మానవీయ విలువల పునాది పై ప్రత్యామ్నాయ సమాజాన్ని నిర్మించే ఆచరణే ‘అనేక వైపుల’ నవలా శిల్పం

( ‘అనేకవైపుల’ నవల వస్తు రూపం దృక్పథాల గురించి రచయిత పాణి గారితో.. సాహిత్య విమర్శకులు ఎ.కె. ప్రభాకర్ సంభాషణ…)

ఈరోజు ప్రముఖ రచయిత పాణితో ఆయన కొత్త నవల ‘అనేక వైపుల’ వచ్చిన సందర్భంగా మాట్లాడుకుంటున్నాం. పాణి రచయితగా మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. రెండు దశాబ్దాల పూర్వమే ‘నిప్పుల వాగు’ నవల ద్వారా విప్లవ సాహిత్యోద్యమంలో ఆయన తనదైనటు వంటి ముద్ర వేశారు. నిప్పుల వాగు తర్వాత గుమ్మెటమోత, శికారి నవలలు ఆయన రాశారు. ఇప్పుడు అనేకవైపుల మన ముందుకు వచ్చింది. ఆయన కథా రచయితగా కూడా ప్రసిద్ధుడు. ‘నేరేడు రంగు పిల్లవాడు’ పేరుతో ఒక కథా సంకలనం తీసుకొచ్చారు. విమర్శకుడిగా మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకు సైద్ధాంతిక స్థాయిని సాధించడానికి ఆయన కృషి చేశారు. వరవరరావు గారి కవిత్వం గురించి ‘వ్యక్తిత్వమే కవిత్వం’ అనే సాహిత్య విమర్శ పుస్తకం వెలువరించారు. ఆయన రాసిన సామాజిక రాజకీయ వ్యాసాలు కొన్ని ‘ద్వేషభక్తి’పేరుతో ఇటీవలే వెలువడ్డాయి. ఇవన్నీ పాణి సాహిత్య జీవితాన్ని రాజకీయ ఆలోచనల్ని అలాగే ఆచరణను సైతం తెలియజేస్తున్నాయి. ఈరోజు హర్షణీయం కోసం అనేక వైపుల నవల గురించి ఆయనతో కాసేపు సంభాషించుకుందాం!

ఎ కె ప్రభాకర్ : పాణి గారు నమస్తే!

రచయిత పాణి: నమస్కారం సార్!

ఎ కె ప్రభాకర్:
‘అనేకవైపుల’ నవల వచ్చి రెండు నెలలు అయింది. ఈ రెండు నెలలుగా దానిపైన ఎలాంటి స్పందనలు వచ్చాయి! ఎందుకంటే ఈ నవల తొలి పాఠకుల్లో నేనూ ఒకణ్ణి. ఈ నవల చదువుతున్నంత సేపు నన్ను అనేక ఉద్వేగాలు చుట్టు ముట్టాయి. ఇటువంటి పఠనానుభవం నేను ఇంతకు ముందు ఎరగనిది. అంటే చాలా కథల్లో.. పాత్రలతో ఐడెంటిఫై అవుతూ ఉంటాం. కానీ ఇది ఒక కొత్త అనుభవం. ఎప్పుడో చిన్నప్పుడు చాలా పెద్ద పుస్తకం ‘వేయిపడగలు’ చదివితే చాలా గొప్ప అనుకునేవాళ్ళం. ఆ తర్వాత కొంత పెద్దయిన తర్వాత వడ్డెర చండీ దాసు గారి ‘అనుక్షణికం’ నవల పెద్దదే చదివాను.

కానీ ఇంత పెద్ద నవలను, ఇంత విస్తృతమైనటువంటి జీవితాన్ని .. దీన్ని విప్లవోద్యమ నవల అని అంటే మీరు ఒప్పుకుంటారనే అనుకుంటా, నాకైతే తెలుగు సాహిత్య, నవలా చరిత్రలో విప్లవోద్యమ నవలగా ‘అనేకవైపుల’ కు ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని అనిపించింది. ఎందుకంటే, మూడు భాగాలతో పద్నాలుగు అధ్యాయాలతో దాదాపు యాభై యైదు సన్నివేశాలతో 850 పేజీల నవల ఇది. ఓ రష్యన్ క్లాసిక్ నవల చదువుతున్న ఫీలింగ్ నాకు కలిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులోని పాత్రలు మనను చాలా ఆలోచింపజేస్తాయి. ఆ పాత్రల మధ్య జరిగే సంఘర్షణ, సంభాషణ కావచ్చు అది మన హృదయాన్ని తాకి మనం మళ్లీ మళ్లీ ఆ ఆలోచనల్లోనే సాగుతాం. ఇది నాకు కలిగినటువంటి అనుభవం.

