తెలంగాణ ఉద్యమ పాటలు – ఒక పరిశీలన

తెలంగాణ కదిలే కాలం తలపై అగ్గికుంపటి. చరిత్ర గాయాలు. వలపోత గేయాలు. పొడిచే పొద్దును ముద్దాడే పోరు జెండా. ఆనాటి నుండి నేటి వరకు అదే ప్రత్యేకత. రాజరిక పాలన అంతమయ్యే సమయంలో నిరంతర ఉద్యమాలు జరిగాయి. ఉ ద్యమ సమయంలో పాట అగ్నికి ఆజ్యంలా తోడైంది. ఉద్యమాన్ని ఆద్యంతం పాట ఒడిసిపట్టుకుంది.

తెలంగాణ నేల తెగింపును ప్రసవించినట్లు పాట గొంతెత్తిన ఆర్దనాదం. ఆక్రోశగానం. ఉద్వేగభరితం. కరువొచ్చినా పాట. కన్నీళ్ళు వచ్చినా పాట. కష్టాలు బతుకు మీద పొంగి పొరిలినా, నష్టాలు నట్టేట ముంచినా, సంబరాలు అంబరాన్ని తాకినా పాట. బతుకు కదలిక మీద పాటవాలని పరిస్థితిలేదు. పాట కిరణాలు ప్రసరించని ఉద్యమాన్ని ఊహించడం అతి కష్టం. సాంఘిక సమకాలీన పరిస్థితుల పరిమళాన్ని వీస్తుంది. సమాజాన్నీ దృశ్యీకరిస్తూనే శ్రావ్యంగా పండిత పామర జనరంజకంగా మనసులోకి ఇంకిపోతుంది. వస్తు వైవిధ్యం, విశ్లేషణ ద్వారా తెలంగాణ ఉద్యమ పరిణామక్రమం, పోరాట చరిత్ర, వికాసాలు ఎన్నో అంశాలను వివిధ కోణాల్లో విశ్లేషించి వర్తమాన భవిష్యత్తులకు తెలియజేస్తుంది. ఎన్నో ప్రక్రియలు సాహిత్యంలో ఉన్నప్పటికీ పాట చాలా సులువుగా త్వరగా స్పందింపజేస్తుంది. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేస్తుంది. అందువల్ల ఉద్యమ గీతాల్లోని తెలంగాణ అస్థిత్వాన్ని సమగ్రంగా విశ్లేషించ గలుగుతుంది. అందువల్ల నేను పాటల్ని ఎక్కువ ఊటకించ దలుచుకున్నాను.

ఉద్యమం నిర్వచనం: ‘యమ్’ ధాతువుకు ‘ఉత్’ ఉపసర్గచేరి ఉద్యమం ఏర్పడింది. ‘యమ్’ అంటే ‘పట్టుదల’ అని అర్థం. ‘ఉత్’ ఉపసర్గ ఆధిక్యతను సూచిస్తుంది. ఉద్యమమంటే పైకెత్తుట, శ్రమ, ప్రయత్నం, సిద్ధమగుట, గట్టి పూనికతో చేసే ప్రయత్నం (సూర్యరాయాంధ్ర నిఘంటువు, పుట. 637)మనిషి సంఘజీవి సమాజంలో ఇతరులతో తప్పనిసరిగా కొన్ని సంబంధాలు ఏర్పడుతుంటాయి. మనుగడకు ప్రకృతి పైన ఆధారడుతాడు. తను ఒక్కడి నుండి కానిది జరుగని పనిని గుంపులు గుంపులుగా సమూహాలుగా కలసి చేస్తారు. సమాజంలో ఒకరికి ఒకరు సాయం అందించుకుంటారు.

చరిత్రలో నిర్మితమైన ఘట్టాలకు సజీవ సాక్ష్యాలు లిఖితరూపాలు పాటవలన మనకు అప్పటి పరిస్థితుల్ని సులువుగా అర్థం చేసుకునే వీలు వుంటుంది.1948నుండి ఉద్యమాలు ఉన్నాయి. గ్రంథాలయోద్యమం బాగా జరిగింది. 1947 నుంచి 2014వరకు సాంస్కృతిక సారస్వతాలు అన్నీకూడా పాటల్లో నిక్షిప్తం.

నిజాం సర్కారు 14-09-1948న ఒడ్కు గ్రామంలో జరిగిన హత్య వల్ల 12 మందికి ఉరిశిక్ష విధించింది. తెలంగాణలో 12ఏళ్ల బాలుడు దీనులింగయ్యకు పడిన మరణ శిక్షను చదివిన రష్యన్ కవి విక్టర్ గోం చరోవ్ “లేవు కరకర పొడిచే పొద్దును ఆపేశక్తులు/ లేవులేవు”అంటూ నిరసనను తెలిపాడు. భారతీయ భాషల్లో ‘విలేఖించనుండు” అనుగీతం హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ రచించాడు. మఖ్ధుం మొయినుద్దీన్, తిరునగరి రామాంజనేయులు, గంగుల శాయిరెడ్డి, సుద్దాల హనుమంతు, దాశరథి, కాళోజీ, ఆళ్వారుస్వామి లాంటి వారు ఉద్యమాన్ని ఎన్నోరకాల ప్రక్రియల్లో రికార్డు చేశారు. చరిత్రలో సుస్థిర స్థానమేర్పచుకున్న ఉద్యమాల్ని ఉప్పొంగించిన పాటల ప్రత్యేకతల్ని భవిష్యత్తరాలకు అందజేయాల్సిన బాధ్యత ఉంది.

పాట పుట్టుక గురించి: పాట, గేయం, గీతం అని సమానార్థకాలు. పాడేది గీతం లేదా గేయం (అమర కోశం పుట. 140 ఆదిమ కాలంలో ఆదిమానవుడు వేసిన తొలికేక మొట్టమొదటి పాట. పాట చరిత్ర చాలా గొప్పది. మాటలు నేర్చిన మానవ పరిణామ క్రమం నుంచి వున్నది. ప్రజలు తమ జీవిత క్రమంలో శ్రమతో కలసి ఆశువుగా నోటితో పాడుకొనే పాటలే ప్రజల పాటలు (గద్దర్ – తరగని గని – పుట.1) పనిపాట ఒక్కటయ్యాయి. పనిలేనిది పాటలేదు అని చెప్పబడుతుంది. పాటలు పుట్టుటకు చాలా నిర్వచనాలున్నా సుద్దాల అశోక్ తేజగారి పాట సర్వజనామోదం పొందింది.

“టపటప టపట సెమబొట్లు తాళాలై పడుతుంటే
కరిగికండరాలే నరాలే స్వరాలు కడుతుంటే
పాట పనితో పాటే పుట్టింది – పనీ పాటతోటే జతకట్టింది”
(సుద్దాల అశోక్ తేజ)
పాట విలువను శ్రమసౌందర్య సూచిగా పేర్కొన్న వివరణ తెలంగాణ గేయకవి నిర్వచనం. “సృజనాత్మకమైన ఉత్పత్తి క్రియ పాటకు ఆధారమని” జయధీర్ తిరుమల రావుగారన్నారు. తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిన వివిధ ఉద్యమాల్ని పరిశీలిద్దాం.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం: ఆనాటి నిజాం సంస్థానంలో నిచ్చెన మెట్ల అధికార వ్యవస్థ. రాజుకు ప్రజలకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండేవికావు. నైజాంరాజు, తర్వాత పాయగాళ్ళు, జాగీర్దార్లు, జమీందార్లు, మత్తేదార్లు, దేశ్ పాండేలు, పటేల్ , పట్వారీలు మొదలైన వారికింద బక్కరైతు బాధ చెప్పుకింద నలిగిన బతుకు.రాజు నిర్ణయించిన శిస్తు కంటే జాగీర్దార్, జమీందార్ల మీద మోపేవాడు. జమీందార్లు తమపైన విధించిన శిస్తు తమ ఖర్చులకుపోను ఎక్కువ వసూల్ చేసే మత్తేదార్లు. మత్తేదార్లు పటేల్ పట్వారీలపై, వాళ్లు రైతుల్ని పీడించి పీడించి పన్నులు వసూలు చేయటం. గుండాలను పెట్టి చిత్రహింసలకు, భయబ్రాంతులకు గరిచేయడంతో నిజాంకు వ్యతిరేకంగా రైతులు ఏకమయ్యారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వచ్చింది. ప్రపంచంలో ఎప్పుడు లేని తిరుగుబాటు రైతుల్లో వచ్చింది. నిజాం రాజ్యం 1943లో లేవి పన్ను ప్రవేశపెట్టి రైతుల్ని పీడించింది. దాన్ని వ్యతిరేకంగా వచ్చిన పాట…


“లేవీ ధాన్యం బివ్వవలదన్నా సర్కారు వారికి
లేవీ గొల్చితే కరువు పోదన్నా”అనే పాట రైతుల్ని ఏకం చేసింది. పనులు చేయించుకొని కూలీ పైకం ఇవ్వకుండా ఎగవేసిన సందర్భాలను చేసిన మోసాలను వివరిస్తుంది.


“కూలీలు దోచుకొని భూసామి – కలిసొచ్చెనంటాడు సామి
సందెడు పుల్లలో సద్దో బొద్దో వేసి మెల్లంగి రాబట్టి వళ్ళలువ చేయించి కూలీ… అనే పాటలో శ్రమ దోపిడీని దునుమాడుతారు. సుద్దాల హనుమంతు “ఓహెూ తొండి దొర ఓహెూ మొండి దొరా” అంటూ దొర మోసాలను ఎండగడుతాడు.

వెట్టి చాకిరి విధానం: ఏదీ ఆశించకుండా దొరలకు భూస్వాములకు ఉచితంగా పని చేయడమే వెట్టి. ఉత్పత్తి కులాల వారు తమ ఉ త్పత్తులను ఉచితంగా ఇవ్వాలి. పంట పండించడంలో గ్రామంలోని ప్రతివాడు పంట పండించడంలో భాగస్వామ్యము అవ్వాలి. పని చెయ్యాల్సిందే.

వెట్టి చాకిరి విధానమో రైతన్నా – ఎంత జెప్పిన తీరదో కూలన్నా
మాదిగన్న మంగళన్న మాలన్న చాకలన్న – వడ్రంగి వడ్డారన్న వసిమాలిన బేగరన్న… అంటూ అన్ని కులాల గోడును సుద్దాల హనుమంతు గారు గోడు ఎల్లబోసారు. ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేసారు. పసిపిల్లవాడి మొదలుకొని ప్రాణం పోయే పండు ముదుసలి వరకు పనిచేయాల్సిందే.

పల్లెటూరి పిలగాడా – పసులగాసే మొనగాడా
పాలు మరసి ఎన్నాళ్లయిందో – ఓ పాలబుగ్గల జీతగాడా (సుద్దాల హనుమంతు గారు)పనిలే కుదిరి ఎన్నాళ్లయిందో అనే హృదయ విదారకమైన పాట రాసాడు.

కమ్యూనిస్టు ఉద్యమం: ఆంధ్రాలో కమ్యూనిస్టులు తెలంగాణలో సంఘం పెట్టి, ఊరూరు రజాకార్లను ఎదుర్కోవడం. నిజాం మద్దతుదారులైన దేశముఖ్ లను దొరల ఆగడాలను నిరోధించడం, ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్న సందర్భంలో మీ వెంట మేమున్నం అని భరోసా కల్పిస్తూ నైతిక ధైర్యాన్ని నింపిన ఉద్యమం. ఆ ఉద్యమంలో అనేక పాటలు వచ్చాయి.. పాటలో సంగం స్ఫూర్తితో తిరుగుబాటు మొదలైంది. సంగం గురించి చాలా పాటలు వచ్చాయి.
“సంఘం వచ్చిందిరో రైతన్నా మనకు బలం
చాలా తెచ్చిందిరో కూలన్నా మనకు బలం’ అనే సుద్దాల హనుమంతు రాసారు.

జానపద గీతాల్లో తప్పనిసరిగా సాయుధ భావన నింపిన పాటల్ని ప్రజలు ప్రభాత గీతాల్లా పాడుకున్నారనడానికి ఉదాహరణలు కోకొల్లలు. 1940 జూలై 7న షేక్ బందగీని విసునూరు మూకలు హత్య చేసారు.

“బందగి రక్తం – చిందిన క్షేత్రం, బలిదానాలకు వెరువని క్షాత్రం” లాంటి పాటు ప్రజల నోళ్లలో నానాయి.
ఎక్కుబావా పడవెక్కుబావా – ఆంధ్రమహాసభ పడవెక్కుబావా
చుక్కాని పట్టె రావినారాయణరెడ్డి – పెద్దచాప పట్టె బద్దం ఎల్లారెడ్డి ||ఎక్కుబావా!… అనే పాట ఎంతగానో ప్రజలను సమ్మోహిత్వం చేసి సంగం బలపడుటకు కారణమైంది. 1944లో రాసిన తెలంగాణ మాతృగేయం మొదటిసారి విశాలాంధ్రలో అచ్చయింది.

“బండెనుక బండికట్టి – పదహారు బండ్లుకట్టి
ఏ బండై పోతవు కొడుకా నైజాం సర్కారోడా
నాజీల మించినవురో నైజాం సర్కారోడా”…. అనే (యాదగిరి) పాట ఎంతగానో స్ఫూర్తి నింపింది. నిజాం అనుయాయుల అరాచకాలు ఎక్కువయ్యాయి. బైరాన్ పల్లి నరమేధం కూడా జరిగింది. యాదగిరిని చిత్ర హింసలు పెడ్తూ చంపారు. భువనగిరి సమీపాన జనగాంలో చాకలి ఐలమ్మ పోరాటాన్ని “నైజాం రాజ్యాన ఉయ్యాలో – నల్లగొండ జిల్లాలో ఉయ్యాలో” అనే జానపద బాణీల్లో పాటలు అల్లారు. 1946 జూలై 4న విసూనూరు దొరసాని కాల్పులకు దొడ్డికొమురయ్య నేలకొరిగారు. తెలంగాణలో తొలి అమరుడు.


అమరజీవిని నీవు – కొమురయ్యా
అందుకో జోహార్లు – కొమురయ్యా
నిన్నూ బలిగొన్నట్టి – నీచులను తునుమాడి
నిన్ను కన్నట్టి యీ – తెలుగుగడ్డను మేము
నీ పేరు నిలుపకనే – కొమురయ్యా
నిదురైన పోమోయి – కొమురయ్యా… అని స్తుతిస్తూ చైతన్యం రగిలిస్తూ ఉంది.

జాతీయోద్యమం: కాంగ్రెస్ 1947 జులై 22న ‘జాతీయ జెండా’ గా ఆమోదించారు. తెలుపులో రాట్నానికి బదులు సారనాథ్ స్తూపంలో ధర్మచక్రం చిహ్నాన్ని ప్రతిష్టించారు. మూడు రంగులు కాషాయం=ధైర్యం, త్యాగం, తెలుపు = శాంతి, సత్యం, ఆకుపచ్చజనమ్మకం, మర్యాద, చక్రం=ప్రగతి, అని నెహ్రూ వివరించారు.


ఎగురవే పతాకమా – ఎరుపు తెలుపు ఆకుపచ్చ జాతి చిహ్నములను తెలుప – ఢిల్లి కోటపై వేగ ||ఎగురవే||
భరత భూమి నేలుకొనగ – భారతీయు లేకమైరి
న్యదేశ దేశపాలకుడా! – క్విట్ క్విట్ క్విట్ యనుచు ||ఎగురవే||… అని జాతీయ జండా స్వభావాన్ని, నీదుఛాయలందు జాతివీర రక్తం ఒలకబోసింది. అనుకున్నది సాధించింది అంటూ నిజాం(దేశంలో రాష్ట్రంలో జాతీయ స్ఫూర్తి రగిలించినది. తెలంగాణ ఉద్యమం నివురుగప్పిన నీరులా ప్రవహించింది.

తెలంగాణ తొలిదశ ఉద్యమం : అడుగడుగున వివక్షకు గురిచేస్తున్న ఆంధ్రవాళ్లను, వాళ్ల చర్యలను ప్రతిఘటించటిన ఉద్యమం. ఈ ఉద్యమంలో ఫైరింగ్ ఆర్డర్ వల్ల 1969లో 369 మంది విద్యార్థి యువజనులు అమరులయ్యారు. బహుశ తెలంగాణ యింతటి ఘోర విపత్తు అప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఎపుడు, ఎక్కడా జరుగలేదు. 1969 ఉద్యమం వల్ల ప్రపంచ సమాజానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలిపింది అమరత్వం.

1956 రాష్ట్రావతరణ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం’లోఅనేకాంశాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. తెలంగాణ విద్యా, ఉ ద్యోగ, ఉపాధి, ఆర్థిక నిర్లక్ష్యానికి గురియైంది. సొంతనేల పై తెలంగాణ పౌరులు తెలంగాణ వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులయ్యారు. సంస్కృతిని ఆచారాలను హేళన చేయడం, అసహనపు వ్యాఖ్యలు చేయడం.


వీరులకు కాణాచిరా! – తెలంగాణ
ధీరులకు మొగసాలరా
కదనాన శత్రువుల కుత్తుకల కవలీల
నుత్తరించిన బలోన్మత్తులేలిన నేల
వీరులకు కాణాచిరా! తెలంగాణ
ధీరులకు మొగసాలరా!…. అంటూ ప్రేరణ నింపిన గీతాన్ని రాసింది రావెల్లి వెంకట చిన రామారావు. భాషపై పెత్తనం చేయడం లాంటి అంశాలు అవిశ్వానికి ఆజ్యం పోసింది. ఆనాటి ప్రభుత్వ నిర్బంధం వల్ల “ఎవరో” ఇది నా తెలంగాణ సంజీవదీవిరా – ఇది నా తెలంగాణ పుణ్యాల దేవిరా ఇది నా తెలంగాణ పీయూష వాణిరా – ఇది నా తెలంగాణ రుద్రమ్మ రాణిరా “లేవరా సోదరా! లేవవే సోదరీ”
“అమ్మా! ఇక నన్నాపకు!! అంటూ ఉవ్వెత్తుగా ఎగసిన పాటలు ఇంకా ఎన్నో వున్నాయి. 369 మంది విద్యార్థి యువకులు అమరులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా పెల్లుబుకిన నిరసనలు. ఎస్వీ సత్యనారాయణ, జి. రమేష్, రుక్నుద్దీన్ లాంటి వాళ్లు కావలిసినన్ని రాసారు. అప్పటి ప్రభుత్వం యొక్క నిర్బంధం వల్ల వాళ్లు ఎవరో అను పేరిట కరపత్రం తీశారు. అనుముల శ్రీహరి, ఎస్వీ సత్యనారాయ, రుక్నుద్దీన్, జి. రమేష్ మొదలైన వారు గేయరచయితలు.

అభ్యుదయోద్యమం: 1936లో ప్రేమ్ చంద్ అధ్యక్షతన అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. దాని ప్రభావం తెలుగు నేలపై కూడా పడింది. కార్మికులనుద్దేశించి పెండ్యాల లోకనాథం గారు రాసిన పాట
“కూలివాండ్లు ఏకమైతే – కూటికి తరుగేమిరా
కూలి వాండ్లలోనే బలిమీ – కాలమందున నుండేరా’ శ్రామిక దృక్పథంతో వచ్చిన మొదటి పాట. నైజాం మీద తిరుగుబాటును ప్రేరేపిస్తూ ” ఈ భూమి నీదిరా – ఈ నిజాం ఎవడురా?” అనే పాట ఎంతో ప్రజాదరణ పొందింది.
దిగంబర కవిత్వం తెలుగు సాహిత్యానికి ఒక షాక్ ట్రీట్ మెంట్. ఆనాటి పరిస్తితులను అగ్నిస్నానం చేయించిన సాహిత్యం వెలువడింది కానీ కవిత్వంలో బూతులు ఎక్కువై నిరాదరణ గురియైంది.

విప్లవోద్యమం : 1968 బెంగాల్లో ప్రారంభమైన ఉద్యమం శ్రీకాకుళం ద్వారా ఆంధ్రాలో ప్రవేశించి తెలంగాణలో ఎంతో మార్పు తెచ్చింది. విప్లవం ఈ నాటి కావ్యానికి స్పందన అని వరవరరావుగారన్నారు. బాంచెను కాల్మొక్త అని స్థితి నువ్వెంతరా అనే స్థితికి తెచ్చి మనిషిని మనిషిగా నిలిపిన ఉద్యమం భూస్వాముల్ని ఎదిరించారు.

“విప్లవము రావాలి – విప్లవము కావాలి
విప్లవ జ్వాలతో – విశ్వమే నిండాలి”… అని విప్లవ లక్ష్యాలు నింపిన పాట.

