(ప్రధాన స్రవంతి సాహిత్యలోకం అట్టడుగు ప్రజల జీవితాన్ని, సాహిత్యాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. చరిత్రను సృష్టించే మట్టి మనుషుల జీవితం కాల ప్రవాహంలో అనామకంగా మిగిలిపోవడం చారిత్రక విషాధం. చెమట చిత్తడి జీవితాల ఆనవాళ్లే లేని సాహిత్య చరిత్రలో తవ్వాల్సింది చాలా ఉంది. పూడ్చాల్సిందీ మిగిలే వున్నది. మట్టి పొరల్లో కలిసిపోయిన ప్రజల జీవితాన్ని, చరిత్రను తవ్వి తీసేది ప్రజా రచయితలే. ఎందరో ప్రజా రచయితలు భూమితో మాట్లాడిన శ్రమజీవుల జీవితాన్ని సాహిత్యంలోకి తీసుకువచ్చారు. సమాజం తమపై పెట్టిన బాధ్యతను రికార్డ్ చేస్తున్నారు. బతుకే పోరాటమైన జనం చరిత్రను, వాళ్ల పోరాటాల్ని సజీవంగా నిలిపిన సాహిత్యాన్ని పరిచయం చేయడమే ఈ ”చరిత్ర చెప్పిన కథ” సిరీస్ ఉద్దేశం.)
(చరిత్ర చెప్పిన కథ – 1)
‘కొండగాలి’ – శ్రీకాకుళం ఉద్యమం ఎలా పుట్టి, పెరిగిందో గొప్పగా చెప్పిన కథ
వ్యంగ్యమూ, వెటకారమూ, చుర్రున తగిలే మాటలూ ఉత్తరాంధ్ర రచయితల ప్రత్యేకత. కేవలం రచయితలదే కాదు, అది అక్కడి సామాన్య ప్రజల జీవన విధానం. రావిశాస్త్రి, పతంజలి రచనల గురించి అందరికీ తెలుసు. రాజ్యం, పోలీసులు, ప్రభుత్వం, నాయస్థానాలు… ఈ చట్రంలో ఇరుక్కున్న, నలిగిపోతున్న ప్రజల గురించి, ఛిద్రమైపోతున్న బతుకుల గురించి పదునైన వ్యంగ్యంతో, కొరడాదెబ్బల వెటకారంతో వాళ్ళు రాసిన రచనలు మనలో చాలా మందికి పరిచయమే.
కానీ తక్కువగా రాసినా గొప్ప సాహిత్యం సృష్టించిన భూషణం మాస్టారి గురించి ఇప్పటి తరం చదువరులకు పెద్దగా తెలీదు. నిజానికి ఆయన గురించి సరైన అంచనా రావలిసే వుంది. (రాసే ప్రయత్నం మొదలుపెట్టాను.) 1975-2000 ప్రాంతంలో చదవడం మొదలుపెట్టిన సాహిత్యాభిమానులకు భూషణం మాస్టారి రచనలు పరిచయం. ఎక్కువ పరిచయం ఉంటే తప్ప ఎక్కువ మాట్లాడని భూషణం గారు మిగతా ఉత్తరాంధ్ర రచయితల్లాగే హాస్యప్రియులు. మాట్లాడితే వ్యంగ్యం, వెటకారం ప్రతిధ్వనించేవి. ఆయన రచనల్లో కూడా.
ఆయన రచనలు ఆయనలాగే unassuming. నిరాడంబరంగా ఉండేవి కానీ ఆయన శైలి వడిగా ఉండేది. చిన్న చిన్న వాక్యాలతో, విరుపులతో, ఆయన రచనలు సాధారణంగా కనిపించినా అద్భుతమైన వర్ణనలతో, సునిశితమైన observationsతో మొదలుపెడితే ఆపలేని ఆకర్షణతో ఉండేవి.
చరిత్రను అద్భుతంగా పట్టుకున్న, నిక్షిప్తం చేసిన కథల గురించి ఒక వరుస వ్యాసాలు రాద్దామనుకున్నపుడు నాకు మొదటగా తట్టిన కథ చాల సహజంగా ‘కొండగాలి’ కథ.
ఈ కథ బహుశా మనకి ఎప్పుడూ ఎక్కడా తారసపడే అవకాశంలేని ప్రాంతానివి. ఎక్కడో మారుమూల తూర్పుకనుమలని అనుకునివున్న ఒక ఊరు (నాయుడువలస). అక్కడికి దగ్గరలోని అడవిలోని ఆదివాసీ గ్రామం గదబవలస. ఈ కథలోని ప్రధాన పాత్ర గడ్దిసెట్టి అనే చాకలి యువకుడు. ఆ యువకుడికీ గ్రామంలోని ‘నానాజాతి’ వాళ్లకూ, ముఖ్యంగా ఊరిపెద్ద నాయుడికీ వున్న సంబంధాలు, గదబవలసలోని సోమయ్య, ఆయన చెల్లెలు ఆదెమ్మకీ ఏర్పడ్డ బంధుత్వం, గదబవలసలోకి పొట్టకూటికోసమని వలస వచ్చి ఏకుమేకైన సావుకారు సాంబన్న… ఈ సంబంధాల్లోని అణచివేత, శ్రమ దోపిడి గురించిన కథ.
దోపిడీకి గురవ్వడం, అవమానాలను, దౌర్జన్యాన్ని ఇక తమ జీవితాల్లో భాగమనుకుని భారంగా బతుకును ఈడుస్తున్న ప్రజల జీవితాల్లోకి ఆయుధంగా వచ్చి చేరిన పదునైన ఆలోచన గురించిన కథ ఇది. మామూలు మనుషుల్లోని ప్రేమ, అమాయకత్వమూ, హాస్యమూ, ఆధిపత్యమూ, పీల్చిపిప్పి చేస్తున్న కులవ్యవస్థని ప్రతిఫలించే కథ. స్వలాభంకోసం కులవ్యవస్థని intact గా ఉంచే భూస్వామ్య వ్యవస్థ, ఈ వ్యవస్థకి దన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం ఎలా ఆపరేట్ అవుతాయో ఈ కథ చదివితే తెలుస్తాయి.
సరే ఓ యాభై ఏళ్ల తర్వాత ఇందులో ఏముందిలే అనుకోవచ్చుగాని, ఏభై ఏళ్ల క్రితం జరిగిన ఒక గొప్ప ప్రయోగం — శ్రీకాకుళ అడవుల్లోని ఆదివాసులు చేసిన సాయుధ పోరాటం.
శ్రమ దోపిడీకి, ఆర్ధిక దోపిడీకి గురువుతున్న గడ్డిసెట్టి, సోమయ్య లాంటివాళ్లు ‘గురువుగారు’ (వెంపటాపు సత్యాన్ని ఉద్యమప్రాంతంలో ప్రేమతో పిలుచుకున్న పేరు) చూపించిన దారిలో ఎలా ఆర్గనైజ్ అయ్యారు. ఈ దోపిడీ వెనుక కుట్రను ఎలా అర్ధం చేసుకున్నారు, ఈ దోపిడీని యంత్రాన్ని ఒక well-oiled machineలా నడుపుతున్న సాంబన్న, ఎర్రజిందవ (dreaded forest officer), అప్పారావు గార్డు, నాయుడు, పోలీసులను ఎదుర్కోవడానికి ఎలా సంసిద్దులయ్యారు — అన్నక్రమాన్ని ఈ కథలో అద్భుతంగా ఆవిష్కరించారు భూషణం గారు.
బహుశా ‘గురువుగారి’తో నేరుగానో లేదా గురువుగారితో నేరుగా సంబంధముండిన వారితో వున్న గాఢ పరిచయం వల్లనో లేకపోతే పోరాటం చేసిన ప్రజల జ్ఞాపకాల వినడంవల్లనో రచయిత శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. మనం కథలోని కొన్ని పాత్రలతో సులువుగా సహానుభూతి చెందుతాం.
కథ:
నాయుడువలసలో వున్న నలుగురు చాకళ్ళలో ఒకడు. గడ్డిసెట్టి. ఊరిమొత్తం బట్టలు ఉతకాల్సింది ఈ నాలుగు కుటుంబాలే. కానీ గడ్దిసెట్టి భార్య చనిపోయి, ఒంటరియై దిక్కుతోచక ఉంటాడు. నాయుడు అదిలించడంతో చాకలిబాన ముట్టించాల్సివస్తుంది. ముట్టించడానికి కట్టెలుండవు. అడవికి వెళ్తాడు. ఎర్రజిందవకి, గార్డు అప్పారావుకి దొరికిపోతాడు. లేదా ‘అమిరిపోతాడు’. అలా అమిరిపోయినవాళ్లు అప్పటికే చాలామంది వుంటారు అక్కడ. వాళ్ళతో ఉచితంగా పనిచేయించుకుంటారు.
అడవిని తల్లిలా చూసుకుని, కనిపెట్టుకుని, అవసరానికి — అవసరానికి సరిపడా మాత్రమే — కంపో, కట్టెనో, కుందేలునో కొట్టి జీవిస్తున్న ఆదివాసులు, కొండదిగువున ఉన్న పల్లెల్లోని పేదప్రజల పాలిట ప్రభుత్వం ఫారెస్ట్ అధికారుల రూపంలో గండంలా తయారవుతారు. అల్లూరి సీతారామరాజు కాలంనాటి దుర్మార్గాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగడం మనం ఈ కథలో చూస్తాం.
నిజానికి ఇలాటి కథలే లేకపోతే చరిత్రని అర్ధం చేసుకోవడం ఎంత కష్టం అయివుండేదో కదా అనిపిస్తుంది. మనకు తెలియని మన చరిత్ర ఏంతో వున్నది. నిజానికది అందుబాటులో వున్నా కూడా మనం ఉపేక్షిస్తుండటం విషాదం.
ఎర్రజిందవకి అమిరిపోయిన అడవిబిడ్డలందరూ ఉచిత శ్రమదానం చెయ్యాలి. తుప్పల్ని కొట్టి, మంటపెట్టి నీలగిరి మొక్కలు నాటాలి . నిజానికి ఈ పనికి డబ్బులుంటాయి. కానీ, గడ్దిసెట్టి లాటి వాళ్ళు, సోమయ్యలాంటి వాళ్ళు — అడవి మీద ఆధారపడ్డ వాళ్ళు — అలుసుగా దొరికిపోతారు. కేసుల భయం పెట్టి ఉచితంగా పనిచేయించుకుంటారు.
అలాటి ఒకానొక రోజున కలిసిన గడ్దిసెట్టి – సోమయ్యల జీవితాల్లోకి రాజ్యం ఎలా ప్రవేశించిందో, దాని దోపిడీ అంగాలు ఎలా పీడించాయో భూషణం మాస్టారు ఈ కథలో చెప్తారు.
ఇక అది మొదలు వాళ్ళ జీవితంలోకి రాజ్యం ఎన్నెన్ని తీర్ల అక్కడి ప్రజల జీవితాల్ని ఆగం చేస్తుందో చూపిస్తారు. తాగుడుకు అలవాటుపడ్డ భర్తని వదిలించుకుని బతుకుతున్న సోమయ్య చెల్లి ఆదెమ్మ గడ్దిసెట్టిలో మరో తోడుని, జీవితాన్ని వెదుక్కుంటుంది. సమాంతరంగా, షావుకారు సాంబన్న కథ ఉంటుంది. మైదానంలో కుటుంబంలో, వ్యాపారంలో దెబ్బతిని గదబవలస వస్తాడు. అంటే అడవిలోకి మార్కెట్ ప్రవేశిస్తుంది. మార్కెట్ కు రాజ్యం తోడు ఎప్పుడూ ఉంటుంది. ఆస్తులకు హామీ ఉంటుంది. సోమయ్యతో వరస కలిపి వ్యాపారం మొదలుపెడతాడు సాంబన్న. ఆదివాసులతో వరసలు కలిపి, వాళ్ళు తీసుకొచ్చిన అటవీ ఉత్పత్తులను కారుచౌకగా కొని చూస్తుండగానే ఆస్తులు పెంచుకుంటాడు. ఆస్తుల్ని కాపాడుకోడానికి ఫారెస్ట్ అధికారికి రెండో భార్యను తార్చడానికి కూడా వెనుకాడడు.
అయితే అంతకు ముందు వలె ఆదివాసులు అమాయకంగా మౌనంగా ఉండిపోలేదు. నక్సల్బరీ ఉద్యమం వెలుగులో మొదలైన శ్రీకాకుళ పోరాటం బీజప్రాయంలో ఏర్పడడాన్ని భూషణం మాష్టారు మనకి ఈ కథలో చూపిస్తారు. ‘The proof of the pudding is in the eating’ అని ఇంగ్లిష్ లో ఒక సామెత వున్నది. ఏదైనా సామాజిక సిద్ధాంత గొప్పదనం అది సామాన్య ప్రజల జీవితంలో ఎటువంటి మంచి మార్పునకు దోహదం చేసింది అన్న విషయంలో రుజువవుతుంది.
అప్పటివరకూ తమ మీద జరుగుతున్న అణచివేతనూ, దోపిడీని పంటిబిగువున భరిస్తూ గడుపుతున్న ఆదివాసులు, మైదానప్రాంత పేద ప్రజలకు ప్రజా ఉద్యమం ఊతాన్నిచ్చింది. దోపిడీని, పీడనని, దాని వెనుకనున్న అణచివేత చట్రం గురించి అవగాహన ఏర్పరిచింది. చదువుకున్న వాళ్ళు, లోకాన్ని చదివిన వారు, నిజమైన’గురువు’ ప్రజలలో ఎలా కలిసిపోతారో, కలిసిపోవాలో చూపించిన పాత్ర ‘గురువు’ పాత్ర.
ప్రభుత్వాలు, ప్రభుత్వ అంగాలు ప్రజల్ని ఎలా కాల్చుకుతింటాయో చూస్తాం ఇందులో. చీటికీ మాటికీ, అయినదానికీ కానిదానికీ కేసులు పెట్టి, కేసులు పెడతామని బెదిరించి లొంగ దీసుకునే, అణచివేసే ప్రయత్నం ఈనాటిది కాదు.
బాన ముట్టించడానికి పుల్లల్నేరుకోడానికి అడవికి వెళ్లిన గడ్దిసెట్టిని పట్టుకుంటాడు అప్పారావు. ”బాబ్బాబు,” అని బతిమాలితే కాళ్లావేళ్లాబడితే “ఒరే సాకాలోడా! ఇది నువ్వుచేసిన మొదటి తప్పుకింద జమచేసి నీమీద కేసెట్టను. ఈ గొడ్డలి మాత్రం ఇప్పుడివ్వను,” అంటాడు అప్పారావు.
ఇంటికెళ్లి ఐదురూపాయల లంచం ఇస్తే గాని వెనక్కివ్వడు. గడ్దిసెట్టి శ్రమకు గొడ్డలి ఆయువుపట్టు. చాకలి వృత్తికి బాన వెలగాలి, వెలగాలంటే కట్టెలు కావాలి. కట్టెలు కావాలంటే గొడ్డలి ఉండాలి. ఆ గొడ్డల్నే స్వాధీన పరుచుకుంటే కాళ్ళకింద భూమిని లాగేసినట్టే.
అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలకోసం పనిచేసేవారికి మద్దతునిస్తే జీవనోపాధిని కోల్పోవాల్సిందే. అలాటి భయం పెట్టే గడ్దిసెట్టిని, సోమయ్యని, ఇంకా బతుకుతెరువు కోసం అడవితల్లిని ఆశ్రయించిన శ్రమజీవులని వేపుకు తింటుంటారు ఫారెస్ట్ అధికారులు.
అర్జీలకు, పిటిషన్లకు ప్రభుత్వం, అధికారులు, భూస్వాములు కరిగిపోరనీ, పైగా అవన్నీ తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని వివరిస్తాడు గురువు. బతిమాలితే వినరనీ అంటాడు. “ఈ గవర్నమెంట్ మనది కాదు. దీని పోలీసులు మనకు రక్షణ ఇవ్వరు. దీని కోర్టులు మనకు న్యాయం చేకూర్చవు. ఆస్తులు పోగేసుకున్న వాడి కోసమే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేసేది,” అని educate చేస్తాడు గురువు.
సోమయ్య ఇంట్లో అంబలి ఉంటే అంబలే తాగుతాడు. తమ సమస్త సమస్యలకూ కారణమై, ఎప్పుడూ ఆమడ దూరంలోనుంచే ఊరిపెద్దలకూ, తమలో కలిసిపోయి, తమ సమస్యల్ని ఆకళింపు చేసుకుని తమలో కలిసిపోయిన గురువుకీ మధ్య వున్న అంతరం తెలుసుకుంటారు.
“కమినీస్తోలంటే మా సెడ్డ కానోలు. రగతాలు తాగతారు. పచ్చి మాంసాలు తింతారు అని సొప్పినాడు నాయిడొలస నాయుడు. ఈలేంతోటి మంచోలో నా రొండు కల్లతోటి ఇయాల సూసినాను. మా సెడ్డ మంచోలు. మంచోలు కాకపోతే ఆల్ల కుక్కల కొడుకు, తల్లికి మొగుడు అప్పారావు గారుడు గాడు ఊల్లోకొస్తే కోడిమాంసం కూరొండితేనే గానీ తినడు. ఇంతోటి గురువు అంబలి జుర్రుకొనితాగి నచ్చిందన్నడంటే తెలస్తన్నాది కదా! ఈ బావులు మా కోసం ఇంతోటి ఇబ్బందులు పడుతుంటే మరీలకోసం గడ్డిపరకల్లాంటి మా పేనాలు అడ్డుపెట్టి ఆపకపోతే ఎలా?” అనుకుంటాడు సోమయ్య.
అందుకే, గురువు ఆచూకీ తెలుసుకున్న పోలీసు మూక గూడెం మీద దాడిచేసి ఇల్లిల్లు వెతుకుతుంటే గదబవలస పచ్చిబాలింత ముత్తేలమ్మ పురిటిమంచమ్మీద ముసుగేసి కాపాడింది గురువుగారిని.
ఊళ్లు మేల్కొంటున్నాయి. ఉద్యమం విస్తరిస్తున్నంత మేర ప్రజలకు తమ సమస్యలు తమకు కొత్తగా కనిపిస్తున్నాయి. కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఊళ్లు మేల్కొంటున్న కొద్దీ ఊరిపెద్దలకు భయం మొదలైంది. మన్యంలో అల్లూరి నాయకత్వంలో జరిగిన తిరుగుబాటుని చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కి పడ్డట్టు, శ్రీకాకుళ ఉద్యమం చూసి ప్రభుత్వం, భూస్వాములు ఉలిక్కిపడ్డారు. కట్టుకథలు మొదలుపెట్టారు. “ఈ నక్సలైట్లు సాక్షాత్తూ రాక్షసులు. మనల్ని మనం రక్షించుకోవాలంటే గ్రామరక్షక దళాలుగా మారాలి. రాత్రిళ్ళు వంతుల వారీగా కాపలా కాయాలి,” అంటాడో నాయుడొలస పెద్ద.
కానీ అప్పటికే ప్రజలు ఆ కపటనాటకాన్ని అర్ధం చేసుకున్నారు ఎంతోమంది ‘గురువుల’ దగ్గర నేర్చుకున్న పాఠాలవల్ల. అందుకే అంటాడు కురమయ్య: “బావులూ! మీరు సెప్పినయన్నీ సానా బాగున్నాయి. మావు పూటకి టికానా లేనోలివి. పొగులంతన్నూ రెక్కలు ముక్కలు సేసుకోని రేత్తిరి నిద్దర నేకుండా ఊరు కాపలాగేస్తే తెల్లారిమల్లా కూలికెల్లాల గదా? దాని మాటేటి?”
కరణం జవాబిస్తాడు. “కురమయ్యా నువ్వు చెప్పింది నిజమే కానీ గ్రామం కోసం త్యాగం చెయ్యాలి కదా,” అని.
‘చదువు’లేని కురుమయ్య అయితే ఊరుకునేవాడే. ఎందుకంటే త్యాగం చెయ్యాలన్నా, దేశభక్తి చూపించాలన్నా — ఆ బరువంతా మెజారిటీగా వున్న పేద ప్రజలదే. వీళ్ళ త్యాగఫలాన్ని అనుభవిస్తున్నది ఆస్తులున్నవారు.
“బావూ, కారణంగారూ. కడుపులోని సల్ల కదలనోలు ఏటిసేసినా ఊరికోసం సెయ్యగలుగుతారు. మావు ఊరు కాపలాగాత్తే మరి మీ పెద్దోలంతా ఏటి సేత్తారు? సక్కగా పందిరి మంచాలమీదన తొంగుంతారా? ఆ కమినిస్టోలొత్తే మా దగ్గరేటున్నాది గనక వొట్టుకుపోనానికి,” అంటాడు కురమయ్య.
ఈ తెలివిడి ప్రజలకు వచ్చిందంటే ఇక పాలకుల ఆటలు చెల్లవు. అందుకే మూలవాసుల సమస్యల్ని తెలుసుకుంటూ, వాళ్ళని ఆర్గనైజ్ చేస్తూ ఊరూరునూ పేనుకుంటూ ఉద్యమాన్ని నిర్మిస్తున్న నాయకత్వమ్మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం. పెరుగుతున్న నిర్బంధాన్ని, ముసురుకొస్తున్న కారుమబ్బుల్నీ అన్యాపదేశంగా చెప్తారు భూషణం మాస్టారు.
తమ బతుకుని బుగ్గిచేస్తున్నదెవరో, తమ అడవిని తమకు కాకుండా చేస్తున్న వారెవరో అర్ధం చేసుకున్న, తమ శ్రమఫలితాన్ని తమకు దక్కనియ్యకుండా చేస్తున్న, తమ సంపదని దోచుకుంటున్న వారెవరో ఎరిగిన ఆదివాసులు, ఇంకా అడవిని అనుకుని వున్న మైదాన ప్రాంత రైతులు, రైతు కూలీలు, ఇతర వృత్తుల వారు తిరగబడ్డారు. ప్రజలు తిరగబడితే ఆపగలవారెవ్వరు? ఆదివాసుల సంపదని పీల్చుకుని, పోలీసులకు కళ్ళూ చెవులైన సావుకారు సాంబన్న అంతమవుతాడు. గదబవలసలో సాంబన్నని అంతం చేశాక, ఆదెమ్మ నాయుడువలస పెద్దలపై తిరుగుబాటు ప్రకటిస్తుంది. “నాతోని ఎవులొత్తారో బయలెల్లండి,” అని పిలుపునిస్తుంది.
ఇక్కడ చూడొచ్చు భూషణం మాస్టారి అతి సాధారణ, అతి వేగవంతమైన శైలి.
“ఆదెమ్మ లేచింది. సోమయ్య లేచాడు. పసికందుని వీపుకు కట్టుకొని ముత్తేలు లేచింది. కొండలూ, కోనలూ, గట్టులు, పుట్టలూ, చేమలూ, వాగులూ, వంకలూ నడిచాయి. కొండలు కదిలాయి. కొండగాలి దేశం నలుమూలలా పెను ప్రళయంగా వీచింది.” — అని కథని ముగిస్తారు.
ఏభై ఏళ్ల క్రితం ఎక్కడో మారుమూల జరిగిన ఈ దేశపు మూలవాసులు చేసిన గొప్ప ఉద్యమం శ్రీకాకుళ ఉద్యమం. స్వతంత్రం వచ్చి ఇరవై ఏళ్లయినా జీవితాల్లో ఎటువంటి మార్పూ లేకపోవడమే కాదు, అదివరకటి పీడన కంటే పెరిగిన పీడనని తట్టుకోలేని ప్రజలు ఎక్కడో నక్సల్బరీలో రైతులు ఇచ్చిన చైతన్యాన్ని ఇముడ్చుకుని చేసిన గొప్ప తిరుగుబాటు. అప్పటికి కేవలం వర్గశత్రు నిర్మూలనగా మాత్రమే కనిపించవచ్చు. కానీ అప్పటికది చారిత్రిక అవసరం. ఆ తర్వాత ఉద్యమాలు అక్కడ నేర్చుకున్న పాఠాల నుంచి నేర్చుకుని పోరాట పరిధిని విస్తృతం చేశాయి.
విల్లంబులు పట్టుకుని, నాటు ఆయుధాలు చేతబూని ఆదివాసులు చేసిన పోరాటం ప్రజా పోరాటాలకు నిరంతర స్ఫూర్తి. ఇది ప్రధాన స్రవంతి చరిత్రలో, సామజిక విశ్లేషణలో, సాహిత్యంలో ఏక్కడా మనకు కనిపించదు. ఆ రక్తసిక్త చరిత్రను పట్టుకుని చెప్పాల్సిన బాధ్యత ప్రజా కవులదే, ప్రజా రచయితలదే. ఆ బాధ్యతని భూషణం మాస్టారు అద్భుతంగా నిర్వహించారు. ఈ కథ చదువుతుంటే మనం అప్పటి ఆ గడ్డు రోజుల్లోకి, ఆ గడ్డురోజుల్లో బతుకు ఈడుస్తున్న ప్రజల జీవితాల్లోకి, వాళ్ళు చేసిన పోరాటంలోకి వెళ్ళిపోతాం. అప్పటి స్థలకాలాలు ఇప్పటి స్థలకాలకు గుణం లో ఏమాత్రం తేడాలేదని గమనిస్తాం. వాళ్ళు అనుభవించిన ఆ ఉద్వేగభరితమైన నడకను చూసి సహానుభూతి చెందుతాం.
“హింస భరించరానిదై నప్పుడే పీడితులు ప్రతిహింసకు పూనుకుంటారు. సాయుధులవుతారు. ప్రభువులు గుర్తించని ఈ కారణాలను ప్రజలైనా గుర్తించాలనే కవులూ, రచయితలూ ఘర్షణలను గురించి పదేపదే రాస్తారు. వారి రచనలను నిషేధించినా వారిని జైళ్లలో వేసినా వారు తమ ప్రయత్నాలను మానరు. భూషణంగారు ఈ కోవకు చెందినవారే కాదు వారి కథలు కూడా ఈ కోవకు చెందినవే. అవి శ్రీకాకుళానికీ, అప్పటి కాలానికీ పరిమితాలు కావు. అన్ని చోట్లకూ అన్ని కాలాలకూ చెందినవి,” అని భూషణం గారి మిత్రులూ, మరో గొప్ప కథకుడూ అయిన కాళీపట్నం రామారావు గారు అంటారు.
ఆ మాటలు నూటికి నూరుశాతం నిజం.
అద్భుతం – రోమాంచితం చేసిన అక్షరాలనిక్కడ చదువుకునే అవకాశమిస్తున్న మీకూ, కొలిమికీ.. …వేవేల దణ్ణాలు