ప్రపంచ యుద్ధాల తో అతలాకుతలమైన దేశాల నుండి వచ్చిన సాహిత్యం, దాని ఆధారంగా తీసిన సినిమాలు యుద్ధ భయంకర వాతావరణాన్ని, యుద్ధం చిధ్రం చేసిన జీవితాలను, మానవత్వాన్ని కథా వస్తువుగా తీసుకుని అద్భుతమైన సందేశాత్మక కళారూపాలను నిర్మించాయి. దెబ్బ తిన్న గుండెల ఆవేదన నుండి సృష్టించబడిన సాహిత్యం కాని, సినిమా కాని, మానవ జీవితంలో ఎన్నో కోణాలను, మానవ చరిత్రను, మనిషిలోని విభిన్న దృక్కోణాలను చూపించే ప్రయత్నం చేసాయి. అందులోనూ పోరాటం నేపథ్యంగా ఏర్పడిన వ్యవస్థలలో అత్యుత్తమమైన సాహిత్యం వచ్చింది. 1958 లో గ్రెగర్ డార్ఫ్మిస్తర్ అనే ఒక పాత్రికేయుడు, రచయిత “డై బ్రూకె” అనే ఒక జర్మన్ నవల రాసారు. మాన్‌ఫ్రెడ్ గ్రెగర్ అనే కలం పేరుతో ఆయన రాసిన ఈ నవల ఒక నిజ జీవిత కథ ఆధారంగా రాసానని ఆయన చెప్పుకున్నారు. ఈ నవలను అదే పేరుతో 1959 లో జర్మన్ భాషలో సినిమాగా తీసారు. డై బ్రూకె అంటే ఆంగ్లంలో “ది బ్రిడ్జ్”. ఈ జర్మన్ సినిమా తరువాత ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రపంచానికి అందింది.
ఎన్నో జాతీయ అంతర్జాతీయ బహుమానాలు అందుకున్న ఈ సినిమా యుద్ధం నేపద్యంలో వచ్చిన ఒక అద్భుతమైన సినిమా గా నేటికీ క్రిటిక్స్ చెప్పుకుంటారు. యుద్ధం అనేది ఎంతమంది జీవితాలను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తుందో అర్ధం అయితే యుద్ధం గురించి మాట్లడేటప్పుడు ప్రస్తావించే వీరోచిత వాక్యాలు అసంబద్ధ విషయాలని ఒప్పుకుంటాం. యుద్ధంలో పాల్గొన్న సైనికుల త్యాగాలను కొనియాడుతూ, యుద్ధాన్ని గ్లామరైజ్ చెస్తూ, యుద్ధానికి అనవసర విలువలను జోడిస్తారు పాలకులు. సాధారణంగా కౌమార్య దశలో ఉండే మగపిల్లలకు యుద్ధానికి సంబంధించిన ఏ వార్త అయినా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. యుద్ధం, ఒకరి పై ఒకరు తుపాకులు ఎక్కుపెట్టుకోవడం, మరొకరి ప్రాణాలు తీయడం దేశం కోసం కొన్ని వేల మందిని చంపడం వీరోచిత కార్యంగా అనుకుంటారు. వారి మెదళ్ళూ అలా ట్యూన్ చేయబడి ఉంటాయి. యుద్ధం కేవలం కొందరు మనుష్యుల గురించి మాత్రమే కాదని, అది ఒక తరం జీవితాలను, వారి వర్తమానాన్ని, భవిష్యత్తుని తలక్రిందులు చేసే చర్య అని అర్ధం చేసుకోవడాని చాలా సమయం పడుతంది. చివరకు న్యాయం ఎటు ఉందో అన్యాయం ఎటువైపుందో, తుపాకి ఎక్కు పెట్టి శత్రువుని కాల్చిన వాడు చేసిన పని సరి అయినదేనా, మరణించిన వ్యక్తుల దేశభక్తి దేశాన్ని ఏ విధంగా కాపాడింది? అసలు యుద్ధంలో నష్టపోయేదెవరు, లాభపడేది ఎవరు లాంటి ప్రశ్నలు వేసుకుంటే అసలు ఎవరు, ఎవరిని ఎవరి కోసం ఎందుకు చంపుకుంటున్నారో అసలు ఏది తప్పో ఏది కాదో అర్ధం కాని స్థితిలో ఇరు దేశాల సైనికులు యుద్దకాలంలో గడపడం చూస్తాం.