ఈ రెండు నెలలుగా ఈ నవల చదివిన వ్యక్తులు పాఠకులు ఎలా మీతో స్పందించారు? ఎలా తమ అనుభవాలను పంచుకున్నారు! ముందు ఈ వివరం చెప్పుకుని తర్వాత మనం నవలలోకి వెళ్దాం…

పాణి:
సరేనండి! మీలాగే, నవల అచ్చయ్యే క్రమంలో ఓ పదిమంది మిత్రులు చదివారు. వాళ్లతో నవల గురించి మాట్లాడటం, వాళ్ళ అభిప్రాయాలు వినడం, వాళ్ల స్పందనలను తెలుసుకోవడం… ఇదంతా నాకు ఒక గొప్ప అనుభవం. మనం కల్పనా సాహిత్యం రాస్తూ ఉన్నప్పుడు, ఒక గీటు రాయి పెట్టుకుంటాం. ఇది పాఠకుల్ని ఎట్లా ప్రభావితం చేస్తుందీ అని. కానీ ఈ నవల రాసే క్రమంలో నాకు కలిగిన అనుభవం ఏమిటంటే, ఈ నవల రచయితను కూడా ప్రభావితం చేసింది. బహుశా రచయితను ప్రభావితం చేసే క్రమంలో రూపొందిన వాచకం ఇది. అట్లాగే నవలకు తుది మెరుగులు దిద్దే క్రమంలో మీలాగా, రెండు మూడు తరాలకు చెందిన, చాలా భిన్నంగా సాహిత్యాన్ని చదివే అలవాటు ఉన్న లేదా భిన్నమైన నేపథ్యాలు ఉన్న మిత్రులు చదివారు.

తరువాత అచ్చయిన తర్వాత ఈ రెండు నెలల్లో కొంత సంతృప్తికరమైన ప్రతిస్పందనే వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే.. విప్లవోద్యమంతో ఎక్కడో అనుబంధం ఉన్న పాఠకులు, విప్లవ సాహిత్యం చదివే అనుబంధం ఉన్న పాఠకులు, లేదా కార్యకర్తలు, రాయలసీమ నేపథ్యంలో లేదా కర్నూలు స్థానీయతతో నవల నడిచినప్పటికీ, వేరు వేరు తెలుగు ప్రాంతాలలో ఈ కథ నడుస్తున్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఈ నవలలో ఉండే పాత్రలు తమ చుట్టూ తిరుగుగాడే పాత్రలుగా, తాము ఎరిగిన పాత్రలుగా, తమకు సన్నిహితమైన మనుషులతో కలబోసుకున్న ఆలోచనలుగా చెప్పుకొచ్చారు.

మరొక విషయం ఏమంటే ఈ నవల లో ఉండే విప్లవోద్యమ కార్యకర్తలను, నాయకులను పాఠకులు తమ ప్రాంతంలో తమను నడిపించిన, తామెరిగిన, తమకు మార్గదర్శకత్వం వహించిన విప్లవ నాయకులతో పోల్చుకున్నారు. మా నాయకుడు, మా నాయకురాలు మాతో ఇట్లాగే మాట్లాడేవారు… ఆమె వ్యక్తిత్వం ఇట్లా ఉండేది… ఆయన ఇట్లా ఆలోచించేవాడు… వాళ్లు ఇట్లా మాతో పని చేయించే వాళ్ళు… మనుషుల్ని ఇట్లా కలిపే వాళ్లు… మనుషుల ప్రేమను ఇట్లా పొందే వాళ్ళు .. ఇట్లా అందించే వాళ్ళు.. అని వాళ్ళ వాళ్ళ అనుభవాలను పంచుకున్నారు… నవల చదివే క్రమంలో ఆ జ్ఞాపకాల్లోకి ఆ అనుభూతుల్లోకి వెళ్లారు…

ఇది ఒక నిర్దిష్ట స్థల కాలాల్లో నడిచిన నవల. కనీసం ముప్పై నలభై ఏళ్లుగా విప్లవోద్యమంతో.. సీరియస్ సాహిత్య పఠనంలో ఉన్న మిత్రులు దీన్ని తమ అనుభవంగా భావించారు. అది నాకు కొంచెం సంతృప్తికరమైన అంశంగా చెప్పొచ్చు.

ఎ కె ప్రభాకర్:
తెలుగులో ఇప్పటికీ దాదాపు (ఈ సంఖ్య కరెక్టో కాదో నాకు తెలియదు) నలభై వేల నవలలు వచ్చి ఉంటాయని అంచనా. ఎక్కడో బాలగోపాల్ అంటారు: తెలుగులో దాస్తోవస్కీకి సరితూగ గల రచయిత ఇప్పటికీ పుట్టలేదు అని ఒక ప్రస్తావనను తీసుకొస్తారు. దానికి కారణం ఏంటంటారంటే ఆయన… నవల ఆధునిక ప్రక్రియ కాబట్టి, అది బూర్జువా సాహిత్య రూపం కాబట్టి, ప్రగతిశీల మైనటువంటి బలమైన బూర్జువా వర్గం మన దగ్గర లేకపోవడమే కారణమని ఒక సూత్రీకరణను బాలగోపాల్ చేశారు.

ఈ నవల రాస్తున్న సందర్భంలో ఇది రావడానికి బలమైన ప్రగతిశీలమైన బూర్జువా వర్గం, అది చేసే దోపిడీ దానికి వ్యతిరేకంగా జరిగే ప్రతిఘటన, ఆ ప్రతిఘటనని అణచి వేయడానికి జరిగే అనేక పద్ధతులు, ఇవన్నీ కూడా ఈ నవల రాయడానికి మీకు ప్రేరణగా నిలిచాయా? అంటే… ఇంత గొప్ప నవల రావడానికి కారణమైన సామాజిక రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని మీకు అనిపించిందా? లేదా అసలు ఈ నవల పుట్టడానికి అవే కారణాలా?

పాణి:
సాహిత్య విద్యార్థిగా ఏమనుకుంటున్నానంటే.. ఒక సమాజంలోని, ఒక సాంస్కృతిక చారిత్రక ప్రపంచంలోని సాహిత్య వ్యక్తుల తోటి, మరొక ప్రాంతంలోని సాహిత్య వ్యక్తులను పోల్చనవసరం లేదు. ఆసక్తి కొద్ది మనం పోలుస్తాం గానీ వాళ్లు రూపొందిన స్థల కాలాలు పూర్తి భిన్నమైనవి. నవల అనేది ఒక ఆధునిక ప్రక్రియ అయినప్పటికీ ఈ నవల యూరప్ లో రూపొందడానికి తెలుగు సమాజంలో రూపొందడానికి, తెలుగు సమాజాలలో కూడా ఒక తెలంగాణలో నవలా ప్రక్రియ రూపొందడానికి రాయలసీమలో లేదా ఆంధ్రాలో రూపొందడానికి తేడా ఉంటుంది. కాబట్టి నవల అనే స్థూలమైన ఒక ప్రక్రియను మనం స్వీకరించినప్పటికీ అది రూపొందే క్రమం నిలదొక్కుకునే క్రమం చాలా భిన్నంగా ఉంటుందని నా అభిప్రాయం. అట్లా చూసినప్పుడు నవలా రచయితలుగా దోస్తొవిస్కీ లాంటి సాహిత్య వ్యక్తిత్వం తెలుగు సమాజాలలో ఉండాలి అని అనుకోవడం.. లేదని అసంతృప్తికి గురి కావడం అంత హేతుబద్ధమైన అంశం కాదు. చాలా నిర్దిష్టమైన స్థల కాలాలలో దోస్తొవస్కీ రూపొందాడు. అలాంటి సాహిత్య వ్యక్తిత్వం తెలుగులో ఉన్నదా లేదా? లేకుంటే ఎందుకు లేదు? అనేది ఒక సాహిత్య సామాజిక అధ్యయనానికి పనికి వచ్చి అంశమే కానీ దాన్ని పోల్చి అది లేకపోవడమే వెలితిగా అది లేకపోవడమే బలహీనతగా చెప్పగలమా? అనేది ఒక open ended question.

రెండవది ఈ నవల రూపొందడానికి భారత సమాజం.. ముఖ్యంగా తెలుగు సమాజాలు అనుభవిస్తున్న సంఘర్షణ, దానికి పరిష్కారంగా భారత దేశంలోనే తెలుగు ప్రజల ముందు మూడు తరాల విప్లవోద్యమ అనుభవం ఉన్నది. అనేక ప్రజాస్వామ్య పోరాటాలు ఉన్నాయి. ఒక బలమైన వర్గ పోరాట దృక్పథం తెలుగు సమాజానికి ఉన్నది. అది మిగతా సమాజాలకు లేదని చెప్పడం కాదు గాని తెలుగు సమాజాలలో దాని ప్రభావం చాలా తీక్షణమైనది. ఒక ప్రచండమైనటువంటి శక్తిగా అది తెలుగు సాహిత్యంలో తెలుగు సమాజంలో తెలుగు ఆలోచనా ధారలో ఉన్నది. దీనికి అవతలి వైపు నుంచి చాలా పెద్ద ఎత్తున మానవ విధ్వంసానికి సంబంధించిన ప్రతిఘాతుక ధోరణులు మనకు కనిపిస్తున్నాయి. అంటే సమస్తాన్నీ ధ్వంసం చేయడం, సమస్తాన్నీ నేలమట్టం చేయడం.

అంటే దేశవ్యాప్తంగా ఫాసిజమనే సంక్షోభం ఒక పక్కన ఉన్నది. మనుషుల ఉనికిని రద్దు చేసే ఆర్థిక విధానాలు ఉన్నాయి. సాంస్కృతిక విధానాలు ఉన్నాయి. ఘర్షణ ఉన్నది ఈ ఘర్షణకు పరిష్కారంగా విప్లవోద్యమంతో పాటు చాలా ప్రగతిశీల భావధారలు మన భారత సమాజంలో ఉన్నాయి. నిర్దిష్టంగా మనం జీవిస్తున్న మన అనుభవంలో భాగమైన తెలుగు సమాజంలో ఉన్నాయి.

ఈ నేపథ్యం లేకుండా, ఈ ఆవరణ లేకుండా ఈ నవలను ఊహించలేం. చాలా వినయంగానే నేను అనుకోవడం ఏమిటంటే ఈ ఆవరణ ఎంతో కొంత ఈ నవలలోకి వచ్చి ఉంటుంది. ఈ సంఘర్షణ ఈ పరిష్కారాల ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి . వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? మానవ జీవితం ఇట్లా ఎందుకు ఉన్నది? అనే అన్వేషణ ఎంతో కొంత ఈ నవలలోకి వచ్చి ఉండవచ్చు. అదేదీ లేకుండా ఈ ‘అనేక వైపుల’ నవలను ఊహించలేం.

