(రెండో భాగం)
అనేక మీటింగులు, వేలాది మంది రైతులు, కూలీలు కదం తొక్కుతున్నారు. 8సెప్టెంబర్ 1978న ‘జగిత్యాల జైత్రయాత్ర’తో వందల గ్రామాల్లో రైతుకూలీ సంఘాలేర్పడ్డాయి. ‘విప్లవానికి బాట’, ‘వ్యవసాయక విప్లవం’ పుస్తకాలు మాకందాయి. ‘దున్నేవారికి భూమి నినాదం’ మారుమోగింది. పాలేర్ల జీతాల పెంపు, కూలీరేట్ల పెంపు, ఆశ్రిత కులాల వెట్టి రద్దు, ప్రభుత్వ బంజరు భూముల ఆక్రమణ, ప్రజా పంచాయతీలు వచ్చాయి. మొదటి దశలో దొరలు తమ గూండాలతో ప్రజల మీద దాడులకు దిగారు. లక్ష్మీరాజం, పోశెట్టి లాంటి కార్యకర్తలు చనిపోయారు. రైతాంగ కార్యకర్తలు గెరిల్లాలుగా మారారు. అక్టోబరు 1978లో జగిత్యాల, సిరిసిల్లాలను ‘కల్లోలిత ప్రాంతాలు’గా ప్రకటించారు. గ్రామాల నిండా సాయుధ బలగాలు నిండిపోయాయి. కేసులు- అరెస్టులు- దాడులు- ప్రతిదాడులు, సమ్మెలు. దొరలను ప్రజలు సాంఘిక బహిష్కారం చేశారు. దొరలు గ్రామాలు వదిలి పట్నాలకు పారిపోయారు. వీటన్నిటిలో- వీటన్నిటితో నేను రాయకుండా ఉండలేని పరిస్థితి. ఎట్లా రాయాలో తెలియని స్థితి. అప్పటి వరకు నేను చాలా సాహిత్యం చదివినా కూడా ఈ అనుభవాలు అలాంటి సాహిత్యం లేనివి. అవి విమర్శలో, వ్యాఖ్యానాలో కానీ ఇది ప్రజలు పోరాడి తెస్తున్న మార్పు. కొలిమి అంటుకున్నది. ఇనుము కరుగుతోంది. కొలిమి అంటుకున్న- భగ భగ మండుతున్న వేడిలో లీనమై మళ్లీ నవల తీసి సృజనకు పంపాను. సాహితీమిత్రులు నడిపే సృజన అప్పటికే నా ‘ఎదురు తిరిగితే’ కథ ప్రచురించింది. అందులోని లోపాలు తెలుపుతారని పంపాను. ఆఖరి ప్రయత్నం విఫలమైందనుకున్నాను. ‘సాహితీ మిత్రులు’ పిలిచి వివరంగా మాట్లాడారు. నేను చదివితే విన్నారు. అప్పుడు మంటర మంటర మళ్లీ రాశాను. 1974లో మొదలైన నవల కరీంనగర్, ఆదిలాబాద్ పోరాటాల నేపథ్యం- అవి బద్ధలైన స్థితి దాకా (1979) రాశాను. ‘సృజన’లో సీరియల్‌గా వచ్చింది. చాలామంది చదివారు. చదివిన వారు రైతులకు వినిపించారు. కార్యకర్తలకు చేరింది. రైతులకు చేరింది. ‘సృజన’ వాళ్లే మాత్రుకలైన పాత్రల ఫోటోలతో నవలగా వేశారు. కార్యకర్తల అరెస్టుతో పాటు నా ‘కొలిమంటుకున్నది’ నవలలు దొరికేవి. పోలీసు స్టేషన్లలో బందీలయ్యేవి.
గ్రామాల నుండి క్రూరమైన, అభివృద్ధి నిరోధకమైన దొరలను తరిమేసిన ఒకానొక చారిత్రిక ఘట్టాన్ని కొలిమిలోని బొగ్గులు, నిప్పురవ్వ అంటుకొని మండిన కాలానికి ఈ నవల సాక్ష్యం. ఊపిరి. ఉత్తేజం.
రాసింది నేనే అయినా – ఈ నవలలోని ప్రతి ఘట్టం, మాట, తిరుగుబాటు రైతాంగం, రైతు కూలీలది. వాళ్లను నడిపిన విప్లవోద్యమానిది. కార్యకర్తలది. ఇది నేపథ్యం.
ఇప్పటి మూడో తరం యువకులతో కలవాలంటే…
‘కొలిమంటుకున్నది’ నవల నుంచి సమకాలీనం దాకా రావాలి. అంటే నలభై సంవత్సరాల చరిత్ర క్లుప్తంగానైనా తడుముకోకుండా ఇక్కడి దాకా రాలేము. ‘కొలిమంటుకున్నది’ తెలంగాణాలోని రెండు జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాదు పోరాటాల నేపథ్యంలో వచ్చింది. రైతాంగ పోరాటాలు వాటికవే ఆరంభం కాలేదు. ‘నక్సల్బరీ’లో జోతేదారుల పంటలు స్వాధీనం చేసుకున్న రైతుల ఆగ్రహం ఉంది. దాన్ని దేశవ్యాపితంగా అందిపుచ్చుకున్న రైతాంగం ఉన్నారు. దాన్ని నెత్తురుటేర్లలో ముంచిన ప్రభుత్వాలకు సంబంధించిన అనుభవం ఉన్నది. ఆ తరువాత శ్రీకాకుళంలో బుగతలను ప్రశ్నించి తరిమికొట్టిన నిర్మాణం ఉంది. దాన్ని- దాని నాయకత్వన్నినెత్తురుటేర్లలో ముంచిన దమనకాండ అనుభవం ఉంది. ప్రతిఘటనా పోరాటాలు తగిన నిర్మాణాలను, స్థావర ప్రాంతాలను నిర్మించడానికి స్ఫూర్తి ఈ అనుభవాలేకాక- 1948-51దాకా మహోధృతంగా తెలంగాణా అంతటా చెలరేగిన రైతాంగ సాయుధ పోరాట అనుభవాలు- నాయకత్వ విద్రోహం ఉంది. ప్రజలు కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో చేసిన పోరాటాల గుణపాఠాలున్నాయి. ఈ అనుభవాల నేపథ్యంలో విప్లవకారుల ఐక్యతా కేంద్రం – రైతాంగాన్ని సమీకరించి- సంఘాలల్లో సమీకరించి ఒక దశ నుంచి మరో దశకు పురోగమించే ఎత్తుగడలతో – కార్మిక కర్షక రాజ్యాధికారం వ్యూహంలో ప్రజా సైన్యాన్ని నిర్మించే లక్ష్యం కలిగి ఉంది.
మొట్టమొదటిసారిగా ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా- ఎంతమంది కార్యకర్తలు ఎన్కౌంటర్లలో చనిపోయినా- జైల్లు, కోర్టు కేసులతో ప్రజలు వాళ్లకు నాయకత్వం వహించే పార్టీ రాటుదేలి 12 సంవత్సరాలు (1967-79) నిలదొక్కుకున్నారు. భారతదేశంలో ఇది ఒకగెంతు. ప్రజల్లో పట్టు సాధించారు. తమదైన పోరాట అనుభవాన్ని సంపాదించారు. క్రమంగా ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించడమే కాక ఇతర రాష్ట్రాలల్లోకి విస్తరించి ఈ కొత్త వాతావరణంలో అనుభంతో ఏప్రిల్ 22, 1980లో ‘పీపుల్స్‌వార్’ పార్టీగా ఏర్పడ్డారు. కొలిమంటుకున్నదిలోని ప్రజలు – వారి పిల్లలు నాయకులయ్యారు. తెలంగాణలో విస్తరించి ఉన్న కార్మికరంగం అయిన సింగరేణిలోకి విస్తరించారు. భారతదేశ వ్యాపితంగా జరిగిన విప్లవ పోరాటాల అనుభవం దాటి పురోగమించి క్రమంగా ఆదివాసి ప్రాంతాలల్లోకి విస్తరించారు. ముగ్గురితో ప్రారంభమైన సాయుధ దళాలు 15 దాకా ఒకే దళంతో పాటు అనేక దళాలుగా – మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా దాకా స్థావర ప్రాంతాలు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో భారతదేశలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ వైరుధ్యాలను అధ్యయనం చేసి, పరిష్కరించే అనుభవాన్ని సంతరించుకున్నారు. మొట్టమొదటి సారిగా వక్రీకరించబడిన ఊహలతో, కల్పనలతో హేతువిరుద్దమైన పుక్కిటి పురాణాలతో నిండి ఉన్న భారతీయ చరిత్రను ప్రజల పరంగా అర్థంచేసుకునే – నిర్మించే పనికి పూనుకున్నారు. ఇది ఒక మహత్తర ముందంజ.
మొట్టమొదటి సారిగా దొరల అధికారం ఆర్థిక మూలాల మీద ప్రజలు తిరుగబడి దెబ్బకొట్టడంతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దొరలు నగతు, బంగారం తీసుకొని సమీప పట్నాలకు చేరుకున్నారు. తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి అర్థవలస, అర్థభూస్వామిక, సామాజిక నేపథ్యంలో జరిగింది. కనుక – స్థానిక భూసామ్యానికి పరిశ్రమలతో పెట్టుబడులులేవు. కొద్దోగొప్పో పరిశ్రమలకు బడా పెట్టుబడిదారులే వాటి యజమానులు. పట్నాలల్లో వ్యాపారం అంతా మార్వాడీలతో నిండిపోయింది. అందుకనే పట్నాల సివారు ప్రాంతాలల్లో భూములు కొన్నారు. స్కూల్లు పెట్టారు. బ్రాండిషాపులు పెట్టారు. పట్టణాలల్లో ఒత్తిడి పెరిగింది. పల్లెలల్లో అధికారం సంఘం నాయకత్వంలోకి వచ్చింది. మొదట కులం పునాదిగా గుర్తించనందున బహుజనులే గ్రామాలల్లో క్రమంగా సంఘాలల్లో బలపడ్డారు. 90% భూమిలేని దళితులు, రైతు కూలీలు ఈ కార్యకలాపాల పట్ల వెనక్కి నెట్టివేయబడ్డారు. ఈ దశలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నది.
తమ రాజ్యాధికారం కాపాడుకోవడానికి ప్రభుత్వాలకు తమ ఎత్తుగడలు తమకున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో – 1972 పి.వి నరసింహారావు ముఖ్యమంత్రిగా వచ్చి భూగరిష్ట పరిమితి చట్టం తీసుకువచ్చిండు. దీని వలన దొరలు వందల వేల ఎకరాల భూములను అమ్ముకున్నారు. ఇతరుల పేర్ల మీద బదలాయించుకున్నారు. ఎక్కువగా ఇలాంటి భూములు బహుజన మధ్యతరగతి, ధనిక రైతులు కొనుకున్నారు. తెలంగాణలో భూ యజమాన్య స్థితిలో కదలిక మొదలైంది. శ్రీకాకుళ పోరాటాన్ని అణచివేసిన జలగం వెంగళరావు 1978 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఆ తరువాత మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య నాటికి మళ్లీ ఆంధ్ర ప్రాంతపు ముఖ్యమంత్రులయ్యారు.. గ్రామాలల్లోసాంప్రదాయిక భూస్వాములైన రెడ్డి, వెలమ పట్టణాలల్లోకి వచ్చినా కూడా ఇంతవరకు రాజకీయ అధికారం కాంగ్రెసు పార్టీ నాయకత్వంలో వారిదే అయ్యింది. కాని గ్రామాలల్లో కొత్త నాయకత్వం బహుజనుల నుండి విప్లవోద్యమాల నుండి రూపొందింది. దొరలు ఖాళీ చేసిన గ్రామాలల్లో పాత భూస్వామిక దోపిడీ, పీడనలతో కాకుండా కొత్త పరిస్థితుల్లో అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు మధ్య వర్తులుగా తీవ్రమైన నిర్బంధ వాతావరణంలో కోర్టు కేసులు, పోలీసు స్టేషన్ల చుట్టు తిరగడం లాంటి పనులు చేసే కొత్తగా నాయకులుగా రూపొందే క్రమం ఆరంభమైంది.
గ్రామాలల్లో తీవ్ర నిర్బంధం కొనసాగుతూనే ఉంది. రైతాంగ గెరిల్లాలు అడవిబాట పట్టారు. అడవి ఉద్యమాలు ఊపందుకున్నాయి. సింగరేణి కార్మికులు వారి దైనందిన సమస్యల మీద అనేక సమ్మెలు చేయసాగారు. సికాస ఏర్పడి 56 రోజులు సమ్మె చేయడంతో దాదాపు 370 రైళ్లు బందయ్యాయి. దక్షిణ భారతదేశం అతలాకుతలమయ్యింది. కార్మికులు రాజకీయ సమ్మెలు చేసే చైతన్య స్థాయికి ఎదిగారు. ఈ నిర్భంద వాతావరణంలో నక్సలైట్లే దేశభక్తులు నినాదంతో ఎన్.టి రామారావు తెలుగుదేశం పార్టీ నాయత్వంలోకి వచ్చింది. తెలంగాణలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాలల్లోని బహుజన నాయకులు ఆ విధంగా కొత్తగా అధికారంలోకి వచ్చారు. వలసవాదులు క్రమంగా హైదరాబాదు నగరంలోని విలువైన భూముల ఆక్రమణ మొదలైంది. పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతాల నుండి వలసలు మొదలయ్యాయి. అప్పుడప్పుడే వికసిస్తున్న వినిమయ వ్యాపారానికి సినిమా పరిశ్రమ హైదరాబాదు రావాడానికి కారణభూతమయ్యాయి. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, మండలాలు ఏర్పడడం లాంటి పననులతో గ్రామాలల్లో పాత సాంప్రదాయిక దొరల అధికారం కుప్పకూలింది. విప్లవోద్యమాల వలన గ్రామాలు వదిలి పట్నాలు పట్టిన దొరలకు కొత్తగా తెలంగాణ నగరాలల్లోకి వలస వచ్చిన ఆంధ్రప్రాంతం వారికి వ్వాపారంలో, అధికారంలో, ఆస్తుల ఆక్రమణలో తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
తెలుగుదేశం పార్టీ తీవ్రమైన నిర్బంధంతో లాటిన్ అమెరికాలోలాగా తెలంగాణలో విప్లవోద్యమ నాయకత్వమే లేకుండా చేయడానికి ఎన్ కౌంటర్లు, మిస్సింగులు, హత్యలు అనేక ముసుగు సంఘాలు గూండా గ్యాంగులను అనివార్యంగా పెంచిపోషించింది. ప్రజా ఉద్యమాలు కిడ్నాపులు, క్రూరమైన విప్లవ వ్యతిరేకులను వధించడం ఆరంభించారు. పోలీసులు, నాయకులు సాయుధ గార్డ్సు లేకుండా తిరుగలేని పరిస్థితి వచ్చింది. ఇదంతా కదలబారిన భూస్వామిక సమాజం మీద ఆధిపత్యం, ఆస్తులను దక్కించుకోవడానికి జరిగిన యుద్ధమే. గ్రామాల నుండి తరిమేయబడిన భూస్వాములది, వలస వాదులది, ప్రజా ఉద్యమాల పట్ల క్రూరమైన అణచివేత విధానమే.
ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడి తన సంక్షోభాన్ని దాటవేయడానికి ప్రపంచ ప్రజల శ్రమశక్తిని వనరులను కొల్లగొట్టడానికి సమాయత్తమైన సామ్రాజ్యవాదం – ఉత్పత్తి వికేంద్రీకరణ- మార్కెటు విస్తరణలోని భాగంగా ప్రపంచీకరణను ముందుకు తెచ్చింది. అర్థవలస – నుండి తెలంగాణ నుండి ఎదిగిన బ్రాహ్మణీయ భూస్వామ్య ప్రతినిధి అయిన పి.వి. నర్సింహారావే ప్రపంచ పెట్టుబడి దారులకు తలుపులు బార్లా తెరిచారు. భారతదేశ భూస్వామ్యం ఎంత క్రూరత్వమైందో? జిత్తల మారిదో? శ్రామిక దళిత బహుజన, ఆదివాసీ మత మైనార్టీ ప్రజలను కొల్లగొట్టడానికి ఎంతకైన దిగజారగలదనటానికి ఇది ఉదాహరణ. అలాంటి సామ్రాజ్యవాద పెట్టబడికి హైదరాబాదు కేంద్రమైంది.
ప్రజల సొమ్ముతో మౌళిక వసతులు భూములు చౌకగా కట్టబెట్టే లక్ష్యంతో కొత్తదళారీ నాయకత్వం అవసరంగా చంద్రబాబును రంగంమీదికి తెచ్చారు. అప్పటి నుండి తెలంగాణ విప్లవోద్యమం అంతర్జాతీయ పెట్టుబడి, సామ్రాజ్యవాదంతో తలపడాల్సి వచ్చింది.
టర్కీలో అమలు చేసిన ‘మంద్రస్థాయి యుద్ధ తంత్రం’ తెలంగాణలో అమలు చేయడం ఆరంభమయ్యింది. ప్రజలను వీలైనంత మేరకు అన్ని రకాలుగా మభ్యపెట్టి కొంత డబ్బు ఇచ్చి చీలదీయడం అందుకు సంబంధించిన నిర్మాణాలను అభివృద్ది చేయడం. ఒకపక్క ఈ కాలంలోనే పత్రికలు, టీవీ చానెల్లు విరివిగా వచ్చాయి. అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు వెలిశాయి. మరోపక్క గ్రామీణ ప్రాంతాలల్లో నాయకత్వాన్ని గుర్తించి ప్రజల నుండి వేరు చేసి నిర్మూలించడం జరిగింది. గ్రామాలల్లో అదివరకంటే మూకదాడులు తగ్గి సానుభూతిపరులను, మిలిటెంట్లను గుర్తించి కేసులు లేకుండా ముసుగు సంఘాలతో చంపడం ఆరంభమయ్యింది. ఇలాంటి స్థితిలో గ్రామాలల్లో సంఘనిర్మాణాలల్లోని అగ్రకుల, బహుజన, ధనిక మధ్యతరగతి రైతులు ప్రభుత్వ పథకాల మోజులో పడ్డారు..
అందుకనుగుణంగా త్వరగతిన ఏర్పడి పనిచేయాల్సిన రహస్య ప్రచార కమిటీలు అనేక వైరుధ్యాలతో సతమతమయ్యాయి. విప్లవోద్యమం వలన ఉత్పత్తి వనరుల్లో, ఉత్పత్తి శక్తుల్లో కదలిక మొదలయ్యింది. ఈ కదలిక ఎప్పటికప్పుడు తలెత్తే వైరుధ్యాలను సరైన సమయంలో పరిష్కరించి, ఉత్పత్తి సంబంధాలను ప్రజాస్వామీకరించి ప్రతిఘటనా పోరాటాలను, దోపిడీలేని నూతన ప్రజాస్వామిక విప్లవ దిశగా నడిపించే ప్రజారాజ్య కమిటీలు అవసరమయ్యాయి. ఈ స్థితులన్నిటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి తీవ్రమైన నిర్బంధంలో కూడా నిలదొక్కుకొని పనిచేయగల ‘ప్రజారాజ్య కమిటీ’ నిర్మాణంలో ఎదురవుతున్న అతివాదం, మితవాదం కు సమస్యను అధిగమించాలనే గుర్తించిన నల్లా ఆదిరెడ్డి, సంతోష్‌రెడ్డి, నరేష్ (తెంగాణ విప్లవోద్యమ) నాయకత్వాన్ని బెంగుళూరులో పట్టుకొని హత్య చేశారు. ఆ తరువాత ఒక మలుపు తిరిగి పురోగమించాల్సిన కీలకమైన స్థితిలో నాయకత్వం అందడంలో ఆలస్యమై తీవ్రమైన నష్టాల్లో నుంచి భయటపడి తెలంగాణ ఖాళీ చేయాల్సివచ్చింది. వందలాది మంది హతులయ్యారు.
నిర్బంధాన్ని ఎదుర్కోవడానికి, వలసవాద దోపిడీని అరికట్టడానికి తెలంగాణ స్థలకాలాల్లో జరిగిన అనేక పరిణామాల మూలకంగా ప్రత్యేక తెంగాణ రాష్ట్ర నినాదం బలపడింది. 1997 నాటికే తెలంగాణలోని పరిస్థితులను అంచనావేసి, ఒక ఉద్యమ రూపం తీసుకోవాల్సి వచ్చింది. ‘తెలంగాణ జనసభ’ ఆవిర్భవించింది. తెలంగాణ భూస్వామ్యశక్తులు అదనుకోసం చూస్తున్నాయి. తమ అస్తిత్వం కోసం విప్లవ శక్తులతో కలిసి ఉద్యమించాల్సి వచ్చింది. అనేక పోరాటాల అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం సాధన ఉద్యమంలో విప్లవోద్యమ శక్తులు పాల్గొని పోరాడినా కూడా నాయకత్వం భూసామ్య శక్తులే వహించడం వలన, ఇపుడు ఊళ్లు తరిమేసిన దొరలు, ఉద్యమాల నుంచి వచ్చి రాజీపడిన శక్తులతో కలిసి రాజ్యాధికారం చేపట్టారు. ఊళ్లు ఖాళీ చేసిన దొరలు అనేక రకాలుగా పట్టణ ప్రాంతాల్లో, స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి దళారులుగా సురక్షిత ప్రాంతంలోకి విస్తరించారు. మళ్లీ ఖాళీ చేసిన గ్రామాల్లోకి చొచ్చుకురావడానికి తగిన పరిస్థితులు కల్పించుకుంటున్నారు. గ్రామాల్లో విప్లవోద్యమం ఆరంభించి, కొనసాగించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్య అట్లాగే ఉండగా కొత్తగా తలెత్తిన స్థానిక రాజకీయాల్లో కొనసాగుతున్న బహుజనులు, దళితుల మధ్య వైరుధ్యం పెంచిపోషించి నిచ్చెన మెట్ల కులవ్యవస్థను వాడుకొని సుస్థిర రాజకీయాధికారాన్ని తెలంగాణ భూస్వామ్యవర్గం దక్కించుకున్నది.
విచిత్రమేమిటంటే ‘తెలంగాణ జనసభ’ ప్రకటించిన ప్రణాళికనే తమ ప్రణాళికగా చెప్పుకొని, విప్లవోద్యమం పరిష్కరించాల్సిన సమస్యను, వైరుధ్యాలను గుర్తించి తమకనుకూలంగా అర్థవలస, అర్థభూస్వామ్య పద్దతిలో ఇటు వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో మార్పులు చేయబూనుకున్నారు. తెలంగాణ జనసభ నాయకుడు ఆకుల భూమయ్య ప్రమాదంలో చనిపోవడం యాదృచ్చికమైనదేమీ కాదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వైరుధ్యాలను ప్రజల ప్రమేయంతో పరిష్కరించే ప్రణాళికక కొండగుర్తు. ‘విప్లవోద్యమం’ లేదా ‘తెలంగాణ జనసభ’ గుర్తించిన వైరుధ్యాలను మౌళికంగా ఉత్పత్తి వనరులు, శక్తులు, ఉత్పత్తి సంబంధాల నూతన ప్రజాస్వామిక దృక్పథంతో ప్రజల ప్రమేయంతో పోరాటాల ఐక్యతతో పరిష్కరించడం లక్ష్యంగా కలవి. స్థల కాలాల్లో విప్లవోద్యమం వలన మారిన పరిస్థితులను భూర్జువా, భూస్వామ్య, వలస శక్తులతో కూడి ఉన్న ప్రభుత్వాలు పరిష్కరించజాలవు. అందుకే ప్రపంచ విప్లవాల్లో శ్రామిక వర్గానికి రాజ్యాధికారం ఒక లక్ష్యంగా వ్యుహంగా కొనసాగాయి.
(చివరి భాగం జులై సంచికలో…)
మీ వ్యాసము చదువుతుంటే గతం కళ్ళముందు కదాలాడింది