నెత్తురోడుతున్న పాలస్తీనాలో ప్రతిఘటనా జ్వాలలు

గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న జాతిసంహారం (genocide) మొదలై ఎనిమిది నెలలు కావస్తున్నది. 76 ఏండ్ల క్రితం ఇజ్రాయిల్ స్థాపనతో పాలస్తీనీయుల జాతి ప్రక్షాళన (ethnic cleansing) మొదలయింది. 76 ఏండ్లుగా పాలస్తీనా ప్రజలను బలవంతపు వలసలకు గురి చేస్తూ, ఊర్లలో నుండి వెళ్లగొడ్తూ, జైళ్ళలో వేస్తూ, మిలిటరీ దాడులతో హత్యాకాండలు చేస్తూ ఇజ్రాయిల్ జాతి ప్రక్షాళన కొనసాగిస్తున్నది. అది ఇప్పుడు తారాస్థాయికి చేరి ఏకంగా జాతిసంహారానికి పాల్పడుతున్నది. సౌత్ ఆఫ్రికా ఇజ్రాయిల్ పై ప్రపంచ కోర్టు (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్) లో వేసిన కేసులో పాలస్తీనా ప్రజలకు జెనొసైడ్ కన్వెన్షన్ ప్రకారం హక్కులను అడిగే సంభావ్యత ఉందని కోర్టు జనవరి 26, 2024 న తీర్పునిచ్చింది. అందులో భాగంగా ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వుల్లో ఇజ్రాయిల్ ను జాతిహననం జరగకుండా చర్యలు తీస్కోవాలని, వెంటనే మౌలిక సదుపాయాలు, మానవీయ సహాయం అందేలా చర్యలు తీస్కోవాలని ఆదేశించింది. అవేమీ చేయకపోగా ఇజ్రాయిల్ దాడులను ఉధృతం చేసి, ఎలాంటి ఆహారం, నీళ్ళు, మందులు, ఇతర సహాయం గాజాలోకి ప్రవేశించకుండా నిరోధించి గాజాలో కరువు పరిస్థితులను సృష్టించింది. గాజా ప్రజలు ఒకవైపు బాంబు దాడుల్లో చనిపోతుంటే మరోవైపు తిండి లేక, చికిత్స చేయగలిగిన వ్యాధులకు కూడా మందులు లేక చనిపోతున్నారు. ఉత్తర, మధ్య గాజాలలోని ప్రజలను ఖాళీ చేయించడంతో మొత్తం 23 లక్షల మంది గాజా జనాభాలో సుమారు 15 లక్షల మంది దక్షిణాన ఉన్న రఫాలో ఆశ్రయం పొందుతున్నారు. గాజా వైశాల్యం 140 చదరపు మైళ్లు కాగా రఫా వైశాల్యం 24.7 చదరపు మైళ్లు. పారిపోవడానికి మరో చోటు లేకుండా, శరణార్థుల టెంట్లతో కిక్కిరిసిపోయి వున్న రఫాపై కూడా ఇజ్రాయిల్ మిలిటరీ మే 6 న దాడి మొదలుపెట్టింది.

ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా ఇజ్రాయిల్ పై కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని మళ్ళీ ప్రపంచ కోర్టును ఆశ్రయించింది. సౌత్ ఆఫ్రికా వాదనలు విన్న ప్రపంచ కోర్టు మే 24, 2024 న ఇజ్రాయిల్ వెంటనే రఫా పై దాడిని నిలిపివేయాలని, బార్డర్ క్రాసింగ్ లను వెంటనే తెరిచి మానవీయ సహాయం గాజాలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన రెండో రోజు మే 26 న, రఫాలో సేఫ్ జోన్ గా ప్రకటించిన ప్రదేశంలో టెంట్లపై బాంబు దాడులు చేసి ఇజ్రాయిల్ 45 మంది పాలస్తీనీయులను చంపింది. ఎందరో పిల్లలు కాలిన గాయాలతో చనిపోగా, తండ్రి చేతిలో తల లేని పసివాడి శవం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దానిని ఇజ్రాయిల్ ‘పొరపాటున జరిగిన దాడి’ అని ఒకవైపు చెబుతూనే మరోవైపు 48 గంటల్లో మరో రెండు దాడులు చేసి 28 మంది పాలస్తీనీయులను హతమార్చింది. ఆ దాడుల నుండి తేరుకోకముందే ఇజ్రాయిల్ ట్యాంకులు మే 28 న రఫా లోకి ప్రవేశించాయి.

మరో వైపు వెస్ట్ బ్యాంక్ లో అక్టోబర్ 7, 2023 తర్వాత గాజాలో యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఇజ్రాయిల్ సైన్యాలు దాడులు ముమ్మరం చేశాయి. దానితో పాటు ఇజ్రాయిలీ సెట్లర్లు పదేపదే పాలస్తీనా ఊర్లలో చొరబడి దాడులు చేస్తూ, అక్కడి నివాసితులను వెళ్లగొట్టి, వాళ్ళ ఇళ్లను ఆక్రమించుకుంటున్నారు. వెస్ట్ బ్యాంకులో అక్టోబర్ 7, 2023 నుండి మే 16, 2024 వరకు అటు సైన్యం, ఇటు సెట్లర్ల దాడుల్లో కలిపి కనీసం 502 మంది చనిపోయారు. అందులో 124 మంది పిల్లలు. అక్కడ సుమారు 4000 మంది నిర్వాసితులు కాగా, 8000 మంది అరెస్టు చేయబడ్డారు.

ఇజ్రాయిల్ జరుపుతున్న ఈ నరమేధానికి అమెరికా బేషరతుగా ప్రత్యక్ష మద్దతునందిస్తోంది. అమెరికా ఆయుధాల సరఫరా ఆపేస్తే కొన్ని రోజుల్లోనే యుద్ధం కొనసాగించడానికి ఇజ్రాయిల్ దగ్గర ఆయుధాలు మిగలవని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయిల్, అరబ్ దేశాలకు మధ్య జరిగిన 1967 యుద్ధంలో ఇజ్రాయిల్ గెలిచి సిరియా నుండి గోలాన్ హైట్స్, జార్దన్ నుండి వెస్ట్ బ్యాంక్, ఈజిప్ట్ నుండి గాజా స్ట్రిప్, సైనాయ్ పెనిన్సుల లను ఆక్రమించుకుంది. ఆ యుద్ధంలో విజయం ద్వారా ఇజ్రాయిల్ మధ్య ప్రాచ్యంలో తన తిరిగులేని బలాన్ని నిరూపించుకున్నాక అమెరికా ఇజ్రాయిల్ కు సహాయాన్ని అందించడం మొదలుపెట్టింది. బదులుగా ఇజ్రాయిల్ మధ్య ప్రాచ్యపు దేశాలలో అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వాలను నిలబెట్టడంలో, ప్రతికూలమైన పాలనలను పడగొట్టడంలో దోహదపడింది. అమెరికా నేరుగా మిలిటరీ సహాయం చేయడానికి ప్రజామోదం లేని ప్రభుత్వాలకు ఇజ్రాయిల్ ద్వారా సహాయాన్ని అందించింది. అలా ఇజ్రాయిల్ ద్వారా సహాయాన్ని అందించిన ప్రభుత్వాలలో జాతివివక్షను పాటించిన నాటి సౌత్ ఆఫ్రికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, గ్వాటమాలా లోని సైనిక ప్రభుత్వం ఉన్నాయి. అమెరికాలోని మిలిటరీ – పారిశ్రామిక వ్యవస్థ (మిలిటరీ – ఇండస్ట్రియల్ కాంప్లెక్స్) కు ఆయుధాల పరిశోధన, అభివృద్దిలో ఇజ్రాయిల్ సహకరిస్తోంది. అమెరికా సరఫరా చేస్తున్న కొత్త ఆయుధాల పనితనాన్ని ఇజ్రాయిల్ నేరుగా పాలస్తీనా ప్రజాలపై పరీక్షిస్తోంది. వీటికి తోడు అమెరికాలోని కోట్ల మంది క్రిస్టియన్ మితవాదులు, యూదులందరూ పవిత్ర నేల (ఇజ్రాయిల్) కు చేరితే జీసస్ రెండవ రాకకు దోహదం చేస్తుందనే విశ్వాసంతో ఇజ్రాయిల్ కు మద్దతునిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ కోసం లాబీయింగ్ చేసే శక్తివంతమైన సంస్థలు కూడా అమెరికాలోని మీడియాపై, ప్రభుత్వాలపై విశేషమైన ప్రభావం చూపుతాయి. ఇక చివరగా ఇజ్రాయిల్ చేస్తున్న పాలస్తీనా మూలవాసుల జాతిహననం, మూలవాసులైన నేటివ్ అమెరికన్ లను అంతమొందించి స్థాపించబడిన అమెరికా పాలకవర్గాలకు ఇబ్బంది కలిగించకపోవడం ఆశ్చర్యమేమీ కాదు.

