(ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రమాదమై ముంచుకొస్తున్న బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా విప్లవోద్యమం సాంస్కృతిక ప్రతి వ్యూహాన్ని నిర్మిస్తోంది. వివిధ వాదాల పేరుతో విప్లవోద్యమం, విప్లవ సాంస్కృతికోద్యమాలపై విమర్శలు, దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విప్లవ రచయిత, విమర్శకుడు పాణితో కొలిమి సంభాషణ.)
- పర్‌స్పెక్టివ్ ప్రచురించిన ‘50 ఏళ్ల విరసం పయనం, ప్రభావం’ మీద మీరు గత ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసిన ‘కల్లోల కాల ప్రతినిధి’ పుస్తకం ఒక కంప్లీట్ ఆర్గ్యుమెంట్ అనవచ్చు. విరసం చరిత్రను, అర్ధ శతాబ్ద తెలుగు సమాజ, సాహిత్య చరిత్రను ఎక్కడా మర్చిపోకుండా అంత పెద్ద వాదన చేశారు. అసలు ఆ పుస్తకంలో ఉన్న అంత మంది మేధావులతో సంభాషించడం మీకు ఎలా అనిపించింది?
నిజంగానే అది ఒక అద్భుతమైన అనుభవం. ఆ సందర్భంగా మూడు తరాల ప్రముఖుల ఆలోచనలతో సంభాషించానని అనిపించింది. అలాంటి పనిలో చాలా థ్రిల్ ఉంటుంది. ఎందుకంటే, నేను వాళ్లను వ్యక్తులుగా చూడలేదు. భిన్న ఆలోచనలకు ప్రతినిధులు వాళ్లు. తెలుగు మేధావులు, రచయితలు దేన్నయినా ఎట్లా చూస్తారు? ఎట్లా ఆలోచిస్తారు? దేని మీదైనా వాళ్లు నిర్ధారణకు వచ్చే పద్ధతి ఏమిటి? వాటి వెనుక భావజాలాలు, రాజకీయాలు ఎట్లా పని చేస్తాయి? అనేవి ఆ పుస్తకం రాస్తున్నప్పుడు చాలా లోతుగా తెలుసుకొనే అవకాశం వచ్చింది. అదే సమయంలో వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు, సామాజిక చారిత్రక విశ్లేషణలకు మధ్య మేధావుల ఆలోచనలు ఎలా తిరుగుతుంటాయో తెలిసింది. వీళ్లు అన్ని ఉద్యమాలను ఇలాగే చూస్తున్నారా? అన్ని నిర్ధారణలు ఇలాగే చేస్తున్నారా? అనే సందేహం కూడా కలిగింది.
- ఈ పుస్తకం మీద ఎలాంటి స్పందన వచ్చింది?
పర్‌స్పెక్టివ్ పుస్తకంలో రాసిన వాళ్లలో కొంత మంది సీరియస్‌గా తీసుకున్నారు. ఈ చర్చ ఇంకా జరగాలని అన్నారు. ఎలా జరిగితే బాగుంటుందో కూడా చెప్పారు. కొద్ది మంది మాత్రం మౌనం పాటించారు. ఈ పుస్తకమే రాలేదన్నట్లు ఉండిపోయారు. బహుశా తమ వాదనలకు, వైఖరులకు ఈ పుస్తకాన్ని సమాధానం అనుకున్నారేమో. ఒకవేళ అట్లా అనుకున్నా తిరిగి వాదనలోకి రావాలి కదా. తెలుగు సాహిత్యం, విరసం చరిత్ర, విప్లవోద్యమ అవగాహన, ఆచరణలపై ఆ రచయితల వాదనలను అవతలి వైపు నుంచి ఎట్లా చూడవచ్చో కల్లోల కాల ప్రతినిధిలో ఒక ప్రయత్నం చేశాను. అందుకే నా ఉద్దేశం పర్‌స్పెక్టివ్ పుస్తకానికి సమాధానం చెప్పడం కాదు. వాళ్ల అంచనాలను తప్పుపట్టడం కాదు. పూర్వపక్షం చేయడం కూడా కాదు. ఎక్కడైనా గొంతు అలా వినిపించి ఉంటే అది లోపమే. విప్లవ సాహిత్యోద్యమాన్ని చూడవలసిన పద్ధతిని చర్చనీయాంశం చేయడమే లక్ష్యం. ఆ పుస్తక రచయితల్లో చాలా మంది విరసాన్ని విప్లవోద్యమ నేపథ్యంలో చూశారు. కాబట్టి విప్లవోద్యమాన్ని ఎలా చూడవచ్చునో చెప్పే ప్రయత్నం చేశాను. ఈ క్రమంలో విరసం నేర్చుకోవాల్సినవి ఆ పుస్తకంలో ఏమున్నాయో కూడా రాశాను. మౌనం పాటించిన వాళ్లు ఇవన్నీ ఎంత పట్టించుకున్నారో తెలియదు. అయితే సాధారణ విప్లవాభిమానులు ఆ పుస్తకాన్ని బాగా చదివారు. వాళ్లు దీన్ని కేవలం విరసం మీద చర్చోపచర్చల పుస్తకంగా చూడలేదు. మొత్తంగా విప్లవోద్యమం గురించి మేధావులతో సంభాషించిన పుస్తకంగా గుర్తించారు. దానికి చాలా సంతోషమైంది. ఇది కదా అన్నిటి కంటే ముఖ్యమైనది. మొత్తం మీద పాఠకులు బాగా చదివారని, చదవాల్సినట్లే చదివారని చెప్పవచ్చు.
- ఆ పుస్తకంలో మీరు తెలుగు మేధో రంగం మీద సున్నితంగానే అయినా గట్టి విమర్శ పెట్టారు. కొందరైనా విప్లవ, విప్లవ సాహిత్యోద్యమాలను అర్థం చేసుకోవడంలో లోపం ఉన్నందు వల్లే మీకు విమర్శ తప్పలేదా?
లోపం అనుకోవడం కంటే మన మేధో రంగం ఎట్లా ఉన్నదో పరిశీలిస్తే బాగుంటుంది. మనకు తక్షణ, తాత్కాలిక, పాక్షిక స్వభావం ఉన్న ఉద్యమాలు తెలిసినంతగా దీర్ఘకాలిక పరివర్తనా ఉద్యమాల గురించి తెలుసా? వాటిని విశ్లేషించగల పద్ధతి తెలుసా? అనే ప్రశ్నలు వేసుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలతో సాగే ఉద్యమాలను కూడా కొందరు మేధావులు ఒక చిన్న టైం పీరియడ్‌లోకి కుదించి అంచనా వేస్తుంటారు. ఆ టైం పీరియడ్‌ను కూడా ఒక క్రమంలో భాగం చేసి చూడవచ్చు. అట్లాకాకుండా ఆ టైం పీరియడ్‌లో కంటికి ఏది కనిపిస్తే అదే ఆ ఉద్యమాల గురించిన సత్యం అనుకొని నిర్ధారిస్తుంటారు. ఏదో ఒక విషయాన్ని పట్టుకొని సాధారణీకరిస్తుంటారు. అసలు నిర్దిష్టతలను చూడలేకపోవడం, సాధారణీకరణే లేకుండా ఏదో ఒక నిర్దిష్టమైన అంశాన్నే సాధారణీకరణ అనుకోవడం వల్ల పొరబాట్లు చేస్తుంటారు. మనకు అలవాటైన పద్ధతే కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉంటాయా? అని మధనపడటం లేదు. సామాజిక, సాంస్కృతిక రంగాలను అధ్యయనం చేస్తున్నవాళ్లు మౌలిక మార్పు కోసం నడిచే దీర్ఘకాలిక ఉద్యమాల ఆచరణను సూక్ష్మస్థాయిలో చూడాలి. తక్షణ`దీర్ఘకాలికాల సమన్వయంలో చూడాలి. ఉద్యమాల ప్రభావాన్ని, ఫలితాలను అంచనా వేయాలి. అది సాహిత్యోద్యమమైనా సరే. రాజకీయ ఉద్యమమైనా సరే. అప్పుడు విప్లవోద్యమ ప్రత్యేకతలు తెలుస్తాయి. ఈ దేశంలోని వందల వేల ఏళ్ల కిందటి వ్యవస్థలతో అది ఎలా తలపడుతున్నది? వేగంగా మారిపోతున్న కొత్త వ్యవస్థలపై ఎలా పోరాడుతున్నది? ఈ మొత్తానికి ఉన్న అనుకూలతలు ఏమిటి? కౌంటర్ టెండెన్సీస్ ఏమిటి? వాటితో ఎట్లా వ్యవహరిస్తోంది? అనే వైపు ఆలోచించకపోతే విప్లవోద్యమం అర్థం కావడం కష్టం.
దేనికంటే ఆధునిక భారతదేశ చరిత్రలో విప్లవోద్యమంలాగా సుదీర్ఘకాలంగా సాగుతున్న ఉద్యమం మరేదీ లేదు. ముఖ్యంగా అంత నిర్మాణబలం ఉన్న ఉద్యమమేదీ లేదు. అట్టడుగు ప్రజలను అంతగా క్రియాశీలం చేస్తున్న ఉద్యమం కూడా ఇంకోటి లేదు. మూడు తరాలుగా కోట్ల మంది ప్రజలను తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రభావితం చేయడం ఆ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత. ఆ మాటకొస్తే ప్రతి ఉద్యమం ప్రజలను ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కానీ ప్రజలను దీర్ఘకాలిక ఉద్యమ లక్ష్యాలకు తగినట్లు నిరంతరం మార్చుకుంటూ, వాళ్లలో చైతన్యవంతమైన మిలిటెన్సీని పెంచుకుంటూ పోయే శక్తి విప్లవోద్యమానికే ఉన్నదని ఎప్పుడో రుజువైంది. మానవ జీవితాన్ని అర్థం చేసుకోకపోతే ఇది సాధ్యం కాదు. ఈ పద్ధతి మీద చర్చ జరగాలి. అప్పుడు ఉద్యమాల్లోని లోటుపాట్లు మరింత బాగా కనిపిస్తాయి. వాటి నుంచి బైట పడపడే అవకాశం ఉంటుంది.
- తెలుగు సమాజాల్లో విప్లవోద్యమం, ఇతర ఉద్యమాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి కదా. వాటిని అర్థం చేసుకోడానికి ఈ దిశగా మేధావులు ఆలోచించడం లేదంటారా?
అసలే ఆలోచించడం లేదనని అనలేం. కాకపోతే విప్లవోద్యమ ఆచరణే చాలా సంక్లిష్లమైనది. దాన్ని కేవలం ఆచరణ వైపు నుంచి చూసినా అర్థం కాదు. సిద్ధాంతం వైపు నుంచి చూసినా అర్థం కాదు. సిద్ధాంతం`ఆచరణ కలిసే ఉమ్మడి ప్రాంతం ఏదో తెలిసి ఉండాలి. అక్కడ ఆ రెండూ ఎట్లా కలుస్తాయో తెలియాలి. వాటి మధ్య గతితార్కిక సంబంధం ఉంటుందని ఒక మాట అనుకుంటే సరిపోదు. మామూలుగా మనం సిద్ధాంతాల్లోని క్లిష్టతల మీద కేంద్రీకరిస్తుంటాం. ఆ పని చేయాల్సిందే. కానీ రాజకీయ కార్యక్రమాన్ని ఆచరించేటప్పుడే ప్రజలకు సిద్ధాంతం తెలుస్తుంది. ఆచరణ అన్నిటికంటే సంక్లిష్టంగా ఉంటుంది. ప్రజలను అనేక పోరాట రూపాల్లోకి తీసికెళ్లే చైతన్యాన్ని పరిశీలించాలి. చరిత్రలో ఎప్పటికో పూర్తయ్యే మౌలిక మార్పుకు తగినట్లు ప్రజలు ఈరోజు తమను తాము మార్చుకుంటూ పోతారు. తక్షణ అవసరాలను పరిష్కరించుకుంటూనే ముందుకు నడుస్తారు. దాని కోసం ఇప్పుడు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అవుతారు. ఈ సంసిద్ధత, ఆచరణ, అవగాహన వెనుక ఉండే దృక్పథాన్ని ఎట్లా చూడాలి? వర్తమానాన్నేగాక భవిష్యత్తును కూడా చర్చించే సిద్ధాంతాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి చాలా ఓపిక అవసరం. అవి లేని వారే దీర్ఘకాలిక పోరాటాలపట్ల విసుగు ప్రదర్శిస్తుంటారు. ఇవాళ ఇదొక మేధో సంస్కృతిగా మారిపోయింది. దీర్ఘకాలిక పోరాటాలు సాధ్యం కాదని చెప్పడానికి బోలోడు మేధస్సును వెచ్చిస్తుంటారు. కానీ తక్షణ ప్రయోజనం కోసం ప్రజలు చేసే పోరాటాల్లో ఇప్పటికిప్పుడు జరిగే మేలు ఎంత ఉంటుందోగాని భవిష్యత్తుకే ఎక్కువ మేలు జరుగుతుంది.
ఇలాంటి పోరాటాల్లో ఏ ఆచరణ రూపం అంతకంటే ఉన్నతమైన ఆచరణగా మారగలదో చెప్పగలగాలి. ఏది భిన్నమైన పరిస్థితుల్లో కూడా మిలిటెంట్ రూపం తీసుకుంటుందో గ్రహించాలి. వీటికి వ్యక్తుల్లో, సంబంధాల్లో, నిర్మాణాల్లో, పోరాటాల్లో అనేక అవాంతరాలు ఉంటాయి. వ్యవస్థ వైపు నుంచి ఎక్కువగా ఉంటాయి. కాబట్టే ఆచరణను అధ్యయనం చేయడం చాలా సంక్లిష్టం. ఒక్క విప్లవోద్యమం గురించే కాదు. గతంలో జరిగిన పోరాటాలనైనా, ఇవాళ మన కండ్ల ముందు సాగుతున్న పోరాటాలనైనా వాటి ఆచరణలోంచి చూడాలి. వాటి ప్రకటిత సిద్ధాంతాలను, ఆశయాలను, విలువలను కలిపి మొత్తంగా ఆచరణను పరిశీలించాలి. ఇంత సంక్లిష్టమైన, విస్తారమైన, అనేక స్థాయిల బహుముఖీన ప్రజా ఆచరణను పరిశీలించే పద్ధతి ఉన్నదా? విప్లవోద్యమాలు తమ ఆచరణ నుంచి చెప్పే పరిశీలనలను చూడగల సహనం, వినయం ఉన్నాయా? ఆలోచించుకోవాలి. అట్లాగే ఏ పోరాటాలనైనా చలనంలో భాగంగా చూడాలి. మనం మాట వరసకు చలనం అంటాం కాని, చలనాలు అనాలి. అనేక వేగాలతో, అనేక తలాలలో చలనాలు సాగుతూ ఉంటాయి. వీటిని ట్రిగ్గర్ చేసే అంశం ఏదో కూడా తెలిసి ఉండాలి. వివిధ సమూహాల ఆధారంగా సాగే చలనాలలోని ఘర్షణకు తప్పకుండా వర్గ కోణం ఉంటుంది.