ప్రభాకర్:
మీరు వర్గ పోరాటం, ఆ వర్గపోరాటానికి అనువైన పరిస్థితులు వాటిపై జరుగుతున్న అణిచివేత… ఈ విషయాల గురించి మాట్లాడారు కదా.. విప్లవాలకు వర్గ పోరాటాలకు కాలం చెల్లిపోయింది అని కొందరు అంటున్నారు. అసలు వర్గ పోరాటం అనే భావనే విదేశీ భావన అని దానికి ఈ దేశంలో చోటు లేదని దాన్ని తుడిచి పెట్టేస్తామని అంటున్నారు. అలాగే ఈ ఆధునిక సాంకేతిక యుగంలో పాతకాలపు సాయుధ పోరాట పద్ధతులు, ఆత్మహత్యా సదృశమని మరికొందరంటున్నారు. ఇన్ని విమర్శల మధ్య ఈరోజు విప్లవోద్యమాన్ని ఉన్నతీకరిస్తూ ఈ నవల రాయడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఆ ఉద్దేశం ఈ నవలలో ఏ మేరకు ప్రతిఫలిస్తుంది? ఈ విషయాల గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం..

పాణి:
మొట్టమొదట, మార్క్సిజం విదేశీ అనే మాట.. మార్క్సిజమే విదేశీ అవుతుందా?

అనేక ప్రకృతి శాస్త్రాలున్నాయి. అనేక సామాజిక శాస్త్రాలూ ఉన్నాయి. మనం జీవించడానికి కారణమైన వైద్యశాస్త్రం ఉంది. science and technology ఉన్నాయి. సైన్స్ ను విదేశీ అని చెప్పవచ్చునా? అనేది ఒక ప్రశ్న. ఇలా అనే వాళ్లు మార్క్సిజాన్ని ఎలా చూస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఫిజిక్స్ వెస్ట్రన్ అనగలమా? శరీర నిర్మాణ శాస్త్రాన్నీ యూరోపియన్ అనగలమా? ఇవి ఎట్లాగైతే సైన్స్ గా ఉంటాయో, అన్ని మానవ సమాజాలకు సంబంధించినవి. ఇవి అన్ని మానవ సమాజాలలోంచి పోగైనవి, చాలా ప్రాచీన కాలం నుంచి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆధునిక కాలంలో సామాజిక సిద్ధాంతాలుగా రూపొందాయి. మార్క్సిజం అట్లాగా ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ప్రజా పోరాటాల వెలుగులో నుంచి, ప్రజా సంఘర్షణలో నుంచి, రూపొందిన సిద్ధాంతం. అది అన్ని సమాజాలకు వర్తించేది.

ఇక వర్గమున్నదా? లేదా? అనేది అది సైద్ధాంతిక చర్చ కాదు. మానవ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చూడగలిగామంటే తెలుస్తుంది. గత పది, పదైదు సంవత్సరాలను మనం చూసామంటే… మన సమాజం ఎంత వర్గ విభజనకు లోనవుతూ ఉన్నదీ, నిరుపేదలు ఎంత పెరిగిపోతున్నదీ, సంపద అతి కొద్ది మంది చేతిలో ఉన్నదీ తెలుస్తుంది. సంపద అంటే అర్థం కేవలం సంప్రదాయార్థంలో సంపద మాత్రమే కాదు. నీరు నేల ఆకాశం భూమి సముద్రం సమస్తమూ పిడికెడు మంది చేతుల్లోకి వెళ్ళిపోతున్న ఒక స్థితి మనకు కనిపిస్తున్నది. ఇవి అందరికీ చెందవలసినవి. వాటికి వాళ్లు దూరమై పోతున్నారు. అంటే చాలా ప్రబలమైన వర్గ విభజన సమాజంలో జరుగుతున్నది. అన్ని సముదాయాలలో అన్ని ప్రాంతాలలో అన్ని భూ ఖండాలలో జరుగుతున్నది. వర్గం అనేది ఉన్నదా లేదా అనేది సైద్ధాంతిక చర్చకు కాదు, మన నిమిత్తంగా మనం ఆమోదించి అంగీకరించే విషయం కాదది. ఒక సామాజిక వాస్తవంగా నిరంతరంగా వర్గ విభజన జరుగుతున్నది, వర్గాల మధ్య సంఘర్షణ కూడా జరుగుతూ ఉన్నది. ఇది రెండవ అంశం.

మూడవది science and technology పెరిగింది కాబట్టి, ప్రజా పోరాటాలు అవసరం లేదు అనడం. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగడం వలన మానవ జీవితం ఏమైనా మానవీయంగా తయారయిందా? కనీసమైన ప్రజల అవసరాలు తీర గలిగి జీవితం అర్థవంతమవుతూ ఉంటే, ఈ ప్రశ్న వేసుకోవాలి. Science and technology పెరుగుతూ ఉన్నది కానీ ఇది కూడా సంపదలాగే అతి కొద్ది మంది చేతుల్లో బందీ అయి ఉన్నది. టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే సరుకులుగా మార్కెట్లో ప్రజల చేతుల్లోకి వచ్చినవి, సైన్సు టెక్నాలజీ అవతలి వర్గం చేతిలో ఉన్నాయి. అంటే జీవితం ఏమాత్రం సాఫీగా లేదు. ఏమాత్రం మానవీయంగా లేదు. జీవితం ఏమాత్రం స్వేచ్ఛాయుతంగా అర్ధవంతంగా లేదు. నిన్నటి కంటే మరింత దుర్భరంగా మారుతూ ఉన్నది.

సైన్సు ఇంత పెరిగింది అనుకుంటున్నాము కానీ నిజంగా మన దేశంలో సైన్స్ పెరిగిందా? టెక్నాలజీ దిగుమతి అయిందా! అనేది ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు మనం ఆ చర్చలోకి వెళ్లే అవసరం లేదు. టెక్నాలజీ ఎంతో కొంత దిగుమతి అయింది. వాటివల్ల జీవితంలోని ఏ కనీస అవసరాలూ తీరలేదు. కాబట్టి ప్రజా పోరాటాలు మరింత పెరుగుతాయి. అసమానతలు పెరిగే కొద్దీ వాటిలోని తీవ్రత దాష్టీకమూ పెరిగే కొద్దీ ప్రజలు తప్పనిసరిగా వాళ్లకు చేతనైన పోరాటాలు వాళ్ళు చేస్తారు. వాటన్నింటికీ నాయకత్వం వహించగలిగితే కార్మిక వర్గ అగ్రగామి, వాటిని వర్గ పోరాటాలుగా మార్చుతుంది. వివిధ ప్రజాపోరాటాల్లో వర్గ పోరాట అంశ ఉంటుంది కాబట్టి అవి వర్గ పోరాటాలు మారుతాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం భారతదేశంలో విప్లవోద్యమం గురించి, ఆ విప్లవోద్యమాన్ని అర్థం చేసుకోవలసిన ఈ నవల గురించి మనం మాట్లాడుకుంటున్నాం.

ప్రభాకర్:
వర్గ పోరాటం కొన్ని దశాబ్దాలుగా మన నేల మీద జరుగుతూన్నప్పుడు, మీరు ఈ నవల రాయడానికి 2014 ఆగష్టు నుండి 2020 ఫిబ్రవరి దాకా నిర్దిష్టమైన కాలంగా తీసుకున్నారు. అది రాయలసీమ నేపథ్యంగా, కథ కర్నూలు చుట్టూ ప్రధానంగా తిరుగుతున్నప్పటికీ రాయలసీమ అంతా వ్యాపించిన పాత్రలు ఆయా ప్రాంతాలకు వెళ్లి రాయలసీమ సమస్యల గురించి మాట్లాడతాయి. అంటే ఇది ఒక పీరియడ్ నవలగా, ఇది ఒక స్థానికమైనటువంటి నవలగా అంటే .. ఒక నేల మీద నిలబడి ఒక కాలానికి సంబంధించినటువంటి నవలగా మనం తీసుకున్నప్పటికీ ఈ ఐదు సంవత్సరాల కాలాన్నే .. రాష్ట్రం ఏర్పడి లేదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదలైన ఆ ఐదేళ్ల కాలాన్ని ఎందుకు తీసుకున్నారు? ఆ కాలానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అంటే ఆ కాలంలో నిలబడి గతంలోకి కూడా వెళుతున్నారు, కానీ సంఘటనలు అన్నీ ఆ కాలం నుంచి గతాన్ని చూడటం గతంలో నుంచి మళ్లీ వర్తమానం లోకి రావడం .. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా?

పాణి:
2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఆ సందర్భంలో రాయలసీమ ప్రాంతీయ సమస్యల ఎజెండా ముందుకు వచ్చింది. నిజానికి ఈరోజుకి అటు ఇటుగా ఒక వందేళ్ల అస్తిత్వ పోరాట చరిత్ర రాయలసీమకు ఉన్నది. 2014 ఉమ్మడి రాష్ట్రం వేరైపోయి తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా అటు రాయలసీమలో ఆంధ్రలో సమైక్య ఉద్యమం వచ్చింది. అయితే రాయలసీమలో కొన్ని ప్రగతిశీల శక్తులు, రాయలసీమ ప్రాంతీయ సమస్యలను అర్థం చేసుకున్న ప్రజాస్వామిక శక్తులు, తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్య ఉద్యమం కాదు మనం చేయవలసింది… రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఆ ప్రాంత సమస్యల మీద పోరాటం చేయాలి అని చెప్పాయి . 2014లో రాయలసీమ ఉద్యమ ఎజెండా తిరిగి మళ్లీ రంగం మీదకి వచ్చింది. అది ఒక ప్రత్యేకమైన అంశం.

రెండవది తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఏమిటి? అనే ప్రశ్న కూడా వచ్చి ఉన్నది. జాతీయస్థాయిలో చాలా కీలకమైన పరిణామాలు జరిగాయి. అంతకు ముందున్న ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పనితీరు మీద, ఈ ప్రభుత్వం భావజాలం మీద సమాజంలో మొదటి నుంచి చాలా భయాలు సందేహాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం నాయకత్వంలో సమాజం ఎట్లా మారబోతుంది? అనే ఆందోళన ప్రజలందరికీ ఉన్నది. అణగారిన సమూహాలకు ఈ ఆందోళన ఎక్కువగా ఉన్నది. అట్లాగే అంతకు ముందు కంటే కూడా చాలా పెద్ద ఎత్తున, పెట్టుబడిదారీ అనుకూల విధానాలు, కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన విధానాలు మొదలయ్యాయి. 2014 తర్వాత వచ్చిన పరిణామాలు వాటిని వేగవంతం చేసినవి. ఆ విధంగా ఒక కీలకమైన సందర్భం అది. మానవ జీవితంలో భారత సమాజ ప్రజల జీవితంలో, తెలుగు సమాజపు అనుభవాల్లో ఒక కొత్త దశ అది.

అందువల్ల అక్కడి నుంచి నవల రాయాలని, తీవ్రమైన ఈ సంఘర్షణను కేంద్రం చేసుకొని రాయాలనే ఆలోచన వచ్చింది. 2020 తో ముగియడానికి కూడా కారణం ఉంది. 2020 ఫిబ్రవరి, మార్చ్ తర్వాత మానవాళి ముందుకు కోవిడ్ అనే ఒక సమస్య వచ్చింది. అంతకు ముందున్న జీవితం, అంతకు ముందున్న జీవన క్రమాలు, వ్యవస్థలు వాటి పనితీరులో మొత్తంగా మార్పు వచ్చింది. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయానికి, ఆ తర్వాత కొన్ని అవరోధాలు ఉంటాయి. అందువల్ల నవల కాలాన్ని అక్కడికి పరిమితం చేశాను. ఈ కాలంలో నిర్దిష్టంగా, కర్నూలు, రాయలసీమ, తెలుగు సమాజాలు, స్థూలంగా భారత సమాజాల్లోని మార్పులు, సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు విప్లవోద్యమం చేస్తున్న ఒక ప్రయత్నం.. ఉన్నాయి. అట్లా ఆ స్థూల నేపథ్యం ఆ కాలానికి తగినది అనుకుని రాశాను.

ప్రభాకర్:
విప్లవోద్యమం కేంద్రంగా ఈ నవల రాశానని చెబుతున్నారు కదా! రాయలసీమను… మొత్తం తెలుగు సమాజాన్ని… భారత సమాజాన్ని విప్లవోద్యమం ఎలా ప్రభావితం చేసింది? ఈ అంశాన్ని, అంటే… విప్లవోద్యమం సమాజాన్ని ప్రభావితం చేయడం, అట్లాగే సమాజంలో ఇతరేతర పురోగామి శక్తులు ఉన్నాయి – ఈ శక్తులన్నింటినీ కలుపుకు రావడంలో, ఈ నవలకు ‘అనేక వైపుల’ అని పేరు పెట్టారు కదా… నాకేమనిపించింది అంటే ఇవాళ 2014 నుండి 2020 మధ్య కాలం నుంచి ఆ నిర్దిష్టత నుంచి మాట్లాడుతున్నప్పటికీ, దాదాపు మీకు తెలిసినటువంటి ముప్పై నలభై యేండ్ల సమాజాన్ని కూడా వ్యాఖ్యానిస్తూ, గతంలోనికి కూడా వెళ్లారు. ఆ వెళ్లిన సందర్భాలలో నవలకి ‘అనేకవైపుల’ అని పేరు పెట్టడంలో 90 లలో వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమాలు, అంటే కుల జెండర్ ప్రాంత అస్తిత్వాలు కావచ్చు… ఇవి ముందు కొచ్చినప్పుడు ఆ అస్తిత్వాల ప్రభావం అనేక వైపుల నుండి విప్లవోద్యం మీద పడటం… లేదా, విప్లవోద్యమం ఆ అనేక అస్తిత్వాలను తనలో మిళితం చేసుకొంటూ వాటిలో ఉన్నటువంటి ప్రజాస్వామిక దృక్పథాన్ని మిళితం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంది అనే ఎరుకతో, ఈ రెండు పరస్పరం ఆదాన ప్రదానంగా ఒక కొత్త ప్రజాస్వామిక భావన బలపడాల్సినటువంటి అవసరం ఉంది అనే ఈ democratic space నుంచి మనమందరం మాట్లాడుతున్న ఈ సంక్షోభ కాలాన్ని ఈదవలసి ఉంది అనే అవగాహనతోనే రాసారా?

పాణి:
ఈ నవల 2014 నుండి మొదలైనప్పటికీ దాని వెనక ఒక పదీ పదైదు ఏండ్ల కాలం ఉంది. (ప్రభాకర్: అంటే ఇది 21వ శతాబ్దపు నవలగా భావించాలా?) 21వ శతాబ్దపు నవల అనడం కంటే, 21వ శతాబ్దపు భారత విప్లవోద్యమ నేపథ్యం నుంచి, అది గడించిన అనుభవాల నుంచి, విప్లవోద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి ఉండగల పరిష్కారాల నేపథ్యంలోంచి దీన్ని చూడవచ్చు.

అయితే ఇతర ప్రజాస్వామిక ఉద్యమాల నుంచి నేర్చుకోవడం .. నిజానికి సజీవమైన ఉద్యమాలే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ప్రజల మధ్య ఒక నిత్య చలనశీలమైన, ప్రయోగాలు చేసే ఉద్యమాలే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ప్రభావం చేయగల ఆలోచనలు, ప్రభావం వేయగల ఉద్యమాలు తప్పనిసరిగ ప్రభావానికి లోనవుతాయి. ప్రభావం వేయగల ఆచరణే ప్రభావితమవుతుంది. ప్రభావం వేయగల ఉద్యమాలే సమాజంలోని ప్రజల ఆకాంక్షల నుంచి సమాజంలో జరుగుతున్న పరిణామాలకు.. అవి సానుకూల పరిణామాలు కావచ్చు ప్రతికూల పరిణామాలు కావచ్చు.. స్పందిస్తాయి. నిరంతరం పరస్పర సంబంధాల మధ్య, పరస్పర మోహరింపుల మధ్య, ఆలోచన రంగంలో కానీ రాజకీయ ఆర్థిక రంగంలో గానీ, సైనిక రంగంలో గాని పురోగమించడానికి అవకాశం ఉంటుంది.

విప్లవోద్యమం నిజానికి అంతకు ముందు కంటే.. అంటే 1980 కంటే 90 ల కంటే 2000 నుంచి చాలా నేర్చుకున్నది. 2004 నుంచి ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. భారత సమాజమే ప్రవేశించింది. భారత సమాజంలోని సంఘర్షణ అంతకు ముందు కంటే చాలా తీవ్రస్థాయిలో ఉంది. ప్రజా అనుకూల శక్తులు చాలా పెద్ద ఎత్తున విడుదలయ్యాయి, బయటికి వచ్చాయి. అట్లాగే ప్రతిఘాతుక శక్తులు కూడా. కార్పొరేటైజేషన్ అయినా, హిందుత్వ ఫాసిజమైనా, అగ్రకుల తత్వమైనా, సమాజంలో తీవ్రమైన పితృస్వామిక ధోరణులైనా.. అమానవీయమైన ధోరణులు సమాజంలో చాలా పెద్ద ఎత్తున పుట్టుకొచ్చినవి. చాలా సంఘర్షణాయుతమైన కాలమిది. కాబట్టి ఈ నేపథ్యంలో పనిచేస్తున్న విప్లవోద్యమం ముందుకు ఎన్ని సవాళ్లు వచ్చాయో వాటన్నిటి గురించి నేర్చుకునే అవకాశం వచ్చింది. అంతకుముందు కంటే కొత్తగా నేర్చుకోగల, కొత్తగా వినవలసిన, ప్రభావానికి లోను కావలసిన సందర్భం ఇది.

అందువల్ల ఆ నేపథ్యం మనకు నవలలో కనిపిస్తుంది. అయితే ఇతర శక్తులు ఎంత నేర్చుకున్నాయి? చెప్పలేం.. వేరు వేరు సామాజిక ఆకాంక్షలని, సామాజికమైన వైరుధ్యాలని వాటిపట్ల ఎరుకని, విప్లవోద్యమం ఎట్లాగైతే గ్రహించగలిగిందో, సమాజంలోని ఇతర ప్రగతిశీల లౌకిక శక్తులు ఈ సంఘర్షణాయుత మైన కాలంలో ఎంత నేర్చుకున్నాయి? అనేది వివరాలతో సహా మనం చర్చించుకోవలసిన ఒక ప్రత్యేకమైన అంశం. ఈ స్థూల నేపథ్యం నవలకు ఉన్నది. కాబట్టి 21వ శతాబ్దంలో భారతదేశంలో నడుస్తున్న విప్లవోద్యమం… దాని అనుభవాలు ఈ నవల వెనక పనిచేశాయని నేను అనుకుంటున్నాను.

ప్రభాకర్:
నవల లోకి వెళ్ళినప్పుడు – ఇందులో ‘సాధన’ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి దాదాపు ఓ 20 సంవత్సరాలు. ఆమె తల్లి విప్లవోద్యమంలో పనిచేసి అమరురాలు అవుతుంది. తండ్రి ఇంకా విప్లవోద్యమంలో ఆచరణలో ఉన్నాడు. ఆమెను మొదట ఒక దంపతులు పెంచుతారు. వాళ్లు కూడా విప్లవోద్యమంలో పరోక్షంగానో ప్రత్యక్షంగానో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. తర్వాత వాళ్లు కూడా విడిపోవడం వల్ల ఆమె పెంపకం మరోచోటికి (హైదరాబాద్) మారుతుంది. ఆమె తన తల్లి జన్మస్థానమైన కర్నూలుకు వస్తుంది. వచ్చిన తర్వాత అనేకమందితో స్నేహ సంబంధాల్లోకి వెళ్తుంది. ఇటు రాయలసీమలో ఉన్న మేధావులతోటి సామాన్యులతోటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలతోటి, జెన్నీ అనే దళిత ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి అమ్మాయితోటి, అంటే‌.. ప్రాంతీయ అస్తిత్వవాదులతో, కుల అస్తిత్వవాదులతో, ఇతర రాజ్యాంగ వాదులతో కూడా కలిసి, వాళ్ల సంపర్కంతో – మీరు నేర్చుకుంటాం అన్నమాట అన్నారు కాబట్టి – ఈ నేర్చుకునే క్రమం.. అంతా సాధనలో కనిపిస్తుంది. ఈ అందరితో సంభాషిస్తుంది, ఆ సంభాషణ క్రమంలో ఘర్షణ కూడా పడుతుంది .. ఆయా వ్యక్తులతో ఆయా భావజాలాలతో.

