మన స్థల కాలాలకు గ్రాంసీ

‘నీవు ఎవరికి చెబుతున్నావు?’ అనేది గ్రాంసీకి చాలా ముఖ్యమని ఈ రచనలో అశోక్‌ అన్నారు. మార్క్సిజమంటే  ఆయనకు ‘ఆచరణాత్మక తత్వశాస్త్రం’ అనీ ప్రస్తావించారు. గ్రాంసీని అర్థం చేసుకోడానికి అశోక్‌ ఈ రెంటినీ  గీటురాయి చేసుకున్నారు. అందువల్ల ‘అసలు గ్రాంసీ’ని తెలుసుకోవడం,  మనకు చెప్పడం  చాలా తేలికైంది.

గ్రాంసీ విశ్లేషకులు ఆయనను  ‘ఓల్డ్‌ గ్రాంసీ’, ‘న్యూ గ్రాంసీ’ అని విభజించి చూస్తారు. అట్లాగే గ్రాంసీ భావాలను  పోస్టు మార్క్సిస్టులు, యాంటీ మార్క్సిస్టులు, నాన్‌  మార్క్సిస్టులు కూడా గొప్పవని కీర్తిస్తుంటారు. మన దగ్గర ఓ ముప్పై ఏళ్ల కింద గ్రాంసీ పెద్దగా తెలియదు. ఆయన ఆలోచనల పరిచయమే  మార్క్సిజం మీద విమర్శతో, విసుగుతో, అసంతృప్తితో మొదలైంది. ముఖ్యంగా నడుస్తున్న విప్లవోద్యమం మీద ఎంతో కొంత వ్యతిరేకతతో మొదలైంది.  మార్క్సిజం తెలిసినవాళ్లను, ప్రజా ఉద్యమాల్లో  ఉన్నవాళ్లను కూడా  సందేహాలకు లోను చేసేలా ఈ చర్చ జరిగింది. మార్క్సిజాన్ని సవరించాలని, సృజనాత్మకంగా అభివృద్ధి చేయాలని అన్నారు. విప్లవ రాజకీయ కార్యక్రమాన్నే మార్చుకోవాలని అన్నారు. సారాంశంలో ఇదంతా వర్గపోరాటంతో సంబంధం లేని సిద్ధాంత చర్చకు దారి తీసింది. వర్గ సమాజం స్థానంలోకి పౌర సమాజం వచ్చింది. వర్గం బదులు ‘సబాల్ట్రన్‌’ అనే భావన వచ్చింది.

ఈ ఉధృతి కొద్ది కాలం నడిచింది. తెలుగులో ఇప్పుడు అంతగా గ్రాంసీ గురించి మాట్లాడటం లేదు. బహుశా ఈ తరహా మేధావులందరూ  మార్క్సిజాన్ని గ్రాంసీ ఆచరణాత్మక తత్వశాస్త్రంగా గుర్తించాడనే మౌలిక విషయాన్ని విస్మరించి ఉంటారు. మానవ ఆచరణలోకి గ్రాంసీ ఆలోచనలను అన్వయించాలనుకోవడం వల్ల కొద్ది రోజులు ఆసక్తిగా చర్చించి ఆ తర్వాత వదిలేశారు. 

ఈ తరహా చర్చల వల్ల గ్రాంసీ భావనలు అనేక అర్థాల్లో ప్రచారంలోకి వచ్చాయి. అవి మన ఆలోచనలను, ఉద్యమాలూ ప్రభావితం చేశాయి.  గ్రాంసీ జీవించి, రచించి, మరణించిన ఫాసిస్టు సందర్భానికి ఇప్పటి భారత సామాజిక ఫాసిస్టు దశకు చాలా పోలికలు ఉన్నందు వల్ల ఆయనను అధ్యయనం చేయాల్సిన అవసరం పెరిగింది. గ్రాంసీ మౌలిక భావనలకు ప్రాధాన్యత పెరిగింది.

అనేక కారణాల వల్ల గ్రాంసీ ఒరిజినల్‌ భావనలను, వాటి అర్థాలను, లక్ష్యాలను తెలుసుకోవడంలో చాల సంక్లిష్టత ఉన్నదని గ్రాంసీ విశ్లేషకులందరూ అంటారు. పెట్టుబడిదారీ విధానం నుంచి, ప్రపంచ యుద్ధం నుంచి ఫాసిజం పుట్టిన సందర్భంలో, జైల్లో దారుణమైన పరిస్థితుల్లో  గ్రాంసీ రాసుకున్న నోట్స్‌లోని ఆలోచనలు అవి. జైలు సెన్సార్షిప్‌ను దాటుకోడానికి ఆయన కొత్త పరిభాషను, రచనా శైలిని ఎంచుకున్నాడు.  ఆ తర్వాత  ఇటలీ కమ్యూనిస్టు పార్టీ  గ్రాంసీ నోట్స్‌ను పరిష్కరించి ప్రచురించింది. వీటన్నిటి వల్ల చోటు చేసుకున్న సంక్లిష్టత నుంచి కూడా గ్రాంసీని ‘సంప్రదాయ మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతానికి’ భిన్నంగా, వ్యతిరేకంగా నిలబెట్టే వాళ్లు తయారయ్యారు.  మౌలికంగా మార్క్సిస్టు సంవిధానానికి ఇతరంగా ఆయనను ఆలోచించాడని అంటున్నారు. ఈ ధోరణి తెలుగులోకి కూడా దిగుమతి అయింది.

ఇంత విస్తృతమైన, జటిలమైన గ్రాంసీ అధ్యయన పర్యావరణంలోకి అశోక్‌ రాసిన ఈ పుస్తకం వస్తోంది.  ‘ఓల్డ్‌ గ్రాంసీ’, ‘న్యూ గ్రాంసీ’ అనే విభజనకు భిన్నంగా ఆయనను అన్వేషించడానికి అశోక్‌ ప్రయత్నించారు. ఇటలీ పరిణామాలు, ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం తరహా భీతావహ పరిస్థితులు, చారిత్రకంగా, తాత్వికంగా మార్క్సిస్టు గతితార్కిక పద్ధతి వికాసానికి ఉన్న అవకాశాలు దృష్టిలో పెట్టుకొని గ్రాంసీని అధ్యయనం చేసిన ఫలితమే ఈ పుస్తకం.  గ్రాంసీని ఆయన జీవితం నుంచి, స్థలకాలాల నుంచి, ఆయనను రూపొందించిన ఆనాటి చారిత్రక పరిస్థితుల నుంచి వేరు చేయకుండా పరిశీలించడం ఇందులోని ప్రత్యేకత. గ్రాంసీ ప్రవేశపెట్టిన అనేక కొత్త ఆలోచనలను  మార్క్సిస్టు పద్ధతి విస్తరణలో భాగంగా చూసినందు వల్ల  గ్రాంసీని దగ్గరిగా అశోక్‌ మనకు చూపించారు.  గ్రాంసీ భావనల చుట్టూ ఉన్న అనేక చర్చలను పరిగణలోకి తీసుకొని మార్క్సిస్టుగా, ఆచరణకు ప్రాధాన్యత ఇచ్చిన విప్లవకారుడిగా ఆయన సిద్ధాంతాలను పునర్నిర్మించే ప్రయత్నం కూడా  ఈ రచనలో ఉంది.  దీనికి గ్రాంసీ సోషలిస్టు పార్టీలో ఉన్న రోజుల్లో చేసిన ఆలోచనల దగ్గరి నుంచి ఒక పరిణామ క్రమాన్ని అశోక్‌ సూక్ష్మంగా పరిశీలించారు. ‘ప్రతి వ్యక్తికి, సిద్ధాంతానికి ఒక ప్రయాణం ఉంటుంది’ అనే వాక్యంతో ఈ పుస్తకం ఆరంభం అవుతుంది.  ఇక్కడి నుంచి అశోక్‌  తనదైన పరిశీలనా పద్ధతిని రూపొందించుకున్నారు.

చరిత్రలో ఏ వ్యక్తినైనా పరిశీలించేందుకు, అందునా గ్రాంసీలాగా ఒక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొన్న ఆలోచనాపరుడిని అంచనా వేయడానికి శాస్త్రీయమైన పద్ధతి అవసరం. మౌలికంగా ఆ వ్యక్తి ఆలోచనా చట్రం, దాని వికాసం తెలుసుకోకుండా పరిశీలిస్తే దూరంగా ఉండిపోతాం. ఊహా కల్పనల్లో చిక్కుకపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి భిన్నంగా అశోక్‌ పరిశీలించాడు.  మార్క్స్‌ భావనలకు, పద్ధతిని గ్రాంసీ ఏ విషయాల్లో సృజనాత్మకంగా, కొత్తగా చెప్పిందీ వివరించారు. తన కాలపు మార్క్సిజానికి  ఆయన కొత్తగా చేర్చిన ముఖ్య భావనలను ప్రత్యేకంగా చెప్పారు. తద్వారా మార్క్సిస్టు సిద్ధాంతానికి, ముఖ్యంగా రాజకీయాలకు, సాంస్కృతిక, భాషా విశ్లేషణల్లో గ్రాంసీ చేర్పును చాలా నిర్దిష్టంగా రాశారు.  హెజిమొని, ఇంటలెక్చ్యువల్‌, కామన్‌సెన్స్‌, సివిల్‌ సొసైటీ వంటి భావనలను గ్రాంసీ వాడిన పద్ధతిలోని ప్రత్యేకతలను అశోక్‌ వివరించారు.  ఇందులో  ముఖ్యమైనది ఫాసిజాన్ని అర్థం చేసుకోవడం. ఆర్థిక సంక్షోభకాలంలో బూర్జువా వర్గం చేసే ప్రతీఘాతుక చర్యగా ఫాసిజాన్ని గ్రాంసీ చూడలేదు. మార్క్స్‌, ఏంగెల్స్‌ పదే పదే తిరస్కరించిన ఆర్థిక నియతివాదానికి పూర్తి భిన్నంగా  గ్రాంసీ చేసిన ఆలోచనలు మార్క్సిస్టు సిద్ధాంతరంగానికి గొప్ప చేర్పు ఎట్లా అయిందో అశోక్‌ చాలా జాగ్రత్తగా, సున్నితంగా చెప్పారు. పునాది, ఉపరితలం పరస్పర సంబంధాల్లో, ప్రభావాల్లో కలిసి ఉండే చారిత్రక స్థితిని ‘హిస్టారికల్‌ బ్లాక్‌’ అనే భావనతో గ్రాంసీ వివరించాడని అశోక్‌ అంటారు. ఆర్థిక నియతివాదాన్ని ఎదుర్కోడానికి గ్రాంసీ చేసిన ఈ చేర్పు అద్భుతమైనది.

‘మనిషి అంటేనే హిస్టారికల్‌ బ్లాక్‌’ అనే భావనతోపాటు  సామాజిక మానసికతను, సమ్మతిని వివరించేందుకు ఆయన ఎంచుకున్న పద్ధతి మార్క్సిస్టు విశ్లేషణలో భాగంగా అశోక్‌ చెప్పారు.  ఏ సమాజంలో అయినా పాలకవర్గ భావాలే ఆ సమాజ భావాలుగా ఆధిక్యంలో ఉంటాయనే మార్క్సిస్టు సూత్రీకరణను గ్రాంసీ మరో వైపు నుంచి చెప్పారు. పాలక భావాలు ప్రజల మనసుల్లోంచి, సమ్మతిలోంచి ఆధిక్యంలోకి వస్తాయని చెప్పడం గ్రాంసీ ఉద్దేశం.

అశోక్‌ ఎంచుకున్న పద్ధతి  గ్రాంసీని అధ్యయనం చేయడంలోని క్లిష్టతలను ఛేదించడానికి దారి చూపుతుంది.  ఇటలీలోని ముసోలినీ  ఫాసిజానికి, మన దేశంలోని హిందుత్వ  కార్పొరేట్‌ ఫాసిజానికి కొన్ని తేడాలు ఉన్నప్పటికీ చాలా పోలికలు ఉన్నాయి. ఎక్కడైనా ఫాసిజం పని చేసే పద్ధతిలో సారూప్యతలు ఉంటాయి. అత్యంత అమానవీయమైన, విధ్వంసకరమైన, ప్రతీఘాతుకమైన ఫాసిజాన్ని నిందించి లాభం లేదు. దాని పని విధానం తెలుసుకోవాలి. మన దేశంలో ఫాసిజాన్ని అర్థం చేసుకోడానికి గ్రాంసీ అత్యవసరం. కేవలం ఫాసిజాన్ని ఓడిరచడానికే కాదు. విప్లవం విజయవంతం చేయడానికి కూడా గ్రాంసీ కావాలి.

మార్క్సిస్టులందరిలాగే గ్రాంసీ సాధారణ ప్రజల మానసికతకు, చైతన్యవంతమైన ఆచరణకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అత్యంత క్లిష్టమైన మార్గంలో కొనసాగుతున్న భారత విప్లవోద్యమాన్ని పురోగమింపచేయాలంటే ఈ సమాజంతో, దాని చరిత్రతో, దాని మానసికతతో విప్లవాత్మకంగా వ్యవహరించాల్సిందే. విప్లవకారుల లక్ష్యం అదే. నిజానికి  భారత విప్లవోద్యమ ఆచరణలో గ్రాంసీ భావనలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దేనికంటే ఆయన ఆలోచనలు  పూర్తి ఆచరణాత్మకమైనవి. ఆ రకంగా అది పూర్తి సైద్ధాంతికమైనది. మానవ ఆచరణకు ప్రాధాన్యత ఇచ్చే గ్రాంసీ అధ్యయనం విప్లవోద్యమాన్ని పురోగమింపచేయడానికి అత్యవసరం.   గ్రాంసీని మనకు పరిచయం చేయడంలో అశోక్‌ లక్ష్యం కూడా ఇదే. ఈ పుస్తకం చూడ్డానికి చాలా చిన్నదే కావచ్చు.  ఈ రకంగా  చాలా ప్రాధాన్యత ఉంది. అందరూ, ముఖ్యంగా ప్రజా క్షేత్రంలో ఉండే కార్యకర్తలకు ఈ పుస్తకం చాలా అవసరం.

కవి, రచయిత, విమర్శకుడు, వక్త. విరసం కార్యవర్గ సభ్యుడు. గతంలో విరసం కార్యదర్శిగా పని చేశారు. రచనలు: 'కలిసి పాడాల్సిన గీతమొక్కటే' (కవిత్వం), 'అబుజ్మాడ్' (కవిత్వం), 'నేరేడు రంగు పిల్లవాడు' (కథలు), 'జనతన రాజ్యం', 'సృజనాత్మక ధిక్కారం'. రెండు దశాబ్దాలుగా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శలో కృషి చేస్తున్నారు.

Leave a Reply