దీన్ని చూసే పద్ధతిని విప్లవోద్యమం అభివృద్ధి చేస్తూ ఉన్నది. ఉద్యమానికి ఎంత పెద్ద ఆశయాలు ఉన్నా కళ్లముందున్న పరిస్థితుల మధ్య నుంచే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పని చేస్తూ ఉంటుంది. ప్రజలకు సాధ్యమయ్యే ప్రజాస్వామిక ప్రక్రియలన్నిటినీ చేపడుతుంది. అవి నిలకడగా సాగకుండా దీర్ఘకాలిక మౌలిక మార్పు సాధ్యం కాదు. విప్లవోద్యమం ఒక చోట మొదలైతే అది ఏక కాలంలో అనేక తలాల్లో మార్పులు తీసుకొస్తుంది. అలాంటి పొలిటికల్ డైనమిజం విప్లవోద్యమానికి ఉంది. ఈ భిన్న తలాల మధ్య ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. దాన్ని పట్టుకొని వ్యవహరించగల దృషి ఉండాలి. ఇంత సంక్లిష్టతను విశ్లేషించే పద్ధతి మన మేధావులకు, ముఖ్యంగా రచయితలకు ఎంత ఉన్నది? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది విరసాన్ని, విప్లవోద్యమాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్న సమస్యే కాదు. చరిత్రలోని ఏ విషయాన్ని అర్థం చేసుకోవడంలో అయినా ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సామాజిక అభివృద్ధి స్థాయికీ`మేధో సృజనరంగాల అభివృద్ధికీ మధ్య సరళమైన సంబంధం ఉండదుగాని, సామాజిక అభివృద్ధి దశ ఎంతో కొంత సృజనాత్మకతకు, శాస్త్రీయ విశ్లేషణ పద్ధతులకు పరిమితి విధిస్తుందని దీన్నిబట్టి చెప్పవచ్చనుకుంటా.
- మీరు చెబుతున్నది సామాజిక ఉద్యమాలను అర్థం చేసుకోడానికి తప్పక అవసరమైన జనరల్ పద్ధతి. ఇది పట్టుబడకపోవడానికి నిర్దిష్టమైన కారణాలు ఏమైనా ఉన్నాయా?
చాలా ఉన్నాయి. ఒక కారణం ఏమంటే .. మన మేధో సృజన రంగాలు చాలా వరకు దినపత్రికల ఒరవడిలోనే ఉన్నాయి. గతంలో ఇంతగా లేదేమో. ఇరవై పాతికేళ్లుగా బాగా పెరిగింది. మేధావుల్లో తటస్థత పెరగడానికి పత్రికలు ఒక కారణం. అది ఎంత ఉందంటే వీళ్లు సమస్యను సీరియస్‌గానే తీసుకున్నారా? అనే సందేహం కలుగుతుంది. అంతగా తటస్థతను పాటిస్తుంటారు. పైగా ప్రజాస్వామికంగా ఉండటమంటే తటస్తంగా ఉండటమనే భ్రమలో ఉన్నారు. రాజకీయ వైఖరుల్లో తటస్థత సరే. పరిశీలనా పద్ధతుల్లోనే తటస్థత పెరిగిపోయింది. ఇది ఒక ధోరణిగా మారింది. ఈ క్రమంలో చాలా మంచి మాటలే చెప్పవచ్చు. నలుగురిని ఆలోచింపజేయవచ్చు. కానీ చాలా మంది తటస్థ విశ్లేషణల దగ్గరే ఆగిపోతున్నారు. అందువల్ల మౌలిక విశ్లేషణలు మనకు చాలా తక్కువ. ఎప్పటికప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులను చెప్పడంతో సరిపోతోంది. అక్కడి నుంచి వాస్తవికతకు ఉండగల పలు కోణాలను చూపించి, వాస్తవికత దగ్గరికి తీసికెళ్లాలి. విస్పష్ట వైఖరిని ప్రకటించాలి. ఇదీ విశ్లేషణ కర్తవ్యం. ఈ పని జరగడం లేదు. ఏరోజుకారోజు విశ్లేషించే పాత్రికేయ శైలి సగటు తెలుగు మేధో పద్ధతిగా మారిపోయిందా? అనే అనుమానం కలుగుతోంది. కొంత మంది విశ్లేషకులు వర్ణన దగ్గరే ఆగిపోతున్నారు. కవిత్వం చెబుతున్నట్లనిపిస్తుంది. సమాజంలోని సంక్షోభాలను, దీర్ఘకాలిక మార్పులను చూడటానికి ఈ పద్ధతులు సరిపోవు. పైగా ఆటంకం.
ఈ ధోరణుల నుంచే .. ‘అసలు విప్లవోద్యమం ఉన్నదా? ఉన్నా దాని ప్రభావం ఎంత? అడవుల్లో ఉంటే లాభం లేదండీ.. ప్రజల్లోకి వచ్చి పని చేయాలి..విప్లవానికి ముందు ఈ సమాజంలో సెటిల్ చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. వాటి సంగతి చూడకుండా విప్లవం చేస్తామంటే ఇలాగే ఉంటుంది. పాత వ్యూహాలను వదిలేసి కొత్తవి తయారు చేసుకోవాలి’ అనే వాళ్లు తయారయ్యారు. ఇవి నలుగురు కలిసినప్పుడు మాట్లాడుకొనే మామూలు మాటలు. అంతకు మించి వీటికి లోతు ఏమీ లేదు. ఇంకో వైపు నుంచి ‘అంతా అయిపోయిందని, ఇంకేమీ చేయలేమ’నే నిరాశా వాదన కూడా వినిపిస్తున్నది. ఇది నిజమా? చరిత్ర అట్లా నడుస్తుందా? చరిత్రను ఇట్లా చూడవచ్చునా? ఎంత కోల్పోయినా ఇది గుండె దిటవుల కాలం కూడా. ఈ కాలంలోని సాహసాన్ని చూడలేమా? తీవ్రమైన విధ్వంసమే జరగవచ్చు. కానీ ప్రజలంటేనే నిర్మాణాత్మకం అనే మాటను మర్చిపోదామా? కేవలం ఆశావాదం వల్ల ప్రయోజనం లేదు. క్రిటికల్‌గా చూడాలి. అప్పుడు అన్ని కాలాల్లా ఇదీ సాహసిక కాలంగా కనిపిస్తుంది.
దేనికో మరి. ఈ అవగాహన లోపిస్తున్నది. ‘50 ఏళ్ల విరసం పయనం ప్రభావం’లో సీరియస్‌గా రాసిన వాళ్లలో కూడా ఇది ఉంది. దీన్ని మన మేధో సంస్కృతిలో చూడాలనుకుంటా. భారత ప్రజలేమో ఒక పక్క తక్షణ అవసరాల కోసం పోరాడుతూనే దీర్ఘకాలిక, సమగ్ర మార్పు కోసం అలిసిపోకుండా పోరాడుతున్నారు. మౌలిక స్థాయిలోకి వెళ్లి వ్యవస్థలతో తలపడుతున్నారు. సామాజిక క్రమాలను సమూలంగా మార్చాలనుకుంటున్నారు. ఉద్యమాల ఆటుపోట్లతో సంబంధం లేని ప్రాసెస్‌గా ఇది సాగుతోంది. దీన్ని పట్టుకోవాలి. ఉద్యమాలు ఎదురు దెబ్బ తినడాన్ని కూడా మొత్తంలో భాగంగానే చూడాలి. నిజంగానే ఇవాళ ఉద్యమాల ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఉద్యమ పురోగతిని అడ్డుకుంటున్న ధోరణులు లోపలా, బైటా ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్యనే తిరిగి లేచి నిలబడటానికి అనుకూలతలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూడాలి. అప్పుడు ఈ స్థితితో వ్యవహరించగల దీర్ఘ దృష్టి ఏ ఏ ఉద్యమాలకు ఎట్లా ఉన్నదో ఆచరణలోంచి తెలుసుకోవచ్చు. నిర్దిష్టంగా చూడకపోతే ఉద్యమాల అభివృద్ధి, సవాళ్లు అర్థం కావు. సమాజ ప్రగతిలోని ఎగుడుదిగుళ్లు అసలే అర్థం కావు. ఉద్యమాలకంటే సమాజం చాలా క్లిష్టంగా ఉంటుంది. దీన్ని ఎంత అర్థం చేసుకోగలం? అనేది ఇవాళ మన మేధో రంగం ముందున్న సమస్య. దీన్ని జర్నలిస్టిక్‌గానే కాదు, అకడమిక్ దృష్టితో కూడా ఎవ్వరూ పరిష్కరించలేరు. దేనికంటే అకడమిక్ పద్ధతి చాలా వరకు నాన్ పొలిటికల్, నాన్ కమిటల్. అక్కడ సమాచారం చాలా పోగేస్తారు. అంత వరకు ఆ పని ముఖ్యమైనదే.