అమెరికాతో పాటు ఇజ్రాయిల్ కు దౌత్య, మిలిటరీ సహాయాన్ని అందిస్తున్న దేశాలలో జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉన్నాయి. యురోపియన్ యూనియన్ లోని సుమారు అన్ని దేశాలూ ఇజ్రాయిల్ కు దౌత్య సహాయం చేస్తున్నాయి. ఇజ్రాయిల్ కు సరఫరా అవుతున్న ఆయుధాలలో 30% జర్మనీ నుండి వెళ్తున్నాయి. పాలస్తీనా ప్రజల జాతిసంహారానికి తోడ్పడుతూ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని జర్మనీని నికరాగువా దేశం ప్రపంచ కోర్టు ముందు నిలబెట్టింది. ఇక పాలస్తీనా ప్రజలు ఆశగా ఎదురు చూసిన అరబ్, ముస్లిం దేశ ప్రభుత్వాలు ఎన్నో ఒకవైపు ఇజ్రాయిల్ ను ఖండిస్తూనే మరోవైపు, తమ స్వప్రయోజనాల కోసం ఇజ్రాయిల్ కు సహాయపడుతున్నాయి. ఏప్రిల్ 1, 2024 న ఇజ్రాయిల్ డమాస్కస్ లోని ఇరాన్ కాన్సలేట్ పై జరిపిన దాడిలో 16 మంది చనిపోయారు. దానికి ప్రతిచర్యగా ఏప్రిల్ 13 న ఇరాన్ ఇజ్రాయిల్ పై డ్రోన్, మిసైల్ దాడులు చేసింది. ఆ మిసైల్ దాడులను ఎదుర్కోటానికి సౌదీ అరేబియా, UAE, జనాభాలో ఇరవై శాతం పాలస్తీనియన్లు ఉన్న జార్దన్, ఇజ్రాయిల్ కు సహాయపడ్డాయి. సౌదీ అరేబియా, UAE,ఇరాక్, ఈజిప్ట్, కతర్ లకు సమిష్టిగా చెందిన అరబ్ పెట్రోలియం కంపనీ, SUMED పైప్లైన్ ఇప్పటికీ ఇజ్రాయిల్ కు ముడి చమురు సరఫరా చేస్తూ ఈ జాతిహననానికి సహాయపడుతోంది. ఇజ్రాయిల్ రోజువారీ చమురు దిగుమతుల్లో 60 శాతం ముస్లిం దేశాలైన ఖజకస్థాన్, అజర్బైజాన్ నుండి వస్తున్నాయి.

ఇక పాలస్తీనాకు మద్దతుగా సౌత్ ఆఫ్రికా ప్రపంచ కోర్టులో ఇజ్రాయిల్ పై కేసు వేయగా, నికరాగువా, కొలంబియా, లిబ్యా దేశాలు పాలస్తీనా తరపున కేసులో చేరారు. మాల్దీవ్స్, ఈజిప్ట్, టర్కీ, ఐర్లాండ్, బెల్జియం వంటి దేశాలు తాము కూడా జెనొసైడ్ కేసులో పాలస్తీనా తరపున చేరుతామని ప్రకటించాయి. అటు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ దేశాలు పాలస్తీనా రాజ్యాన్ని గుర్తిస్తున్నట్టు ప్రకటించాయి. ఇప్పటికే సుమారు 140 దేశాలు పాలస్తీనాను గుర్తించినా, యురోపియన్ యూనియన్ లోని ప్రధాన దేశాలేవీ పాలస్తీనాను గుర్తించలేదు. ఆ నేపథ్యంలో స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ లు పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడం సంకేతాత్మకమే అయినా ప్రపంచంలో ప్రజాభిప్రాయం పాలస్తీనాకు అనుకూలంగా మారడంలో విజయంగా చూడవచ్చు. అలానే ఈ గుర్తింపు, యూరోప్ లోని ఇతర దేశాలపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

అయితే దేశ ప్రభుత్వాలు ఎవరికి మద్దతుగా ఉన్నా, అమెరికా, యు. కె తో సహా అన్ని దేశాలలో సామాన్య ప్రజలు మాత్రం పాలస్తీనాకు మద్దతుగా వీధుల్లోకి వస్తున్నారు. దశాబ్దాలుగా అమెరికా మీడియా ప్రచారాన్ని నమ్మి ఇజ్రాయిల్ ను సమర్థించిన అమెరికా ప్రజలు ఇప్పుడు నేరుగా పాలస్తీనా ప్రజల ఫోన్ కెమెరాల నుండి వస్తున్న దృశ్యాలను చూస్తున్నారు. అమెరికాలోని నల్లజాతి ఆక్టివిస్ట్ లు, నేటివ్ అమెరికన్, లటినో, ఎల్. జీ. బీ. టీ, మహిళా హక్కుల కార్యకర్తలు, ఇజ్రాయిల్ దూరాక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా వైపు నిలబడుతున్నారు. మతం, జాతి, రంగుకు సంబంధం లేకుండా, వేల మంది యూదులతో సహా, లక్షలాది ప్రజలు, ముఖ్యంగా యువత పాలస్తీనా కోసం తమ గళం విప్పుతున్నారు. అమెరికాలో దేశవ్యాప్తంగా 500 యూనివర్సిటీ క్యాంపస్ లలో పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరగగా సుమారు 130-140 క్యాంపసులలో విద్యార్థులు నిరసన క్యాంపులను ఏర్పరిచారు. సుమారు 3600 విద్యార్థులు ఈ నిరసనల్లో అరెస్టు కాగా, వాటిలో పాల్గొన్నందుకు పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ సంవత్సరం తమ డిగ్రీ పట్టాలను అందుకోలేకపోయారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో లో జరుగుతున్న నిరసనలో ఒక జర్నలిస్టు ఒక విద్యార్థితో “ఇక్కడ నిరసన చేస్తున్నవాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ ప్రకటించింది కదా,” అని అడిగింది. బదులుగా ఆ విద్యార్థి, “మన ప్రభుత్వం, మన విద్యాసంస్థలు ఈ జాతిసంహారానికి సహకరిస్తే, మేమిక ఆదేశాలను ధిక్కరించే సమయమొకటి వస్తుంది. అప్పుడు వాళ్లు మమ్మల్ని ఏం చేసినా ఫర్వాలేదు. ఈ ప్రపంచంలో మా కెరియర్ల కన్నా, భవిష్యత్తు కన్నా ముఖ్యమైన నైతిక విలువలు, మనుషుల ప్రాణాలు ఉన్నాయి,” అని జవాబు చెప్పాడు. ఆ విద్యార్థి మాటలను ప్రతిబింబిస్తూ వేలకొద్ది విద్యార్థులు యుకె, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ ఇంకా పలు ఇతర దేశాలలో పోలీసు అణచివేతలను ఎదుర్కొంటూ పాలస్తీనా కోసం నిరసనలు చేస్తున్నారు. ఇక టర్కీ, మెక్సికో దేశాలలో నిరసనకారులు ఇజ్రాయిల్ ఎంబసీలకు నిప్పంటించారు. యెమెన్ లో 33 వారాలుగా ప్రతి శుక్రవారం లక్షల సంఖ్యలో జనం పాలస్తీనాకు మద్దతుగా వీధుల్లో మార్చ్ చేస్తున్నారు.

గాజా, వెస్ట్ బ్యాంకులలోని వివిధ పాలస్తీనా ప్రతిఘటనా దళాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మిలిటరీ సహాయాన్ని అందిస్తున్నది, ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో భాగమైన ఇరాన్, లెబనాన్ లోని హెజ్బొల్లా సంస్థ, సిరియా ప్రభుత్వం, ఇరాక్ ఇస్లామిక్ రెసిస్టెన్స్, యెమెన్ లోని అన్సార్ అల్లా సంస్థ. ఇజ్రాయిల్ తో పోరాడడానికి ఇరాన్ తన మిత్రవర్గాలకు ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, నిధులు, శిక్షణ అందిస్తోంది. సిరియా ప్రభుత్వం, ఇరాక్ లోని ఇస్లామిక్ మిలీషియా ఆయా దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై సుమారు రెండు వందల దాడులు చేశాయి. తద్వారా ఇజ్రాయిల్ కు సహాయపడుతున్నందుకు అమెరికాపై ఒత్తిడిని పెంచాలనేది వాళ్ళ లక్ష్యం. ఇక యెమెన్ లోని అన్సార్ అల్లా సంస్థ (హూతీలు) ఎర్ర సముద్రం (Red Sea) లో ఇజ్రాయిల్, దాని మిత్రదేశాలకు చెందిన నౌకలపై దాడులు చేస్తున్నాయి. దానివల్ల ఇజ్రాయిల్, దాని మిత్ర దేశాల నౌకలు వేల మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించి ఆఫ్రికా దక్షిణ కొస చుట్టూ వెళ్ళవలసి వస్తోంది. ఫలితంగా ఆ దేశాలకు నౌకల్లో సరుకుల రవాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. దానికి ప్రతీకారంగా అమెరికా, యుకె లు యెమెన్ పై బాంబు దాడులు చేయగా పదుల సంఖ్యలో సామాన్య ప్రజలు మరణించారు. అయితే ఏది ఏమయినా జంకేది లేదనీ, గాజాలో మారణహోమం ఆగేవరకూ నౌకలపై దాడులు కొనసాగుతాయనీ హూతీలు ప్రకటించారు. ఇక దక్షిణ లెబనాన్ లోని హెజ్బొల్లా, ఇజ్రాయిల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరగటం లేదు కానీ ఆ రెంటి మధ్యా రోజువారీగా దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. గాజాలో నరమేధం జరుగుతున్నంత కాలం ఇజ్రాయిల్ పై దాడులు చేస్తామని హెజ్బొల్లా కూడా ప్రకటించింది. ఇజ్రాయిల్ సైన్యాలు మొత్తం గాజాపై కేంద్రీకరించకుండా హెజ్బొల్లా ఉత్తరాన బలంగా ప్రతిఘటిస్తోంది. ఫలితంగా, సుమారు లక్ష మంది ఉత్తర ఇజ్రాయిలీలు అంతర్గతంగా నిర్వాసితులయ్యారు. గాజాకు సరిహద్దులో ఉన్న దక్షిణ ఇజ్రాయిల్ నుండి కూడా లక్ష మందికి పైగా ఇజ్రాయిలీలు ఖాళీ చేయవలసి వచ్చింది. నాలుగు వైపుల నుండి దాడులను ఎదురుకుంటోన్న ఇజ్రాయిల్ కు ఎనిమిది నెలలుగా నిర్వాసితులైన పౌరులకు నివాసాన్ని ఏర్పరచడం, వాళ్లను సముదాయించడం తలనొప్పిగా మారింది.

ఇక గాజాలో హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, పాపులర్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్టైన్ (మార్క్సిస్ట్ -లెనినిస్ట్) , డెమోక్రాటిక్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్టైన్ (మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావోయిస్ట్), పాపులర్ రెసిస్టెన్స్ కమిటీస్, ఇంకా నాలుగైదు ఇతర సంస్థలు/ పార్టీలు కలిసి ‘పాలస్తీనా జాయింట్ ఆపరేషన్ రూమ్’ అనే ఒక యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడి ఇజ్రాయిల్ సైన్యాలతో హోరాహోరీగా పోరాడుతున్నాయి. వీటిలో 2007 నుండి గాజాలో అధికారంలో ఉన్న హమాస్ అత్యధికంగా యోధులను, ఆయుధాలను కలిగి ఉంది. ఇరాన్ నుండి సాంకేతిక పరిజ్ఞాన సహాయం పొందుతున్నా తమ దగ్గర ఉన్న చాలామటుకు ఆయుధాలను పాలస్తీనా విముక్తి కోసం పోరాడుతున్న సంస్థలు గాజాలోనే అభివృద్ధి చేశాయి. దశాబ్దాలుగా ఇజ్రాయిల్ చేస్తున్న దిగ్బంధం వల్ల అడపా దడపా కొంత ఆయుధాల స్మగ్లింగ్ జరిగినా గాజాలోకి బయట నుండి పెద్ద ఎత్తున్న ఆయుధాలను దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. పాలస్తీనీయులు తమ కాల్పనికతో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆయుధాలను తయారుచేసుకున్నారు. అయితే వాళ్లకు అధికంగా ముడిసరుకును సరఫరా చేసేది ఇజ్రాయిలే. ఇజ్రాయిల్ వేసే బాంబుల్లో పేలని బాంబులతోనే రాకెట్లు, ట్యాంకులను పేల్చే మిసైళ్ళు (anti-tank missiles) తయారుచేసుకుంటున్నారు. ఒక్క పేలని 750 పౌండ్ల బాంబుతో వందల రాకెట్లు, మిసైళ్లు తయారుచేయవచ్చునట. ఇక రాకెట్లు వగైరా తయారు చేయడానికి అవసరమైన కన్‌స్ట్రక్షన్ సామాగ్రి దిగుమతిని కూడా ఇజ్రాయిల్ పెద్దఎత్తులో గాజాలోకి అనుమతించదు. అయితే ఇజ్రాయిల్ దాడుల్లో కూలిపోయిన భవనాల నుండి మిలిటెంట్లు పైపులను, కాంక్రీట్ ను ఆయుధాల కోసం సమకూర్చుకుంటున్నారు.

గాజాలో సుమారు 400-500 కిలోమీటర్ల విస్తారమైన భూగర్భ సొరంగాల నెట్వర్క్ ఉన్నట్టు ఒక అంచనా. ఈ సొరంగాలు విశాలంగా, అంతర్గత సమాచార వ్యవస్థతో, సాలెగూడులా ఇజ్రాయిల్ మిలీటరీకి, ఇంటలిజెన్స్ వ్యవస్థకు అంతుపట్టకుండా ఉన్నాయి. గెరిల్లా యుద్ధానికి అనువుగా ఉండే పర్వతాలూ, నదులూ లేని 25 మైళ్ళ మైదాన ప్రాంతమైన గాజాలో పాలస్తీనా ప్రజలు భూగర్భ సొరంగాలను నిర్మించుకుని, ప్రపంచంలోనే అతిశక్తివంతమైన అమెరికా ఆయుధాలతో, ఇజ్రాయిల్ సైన్యాలతో ధీటుగా గెరిల్లా యుద్ధం చేస్తున్నారు. ఈ సొరంగాలు వైమానిక ఆయుధాలను, వాయు యుద్ధాన్ని అర్థరహితం చేశాయి. ప్రతిఘటిస్తున్న గెరిల్లా యోధులను అంతమొందించలేని ఇజ్రాయిల్, సామాన్య ప్రజలపై 2000 పౌండ్ల బాంబులు వేసి కసి తీర్చుకుంటోంది.

