ప్రేమరాహిత్యపు మరణాలు లేవనెత్తే ప్రశ్నలు

హాలీవుడ్ అగ్రశ్రేణి తారగా ప్రసిద్ధి చెందిన అమెరికన్ నటి మార్లిన్ మన్రో ఆగస్టు 4, 1962 న మరణించింది. తన అసలు పేరు నార్మా జీన్ మార్టెన్సన్. ఒక దశాబ్ద కాలంపాటు తాను నటించిన సినిమాలు అత్యధికంగా వసూళ్లు సంపాదించాయి. అందానికే తప్ప అభినయ కౌశల్యానికి తావివ్వని పాత్రల మూస నుండి బయటపడి ఉత్తమ నటిగా గుర్తింపు కూడా సంపాదించింది. మానసిక సమస్యలతో బాధపడే తల్లి, బాల్యపు అనుభవాలు తన జీవితంలో చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. విఫల ప్రేమలు, భగ్న వివాహాలు జీవితాన్ని దారుణంగా గాయపరిచాయి. లాస్ ఏంజెల్స్ నగరంలోని ఇంటిలో ఆగస్టు 4, 1962న ఆ రాత్రి ఆమె చనిపోయింది. మార్లిన్ మన్రో మరణం అనేక చర్చలకీ, పుకార్లకీ దారితీసినా చివరికి అది ఆత్మహత్యగానే  నమోదు అయింది.

మార్లిన్ మన్రో సన్నిహిత మిత్రుడూ, కవీ అయిన నార్మన్ రోస్టన్ తనకోసం ఒక గీతాన్ని రాశాడు. ప్రఖ్యాత గాయకుడు పీట్ సీగర్ ఆ గీతానికి సంగీతాన్ని కూర్చాడు.

ఆ గీతాన్ని యూ ట్యూబ్ లో వినవచ్చు. గీతానికి తెలుగు అనువాదం చదువుకోబోయే ముందు, గాయకుడు పీట్ సీగర్, మాటలు గుర్తు చేసుకోవాలి.

నార్మా జీన్ ని ఎవరు చంపారు?

ఖాళీ కోరలున్న జంతువు నాకొకసారి కలలో కనిపించింది. నేనెంతగానో అభిమానించిన మా అత్తగారు క్యాన్సర్ వ్యాధితో మరణించినప్పుడు నేనా జంతువుని మొదటిసారి చూశాను. ఆ జంతువూ అలా వచ్చి, ఆమె వీపుకు అతుక్కుపోయింది. బోలుగా వున్న వందలాది గోళ్ళు, కోరలతో అది ఆమె మెడని, భుజాలని, చేతులని, వెన్నెముకని చుట్టుకుంది. రెండు పెద్ద కళ్లతో అది మావైపే మౌనంగా, తీక్షణంగా చూస్తూ వుంది. నా తనివితీరా జుర్రుకునేదాకా నన్ను మీరు వదిలించుకోలేరు అని మాతో అది అంటున్నట్టు అనిపించింది. మనిషి జీవానికోల్పోయిన పెంకులా మారేవరకూ అది జీవ రసాన్ని మొత్తం బోలుగా ఉన్న కోరలతో పీల్చుకుంది.

‘‘సంస్కృతీపరిశ్రమ కబంధ హస్తాలలో చిక్కుకున్న ఒక స్నేహితురాలిని చూశాక ఆ ఖాళీ కోరల జంతువు నాకు మళ్ళీ, మళ్ళీ కనిపించింది. ఈ సంస్కృతీ పరిశ్రమ లాభాలు సంపాదించి పెట్టేంత వరకూ మాత్రమే మనిషికి విలువ ఇస్తుంది. ఈ విధ్వంసం ఎల్లవేళలా కొనసాగుతూ ఉంటుంది. మామూలు జనాలకు అది ఎన్నడూ వింతగా కనిపించదు.