“దేశభక్తి” అన్నది చాలా మంది తమ స్వార్థానికి మరొకరిని బలిపశువులుగా మార్చడానికి ఉపయోగించే సాధనం. ఇతరులలో ఆ భావాలను నింపి, వాటిని తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు పాలకులు. ఏ దేశ చరిత్ర చూసిన మనకు కనిపించేది ఇదే. యుద్ధం ప్రజల ఇష్టంతో మొదలవదు. ప్రజలను అనవసరమైన విలువలు, వర్గపు ప్రేమ లకు గురి చేసి ఆ మత్తులో వారిని ఆయుధాలు పట్టించి దేశం పేరు మీద రెండు స్వార్థపు వర్గాలు అమాయకులను పావులుగా వాడుకోవడమే యుధ్ధం. ఈ సంగతి అర్ధం అయినా, అవకపోయినా చరిత్రలో ఎందరో అమాయకులు తమ దేశం కోసం తమను తాము బలి ఇచ్చుకున్నారు. వారి త్యాగం ఎన్నో సందర్భాలలో వ్యర్ధం అయి బలవంతుల చేతిలో వారి జీవితాలు చిధ్రమయి ఎంతో ధన, ప్రాణ, మాన నష్టం జరిగిన సందర్భాలు చరిత్రలో జరిగిన యుద్ధాలను సామాన్యుల నేపథ్యం లోంచి చూస్తే అర్ధమవుతాయి.
“ది బ్రిడ్జ్” లో ఇతివృత్తం ఇదే. కాని ఈ కథను తెరపైకి ఎక్కించిన విధానం లో మానవ జీవితపు విషాదాన్ని తార్కికంగా చర్చించే ప్రయత్నం కనిపిస్తుంది. ఒక చిన్న జర్మన్ పట్టణంలో ఒక స్కూలులో ఏడుగురు స్నేహితులు కలిసి చదువుకూంటూ ఉంటారు. అవి రెండవ ప్రపంచ యుద్ధం రోజులు. వీరంతా సామాన్యమైన మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. ఊరిలో మగవారు చాలా మటుకు యుద్ధంలోకి వెళ్ళిపోతారు. పదహారేళ్లు దాటని ఈ చిన్న పిల్లలు తమ తల్లులకు తోడుగా మిగిలిపోతారు. కాని ఆ వయసు ఇచ్చే ఆసక్తి, శక్తులతో యుద్ధం పట్ల ఒక ఆకర్ణణను పెంచుకుంటారు ఆ పిల్లలంతా, తమను కూడా యుద్ధంలో పిలవాలని, తాము తమ దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలని ఉత్సాహంతో ఆలోచిస్తూ ఉంటారు వారు. అందరి ఇళ్ళల్లో ఏవో కొన్ని సమస్యలు, వీటి మధ్య సాధారణ మధ్యతరగతి కౌమార దశలోని యువకులలాగు వారు జీవిస్తూ ఉంటారు. ప్రతి దానికి విపరీతంగా స్పందిస్తూ, జీవితం లో అన్నీ తాము కోరుకున్నట్లే జరుగుతాయనే అమాయకమైన ఆలోచనలతో గడుపుతుంటారు వీళ్ళంతా. భర్తలకు దూరంగా ఉంటూ అతి కష్టంతో ఇళ్ళు నడిపే ఆ పిల్లల తల్లులకు తమ బిడ్డలు చిన్న వారని అందువలన యుద్ధం వారినేమీ చేయదని ఒక ఆశ ఉంటుంది.
ప్రపంచాన్ని తమ దృష్టితో అర్ధం చేసుకునే ప్రయత్నంలో ఈ పిల్లల మధ్య ఒకోసారి కోపాలు, కొన్ని సార్లు ఈర్శ్య, అసూయలు, అలకలు, ప్రేమలు కొన్ని గందరగోళాలు వారి మనసులను ఆక్రమించుకొని ఉంటాయి. వీరి క్లాస్ టీచర్ కి ఈ పిల్లలంటే చాలా ప్రేమ. వారి ఉత్సాహం తప్ప ఎక్కడా మరో ఆనందకరమైన సంగతి కనిపించక భయంతో జీవస్తున్న ఆ ఊరిలో ఆ పిల్లలను అంటి పెట్టుకుని తమ జీవితాలను సాగించుకునే వ్యక్తులు ఎందరో. ఇంతలో వీరిని యుద్ధంలో చేరమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. తల్లి తండ్రులు ఆశ్చర్యపోతారు. ముక్కుపచ్చాలారని తమ బిడ్డలను యుద్ధంలోకి ఎలా ప్రభుత్వం పిలిచిందో వారికి అంతు పట్టదు. కాని ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించడానికి ఉండదు. ప్రతి ఇంట్లో విషాదమే. కాని పిల్లలలో మాత్రం ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. తమ శక్తిని, దేశభక్తిని చాటుకునే సమయం వచ్చిందని ఉప్పొంగిపోతారు. అందరూ సైన్యంలో ట్రేనింగ్ కి వెళతారు.
