిల రూపాయలు విక్కికి ఇచ్చి పంపిండు. డబ్బును చూడగానే విక్కి ఆలోచన మారింది. దీపావళి నాడు బావ చేసిన లొల్లి యాదికొచ్చింది. త్వరలోనే మీ డబ్బులు మీకు ఇస్తానని కేశవరెడ్డికి ఒక ఉత్తరం రాసి పోస్టు డబ్బాలో వేసి బట్టలు సర్దుకుని బస్సెక్కిండు.
సెల్ ఫోన్ మళ్లీమోగింది. పేరు లేదు. ఏదో నెంబరు. ఎత్తాలంటే భయమయింది. ఆప్పటికి బస్సు కొత్తగూడెం దాటింది.
‘తన ఉత్తరం అందుతుందా… అందితే కేశవ రెడ్డి సారు నమ్ముతడా… తనకోసం వెతుకుతరా… మోసం చేసిండని అనుకుంటరా… పోలీసులకు చెప్పుతరా… తన అడ్రసు ఎవలకు చెప్పలేదుకదా… మరి తను దొరుకుతడా…? ఎన్నో అనుమానాలు విక్కీకి. దొరకకుంటే బాగుండునని వేయి దేవుళ్లకు మొక్కుకున్నడు.
‘ఏదయితే అదయింది. మొదలు బావకు పైసలు ముట్టాలంతే. తనను వెతికి పట్టుకోడానికి కనీసం వారం రోజులయినా పడుతుంది. ఈ లోపు తనే వెళ్లి విషయం చెప్పి అక్కడే పని చేసుకుంటూ అప్పు తీరుస్తానని చెప్పాలె’ గట్టిగా అనుకుని కళ్లుమూసుకున్నడు.
ఆగుతూ ఆగుతూ బస్సు గొల్లపల్లికి చేరుకునేసరికి ఆరు దాటింది. చలిగాలి మొదలయింది. అప్పుడే చీకట్లు కమ్ముకున్నయి. జేబును తడుముకుంటూ భయం భయంగా దిగిండు విక్కి. రోడ్లు విశాలం చేసినట్లున్నరు. అంచున ఉండే ఒక్క చెట్టులేదు. వరుసగా ఉండే బట్టల షాపులుకూడా కూలిపోయి ఉన్నయి. ఓ బట్టల షాపును వెతుక్కుని అక్కకు, అమ్మకు, బావకు బట్టలు కొన్నడు.
‘ఏం రా పోడా ఎప్పుడో వచ్చినవు… అందరికి కొంటున్నవుగనీ మరి ఆయ్యకు కొనవారా…’ మాటలతో ఉలిక్కిపడి పక్కకు చూసిండు. తనకు గుర్తుకు రావడం లేదుకాని ఎవరో ఊరివారు.
‘వానికేం తెలుసు. అయ్యచ్చి ఆరునెల్లాయెగని వీడువోయి యాడాదాయె.’ ఇంకో మనిషి అన్నడు.
మూట గట్టిన బట్టలను తీసుకుని వెళ్లిపోతున్నరు ఇద్దరు. పోతూ పోతూ ‘ఇప్పుడు రాంగ వీళ్లింటిముందేదో బొబ్బయితుంది’ ఒకడు చెప్పిండు.
‘అయ్యగొడుకులు చిన్నోల్లా… ఏం కథలు వడ్డరో…’ ఇంకొకడు అన్నడు.
తర్వాత మాటలేవీ వినిపించలేదు విక్కికి. ఇంటిముందేదో బొబ్బయితుందన్న మాట దగ్గరే ఆలోచనలు ఆగిపోయినయి.
వాళ్లు గాని తనకంటే ముందే రాలేదు కదా అనుకున్నడు. భయమయింది. తండ్రికి సంబంధించిన జ్ఞాపకాలకోసం మనసును తవ్వుకున్నడు. ఎప్పుడో ఐదేళ్లకింది మాట. అబద్దం ఆడొద్దు మోసం చెయ్యొద్దు అని ఏదో చెప్పిన జ్ఞాపకం. తండ్రి ఏమంటడో అన్న కొత్త భయం మొదలయింది. కొద్ది సేపు ఆలోచించిండు. ఏమయితే అది అయిందిలే అనుకుని ఆటో మాట్లాడుకుని ఇంటికి వచ్చిండు. దారి పొడుగునా ఇంటి ఆలోచనలే. ‘నాన్న ఎలా ఉంటడు. తనను చూసి ఏమంటడు. నాన్న ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఏమన్నది…’ ఆలోచిస్తూనే ఒకసారి ఫోన్ ఆన్ చేసి చూసుకున్నడు.
కేశవరెడ్డి శాంతక్క ఇంకో ఇద్దరు పగలు పన్నెండు వరకు ఫోన్ చేసినట్టు మాత్రమే ఫీడ్ బ్యాక్ మెసేజ్ లున్నయి. తర్వాత ఎవరు ఫోన్ చేసినట్టు లేదు. అంతటి ఆలోచనల్లోనూ తర్వాత ఎవరు ఎందుకుచేయలేదన్న ఆలోచన మొదలయింది.
ఆటోలో ఇంటి ముందు దిగిండు విక్కి. ఇంట్లో లైట్లు వెలుగుతున్నయి. బట్టల కవర్లు చేతులో పట్టుకుని ఆతృతగా ఇంట్లోకి అడుగు పెట్టిండు. ఫోన్ లో మాట్లాడుతున్నట్టుంది. తల్లి గొంతు వినిపించింది.
‘ఒక్కరొండు నెల్లు ఓపిక వట్టు బిడ్డా… రెండుమూడు జాగల్ల అడిగినం గనీ యాల్లకు అందలేదు… ఇప్పుడు నాన వచ్చిండు గదా… ఎట్లనన్న తెత్తడు…’ కట్టయిందో అక్క కట్ చేసిందో కాని తల్లి హలో హాలో అంటుంది.
‘ఇయ్యంపుడు ఇంతకుముందే ఇంటికచ్చి తిట్టిపాయె. అల్లుడు అలిగి కూసుండె. ఏం జెయ్యత్తది. పైసలు చెట్లకు కాత్తయనుకున్నరా… అయినా నిన్ను అనాలె. అన్ని పైసలు ఎవడొప్పుకొమ్మన్నడు. అయినకాడికే ఇత్తనననుంటివి. ఏం ఎత్తి పోయిందని లగ్గం జేసినవు… నేను వచ్చేదాక ఆగనుంటివి…’ కోపంగా అంటున్నడు తండ్రి.
ఇల్లు ఇడిసిపోయింది కాకుండా తల్లినే తిడుతుంటే కోపం వచ్చింది విక్కికి.
వేగంగా నడవబోయి కడప తట్టుకుని తూలిపడబోయే వాడే. ఎదురుగా వస్తున్న తండ్రి అందుకుని ముఖం చూసి విక్కీ అన్నడు. ఒక్కసారిగా వంటింట్లోంచి దూసుకుని వచ్చింది తల్లి, కొడుకును చూసింది. ఆమాంతంగా మీద పడి ఏడుపును అందుకుంది. తండ్రి మౌనంగా నిలబడ్డడు.
విక్కీని ఏదో ఉద్వేగం ఆవహించింది. వెంటనే జేబులోంచి నోట్ల కట్ట తీసి తల్లికి ఇస్తూ ‘ఇప్పుడేం బాధ లేదు… ఇవ్వి వాళ్ల మొఖాన కొట్టుండ్రి.’ అన్నడు.
నోట్ల కట్ట దిక్కు భయం భయంగా చూసింది. తల్లి, కొడుకును తీసుకుని లోపలికి నడిచింది. పీట మీద కూర్చోబెట్టి భయంగా ఓ ఇంత డబ్బెక్కడిది… యాడ తెచ్చినవు… ఇప్పటికే ఊర్లె బదునామయినము… ఇది మల్ల ఇంకో కథనా… యాడ తెచ్చినవో చెప్పు. వాల్లయి వాల్లకిద్దాం…’ అన్నది.
తండ్రి యాష్టగా ‘ఇది నీ తెలివి… పోరడు పైసలు తెత్తే వాళ్లయి వాళ్లకిత్తమంటవు. ముందు అల్లునికిద్దాం… తర్వాత సూసుకుందాం.’ అన్నడు.
తల్లి అగ్గిమీద గుగ్గిలమయింది. ‘నువ్వు నోరు మూసుకో… నీకేంది… ఎవడన్న అడిగితే మల్లో యాడాది దెంకపోతవు. ఇంట్ల ఎదురుంగ ఉండేది నేనే కదా…’ అంటూ కొడుకుతో ఒట్టు పెట్టించుకుంది.
విక్కీ జరిగిందంతా చెప్పిండు. చెప్పి వాళ్లు చాలా మంచోళ్లమ్మా… మళ్లి పోత. జరిగింది చెప్పితే ఒప్పుకుంటరు. అప్పు తీరేదాక అక్కడనే ఉంట…’ అన్నడు.
తల్లి గయ్యిమంది. ‘మా కోసం నువ్వక్కడ జీతముంటవా… ఆ పైసలద్దు, అటుపోవుడద్దు. ఫోన్ చేసి రమ్మందాం… వాళ్లయి వాళ్లకు ఇచ్చేద్దాం… ఫోన్ నెంబర్ చెప్పు…’ అరిచింది తల్లి. కొడుకు వినకపోవడంతో ఫోన్ లాక్కుంది…
తండ్రి తల్లిని ఒప్పించాడు. విక్కికి బదులు తాను వెళ్తానన్నాడు. విక్కిని చదివిద్దామన్నాడు. కూతురు బాధపడితే చూడలేనన్నాడు.
తల్లి నమ్మలేదు. ఆమెను నమ్మించడానికి వెంటనే కేశవరెడ్డితో మాట్లాడాడు. రేపు పొద్దున్నే బయలుదేరి వస్తున్నానని చెప్పాడు. పొద్దున్నే బయలుదేరి అల్లునికి డబ్బు ఇచ్చి భద్రాచలం వెళ్లడానికి బట్టలు సర్దింది తల్లి.
ఆ రోజు తల్లి పక్కన తృప్తిగా నిద్రపోయాడు విక్కీ. పొద్దున లేచి చూస్తే తండ్రి లేడు. దాచిపెట్టిన డబ్బుకూడా లేదు.