- విప్లవ సాహిత్యోద్యమం మీద అనేక అంచనాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ‘విరసం పయనం, ప్రభావం’లో వచ్చాయి. దాదాపుగా వాటన్నిటినీ మీరు అడ్రెస్ చేశారు. ఈ మొత్తాన్ని ఎట్లా మదింపు వేయవచ్చు?
సాహిత్యానికి మానవ అనుభవం, భావోద్వేగాలు ముఖ్యం. మానవ అనుభవంలోంచి సామాజిక వాస్తవికతను సాహిత్యం సృష్టిస్తుంది. ఆ సాహిత్యానికి రాజకీయ ఉద్దేశాలు, సామాజిక లక్ష్యాలు ఉంటాయి. విప్లవ సాహిత్యోద్యమం తొలి రోజుల్లోనే సాధించిన ప్రధాన విజయం ప్రజాపంథా. అది వర్గం, కులం, పితృస్వామ్యం మొదలైన అనేక ఆధిక్యాలకు వ్యతిరేకంగా సకల పీడిత అస్తిత్వాలతో ప్రజలను సాహిత్యంలోకి తీసుకొచ్చింది. కార్మికవర్గం గురించి చెప్పినప్పటికీ వాళ్లు ప్రధానంగా గ్రామీణ ప్రజలు. భారతీయ గ్రామం మీద అన్ని వైపుల నుంచి దాడి చేసింది నక్సలైట్ ఉద్యమం మాత్రమే. అంతక ముందు కూడా గ్రామం కేంద్రంగా ఉద్యమాలు జరిగి ఉండవచ్చు. వాటికీ విప్లవోద్యమానికి మౌలికమైన తేడాలు చాలా ఉన్నాయి. విప్లవోద్యమం గ్రామాన్ని కేవలం బైటి నుంచే చూడలేదు. గ్రామాన్ని లోపలి నుంచి చూచింది. మనకు వేల ఏళ్ల నాగరికత ఉంది. కులం, పితృస్వామ్యం వంటి పురాతన సామాజిక సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. భూస్వామ్య దోపిడీ ఉన్నది. వాటి నుంచి గ్రామ వ్యవస్థలు తయారయ్యాయి. నక్సలైట్ ఉద్యమం ఆ గ్రామ వ్యవస్థలను లోలోపలి పొరల్లోంచి చూసింది. వాటి ఆంతరంగిక తర్కంలోంచి చూచింది. గ్రామం ఎందుకు అలా ఉన్నదో, ఎందుకు అలా పదిలంగా కొనసాగుతున్నదో చూసి దాడి మొదలు పెట్టింది. అందులోనూ మొదట దేని మీద దృష్టి పెడితే పోరాటాలకు స్పేస్ దొరుకుతుందో, ఏది ముట్టుకుంటే మిగతా సంబంధాలు సహితం కదలబారుతాయో ఆచరణాత్మక ఎరుకను ప్రదర్శించింది. ఇది ఏదో ఒకానొక రాజకీయ పోరాటం కాదు. సాంఘిక సాంస్కృతిక పోరాటం మాత్రమే కాదు. భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త జ్ఞాన ఆవరణను ప్రవేశపెట్టిన ఉద్యమం. అంతక ముందటి వాటికి చేర్పు కాదు. చారిత్రక వికాసానికి కేవల కొనసాగింపు కాదు. గతంతో తెగతెంపులనే లక్షణంతో భారతదేశ చరిత్రలోనే నక్సలైట్ ఉద్యమం ఒక కొత్త దశను ప్రవేశపెట్టింది. ఆ పనిలో మొదట కాస్త దుందుడుకుతనం ఉంటే ఉండొచ్చు. కానీ ఆ తెగతెంపు స్వభావాన్ని ఆచరణలో నిజం చేసుకోవడం కోసం అనేక పాత, కొత్త సవాళ్లన్నిటినీ ఆ ఉద్యమం ఎప్పటికప్పుడు తనలో భాగం చేసుకుంటోంది. గతంతో తెగతెంపులంటే అందులో ఉండే మంచిని కూడా కాదనడం కాదు. కేవలం గతం మీద విమర్శే కాదు. భవిష్యత్తును నిర్మించడం అనే లక్ష్యం కూడా దానికి ఉంది.
అప్పటి దాకా గ్రామీణ వ్యవస్థలు అట్టడుగు ప్రజల సృజనాత్మకతను, మేధస్సును బంధించి వేశాయి. విప్లవోద్యమం వాటిని బద్దలు కొట్టింది. ఒక కొత్త యుగానికి సన్నాహాలు చేసింది. వ్యక్తిని పాత సమూహం నుంచి, సమూహాలను ఆధిపత్య వ్యవస్థల నుంచి విడుదల చేసే పోరాటంగా మారింది. భౌతికంగా, జ్ఞానపరంగా ప్రజాస్వామిక విలువల మీద కొత్త జీవన క్రమాలను స్థాపించే ప్రయత్నం చేసింది. ఈ రంగంలో నక్సలైట్ ఉద్యమం ఎంత శక్తివంతమైందంటే దాని తర్వాత మేధో రంగంలో చాలా కొత్త ఆలోచనలు వచ్చాయి. అవేవీ ఆ ఉద్యమం తీసుకొచ్చిన జ్ఞాన ఆవరణను కదిలించలేకపోయాయి. ఇప్పటికీ దాన్ని దాటి పోలేకపోయాయి. దేనికంటే అది ఆచరణ పునాదిగా ఉండి ఆచరణను ప్రభావితం చేసే జ్ఞానం. ప్రజా ఆచరణ జ్ఞానదాయకమే కాదు. గొప్ప సృజనాత్మక వనరు. మీరు విప్లవ సాహిత్యోద్యమం ప్రత్యేకత ఏమిటి? అని ప్రశ్నించుకుంటే ఇక్కడికి వస్తారు. విప్లవోద్యమంలోకి ఉత్పత్తదాయకమైన అంటరాని పేద జనం, రైతు కూలీలు, మహిళలు, ఆదివాసులు, మధ్యతరగతి వచ్చినట్లే విప్లవ సాహిత్యంలోకి వీళ్లంతా రక్తమాంసాలతో వెల్లువలా వచ్చారు. నక్సలైట్ ఉద్యమం అందించిన కొత్త చైతన్యంతో, కొత్త రంగు రూపులతో, కొత్త కాంతులతో వచ్చారు. కాబట్టి అదొక ట్రెండ్ కాదు. ఈ కాలం మొత్తానికి సంబంధించింది. ఇది వ్యక్తుల ఇష్టాఇష్టాలనుబట్టి ఉండదు. రాజకీయ నిర్మాణ బలాబలాలతో కూడా సంబంధం లేని యుగ స్వభావం ఇది. చరిత్ర ముందుకు పోవాలంటే పరిష్కారం కావాల్సిన మౌలిక వైరుధ్యాలు ఉన్నంత వరకు నిలిచి ఉండే సృజనాత్మక, జ్ఞాన ప్రపంచాన్ని విప్లవోద్యమం, విప్లవ సాహిత్యోద్యమం సాహిత్య కళా రంగాల్లోకి తీసుకొచ్చాయి. ఈ మొత్తం ఆచరణను, దాని వెనుక ఉన్న దృక్పథాన్ని ఇప్పటికీ మేధో రంగం సమగ్రంగా కాప్చర్ చేయలేదనే చెప్పాలి.
- అయితే ఈ ఇరవై, ముప్పై ఏళ్లలో విప్లవోద్యమం దారి తప్పిందనీ, బలహీనపడిందనీ అనేవాళ్లు కూడా ఉన్నారు కదా?
ఈ ఇరవై ముప్పై ఏళ్లు చరిత్రలో విడిగా ఉండవు కదా. అంతక ముందు కాలానికి కొనసాగింపుగా ఉంటుంది. ఎలాంటి కొనసాగింపో తెలియాలి. అప్పుడు ఈ వర్తమానాన్ని బాగా పట్టుకోగలం. కొంత మంది విప్లవోద్యమాన్ని విప్లవ పార్టీల వైపు నుంచే చూసి అవి తీసుకొచ్చిన మార్పును చూస్తూ ఉంటారు. అదొక్కటే సరిపోదు. బైటి నుంచి కూడా చూడాలి. విప్లవోద్యమం అనేక ఇతర పోరాటాలను ప్రభావితం చేసింది. కొత్త పోరాట శక్తులు విడుదల కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదం చేసింది. వేర్వేరు ప్రజాస్వామిక అవగాహనలు తలెత్తడానికి ప్రేరణ అయింది. ఇదంతా అనేక రూపాల్లో, అనేక పద్ధతిల్లో జరిగింది. విలువలు, సంస్కృతి, భావజాలం, కులం, పితృస్వామ్యం, భూమి, పెట్టుబడి, రాజ్యం వంటి అనేక ప్రాతిపదికలపై మొదలైంది. ఒదొక సంక్లిష్టమైన విషయం. అయినప్పటికీ ఆ తర్వాతి దశలో పోల్చుకుంటే మొదట్లో ఇది సరళమైనదే. విప్లవ సాహిత్యంలోనికి కూడా ఈ ప్రజాపంథా తొలిదశలో సరళంగానే వచ్చింది. ఆనాటి సాహిత్య కర్తవ్యాలు కూడా అలాంటివే. అది ఆ దశ ప్రత్యేకత.
ఈ నేపథ్యంలో మీరు అడిగిన ప్రశ్నను చూడాలి. 1990ల తర్వాత పైన చెప్పిన పరిస్థితిలో మార్పు మొదలైంది. అన్ని రంగాల్లో బరిగీచి నిలవాల్సి వచ్చింది. సాహిత్యం కూడా ఒట్టి మాటలతో, ప్రకటనలతో, ఆదర్శాలతో నిలబడదు. విప్లవ సాహిత్యంలో ఇది ప్రత్యామ్నాయ నిర్మాణ దశ. దీనికి మారిన పరిస్థితులే కారణం. ఆధునిక భారతదేశంలో అప్పటికి వందేళ్ల కిందే గ్రామానికి కొనసాగింపుగా పట్టణాలు ఏర్పడ్డం మొదలైంది. కొన్ని మహా నగరాలకు వందల ఏళ్ల చరిత్ర కూడా ఉంది. 1990ల నుంచి గ్రామానికి, పట్టణాలకు, మహా నగరాలకు మధ్య సంబంధాలు తీవ్రంగా మారడం మొదలైంది. విప్లవోద్యమం గ్రామాల మీద ఎంత కేంద్రీకరించినా ఆరంభం నుంచే పట్టణాల్లో కూడా పని చేసింది. నిజానికి పట్టణాల్లో పని చేసినందు వల్లే మధ్య తరగతి, విద్యావంతుల మద్దతు అంతగా దొరికింది. కాబట్టి విప్లవోద్యమం పట్టణాలను వదిలేసిందనడం, అడవులకు వెళ్లిపోయిందనడం మరీ అమాయకపు మాటలు. పట్టణ ఉద్యమ అనుభవంతో పైన చెప్పిన కొత్త పరిస్థితుల్లో గ్రామం`పట్టణం మధ్య ఎక్స్‌టెన్షన్‌లోకి కూడా విప్లవోద్యమం ప్రవేశించింది. ఈ సంబంధాల్లోని మానవ విధ్వంసాన్ని, కొత్త దోపిడీ రూపాలను, కొత్త చైతన్య రూపాలను, కొత్త పోరాట స్థావరాలను విప్లవోద్యమం గుర్తించింది. అట్లాగే ఈ కొత్త పరిస్థితుల్లో కొత్తగా ఊపిరి పోసుకుంటున్న పాత సాంఘిక సాంస్కృతిక వ్యవస్థల మీద మరింత కేంద్రీకరించింది. కాబట్టి మొదటి దశలో విప్లవోద్యమం బాగా ఉండేదని, ఆ తర్వాత బాగా లేదని, దారి తప్పిందనే వాదనలో కనీస తర్కం కూడా లేదు.
- మరి ఈ మార్పులను విప్లవ సాహిత్యం పట్టుకున్నదా? ఎలాంటి మార్పులకు లోనైంది?
సమాజంలో వస్తున్న కొత్త వైరుధ్యాల దిశగా విప్లవోద్యమం, ఇతర ప్రజాస్వామిక పోరాటాలు విస్తరించే క్రమాన్నంతా విప్లవ సాహిత్యం తనలోకి తీసుకుంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయం నిర్మించడానికి అవసరమైన భావజాల పునాదిని ఈ కాలపు విప్లవ సాహిత్యం తయారు చేసుకున్నది. దేన్నయినా కేవలం విమర్శించుకుంటూ, తిట్టుకుంటూ, తిరగబడుతూ ఉంటే సరిపోదు. ప్రత్యామ్నాయ నిర్మాణం కావాలి. ఆధునిక తెలుగు సాహిత్యం మీద ఉద్యమ భావజాలాల ప్రభావం ఎక్కువ. అస్తిత్వ ధోరణులు కూడా ఆ వాదాల ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. ఆ అస్తిత్వ జీవితాలు ఎలా ఉండేవో చిత్రించాయి. కానీ విప్లవ సాహిత్యం ఈ సమాజానికి, ఈ జీవితానుభవాలకు ప్రత్యామ్నాయాన్ని చిత్రించే ప్రయత్నం చేస్తున్నది. జీవిత మూలాలతోపాటు, గత, వర్తమాన క్లేశాలను అధిగమిస్తూ కొత్త జీవితం రూపొందే క్రమాల వైపు విప్లవ సాహిత్యం ఫోకస్ పెట్టింది. విప్లవ సాహిత్యంలోని సౌందర్యం అంతా అక్కడ ఉన్నది. అది పఠన అనుభవంగానే మిగిలిపోదు. క్రియాశీల చైతన్యానికి, ఆచరణకు దారి తీస్తుంది. అకడమిక్ సాహిత్యకారులు వస్తు వైవిధ్యం, శిల్ప ప్రయోగం, భిన్న జీవితానుభవాలు అనే కోణంలో సాహిత్యాన్ని పరిశీలిస్తుంటారు. ఆ పని కూడా చేయాల్సిందే. కానీ వీటన్నిటినీ విడి విడి డబ్బాలో కూరడానికి లేదు. అన్నిటినీ కలిపి సామాజిక చారిత్రక ప్రగతిలో భాగంగా చూడాలి. ముఖ్యంగా ప్రజల ఆచరణ వైపు నుంచి చూడాలి. లేకపోతే కవుల కల్పనగా మిగిలిపోతుంది. ఈ ఇరవై ముప్పై ఏళ్ల విప్లవ సాహిత్యోద్యమం ఈ దశ సామాజిక వైవిధ్యాన్ని, ప్రత్యేకతలను వివరించడానికి బలమైన భావజాల, సిద్ధాంత పునాది సంతరించుకుంది. ఉదారవాదానికి ప్రత్యామ్నాయంగా విప్లవాచరణను, పార్లమెంటరీ విధానానికి వ్యతిరేకంగా బహుముఖీన వర్గపోరాటాలను, పునాది, ఉపరితల సంబంధాల నుంచి విముక్తి ఆకాంక్షలను చిత్రించే క్రమంలో ప్రత్యామ్నాయాన్ని విప్లవ సాహిత్యం తీసుకొచ్చింది. పైపైన చూస్తే మామూలుగా కంటికి కనిపించనివి ఎన్నో ఈ కొత్త దశలో విప్లవ సాహిత్యంలోకి వచ్చాయి. అట్లా ఈ ఇరవై ఏళ్లలో సాయుధ వర్గపోరాటాన్ని, దాని ఆచరణ రూపాలను, ప్రభావాలను, ఫలితాలను చాలా వరకు చిత్రించింది.
9. మన సమాజ సాహిత్య రంగాల్లో 1990లు ఒక కీలక మలుపు. ప్రత్యేకంగా ఆ కాలంలోని విప్లవ సాహిత్యాన్ని మీరు ఎట్లా అంచనా వేస్తారు?
1990ల సాహిత్యమంతా ఆ కాలపు సమాజ ప్రత్యేకతలను, ఉద్యమ గతిని చాలా స్థిమితంగా చిత్రించింది. అప్పటి ప్రత్యేక పరిస్థితులకు తగినట్లు ప్రజాపంథాలో విప్లవోద్యమం ప్రత్యామ్నాయాల దిశగా విస్తరించినందు వల్లనే ఇది సాధ్యమైంది. గతంకంటే మరింతగా అనేక ప్రజాస్వామిక పోరాటాలను ప్రభావితం చేయగలిగే స్థాయికి ఈ కాలంలో విప్లవోద్యమం ఎదిగింది. స్వయంగా తానే అనేక ప్రజాస్వామిక ప్రక్రియల్లో భాగమైంది. ఈ మొత్తం విప్లవ సాహిత్యోద్యమంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఒక రకంగా 1990ల నాటి విప్లవ సాహిత్యం గుణాత్మకంగా కనిపిస్తుంది. అట్లాగే 1980లు, 90లలో ఉండిన వివిధ అస్తిత్వవాదాల సాహిత్యానికంటే అయా పీడిత అస్తిత్వ జీవితాలను విప్లవ సాహిత్యం చాలా శక్తివంతంగా చిత్రించింది. సాంఘిక అస్తిత్వాలను వాటి ప్రత్యేకతలతోపాటు, సామాజిక రాజీకీయార్థిక అంశాల మధ్య గుర్తించింది. అందువల్ల ఆ సాహిత్యం అస్తిత్వాల గురించి కొత్త ఎరుకను అందించింది. అస్తిత్వవాద సాహిత్యంలో రాని అనేక అంశాలను తీసుకొచ్చింది. మొత్తంగా అస్తిత్వ ఇతివృత్త సాహిత్యానికి ఉండవలసిన రాజకీయ, సాంస్కృతిక తీవ్రత మనకు కనిపిస్తుంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు, జాతుల విముక్తికి, హిందుత్వ మతోన్మాదానికి, పీడిత అస్తిత్వ ప్రజల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడేందుకు క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా విప్లవోద్యమం చేపట్టిన ఉద్యమాల వల్ల సాహిత్య మేధో రంగాల్లో గొప్ప వికాసం జరిగింది. సరిగ్గా ఈ కాలంలోనే అటు తెలంగాణలో, దండకారణ్యంలో ప్రత్యామ్నాయ వ్యవస్థలు నిర్మించే ప్రయత్నం మొదలైంది. ఇది మిగతా ప్రాంతాలకు కూడా అప్పట్లోనే విస్తరించింది. మాస్‌లైన్‌లోని ఈ ప్రత్యామ్నాయ భావన విప్లవ సాహిత్యానికి అవసరమైన తాత్విక, భావజాల పునాదిగా మారింది. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో 1990ల తర్వాతి విప్లవ సాహిత్యాన్ని నిర్దిష్టంగా అధ్యయనం చేయడం బాగుంటుంది.
నిజానికి పైన చెప్పిన రాజకీయ ఉద్యమ వాతావరణం మొత్తంగానే తెలుగు సాహిత్యాన్ని కూడా ప్రభావితం చేసింది. అందుకే 1990ల తెలుగు సాహిత్యాన్ని అస్తిత్వవాదాలు, ఆ కాలానికే గుణాత్మక దశకు చేరుకున్న విప్లవోద్యం ఏది ఎంత ప్రభావితం చేసిందీ పరిశీలించాలి. వాటిలో ఏ ప్రభావం కాలానుగణంగా అభివృద్ధి చెందుతూ కొనసాగుతున్నది? ఏది వ్యవస్థలో కలిసిపోతున్నది? అనే నిష్కర్ష కూడా చేయవచ్చు.
దీన్నే ఇంకో వైపు నుంచీ చూడవచ్చు. ఈ ఇరవై ముప్పై ఏళ్లలో తెలుగు సాహిత్యం ఆధునిక చింతనను చాలా అలవర్చుకున్నది. గత నూటాయాభై ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రయాణం ఇటీవల వేగం పుంజుకున్నది. ఆధునిక ఆలోచనలు, ఆధునిక జీవితం బలోపేతం కావడానికి అనేక వైపుల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కదలిక రావడానికి ఇతరేతర కారణాలతోపాటు విప్లవోద్యమం పాత్ర గణనీయమైనది. మనలాంటి సమాజాల్లో ఆధునికతా వికాసానికి, వర్గపోరాటానికి ఉండే సంబంధాన్ని రాజకీయ తాత్విక కోణాల్లో పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. అందువల్లనే ఈ కాలంలో కూడా అయోమయ, వ్యక్తివాద సాహిత్య ధోరణులు వచ్చినా ఏవీ నిలబడలేదు. కనీస గుర్తింపు కూడా లేదు. సాహిత్యమంటే సమాజంలోని ఆధునిక, ప్రగతిశీల ఆకాంక్షలను, ఆ దిశగా సాగే జీవిత సంఘర్షణలను వ్యక్తం చేసేదే అనే భావన గతం కంటే ఈ కాలంలోనే స్థిరపడిరది. గతంలో సాహిత్యరంగం ఇంత గతిశీలంగా లేదు.
ఈ మొత్తాన్నీ కలిపి చూడలేని వాళ్లే ప్రస్తుత తెలుగు సాహిత్యాన్ని చిన్న చూపు చూస్తారు. అయితే ఈ కాలపు సాహిత్యంలో సమస్యలు లేవా? అంటే బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త తరం సాహిత్యంలో. వాటితో సహా అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. కొత్త తరం రచయితలకు వెనుకటి తరానికి తెలియని జీవితం ఉంది. కొత్త చూపు ఉంది. ఈ మొత్తాన్నీ సిద్ధాంతీకరించవలసి ఉన్నది. నేను చెప్పదల్చుకున్నది ఏమంటే, ఇటీవలి దశాబ్దాల్లో మన సమాజ సాహిత్య ఆధునికతా ప్రయాణం అనేక పాయలుగా విస్తరిస్తున్నది. ముందు దీన్ని గుర్తించాలి. తెలుగు సమాజాల్లో దీనికి విప్లవోద్యమం చేస్తున్న దోహదం చాలా ఉన్నది. దాని మోతాదు మీద అంచనాల్లో ఎవరికి ఏ అంచనాలైనా ఉండవచ్చు. కానీ వాస్తవాలను పరిగణలోకి తీసుకుంటే దాన్ని తిరస్కరించడం ఎవ్వరి వల్లా కాదు.
అదే సమయంలో ఈ ఆధునికతా క్రమాన్ని సవాల్ చేసే శక్తులు కూడా పెరిగిపోయాయి. అయినా వర్గపోరాట ప్రభావం వల్ల సాంస్కృతికంగా, రాజకీయంగా ఈ రోజుకూ తెలుగు సమాజాలకు డైనమిక్ స్వభావం ఉంది. ఇక్కడ వివరాల్లోకి వెళ్లలేంగాని, దక్షిణాది రాష్ట్రాల మధ్య కూడా హిందుత్వ శక్తుల చొరబాటులో తేడా ఉంది కదా.. ఆ తేడాను తెలుగు సమాజాల్లో చూడదలిస్తే చాలా కొత్త విశ్లేషణలు ఇవ్వవచ్చు. తెలుగు సాహిత్యరంగంలో ఏదో మేరకు గట్టిగానే ఉన్న ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక, విప్లవ చైతన్యాన్ని నిరూపించవచ్చు.
ఈ మొత్తాన్నీ దృష్టిలో పెట్టుకొని 2010 తర్వాత ఏర్పడిన పూర్తి కొత్త పరిస్థితులకు తగిన మాస్‌లైన్ ఇప్పుడు తాజాగా రూపొందుతున్నది. విప్లవోద్యమ ఆచరణలో, సాహిత్య రచనలో ఇది మరింత బలపడవలసి ఉన్నది. దానికి అవసరమైన భావజాల, సిద్ధాంత పునాది స్పష్టంగానే ఉన్నది కాబట్టి పెద్ద కష్టం కాదు.
- ఈ పదేళ్ల దశకు అనుగుణంగా మాస్‌లైన్‌ను చెప్పిన సాహిత్యం వచ్చిందా?
చాలా వచ్చింది. అయితే ఈ దశను బలంగా చిత్రించేందుకు ఇంకా చాలా రాయవలసినవి ఉన్నది. ఎప్పుడైనా సరే కొత్త సాంస్కృతిక, రాజకీయార్థిక పరిస్థితులు కొత్త వైరుధ్యాలను ముందుకు తెస్తాయి. పాత వైరుధ్యాలు రద్దు కాకపోగా కొత్తగా మారిపోతాయి. కొత్తవాటితో పీటముడిపడిపోతాయి. ఇండియాలో ఇది చాలా జటిలంగా ఉంటుంది. దీనికి తగిన ప్రజాపంథాను విప్లవోద్యమం తయారు చేసుకుంటున్నది. విప్లవ సాహిత్యంలోకి వస్తే.. గత పది ఇరవై ఏళ్లలో వచ్చిన కథలు, నవలలు, సాహిత్య, సామాజిక విశ్లేషణ అంతా ఈ ప్రయత్నంలో భాగమే. దీని కోసం వెనక్కి వెళ్లి ముప్పై ఏళ్ల కిందటి, నలభై ఏళ్ల కిందటి విప్లవోద్యమ ఆచరణను మదింపు వేసే నవలలు వస్తున్నాయి. అంటరానివసంతం, ఎదురగ్గి, నర్రెంకచెట్టుకింద, ఒండ్రుమట్టి, నిషిధ, సైరన్, తల్లులు బిడ్డలు వంటివి ఉదాహరణ మాత్రమే. వీటిలో నాస్టాల్జియా లేదు. గతం గురించిన వలపోత లేదు. భవిష్యత్ కోసం వర్తమాన పరిణామాల దృష్టితో గతాన్ని పునర్దర్శించడం ఈ నవలల ఇతివృత్తం. అంటే వర్తమానంతోపాటు భవిష్యత్‌నూ నిర్మించే లక్ష్యంతో రాసిన నవలలు ఇవి. ఈ పదేళ్లలోనే సిక్స్‌ప్యాక్ రాముడు, హస్బండ్ స్టిచ్, ఏది నేరం, జీవితం, అపురూప, వెన్నెల పడవ, జోలె విలువ, అలివివల, ఖబర్‌కేసాత్, పి. చంద్ కథలు, రాహే, భూమిరంగు మనుషులు, ఈ వేళప్పుడు, సబ్జెక్ట్ కరెక్షన్, పూల పరిమళం, కలతనిద్దురలో, పూలు రాలిన చోట, ప్రేమతో మీ సుధ, ఆస్మాని వంటి కవిత్వం, రెయిన్‌బో వంటి వ్యాసాలు ఈ దశ విప్లవోద్యమ ఆచరణలోని ప్రజాపంథా వ్యక్తీకరణలు. వీటికి మిగతా తెలుగు సాహిత్యానికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న ప్రగతిశీల రచనల్లో కూడా ఒక రకమైన ఒగపాటు ఉంటుంది. ఏమీ చేయలేమనే నిస్సహాయత ఉంటుంది. గతంలోకి తొంగిచూసి విడిచే నిట్టూర్పులు వినిపిస్తుంటాయి. వాటిలో కొత్త వసు శిల్పాలు ఉండవచ్చు. కానీ వర్తమాన సంక్షోభంలోంచే మానవులకు కలిగే ఎరుకను చాలా మంది పట్టించుకోవడం లేదు. అంటే వాళ్లు సంక్షోభాన్ని సమగ్రంగా చూడ్డంలేదు. కానీ విప్లవ సాహిత్యంలో ఈ నిస్సహాయత ఉండదు. ఒకవేళ నిస్సహాయత, సందిగ్థత ఉన్నా.. జీవితాన్ని మరింత సూక్ష్మంగా చూడ్డానికి, సృజనాత్మకంగా పరిశీలించడానికి దోహదం చేస్తాయేగాని పలాయనానికి కాదు. వ్యక్తుల, సమూహాల నిస్సహాయత, సందిగ్థత చారిత్రక గతిని సందేహంలో పడేయలేవు. సామాజికత ఉన్నందు వల్లనే కళా సాహిత్యాలతో మనుషులకు సంబంధం ఏర్పడిరది. ఆ సామాజికత నిరంతరం చలనంలో ఉంటుంది. ఆ చలనాన్ని చెప్పేదే సాహిత్యం. అట్లా చెప్పినందు వల్లనే అది పాఠకుల మీద ప్రభావం వేస్తుంది. ఈ కాలమంతా వచ్చిన దండకారణ్య సాహిత్యం చదివితే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది.
- కానీ విప్లవ సాహిత్యంలో సృజనాత్మక ప్రక్రియలకంటే విశ్లేషణా రచనలే ఎక్కువ అనే అభిప్రాయం కూడా ఉంది..
ఎక్కువ కాదు కదా. ఉండవలసినంత లేదనే విమర్శ కూడా ఉంది. సాహిత్య ఉద్యమం దానికదే రాజకీయ ఉద్యమం. అది అనేక రకాల ప్రజలతో కనెక్ట్ అవ్వాలి. సమాచారాన్ని, విశ్లేషణను అందించే రచనలు దానికి అత్యవసరం. వాటిని చదివి ఆలోచించే పాఠకులు, శ్రోతలు, ప్రజలు చుట్టూ లేకుండా సాహిత్యోద్యమం కొనసాగలేదు. కాబట్టి విప్లవ సాహిత్యోద్యమానికి సృజనాత్మక సాహిత్యమని, విశ్లేషణ సాహిత్యమనే విభజన లేనేలేదు. విశ్లేషణ రచనల్లో సృజనాత్మకత ఉండదని, కాల్పనిక రచనల్లో విశ్లేషణ ఉండదనే యాంత్రిక వైఖరి ప్రమాదం. ప్రక్రియల ప్రత్యేకతలనుబట్టి ఇవి వాటిలో ఉంటాయి. వివిధ ప్రక్రియల మధ్య సృజనాత్మకత, విశ్లేషణల ఉమ్మడి లక్షణాన్ని నెలకొల్పడానికి విప్లవ సాహిత్యోద్యమం చాలా కృషి చేసింది. అందుకే కథ, నవలలాగే వ్యాసం కూడా కాల్పనికేతర సాహిత్యంగా శిల్ప ప్రమాణాలను సంతరించుకుంది. అప్పుడు వ్యాసం కేవల సమాచారం చెప్పే పొడిపొడి రచనగా ఉండదు. హేతుబద్ధమైన వాదన వినిపించే దృఢమైన వాక్యంతో సాహిత్య రూపాన్ని తీసుకుంటుంది.
- ఇంత విశ్లేషణ ఉన్నా.. సమకాలీన సామాజిక మార్పులు విప్లవోద్యమానికి తెలియవనే విమర్శ కూడా ఉంది కదా?
అట్లా అనే వాళ్లు కొంత మంది ఉన్నారు. కానీ తమ అభిప్రాయాన్ని నిరూపించలేమనే సంగతి వాళ్లకు బొత్తిగా తెలియదు. అదీ అసలు విషయం. అట్లని విప్లవ, విప్లవ సాహిత్యోద్యమాలకు మారుతున్న పరిస్థితుల గురించి సర్వ సమగ్రంగా తెలుసని చెప్పడానికి కూడా లేదు. దేనికంటే దేశం మొత్తానికి వర్తించే స్థూల రాజకీయ సామాజిక వ్యూహంలో భాగంగా అందివచ్చిన ప్రాంతాల్లో ప్రజా పోరాటాలు జరుగుతున్నాయి. అవి భౌగోళిక విస్తరణ, కుదింపుల మధ్య చలనంలో ఉన్నాయి. వాటిని ఉన్నత దశలోకి తీసికెళ్లకుండా సమకాలీన మార్పులను, పరిస్థితులను తెలుసుకున్నామని ఎవరు చెప్పినా అంగీకరించడం కష్టం. దేన్నయినా తెలుసుకోవడమంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు తేవడానికి జరిగే ప్రయత్నాల్లో ఏదో ఒక రూపంలో భాగం కావడమే. అప్పుడే తెలిసినట్లు. ఆచరణలో విప్లవోద్యమం దృఢంగా నిలబడి ఉన్నది కాబట్టి నిరంతరం కొత్తగా ఆలోచించే అవకాశం కలుగుతోంది. గత ఇరవై ముప్పైఏళ్లలోని రాజకీయార్థిక పరిణామాలు, వర్గ పొందికలో, సామాజిక, సాంస్కృతిక రంగాల్లోని మార్పులు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వస్తున్న మార్పులు, వీటన్నిటి నుంచి తలెత్తిన ఫాసిస్టు ప్రమాదం మొదలైన వాటి గురించి విప్లవ శిబిరానికి తెలుసు. వీటికి వ్యతిరేకంగా చాలా అననుకూల పరిస్థితుల్లోనే విప్లవోద్యమం పని చేస్తున్నది.
విప్లవోద్యమ ఆచరణ సంక్లిష్టంగా ఉన్నట్లే, దాని జ్ఞాన క్రమం కూడా సంక్లిష్టంగానే ఉంటుంది. విప్లవోద్యమానికి సమకాలీన మార్పులు తెలియవని అనేవాళ్లు మొదట విప్లవోద్యమ ఆచరణలోకి, జ్ఞాన క్రమంలోకి వెళ్లి చూడాలి. ఒక స్పష్టమైన సిద్ధాంతం, రాజకీయ వ్యూహం ఉన్న విప్లవోద్యమం గడిస్తున్నంత విస్తృత అనుభవం ఆధునిక భారతదేశ చరిత్రలో మరే ఉద్యమానికీ లేదు. భిన్న ప్రాంతాలు, సంస్కృతులు, ఆలోచనారీతులు, సాంఘిక మూలాలు, అంతరాలు, అనేక చైతన్యస్థాయిలు ఉన్న ప్రజలతో విప్లవోద్యమం వ్యవహరిస్తున్నది. ఈ సమూహాలు సామాజిక అభివృద్ధి క్రమంలో ఒక్కో దశలో ఉన్నాయి. భారత కార్మికవర్గంలో కూడా ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాళ్లందరినీ విప్లవం దిశగా దశాబ్దాలపాటు నడిపిస్తున్న అనుభవం సామాన్యమైనది కాదు. ఇలాంటి ఆచరణ వెనుక ఉన్న సిద్ధాంతాన్ని, ఈ ఆచరణ వల్ల కలుగుతున్న జ్ఞానాన్ని కలిపి చూడాలి. కొన్ని విషయాల్లో డీటేల్స్ బైటి మేధావులే బాగా చెప్పవచ్చు. అవి వాళ్ల నుంచి తెలుసుకోవాల్సిందే. కానీ మార్పుల సారం ఏమిటో, వాటికి తగినట్లు పోరాట రూపాలు, నినాదాలు ఎలా ఉండాలో ఆచరణలో తేలుతాయి. అప్పుడే ఆలోచనలు భౌతిక రూపం ధరించినట్లు. ఈ క్రమంలోనే ఏదైనా తెలుస్తుంది. మార్క్సిస్టుల్లో రెండు రకాల వాళ్లు ఎప్పుడూ ఉంటారు. మార్క్సిజాన్ని ఒక అకడమిక్ శాస్త్రంగా అభివృద్ధి చేసేవారు, ఆచరణశాస్త్రంగా అభివృద్ధి చేసేవారు.
- అయినప్పటికీ విప్లవోద్యమానికి ప్రాసంగికతే లేదనే వాళ్లు పెరుగుతున్నారు…
ప్రాసంగికత వ్యక్తుల ఇష్టా ఇష్టాలనుబట్టి ఉండదు. అది మన కళ్ల ముందు నిర్మాణమవుతున్న చరిత్రను చూసేదాన్ని బట్టి ఉంటుంది. చరిత్ర దగ్గర మన అభిరుచులు పని చేయవు. అంచనాల్లో ఎన్ని భిన్నాభిప్రాయాలైనా ఉండవచ్చు. కానీ ఏదో ఒక పద్ధతిలో చరిత్రను, అందులో భాగమైన విప్లవోద్యమాన్ని, దాని ఎజెండాను చూడాలి. అప్పుడు ఎన్ని భిన్న అంచనాల మధ్య చర్చకైనా ప్రాతిపదిక ఏర్పడుతుంది. బహుశా విప్లవోద్యమ బలాబలాల తూకాన్ని కంటికి కనిపించే లెక్కల్లోకి కుదించినవాళ్లే ఇలా అంటారు. వాళ్లకు తాము మాట్లాడుతున్నది ప్రాసంగికత గురించి కాదని తెలిస్తే బాగుండు. కాబట్టి ముందు వాళ్లు విప్లవోద్యమానికి ప్రాసంగికత లేకపోవడం అంటే ఏమిటో చెప్పాలి. ఎందుకు లేదో చెప్పాలి. ఆ తర్వాత మిగతావి.
(ఇంకా వుంది…)
నా ముఫ్ఫై ముఫ్ఫై అయిదేళ్ల సామాజిక సాహిత్య జీవితం లో తారసపడిన అత్యంత స్పష్టమైన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దృక్ఫధం ఉన్న మిత్రులలో పాణి ఒకరు. ఈ ఇంటర్వ్యూ లో అడుగడుగునా ఆ స్పష్టత కనిపించింది. విరసం యాభై ఏళ్ళ పరిణామంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులూ, విప్లవం పట్ల ఆ సంస్థకున్న వైఖరి మొత్తంగానే తనను సాహిత్య సాంస్కృతిక ఉద్యమంలో భాగం చేసుకోవడంలో పొందిన అనుభవాలూ ఆర్థిక సాంస్కృతిక మార్పులకు తగ్గట్టు సాన పెట్టుకున్నా కొత్తగా చేర్చుకున్న సధనాలూ వాటిని ఉపయోగించుకొని సామాజిక కదలికలతో ముందడుగు వేస్తున్న తీరు పాఠకులకు సాధ్యమైనంత సులువుగా అర్థం అయ్యేలా సమధానం ఇవ్వడంతో పాటు , సంస్థ పట్ల బయటి వారి నుంచి వస్తున్న విమర్శలకూ, కువిమర్శలకూ గట్టిగానే వివరణ ఇచ్చారు. విరసం పట్ల ఉన్న అపోహలు ఈ సమాధాల ద్వారా తొలుగుతాయనడంలో సందేహం లేదు.
12వ ప్రశ్నకి అనుబంధంగా పాణి గారికి మరొక ప్రశ్న. ఇండియా జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 1950 లలో 56% , 60లలో 52%, 70 లలో 46% గా ఉంది . ఈ వాటా 2023లో 18 %కి తగ్గిపోయింది. ఈ 18 % లో కూడా కార్పొరేట్ వ్యవసాయం వాటా పెరుగుతుంది. ఈ స్థితిలో భారత ఉపఖండాన్ని ఇంకా అర్థవలస-అర్థ ఫ్యూడల్ వ్యవస్థగా ఎలా నిర్ధారిస్తాం?.
Burning issue — needs to discuss every day – every moment
Some so called writers are silent on this issue —1 FEAR 2 NO INTEREST 3 SELFISH 4 NO CARE
BRAHMANIYA FASICISM NEEDS TO GO
PANI GARU – U R RIGHT SIR