ఫ్యూడల్ సాహిత్య సమాజపు ధిక్కార పతాక: తొలి పంజాబ్ మహిళా రచయిత్రి అమృతా ప్రీతం – 2

20వ శతాబ్దంలో అమృత తన కవిత్వము, వచనము రెంటిలోనూ స్త్రీత్వానికి, కొత్త ఆధునిక, గౌరవనీయమైన నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అలాగే, స్త్రీల వ్యక్తిత్వాలను, వాళ్ళ సాధికారత, స్వేచ్ఛకు సంబంధించి ముఖ్యముగా రచయిత్రులను గురించి భిన్నమైన కోణంలో చర్చించడం మొదలు పెట్టింది. అంతేకాదు, స్త్రీలు, బాధాకరమైన వైవాహిక సంబంధాల కొనసాగింపు ఆవశ్యకత లోని న్యాయాన్యాయలను ప్రశ్నించేది. తన జీవితంలో తన వైవాహిక జీవితంలోని భర్త, అత్తల నుంచి ఎదుర్కొన్న అణిచివేతలను భరించలేక 1960 లో ఆమె విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. అమృత కవి సాహిర్ లుథియాన్వితో ప్రేమలో పడడం, అతనితో కలిసి ఉండాలనుకోవడం కూడా కారణం. ఈ నిర్ణయం తీసుకోవడానికి అమృత ఏ మాత్రము వెరవలేదు. పైగా భర్తతో విడిపోయింది కూడా. కానీ సాహిర్ పిరికితనం వలన అమృత సాహిర్ ని పొందలేక పోయింది. కానీ సాహిర్ మీది ప్రేమ, మోహం, విరహపు బాధని తన కవితలనిండా గుప్పిస్తూ రాసింది. అందుకే అమృతని పురుష రచయితలు ”శృంగార రచయిత్రి” అని వెక్కిరించేవారు కానీ అమృత పట్టించుకోలేదు. విప్లవం, ఆకలి, హింస, దారిద్య్రం, దోపిడీ, హక్కులు, కోపము, ఆనందం లాగా శృంగార భావనలు కూడా అంతే సహజంగా సాహిత్యంలో రాసే స్వేచ్ఛ రచయిత్రులకి ఉండాలి అని అమృత భావించి ఉండచ్చు. ”రాత్రి” అనే కవితలో స్త్రీలు రాసే సాహిత్యం మీద అనేక ఆంక్షలు ఉన్న 20వ శతాబ్దపు ఆరంభ కాలంలో, భారత దేశంలోని ఫ్యూడల్ వ్యవస్థలో స్త్రీల మీద అమలవుతున్న పురుష లైంగిక రాజకీయాలు, స్త్రీ పురుషుల మధ్య నడిచే వివాహేతర సంబంధాల మీద చర్చించింది. 

రాత్రి

ఈ రాత్రి,
సగం అక్కడ, సగం ఇక్కడ
గ్యాస్ లైట్ల వెలుగులో,
మధువును గుటకలు వేస్తూ
గుప్పిట నోట్లను బంధిస్తూ,
అందమైన ఆడవాళ్ళ ముఖాల కోసం
ఏ ఇంటి చూరు కింద ఎదురుచూస్తూ ఉన్నావో?
ఓ నా పుట్టబోయే బిడ్డకి కాబోయే తండ్రీ,
నువ్వు, అవును నువ్వే,నువ్వే !

ఈ రాత్రి కూడా, నువ్వు సగం అక్కడ, సగం ఇక్కడ
నేను మాత్రం, అదే గాస్ లైట్ వెలుగులో,
నీ తాత ముత్తాతల
ఇంటి చూరు కింద,
తాగి తడబడే నీ అడుగుల చప్పుడు కోసం,
అసహ్యకరమైన సారా డాగులు నిండిన చొక్కాతో
ఖాళీ జేబులతో, వచ్చే నీ కోసం,
తాగి, తాగి నిప్పుల్లాగ ఎర్రబడ్డ కళ్ళతో,
నోటినిండా పచ్చి బూతులతో అరుస్తూ వచ్చే నీకోసం,
నేను – అవును – నేను – నేనే !
అమ్మని ! అవును…
నీకు పుట్టబోయే బిడ్డకు తల్లిని
ఎదురు చూస్తున్నాను!

గర్భధారణ చుట్టూ అల్లబడిన స్త్రీల నిస్సహాయ స్థితి వలన వచ్చే పురుషుడిపై పరాధీనతని, నమ్మకాలని, విశ్వాసాలని, భర్త వివాహేతర సంబంధాలని, భర్తచే నిర్లక్షానికి గురి కాబడ్డ భార్య వేదనని, అదే సమయంలో పురుషున్ని దక్కించుకోవడానికి భార్య తన భర్తని, సంతానం అనే బంధంలో ఇరికించడానికి చేసే వ్యర్థ నిష్ఫల ప్రయత్నం, చట్టబద్దమైన భార్యకి, అనైతికంగా వ్యభిచరిస్తున్న స్త్రీకి మధ్య పోలికని ఈ రాత్రి అనే కవితలో చర్చకు పెడుతుంది అమృత. తను కూడా వ్యభిచారిని లాగ తన భర్తని, కొడుకుని కని ఇంటికి బంధించాలని అనుకుంటుందా? తను ఆమె లాగా విశృంఖల స్వభావం ఉన్న ఆడదా లేక ఇద్దరూ ఒకటేనా? కవిత నిండా ఇలాంటి సందిగ్ధ, అసందిగ్ధ, నైతిక, అనైతిక సంబంధాల, ఆత్మగౌరవ ఘర్షణల ప్రస్తావన నడుస్తుంది. అమృత రాసిన వర్జిన్, స్కార్, ఫస్టుబుక్, రాత్రి లాంటి కవితల్లో అప్పటి ఫ్యూడల్ సమాజాలలో నిషిద్ధమైన వివావేహతర సంబంధాలు, అవాంఛిత గర్భాలు, గర్భ స్రావాలు, అక్రమ సంబంధాల వలన పుట్టిన పిల్లల అవమానకర జీవితాలు, విభజన సమయంలో జరిగిన మత హింసలో భాగంగా అత్యంత కిరాతకంగా స్త్రీల మీద జరిగిన లైంగిక అత్యాచారాలు, స్త్రీ, పురుషుల మధ్యన నడిచే పురుషుడి అవసరం, తృప్తి, ఆధిపత్యం కేంద్రంగా నడిచే లైంగిక రాజకీయాలని చాలా బహిరంగంగా చర్చకు పెట్టింది. కవిత్వంలోనే కాదు ‘డాక్టర్ దేవ్’, ‘పింజర్’ ఇంకా అనేక నవలల్లో, ‘రెవిన్యూ స్టాంప్’ ఆత్మకథ లో కూడా వీటిని స్వేచ్ఛగా చర్చించింది. అమృత తన మీద విమర్శ పెట్టిన వారికి, ముఖ్యంగా పురుష రచయితలకు సరైన సమాధానమే ఇస్తుంది. స్వాతంత్త్రానంతర పంజాబ్ కవిసమ్మేళనంలో చాలా బాధతో ఇలా అంటుంది అమృత. “సామాజిక కట్టుబాట్లు, నిబంధనల ప్రస్తావన, చర్చ నా సాహిత్యంలో ఖచ్చితంగా తీసుకొచ్చాను కానీ వాటిని వ్యతిరేకిస్తూ, తిరస్కరిస్తూ, విమర్శిస్తూ మాత్రమే సుమా. ఈ క్రమంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. బహుశా మేధావి, సృజనశీలురైన ప్రతీ ప్రగతిశీల రచయిత్రి, కవయిత్రి ఈ రకమైన బాధలు పడాల్సిందేనెమో? ఈ బాధలు, ఒత్తిళ్లు అవమానాలు రచయిత్రులు చెల్లించాల్సిన మూల్యమేమో అనిపిస్తుంది నాకు. స్త్రీల విషయానికి అదీ సాహిత్య రంగంలో ఉన్న రచయిత్రుల విషయానికి వస్తే, వీళ్ళు మిగతా రంగాల్లోని స్త్రీల కన్నా భిన్నమైన సమస్యలతో ఉంటారు. వాస్తవానికి సాహిత్య రంగాల్లో ఉండే స్త్రీల పట్ల పురుష రచయితల, కవుల, విమర్శకుల, సమీక్షకుల, న్యాయనిర్ణేతల పక్షపాత ధోరణి, స్త్రీల రచనల పట్ల అవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంది. స్త్రీలు రాసిన సాహిత్యాన్ని చాలా తేలికగా తీసుకుంటారు, వాళ్ళ నిబధ్ధతను, మేధస్సును, సృజనాత్మకతను, ప్రతిభను, సంశయిస్తుంటారు. వాళ్ళకంటే స్త్రీలు ప్రతిభావంతంగా రాయడాన్ని భరించలేరు. ఏదో ఒక విధంగా అవమానించి, వారిని నూన్యత పరిచి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, కిందికి తోసేయ్యాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ సందర్భంగా నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నాకు కూడా ఇటువంటి అనుభవాలు చాల అయినాయి. నాకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు, నాకు ఎంతో పేరు, ప్రతిష్ట, గుర్తింపు వచ్చింది కానీ ఢిల్లీలో ఒక పేరున్న ఇంగ్లీష్ పత్రిక ఏం రాసిందో తెలుసా?  నాకు పంజాబ్ సాహిత్య రంగంలో ఇంతటి పేరు, అవార్డులు అన్నీ కూడా కేవలం నేను యవ్వనంలో ఉండి, అందంగా, చురుగ్గా ఉండడం వల్లనే వచ్చాయి అని. సాహిత్య అకాడమీ అవార్డు నా మేధస్సుకు, సృజనాత్మక రచనలకు కాకుండా నా అందానికి వచ్చింది అని ఆ పత్రిక నడిపిస్తున్న పురుష సంపాదకులు వ్యాఖ్యానించడం, నన్ను ఎంతో మనస్తాపానికి గురి చేసింది. తమ కంటే సమర్థవంతంగా రాసే రచయిత్రుల పట్ల పురుష రచయితలకు అంత అసూయా, ద్వేషాలు, కుస్థితత్వం ఎందుకు? నాకు గుర్తింపు వచ్చింది నేను రాసిన రచనల వలన, నా ప్రతిభ వలన కాదా? వీళ్ళు, అందమైన స్రీలని ఆరాధించడం వరకు మాత్రమే, ప్రతిభ ఉన్నవాళ్లను అంగీకరించే సౌజన్యం వీరికి ఉండదు.”

https://youtu.be/YtZfBfmj-rY

తన సమకాలీన పురుష సాహిత్యకారులు వారి రచనలు కేవలం వారు మేధావులు, సృజనకారులు, తెలివైనవారు, ప్రతిభ ఉన్నవారు కావడం వలన మాత్రమే విజయాలు, అవార్డులు, గుర్తింపుకి నోచుకుంటున్నట్లు సాహిత్య సమాజం ప్రవర్తించడం, బహిరంగ సభల్లో వారి సాహిత్యంలో గొప్పతనాన్ని పొగడడం చేసుకుంటారు. అదే సమయంలో అమృత ఒక ప్రతిష్టాత్మకమైన మహిళా అవార్డు గ్రహీతగా ఉన్నా కానీ, అది ఆమె ప్రతిభకు దొరికిన గుర్తింపు అయినా కానీ అమృత స్త్రీ అవడం మూలంగా మాత్రమే అది వచ్చి వుండచ్చని ఆమె రచనలు సమాజాన్ని, సాహిత్యాన్ని, లోతైన అధ్యయనం, పరిశీలనా చేయడం వలన రాసినవి కావని అవన్నీ పైపైన రాతలని, దానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని భావించారని, వ్యాఖ్యానించారనీ అమృత తీవ్రమైన మనస్థాపంతో మాట్లాడుతుంది. ఖండిస్తుంది. అమృత తన సాహితీ జీవిత చరమాంకం వరకూ ఈ రకమైన కుట్రపూరితమైన రచయితల అణిచివేతలని, కుసంస్కారాన్ని ఎదుర్కొంటూనే ఉంది స్త్రీలతో అనేక సంబంధాలు నెరుపుతూ దాదాపు అశ్లీల సాహిత్యాన్ని ఎక్కువగా రాస్తాడు అని పేరున్న రచయిత కుశ్వంత్ సింగ్ కూడా అమృత రచనల కంటే కూడా ఆమె సౌందర్యమే ఎక్కువగా ఆకర్షిస్తుంది అని అంటాడు. “స్వాతంత్య్రం వచ్చిన తరువాతి కొత్త పంజాబీ కవిత్వంలో చాలా బాధ, దుఃఖము అంతకు మించి సమాజాన్ని కదిలించి ఆలోచింప చేసే శక్తీ ఉన్నాయి. నేను వాటి మీద మాత్రమే అంటే మానవ దుఃఖం మీద మాత్రమే రాయగలిగాను. సమాజం దుఃఖంతో ఉంది కాబట్టి నా కవితాన్ని అంగీకరించింది లేదా గుర్తించింది.  1960లో అప్పుడు నేను రాసిన కవిత్వం వీళ్ళందరికి వ్యాధిగ్రస్తమైనదిగా, అశ్లీలంగా, అయోమయం కలిగించేదిగా ఉన్నది కావచ్చు. అలా నా కవిత్వానికి ముద్రలు వేసింది వీళ్ళే ఈ పురుష రచయతలే” అని అమృత తన ఆత్మ కథలో బాధతో రాసుకుంటుంది.

20వ శతాబ్దపు మధ్య కాలంలో, అమృతా ప్రీతం, ఆమె సమకాలీన రచయితలు కొందరు పుంజాబ్ లో ”న్యూ పోయెట్రీ సీన్ ఇన్ పంజాబీ” ను మొదలు పెట్టారు. ఈ సంస్థ ద్వారా ఫ్యూడల్ సమాజంలో కొనసాగుతున్న అసమానతలను, సాంప్రదాయకమైన స్త్రీల పితృస్వామ్య నమూనాలను, లైంగికతకు సంబంధించిన పక్షపాత ధోరణులను, మానసిక శాస్త్రాన్ని,రాజకీయాల్ని తమ సాహిత్య ప్రక్రియల ద్వారా సవాలు చేయడం మొదలు పెట్టారు. ఈ రకంగా సమాజంలో పాతుకుపోయిన ఫ్యూడల్ నమూనాలను, సాంప్రదాయాలను శాస్త్రీయంగా, హేతుబధంగా, తార్కికంగా ఎదిరించడానికి, ప్రశ్నించి ఆలోచనలు రేపటానికి ఒక కళాత్మకమైన సాహిత్య ప్రక్రియను సృష్టించిన అమృత లాంటి ఆధునిక రచయిత్రులు, స్త్రీవాదులు, పరిశోధక రచయిత్రులు 20వ శతాబ్దపు మధ్య కాలంలో దక్షిణ ఆసియాలో తీవ్రమైన సెన్సార్షిప్ ని, అశ్లీల రచయత్రులు అన్న నిందని, సాంప్రదాయ భావజాలం ఉన్న పాఠకులనుంచి తిరస్కారాన్ని ఎదుర్కొన్నారు.

ఇంతటి అణిచివేతని ఎదుర్కొంటున్నా అమృత 1964 లో పంజాబ్ లిటరరీ జర్నల్ ”నాగమణి”ను మొదలు పెట్టింది. పంజాబ్ లో పేరున్న రచయితలు, కొత్తగా రాస్తున్న వాళ్ళ సాహిత్యం, అలాగే విదేశీ అనువాద సాహిత్యాన్ని ప్రచురించడం మొదలుపెట్టింది. దాంతో పాటుగా ఇంగ్లీష్ భాషలో రాయలేని, పంజాబీ రచయితల, రచయిత్రుల రచనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చింది అలాగే అణిచివేతకు గురి అయ్యే, కులాల, తెగల, భిన్న భాషలని, సంస్కృతిని కలిగివున్న వారి రచనలను ప్రచురించడం మొదలుపెట్టింది. దీని వలన అమృత కి అంతర్జాతీయ సాహితీరంగంలో చాలా గుర్తింపు వచ్చింది. అంతర్జాతీయ సాహితీ సభలకు ఆహ్వానాలు అందుకున్నది అమృత. సోవియట్ యూనియన్, బల్గేరియా, రోమానియా, వెస్ట్రన్ యూరోపియన్ దేశాల సాహిత్య సంస్థలు అమృతని ఆహ్వానించి, గౌరవించాయి. దీనితో అమృత పరిశీలనా దృష్టి చాల విశాలమైంది. ఉజ్బెకిస్తాన్ లో దేశభక్తి గీతాలు, అద్భుతమైన ప్రేమ కవితలు రాయడంలో పేరు తెచ్చుకున్న కవయిత్రి జుల్ఫీయాని కలిసింది అమృత. అలాగే, తజెక్ లో ప్రముఖ కవి, మీర్జా టర్సన్ జాడే, జార్జియన్ కవయిత్రి మిర్వార్డ్ కన్ డిల్బాజీని కలిసింది. అలాగే ఎంతోమంది హంగేరియన్ కవయత్రులని, ఇతర దేశాల రచయత్రులని కలుసుకుంది. “మా రచనలు గత పదేళ్లుగా పత్రికలు ప్రచురించడం లేదు, ఎవరూ కూడా ప్రచురించడానికి గాని, చదవడానికిగాని సిద్ధమవ్వలేదు ఇప్పుడిప్పుడే కొద్దిమంది ప్రచురిస్తున్నారు”, అని వారు చెప్పినప్పుడు ఆశ్చర్య పోయింది. నాగమని పత్రికలోఒక పూర్తి ప్రత్యేక సంచికగా బల్గేరియన్, యుగెస్లావియన్, హంగేరియన్ కవితలను ప్రచురించి, వారిని గౌరవించింది. పురుషాధిపత్యం ఉన్న సాహిత్య సమాజంలో ప్రపంచంలో ప్రతీ దేశంలో, రాష్ట్రాల్లో, స్థానికంగా స్త్రీల కోసం స్త్రీలే నడిపే మహిళా పత్రికలు ఉండాలని అమృత అభిప్రాయపడడమే కాదు, తను నడిపే పత్రికలో స్త్రీల రచనలకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చింది. రుమేనియన్, వెస్ట్ జర్మనీ సాహిత్యాన్ని ప్రచురించింది. ”మంచి రచనలు ఎవరు రాసినా, ఏ దేశం వాళ్ళు రాసినా ప్రచురించడం నాకు ఆనందాన్నిచే విషయం. వాళ్ళ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. మంచి రచయితలను కలిసినప్పుడల్లా, వాళ్ళ గురించి రాయాలన్న ఉత్తేజం కలుగుతుంది. వాళ్ళు సోషలిస్ట్ దేశస్తులా, లేక వేరే దేశానికి చెందిన వారా నాకు అవసరం లేదు. మంచి సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే నా ఉద్దేశ్యం” అంటుంది అమృత. అదే విధంగా 1961 లో ”యూరి గేగరిన్” సోవియట్ యూనియన్ లో అంతరిక్షం లోనికి వెళ్ళినప్పుడు అమృత ఆయన మీద కవిత రాస్తుంది. సమాజ అభివృద్ధి కోసం శాస్త్రీయ, సాంకేతిక జ్ఞానం, సైన్స్ ఎంత ముఖ్యమైనవో చెప్తుంది అమృత.

జాతీయ, అంతర్జాతీయంగా రచయిత్రుల మీద ఇన్ని రకాల సెన్సార్షిప్ ఉన్న సాహిత్య సమాజంలో 20వ శతాబ్దపు మధ్య కాలంలో అమృతా ప్రీతం తన స్త్రీవాద దృక్పథం తో పితృస్వామ్యం నిర్దేశించిన స్త్రీల నమూనాల మీద దాడి చేయడానికి లేదా స్త్రీలతో పాటుగా, పురుషుల్ని కూడా చైతన్యవంతుల్ని చేయడానికి ‘నాగమణి’ పత్రికని మాధ్యమంగా వాడుకున్నది. అంతే కాదు, స్త్రీల లైంగికపరమైన అంశాలు, ప్రేమ, కోరికలు, వివాహేతర శృంగారం, గర్భాలు, స్త్రీల లైంగికత చుట్టు అల్లబడిన పురుష రాజకీయాలు, మతపరమైన, సంస్కృతి పరమైన, నిషేధిత ఆచార వ్యవహారాలు, వాటికి అనుగుణంగా ఉండే సామాజిక ప్రవర్తనల గురించి తన పత్రికలో విస్తృతంగా వ్యాసాలు, కవితలు, కథలు, నవలల మాధ్యమంగా ప్రశ్నించ సాగింది. సాహిత్య రంగంలో ఉండే ఆధిపత్య ధోరణిని, ముఠాతత్వాన్ని బద్దలుకొడుతూ పేరు ప్రఖ్యాతులున్న పెద్ద రచయతల కంటే కూడా, బాగా రాస్తున్నప్పటికీ తక్కువగా గుర్తింపుకి నోచుకోని దేశ, విదేశ సాహితీకారుల రచనలను గుర్తించి ప్రచురించడం మొదలు పెట్టింది. ఆ విధంగా అమృత పంజాబీ సాహిత్య ప్రపంచానికి, కవిత్వానికి కళాత్మక, సామాజిక, రాజకీయ విస్తృతిని సంపాదించి పెట్టింది.

దేశవిభజన సమయంలో కోటానుకోట్ల ప్రజల హృదయాలు బ్రద్ధలయ్యాయి, రక్తాలు కార్చాయి. ఇల్లు, వాకిలి, డబ్బు, పొలాలు, భార్యాబిడ్డలను కోల్పోయిన హిందూ, ముస్లిం ప్రజలు, వలసల సమయంలో ఎదుర్కొన్న క్రూరమైన హింసోన్మాదానికి రక్తాలు కారుస్తూ, హాహాకారాలు చేసారు. దిక్కు, మొక్కు లేక తల్లడిల్లారు. ఆకలికి అల్లల్లాడారు. స్త్రీలు, బాలికలు లైంగిక అత్యాచారాలకు లోనైనారు. అవాంఛిత గర్భాలను మోశారు. కుప్పలకొద్దీ శవాలను కళ్ళతో చూసిన అమృత భయపడిపోయింది, కదిలిపోయింది. ఆమె కూడా బాధితురాలే. మనుషుల మధ్య మత ప్రాతిపదికన మొదలైన ద్వేషం, హింస ఆమెను వేదనలో దుఃఖంలో ముంచేసింది. ఈ వేదననంతా అమృత ‘ఆజ్ ఆఖరి వారిష్ షా ను” (ఈ రోజు నేను వ్వారిష్ షా ను అడుగుతున్నాను ) అనే కవితలో తీవ్రమైన దుఃఖంతో ప్రశ్నిస్తుంది. ఈ కవితకి ఇప్పటికీ ప్రాసంగికత ఉంది. చరిత్రలో అనాదిగా ఎక్కడైనా, యుద్దాలు జరిగిన ప్రతిసారి, ఆకలి వలసలు తరిమిన ప్రతిసారి, చెలరేగే హింస, ముఖ్యంగా స్త్రీల మీద జరిగే ఉన్మాదపురితమైన లైంగిక అత్యాచారాలు చూసి చలించిపోతుంది అమృత. మృతి చెందిన, సమాధిలో ఉన్నవందేళ్ల క్రిందటి రాంజ్హ్ అనే పంజాబ్ విఫల ప్రేమికురాలి దుఖం మీద ఆర్త్రంగా గొప్ప కవిత రాసిన సూఫీ కవి వారిష్ షా ను సమాధి నుంచి బయటకు లేచి వచ్చి, శోకంలో మునిగిపోయిన వందల మంది పంజాబీ తల్లుల దుఃఖాన్ని, విషంతో మునిగిపోయిన పంజాబు గాలిని, రక్తసిక్తమైన వీధులను, కుప్పలు, కుప్పలుగా పడివున్న శవాలను చూడడానికి సమాధి లోనించి బయటకు రమ్మని ఆక్రోశిస్తూ పిలుపునిస్తుంది. దేశవిభజన సమయంలో జరిగిన మానవ హననం, కోల్పోయిన మానవ విశ్వాసాలు, విఛిన్నమైన మానవ సంబంధాలు, విడిపోయి చెల్లాచెదరైన కుటుంబాలకు సంబంధించిన దుఃఖాన్ని, వేదనలను, భయాలను సజీవ చిత్రికను పట్టిన కవితగా ప్రపంచ ప్రఖ్యాతమైంది. అనేక భాషల్లోకి అనువాదం అయింది. అమృత 100వ పుట్టినరోజు సందర్భంగా, (ఆగస్ట్ 31.2019), ఇండియా-పాకిస్థాన్ ప్రభుత్వాలు అమృతా ప్రీతంను ప్రేమగా తలచుకొని, గౌరవించుకున్నాయి. గూగుల్ అమ్రుతా ప్రీతంను ప్రపంచ సాహిత్య చరిత్రలో అత్యంత ప్రతిభాశాలి ఆయిన రచయిత్రిగా ప్రకటించి, అమృతను జ్ఞాపకం చేసుకున్నది.

అమృత రచనలు అన్నీ, ఆమె దృక్పధాన్ని తెలియచేస్తాయి. ఆమె తన కాలానికంటే ఒక వందేళ్లు ముందుకు వెళ్లి రచనలు చేసింది. అమృత తన రచనలకు, తన ప్రగతిశీల రాజకీయ విశ్వాసాలకు, తన జీవన విధానాలకు సంబంధించి ఎవరికీ సంజాయిషీ ఇవ్వకుండా నిర్భయంగా బతికిన మనిషి. “నా జీవితం/ నా రచనలే సమాధానం వంటి సంచలనాత్మకమైన వ్యాఖ్యానాలు, రచనల ద్వారా అమృత భారత దేశం లొనే కాదు విదేశాల్లో కూడా గొంతు లేని స్త్రీలకు గొంతు అయ్యింది. పూర్తి స్థాయి సామాజిక బాధ్యత ఉన్నరచయిత్రిగా కాక మునుపు అమృత కుటుంబంలో, సమాజంలో అనేక కట్టుబాట్లను, నిబంధనలను, అవమానాలను ఎదుర్కోవాల్సివచ్చింది. భక్తి కవితలు మాత్రమే రాయమని తండ్రి చేసిన ఒత్తిడి, ఇష్టం లేని బలవంతపు పెళ్లి, భర్త ప్రీతం తో బాధాకరమైన సహజీవనం, తన విప్లవాత్మకమైన రచనలపై ఆంక్షలు, ఇవన్నీ కూడా అమృతలో తీవ్రమైన తిరుగుబాటు ఆలోచనలు రేపి కలాన్ని పట్టి, బలంగా రాయిస్తూ, లోపభూయిష్టమైన వ్యవస్థను ప్రశ్నించడానికి పురిగొల్పింది. ఒకవిధంగా తన రచనలనే ప్రశ్నించే ఆయుధాలుగా మల్చుకుంది అమృత. స్త్రీ పాత్రలను కేవలం సహనంతో, ప్రేమను పంచేవారిగా లేదా వారి దేహాలను పురుషుల ఆస్తిగా మాత్రమే చిత్రీకరించే పురుష రచయితలు ఉలిక్కిపడి సిగ్గుపడే విధంగా అమృత తన రచనల్లో స్త్రీల పాత్రలను వాళ్ళ సమస్త భావోద్వేగాలతో, దైహిక పరమైన కోరికలు, వియోగం, మోహం, ప్రేమ లతో పాటు, పురుషాధిపత్య సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్త సమస్యలు కన్నీళ్లు, బాధలు, సవాళ్లు, అవమానాలు, దౌర్జన్యాలు ధైర్యంగా, ఆత్మగౌరవం, ఆత్మవిస్వాసంతో ఎదుర్కొనే వ్యక్తిత్వాలున్న శక్తివంతమైన వ్యక్తులుగా, ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న స్వతంత్ర వ్యక్తులుగా, తమ జీవితం మీద తమకే అధికారం ఉన్న, అస్మితతో ఉన్న స్త్రీ పాత్రలను చిత్రీకరిస్తుంది. ఒక విధంగా, స్త్రీలను పురుష సాహిత్యకారులు పాత సంప్రదాయ బద్దమైన నమూనాల్లో బేలలుగా, బలహీనులుగా, శృంగారవస్తువులుగా తమ సాహిత్యంలో చూపించిన దానికి విరుద్ధంగా వాస్తవ జీవితంలో స్త్రీలు పురుషుల ఆధిపత్యం వలన, ఎంత అణిచివేతలతో కూడిన సంఘర్షణాత్మకమైన జీవితాలను గడుపుతున్నారో, ఎత్తి చూపిస్తూ, కొత్తగా ఆవిష్కరిస్తుంది. ఇవన్నీ కూడా సాహిత్య రంగాన్ని శాసిస్తున్న అప్పటి పురుష రచయితలు రాయలేదు. సమాజంలో భిన్న వర్గాలకు, కులాలకు చెందిన స్త్రీల సంఘర్షణలను తమ రచనల్లో దాదాపు చిత్రించలేదు. సమాజంలో, కుటుంబంలో, యుద్ధాల్లో, చరిత్ర గమనంలో ముఖ్య పాత్రలను పోషించిన, ప్రాణ త్యాగాలను చేసిన స్త్రీల జీవితాలు వీరికి పెద్దగా ఆనలేదు. ఈ లింగ వివక్ష అన్ని రంగాల్లో ఉన్నది. అమృత స్వయానా తన జీవితంలో ఈ వివక్షను అటు కుటుంబంలో పుట్టినింట్లో బాల్య, యవ్వన దశల్లో,ఇటు మెట్టినింట్లో భర్త, అత్త, ఆడబిడ్డలతో అనుభవించింది. స్త్రీల పైన పురుషులకు పెత్తనం ఇచ్చిన ములాల్ని లోపభూయిష్టమైన పితృస్వామ్య వ్యవస్థలో కనుక్కుంది. అదే పురుషాధిపత్యాన్ని సాహితీ రంగంలో కూడా అనుభవించింది, ప్రశ్నించింది. తన చుట్టూ సమాజంలో స్త్రీలు పడుతున్న అణిచివేత, వివక్షలను కుడా గమనించింది. వారికోసం తన కలానికి పదునుపెట్టింది.

అమృత కథల్లో స్త్రీ పాత్రల చిత్రీకరణ

19వ శతాబ్దంలో ఇంగ్లీషులో రాస్తున్న భారత దేశ రచయిత్రులు సాహిత్యానికి ఒక కొత్త కోణాన్ని ఇచ్చారు. దాదాపు 19వ శతాబ్దం నుంచే భారత దేశంలో రచయిత్రులు విస్తృతంగా రాయడం మొదలు పెట్టారు. అయితే ఎక్కువగా ప్రేమ, పెళ్లి, కుటుంబ జీవితం, అన్యోన్య దాంపత్యం, భర్త ఆనందాలు, పిల్లలు, సంస్కృతీ, సాంప్రదాయాలు, ఆచారాలులాంటి సాంప్రదాయబద్దమైన కథా వస్తువులనే తీసుకొని రాసేవారు. కానీ తరువాత ఫెమినిజం సాహిత్యంలో ప్రవేశించాక దాన్ని ఒక దివీటిలాగా అందిపుచ్చుకుని, ఆ వెలుగులో, స్త్రీల సమస్యలను స్త్రీవాద దృష్టికోణం నుంచి రాయడం మొదలుపెట్టారు. ఎప్పుడూ తమ జీవితాలను కుటుంబం కోసం త్యాగం చేసే పాత సాంప్రదాయ స్త్రీ పాత్రలు అన్నీ, 19వ శతాబ్దపు కొత్త రచయిత్రుల సాహిత్య సృజనాత్మక ప్రపంచంలో గొప్ప సాధికారత, ,ఆర్ధిక స్వతంత్రత, స్వయం నిర్ణయాధికారం ఉండే స్త్రీలుగా మారిపోయాయి. అమృతా ప్రీతం కూడా ఈ నూతన ప్రగతిశీల, స్త్రీవాద సిద్ధాంతం ఇచ్చిన సాహిత్యపు వెలుగు దివీటిని పట్టుకొని తన స్త్రీ పాత్రలను గొప్ప అస్మితతో ప్రగతిశీలంగా మలిచింది. ఈ కథలు భారత దేశపు ఫ్యూడల్ సమాజంలో కుల, మత పరమైన, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన కట్టుబాట్లను, మూఢనమ్మకాలను తెంచుకుని స్వేచ్చా, హక్కుల కోసం ఘర్షణ పడుతున్న స్త్రీల ప్రతిఘటనని, ఆత్మగౌరవాన్ని, స్త్రీల అస్తిత్వ పోరాటాలని తెలుపుతాయి అమృత కథల్లో స్త్రీపాత్రలు. అట్లాగే క్రూరమైన ఫ్యూడల్ కుటుంబాలలోని అమానవీయమైన డిమాండ్లకు ప్రాణత్యాగాలు చేయడం లాంటి దుర్మార్గాన్ని కూడా తన కథల్లో చూపిస్తుంది అమృత.

Stench of Kerosene — దుర్గంధం -బూ కథలో కుటుంబంలో స్త్రీకి గుర్తింపు ఆమె కుటుంబ అవసరాలైన భర్త కోరికలు, సేవ, వారసుల్ని కనీ పెంచడం లాంటివి తీర్చేంతవరకు మాత్రమే ఉంటాయని, ఇవి నెరవేర్చలేని స్త్రీ విలువ, గౌరవం లేని, తిరస్కరించే మనిషిగా చూడబడుతుందని చెపుతూనే వివాహ వ్యవస్థలోని క్రూరత్వాన్ని, సమాజంలో తక్కువగా చూడబడే స్త్రీ స్థానాన్ని ఎత్తి చూపిస్తుంది. స్త్రీల జీవితాల్ని ఉత్పత్తి, పునరుత్పత్తి అనే అంశాలు ఎట్లా శాసిస్తాయో చర్చిస్తుంది. కథలో గులేరిని ప్రేమించి పెళ్లిచేస్కున్న మానెక్, పెళ్లి తర్వాత ఆమెకి పిల్లలు పుట్టరు అని తెలిసాక కూడా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ మానెక్ తల్లి దీనికి ఒప్పుకోదు. వారసుడ్ని కనాల్సిందే అని కొడుకుని బలవంతం చేస్తూ, కోడల్ని వేధిస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య మానెక్ నలిగి పోయినా సమాజం, తల్లి, భార్య మధ్యలో ఘర్షణ పడుతూ చివరికి తల్లి చేసే రెండవ వివాహానికి వప్పుకుంటాడు. అది తెలిసిన గులేరి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. మానేక్ కి రెండవ వివాహం జరిగి కొడుకు పుడతాడు. కొడుకుని చూడ్డానికి వెళ్లిన మానెక్ కొడుకుని చేతుల్లోకి తీసుకొంటాడు కానీ మానెక్ కి అక్కడంతా పురిటి వాసన కాకుండా కిరోసిన్ వాసన తగిలి, తన మొదటి భార్య కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేస్కోవడం గుర్తుకు వచ్చి వ్యాకుల పడతాడు. సంతానాన్నివ్వలేని గులేరిని చంపిన కిరోసిన్, దాని వాసనని ఒక మెటఫోర్ గా వాడుతుంది రచయత్రి. స్త్రీలని పునరుత్పత్తి యంత్రాలుగా మాత్రమే చూస్తూ, వారసుల్ని ఇవ్వలేని స్త్రీలని వ్యర్థులుగా చూపిస్తూ, ఆత్మహత్యల వైపు తరిమే పితృస్వామ్య వ్యవస్థకి కిరోసిన్ వాసన ఒక ప్రతీక. పితృస్వామ్యాన్ని అమలుచేసే అత్తని కూడా ఆమె స్త్రీ అయినప్పటికీ మరో స్త్రీకి శత్రువుగా ఎలా మారుస్తుందో చూపిస్తుంది రచయిత్రి. భర్త మానెక్, అత్త ఇద్దరూ కుటుంబ వ్యవస్థలో స్త్రీ స్థానాన్ని, జీవితాన్ని, చావు, పుట్టుకలను, ఫ్యూడల్ సమాజ నియమాలకు అనుకూలంగా ఎలా నిర్దేశిస్తారో ఈ కథలో ప్రతీతాత్మకంగా చెబుతుంది రచయిత్రి.

’ఐదుగురు అక్క చెల్లెళ్లు’ కథలో ఐదుగురు స్త్రీల భిన్నమైన, బాధాకరమైన అనుభవాలను ప్రయోగాత్మకంగా రాస్తుంది అమృత. ఈ ఐదుగురిలో తన పాత్ర కూడా ఉంటుంది. ఈ కథ అంతా ప్రతీకాత్మక శైలిలో రాసింది. ఈ కథలో, ప్రకృతిలో ఉండే గాలి ఒక పాత్రగా, మనిషి జీవితం ఒక పాత్రగా ఉంటాయి. ఇందులో, స్త్రీల సమస్యలను తెలుసుకోవడం లేదా నూతన, చైతన్యవంతమైన స్త్రీలను ఆ బాధల్లోంచి కొత్తగా సృష్టించడం ఉంటుంది. 20వ శతాబ్దానికి చెందిన అయిదుగురు స్త్రీలను గాలి, జీవితం రెండూ వాళ్ళ ఇంటికి వెళ్లి కలుసుకుంటాయి. అందులో మొదటి స్త్రీ ఊపిరి ఆడని నాలుగు గోడల మధ్య బందీగా ఉండడం చూస్తారు. మిగతా నలుగురు స్త్రీలు కూడా నాలుగు గోడల మధ్య బంధించబడి ఉంటారు. రెండవ స్త్రీ బీదరికపు కష్టాలు భరించీ, భరించీ అతి దీనంగా ఉంటుంది. మూడవ స్త్రీ దేహం ఒక శిల వలే ఉంటుంది. ఆ దేహంలో హృదయం స్పందించని రాయిలా ఉంటుంది. ఎందుకంటే, ఆమె దుఃఖపూరితమైన వివాహ జీవితం చేసిన ఆపరేషన్ వలన ఆమె గుండె రాతివలె కఠినంగా మారి పోయింది. ఇక్కడ ‘ఆపరేషన్’ లేదా ’శస్త్ర చికిత్స’ పద ప్రయోగం స్త్రీలు వివాహం తరువాత కుటుంబంలో అణిచివేత, ఆధిపత్యం, హింసల వలన మానసికంగా ఒక కబ్జాకి గురి అయ్యి, తమ స్వంత అస్తిత్వాన్ని ఎలా కోల్పోతారో అన్న విషయం చెప్పడానికి ఒక metaphor లాగా రచయిత్రి వాడింది.

నాలుగవ స్త్రీ దారుణంగా ఏడుస్తూ, దేశవిభజన సమయంలో తన మీద అత్యంత పాశవికంగా లైంగిక అత్యాచారం జరిగిందని అప్పటినించి తనకు జీవితం మీద, మనుషుల మీద నమ్మకం పోయిందని చెబుతుంది. చివరిగా ఆ అయిదుగురు అక్కచెల్లెళ్లలో ఆఖరి అమ్మాయి, ఒక గాయకురాలు, రచయిత్రి అని ఆ చీకటి గదిని దర్శించిన ‘జీవితం’ అనే పాత్ర తెలుసుకొంటుంది. ఆమె అప్పటికే చాల గొప్ప సృజనాత్మకత ఉన్న రచయిత్రిగా పేరు తెచ్చుకుంటున్నప్పటికీ, సాహిత్య రంగంలో, కుటుంబంలో లింగవివక్షను ఎదుర్కొంటున్నట్లు తెలుసుకుంటుంది. ఈ కథ చదువుతున్న పాఠకులకి ఆ అయిదవ పాత్ర గాయని, రచయత్రి మరెవరో కాదు అమృత అని అర్థం అవుతుంది. అమృత స్వయంగా పెళ్ళికి ముందు తండ్రి వల్ల, పెళ్లి తరువాత భర్త వల్ల, సాహిత్య ప్రపంచంలో పురుష రచయితల వల్ల చాలా తీవ్రమైన లైంగిక వివక్షని, అణిచివేతని ఎదుర్కొంది.

“జంగ్లీబుటి” (weed) కథలో, స్త్రీ ల లైంగికత మీద, ప్రేమ, ప్రణయానుభూతుల వ్యక్తీకరణల, అనుభవాల మీద వివాహ వ్యవస్థ ఎలాంటి కంట్రోల్ చేస్తుందో (మేజిక్ రియలిజం) మాంత్రిక వాస్తవికతా పద్ధతిలో చెప్తుంది రచయిత్రి. అంగూరి అమాయకమైన గ్రామీణ యువతి. చాలా కఠినమైన పల్లెటూరి కట్టుబాట్ల మధ్య పెరుగుతుంది అంగూరి. మగ పిల్లలు ఇచ్చే మిఠాయి, తాంబూలంలో జంగ్లీబుటి అంటే ఒక రకమైన అడవి వేరు ఉంటుందని, ఆ వేరు తినగానే ఆడ పిల్లలు ఆ మగ మనిషి ప్రేమలో పడతారని, వెర్రెక్కినట్లు విరహ గీతాలు పాడుతూ తిరుగుతారని, కాబట్టి అలాగ వాళ్ళ నించి ఏ తినుబండారాలు స్వీకరించవద్దని కట్టుకథతో ఊరి పెద్దలు తమ ఇంటి ఆడపిల్లల్ని, భార్యల్ని పురుషుల ప్రేమలో పడకుండా అదుపులో పెడుతుంటారు. వారికి ఈ కథ వారసత్వంగా వస్తుంది. అంగూరి కూడా దీన్ని బలంగా నమ్ముతుంది. అంతే కాదు, ఆడవాళ్లు చదువుకుంటే పాపం చుట్టుకుంటుందని కూడా బలంగా నమ్ముతూ, ఆడపిల్లల్ని చదువుకు దూరం చేసే మూఢ సంప్రదాయం ఆ ఊరిలో ఉంటుంది. పట్నంలో ఒక ఇంట్లో పనిచేసే పరబతి అనే ఆయనకి రెండవ భార్య అంగూరి. పరబతి మొదటి భార్య శవం కాలుతుండగానే, కన్నీళ్లతో కాకుండా, చమట నీళ్ళతో తడిసిన పరబతి కండువా మీద తన కొత్త కండువా వేసి, ‘నీకు నా బిడ్డ అంగురిని భార్యగా ఇస్తున్నాను’ అంటాడు అంగురి తండ్రి. ఇందులో చిన్నారి అంగురి ఇష్టాఅయిష్టాలతో సంబంధమే లేదు. ఆమె ఒక పురుషుడికి ఇవ్వబడే ఒక వస్తువు అంతే.

పెళ్లి అయిన అయిదు ఏళ్ల తర్వాత అంగూరి తన కంటే వయసులో చాలా పెద్దవాడైన, చూడ్డానికి కూడా బాగోని పరబతి దగ్గరికి కాపురానికి వస్తుంది. ఈ ఐదు ఏళ్ళు అంగూరిని పుట్టింటి చాకిరీకి వాడుకుంటారు తల్లిదండ్రులు. పరబతి యజమాని ఇంట్లోనే తింటుంటాడు కానీ అంగురి తన ఒక్కతికే వంట చేసుకుంటుంటుంది. యజమాని ఇద్దరికి భోజనం పెట్టటానికి ఒప్పుకోదు. పరబతి యజమాని ఇంటి పక్కనే ఉన్న కథా వ్యాఖ్యాత బీబీతో అంగురికి పరిచయం అవుతుంది. ఆమెతో ఎన్నో కబుర్లు తన ఊరి గురించి, ఆచారాలను గురించి చెబుతుంది. ఆడపిల్లకు చాలా చిన్న వయసులోనే అంటే ఆరు, ఏడేళ్ల వయసులోనే వరుణ్ణి నిర్ణయిస్తారు. వరుని ఎన్నిక అమ్మాయే చేసుకోని, అతని పాదాల మీద పూలు చల్లి, చెప్పి రావాలి అంటుంది అంగూరి. బీబీ ఆశ్చర్యపోతూ ‘ఆరేళ్ళ పాపాయికి వరుని ఎన్నిక ఎలా తెలుస్తుంది?’ అని అడుగుతుంది. “తెలియదు. అందుకే నాన్నలే వరుణ్ణి నిర్ణయించి, అమ్మాయి బదులు వాళ్ళే అల్లుడి పాదాల మీద పువ్వులు చల్లి వస్తారు ఇది మా కుటుంబ సాంప్రదాయం” అంటుంది అంగూరి. ఇక్కడ భర్త ఇంట్లో ముందు పుట్టింటిలో లాగా ముఖానికి ముసుగు వేస్కోని, ఘల్లు ఘల్లు మని శబ్దం చేసే కాళ్ళగజ్జెలతో, వంటినిండా నగలతో మెల్లిగా, భయంగా, తిరిగే అంగూరి, మెల్లగా ముసుగు తీసేసి స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. పుట్టింటిలో దొరకని స్వేచ్ఛని అనుభవిస్తుంటుంది. రోజూ ఉదయం పూట ఇంటి బయట నులివెచ్చటి నీరెండలో పొయ్యి మీద చాయ్ చేస్తూ ఉంటుంది అంగూరి. ఆమె భర్త పరబతి, అక్కడ రాత్రి చౌకీదారుగా పని చేసే రామ్ తారా ముగ్గురూ కలిసి చాయ్ తాగుతుంటారు. రామ్ తారా మంచి స్ఫురదృపంతో ఉన్న అందమైన యువకుడు.

కథా వ్యాఖ్యాత బీబీ తో స్నేహం చేసిన అంగురి మెల్లిగా ఆమెని తనకి చదువు చెప్పమని అడుగుతుంది “చదువుకుంటే పాపం అని చెప్పావుగా మరి నువ్వే” అని వ్యాఖ్యాత ఆశ్చర్యపోతుంది. ఈ విషయం తమ ఊరిలో బలంగా నమ్ముతారనీ, అదే సమయంలో జంగ్లీ బూటీ తింటే కూడా ఆడవాళ్లు మగవాళ్ల ప్రేమలో పడతారన్న నమ్మకం గురించి కూడా అంగూరే వ్యాఖ్యాత బీబీ కి చెప్తుంది. కాలం మెల్లిగా గడుస్తుంటుంది. ఒక రోజు అంగురి చెట్టు కింద కూర్చొని పాటలు పాడుతుంటుంది. వ్యాఖ్యాత బీబీ ఆశ్చర్య పోతుంది. జాగ్రత్తగా వింటే అవి తనకి దూరమైన ప్రియుడి కోసం ప్రియురాలు పాడే ప్రేమా, విరహానికి సంబంధించిన పాటలు అని గమనిస్తుంది. “ఏమైంది అంగురి పాటలు, అవీ విరహ గీతాలు పాడుతున్నావు” అని అడుగుతుతుంది.  అప్పటికి రామ్ తారా ఊరెల్లి మూడు రోజులు అవుతుంది. అప్పటినుంచీ అంగూరి ఉదాసీనంగా, పరధ్యానంగా మారడం గమనిస్తుంటుంది బీబీ. ‘కొంప దీసి జంగ్లీ బూటీ తిన్నావా’? అని లాలనగా నవ్వుతూ అంగూరిని నవ్వించడానికి, తేలిక పరచడానికి అడుగుతుంది. ‘లేదు, లేదు బీబీ, మిఠాయి కాని, తాంబూలం కానీ తీసుకోలేదు, అతను ఇచ్చిన చాయ్ మాత్రమే తాగాను’ అంటుంది అమాయకంగా. అంగురి చెంపల వెంట ధారగా కారే కన్నీళ్లతో మెల్లిగా దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో, పాడుతూనే ఉంటుంది తను ప్రేమించిన రామ్ తారా కోసం. ఈ కథలో అమృత స్త్రీల ప్రేమించే హక్కుని, లైంగిక కోరికలను వ్యక్తం చేసే హక్కుని పితృస్వామ్య వ్యవస్థ ఎంత కుట్రపూరితంగా నియంత్రిస్తుందో అత్యంత ఆర్తితో, బాధతో చర్చకు పెట్టింది. వాటితో పాటు స్త్రీలని నియంత్రించడానికి మూఢనమ్మకాలను ఎలా ప్రయోగిస్తారో అన్న అంశం మీద కూడా చర్చిస్తుంది. ముసలి భర్త మీద ప్రేమ ఆకర్షణ ఏమాత్రమూ కలగని అంగురి అందగాడు, తన ఈడు వాడే అయిన రామ్ తారా మీద కలిగిన ప్రేమని చంపుకోలేక ఎలా హింస అనుభవిస్తుందో చాలా ఆర్ద్రంగా రాసారు అమృత.

“పింజర్” నవల- ఆధునిక భారతదేశ సాహిత్య చరిత్రలోనే స్వాతంత్రానంతర, దేశవిభాజానంతరం చెలరేగిన మానవ హననం మీద నవల రాసిన మొదటి భారత దేశ రచయిత్రి అమృతా ప్రీతం

అమృత రాసిన చాల నవలల్లో ఆమెకి అత్యంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నవలల్లో “పింజర్” ప్రధానమైనది. అట్లాగే “నేను వారిష్ షా ని అడుగుతున్నాను”అనే కవిత కూడా. ఈ రెంటి నేపథ్యం, అవి రాసిన సామాజిక, చారిత్రిక సందర్భం చూస్తే, 1947 ముందరి జాతీయోద్యమ కాలం 1947 తర్వాతి  దేశవిభజన. దీని తరువాత  భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో చెలరేగిన మత కల్లోలాలలో, పెచ్చరిల్లిన హింస, హత్యలు, పొంగి పొర్లిన మానవ రక్తపుటేరులు, ముఖ్యంగా, లక్షలాదిమంది స్త్రీల మీద, చిన్న వయసు ఆడపిల్లల మీద అత్యంత పాశవికంగా జరిగిన లైంగిక అత్యాచారాలు, మరణాలు, వారు మోసిన నిర్బంధ గర్భాలు, వలసలు, ఆకలి, కిడ్నాపులు, స్త్రీలు వ్యభిచార కూపాల్లోకి నెట్టబడి మగ్గిపోవడం, మనుషులు చూస్తూ చూస్తుండగానే అత్యంత హీనమైన, దుర్భరమైన స్థితుల్లోకి నెట్టబడడం, ధ్వంసమైన మానవ విలువలు, మొత్తం మానవ సమాజం అవమానంతో సిగ్గుతో చితికిపోయిన సందర్భం. ఎంతోమంది అమ్మల్ని, అక్కచెల్లెళ్ళని, కూతుర్లని, భార్యల్ని కోల్పోయిన సందర్భం. దాదాపు 33,000–50,000 ల మంది హిందూ, సిక్కు స్త్రీలు, 21,000–30,000 ల వరకు ముస్లిం స్త్రీలు ఎత్తుకుపోబడ్డారు. అంటే కిడ్నాపులకు గురి అయ్యారు. ఈ దశలో స్త్రీలు సమస్తము, తమ కుటుంబాన్ని, పిల్లలను, భర్తలను, అమ్మలు తమ గౌరవాన్ని, అస్తిత్వాన్ని ,దేశాన్ని కోల్పోయారు. లైంగిక అత్యాచారాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి చాలా మంది స్త్రీలు బావుల్లో దుంకి ప్రాణ త్యాగాలు చేసారు. అమృత తను కూడా ఈ హింసాత్మక కాలపు పీడితురాలు. శరణార్థిగానే కాక, సాక్షిగా కూడా ఉండింది విపరీతంగా చలించి పోయింది, దుఃఖ పడింది. భారతదేశంలో దేశ విభజన అనేది ఒక భయానక ఘట్టం.  కారణాలు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల విభజించి పాలించే రాజకీయ కుట్ర, మతవిద్వేషాలు, భారత్, పాకిస్తాన్ రాజకీయ నాయకుల, వ్యక్తిగత, ఆర్ధిక ప్రయోజనాలు, ఇలా ఏమైతేనేమి, భయానకమైన హింసోన్మాదానికి తప్పించుకోలేని, లక్షలాది స్త్రీలు, పిల్లలు, ముసలివాళ్ళు, బలి అయిపోయారు, ఎన్నో వేలమంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. అప్పటి సామాజిక, చారిత్రిక సందర్భాన్ని అంటే తన సమకాలీన చారిత్రిక సందర్భాలను, మార్పులను అమృత ఎంతో సామాజిక బాధ్యతతో నవలీకరించింది. ఈ దేశవిభజన అనంతరం జరిగిన భయంకరమైన హింసని, వేదనని అంతా అమృత పింజర్ అనే నవలలో ఎంతో వాస్తవికంగా చిత్రీకరించింది.

1947 తర్వాత వచ్చిన దేశవిభజన సాహిత్యం –రచయితలు

ఆధునిక భారత దేశ చరిత్రలో 1947 లో భారత దేశం మత ప్రాతిపదికన రెండు దేశాలైన భారత్, పాకిస్థాన్ గా విడిపోయింది. ఇది ఒక హింసాత్మక మైన వలసలకు, విస్తాపనకి దారి తీసింది. చాలామంది ముస్లిమ్స్ పాకిస్థాన్ కి తరలి పోతే, సిక్కులు, హిందువులు భారత దేశంలో ఉండిపోయారు. కానీ అత్యంత విషాదం ఏంటంటే ఈ వలసలు ఎవరూ ఊహించని విధంగ, హింసలు, హత్యలు, లైంగిక అత్యాచారాలు, మాటలకందని క్రూరమైన చర్యలకు దారితీసాయి. దాదాపు కోటి మంది శరణార్ధులైన ప్రజలు వందల మైళ్ళు, కాలినడకన మానవ గొలుసులు నిర్మించుకొని, ఆకలి, దాహంతో, బ్రతుకు భయాలతో, సందేహాలతో, ఆందోళనతో దేశ సరిహద్దుల వెంబడి నడిచారు. మధ్య మధ్యలో అత్యాచారాలకు, హత్యలకు గురి అవుతూ మనుషులు మాయం అవుతూ, అత్యంత విషాదకరమైన, బాధాకరమైన జీవన ప్రయాణాన్ని చేశారు. ఈ అపనమ్మకం, అవిశ్వాసం, అనుమానం ఇప్పటికీ భారత, పాకిస్థాన్ దేశాల మధ్య వైర స్వభావంతో కొనసాగుతూనే ఉంది. చరిత్రలో ఎక్కడైనా జరిగే యుధాల్లో అత్యాచారాలకు, బలి అయ్యేది ప్రాణ త్యాగాలు చేసేది ఎక్కువ శాతం స్త్రీలే. అందుకే అమృత దేశవిభజన సమయంలో స్త్రీ కేంద్రంగా జరిగిన హింసను, దాని మూలంగా వాళ్ళ జీవితాల్లో వచ్చిన పెను మార్పులను పింజర్ నవలలో రాయదల్చుకున్నది. పింజర్ అంటే అస్థిపంజరం.

జాతీయోద్యమకాలంలో, దేశవిభజనాంతర రాజకీయ పరిణామాలని, మతకల్లోలాలని అమృతతో పాటు ఎంతోమంది రచయితలు సాహిత్యంలో హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ భాషల్లో రాశారు. వాటిలో ముఖ్యమైనవి- ఖూన్ దే షోలే (నానక్ సింగ్, 1948) పింజర్ (అమృతా ప్రీతం, 1950) డార్క్ డాన్సర్ (బాలచంద్ర రాజన్, 1955), ట్రైన్ టు పాకిస్థాన్ (కుశ్వంత్ సింగ్, 1956), సన్ లైట్ ఆన్ ఎ బ్రోకెన్ కాలమ్ (అత్తియాహుస్సేన్, 1961), టూటావాలా కూహ్ (సోహన్ సింగ్ శీతల్, 1962), బెండ్ ఇన్ ది గంగాస్ (మనోహర్ మాలగొంకర్, 1964), ఆధా గావ్ (రాహీ మాసుం రాజా, 1966), తమస్ (బీషం సహాని, 1974), మిడ్ నైట్స్ చిల్డ్రన్ (సల్మాన్ రష్దీ, 1980), ఐస్ క్యాండీ మాన్ (బాప్సి సిధ్వాన్స్, 1988) ,షార్ట్ స్టోరీస్ ఆఫ్ సాదత్ (హసన్ మంటో), పోయెమ్స్ ఆఫ్ ఫైజ్ అహ్మద్ ఫైజ్, స్టోరీస్ ఆఫ్ ఇస్మత్ చుగతాయి.

అమృత ‘పింజర్’ నవల దేశ విభజన సమయంలో తాము పుట్టి పెరిగిన తావుల నుంచి విస్తాపన చెందిన దేశప్రజలు ముఖ్యంగా స్త్రీలు ఎదుర్కొన్న శారీరిక, మానసిక హింసలని చిత్రిస్తుంది యుద్ధాల్లో, దోపిడీల్లో స్త్రీల మీద జరిగే లైంగిక అత్యాచారాలకు కులం, మతం, ప్రాంతం ఏవీ అడ్డు కాదని చెప్తుంది. ఈ నవలలో పురో అనే హిందూ మతానికి చెందిన పంజాబీ అమ్మాయి, పితృస్వామిక ద్వంద్వ స్వభావానికి, కపటత్వానికి అదే సమయంలో, సరిహద్దుల్లో జాతీయవాదం పేరిట జరుగుతున్న హింసకు ఒక ముస్లిం యువకుడి చేతిలో కిడ్నాప్ అయి బాధితురాలిగా మారాక, తల్లిదండ్రులు తిరస్కరిచడం వలన ఎలా రాజీ పడి పరిస్థితులకు లొంగిపోవలసి వస్తుందో, దేశ విభజన జరిగాక కూడా తన మాతృభూమి అయిన భారత దేశానికి రాకుండా ఒక మతాంతీకరణ చెందిన ముస్లిం స్త్రీగా ఆమె తనని కిడ్నాప్ చేసిన ముస్లిం యువకుడి భార్యగా పాకిస్థాన్ లోనే ఉండిపోయే నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఏ రకమైన నాటకీయత లేకుండా రాస్తుంది రచయిత్రి. ఈ నవలను ‘పింజర్’ పేరుతోనే డాక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది 2003 లో చలన చిత్రంగా తీశారు. దీనికి జాతీయ సమగ్రత కింద జాతీయ అవార్డు వచ్చింది. ఈ నవలని కుశవంత్ సింగ్ ‘ది స్కెలిటన్’ గా ఇంగ్లీషులో అనువదించారు. డెనిస్ మాట్రింగ్, ఫ్రెంచి భాషలోకి అనువదించారు.  

‘పింజర్’ నవలా కాలం 1946. అంటే దేశవిభజనకి ముందు కథ మొదలవుతుంది. కథానాయిక హిందూ పంజాబీ అమ్మాయి పురో, ఇతర పంజాబీ అమ్మాయిలైన లాజో, రజో, తారో అంటే స్త్రీల వైపునుంచి ప్రధానంగా నడుస్తుంది. 1946 నుంచీ 1948 వరకు దేశవిభజన తరువాత పురో జీవితం లో చోటు చేసుకున్న మార్పులు, భూమి తగాదాల్లో, పంచాయతీల్లో పగ ప్రతీకారాలను స్త్రీల మీద లైంగిక అత్యాచారాలు, కిడ్నాపులు చేసి తీర్చుకోవడంగా, అవతల వారికి బుద్ధి చెప్పడంగా చరిత్రలో ఎప్పటినించో ఉంది. నవల అంతా పంజాబ్ లోని, అమృతసర్ లో, చట్టావాల అనే ఊరిలో, పాకిస్థాన్, భారత్ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతుంది. పింజర్ నవలలో రషీద్ కుటుంబం అప్పు తీర్చలేదని తమ కుటుంబంలో స్త్రీని ఎత్తుకెళ్లిపోయి చెరుస్తుంది పురో కుటుంబం. దానికి ప్రతీకారంగా రషీద్ కుటుంబం అతనిపై అప్పటికే రాంచంద్ తో పెళ్లి కుదిరిన పురోని ఎత్తుకు రమ్మని వత్తిడి చేస్తుంది. రషీద్ ఆమెని ప్రేమిస్తాడు కానీ కుటుంబం వత్తిడికి లొంగి పురోని కిడ్నాప్ చేస్తాడు. పురో తప్పించుకొని పుట్టింటికి వెడితే ”ఒక ముస్లిం దగ్గర పది రోజులు ఉన్న నీకు ఇప్పుడు ఒక మతం లేదు, పుట్టుక హక్కు లేదు ఇక్కడ్నించి వెళ్లిపో” అని తల్లిదండ్రులు ఆమెని కుటుంబ గౌరవం కోసం తిరస్కరిస్తారు. పురో వాళ్లకి చచ్చిన మనిషితో సమానం. చెల్లి తప్పిపోయిందన్న విషయాన్ని పురో అన్న త్రిలోక్ పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నా కుటుంబం అంగీకరించదు. పొలాల్లోకి వెళ్ళిపోయి బావిలో దుంకి చనిపోయే ప్రయత్నంలో ఉన్న పురోని రషీద్ పెళ్లి చేస్కుంటానంటాడు. పురో రాజీ పడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆమె పేరు హామీదాగా మారుతుంది. గర్భం వచ్చిన తర్వాత రషీద్ తో పాటు, అతని కుటుంబ సభ్యులు సంతోష పడుతుంటే, పురో మాత్రం రషీద్ తనని రేప్ చేయడంవల్ల వచ్చిన గర్భాన్ని అంగీకరించలేక అవమానంతో కృంగిపోతుంది. అయితే ఆ గర్భం నిలువదు. హిందూ మతానికి చెందిన ఒక పిచ్చి తల్లి పాపని ప్రసవించి చనిపోతే ఆ పాపని పురో, రషీద్ లు రక్షించి పెంచుకోవాలనే ప్రయత్నాన్ని స్థానిక హిందువులు అడ్డుకొని పాపని తీసుకెళ్లినా ఎవరూ పెంచుకోడానికి సిద్ధం కాని సమయంలో ఆ పాపని పురోనే దగ్గరికి తీస్తుంది.

రాషీద్ తో ఉంటున్నా కానీ మనసులో తనకు నిశ్చితార్థం జరిగిన రాంచంద్ ని మరవదు పురో. ఈ విషయం రాషీద్ గమనిస్తాడు. రామచంద్ చెల్లెలు లాజోని త్రిలోక్ పెళ్లి చేసుకుంటాడు. పురో మీద ప్రేమ చావని రాంచంద్, చెల్లెలి మీద మమకారం తగ్గని త్రిలోక్ ఇద్దరూ పురో కోసం వెతుకుతూనే ఉంటారు. పురోకి పుట్టింటి మీద మమత పోదు. “చనిపోయిన వాళ్ళని కూడా సంవత్సరానికి ఒకసారి తలుచుకుంటారు, తనకి ఆ మాత్రం అర్హత లేదా, జరిగిన దాంట్లో తన తప్పు ఏముంది” అని వేదన పడుతుంది. పురో చెల్లెలు పెళ్లి ప్రయత్నాలు జరుగుతాయి. పురో, త్రిలోక్, రాంచంద్ ఒకరికోసం ఒకరు చేసుకునే వెతుకులాటల మధ్య కాలంలోనే, దేశవిభజన ఒక్కసారి హింసాత్మకంగా ప్రజల మీద విరుచుకు పడుతుంది. పంజాబ్ అంతా రక్తం ఏరులై ప్రవహిస్తుంది. పంజాబ్ కాస్త పాకిస్థాన్ దేశంగా మారిపోతుంది. పొరుగువారైన హిందువులు భారత దేశం పౌరులుగా, ముస్లింలు పాకిస్థాన్ దేశవాసులుగా మారిపోతారు. హిందువులు, ముస్లింలు అనివార్యంగా మత ప్రాతిపదికన తమ తమ దేశాలు ఎన్నుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టి వేయబడతారు. పంజాబీ హిందువులైన పురో కుటుంబం భారత దేశంలో ఉండిపోతే, హామీదాగా మారిన పురో పాకిస్థాన్ లో ఉండిపోతుంది. ఇండియన్, పాకిస్థాన్ సైనిక బెట్టాలియన్ల సంరక్షణలో జరిగే ఈ శరణార్ధుల వలసల్లో త్రిలోక్ భార్య, పురో వదిన లాజోని ఒక ముస్లిం ఆందోళనకారుడు ఎత్తుకుపోయి ఉంచుకుంటాడు. ఆమె ఇంటిని కూడా ఆక్రమించుకుంటాడు. ఆమెనే కాదు అనేక మంది స్రీలని, దొంగలు, దోపిడీదార్లు ఎత్తుకుపోయి తమ స్వంత ఆస్తులుగా మార్చుకోవడమో, అత్యాచారాలు చేసిన తరువాత, చంపేసి వదిలించుకోవడమో చేస్తుంటారు. ఇండియాకు పాకిస్థాన్ నుంచి వెళ్తున్న శరణార్ధుల్లో రాంచంద్ ను పురో కలుసుకుంటుంది. గుర్తుపట్టి మమకారంతో దుఃఖిస్తుంది. రాంచంద్ కూడా పురో ని గుర్తుపడతాడు. అతని ద్వారా కిడ్నప్ అయిన అతని చెల్లెలు లాజో గురించి తెలుస్తుంది. భర్త రషీద్ సహాయంతో మారువేషం వేసుకొని లాజోని విడిపించి రామచంద్ కి సరిహద్దుల్లో అప్పచెప్తుంది. అక్కడ అన్న త్రిలోక్ ని చూసి కన్నీళ్లు కారుస్తుంది. రామచంద్ పురోని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. రషీద్ కూడా పశ్చాత్తాపంతో పురోని ఆమె ప్రేమించిన రాంచంద్ దగ్గరికి, అన్న త్రిలోక్ తోటి పుట్టిల్లు అయిన ఇండియాకి వెళ్ళిపొమ్మంటాడు. కానీ ఎంతో ద్వైదీభావానికి లోనైనప్పటికి పురో పాకిస్థాన్ లోనే రషీద్ తో ఉండిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది అందరూ ఆశ్చర్యపోయే విధంగా. సరిహద్దుల్లో రాంచంద్, లాజో, త్రిలోక్ ల కన్నీళ్ల మధ్య మరెందరో శరణార్ధులని మోసుకుంటూ జీపు ఇండియా వైపుకి వెళ్లి పోతుంది.

స్త్రీల పాత్ర చిత్రణే ప్రధాన కేంద్రంగా నడిచిన ఈ నవలలో, పురో జీవితం దేశవిభజనకు ముందు నాశనం అయితే, పురో సమస్యను తేలికగా తీసుకుని భర్త త్రిలోక్ తో వాదించిన లాజో జీవితం దేశవిభజన తరువాత నాశనం అవుతుంది. కానీ పురో తానొక కిడ్నాప్ కి, లైంగిక అత్యాచారానికి గురియైన బాధితురాలిగా లాజోని మానవత్వంతోటి స్పందించి, రక్షిస్తుంది. పురో దేశవిభజన సమయంలో రెండు దేశాల సరిహద్దుల్లో జరిగిన లైంగిక అత్యాచారాలకు బలి అయిన స్త్రీలను చూస్తుంది. కొంతమందికి సహాయం చేస్తుంది. వ్యభిచారిణులుగా మార్చబడి కరడుగట్టిపోయిన తారో లాంటి స్త్రీల దుర్భరమైన జీవితాలను, ఆ ప్రభావం వలన సమాజ ఆంక్షలను లెక్కచేయని నిర్భయత్వాన్ని సంతరించుకున్న వాళ్ళ వ్యక్తిత్వాలను చూస్తూ, అటువంటి మహా సంక్షోభ సమయాల్లో తన కష్టం అతి చిన్నదిగా భావించడమే కాదు, ఇండియాకి వెళ్లిపోయే అవకాశాన్ని రషీద్ ఇచ్చినప్పటికీ, నిస్సహాయ స్థితిలో తనను వెల్లగొట్టిన తల్లిదండ్రుల కంటే తన సంతోషం కోసం రామచంద్ తో, అన్న త్రిలోక్ తో ఇండియా వెళ్ళిపొమ్మన్న రషీద్ హృదయంలో తన పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమను గ్రహించి అతనితో పాకిస్థాన్ లోనే ఉండిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఈ మార్పు అంతా కూడా, మంచి, చెడులు చూడ్డం, విశ్లేషించడం ఇరవై ఏళ్ళు కూడా నిండని ఆమెలో తన చుట్టూ మనుషుల జీవితాల్లో జరుగుతున్న దుర్భరమైన హింసాత్మకమైన సంఘటనలను చూడ్డం ద్వారా వస్తుంది. చివరలో తనని పుట్టింటికి రా చెల్లీ అని ఆహ్వానించిన అన్న త్రిలోక్ తో తాను ఇక రాలేను అనీ, తన జీవితం తిరిగి సరి చేసుకోలేనంతగా ధ్వంసం అయి, మారిపోయిందని, కాకపోతే తనలాగ ఎత్తుకుపోబడి, గాయపడి పుట్టింటికి ఎన్నో ఆశలతో ఏ ఆడపిల్ల అయినా తిరిగి వస్తే తనను చీదరించుకొని వెల్లగొట్టినట్లు వెల్లగొట్టద్దని, ఆదరించమని పురో తన అన్నకు చెప్పడం పాఠకుల్లో కంట తడిపెట్టిస్తుంది. కరుడు గట్టిన పితృస్వామ్య వ్యవస్థ కుటుంబంలో, సమాజంలో స్త్రీల జీవితాల్ని ఏ విధంగా నడిబజారులోకి విసిరేస్తుందో పురో పాత్ర ద్వారా రచయిత్రి చెప్తుంది. నవల అంతాకూడా దేశవిభజన సమయంలో పురో, లాజో, తారో ఇంకా అనేకమంది గాయపడ్డ స్త్రీలచుట్టూ తిరుగుతుంది.

అందరి గాయాలకు, కన్నీళ్లకు మూలం పితృస్వామ్యంతో పాటుగా, దేశవిభజన చుట్టూ జాతీయవాద ముసుగులో ఉన్న పాలకవర్గ స్వార్థ రాజకీయమే. తనను రేప్ చేసిన వ్యక్తితోనే జీవించాలని పురో తీసుకున్న నిర్ణయం మనకి మింగుడు పడదు కానీ ప్రేమేలేని పుట్టింటి కసాయితనం కన్నా, హృదయంతో ప్రేమిస్తున్న రశీద్ దగ్గరే తనకి గౌరవం ఉందనుకుందేమో పురో అనిపిస్తుంది. ఇప్పటికైనా పురో పుట్టింటికి వెళితే తల్లిదండ్రులు అంగీకరిస్తారా, రాంచంద్ తనని పెళ్లాడడానికి ఒప్పుకున్నా ఆయన తల్లితండ్రులు ఒప్పుకుంటారా అలా కాని పక్షంలో మళ్లీ తన పరిస్థితి ఏమిటి అని చాల లోతుగా పురో ఆలోచించిందా తెలియదు. రచయిత్రి పాఠకులకే ఈ ఆలోచనని వదిలేస్తుంది. ఈ రకంగా నవల అంతా కూడా ఒక భయంకరమైన హత్యాకాండ జరిగేటప్పుడు, జరిగాక దారుణంగా గాయపడ్డాక అనుభవించిన ఆ మానసిక వత్తిళ్లను, శారీరిక గాయాలను ఎదుర్కొన్న స్త్రీల అనుభవాలను, దుఃఖాలను, అవమానాలను అత్యంత ప్రతిభావంతంగా మానవీయకోణం లోంచి, వాస్తవిక దృక్పథంతో, స్త్రీ కావడం వలన స్త్రీల హక్కుల కోణంతో నడపడంలో రచయిత్రి విజయం సాధించింది అని చెప్పవచ్చు. అప్పటి ఫ్యూడల్ వ్యవస్థలో ఒక సంపన్న వర్గానికి చెందిన స్త్రీగా పురో జీవితం ఒక పాత కుటుంబ కలహానికి ఎట్లా బలి అయిందో, ఆమె చుట్టూ ఎంతటి అమానవీయమైన పరిస్థితులు సృష్టించి, లైంగిక అత్యాచారం చేసి అవమానించిన, గాయపరిచిన, తనకి సమస్తాన్నీదూరం చేసిన వ్యక్తికే లొంగిపోయి కాపురం చేయాల్సిన స్థితిని, ఆ స్థితిలోంచి పురో మానసిక పరిపక్వతతో పరిస్థితుల్ని, భవిష్యతుని బేరీజు వేసుకుని బయటపడడం అత్యంత సహజంగా ఏ సైద్ధాంతిక చర్చలు లేకుండా నడిపిస్తుంది అమృత. ఈ స్థితి దేశవిభజన సమయంలో స్త్రీల సామాజిక స్థితిని మాత్రమే కాదు ఆ స్థితి ఇప్పటికీ కొనసాగుతుండడాన్ని మన కళ్ళ ఎదుట ఆవిష్కరిస్తుంది అమృత. 1947 నాటి మత కల్లోలాలనే ఇప్పటి RSS ప్రభావిత బీజేపీ పాలకవర్గం తన రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకోసం అమలు చేయడం ఇప్పటి వర్తమాన చరిత్ర.

అమృతా ప్రీతం తన ఆత్మకథని, 1) ది రెవిన్యూ స్టాంప్  2) కాగజ్ ఠె కాన్వాస్ 3) ది బ్లాక్ రోస్ అనే మూడు భాగాలుగా రాసింది. తన బాల్య జీవితం, తల్లిని కోల్పోవడం, వంటరితనం, సాంప్రదాయ భావజాలంతో ఉండే నానమ్మ పెంపకం, ఆమె మూఢ ఆచారాలను, ముస్లింల పట్ల ఆమె ప్రదర్శించే బేధభావాలను ప్రశ్నించడం, భక్తి కవిత్వాన్ని మాత్రమే రాయమని శాసించే తండ్రిని ధిక్కరించి ప్రేమ కవిత్వం రాయడం, తన తొలి కవితా సంకలన ప్రచురణ, పదహారేళ్ళ పసి వయసులో ప్రీతం సింగ్ తో ఇష్టంలేని పెళ్లి, ప్రతిఘటన, భర్తతో పడక విడిపోవడం రాస్తుంది కానీ ఆ వైరుధ్యాలు ఏంటో, ఇద్దరు పిల్లలతో అనుభవాలు, అత్త ఇంట్లో గొడవలు ఏవీ రాయదు అన్ని దాటవేస్తుంది. అయితే బ్లాక్ రోజ్ అనే ఆత్మ కథ లో కొంత రాసింది. రెవిన్యూ స్టాంపులో తన సమ కాలీన కవి సాహిర్ లూథియాన్వి మీద అనంతమైన అనురాగాన్ని, ప్రేమని, ఘర్షణని ధైర్యంగా రాసుకుంటుంది. సాహిర్ కోసం పధ్నాలుగేళ్ళు ఎలా నిరీక్షించిందో, అతను అందక ఎంతగా కృంగిపోయిందో రాసుకుంటుంది. అతని కోసం ప్రేమ, విరహంతో పుంఖానుపుంఖాలుగా రాసుకున్న ప్రేమ కవితలను, అతనికి రాసిన ప్రేమ లేఖలను నిర్భయంగా రాసుకుంటుంది. తరువాత కళాకారుడు ఇమ్రోజ్ తో ప్రేమపూర్వకమైన తన సహజీవనం గురించి రాసుకుంటుంది. ప్రగతిశీల రచయితల సంఘం తన భావజాలాన్ని ఎంత విప్లవాత్మకంగా మార్చివేసిందో రాసుకుంటూనే దేశ, విదేశ రచయత్రులతో తన అనుభవాల్ని, స్నేహాలని, సంపాదకురాలిగా ‘నాగమణి’ అనే పత్రిక నిర్వహణలో తాను ఎదురుకొన్న సవాళ్ళను, పురుష సాహిత్య ప్రపంచంలో తన మీద అమలైన అణిచివేతను, తన సృజనాత్మకమైన రచనల మీద, తన ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన పురస్కారాల మీద అసూయతో పురుష రచయితలు చేసే హేళనలను దీటుగా ఎదుర్కొంటూనే, తన స్థానం నిలుపుకోవడానికి ఎంత ఘర్షణ పడుతుందో రాస్తుంది. అమృతని, ఆమె గొప్ప వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే ఆమె సృజించిన అద్భుతమైన రచనలు మాత్రమే కాదు, ఆమె ఆత్మకథలైన ఈ మూడు రచనలను చదవాల్సిందే.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

3 thoughts on “ఫ్యూడల్ సాహిత్య సమాజపు ధిక్కార పతాక: తొలి పంజాబ్ మహిళా రచయిత్రి అమృతా ప్రీతం – 2

  1. అమృతా ప్రీతమ్ గురించి సమగ్రమైన వ్యాసం అందించారు. మీ వ్యాసం ఆమె కవితల్ని, నవలలను,ఆమె ఆత్మకథను చదవడానికి ప్రరణగా నిలుస్తుంది. అభినందనలు.

  2. చాలా విలువయిన వ్యాసం. ఎంతో సుదీర్ఘ పరిశీలన వల్ల అమృత సాహిత్యాన్ని పరిచయం చేసారు. స్త్రీవాద దహిత్యాన్ని మన తెలుగు రచయిత్రులు అమృత సాహిత్యము గురించి పెద్దగా మాట్లాడలేదేమో అనిపిస్తుంది. ఇంత స్తామకోర్చి అమృత సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసిన గీతాంజలి గారిని అభినందిస్తున్నాను

  3. A very great article on Amrita Pritam. As a student of Literature ,I studied her novels as text books in the class. But the analysis of Gitanjali garu is brilliant. I never looked into the angularities shown by Geetanjali garu. Kudos to her.
    Jeevan Kumar
    Human Rights Forum

Leave a Reply