35000-40000 మంది సామాన్య ప్రజలను చంపిన ఇజ్రాయిల్ మిలిటరీ, దీర్ఘకాలిక వ్యూహాత్మక ఓటమిని చవిచూస్తోందని నిపుణులు చెబుతున్నారు. గాజాలో సాధిస్తామని చెప్పుకున్న మిలిటరీ లక్ష్యాలు – హమాస్ ను అంతమొందించడం, గాజాలో ఉన్న ఇజ్రాయిలీ బంధీలను విడిపించుకోవడం, గాజాపై పట్టు సాధించడం – ఏవీ సాధించలేకపోయింది. ఇజ్రాయిల్ లోని ముఖ్య వార్తా పత్రికలైన హారెట్జ్, ది జెరూసలెం పోస్ట్ “ఇజ్రాయిల్ యుద్ధం ఓడిపోయిందని, నిజం ఒప్పుకోక తప్పదని” రాశాయి. యుద్ధం మొదట్లోనే పాలస్తీనా ప్రతిఘటనను తుడిచిపెట్టామని చెప్పుకున్న ప్రదేశాలలో పాలస్తీనా యోధులు శక్తిని తిరిగి కూడగట్టుకుని ఇజ్రాయిల్ తో తలపడుతున్నారు. అటు వెస్ట్ బ్యాంకులో కూడా పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయిల్ సైన్యాలతో అనుదినం పోరాడుతున్నారు. అట్లా పాలస్తీనా విముక్తి పోరాటం ఇజ్రాయిల్ తో war of attrition (దీర్ఘకాలిక యుద్ధంలో శత్రువును బలహీనపరిచే వ్యూహం) కొనసాగిస్తున్నది. ఒకవైపు యోధులను కోల్పోయినా ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న హింసవల్ల సునాయాసంగా అంతకన్నా ఎక్కువ మంది యోధులను రిక్రూట్ చేసుకోగలుగుతున్నారు. ఇజ్రాయిల్ దాడుల వల్ల పుట్టి పెరిగిన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్న ఒక యువకుడు, “నా జ్ఞాపకాలను, నా అనుభవాలను ఈ ఇంట్లో వదిలివెళ్లిపోతున్నా. ఇదిగో పాలస్తీనా యోధుల కోసం కొన్ని నూడుల్స్, గుడ్లు, కూరగాయలు, రొట్టెల పిండి ఇంట్లో వదిలివెళ్తున్నా. నిర్వాసితులవుతున్న గాజా ప్రజలారా, యోధుల కోసం ఇళ్ళలో కొంచెం తిండి వదిలిపెట్టండి. బహుశా ఈ ఇంట్లోకి వాళ్లు అడుగుపెడితే నేను వదిలిపెట్టిన వాటిలోనుండి ఏదైనా కొంచెం తింటారని నా ఆశ,” అని కన్నీళ్ల పర్యంతమవుతూ వీడియో చేసి పోస్ట్ చేశాడు. విముక్తి పోరాటాల్లో ప్రజలే పోరాట యోధులను కాపాడుకుంటారని ఆ వీడియో మనకు గుర్తుచేస్తుంది. పుట్టిపెరిగిన సొంతనేల మీద పాలస్తీనా యోధులు నీళ్ళలో చేపల్లా, మెరుపు తీగల్లా గాజా వీధుల్లో పోరాడుతున్నారు. ట్యాంకు దిగి వీధుల్లోకి అడుగుపెట్టడానికి సాహసించని ఇజ్రాయిలీ సైనికులు, సొరంగాల్లోకి అడుగుపెట్టే ప్రయత్నాలు చాలా అరుదు. గాజా మిలిటెంట్ల గురించి మాట్లాడుతూ ఒక ఇజ్రాయిలీ సైనికుడు, “వాళ్లు మాకు సరిగ్గా కొన్ని సెకండ్లు కూడా కనిపించరు,” అని చెప్పాడు. “వాళ్లు నాకు కనిపించడంలేదు. వాళ్లు నాకు కనిపించడంలేదు. వాళ్లు భూతాలు,” అని భయంతో రోదిస్తున్న ఇజ్రాయిలీ సైనికుడి ఆడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. ఎనిమిది నెలల యుద్ధం తర్వాత గాజాలోని అండర్గ్రౌండ్ టన్నళ్లు ఎక్కువశాతం చెక్కుచెదరకుండా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా మిలిటెంట్ యోధులు 70% మిగిలివున్నారని ఒక అంచనా.

యుద్ధం ఆపి గాజాలో బంధీలుగా ఉన్న తమ బంధువులను తిరిగి తీసుకురావాలని చేస్తున్న నిరసనలు, అంతర్గతంగా నిర్వాసితులైన ప్రజల నుండి ఒత్తిడి, దేశం వదిలివెళ్లిపోతున్న లక్షలాది జనం, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ ఇజ్రాయిల్ కు సవాళ్లుగా మారాయి. గాజాలో వ్యూహాత్మక ఓటమి, అంతర్గతంగా చెలరేగుతున్న సవాళ్లు, యుద్ధం ఆపితే ప్రభుత్వం కూలదోస్తామంటున్న రైట్ వింగ్ రాజకీయ నాయకులు, ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ నెతన్యాహూ ను క్లిష్టమైన పరిస్థితిలోకి నెట్టివేశాయి. ఈ అసాధ్యమైన పరిస్థితుల్లో నుండి ఇజ్రాయిల్ ఎలా బయటపడుతుందనేది ఆసక్తికరమైన విషయం.

సమగ్రంగా చూస్తే, అక్టోబర్ 7 దాడి, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయిల్ జయించలేని శక్తిగా ఉన్న ఇమేజ్ ను విచ్ఛిన్నం చేసింది. ఆ తర్వాత జరుగుతున్న యుద్ధం, మొదటిసారి పాలస్తీనా సమస్యపై ప్రపంచం మొత్తం ప్రధానంగా దృష్టి పెట్టేలా చేసింది. అమెరికా, యూరోప్ దేశాలలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల మనుగడ పాలస్తీనా అంశంపై వారి వైఖరిపై ఆధారపడే స్థాయికి వచ్చింది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దేశాలలో, ముఖ్యంగా అరబ్ దేశాలలో ఈ యుద్ధం పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో చూడవలసి ఉంది. ఇక అన్నింటికన్నా ప్రధానంగా, ప్రపంచం ముందు ఇజ్రాయిల్ ఒక జెనొసైడల్ వ్యవస్థగా, పాశ్చాత్య దేశాలు ఆ మారణహోమాన్ని ప్రోత్సహించేవిగా బహిర్గతం అయ్యాయి. కొన్ని నెలల క్రితమే ఇలాంటి పరిణామం ఊహించలేనిది. ఈ మారణహోమానికి సహాయపడి తమ కపటత్వాన్ని, హిపోక్రసీని బయటపెట్టుకున్న పాశ్చాత్య దేశాలు మానవ హక్కుల గురించి ప్రపంచానికి బోధించే నైతిక అధికారాన్ని కోల్పోయాయి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ యుద్ధం గ్లోబల్ నార్త్ (అభివృద్ధి చెందిన) దేశాలకు, గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న) దేశాలకు మధ్య సమీకరణాలను వేగంగా మార్చుతోంది. ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలుగా పాశ్చాత్య వలసవాదపు హింసను అనుభవించిన దేశాల ప్రజలు పాలస్తీనాకు అండగా నిలబడుతున్నారు. చరిత్ర పట్ల నిజమైన ఉత్సుకతతో, కొత్త ఎరుకతో యువత అమెరికా సామ్రాజ్యవాదంలోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ, పీడితుల పక్షాన మాట్లాడుతున్నారు.

ఇక హిందూ రాజ్యం గురించి కలలు కంటున్న మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ యూదు రాజ్యం వైపు ఆరాధనాభావంతో చూస్తోంది. ఇండియా ఇజ్రాయిల్ తో ఆయుధాలు, టెక్నాలజీనే కాకుండా భావజాలాన్ని, వ్యూహాలను పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో పొంచివున్న ప్రమాదాన్ని పసికట్టడంలో మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామిక గళాలన్నీ ఏకమై నేడు పాలస్తీనా ప్రజల స్వేచ్ఛా పోరాటానికి సంఘీభావంగా నిలబడి, అలాంటి హింస మరెక్కడా పునరావృతం కాకుండా కృషి చేయాలి.

పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

2 thoughts on “నెత్తురోడుతున్న పాలస్తీనాలో ప్రతిఘటనా జ్వాలలు

  1. ఎన్నో వివరాలతో, మాప్ లతో చాలా వివరమైన విశ్లేషణ నందించావు చైతన్యా.గుండెలవిసిపోయే జాతి హననాలు,వేల కొద్దీ ప్రాణ నష్టాల తర్వాత కూడా పాలస్తీనా పోరాట పటిమ కొత్త శక్తినిస్తుంది. ఇకముందు ప్రపంచ పీడిత మానవాళికి పాలస్తీనా దిక్శూచిలా పోరాట పాఠాలు నేర్పుతుంది!

  2. సమగ్రమైన వ్యాసం. Thanks for writing this

Leave a Reply