ఎంత శారీరిక శ్రమతో కూడుకున్న ట్రైనింగ్ లో కష్టపడి తమ శక్తి చాటుకుంటారు ఆ పిల్లలు. వారి టీఛర్ తన పాత పరిచయాలను ఉపయోగించి ఆ పిల్లలను సైన్యం నుండి విడిపించుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. కాని అది సాధ్యపడదు. ఒక్క రోజు ట్రైనింగ్ తరువాత అమెరిన్ సైన్యాలు ఆ నగరంలోకి చొచ్చుకు వస్తున్నాయని వారిని ఆపడానికి వెళ్ళే దళంలో ఈ పిల్లలను కూడా చేర్చుకుని తీసుకువెళతారు అధికారులు. టీచర్ తో మాట్లాడిన ఆఫీసర్ కు ఆ పిల్లల పట్ల కొంత సానుభూతి ఉంటుంది. వారిని భయంకర యుద్ధం నుండి ప్రత్యక్ష్యంగా తప్పించాలని వారికి రక్షణ కల్పించాలని ఒక బ్రిడ్జ్ ను కాపాడే పనిని వారికి అప్పగిస్తాడు. ఒక సీనియర్ అధికారి కి ఈ బాధ్యత అప్పగించి అతని కింద దళం గా ఆ పిల్లలను అప్పగిస్తాడు. ఆ బ్రిడ్జ్ ని కాపాడే పని పెద్ద ప్రాముఖ్యత ఉన్నది కాదని మరుసటి రోజు ఆ బ్రిడ్జిని ఎలాగైనా పేల్చి వేయవలసిందే కాబట్టి ఆ రాత్రి భయంకర యుద్ధం నుండి ఆ పిల్లలను దూరం పెట్టవచ్చని అతను అనుకుంటాడు. వారంతా కాపాడవలసిన బ్రిడ్జి, తమ ఊరి చివర బ్రిడ్జ్ అని తెలుసుకుని ఆ పిల్లలు సంతోషిస్తారు.
తాము చిన్నప్పటినుండి తిరిగిన ప్రదేశాలు ఆడుకున్న బ్రిడ్జ్ ని కాపాడుకోవడం తమ హక్కు అని కూడా వాళ్ళంతా అనుకుంటారు. వారికి నాయకుడైన ఆఫీసర్ సిగరెట్టు తాగడానికి కొంచెం సేపు ఊరిలోకి నడిచి వెళతాడు. అయితే అతన్ని చూసిన కొందరు ఆఫీసర్లు అతను సైన్యం వదిలి పారిపోతున్నాడని అనుకుని అతన్ని పట్టుకుంటారు. తాను కొందరు చిన్న పిల్లల తో ఆ ఊరిలో ఉండి పోవలసి వచ్చిందని, తాను లేకపోతే ఆ పిల్లలు ఇబ్బంది పడతారని, తనను వదలమని తాను సైన్యం నుండి పారిపోవట్లేదని, డ్యూటిలో ఉన్నానని అతను ఎంత చెప్పినా వినరు వాళ్ళు. వారిని తప్పించుకునే ప్రయత్నంలో అతను పారిపోతుంటే సైనికులు కాల్చి చంపేస్తారు.
అధికారి మరణంతో బ్రిడ్జ్ దగ్గర తమకు ఏం చేయాలో చెప్పేవాళ్లు లేక బిక్కు బిక్కుమంటూ మిగిలిపోతారు ఆ పిల్లలు. వారి కళ్ళ ముందే చాలా మంది సైనికులు యుద్ధ భూమి వదిలేసి పారిపోవడం చూస్తారు. అందులో పెద్ద ఆఫీసర్లు కూడా ఉంటారు. తాము మాత్రం తమ దేశానికి సైనికులుగా కర్తవ్యాన్ని నిర్వహించాలని వారు నిశ్చయించుకుంటారు. గాలిలో తిరిగే విమానం వేసిన బాంబుకు వారిలో చిన్న వాడైన సిగి చనిపోతాడు. ఆ దుఖంతో మిగిలిన వారు బ్రిడ్జి పైకి వస్తున్న అమెరికన్ వాహనాలపై కాల్పులు జరుపుతారు. హోరా హోరి పోరులో ఇంకో నలుగురు పిల్లలు మరణిస్తారు. అప్పుడే అక్కడకి చేరిన జర్మన్ సైనికులు, ఆ బ్రిడ్జి పేల్చి వేయమని తమకు ఆదేశాలున్నాయని అంత సేపు ఆ పిల్లలు అక్కడ చేసిన యుద్ధం అనవసరమని చెప్పి, వారిని గేలి చేయడం మొదలెడతారు. అది తట్టుకోలేక వారిని కాలుస్తూ మరో పిల్లాడు చనిపోతాడు. చివరకు స్నేహితులందరిని పోగొట్టుకుని ఒక్క అబ్బాయి మిగులుతాడు ఈ కథ చెప్పడానికి.