జై జై జై అరుణ పతాకకు జై
వేగరావోయ్ కార్మికా!
వేగరావోయ్ కర్షకా
కలిసి మెలిసి పలుకవోయ్
అరుణ పతాకకు జై జై జై జై”… అంటుముక్కామల నాగభూషణం గారు ఎర్రజండా ప్రాశస్త్యాన్ని పాటలో పలికించాడు.

విప్లవోద్యమంలో ఎర్ర జెండా పాత్రను వివరిస్తూ…
“ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయల్లో – ఎర్రెర్రనీది జెండ ఎన్నీయల్లో
పేదల పక్షాన ఎన్నీయల్లో – పెన్నిధి జెండ ఎన్నీయల్లో”… ఎర్రజెండ అంటూ విప్లవ చైతన్యం నింపే పాటలు అల్లం వీరయ్య అందించాడు.

పదహారు భాషల్లోకి తర్జుమా అయిన తెలంగాణ పాటను గూడ అంజన్న రాసాడు. అన్ని కులవృత్తుల పనిముట్ల ప్రశస్తిని తెలిపిన పాట. ఊరు శ్రామికులందరిదనీ అంటూ… “ఊరు మనదిరా – ఈ వాడ మనదిరా / పల్లె మనదిరా – ప్రతి పనికి మనంరా … / నడుమ దొర ఏందిరో దొరా పెత్తనమేందిరో అనే పాట చాలా విస్తృమయి ఎదలోతుల్లోకి దూసుకుపోయింది.

“విప్లవాల యుగం మనది – విప్లవిస్తే జయం మనది” అనే చెరబండ రాజుగారి పాట చాలా ప్రసిద్ధమైంది. ఈ పాట నినాదమైంది.
విప్లవోద్యమ కాలంలో పాటకు పట్టం కట్టిన ప్రజా యుద్ధనౌక గద్దర్ నుంచి అనేక పాటలు వచ్చాయి. భారత దేశం గురించి రాస్తూ “భారత భాగ్య సీమరా – ఖనిజ సంపదకు / కొదువలేదురా – బంగరు పంటల భూములున్నయి…
సకల సంపదలున్న దేశంలో దరిద్రమెట్లుందో నాయనా” అని ప్రశ్నిస్తాడు. అమర వీరుల గురించి
“వందనాలు వందనాలమ్మో మా బిడ్డలూ
వీరులారా, శూరులారా! రైతు కూలీ బిడ్డలారా”… అని స్మరిస్తాడు.

దళితోద్యమం: దళిత ప్యాంథర్స్ సమావేశం మహారాష్ట్రలో తీర్మాణం. దళతుల్లో కొంత చైతన్యం తెస్తే చుండూరు, పదిరికుప్పం, వేంపెంట, కారంచేడు ఘటనలు దళితుల్ని మేల్కొల్పాయి. దళితులకు దారి చూపిన బాబా సాహెబ్ అంబేద్కర్ ని స్తుతిస్తూ పాటలు కూడా వచ్చాయి. “అందుకో దండాలు బాబా అంబేద్కరా – అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో” అని సాగే మాష్టార్జీ పాట దళితస్పహ పెంచింది.

“దండమో దీన బందులకూ మహనీయుల్లారా! – అందుకోండి పేదోల్ల దండాలు” భీం సేన “జగతికి ప్రాణం అంబేద్కర్ – జగజ్జన నేత అంబేద్కర్ జయరాజ్
“మంచి మంచి మల్లేలేరి మల్లెపూల దండాలేత్తుమో భారతరత్న అంబేద్కర్ కు” దరువు ఎల్లన్న “బతుకు బతుకుల నడుమ బహుజన బతుకుల నడుమ పుట్టినాడు అంబేద్కరుడు” దమ్మని రాము … మొదలైన వారు పాటలు రాసారు.

విప్లవోద్యమం కలగలసిన దళిత జీవనం మీద దాడుల్ని పాటల ద్వారా మేల్కొల్పు పాటలు తెలంగాణ నేలనుంచి వచ్చాయి. జూలై 17 1985 కారంచేడులోనూ, ఆగస్టు 6న చుండూరులో దళితుల చైతన్యాన్ని పెంచడానికి దోహదపడింది.

“దళిత పులులమ్మ… కారం చేడు భూస్వాములమీద కలబడి నిలబడి పోరుచేసిన దళిత పులులమ్మ” అనే పాటను గద్దర్ పాట రాసారు. కులం లేదనే పాట చెరబండరాజు గారిది“ఏ కులమబ్బీ – నీ దేమతమబ్బీ” అంటూ సమానత్వం బోధించింది. “పుట్టినావు మాకులాగే పట్టుకోని రాలేదేది- మరి కలిమినీకు ఎట్లా కలిగేరో ఓరున్నోడా” మాస్టార్టీ సంపన్నులను ప్రశ్నిస్తాడు.
“దేశం నీదన్నాగాని రాజ్యమడగమన్నానా – దళితుడ ఈ దేశాన్ని నిన్నేలొద్దనా” మాస్టార్టీ దళితుల్ని కొత్త పుంతలు క్కిస్తాడు. అంబేద్కర్ సూచించిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు కావలనీ మాదిగ దండోర ఉద్యమం వర్గీకరణం పోరుచేస్తే, మాలమహానాడు ఏకీకరణం అంటూ ఉద్యమాలు వచ్చాయి. వీటితో పాటు తెలంగాణలో అనేక రకాల ఉద్యమాలు వచ్చాయి.

మలిదశ తెలంగాణ ఉద్యమం: 1996 ఢిల్లీ ఎర్రకోట నుండి ప్రధాని దేవేగౌడ కొత్తగా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించేసరికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బీజం పడింది. తెలంగాణ జనసభ లాంటి సాంస్కృతిక సంస్థలు బలోపేతమయ్యాయి. వరంగల్ లో ప్రజా సమితి సదస్సు నందు 1996 నవంబర్ 1న ‘తెలంగాణ రైటర్స్’కవుల కళాకారుల సమావేశం నిర్వహించారు. 1997లో బెల్లి లలిత హత్య, 1998లో గద్దర్ పై తూటా మరింత ఆలోచన పెరిగింది. కవులలో కళాకారులలో కసిని పెంచింది. 1999 జనవరి 11న నందిని సిధారెడ్డి, వేణు సంకోజుల ఆధ్వర్యంలో తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు అయ్యింది. అప్పట్టాక నివురుగప్పిన నిప్పొలె ఉన్న రాజకీయ తెలంగాణ రావడంతో 2001లో తెలంగాణ రాజకీయ ప్రవేశం రగుల్కొంది.
తెలంగాణ ప్రజలు రోమరోమాన అక్షరాల పటుత్వాన్నే కాదు అస్థిత్వాన్ని నింపుకున్నారు. రాష్ట్ర గీతంగా ఆలపించిన పాట. ఈ పాట తెలంగాణ విముక్తి గీతాల్లో తలమానికమైంది. ఏ సభ ప్రారంభానికి ముందు ఈ పాటను పాడటం ఆనవాయితీ అయింది.

జయ జయహే తెలంగాణ – జననీ జయకేతనం / ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అందెశ్రీ పాట తెలంగాణ ఉ ద్యమ వ్యాప్తిలో ప్రభాతగీతమైంది. తెలంగాణ అస్తిత్వాన్ని పోరాటస్ఫూర్తిని సాహితీ సాంస్కృతిక విలువల్ని నూరి పోసిన గేయమై తెలంగాణ ఊరువాడను దాటి ప్రపంచమంతా మారుమ్రోగిపోయింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను వ్యక్తపరిచి తమ నేలమీద, తమ చరిత్రమీద స్పృహ (సోయి) కలిగించిన పాటల వల్ల ఇక్కడి మట్టి పొత్తిల్లల పురుడు పోసుకున్న చరిత్రను సృజించిన పాట డా. నందిని సిధారెడ్డి గారిది.

“నాగేటి సాల్లల్ల నాతెలంగాణ నాతెలంగాణ – నవ్వేటి బతుకులు నాతెలంగాణ నాతెలంగాణ
పారేటి నీళ్లల్ల పానాదులల్ల – పూసేటి పూవుల్ల పునాసలల్ల” తెలంగాణ బతుకును చిత్రించి స్థానీయ చైతన్యంను పురికొల్పింది. పండుగల ప్రాశస్త్యాన్ని వివరించింది. బడుగుల వెతలు ఈ పాటలో దృశ్యమానమయ్యాయి.

“నా తల్లి తెలంగాణరా! తిరగబడ్డ భూమిరా’ అని తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దర్ గురించి వేరే చెప్పక్కర్లేదు. పల్లవి ఎత్తుకోవడంలోనే కోట్లాది ప్రజలను ఏకతాటి మీదికి తెచ్చినట్లుగా వుండి చైతన్యమై ఎగసి పడ్డది. ఆత్మగౌరవాన్ని ప్రకటించింది.

“పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరుతెలంగాణమా
పోరుతెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా” గద్దర్.
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా
అమ్మా నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమా నీదమ్మో
ఎట్టాల్లో మట్టి చిప్పవూ గాయిదోళ్ల గండ్ర గొడ్డలివి..”
– గద్దర్

“ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా” అని గోరెటి ఎంకన్నా గళమెత్తాడు. “ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిచిందిరా(జయరాజు), పుడితే ఒక్కటి సత్తె రెండు … రాజిగ ఒరెరాజిగ’ – (గూడ అంజన్న), “అయ్యోనివా అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా”(గూడ అంజన్న) “నెత్తురు పారందెన్నడో, నేల కొరుగందెన్నడో… ఈ తెలంగాణా పల్లెలో(జయరాజు), అసొయ్ దులా హారతి కాళ్ల గజ్జల గమ్మతి(కోదారి శ్రీనివాస్), “గోదారి గోదారి ఓహెూ గోదారి, సుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరుకనీ..(యశ్ పాల్), దగాపడ్డ తెలంగాణ దండు కదిలినాదో దండోరా మోగినాదో(నిసార్), ఆడుదాం దప్పుల దరువేయరా(మిత్ర), పోరు సాగుతుంది కొడుకా(ఏపూరి సోమన్న), “కొమ్మలల్లో కోకిలమ్మ పాట పాడుతున్నది – జై తెలంగాణ అన్నది”(గిద్దె రాంనర్సయ్య), ఎవడబ్బ సొమ్మానికొస్తిరి మావూరి కొస్తిరి(రాంచందర్ భీం వంశీ)

“తరగని సంపదున్నా నా తెలంగాణ” మాట్ల తిరుపతి వీరులను తలుచుకుంటూ విలపించిన పాటలు
“జోహారులు, జోహారులు
అమరులకు జోహార్
వీరులకు జోహార్
మావుల్ల రేవుల్లా
మట్టి పొత్తిల్లలా
పువ్వు పువ్వున తీరు
అమరులుంటారు”… నందిని సిధారెడ్డి నిర్బంధ కాలంలో కోమల్ పేరున రాసారు.

