(‘సమూహ’ తొలి రాష్ట్ర మహాసభ, మహబూబ్ నగర్ 14-12-2024 లో చేసిన కీలకోపన్యాసం పాఠం)
- అందరికీ నమస్కారం.
‘లౌకిక ప్రజాస్వామిక సంస్కృతి-సాహిత్యం’ అనే ఈ ప్రసంగాంశమే ఓ మహాసముద్రం. లౌకికవాదం- ప్రజాస్వామ్యం- సాహిత్యం అనే మూడింటిలో వేటికి వాటికే విస్తారమైన పరిణామచరిత్ర ఉంది. కనుక ఆ సముద్రంలో కాస్తంత జాగాను ఎంచుకుని నాకిచ్చిన సమయంలో ఎంతోకొంత ఈదడానికి ప్రయత్నిస్తాను. ఎంతవరకు న్యాయం చేస్తానో చెప్పలేను. విషయాన్ని మూడు శీర్షికల కింద విభజించుకుని మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది, వర్తమానం. రెండోది, గతం. మూడోది, భవిష్యత్తు.
- వర్తమానం
వర్తమానం నుంచి మొదలుపెడతాను. వెనకటి నూటపదేళ్ళ అనుభవంతో పోల్చితే ఇప్పుడు మనం భిన్నమైన అనుభవాన్ని ఎదుర్కొంటున్నాం; భిన్నమైన ఫేజ్ లో గడుపుతున్నాం. ఈ ఫేజ్ గురించిన స్పష్టమైన స్పృహలో మనం జీవించడం ప్రారంభించి పదేళ్ళు అయింది. మీరంతా ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, నేను ఎగ్జాగరేట్ చేస్తున్నానేమో కూడా నాకు తెలియదు…ఇది మన దేశాన్ని, మన సమాజాన్ని, మన జీవితాన్ని మౌలికంగానే కొత్త మలుపు తిప్పిన ఫేజ్ గా నాకు కనిపిస్తోంది.
అయితే ఇక్కడొక వివరణ ఇచ్చుకోవాలి. గత నూటపాతికేళ్ళ చరిత్రనుంచి, అనుభవంనుంచి చూసి దీనిని కొత్త ఫేజ్ అంటున్నాను కానీ, ఇది కొత్త ఫేజ్ ఏమీ కాదు. ఈ ఫేజ్ లో, లేదా ఇలాంటి ఫేజ్ లో వందలు, బహుశా వేల సంవత్సరాలు జీవించిన అనుభవం మన దేశానికి ఉంది. అలా చూసినప్పుడు గత నూటపదేళ్ళ అనుభవాన్నే ఒక కొత్త ఫేజ్ గా చెప్పుకోవాలి.
ఇదెలాంటిదంటే… మహాభారతంలోని ఓ ఉదంతం అస్పష్టంగా గుర్తొస్తోంది. పాండవులు మహాప్రస్థానం చేసిన తర్వాత ధర్మరాజును దేవదూతలు స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి దుర్యోధనుడు కనిపించాడు తప్ప కర్ణుడు, భీమార్జున నకుల సహదేవులు కనిపించలేదు. దాంతో ధర్మరాజు బాధపడి వాళ్ళను చూడాలనుకున్నాడు. ఇంద్రుడు నారదుని వెంట అతన్ని నరకానికి పంపించాడు. ధర్మరాజు నరకంలో ఉన్న ఆ కాస్త సేపూ అక్కడ రకరకాల శిక్షలు అనుభవిస్తున్నవారికి మండువేసవిలో మలయమారుతంలా హాయి గొలిపిందట. మరికొంత సేపు అక్కడే ఉండమని వారు ధర్మరాజును ప్రార్థించారట.
అలాగని, గత పదేళ్ళ వెనకటి, నూటపదేళ్ళ అనుభవాన్నీ పూర్తిగా మలయమారుత మనడంలేదు; అప్పుడు చూడాల్సిన నరకాలను అప్పుడూ చూశాం. అలాగే, అంతకుముందు వందలు, వేల సంవత్సరాలపాటు మన దేశజీవనానుభవాన్ని పూర్తిగా నరకప్రాయమనీ అనడంలేదు. గత పదేళ్ళ అనుభవాన్నీ ఒక ప్రత్యేకమైన ఫేజ్ గా చెప్పి హైలెట్ చేయడమే ఇక్కడ నా ఉద్దేశం.
సమూహ-సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ అనే పేరే చూడండి. ఆశ్చర్యంగా ఆ పేరే గత పదేళ్ళ అనుభవాన్ని చెబుతుంది. పదేళ్ళకు ముందు సెక్యులర్ పేరుతో ఒక రచయితల వేదికను ఏర్పాటుచేయాలనే ఆలోచనైనా మనకు వచ్చిందా? రావడానికి అవకాశముందా? సాహిత్యంవైపునుంచే చెప్పుకుంటే, 19వ శతాబ్దిలో గురజాడతో మొదలైన సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యమనుకున్నాం; 1930 దశకంలో మొదలైన ఒక సాహిత్యపరిణామాన్ని అభ్యుదయసాహిత్యమనీ, ప్రగతిశీలసాహిత్యమనీ అనుకున్నాం. ఆ తర్వాత 60 దశకంలో మొదలైన మరొక సాహిత్యపరిణామాన్ని విప్లవసాహిత్యంగా గుర్తించాం. ఆ తర్వాతి దశకాలలో పుంజుకున్న మరికొన్ని పాయలను స్త్రీవాదసాహిత్యంగా, దళితసాహిత్యంగా, బహుజనవాదసాహిత్యంగా చెప్పుకున్నాం.
వందేళ్లను మించిన ఇలాంటి సాహిత్యవర్గీకరణలలో సెక్యులర్ లేదా లౌకికవాద దృక్కోణం నుంచి సాహిత్యం గురించి మాట్లాడుకునే మరో వేదికను సృష్టించాలనే ఆలోచన ఈ పదేళ్లలోనే ఎందుకు రావలసివచ్చింది?
చెప్పుకోడానికి కొంత ఇబ్బందిగానూ, సిగ్గుగానూ ఉంటుంది కానీ, ఇందులో మన నూరేళ్ళ వైఫల్యం ఉంది. మనం అన్నప్పుడు అందులో లౌకిక, ప్రగతిశీలవాదాలవైపు మొగ్గుచూపే సాహిత్యకారులు, రాజకీయవాదులు, వివిధరంగాలకు చెందిన మేధావులతో సహా అందరూ వస్తారు.
మనం ఈ పరిణామాన్ని ఊహించలేకపోయాం. ఆధునికతతో మొదలైన మన ప్రయాణం పైన చెప్పుకున్న వివిధ మజిలీలమీదుగా సరళరేఖలా ముందుకే సాగుతోందని భ్రమించాం. దానికి మతతత్వం రూపంలో పెద్ద అడ్డుకట్ట ఎదురవుతుందని ఊహించలేకపోయాం. సాంప్రదాయికశక్తులు ఓడిపోయి పక్కకు తప్పుకున్నాయని అనుకున్నాం కానీ, అవి గత నూరేళ్ళకు పైబడిన కాలంలో రహస్యంగా ఉద్యమస్థాయిలో అంగబలాన్ని, అర్థబలాన్ని సమీకరించుకుంటూ బలపడుతూవస్తున్న సంగతిని గమనించలేకపోయాం. మన మధ్యలోనే, మన చుట్టూనే, మన పక్కనే, ఇంకా చెప్పాలంటే మన ఇంట్లోనే ఉన్న మనుషుల్లో అంతవరకూ నిద్రాణంగా ఉన్న మతభావన మేలుకొని ఉగ్రరూపం ధరిస్తుందని పసిగట్టలేకపోయాం. ఇది సమష్టివైఫల్యం.
- గతం
ప్రసంగ విషయంలో లౌకికం-ప్రజాస్వామ్యం-సాహిత్యం అనే మూడు అంశాలున్నాయి. వీటిలో లౌకికవాదం, ప్రజాస్వామ్యమనే భావనలు ఆధునికతతోనే వచ్చాయనుకుంటాం కానీ, రూపభేదంతో ఇవి ప్రాచీనకాలంనుంచీ ఉన్నాయి. రాజూ, చక్రవర్తి రూపంలోని వ్యక్తిపాలనకు ముందు గణదశలో సమష్టి పాలన ఉండేదని మనకు తెలుసు. గణతంత్రమనే మాట ఇప్పుడూ ప్రచారంలోనే ఉంది. గణదశలో ప్రజాస్వామ్యం ప్రాథమికరూపంలో కనిపిస్తుంది. అలాంటి ఒకానొక పరివర్తన చరిత్రే లౌకికవాదానికీ ఉంది. ఎగువరాతియుగంనుంచీ చూస్తే, వేట-ఆహారసేకరణ దశలో ఉన్న మనిషి దృష్టిలో లౌకికం, పారలౌకికం అనేవి విడివిడిగా లేవు. ప్రతి లౌకికచర్యా అలౌకికరూపం తీసుకుని అలౌకికంగానే వ్యక్తమవుతుంది. విలియం ఇర్విన్ థామ్సన్ అనే రచయిత The Time Falling Bodies Take to Light: Mythology, Sexuality & the Origins of Culture పుస్తకంలో దీని గురించి రాస్తాడు. “వేట ఆహారసేకరణ జనాల సంస్కృతిలో మతం అవసరమే లేదు. వారి సంస్కృతే ఆధ్యాత్మికత మూర్తీభవించినది. అందులో ప్రతి ఘటనా ఒక కథగా మారుతుంది; ప్రతి ఒక్క భాగమూ అఖండం(whole)తో అనుసంధానమై ఉంటుంది. ప్రతి ఒక్క చర్యలోనూ అలౌకికత నిండి ఉంటుంది. మొత్తం జీవనవిధానమే అలౌకికమైనప్పుడు ప్రత్యేకించి ప్రార్థనామందిరాలను నిర్మించుకోవలసిన అవసరం కానీ, ఆదివారాలలో ప్రార్థనలు జరపాల్సిన అవసరం కానీ వారి ఉండ” వంటాడు ఆయన.
అప్పటికి ప్రకృతిశక్తులకు దైవత్వాన్ని, మహిమలను ఆపాదించుకోవడమే తప్ప మనిషి రూపంలోని దేవుళ్ళను సృష్టించుకోవడం కానీ, దైవభావనను ఒకానొక మతరూపంలో, విస్తృతమైన ఆయా తంతులతో వ్యవస్థీకరించడం కానీ జరగలేదు. మన దగ్గర ఋగ్వేదంలోని తొలి మండలాలలో ఈ ఛాయలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. రామాయణ, మహాభారతాలకు వచ్చేసరికి మనిషి రూపంలోని దైవాన్ని ప్రతిష్ఠించడం కనిపిస్తుంది. పురాణాల దగ్గరికి వచ్చేసరికి మనిషి రూపంలోని దైవాన్ని ప్రతిష్ఠించడం మరింత స్పష్టరూపం ధరించింది. ఆ దేవుళ్ళ పేరుతోనే పురాణాలు వెలిశాయి. కాకపోతే, లౌకికం, అలౌకికమనే తేడా లేకుండా లౌకికాన్ని కూడా అలౌకికంగా వ్యక్తం చేసే శైలి మాత్రం కొనసాగింది.
మహాభారతంనుంచే మరో ఉదాహరణ చూడండి. పాండవులు అరణ్యవాసాన్ని ప్రారంభించినప్పుడు కొంతమంది బ్రాహ్మణులు కూడా వారితో వెడతారు. వారికి భోజనం ఎలా పెట్టాలని ధర్మరాజు తన పురోహితుని అడుగుతాడు. సూర్యుణ్ణి ప్రార్థించమనీ, అతని అనుగ్రహంతో ద్రౌపది పండించే ఆహారంతో వారికి భోజనం పెట్టమనీ పురోహితుడు చెబుతాడు. అంటే, పంట పండించి అన్నం పెట్టడమనే లౌకికచర్యకు సూర్యుని ప్రార్థించి అనుగ్రహం పొందడమనే అలౌకికచర్యను జోడించి చెప్పాడన్నమాట.
Bronislaw Malinowski అనే పురామానవశాస్త్రవేత్త తన ‘ఆర్గొనాట్స్ ఆఫ్ వెస్ట్రన్ పసిఫిక్’ అనే పుస్తకంలో పసిఫిక్ దీవుల్లో ఒకటైన టోబ్రియాండ్ దీవిలోని జనం గురించి రాస్తాడు. వాళ్ళు వెయ్యిమైళ్ళు దూరంలో ఉన్నా సరే, రెండేళ్ళకోసారి తమ బంధువుల్ని కలిసి కానుకలు ఇవ్వడానికి నౌకలో వెడతారు. ఒక మతపరమైన తంతులా జరుగుతుంది. ఇప్పటికీ మనలో చాలామంది నిత్యజీవనంలో లౌకికం-అలౌకికం కలిసిపోయే వ్యక్తమవుతూ ఉంటాయి.
మొదట్లో లౌకికానికీ, అలౌకానికీ తేడా పాటించకపోయినా; రెండూ గుర్తుపట్టడానికి వీలుగానే ఉంటాయి. సాహిత్యం విషయానికి వస్తే, అది మానవసమాజాన్ని, మానవజీవితాన్ని, మానవసంబంధాలను, మనుషుల మధ్య వైరాలను, ప్రేమలను, వారి లౌకికజీవితానికి సంబంధించిన అన్ని విషయాలనూ వస్తువుగా చేసుకుంటుంది. కనుక ప్రాథమికంగా అది లౌకికం కిందికే వస్తుంది. ఒకవేళ అది అలౌకికం గురించో, ఆధ్యాత్మికం గురించో చెప్పినప్పటికీ అది మనిషి లౌకికజీవితాన్నే ఆధారం చేసుకుంటుంది. ఉదాహరణకు, రామాయణాన్నే తీసుకోండి; రాజ్యాధికారం రాముడిదా, భరతుడిదా అన్న వివాదం తలెత్తడం, రాముడు తండ్రి ఆదేశాన్ని పాటించి భార్యతోనూ తమ్ముడితోనూ కలసి అడవికి వెళ్ళడం, రావణుడు రాముని భార్యను ఎత్తుకుపోవడం, రాముడు అతన్ని చంపి భార్యతో కలసి తిరిగి తన రాజ్యానికి రావడం గురించి రామాయణం చెబుతుంది. ఈ మూలకథలో లౌకికమే తప్ప మన అవగాహనకు అతీతమైన అలౌకికం ఏదీ లేదు. రామాయణకథాగమనాన్ని కనుక మనం పరిశీలిస్తే, రాముడు పుట్టడం దగ్గరినుంచి రావణునిపై యుద్ధానికి వెళ్ళేవరకూ కథంతా లౌకిక తలంలోనే జరుగుతుంది. కాకపోతే, ఇంతకుముందు చెప్పినట్టు లౌకికానికీ, అలౌకికానికీ తేడా పాటించని ఇతిహాస, పౌరాణిక శైలిలోనే ఆ కథను నడిపి ఉండవచ్చు. యుద్ధకాండలోకి వచ్చేసరికి ఒక ఘట్టంలో రాముణ్ణి దేవుడిగా పెంచి చూపడం కనిపిస్తుంది. దాంతో లౌకికమైన రామాయణకథ కాస్తా అలౌకికంగా మారిపోయి మతరూపాన్ని తెచ్చుకుంది.
సరిగ్గా ఇదే పరివర్తనక్రమం మహాభారతానికీ వర్తిస్తుంది. కథ రీత్యా అది కూడా లౌకికతలంలోకే వస్తుంది. కృష్ణుని విష్ణువు అవతారంగా చేయడం, భగవద్గీతను, విష్ణుసహస్రనామాలను చేర్చడం ద్వారా దానిని కూడా అలౌకిక తలంలోకి తీసుకెళ్లి మతరూపాన్ని ఇచ్చారు. ఇదే క్రమం హోమర్ చెప్పిన ఇలియడ్ కూ వర్తిస్తుంది.
ఇలాగే ఋగ్వేదంలోనూ లౌకిక, అలౌకిక తలాలు కలిసిపోయి కనిపిస్తూ ఉంటాయి. క్రమంగా లౌకిక తలాన్ని మరుగుపరుస్తూ అలౌకిక తలాన్ని స్థాపించి మతరూపాన్ని తెచ్చారు.
యూరప్ ప్రయోగశాలగా లౌకిక, అలౌకికాల వేర్పాటు… సెక్యులర్ అనే మాట ఆధునికతా నిఘంటువులొ చేరడం… మన రాజకీయచింతనలో కూడా భాగం కావడం…ప్రత్యేకించి గత పదేళ్ళలో సెక్యులర్ అనే మాటను తిట్టుపదంగా మార్చడమే కాకుండా దాని అర్థాన్ని, వివరణను సంక్లిష్టం చేయడం…సెక్యులర్ అనే మాటకు బయటి నిర్వచనం మనకు వర్తించదనీ, మనది భారతీయ తరహా సెక్యులరిజం అనే కొత్త మాటను ప్రచారంలోకి తేవడం… జరిగాయి.
ప్రజాస్వామ్యం గురించి! చారిత్రకంగా చూస్తే, సమానత్వభావన అడుగంటి అసమానత అడుగుపెట్టడం స్త్రీపై పురుషాధిపత్యాన్ని స్థాపించడంతో మొదలైంది. ఎగువరాతి యుగంనుంచి నాగరికయుగంలోకి వచ్చేసరికి జరిగిన పరివర్తన ఇది. యుద్ధాలు, వాటి దరిమిలా దాసదాసీవ్యవస్థ అందులోనే పుట్టాయి. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు వగైరాలు ఈ పరిణామం తర్వాతి కాలానికి వస్తాయి. ఋగ్వేదంలో దీని ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. పురుషాధిపత్యంతోపాటు స్వజనులు, పరజనులు అనే తేడా కనిపిస్తుంది. పరజనులను దాసులని, దస్యులని, రాక్షసులనీ అది చెబుతుంది. కొత్తరాతియుగంలో మొదలైన యుద్ధాలను, హెచ్చుతగ్గుల సామాజికవ్యవస్థనూ, సంచారజీవనాన్నీ అందిపుచ్చుకుని రష్యన్ స్టెప్పీలనుంచి అటు యూరప్ వైపూ, ఇటు ఆసియావైపు సాగిన వలసలు స్థానికులపై ఆధిపత్యాన్ని, ఆక్రమణను విధించడం; ఆ ప్రక్రియకు మన దగ్గర వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు సమర్థన కూర్చడం; లౌకిక తలంలో జరిగిన ఈ మొత్తం ప్రక్రియకు మతాన్ని, ఉపనిషత్తులు, భగవద్గీత రూపంలో తాత్వికతను ఆపాదించడం జరిగింది.
ఇందులో మళ్ళీ యూరప్ అనుభవంలోనూ, మన అనుభవంలోనూ తేడాలున్నాయి. మొదటే చెప్పినట్టు ఆధునికతా దిశగా జరిగిన పరిణామంలో యూరప్ ప్రయోగశాల కావడమే కాకుండా దిక్సూచి కూడా అయింది. రెలిజియన్ అనే మాట ద్వారా మతాన్ని విస్పష్టంగా నిర్వచించడం యూరప్ లోనే జరిగింది. ఇప్పుడు ఆ నిర్వచనం వెలుగులోనే హిందుత్వ శ్రేణులు పనిచేస్తున్నాయి తప్ప మన దగ్గర మొదటినుంచీ మతానికి స్పష్టమైన నిర్వచనం కనిపించదు. మతం అంటే అభిప్రాయం, అభిమతం, సమ్మతి, శాస్త్రం వగైరా అర్థాలు కనిపిస్తాయి. అలాగే, మతానికి ధర్మాన్ని పర్యాయపదంగా వాడడం కూడా మన దగ్గర ఉంది. ధర్మమనే మాటకు కూడా వేర్వేరు అర్థాలున్నాయి.
మనదైన స్వతంత్ర చరిత్ర ఇటీవలి కాలంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే మొదలైంది. అంతకుముందు బ్రిటిష్ పాలనలో, ఇంకా అంతకుముందు ముస్లిం ఆధిపత్యంలోనూ, వాళ్ళతో పోరాటాల్లోనూ మునిగి ఉన్నాం. దాదాపు పదిహేనువందల సంవత్సరాలపాటు మనదైన అస్తిత్వానికి దూరంగా ఉండిపోయాం. మతరంగంలోనే చూస్తే, మనం క్రీస్తుపూర్వసమాజంలోనే ఉన్నాం. అంటే, మనం పాతప్రపంచంలోనే ఉండిపోయాం తప్ప కొత్త ప్రపంచంలోకి రానేలేదు. వచ్చే ప్రయత్నాన్ని మొదలుపెట్టి పూర్తిగా 80 ఏళ్ళు కూడా కాలేదు. కుటుంబస్థాయితో మొదలుపెట్టి దేశస్థాయి వరకూ మన మింకా ప్రజాస్వామికీకరణ కానీ, లౌకికీకరణ కానీ చెందలేదు. దేశంలోని అన్ని ప్రాంతాలూ ఇంకా ఒక టైమ్ జోన్ లోకి రాలేదు. ఒక నేషన్ స్టేట్ గా ఏర్పడే ప్రక్రియ పూర్తికాలేదు. సాహిత్యం సహా అన్ని మేధోరంగాలూ మానవసంబంధాలను ప్రజాస్వామికమూ, లౌకికమూ చేసే ప్రయత్నంలోనే ఉన్నాయి.
ఇంతలోనే అజెండా మారిపోయింది. మతం అన్నింటి స్థానాన్ని ఆక్రమించుకుంది. వ్యవస్థీకృతమతాల మోడల్ ను ఇక్కడి మెజారిటీ మతానికి పూర్తిస్థాయిలో వర్తింపజేయడం మొదలైంది. అలాగే, స్టెప్పీలనుంచి సంక్రమించిన ఆధిపత్య, ఆక్రమణల కొనసాగింపునకూ రంగం సిద్ధమవుతూవచ్చింది. ఆధునికత ద్వారా సంక్రమించిన లౌకికవాదం, ప్రజాస్వామ్యం, వాటిని ప్రతిబింబించే రాజ్యాంగం వగైరాలను పునః పరిశీలించి సాంప్రదాయికత వెలుగులో పునర్నిర్వచించుకునే ప్రయత్నమూ మొదలైంది.
సింపుల్ గా చెప్పాలంటే వందల వేల సంవత్సరాలకు విస్తరించిన మన గతం 15 వందల సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు పునరుద్ఘాటించుకుంటోంది. స్టేట్ ఒక పక్షం, ఒక వాదం వైపు పూర్తిగా ఒరిగిపోవడం ఆ ఉద్ఘాటనకు శక్తినీ, అధికారాన్నీ జోడిస్తోంది.
- భవిష్యత్తు
స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి మనం అమలు చేసుకుంటూ వస్తున్న లౌకిక, ప్రజాస్వామికరాజ్యాంగాన్ని, ఈ దేశవైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది చేసిన నిర్దేశాలను కాపాడుకోవడం ఒక్కటే ఇప్పుడు మన లక్ష్యంగా మారింది. ఈ దేశ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగానికి రూపకల్పన చేసిన సంగతి మనకు తెలుసు. నిజానికి మనలో చాలామందికి పదేళ్ళ క్రితం వరకూ ఈ రాజ్యాంగాన్ని, అది చెప్పే లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్నీ గట్టిగా గుర్తించి పట్టించుకోవలసిన అవసరం కనిపించలేదు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రమాణస్వీకారం చేసే దృశ్యాలను మనం ఎప్పుడూ ఊహించుకోలేదు. రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పెద్దగా చర్చకు తేలేదు. ఇప్పుడే తేవడంలో అవసరం అలా ఉంచి మన వైఫల్యం కూడా ఉంది. దానిని ఆమోదించక తప్పదు.
వైవిధ్యవంతమైన ఈ దేశ స్వభావం రీత్యా ఇక్కడి స్టేట్ అన్ని మతాలు, వాదాలు, ప్రాంతాలు, భాషలు, జ్ఞానాలు వగైరాలన్నిటికీ సమదూరం పాటిస్తూ తటస్థతను పాటించినప్పుడే ఇక్కడి జనజీవనంలో శాంతి, సామరస్యం ఉంటాయి. స్టేట్ ఏదో ఒక్కవైపే ఒరిగిపోయినప్పుడు వాటికి భంగం కలగడమే కాకుండా దేశం ఎప్పటిలా స్తంభించిన కాలంలో చక్రభ్రమణం సాగిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో చాలాకాలం గడిపిన అనుభవం మనకు ఉంది. ఇప్పుడు అదే పునరావృతమవుతుంది.
మనం ఊహించని ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్నది అంతిమ ప్రశ్న. గత డెబ్బై ఏళ్లనుంచి మనం అనుసరిస్తున్న వ్యూహాలు, కార్యాచరణ, వాడుతున్న పరిభాష ఈ కొత్త పరిస్థితిని ఎదుర్కోడానికి సరిపోవని నేను అనుకుంటున్నాను. ఆ గుర్తింపు మనలో పూర్తిగా ఇంకిందా అని కూడా ప్రశ్నించుకోవాలి. సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ను ఏర్పాటు చేయడంలో ఆ గుర్తింపు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. దానిని మరింత విస్తృతం, బలోపేతం చేయడానికి ఏం చేయాలి, మన పరిభాష దగ్గరినుంచీ ఎలా మార్చుకోవాలనే ఆలోచన చేయాలి.
అన్ని మతాలు, ప్రాంతాలు, భాషల వారు ఒక ఉమ్మడి అజెండాతో లౌకిక, ప్రజాస్వామిక ప్రాతిపదిక మీద కలసి పనిచేయడం తప్ప మరో పరిష్కారం లేదు.