యుద్ధాన్ని ఆ పిల్లలంతా దేశభక్తి చాటుకోవడానికి వారికొచ్చిన అవకాశంగా అనుకోవడానికి కారణం యుద్ధం గురించి చిన్నప్పటి నుండి వారు విని ఉన్న వర్ణనలే. యుద్ధంలో సైనుకుడి పాత్ర చాలా పవిత్రమయినదని వారికి చెప్పి వారిలో యుద్ధవాంఛను రగిలించిన పెద్దలే అవకాశం వచ్చినప్పుడు పారిపోతారు. కాని చిన్నతనపు ఆదర్శాలు, ఆలోచనలు, ఆవేశం, వారిని ఆలోచించుకోనివ్వదు. ప్రాణాలకు తెగించి వారు చేసిన పోరాటం వ్యర్ధమని తెలిసిన తరువాత అ బ్రతికి ఉన్న ఇద్దరు ఎంతటి వేదనను అనుభవించారో చూస్తే యుద్ధం పట్ల చాలా దృక్పధాలు పటాపంచలయి పోతాయి. తమ పితృదేశానికి సేవ చేస్తున్నాం అనుకుంటూ తమ నాయకుడు హిట్లర్ కు న్యాయం చేస్తున్నాం అనుకుంటూ అర్ధం లేని ఆ యుద్ధాన్ని వారు ఓన్ చేసుకుని తమ ప్రాణాలను బలితీసుకోవడం చూసినప్పుడు యుద్ధం భయానక రూపం అర్ధం అవుతుంది. ఒక్క అడుగు నేల కాపాడుకున్నా తమ పితృదేశాన్ని కాపాడుకున్నట్లే అన్న నానుడి చిన్నప్పటి నుండి విని ఉండడం వలన యుద్ధం తమ బాధ్యత అనుకుంటారు ఆ పిల్లలంతా. తుపాకులు వదిలి ఇళ్ళకు వెళ్ళగలిగే అవకాశం ఉన్నా అది పిరికి చర్య అన్న భావన వారిని అక్కడే నిలబడి యుద్ధం చేసేలా పురిగొల్పుతుంది. తమ కళ్ళెదురుగా తమకు నీతి చెప్పిన పెద్దలు పారిపోవడం చూస్తున్నప్పుడు ఇక యుద్ధం తమ బాధ్యత అన్న ఆవేశమే తప్ప తాము బలి చేయబడుతున్నాం అన్న ఆలోచన ఆ పసి పిల్లలలో రాదు. చిన్నప్పటి నుండి వారి రక్తంలోకి మెదళ్ళలోకి ఇంకించిన, దేశభక్తి, ఆదర్శాలు, త్యాగం, బాధ్యత లాంటివి మరెవరో తమ స్వార్ధానికి తమను బలి తీసుకుంటున్నారనే ఆలోచనను వారిలోకి రానివ్వవు.
మరో తరానికి అందమైన జీవితాలు ఇవ్వవలసిన బాధ్యత ప్రతి తరానికీ ఉంది. కాని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఆ పసి వారికి భవిష్యత్తనేదే లేకుండా చేసే తరాలు ఇలాంటి ఎందరో అమాయకుల జీవితాల నాశనానికి బాధ్యత వహించాలి. ఒక యుద్ధమే కాదు అసలు మనం జీవిస్తున్న విధానమే భవిష్యత్తు తరాల వినాశనానికి పునాది అవుతుంది. మనలను నమ్మి, మనం చెప్పే విషయాలను ఆదర్శాలనుకుని వాటిని తమ మెదళ్ళలోకి ఇంకించుకుని వాటి అనుగుణంగా ఆ తరం జీవించాలనుకోవడానికి మనం వారిపై రుద్దిన ఆదర్శాలలో మన స్వార్ధం కూడా ఉంది. మనం వారికి నేర్పిన ఆదర్శాలు చివరకు వారికెటువంటి లాభాలను చేకూర్చవు అని తెలిసి మన స్వార్ధం కోసం నిజాలను కప్పిపెట్టి మరో తరాన్ని, అందునా పసి వారి మనసులని రాజకీయం చేయడం అన్నది హేయమైన చర్య. కాని ప్రతి దేశం తమ భవిష్యత్తు తరాలతో ఇటువంటి రాజకీయాన్నే ఆడుతుంది. తమ పిల్లల అందమైన భవిష్యత్తు కోసం అనువైన వాతావరణాన్ని మన దేశాలలో నిర్మించుకోవాలనే ఆలోచన లేని స్వార్ధపు పెద్దల నడుమ రాబోయే తరాల జీవితాలు ఎలా ఉంటాయన్నది ప్రశ్నార్ధకమే.