“వీరుల్లారా! వీర వనితల్లారా!! అమ్మ రుణంకై రణంలో ఒరిగినారా” – యశ్ పాల్ గారు రచించారు. “మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులారా” (దయా నర్సింగ్)
“వీరులార వందనం విద్యార్థి – అమరులారా వందనం పాదాలకు (దరువు ఎల్లన్న) అద్భుతంగా రాసిన విద్యార్థుల మీద ఇంత మంచి గేయం ప్రపంచ సాహిత్యంలో కూడా దొరుకదంటే అతిశయోక్తి కాదేమో.

విద్యార్థులు చనిపోయిన స్మృతుల్ని పేర్కొంటూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గురువులు పడే బాధ వర్ణన అత్యున్నతం. కరుణ రసం ఒలికించి కదిలించిన పాటలు కూడా చాలా వచ్చాయి. అందులో ప్రధానంగా మిట్టపల్లి సురేందర్ రాసిన పాట…
“రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! / రాగబంధం విలువు నీకు తెలియునురా!!” అని గుండెకోతల బాధల్ని నూరిపోశాడు. “ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా(అభినయ శ్రీనివాస్), నా తల్లి తెలంగాణ ఉయ్యాలో ఉయ్యాల(నలిగంటి శరత్), వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు(అంబటి వెంకన్న), తెలంగాణ వచ్చెదాక తెగించి కొట్లాడుడే(సుందిల్ల రాజన్న), తెలంగాణ చెరువు తీరు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు(జయశంకర్ సారు గురించి దేశపతి శ్రీనివాస్)
నాలుగు కోట్ల ప్రజల అరువైయేల్ల తీరని ఆకాంక్ష 2014 జూన్ 2న పార్లమెంటరీ సాక్షిగా జాతీయ పవిత్ర గ్రంథం రాజ్యాంగం ప్రకారం ప్రమాణపూర్వకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది.

1947లో ప్రారంభమై సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులు, ప్రజలు అనధికార లెక్కల వల్ల దాదాపు నాలుగు వేల మంది హతమయ్యినారు.

1969లో సమైక్యాంధ్ర ప్రభుత్వం 369మంది విద్యార్థి యువకులను పొట్టన పెట్టుకుంది. 2001 నుంచి ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో బలిపీఠమెక్కిన తెలంగాణ అభిమానం ఊళ్లకు ఊల్లె బలిపీఠమెక్కడం వల్లకాడులయ్యాయి. విషాద గీతాలు విలపించాయి. పాటలు ఎతలయి గుండె గుండెకు ప్రవహించాయి.

తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం అయ్యాయి. తెలంగాణ జీవితమంటే అణచబడిన సమాజం. “ఎక్కడైతే అణచివేతకు ఉంటుందో అక్కడే పోరాటం షురువైతది” అని డా. బి.ఆర్. అంబేడ్కర్ అన్నట్లు ఒక బంతిని ఎంత బలంగా నేలకు కొడితే అంతే బలంగా పాట పైకిలేసినట్లు పాట హద్దుల్ని చెరిపింది. చైతన్యం పురివిప్పింది. ఉద్యమం పైకి లేసేలా పాట పచ్చజెండా ఊపి ఆశల్ని ఆరిపోకుండా చేసింది. తెలంగాణ ఉద్యమ చరిత్రకు ఎంత స్థానముందో పాటకు అంతే స్థానముంటుంది.

ఈ వ్యాసంలో కొన్ని పాటలు సూచించినంత మాత్రాన మామూలువి అని కాదు. తెలంగాణ నేలలో గొప్ప పాటలు వచ్చాయి. నాకు అందిన సమాచారం ప్రకారం రాసాను. ఇంకా గొప్ప పాటలు చాలా వున్నాయి. తెలంగాణ పాటలకు పట్టం కట్టిన కవిగాయకులు చాలా మంది ఉన్నారు. వరవరరావు, బి. నర్సింగరావు, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, భూపాల్, దాసరాజు రామారావు, ఎన్నార్, అంబటి ఎంకన్న, అంతడుపుల నాగరాజు, నలిగంటి శరత్, చీకోడు నర్సింలు మొదలైన వారు లెక్కకు మించి వున్నారు. వారందరికీ ఊటకించని కవిగాయకులకు వినమ్రంగా నమస్కరిస్తూ…..

తెలంగాణ సమాజాన్ని నడిపించే ఉద్యమ తీవ్రతను బట్టి పాట పుట్టింది. ఉద్యమ కాలాన్ని తన పల్లవుల్లో, చరణాల్లో పొందుపరుచుకొని భవిష్యత్తు తరాలకు దిశా నిర్దేశనం చేసే దిక్సూచి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆధార గ్రంథాలు:

  1. తెలంగాణ సాయుధ పోరాటం -1948, తెలుగు అకాడమి, 2015.
  2. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, ఎలికట్టె శంకర్రావు, 2015.
  3. తిరగబడ్డ తెలంగాణ, ఇనుకొండ తిరుమలి, హైద్రాబాద్ బుక్ ట్రస్టు, 2008.
  4. తెలుగులో ఉద్యమ పాటలు, డా. ఎస్వీ సత్యనారాయణ. 1996.
  5. తెలంగాణ లొల్లి (ఆడియో క్యాసెట్ పాటల పుస్తకం), సహచర పబ్లికేషన్స్, 2004.
  6. తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర, తెలుగు అకాడమి, 2015
  7. తెలంగాణ పాట – ప్రాదేశిక విమర్శ, డా. పసునూరి రవీందర్, 2016.
  8. తెలంగాణ పాటల్లో సామాజిక చిత్రణ, డా. సిద్దెంకి యాదగిరి, అముద్రిత సిద్ధాంత వ్యాసం.
  9. దళిత రత్నాలు ఆడియో సి.డి.
  10. తాలే లెల్లే, భీమసేన, 2003.
  11. తెలంగాణ మట్టి పాటలు 1,2, వరంగల్ జిల్లా రచయితల సంఘం, నల్లెల రాజయ్య, 2010
  12. నాగేటి సాల్లల్ల, మరసం, నందిని సిధారెడ్డి, 2014
  13. వీరులారా! వందనం, దరువు ఎల్లన్న, దరువు కళాబృందం, 2008.
  14. తరగని గని – గద్దర్.
  15. తెలంగాణ పోరాట పాటలు – జయధీర్ తిరుమల రావు.
  16. మిత్ర పాటలు.

జ‌న‌నం: గోనెప‌ల్లి, సిద్ధిపేట జిల్లా. క‌వి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), 'త‌ప్ష‌'(క‌థ‌) ప్ర‌చురించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి 'తెలంగాణ‌ పాట‌ల్లో సామాజిక చిత్ర‌ణ' అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. ప్ర‌స్తుతం వేముల‌ఘాట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో స్కూల్ అసిస్టెంట్‌(తెలుగు)గా ప‌నిచేస్తున్నారు.

12 thoughts on “తెలంగాణ ఉద్యమ పాటలు – ఒక పరిశీలన

  1. యాదగిరి సార్ మంచి సేకరణ. తెలంగాణలో ఉద్యమం, పాట పర్యాయ పదాలు అనడంలో సముచితం అనుకుంటున్నా. అంతలా ఉంటుంది ఉద్యమం పై పాట ప్రభావం. మీ కృషి కి హృదయపూర్వక అభినందనలు.

  2. రిలవెంట్ ఆర్టికల్,అభినందనలు సిద్దెంకి

  3. శ్రీ సిద్దెంకి యాదగిరి గారు సమగ్రమైన ఉద్యమ చరిత్రను రాశారు .ఇది తెలంగాణ వారందరికీ అవసరమైన కరదీపిక ఇంత చక్కటి వ్యాసం రాసిన యాదగిరి గారికి ధన్యవాదములు.
    పండిట్.సిద్దెంకి.బాబు.వరంగల్.

  4. ఆది మానవుడు వేసిన తొలికేక పాట
    శ్రమజీవుల చెమటనుంచి పుట్టిన పాట
    కరువొచ్చినా పాట కన్నీళ్ళొచ్చినా పాట
    పాట హద్దుల్ని చెరిపింది,చైతన్యం పురివిప్పింది
    తెలంగాణ ఉద్యమానికి ఊపిరైన పాట
    ఉద్యమం పైకి లేసేలా పాట పచ్చజెండా ఊపి, ఆశల్ని ఆరి పోకుండా చేసింది.
    జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటిగొంతుకలు ఒక్కటైనచేతనం అంటు జయకేతనం ఎగరవేసిన అందెశ్రీ పాట…
    పాట పుట్టుక,తెలంగాణ ఉద్యమంలో పాటలపై మీరు చేసిన పరిశీలన సూపర్ సర్…👌🙏🙏

  5. ఇలాంటి వ్యాసంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. రాసిన తర్వాత రెండు, మూడు సార్లు జాగ్రత్తగా చదివితే ఎక్కడైనా పొరబాట్లు దొర్లితే కనిపిస్తాయి. కొన్ని చోట్ల వాఖ్యానికి, వాఖ్యానికి మధ్య లింక్ కుదరలేదు. చాలా చోట్ల అచ్చు తప్పులు ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జరిగిన ఉద్యమంలో ఎంత మంది అమరులు అయ్యారో ఆ సంఖ్య ఇవ్వలేదు. ఒక మంచి వ్యాసంలో చిన్న, చిన్న లోపాలు సైతం ఉండకూడదు అన్నదే నా వాదన. పరమాన్నం తినేటప్పుడు చిన్న, చిన్న ఇసుక రేణువులు వచ్చినా, అవి చికాకును కలిగిస్తాయి.

  6. నమస్తే సర్, మీ ఫోన్ నెంబర్ మెయిల్ చేస్తారా?

  7. పుడితే ఒక్కటి సత్తె రెండు …అంటే ఏంటి అన్నా???

Leave a Reply