బ్రూటల్ హంటర్

ఒకే దేశం
ఒకే చట్టం..

ఒకే మతం
ఒకే ఓటు
ఓకే పాలన..

ఉత్త
ఊదర
గొట్టుడు..

అనడానికి
ఏం అడ్డు..

ఎన్నైనా
అంటడు గానీ..

సత్యం
ఒక్కటంటే..

ప్రాణం
ఎవరిదైనా
ఒక్కటంటే..

హక్కులు
అందరికీ
సమానమంటే..

వొప్పడు..

వొప్పడు
వాడు..

అసలు
ఒక్కటంటేనే

వాడి నైజానికే
పొసగదు..

వాడికి
వొక్కటవుడే
గిట్టదు..

దూరడానికి
సందు జిక్కదని!

అందుకే..

వొక్కటెప్పుడూ
సేల్గానివ్వడు
వాడు

తక్వల తక్వ
రొండయినా
ఉండితీరాలె..

వోటి
మొండికేస్తే
దువ్వుకోవచ్చు
ఇంగోదాన్ని..

వోటి
ఉర్కులాడితే
కాళ్ళ నడుమ
కట్టేయ
వోటుండాలె గదా..

లొల్లి
ఎంతెక్కువుంటే
అంత సంబరం
వాడికి..

ఒక్కటయ్యేవన్నీ
అంతం
చేస్తానని

ఆదిలోనే
శపతం
జేస్తినంటడు..

ఆగకుండా
అదేజేస్తుండు..

సంబరాలు
జూస్తుండు..

వాడు
లూసిఫర్..

వాడిక్కడ
నాయకుడు..
పాలకుడు..

తనకంతం
లేనే లేదని
విర్రవీగుతూ..

అణువంత
మిగలకుండా..

ఆనవాళ్ళైనా
లేకుండా..

కడకు
బుడానికంతం
రాసివున్న..

రక్త రాజ్య
పిపాసి..

ఎదనిండా
చెదలు
నిండినా..

సదా
ఈస్ట్ మన్
కలర్ లో

కుళ్ళిన
మోడై..
పగుళ్ళ
షానై..

రారాజై
ఊరేగుత
నంటడు..

అడవి
రాజేసిన
నుగ్గులు

పొగలు
కమ్ముకు
లేస్తుంటే..

వెన్నులో
పుట్టే
వొణుకు
దాచి..

లోకం
ఏలే
కలలు
కంటూ..

పాడెకు
బైలెల్లిన..

బ్రూటల్
హంటర్..

రాస్కెల్
కిల్లర్
వాడు..

మన
పతనమే
వాడి
లక్ష్యం..

మన
పీకులాటే
వాడి
ప్రాణం..

తరుముడే
వీణ్ణి..

ఇగ
తరుముడే
వీణ్ణి…

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

2 thoughts on “బ్రూటల్ హంటర్

  1. ఔను వాడు హంటర్ యే

Leave a Reply