క్లాస్ రూమ్ లలో నీతులు, మతం, కులం, దేశభక్తి, రాష్ట్రభక్తి, భాషా భక్తి, లాంటి ఆదర్శాల మధ్య పిల్లలలో కుహనా అస్థిత్వవాదాన్ని, నింపాలని ప్రయత్నిస్తూ వారిని తమ రాజకీయ దాహానికి సమిధలుగా చేస్తూ, వారిని ఆలోచించనీయకుండా మత్తు మందులు, విరివిగా మందు షాపులు దేశమంతా పెంచుకుంటూ ఇక ఇంటర్నెట్ లో వివిధ సైట్లు అందుబాటులో ఉంచి మన అహంకారపు గొడవల మధ్య వారిని లాగుతూ చివరకు వారిని ఎటు కాని జీవితాలుగా మారుస్తున ఎన్నో దేశాల పరిస్థితులు కూడా యుద్ధ వాతావరణానికన్నా భయంకరమైనవే. “ది బ్రిడ్జ్” కేవలం ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చిన సినిమా అయినా మరో తరం పై జరుగుతున్న కుట్రను చర్చించే సినిమా. దీన్ని జాగ్రత్తగా పరిశిలిస్తే ఇప్పుడు యుద్ధ వాతావరణం లేని దేశాలలో స్థితులు గమనిస్తే కూడా అదే స్వార్ధం మరో రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఎంతటి అయోమయంలో భవిష్యత్ తరాలను పడేస్తున్నామో, మన స్వార్థం కోసం వారి భవిష్యత్తుని ఎలా అంధకారమయం చేస్తున్నామో ఒక్క సారి చూస్తే ఆ అమాయక పిల్లలను తలచుకుని సిగ్గుపడి తీరతాం. పెద్దవారు తమకొక అందమైన జీవితాన్ని, దేశాన్ని ఇస్తారనే భరోసా లేని ప్రస్తుత తరాల నిరాశావాదానికి కారణాలు వెతుక్కోవడానికి “ది బ్రిడ్జ్” సినిమా నేటి పరిస్థితుల చర్చకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్నో ఉద్యమాలలో యువకులలోని నిస్వార్ధ విలువలకు వారిని బలి ఇచ్చి వారి త్యాగాల మీద తమ కొత్త సామ్రాజ్యాలను నిర్మించుకునే రాజకీయ వ్యవస్థలు ఉన్న దేశ పరిస్థితులు యుద్ధం కన్నా భయంకరమైన నష్టానికి కారణమవుతున్నాయి. అటువంటీ పరిస్థితులను గుర్తుకు తెచ్చే సినిమా “ది బ్రిడ్జ్” అందుకే దీన్ని కేవలం యుద్ధం నేపథ్యంలో వచ్చిన సినిమాగా చూడనక్కర్లేదు. యుద్ధం అనే ఇతివృత్తంతో, ఒక తరం మరో తరానికి చేస్తున్న ద్రోహాన్ని చర్చించుకునే సినిమాగా చూడాలి.
ఈ సినిమా చిత్రణ, స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పటికీ గొప్ప జర్మన్ సినిమాల లిస్టులో “ది బ్రిడ్జ్” తప్పకుండా ఉంటుంది. ప్రపంచ సినిమాలలో ఒక గొప్ప చిత్రంగా పరిగణించబడే “ది బ్రిడ్జ్’ సినిమా కు బర్నాడ్ విక్కి దర్శకత్వం వహించారు. ఇతను ఆస్ట్రియన్ నటుడు, దర్శకుడు కూడా. చాలా గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు ఈయన. “ది బ్రిడ్జ్” వీరి దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా.