ఏరువాక తొలకరి చినుకులు

కవి, విమర్శకుడు, ఉస్మానియాలో తెలుగు పరిశోధనచేసి డాక్టరేట్‌ సాధించిన శివరాత్రి సుధాకర్‌ తనను తాను పునర్నిర్మించుకునే క్రమంలో రాసిన ఎలిజీల స్థాయి గల పరిచయ వ్యాసాలివి. తన మార్గంలో తన ముందుతరం అడుగుజాడలను స్మరించుకోవడం, యాదిచేసుకొని మనాది పడటం, విప్లవోద్యమ మూడోతరం చేస్తున్న ప్రయత్నమిది. ఈ పరిచయాలన్నీ ‘కొలిమి’ అంతర్జాల పత్రికలో వచ్చినవి.

పాత నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటకు ముప్ఫై కిలోమీటర్ల దూరంలో గల మారుమూల పల్లె ముకుందాపురంలో పుట్టినవాడు సుధాకర్‌. అన్ని భారతీయ గ్రామాలలో లాగే ముకుందాపురం అర్ధ వలస`అర్ధ భూస్వామిక విధ్వంసకర ఉత్పత్తి విధానం గల ఊరు. కుల వర్గ పీడనలతో మండుతున్న కుంపటి లాంటి ఆ ఊళ్లోకి సుధాకర్‌ నాయిన శివరాత్రి మల్లయ్య కమ్యూనిస్టు పార్టీని, సాహిత్యాన్ని త్యాగపూరితమైన సమిష్టి పోరాట జీవితాన్ని తెచ్చాడు. ఊరిపక్క ఏటి ఒడ్డున గల వందెకరాల భూపోరాటానికి నాయకత్వం వహించినందుకు మల్లయ్య మీద దొరల గూండాలు మూడుసార్లు హత్యాయత్నం, పంటల ధ్వంసం, ఇల్లు కూల్చివేశారు. ఒక జోరువాన రాత్రి బరిసెలతో పొడిచారు. హాస్పిటల్‌లో సహచరి బతికించుకున్నది. మల్లయ్య సాయుధమయ్యాడు. దొరల సాయుధ ముఠాలను ప్రశ్నించని, అరెస్టు చేయని సర్కారు మల్లయ్యను జైల్లో పెట్టింది. అతని సహచరి నలుగురు చిన్న పిల్లలతో అతని వెంట నడిచింది. అలాంటి పోరాట వారసత్వ కుటుంబం నుంచి ఎదిగివచ్చిన సుధాకర్‌ హింసాత్మకమైన ఊరి నుండి చదువుకోసం బయటికి వచ్చి హాస్టల్‌లో చేరాడు. సూర్యాపేట నుండి ఉస్మానియా దాకా, బీఈడీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో జర్నలిజం, తెలుగు సాహిత్యం చదివాడు. భాషాశాస్త్రంలో ఎం.ఫిల్‌., ఉస్మానియా యూనివర్సిటీలో ‘విప్లవ కవిత్వంలో వస్తురూప వైవిధ్యం’పై పరిశోధన చేశాడు.

ఇలాంటి పోరాట వారసత్వం నుండి రూపొందిన సుధాకర్‌ తన తండ్రి తరం విప్లవ కవులను వెతికి పట్టుకున్నాడు. ప్రతీ అక్షరం మమేకత్వంతో వాళ్ల సాహిత్యాన్ని తనలోకి తీసుకొని ఆర్ధ్రమైన, ఆత్మీయమైన పరిచయాలు రాశాడు.

అలిశెట్టి ప్రభాకర్‌, సలంద్ర లక్ష్మీనారాయణ, రాప్తాడు గోపాలకృష్ణ, సత్యనారాయణ. ఈ నలుగురు విప్లవ రచయితల జీవితం మన కాలంలో, మన ప్రాంతంలో అభివృద్ధి నిరోధకమైన పాతదాన్ని ధ్వంసంచేసి నూతన ప్రజాస్వామిక కొత్త నిర్మాణం కోసం జరిగే భీకర సంఘర్షణలో నుండి శివరాత్రి మల్లయ్య పోరాట జీవితంలాగే పెను ప్రవాహ సదృశంగా కొనసాగింది. ఆ ఒత్తిడి, చిత్తడిలో నుండి సాహిత్యమంటే తెలియని కులాల నుండి, కుటుంబాల నుండి వచ్చిన ఆ నలుగురు సాహిత్యం రాశారు. వాళ్ల సాహిత్యం తెలుగు సాహిత్యంలో మునుపెన్నడూ లేనట్టి వస్తువు, శిల్పం, భాషను ప్రవేశపెట్టింది. ఎందుకంటే పాత అర్ధవలస`అర్ధ భూస్వామిక వ్యవస్థను పెకలించి నూతన ప్రజాస్వామిక సమాజాన్ని రూపొందించే క్రమంలో జరుగుతున్న విప్లవోద్యమంలో రూపొందిన సాహిత్యం అది.

ప్రభాకర్‌, సలంద్ర, రాప్తాడుతోవాళ్ల ఉద్విగ్న, ఉద్రిక్త భావావేశాలతో కలిసి నడిచిన ఆ రోజులుకొన్ని జ్ఞాపకాలు చుట్టుముట్టి అక్షరాలు అలుక్కుపోయాయి. వర్గపోరాట క్రమంలో కవిత్వం, కథలు రూపొందే క్రమం ఎంత యాతనమయమో? ఎంత వీరోచితమో? అవి రాయకపోతే ఆ ఉద్విగ్న భావావేశాలు దించుకోవడం, పంచుకోవడం లేకపోతే… మనుషులేమైపోతారో? వీళ్ల నలుగురి సాహిత్యమే సాక్ష్యం. విప్లవోద్యమ ఉప్పెనలో వాళ్లెంత జ్వర పీడితులై వేగిపోయారో నాకు ప్రత్యక్షంగా తెలుసు. సత్యనారాయణ నాకు కూతవేటు దూరంలో పుట్టి పెరిగిన అతని అడుగుల సవ్వడి అతని అక్షరాల ద్వారా వినిపిస్తూనే ఉండేది. విచిత్రంగా ఆ నలుగురి బాహ్య స్వరూపాలు, ముఖ కవళికలు ఒకేలా ఉండేవి. అలిశెట్టి పూర్తికాని కవిత్వంలాగా అతని ముఖంలో భావోద్వేగాలు తచ్చాడేవి. సలంద్ర నవ్వు ముఖం, రాప్తాడు నిరంతర అన్వేషణ. అమాయకత్వపు పసిపిల్లవాడి ముఖం.

వాళ్లు నలుగురు గతితార్కిక చారిత్రక భౌతికవాదులు. రాజకీయార్థిక విజ్ఞాన శాస్త్రాలైన మార్క్సిజంలెనినిజం తెలిసిన పట్టణ ప్రాంతపు విప్లవోద్యమాలల్లో రూపొందినవాళ్లు. మావో ఆలోచన వెలుగులో ఆరంభమైన నక్సల్బరీ, శ్రీకాకుళం నుండి స్ఫూర్తిపొంది కరీంనగర్‌ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఆరంభమైన రైతాంగ సాయుధ పోరాటాల క్షేత్రస్థాయి అనుభవాల మధ్య ఎదిగినవారు.

వాళ్లు స్వతహాగా సాహిత్యకారులు కాని కులాల నుండి, కుటుంబాల నుండి వచ్చినవారు. సాంప్రదాయిక సాహిత్య నేపథ్యం, సాహిత్య మర్మం పెద్దగా తెలిసినవాళ్లు కాదు. విప్లవోద్యమాల అనుభవాల ఒత్తిడి నేపథ్యంలో వాళ్లు అనివార్యంగా సాహిత్యకారులుగా మారారు. తమ కాలాన్ని, తమ పోరాట భావోద్వేగాలను సిస్మోగ్రాఫ్‌లాగా రికార్డు చేయడానికితమ చుట్టూ విస్తరించి ఉన్న యువకుల్లోకి విప్లవోద్యమాన్ని తీసుకుపోవడానికి వాళ్లు సాహిత్యాన్ని వాహికగా ఎంచుకున్నారు. ఊపిరంత సహజంగా, ఉద్యమాల నుండి పొందిన ఆక్సిజనంత స్వచ్ఛంగా వాళ్లు కవిత్వం రాశారు (వాళ్లు నలుగురిలో ముగ్గురు బతికింది ముప్ఫై లోపే. సలంద్ర మెదడు వ్యాధితో, రాప్తాడు ఆత్మహత్య, సత్యం పోలీసులతో పోరాటంలో, ప్రభాకర్‌ క్షయ వ్యాధితో అమరులయ్యారు). అలిశెట్టి ప్రభాకర్‌ మాత్రం ముప్పై ఏడు సంవత్సరాలు బతికాడు. వాళ్లు సంఖ్యలో వేల పేజీలు రాయలేదు. సాహిత్యకారులుగా నిలిచిపోవాలని, అవార్డులు, రివార్డుల ధ్యాస లేదు. మృత్యు ముఖంలో నిరంతరం తచ్చాడే జీవితంవిప్లవోద్యమం మధ్య నుండి రాశారు. విచిత్రంగా ఆ నలుగురి పదచిత్రాలు , చూపు ఒకే వస్తువుకు సంబంధించిన అనేక ప్రతిఫలనాలు. వాళ్ల నలుగురి సాహిత్యం, జీవితంలోని వెలుగు నీడల నేపథ్యంలో సుధాకర్‌ తను మమేకమై పలవరించిన వ్యాసాలివి.

ప్రభాకర్‌ తెలుగు నుండి దేశవ్యాప్తంగా, చెరబండరాజులాగా విప్లవ వస్తువును వ్యాపింపజేసిన కవి. అతని ఫొటో స్టూడియో, అతని యిల్లు విప్లవోద్యమాల కొండగుర్తు. జగిత్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌, విద్యానగర్‌. ప్రభాకర్‌ ప్రయాణం అతని కవిత్వంలాగే ఒక అవసరం. ప్రతి మాటప్రతి చిత్రం అతను అమరుడయ్యేదాకా సామూహిక బృందగానం. అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వంలోని భిన్న వస్తువులను వడకట్టిన సూటి బుల్లెట్‌ లాంటి మాటలతోలిప్త కాలపు సమయంలో పేల్చిన కవిత్వాన్ని`అతను ఎంచుకున్న రూపాన్ని సుధాకర్‌ విస్తృతంగా చర్చించాడు. అనేక కవితలను విశ్లేషించాడు.

సలంద్ర లక్ష్మీనారాయణ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్‌ రూం సి-35 ఒక చారిత్రాత్మకమైనది. ఆ రూం ఎన్ని ఆరాట పోరాటాలు, గాయాలు నొప్పులు చూసిందో. అట్లాగనే అతని యిల్లు. సలంద్ర విప్లవోద్యమంతో పాటు దళిత జీవితాన్ని, పెద్ది శంకర్‌ అమరత్వం మీద రాసిన పాటలను సుధాకర్‌ విశ్లేషించాడు.

అట్లాగే రాప్తాడు అనంతపురం, జగిత్యాల, కర్నూలు దాకా పోరాడే యువకుల అడ్డా. నా మట్టుకు నేను వీళ్ల ముగ్గురి దగ్గర ఎన్నిసార్లో అనివార్యంగా ఉన్నాను. రాప్తాడు కవిత్వాన్ని`మహిళలు, పిల్లల మీద రాసిన కథలను శోధించాడు. సత్యం ప్రయాణం మందమర్రి నుండి హైదరాబాదు, విశాఖపట్నం మీదుగా దళ కమాండర్‌గా అతను అమరుడయ్యే దాకా సాగిన సాగిన ప్రయాణం గురించి ఆయన రాసింది అతి తక్కువే.

సత్యం యుద్ధరంగం `జైలు జీవితం, అమ్మ గురించి రాసిన ‘పునరంకితం’ కవిత్వాన్ని గుండెలకు హత్తుకున్నాడు. చిత్రంగా మరణాన్ని ధిక్కరించిన ఈ నలుగురు అతి చిన్న వయసులోనే అమరులయ్యారు.

వాళ్ల నలుగురి గురించి ముఖ్యంగా తన ముందుతరం గురించి శివరాత్రి సుధాకర్‌ ఏ పేగు సంబంధంతోనో అన్వేషించాడు. అన్వేషణ బహుశా తన తండ్రికి సంబంధించిన మనాది లాంటిది. తన ఊరు పూర్వీకుల వీరగాథల తవ్వి తలకెత్తుకోవడం లాంటిది.

‘అగ్గిపెట్టె’లాగా సత్యమైన, అవసరమైన ఇలాంటి విప్లవ కవిత్వాన్నికథలను, త్యాగపూరితమైన జీవితాలను పోరాడే ప్రజలు వెతికి పట్టుకుంటారు. గుబగుబలాడే కన్నీళ్లతోతమ ఉద్విగ్న భావోద్వేగాలతో ఈ నలుగురిని స్మరించుకుంటారు. తమ జీవితంలో, ఆచరణలో భాగం చేసుకుంటారు. అలాంటి గొప్ప ప్రయత్నంచేసిన సుధాకర్‌ వాళ్ల నలుగురిని నాలుగో తరానికి ముఖ్యంగా పోరాడే యువతరానికి పరిచయం చేశాడు. వాళ్ల నలుగురినీ మళ్లీ పునరుజ్జీవింపజేశాడు. అందరూ తప్పక చదువదగిన సాహిత్యం ఆ నలుగురి సాహిత్యం. ఆ సాహిత్యం మూలాలు, జీవితం తెలుసుకోవాలంటే ఈ పరిచయ వ్యాసాలు తప్పక చదువవల్సినవి.

అతి పురాతనమైన, దుర్మార్గమైన బ్రాహ్మణీయ వర్గ, కుల, మత, లింగ, ప్రాంత వైరుధ్యాలతో గిడసబారిన సామాజిక వ్యవస్థ మర్మాన్ని విప్పిచెప్పి, దాన్ని మార్చడానికి పీడిత వర్గాలు, కులాలు పోరాడాలని విప్పిచెప్పిన వాళ్ల సాహిత్యం మార్పు కోరేవారందరూ చదువవల్సినవి. వాళ్ల స్వల్ప జీవితకాలంలో తమవంతు కర్తవ్యంగా పోరాటంలో పాలు పంచుకోవడానికి, సాహిత్యాన్ని రాయడానికి తమ జీవితాన్ని త్యాగం చేసినవాళ్లు. ఆ త్యాగాల ఫలితం అనుభవిస్తున్న వాళ్ల ముందుతరం వాళ్లకు, వాళ్ల ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత విప్లవాన్ని కోరే మనమీద ఉన్నది.

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply