ఆమె వైపు చూడాలంటే భయం వేస్తున్నది. దుబాయ్ వచ్చాక లే ఓవర్ స్థలంలో వాలు కుర్చీల్లో సర్దుకున్నాం. ప్రసాద్ గారు కాఫీ తెస్తే తాగాము. ఆకలేసిందేమో కుమారీ తాగి ముడుచుకుని పడుకుంది. నేనూ షాల్ కప్పుకుని పడుకున్నాను. నేనూ నా బిడ్డ దగ్గర్నించే మళ్ళీ హైద్రాబాద్‌కి ప్రయాణం. నాలోనూ ఉంది బోల్డెంత దుఃఖం. కానీ ఏడుపు ఆపుకోవడం,గుండెను బండ చేస్కోవడం సాధన మీద అలవాటైపోయింది. నా భర్త వేణుకు కూడా అలవాటై పోయింది. నా కొడుకు, కూతురూ అమెరికాలోనే ఉన్నారు. పెళ్లిలైపోయాయి. పెద్దమ్మాయికి ఇద్దరు పిల్లలు, చిన్నోడు సాగర్ ఎమ్మెస్ లో చేరాడు.వాడితోనే సమస్య అక్కడి కల్చర్‌కి బాగా అలవాటైపోయాడు. కేసనోవాలో కార్డ్స్ ఆడడం , వీడ్{గంజాయి} తీస్కోవడం, వీకెండ్ పార్టీల్లో తాగి తందనాలాడ్డం, ఆఫ్రో అమెరికన్స్‌తో తగవులు పడడం వాడి లైఫ్ స్టైల్ గా మారి చదువు పక్కకెళ్లిపోయింది. వాడి కోసం నేనూ, వేణు ఇద్దరమూ ఆర్నెల్లకోసారి అక్కడికెళ్లి ఉంటున్నాము. ఇద్దరికీ ఆరోగ్యాలు బాగో లేవు అయినా సాగర్ కోసం వెళ్ళాల్సి వస్తున్నది. అన్నీ మానుకుని ఇండియా రమ్మంటే వచ్చెయ్యడు. వాడిని కంటికి రెప్పలా చూస్కునే బాధ్యత ఇద్దరి మీద పడిరది. అక్క రచన మాట వినడు. ఆర్నెల్లు నేనూ, ఆర్నెల్లు వేణు వాడి దగ్గర ఉండి కాపాడుకుంటున్నాం. నిత్యం భయమే. కొలరాడో రాష్ట్రం లో వీడ్ తీస్కోవడం లీగల్. వీడ్ తీస్కుని ఫ్రెండ్స్ ఇళ్లల్లో మత్తుగా పడి ఉండేవాడు. అల్లుడో, కూతురో వెళ్లి తెచ్చుకునే వాళ్లు. ఇలా కాదని టెక్సాస్ లో హూస్టన్ కి మారాం. వీడ్ మానేయడానికి అక్కడే బోలెడంత ఖర్చు పెట్టి డి -అడిక్షన్ ట్రీట్మెంట్ ఇప్పించాము. విత్ డ్రావల్ లక్షణాలతో నరకం చూపించాడు. వీడ్ తెచ్చిమ్మని ఏడ్చేవాడు. అల్లుడి ఫ్రెండ్ డాక్టర్… అతనే చూస్కున్నాడు. లేకపోతే నా కొడుకు సాగర్ ఏమై పోయేవాడో. కొంచెం కుదురుకున్నాడని సాగర్ ని రచన దగ్గరే వదిలి ఇండియా బయలుదేరాం. కుమారి మా కాలనీలో మా ఇంటికి అవతల నాలుగో ఇల్లే. పదిహేనేళ్ల స్నేహం. మా ఇద్దరి మధ్య అరమరికలు లేవు. కుమారి కంటే ప్రసాద్ పన్నెండేళ్లు, పెద్ద. పైగా షుగర్, బీపీ… ఈ మధ్య గుండెజబ్బు బయట పడింది. స్టెంట్లు వేసారు. కొడుకు అమెరికా నుంచి పైసలు వేస్తాడు కానీ పలకరించడు, రాడు. కూతుళ్ళను అల్లుళ్ళు పంపరు. ఇంకా ఇక్కడ ఉన్నచిన్న కూతురు రూప భర్త అంతంత మాత్రమే. అతనికెప్పుడూ అత్త గారి ఆస్తి మీదే కన్ను. భార్య రూపని మాటికి మాటికి పుట్టింటికి పంపిస్తాడు. మొదట కూతురు మాన్వితను దత్తత తీస్కోమని వాళ్లింటికి పంపాడు. దత్తత వద్దు కానీ పెంచుతానని కుమారి ఎంతో ఇష్టంగా ఆ బాధ్యత తీస్కుంది. పంచప్రాణాలు మనమరాలు మాన్విత మీదే పెట్టుకుని పెంచసాగింది కుమారి. భర్తకి హార్ట్ సర్జరీ అయిన నాలుగు నెలలకి ఎనిమిదేళ్లు గడిచినా కానీ ఎన్నడూ రాని కొడుకు కూతుళ్ళని చూడ్డానికి వెళ్ళి ఇదిగో ఇప్పుడే తిరిగి రాకడ! ఇద్దరం మా… మా గూళ్ళకు చేరుకున్నాం.
***
ఇంటికొచ్చాక జెట్ లాగ్ బాధ ఒకటి . అమెరికాలో రాత్రి ఇక్కడ పగలు. స్లీప్ సైకిల్ మళ్లీ ఇక్కడి సమయానికి సెట్ అవ్వాలి. పగలంతా ఒక వారం పాటు నిద్రపోకుండా., ఉంటేనే రాత్రి నిద్ర పడుతుంది. వచ్చిన రోజు కొద్దిగా రిలాక్స్ అయ్యి ఫేస్‌బుక్‌లోకి వెళ్ళాను. నా మనవరాలు అక్కడ అమెరికాలో నయాగరా జలపాతాల దగ్గర తీసిన ఫోటోలు పెట్టింది. ఒద్దన్నా… ఎందుకంటే ఇక్కడ నేనొక ప్రగతిశీల రచయితల సంఘంలో సభ్యురాలిని. నేనో రచయిత్రిని. ప్రపంచ దేశాల సొమ్ము దోచి అత్యంత ధనవంత దేశమైన అమెరికాకి నేను వెళ్ళడంతో చాలా కనుబొమ్మలు లేస్తాయని తెలుసు! కానీ నేను నా కొడుకు సాగర్ కోసం వెళ్ళాను.అక్కడికెళ్లాక కూడా ఖాళీగా లేను. అక్కడ అబార్షన్ హక్కు కోసం సాగుతున్న సంఘాల ధర్నాలో పాల్గొన్నాను. ఉక్రెయిన్‌కి సంఫీుభావం తెలిపాను . వాషింగ్టన్ వైట్ హౌస్ ముందు జనం చేస్తున్న ధర్నాల్లో ప్లకార్డ్ పట్టుకుని నిలబడ్డాను.ఇజ్రాయిల్ కి అమెరికా చేస్తున్న సహాయాన్ని వ్యతిరేకిస్తూ.. పాలస్తీనాకి సంఘీభావం తెలుపుతున్నఅక్కడి ప్రగతిశీల, హక్కుల,లౌకిక సంఘాలతో, అమెరికాలో నా ఫ్రెండ్ రచయిత్రి అయిన సిల్వియా తో కలిసి ఇంటర్వ్యూలు తీసుకున్నాను.రేసిజాన్నివ్యతిరేకించే విద్యార్థి సంఘాలతో సిల్వియా మాట్లాడించింది. అమెరికాలో కూడా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని,నియంతృత్వాన్ని ప్రశ్నించే,ప్రతిఘటించే ప్రగతిశీల శక్తులు ఉన్నాయి. ప్రజలు ఉన్నారు. ప్రజలు సామ్రాజ్యవాదులు కారు. పాలకులే సామ్రాజ్యవాదులు. నేనేం సంపదెక్కువై వెళ్లలేదు. నా బిడ్డ అల్లుడూ టికెట్లు బుక్ చేస్తే వెళ్ళాను. నా కొడుకు సాగర్ ఎడ్యుకేషన్ లీవ్ తీస్కుని చదువుతున్నాడు. సరే.,ఇక ఫేస్ బుక్ లో నా ఫోటో కింద పోస్ట్‌లో ఇలా ఉంది. కొందరు పిల్లలను కనే ముందే చాలా ప్లాన్ చేసి పెద్దయ్యాక అమెరికాకి పంపాలన్న ఆలోచన చేసి కంటామట.. తర్వాత కాన్వెంట్లలో చదివించేసి., డిగ్రీలు చదివించేసి ఎమ్మెస్ ల కోసం అమెరికా యూనివర్సిటీల్లో చదివించేసి లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాలు పిల్లలకొచ్చాక వాళ్ళక్కడ ఆస్తులు, ఇళ్ళు సంపాదించాక తల్లిదండ్రులను అమెరికాలకి పిలిపించేస్కుని విహార యాత్రలు చేసేస్తారట… పిల్లలని చూసే నెపంతో మేం పెద్ద వాళ్ళం అమెరికాలకి విహార యాత్రలకు వెళ్ళిపోయి, మంచులో కోట్లేస్కుని ఖరీదైన కార్లల్లో, విమానాల్లో తిరిగేస్తుంటాం. మేం విప్లవ,ప్రగతిశీల రచయితలం చెప్పేదొకటి,చేసేదొకటట.ఇదీ సారాంశం… నాకెందుకో ఒళ్లు జలదరించింది. ఖలీల్ జీబ్రాన్ అన్నట్లు పిల్లలు స్వతంత్రులు . వాళ్ళు తల్లిదండ్రుల భావజాల వారసులు కారు . అయినా అది చాలా తక్కువ. నా రాజకీయ విశ్వాసాలు పిల్లలకు రావాలనేం లేదు. బయట సమాజ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీస్కుంటారు. వారి స్వేచ్ఛ వాళ్ళది. నాకు వెంటనే వీడ్ కి అలవాటు పడి నరకం అనుభవించిన సాగర్, కన్నబిడ్డల కఠినత్వానికి దుఃఖంతో విలవిల్లాడిన కుమారీ, ప్రసాద్, ఇంట్లో పనిమనిషిలా చేయలేక రెక్కలసి ఇండియా తిరిగొచ్చిన మా దూరపు బంధువు దాక్షాయణి దంపతులు., తొలి కాన్పులో ప్రాణాలకు భరోసా లేదని నా కూతురికి చెబితే మేము అక్కడ అనుభవించిన నరకం అన్నీ కళ్ళముందు కదిలాయి. అసలు పిల్లలు అమెరికాల్లో ఉంటే తల్లులు వెళ్ళకూడదా? అదే ఇండియాలో దిల్లీ లోనో, రాజమండ్రిలోనో ఉంటే తల్లులు పిల్లల కాన్పులకు, అనారోగ్యాలకు వెళ్లరా…. అంత కనికరం లేకుండా ఉంటారా? పోస్ట్ పెట్టినావిడ కూతురు గుజరాత్‌లో ఉంటే ప్రతి మూణ్నెల్లకు ఒకసారి వెళ్తూనే ఉంటుంది అదీ విమానాల్లో… అల్లుడు కూతురు ఆమెను దేశమంతా తిప్పుతారు. మొన్నే దేశ ముస్లిములు కాశ్మీర్ ఒక పక్క సిఎఎ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రగిలిపోతుంటే.,ఈమె పోయి కాశ్మీర్ తిరిగొచ్చి మంచుకొండల్లో పాటలంటూ పోస్ట్ పెట్టింది. ఒక పేరున్న పత్రికలో పని చేసే సీనియర్ జర్నలిస్ట్ అయితే ఈ కవయిత్రులకు రాయడానికేం మిగల్లేదు స్త్రీవాదం దగ్గర ఆగిపోయారు. అందుకే అమెరికాలకు పోయి కూతుళ్ళ కాన్పులు చేస్తూ.,మనవలు మనవరాళ్ళ పీతి ముడ్లు కడగడానికి విమానం ఎక్కి మరీ పోతున్నారు. అంటూ ఏకంగా ఒక వ్యాసంలోనే రాసాడు రాసిన నెలకే చచ్చాడు. అలా వాగి పదేళ్ళయింది. ప్రతి ఏడాది ఆయన అమరత్వం అంటూ ఫేస్బుక్ నిండా పోస్ట్‌లు.. ఆరాధనలు ఆయనగారి మీద సంతాప వాక్యాలు,కవితలు,బొమ్మలతో హోరెక్కించేస్తారు. స్త్రీ రచయితల,కవయిత్రులపట్ల వీళ్ళెలా వ్యవహరించినా ఫరవాలేదు.ప్రజాస్వామికవాది,మేధావి,మహానుభావుడు అనే ముద్రలు పడిపోతాయి. అయితే అతను మగాడు… అహంభావి… పురుషాహంకారి. స్త్రీగా ఆలోచించలేనివాడు. కానీ నా మీద పోస్టు పెట్టిన ఈ రచయిత్రికి ఏమయ్యింది? నేను వెంఠనే ఆమెని ఖండిస్తూ పోస్టు పెట్టాను. మనసు వికలమైంది. మనవరాలికి పోస్ట్ డిలీట్ చేయమని వాట్సప్ మెస్సేజీ పెట్టాను.
రోజులు గడవసాగాయి. సాగర్ ని వేణు చూస్కుంటున్నాడు. అమ్మాయి రెండో కాన్పుకు సిద్ధంగా ఉంది ఇంకో నాలుగు నెలల్లో… మళ్ళీ నేను అమెరికా వెళ్ళాలి. ఆమె ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు ఇద్దరి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఆందోళన పడుతున్నా. మొన్న అమ్మాయికి బీపీ ఎక్కువైందని మందులు మొదలుపెట్టారు. నాలో ఆందోళన పెరిగిపోసాగింది. ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగి ఫిట్స్ వచ్చి గర్భం పోయిన మా చెల్లి కూతురు ఉష గుర్తుకు వచ్చింది ఒణికిపోయాను. అమ్మాయి రచనకి జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాను. వెళ్ళిపోవాలి అనుకుని ఆందోళన తో ఆరాట పడిపోతున్నాను. రచనకి అల్లుడూ, వేణు ధైర్యం చెబుతున్నారు. నన్ను ఇంకో నెలాగి రమ్మంటున్నారు. అల్లుడు డాక్టరు కదా… అయినా వదలని ఏదో భయం.
ఇంతలో అనుకోని విషాదం., కుమారి భర్తకి మాసివ్ హార్ట్ ఎటాక్‌లో పోయాడు. శవాన్ని మార్చురీలో కోల్డ్ బాక్స్‌లో స్టోర్ చేసారు. ఊర్లో ఉన్న కూతురూ అల్లుడూ వచ్చేసారు. కానీ అమెరికా నుంచి కొడుకు మూడ్రోజులైనా రాలేదు. బిజినస్ టూర్‌కి లండన్ వెళ్ళాట్ట. కంపెనీ సీఈవో అతనే… రాలేనని చెబుతున్నాడు. కుమారి గుండె పగిలేలా ఏడుస్తున్నది. కొడుకు ఇండియాకి వచ్చి పదేళ్ళు అవుతుంది. అల్లుడు – కూతురు రూప ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అసతలను ఫోన్ ఎత్తటం లేదు. మెస్సేజీలు పెడుతున్నాడు. కోడలూ అంతే… “వీలవదత్తయ్యా ఆయన రాలేని పరిస్థితి.. కంపెనీ నష్టాల్లో ఉంది. బాధ్యత అంతా మీ అబ్బాయి చేతుల్లోనే ఉంది అర్థం చేసుకోండి” అంటూ దుఃఖం నటిస్తుంది. ఎలా ఇప్పుడు,.కొడుకే తల కొరివి పెట్టాలిగా అని కుమారి కుమిలిపోయింది. ఇల్లంతా బంధువులతో నిండిపోయారు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే అల్లుడుతో చేయించమని ఎవరో సలహా ఇస్తున్నారు. వియ్యపురాలు ఒత్తిడి చేస్తుంది ‘‘మా వాడు తల కొరివి పెడతాడు కానీ ఒక షరతు మీద చేస్తాడు. ఆస్తిలో డెబ్భై శాతం మా వాడి పేరు మీద చేయాలి. తల కొరివి పెట్టిన వాడు కొడుకుతో సమానం’’ అని మొదలుపెట్టారు. సగం మంది బంధువులు అతనికి సపోర్ట్ చేసారు కొడుకుని తిడుతూ… కుమారి మానసికంగా చితికిపోయింది. “గాయత్రీ విన్నావా నువ్వే చెప్పు ఏం చేయను… ఆస్తితో సంబంధం ఎందుకు… కావాలంటే ప్రేమ ఉంటే తల కొరివి పెట్టమను” అంది ధుఖంతో. “అయినా., ఒకసారి నీ కొడుకుకి మళ్ళీ ఫోన్ చెయ్యి” అన్నాను. ‘‘నేను చేయలేను గాయత్రి నువ్వే చెయ్యి తల్లిదండ్రుల మీద ప్రేమ లేని ఆ కఠినాత్ముడితో మాటలు కూడానా.,మొన్న పదేళ్ల తరువాత వెళ్ళి నప్పుడే వాడు మేం ఎవరో అన్నట్లు చూశాడు” అంటూ వలవల ఏడ్చింది.
‘‘లేదాంటీ నాకు వీలు కాదు. నాకు ప్రేమ లేదా నాన్నంటే. కానీ రాలేని స్థితి కంపెనీ మొత్తం బాధ్యత నా మీద ఉంది. అయినా నేను నాన్న అంత్యక్రియలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నా ఆంటీ ఇక్కడి నుంచే’’ అన్నాడు సుభాష్.
‘‘ఏం చేస్తున్నావు ప్రమోషన్, కంపెనీ కంటే మీ నాన్నేం తక్కువ కాదు… వెంఠనే బయలు దేరు సుభాష్’’ అన్నా. సుభాష్ మౌనంగా ఉండిపోయాడు.
ఆనాటి సాయంత్రం సూటు బూటులో ఒక అతిథి వచ్చాడు. తనను సుభాష్ పంపించాడని చెప్పాడు. ఎందుకెందుకని అంతా అతగాడి చుట్టూ మూగారు. కుమారి అతని వెనకాల వెతికింది. ‘‘నా కొడుకెందుకు రాలేదు నువ్వెవరు… నీకేం పని’’ అంది అసహనంగా..”అమ్మా నమస్తే..నా పేరు కూడా సుభాషే… మీ అబ్బాయి బదులు నేనే నాన్నగారికి అంత్యక్రియలు చేస్తాను. అమెరికాలాంటి దూర దేశాల నుంచి రాలేని వారు మాలాంటి వారికి డబ్బులిచ్చి ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు..’’ అన్నాడు పక్క చూపులు చూస్తూ ., మొఖంలో ఒక గిల్టీ ఫీలింగ్‌ను దాచుకుంటూ.
గాయత్రి,కుమారితో పాటు అక్కడున్న అందరూ నిర్ఘాంతపోయారు. కుమారి “ఏంట్రా నువ్వు చేస్తావా అంత్యక్రియలు? నా కొడుక్కి సిగ్గు లేకపోతే నీకు లేదట్రా… నువ్వు డబ్బుకోసం ఏ బంధువూ కాకపోయినా చేస్తావూ… వాడేమో కన్న కొడుకు అయి ఉండీ అక్కడ డబ్బు సంపాదన కోసం రాడు,బాగుందిరా ఎక్కడా ఎప్పుడూ వినని వ్యవహారం … ఛీ., ఛీ ఫో ఇక్కడ్నించి” అంటూ పిచ్చి దానిలా అరుస్తూ అక్కడే ఉన్న చెప్పు అతని మీదకు విసిరి ఖాండ్రించి ఉమ్మింది.
“ఫో ఇక్కడ్నించి” అంటూ కుమారి అన్న అతన్ని గేట్ దాకా తరిమాడు. కుమారి దుఃఖంతో కూలబడిపోయింది. నాకు బుర్ర తిరిగిపోయింది. అంత్యక్రియలు పెద్ద సమస్య అయ్యిపోయింది. అల్లుడు చేస్తానంటే… వద్దని కఠినంగా అంటూ కుమారి ఒక్క ఉదుటన లేచి… నేను చేస్తాను అంది. అందరూ నివ్వెర పోయారు. “మీరెలా చేస్తారమ్మా శాస్రం ఒప్పుకోవద్దూ”అంటూ పంతులు అడ్డుకోబోయాడు. అల్లుడు తను చేస్తానన్నాడు. ‘‘వద్దు నీకూ ఇందాక వచ్చిన వాడికేం తేడా ఉందీ. నీకూ ఆస్థి కావాలి., వాడికి నా కొడుకు అంత్యక్రియల కోసం ఫీసు చెల్లించాడు…’’ అంటూ వాళ్ళని పంపించేసి కుమారే అంత్యక్రియలు చేసింది గుండె రాయి చేస్కుని.రెండ్రోజులు కుమారిని పగలూ రాత్రి కనిపెట్టుకుని ఉండిపోయాను.
***
మూడో రోజు ఇంటికెళ్ళానో లేదో కుమారి నుంచి ఫోన్ “గాయత్రీ త్వరగా రా”… అంటూ ఏడుస్తోంది.
వెంఠనే పరిగెత్తాను. రూపా ఆమె భర్త ఉన్నారు. మాన్వితను వాళ్ళ నాన్న గట్టిగా పట్టుకుని “పోదాం పదా… అత్తయ్య బట్టలు సర్దండి” అంటుంటే మాన్విత “అమ్మమ్మ దగ్గరే ఉంటాను” అని ఏడుస్తోంది. రూప”అమ్మా పాప బట్టలేవీ”అంటూ లోపలికెళ్ళబోయింది. కుమారి ‘‘రూపా నీకు దండం పెడతా… ట్రాన్స్ఫర్ అయితే మీరు వెళ్ళండే దిల్లీకి., మాన్వితను నా దగ్గరే పెట్టండి. ఎవరున్నారు చెప్పు నాకు ? నాన్న పోయాక వొంటరిగా బతక లేనే సచ్చిపోతాను అని’’ మాన్వితను తనవైపు గుంజుకుంటూ ‘వెళ్ళకే మాన్వీ” అని ఏడుస్తుంది. “గాయత్రీ నువ్వైన చెప్పు” అంటూ నన్ను పట్టుకొని ఏడవసాగింది గుండెలు పగిలేట్లు… భర్తపోయి నీరసించి ఎండు కట్టె లాగా మారిపోయింది… “నాకు డబ్బు పిచ్చి అన్నావుగా అత్తయ్యా…. ఇప్పుడు నీకు తోడు కోసం నా బిడ్డను నీ దగ్గరెందుకుంచాలి చెప్పు ఉంచినందుకు ఏమైనా నీ ఆస్తి మొత్తం రాయబోతావా ఏంటి? అల్లుడు ఎకసెక్కేంగా అంటున్నాడు.
‘‘ఈ ఇల్లు, నగలు, క్యాష్ మాన్విత పేరు మీద రాస్తే నీ దగ్గర ఉంచుతాడట అమ్మా’’ అంటోంది రూప తెలివిగా.
ఆమె అల్లుడు భార్యా బిడ్డలను ఈడ్చుకుపోయాడు. కుమారి కూలబడిపోయింది.”గాయత్రీ ఏంటిది ఇక ఇంత ఇంట్లో నేనొక్కదాన్ని ఎట్టా బతకాలి చెప్పు” అంటూ.
నాకు ఆమెను ఓదార్చటం కష్టమైంది. ఇంత దుఃఖం, ఇన్ని విషాదాలు ఎవరికీ రాకూడదు అనుకున్నా. కుమారిని దగ్గరికి తీస్కున్నా అన్న మాటే కానీ నేనూ ఏడుస్తున్నా నాకు తెలీకుండానే.
***
రోజూ కుమారి దగ్గరకొచ్చి కూర్చొని పోతున్నా సాహిత్య సభలు తగ్గించేసా. ఎందుకో వెళ్లబుద్ది కావటం లేదు. రాయబుద్దీ కావటం లేదు. రోజూ వంట చేసి కుమారికి తీస్కెళుతున్నాను. డాక్టర్ దగ్గరికి తీస్కెళ్ళి డిప్రెషన్‌కి మందులు తెచ్చి వాడుతున్నా. నేనే వేస్తున్నా ఆమెకి మందులు. పదిహేనేళ్ళ స్నేహం మాది. కుమారిని కాపాడుకోవాలి మరి. కుమారి కొడుకుతో మాట్లాడ్డం మానేసింది. గోడకున్న అతని ఫోటో తీసేసింది. కూతురూ అల్లుడు ఫోటోలు కూడా… ఒక్క మాన్విత ఫోటో.,భర్త ఫోటో మాత్రం పెట్టుకుంది. ఆమె ప్రవర్తనలో ఏదో అసహజమైన మార్పు వస్తోంది. తనలో తాను ఏదో గొణుక్కుంటుంది. పరిగెత్తుకుంటూ గేట్ దగ్గరికి వెళుతుంది ఎవరో వస్తున్నారని… నిరాశగా వెనక్కి వస్తుంది. భర్త అక్కడున్నట్లే మాట్లాడుతుంది. సైకియాట్రిస్ట్ మందులు మార్చాడు. ఊర్నించి వాళ్ళ దూరపు బంధువు సుశీల ఇంట్లో వంటకి, కుమారిని చూస్కోడానికి జీతం మీద ఏర్పాటయ్యింది.
ఈ లోపల నన్ను వెంఠనే బయలుదేరి రమ్మని రచన నుంచి ఫోన్ వచ్చింది. తను బాగానే ఉన్నట్లు అయినా నేను త్వరగా రావాలన్నట్లు చెప్పింది. భయంతో చెమటలు పట్టాయి. వేణుని కూడా వెంఠనే రమ్మన్నారు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసారు. ఎల్లుండే ప్రయాణం. ఈ లోపల అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు “గాయత్రి మీ సాగర్ క్షేమమా… ఇండియన్ స్టూడెంట్స్ మీద కాల్పులు జరిగాయి” అన్నది ఒణికిపోయాను. కుమారికి నచ్చ చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి,సుశీలకి జాగ్రత్తలు చెప్పి నేను బయలు దేరాను. సాగర్ ఎలా ఉన్నాడో చెప్పమని వేణుని ఏడుస్తూ వేడుకున్నాను.ఇరవై నాలుగు గంటలు ఆందోళనతో ప్రయాణం చేసి అమెరికా చేరాం.
***
సాగర్ హాస్పిటల్నించి ఆ రోజే డిశ్చార్జ్ అయ్యాడు. యూనివర్సిటీ నించి ఇంటికి వస్తున్న సాగర్ ని , ఇంకో ముగ్గుర్ని ఆఫ్రో- అమెరికన్స్ అడ్డగించారు. ‘‘మీరెందుకు మా దేశానికి వచ్చి మా ఉద్యోగావకాశాలు కొల్లగొడ్తున్నారు. మేం మీ దేశానికేమైనా వస్తున్నామా? పోండ్రా ఇక్కడి నుంచి’’ అంటూ తిడ్తూ వాళ్ల దగ్గరున్న సెల్ ఫోన్స్, వాచీలు, డాలర్లు తీసుకున్నారు. ఒకబ్బాయి కొంచెం ప్రతిఘటిస్తే కాల్పులు జరిపారు.భయంతో సాగర్ పారిపోతుంటే కాలి మీద కాల్చారు. వార్తల్లో సాగర్ బదులు సమీర్ అని ఇచ్చారు. సాగర్ కి రక్తం బాగానే పోయింది. నేను ఒణికిపోయాను.”వచ్చెయ్యరా ఇండియాకి అక్కడే చదువుకొందువు” అని బాగా ఏడ్చాను. పాపం లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాడు. సాగర్ కోలుకొంటుండగానే రచనకి డెలివరి అయ్యింది.తీవ్రమైన ఆందోళన, పని వత్తిడి మధ్యలో నాకు కూడా షుగర్ పెరిగింది ఇండియాలో నా డాక్టర్ కి ఫోన్ చేస్తే ఇన్సులిన్ దోసె పెంచాడు. అమెరికాలో డాక్టర్ అపాయింట్‌మెంట్ అంత తేలిగ్గా దొరకదు . ఇద్దరినీ జాగ్రత్తగా చూస్కుంటూ గడుపుతున్నా. నా షుగరు… బీపీ వేధిస్తున్నా కనపడనివ్వలేదు. రచన ఇద్దరి పిల్లల్ని పెంచడం… వంట, ఇంటి పని, సాగర్…అలసట,నీరసం ఎక్కువవుతున్నది. వేణు,అల్లుడు సహాయం చేసిన నాకు పని ఎక్కువే ఉంటున్నది. మోకాళ్ల నొప్పులతో పాపాయికి స్నానం చేయించడం చాలా కష్టమైంది. అక్కడ పనివాళ్లుండరు. నెలకోసారి వంద డాలర్లు ఇస్తే మెక్సికన్ మెయిడ్స్ వచ్చి ఇల్లంతా క్లీన్ చేసి వెళతారు. వాళ్లంతా అంత పని చేసినా రోజూ ఉండే పనులు ఉండనే ఉంటాయి.
మధ్య మధ్యలో కుమారికి, సుశీలకి ఫోన్ చేస్తూ వాళ్ల విషయాలు పట్టించుకుంటూనే ఉంది. సాగర్ చదువు ఇంకా ఆరు నెలలుంది. పిల్లాడికీ ఆరు నెలలు వచ్చేసాయి. రెండు నెలల క్రిందటే వేణు వెళ్ళిపోయాడు ఇండియాకి. నేనూ ఇండియా బయలు దేరాను. బయలుదేరే ముందు సుశీలతో మాట్లాడాను. “అంతా పిచ్చిగా చేస్తున్నారమ్మా కుమారిగారు మొన్న కమ్యూనిగేట్ దాకా వెళ్ళిపోయారు. వాచ్మెన్ చెబితే తీస్కొచ్చాను. మాన్వితా అంటూ కాలనీలో అందరిళ్ళల్లో వెతుకుతున్నారు మనవరాలి మీద బెంగెట్టుకున్నారమ్మా. మీరు త్వరగా వచ్చేయాలమ్మా ” అంటూ బాధ పడింది.
ఇంటికొచ్చాము నేనూ వేణూ… జెట్‌లాగ్ వల్ల నీరసం, తలనొప్పి అయినా వెంఠనే కుమారి ఇంటికి బయలుదేరాను. ఇంటి నిండా గోల గోలగా బంధువులు ఆశ్చర్యపోయాను. ఇంటి ముందు టెంట్ రూప ఆమె భర్త, మాన్విత కూడా ఉన్నారు. పోలీసుల పహారాలో ఉంది ఇల్లు. హాల్ను మూసేసారు.
సుశీల భోరుమంది నన్ను చూసి.. “‘ఏమైందో తెలీదమ్మా నేను బట్టలారెయ్యడానికి మేడ మీద కెళ్ళా ఈ లోపల అమ్మగారు హాల్లో అదిగో డబ్బు, నగలు, ఇల్లు,పొలం కాగితాలు అన్ని తనకు కట్టేస్కుని నిప్పెట్టేసుకున్నారు.కదలకుండా అట్లాగే కూర్చుండిపోయారు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కే సుకున్నారు. ఒంటి మీద కిరోసిన్ పోస్కుని కాల్చేసుకున్నారమ్మా, ఏడు లక్షలు,నగలు…కాలి బూడిదైపోయింది అమ్మా…’’
సుశీల ఏడుస్తూనే ఉంది. “ఇంత శబ్దం లేదమ్మా.. డబ్బు, నగలు, ఊర్లో ఇంటి కాయితాలు అన్నీ ఒంటికి కట్టేసుకున్నారెందుకో,.మనుషుల్ని దూరం చేసే డబ్బు అంటే అసహ్యంగా ఉంది సుశీల అనేవారమ్మా మాటి మాటికీ నోట్లో గుడ్డలు చుట్టేసుకున్నారు. నోట్లోంచి ఇంత శబ్దం లేదు, ఏడుపు లేదు, కన్నీళ్ళే లేవమ్మా. బట్టలు పైన బాత్రూంలో ఉతికి డాబా మీద ఆరేసి వచ్చే లోపల కాలి బూడిదైపోయారమ్మా… ఏదో బయట టయర్లు కాలుతున్నాయనుకున్నా అమ్మో… కుమారిగారు కాలి బూడిదై పోయారు. ఈ ఇంటి కాయితాలు మాత్రం నాకు వారం క్రితమే మీకు ఇమ్మని ఇచ్చారు.నాకప్పుడు అనుమానమే రాలేదమ్మా ఏదో మామూలుగా చెప్తున్నారనుకున్నా. కానీ ఇంత పని చేస్తారనుకోలేదమ్మా. ఈ ఇంటిని వృద్ధాశ్రమంగా నడపమని మీకు చెప్పమని సంతకాలు తీస్కున్నారమ్మ. వచ్చాక మీ సంతకాలు తీస్కోమన్నారు. లాయర్ని కూడా మిమ్మల్ని కలవమన్నారు.’’ సుశీల భోరుమని ఏడుస్తోంది.
***
గది మధ్యలో కాలి బూడిదైన కుమారి దేహం ఒంటి నిండా కాలిన నగలు, కాగితాలు నాకు దుఃఖం రాలేదు. దిగ్భ్రాంతిగా చూస్తుండిపోయాను. పోలీసులు లోపలికొచ్చి నన్ను సుశీలను బయటకు పంపారు!
కుమారిని అమెరికాకు రానివ్వని… రాని ఆ కొడుకు అసలు మనిషేనా?
ఆందోళనతో నేను వెంఠనే వేణుకు ఫోన్ చేసి సాగర్…రచన ఎలా ఉన్నారో కనుక్కున్నా… కుమారి కొడుకు తండ్రి దహన సంస్కారాలకి పంపిన నకిలీ కొడుకు గురించి చెప్పా. కుమారి ఆత్మహత్య గురించి చెబుతూ ఏడ్చేసా. కొడుకు అలాగైనా వస్తాడని కుమారి ఎంత తపించిపోయిందో తల్చుకుంటే దుఃఖం వస్తోంది. నకిలీ కొడుకుని చూసినప్పటి ఆమె కళ్ళల్లో దిగ్భ్రాంతితో కదిలిన అయోమయపు నీడలు మర్చిపోలేను. నకిలీ కొడుకు సుభాష్ ని చూసినప్పటి నా గుండె ఒణికిన క్షణాలు… ఇప్పటికీ నకిలీ కొడుకు కళ్ళముందు కనిపిస్తే అలాగే ఒణికిపోతాను. సుభాష్ చాలా మామూలుగానే, అందరిలాగానే ఉన్నాడు. అయినా అతన్ని చూస్తుంటే భయంతో వెన్ను జలదరించింది. అమెరికాలో ఉన్న తన కొడుకుని కుమారీ నవమాసాలూ మోసి కన్నది. మరి ఈ నకిలీ కొడుకుని సృష్టించింది ఎవరు? మనీషా డబ్బా,స్వార్థమా., లేక అమెరికా కలనా ? రేపు నా కొడుకూ అలా తయారవుతాడా… నకిలీ కొడుకుగా… నేను కన్నవాడిగా కాకుండా రెండుగా, మూడుగా బహుముఖాలుగా విడి పోతాడా ఏమో.,? కళ్ల ముందు అంత్య క్రియలకి వచ్చిన కుమారి కొడుకు సుభాష్ కనపడ్డాడు. అతని తలమీద కోసుగా మొలిచిన కొమ్ములు,నోట్లోంచి కోరలు కనబడ్డాయి.అసలు అతను మనిషి లాగే కనపడలేదు. వీడు కాదూ అసలైన నకిలీ కొడుకు? “ఆంటీ అమ్మ ఇచ్చిన ఆస్తి కాగితాలు ఏవి ఒకసారి చూపిస్తారా”? ఆ మృగం అడుగుతుంటే వాడి వైపు చూడడానికి కూడా అసహ్యం తో కూడిన భయం వేసి గబ గబా ఇంటికొచ్చి పడిపోయింది.
***
కుమారి మరణం నన్ను క్రుంగదీసింది.స్తబ్దంగా అయిపోయాను. పిల్లల మీద బెంగతో కాలి బొగ్గయిన కుమారి నే కళ్ల ముందు కనిపిస్తోంది. “గాయత్రీ చూశావా ఎలా చనిపోయానో ?ఇక నా కొడుక్కి అమెరికా నుంచి ఇండియా వచ్చే అవకాశమే లేకుండా . మంచి శిక్షే వేశానుగా” అంటూ పిచ్చిగా నవ్వుతూ కలల్లో కొస్తున్నది.అసలు కుమారి ఎందుకు చనిపోవాలి? పిల్లలే లోకమా ., పిల్లలు లేకుండా వొంటరిగా బతికే ఆత్మ స్థైర్యం ఎందుకు లేకుండా పోయింది ఆమెలో? సాధారణ మధ్య తరగతి స్రీ గా ఆమె పరిమితి ఇంతేనా ? ఎన్నో సార్లు ఆమెకు ధైర్యంగా బతకాలి అని చెప్ప చూశాను. ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చే కథలు చదవమని ఇచ్చేదాన్ని. నాతో పాటు బలవంతంగా సాహిత్య సభలకి తీసుకెళ్లేదాన్ని. అయినా ఆమెలో ఎంతకూ రాని కొడుకు మీద మమకారం పోలేదు. అతని కోసం ఎదురు చూడడం,ఏడవడం మానలేదు. ఏనాడూ ఆ కొడుకు తల్లితో ఒక ఐదు నిమిషాలు మాట్లాడలేదు. “మోకాళ్ల నొప్పులయితే యశోదా లో చూపించుకో డబ్బులేస్తాను.,ఏముంటాయమ్మా కబుర్లు నాకు టైమ్ లేదు మీటింగ్ ఉంది” అంటూ ఫోన్ పెట్టే సేవాడు. వాడికి మాట్లాడడానికి కూడా టైమ్ లేదే గాయత్రి . మాటి మాటికీ ఫోన్ చెయ్యద్దని చిరాకు పడతాడు. వాడి మొఖం కూడా మారిచిపోయానే” అంటూ తనని పట్టుకుని ఏడిచేది. నా పరిస్థితి ఏంటి రేపు ., ఎంతైనా మనిషినే కదా ఈ దూరాలు గాయ పరుస్తాయి . కుమారినైతే కాల్చేసి మసీబొగ్గు చేసి పడేశాయి. నాకు భయం వేసింది. వెంటనే టేబుల్ మీద ఉన్న నేను రాసిన “వొంటరి అమ్మ” కథ ఉన్న పుస్తకం తీసుకున్నాను. దాన్లో కథానాయిక పిల్లలున్నా లేని తన వొంటరి జీవితంలో ఖాళీ ని ఎంత పాసిటివ్ గా మలుచుకుందో రాశాను. ఆ కథ చదివి ఒక పాటకురాలు ఫోన్ చేసి “మేడమ్ మీ కథ చదివాక డిప్రషన్ నుంచి బయట పడ్డాను” అని చెబితే ఎంత సంతోషించింది? ఆమాత్రం కుమారి చేయలేకపోయింది. కానీ తను మాత్రం కుమారిలా అసలు కాదు. గాయత్రి తనకు తాను భరోసా ఇచ్చుకునేందుకు ప్రయత్నించింది.
***
‘‘అమ్మా… నా సెమిస్టర్ ఇంకో నెలలో అయిపోతుంది… మంచి జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి కానీ నాకు ఇక్కడ ఉండాలని లేదమ్మా… నీ దగ్గరికి వచ్చేస్తాను. నా కోసం నాన్నా, నువ్వు ఈ వయసులో ఇంత అనారోగ్యాల్లో అమెరికాకి తిరగడం నాకు నచ్చట్లేదు. నాకు చాలా గిల్టీగా ఉంది. సెమిస్టర్ పూర్తి కాగానే నేనూ నాన్నా బయలు దేరి వచ్చేస్తాం సరేనా?’’ ఇండియా వస్తున్నానంటేనే చాలా ఎక్సైటింగ్ గా ఉందమ్మా… నాన్నకి కూడా ఒంట్లో బాగా లేదు. బీపీ పెరిగింది మొన్న. ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏమీ బాగుండవు.తెలుసు కదా. ఎమర్జెన్సీకి కూడా రెన్నెల్ల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారమ్మా…నాకు కూడా ఇక్కడ ఏమీ బాగాలేదమ్మా,. వచ్చేస్తా నాన్నని తీస్కుని”…సాగర్ చెబుతూ పోతున్నాడు…సాగర్ లో ఇంత మార్పు ఒక్కసారిగా వచ్చిందా ఏమో?పరాయి దేశంలో చావుని దగ్గరగా చూసినవాడు కదా., అలాగే కుమారి భయంకరమైన చావు ప్రభావం కూడా సాగర్ మీద పది వుండవచ్చు. నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్న సంగతి నేను గమనించనే లేదు.గొంతు దుఖం తో పూడుకు పోతుంటే “రా నాన్నా వచ్చేయ్” అని మాత్రం అనగలిగాను.
***
సాగర్ ఫోన్ పెట్టేశాక నా కళ్ళ ముందు ఒక్కసారిగా అమెరికా వెళ్ళే విమానం కనపడింది. ఫ్లైట్ అంతా దాదాపు అంతా ముసలి దంపతులే… మెడలకు సర్వైకల్ కాలర్లు చుట్టుకుని… మోకాళ్ళకి ‘నీ కాప్స్’ పెట్టుకుని బిడ్డల కోసం అమెరికా వస్తూ… పోతూ… గాజు కళ్ళేసుకుని… వాళ్ళల్లో నేనూ… కుమారీ… కుమారీ భర్త ప్రసాద్.
కుమారీ, ప్రసాద్ ఇద్దరూ అదృశ్యమైనారు. ఆ ప్లైట్లో చాలా సార్లు ముసలి దంపతుల్లో ఒకసారి చూసిన వాళ్లు మరోసారి కనపడరు. ఒంటరైన వాళ్ళు నిర్వేదంగా కూర్చుని కనిపిస్తారు. అమెరికాకెళ్ళే ముసలి జంటల్లో కొందరు కొద్ది సంతోషంగా… చాలా మంది నిరాశగా… మరికొద్ది మంది అభావంగా కన్పిస్తారు.
బీపీలకి… షుగర్లకి మందులు ఇంజెక్షన్లు ఫ్లయిట్లోనే తీస్కుంటూ ఉంటారు. ఎందుకు వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో ఎన్ని రోజులుంటారో… ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు… మా అమ్మాయి కాన్పుకి వెళ్తున్నామండీ… మా అమ్మాయికి కేన్సర్ అండీ… కన్నీళ్ళతో చెప్తూ అపరిచితుల ఓదార్పుతో ఉపశమనం పొందుతూ… అల్లుడు సతాయిస్తున్నాడండీ అమ్మాయినీ… ఆఫీసులో ఎవరితోనో సంబంధమట… ఆత్మహత్య చేస్కోబోయిందిట… పక్కింటి వాళ్ళు రక్షించారు.. వెళుతున్నాం అమ్మాయి దగ్గరికి…అమ్మాయి కాన్పు కి వెళుతున్నాం .,ఈ సారి రిస్క్ బాగా ఉందిట., కన్నీళ్ళు తుడుచుకుంటూ ఓ ముసలావిడ… కన్నీళ్ళు దాచుకుంటూ ముసలాయన… ఫ్లైట్లో అంతా వీళ్ళే. గాజు కళ్ళేస్కుని, వడిలిన కండరాలు, ముడతలు పడ్డ చర్మం, కంపిస్తున్న దేహం… ఆ ఫ్లైట్ ముసలి వాళ్ళ ఫ్లైట్. రిటైర్ అయిన అమ్మానాన్నల ఫ్లైట్… పిల్లల కోసం, మనవళ్ళను పెంచడం కోసం, విరిగిన రెక్కలతో.,వేధించే రోగాలతో ఆదరాబాదరా ఫ్లైట్ ఎక్కుతూ దిగుతూ… నడుములు విరిగిపోతున్నా, నడవలేక పోతున్నా రోజుల తరబడి ప్రయాణాలు చేస్తూ… సముద్రాలు, ఆకాశాలు దాటుతూ, ప్రమాదాలు లెక్క చేయకుండా బిడ్డల కోసం చేసే ప్రయాణాలవి.,వృద్ధుల ప్రయాణాలు.. వృద్ధ ప్రయాణాలు.,వ్యధా ప్రయాణాలు ., ప్రతిగా పిల్లల ప్రేమ దొరకని వృద్ధ ప్రయాణాలు. ఇక అమెరికా పోమండీ… ఈ ప్రయాణాలు చేయలేము… హైదరాబాద్‌లో వృద్ధాశ్రమంలో చేరిపోతాము. పిల్లలూ అదే చేయమంటున్నారు. మేం ఎలాగూ రాలేము ఒంటరిగా ఇళ్ళల్లో ఉండే బదులు వృద్ధాశ్రమాల్లో చేరిపోండి పైసలు పంపిస్తాం. మమ్మల్ని రమ్మని చావగొట్టకండి. ఇక్కడ మిమ్మల్ని చూసే ఓపిక, టైము, డబ్బు మాకు లేవు అంటున్నారండీ… హైదరాబాద్ వెళ్ళగానే వృద్ధాశ్రమంలోనో చేరిపోవాలి… దుబాయ్ స్టేట్లో ఒక ముసలి దంపతుల బాధ…ఆయన తల పారకిన్సన్స్ వ్యాధితో వణుకుతున్నది . ఏమిటీ మలి సంధ్య దుఃఖం? ఎలా భరించేది… కుమారి., కుమారి మరణం కలిచివేసింది, భయం వేసింది. ఎంత మాతృ ప్రేమ ఉన్నా… పిల్లలు లేకుండా… వాళ్ల దయ లేకుండా బతకాలి… తమ కోసం బతకాలి అని కుమారి ఎందుకు అనుకోలేదు. కుమారి – ప్రసాద్ లాంటి వాళ్ళు ఎందుకు అనుకోరు? దయలేని పిల్లల్ని ఒదిలేసి వాళ్ళే పిల్లలై మళ్ళీ జీవిత చరమాంకంలో బతకాలని… పిల్లలకి బుద్ధి చెప్పాలనీ?
నాకు ఉండీ ఉండీ దుఃఖం వస్తోంది… చేతిలో ఫోన్ తీస్కున్నా ఫేస్‌బుక్ ఓపెన్ చేసా…
నా మీద కామెంట్ పెట్టిన రచయిత్రి మలేషియా టూర్ ఫోటోలలో వికృతంగా నవ్వుతోంది.
నేను కాగితం కలం తీస్కున్నా… కళ్ళముందు కాలి మసిబొగ్గైన కుమారి ఎముకలు. ఆమె కటి వలయపు ఎముకలు…. వెడల్పాటి మూకుడులాగా పిల్లల్ని కన్న గర్భాన్ని మోసిన ఎముకలు., పిల్లల కోసం గుండెల మీద కొట్టుకుంటూ ఏడ్చిన., గోరు ముద్దలు తినిపించిన ఆ చేతి ఎముకలు., పిల్లల కోసం తల పగల గొట్టుకుంటూ ఏడ్చిన, మెదడును దుఃఖంతో ఒత్తిడితో పిప్పి చేసుకున్న పుర్రె ఎముకలు … కొడుకుల కోసం ఎదురు చూసి ఎదురు చూసి మంటల్లో కాలి పోయి, బూడిదై పోయిన కుమారి మళ్ళీ లేస్తుందేమో… కొడుకుకోసం అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తుందేమో? అనిపించింది. కళ్ల ముందు కుమారి కనిపించి నిలువెల్లా ఒణికాను.
కుమారి కథ రాస్తాను….
‘‘ఫ్త్లెయింగ్ మథర్స్” ! అని పేరు పెట్టేసాను. కొత్త వృద్ధ రెక్కలు మొలిపించుకుని అమ్మలు అమెరికాకు ఎగురుకుంటూ ఎందుకు వెళతారంటే…??’’ అని టాగ్ పెట్టి … కథ మొదలు పెట్టాను.
అద్భుతంగా రాశారు. అందరు పిల్లలు ఇలా వుండరు. ఇండియాలోనే వుంటూ ఆస్తి తగాదాలతో తలకొరివి పెట్టని తల్లితండ్రులు వున్నారు.
యూఎస్ వెళ్తున్నప్పుడు ఓ ఎనభై ఏళ్ల వృద్ధురాలిని చూశాను. కూతురి కాన్పు కోసం వెళ్తున్నానని ఆవిడ చెప్పినప్పుడు ఫీలయ్యాను. ఆవిడకే ఒకరు సేవ చేయవలసిన వయసులో ఇలా వెళ్లి ఏం చేస్తుంది అనిపించింది. లేట్ మ్యారేజ్ , లేట్ గా పిల్లలు అందువల్ల అన్నారు ఆవిడ.
కథ చాలా బాగుంది. 👌💐🌹💐