గీత రచయిత నార్మన్ రోస్టెన్ తన గీతం గురించి ఇలా చెప్పాడు,

మార్లిన్ మన్రో చనిపోయింది గనక ఇప్పుడు తనగురించి రాయడం కష్టం. తన గురించి రాయాలంటే భూతకాలపు వాక్యాలు సరిపడవు. అంతటి సజీవమైన వ్యక్తి తాను. తను నాకు తెలుసు, నాకు తానంటే అభిమానం. తానొక విచిత్రమైన వ్యక్తి, వేధింపులకు గురయిన మనిషి, ప్రేమాస్పదమైన యువతి, సరదా మనిషి, సాహసాన్ని ఇష్టపడే వ్యక్తి, చావును సవాలు చేస్తున్నట్లనిపించే మనిషి. నిజం, చావు తనని దెబ్బతీసింది. హాలీవుడ్ ప్రేమరాహిత్యపు ఛాయా ప్రపంచంలో తన జీవితాన్ని దగ్గరనుంచి చూసిన వాళ్ళం తనగురించి ఏం చెప్పగలుగుతాము? హృదయంలో అంతటి ప్రేమని దాచుకున్న మనిషి – మనుషుల పట్లా, జంతువుల పట్లా, పక్షుల పట్లా, చెట్ల పైనా అంతటి ప్రేమని హృదయంలో నింపుకున్న మనిషి – ప్రేమ రాహిత్యంలో మరణించింది.

దీనికి ఎవరిని నిందించాలి? నిజానికి చాలా ఆలస్యంగా ఎవరిని నిందించాలా అని నేను ఆలోచించాను. ఇతరులకి ఎంత పట్టినా పెట్టకపోయినా, నా వరకు నేను నా కవితలో సమాధానం చెప్పుకున్నాను.

నార్మా జీన్ ని చంపింది ఎవరు?

  • నార్మన్ రోస్టెన్

నార్మా జీన్ ని చంపింది ఎవరు?
నేనే, ఒప్పుకుంది నగరం
పౌర బాధ్యతలలో భాగంగా
నేనే నార్మా జీన్ ని చంపాను
ఆమె చావుకు సాక్షులెవరు?
నేనే, ఒప్పుకుంది రాత్రి,
పడకగదిలో వెలిగిన దీపం తోడుగా
ఆమె చావును మేం కళ్లారా చూశాం
ఆమె రక్తాన్ని ఎవరు పట్టారు?
నేనే, ఒప్పుకున్నాడు ఆమె అభిమాని
నా చేతిలో చిన్న పాత్రలో
ఆమె రక్తాన్ని పట్టాను
ఆమె శవంపై కప్పే వస్త్రాన్ని ఎవరు తెస్తారు?
నేనే, ఒప్పుకున్నాడు ఆమె ప్రేమించిన వ్యక్తి
నా అపరాధ భావనను కప్పి పెట్టుకోవడానికి
నేను ఆమె శవంపై వస్త్రాన్ని కప్పుతాను
ఆమె కోసం సమాధిని ఎవరు తవ్వుతారు?
యాత్రికుడు వస్తాడు
ప్రదర్శన స్థలం సందర్శకుల కోసం
యాత్రికుడు ఆమె సమాధిని తవ్వుతాడు
ఆమెకోసం కర్మకాండలు జరిపే వ్యక్తి ఎవరు?
చావుతో లాభాలని కోల్పోయే
పదిశాతం ఐశ్వర్యవంతులు
ఆమె కర్మకాండలు జరిపిస్తారు
ఆమె శవపేటికని మోసేదెవరు?
మేమే, ప్రకటించాయి పత్రికలు
వేదనలో, బాధలో
ఆమె శవపేటికని మేమే మోస్తాము
ఆమెకోసం విషాదపు గంటని ఎవరు మోగిస్తారు?
నేనే, బందీగా గదిలో ఉన్న
ఆమె పిచ్చి తల్లి అరిచింది
గంటని నేను మోగిస్తాను
త్వరగా ఆమెని మరచిపోయేదెవరు?
నేనే, సమాధానమిచ్చింది పత్రికలో ప్రముఖుల పేజీ
తెరమరుగు అవుతూ
అందరికంటే ముందు మరచిపోయేది నేనే

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

One thought on “ప్రేమరాహిత్యపు మరణాలు లేవనెత్తే ప్రశ్నలు

Leave a Reply