నాకేమనిపించిందంటే .. ఒక్కొక్క భావజాలానికి ఒక్కో పాత్రను మీరు నిర్మించారా! ఈ అమరిక అనేక వైపుల నుంచి ఆమె నేర్చుకోవడం, అనేక వైపులకు ఆమె చూడటం ఇదంతా కూడా కావాలని మీరు ఈ ‘అనేక వైపుల’ అని పేరు ముందు అనుకున్నారా? లేకపోతే నవల రూపొందే క్రమంలో ఆ పేరు ఏర్పడిందా?

పాణి:
నవల గురించి రఫ్ గా స్కెచ్ వేసుకున్న తర్వాత, ఇంతకు ఈ నవల ఏం చెబుతుంది? అన్న ప్రశ్న ఎదురైంది. అంటే దానిదైన ప్రత్యేకత దానికి ఉండాలి కదా! దానిదైనా సొంత వ్యక్తిత్వం రచనకు ఉండాలి. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉన్నట్టే ప్రతి రచనకు ఒక వ్యక్తిత్వం ప్రత్యేకత ఉండి తీరాలి. ఆ వ్యక్తిత్వం ఏమిటి? ఇది ఏ స్థల కాలాల్లో రూపొందుతున్నది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు..

నవలలో చాలా రకాల పాత్రలు, ఓ మూడు నాలుగు కథలు మనకు కనిపిస్తాయి. దీన్నంతా అమరుస్తూ ఉన్నప్పుడు నవల శీర్షిక ‘అనేక వైపుల’ అని స్ఫురించింది. ఆ తర్వాత నవలను ఆ శీర్షిక నడిపించింది. నవల మీద మాత్రమే కాకుండా నా మీద కూడా, ‘అనేక వైపుల’ అనే పదం ప్రభావం చూపింది. ఆ పదం ఆరు అక్షరాల పదమే గాని, మానవ జీవితమే నిజానికి ఏకముఖంగా ఉండదు కదా! అనేక ఆలోచనలు, అనేక అనుభవాలు, అనేక భావధారల మధ్య మానవ జీవితం ఉంటుంది. వ్యక్తమయ్యేవి కొన్ని ఉంటాయి, అవ్యక్తంగా మరికొన్ని ఉంటాయి. చెప్పగలిగినవి కొన్ని ఉంటాయి. వినవలసినవి అనేకం ఉంటాయి. వీటన్నింటి మధ్య మానవ జీవితం నిర్మాణం అవుతూ ఉంటుంది. సంఘర్షణ పడుతూ ఉంటుంది. పరిష్కారాలు వెతుకుతూ ఉంటుంది. నాకు అనేక వైపుల అనే మాట స్ఫురించడం కూడా అటువంటిదే. ఎలాగంటే ఇందులో మూడో నాలుగో కథలు ఉండటం, different plains లో వ్యక్తిత్వాలు గల పాత్రలు ఉండటం, రెండు మూడు స్థలాలలో కథ నడవడం వల్ల ‘అనేక వైపుల’ అనే పదం స్ఫురించింది. ఆ తర్వాత దాని నిజమైన అర్థం ఏమిటి? అనే ప్రశ్న నాకు నవల రాసే క్రమంలో కలిగింది… నవల structure మొత్తాన్ని అది పునర్నిర్మించింది.’

ఇంకొక సరదా విషయం చెప్పాలి. ఈ నవల రాసే క్రమంలో మొదట రఫ్ నోట్స్ రాసుకున్నాను, ఆ నోట్స్ ని పకడ్బందీగా ఫైనల్ చేసే సందర్భంలో నాకు ‘అనేక వైపుల’ అని స్ఫురించింది. కరెక్ట్ గా ఆ సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో ఓ 40, 50 మంది ప్రజాస్వామికవాదుల, రచయితల ఇండ్ల మీద NIA దాడి చేసింది. వాళ్లు వచ్చిన రోజు నేను రాసుకుంటున్న ఈ నోట్స్ టేబుల్ మీద ఉన్నది. మామూలుగా నా చేతి రాత అంత సులువుగా ఎవరికీ అర్థం కాదు. అందులో గీతలు, గొలుసులు మాత్రమే ఉంటాయి. అయినా వాళ్ళు ఎంత చురుకైన చూపు ప్రదర్శించారంటే, మావోయిస్టు అనే ఒక పదాన్ని గుర్తించగలిగారు. గుర్తించి ఏదో ప్రమాదకరమైనది అని దాన్ని తీసుకున్నారు. వాళ్లు సీజ్ చేసిన లిస్టులో ఆ నోట్స్ కూడా ఉంటుంది.

అలా అది పోయింది. అది పోయిన తర్వాత నేను మళ్ళీ అనేక వైపులా ఆలోచించవలసి వచ్చింది. అంటే ‘అనేక వైపుల’ అనే పేరు నన్ను ప్రభావితం చేయడమే కాక నవలా నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. రాసుకున్న నోట్స్ వాళ్ళు ఎత్తికెళ్ళడం నిర్మాణం కావలసిన నవలను మళ్లీ తిరిగి revisit చేసేలా చేసింది. అది నిజంగానే అనేక వైపులా ఉన్నదా? కొన్ని వైపుల మాత్రమే ఉన్నదా? అనేక వైపులా ఉండాలంటే ఏం చేయాలి? అని ఆలోచించేందుకు పరోక్షంగా వాళ్లు కూడా దోహదం చేశారు. కాబట్టి వాళ్లకు మనం థాంక్స్ చెప్పుకోవాలి! అట్లా అనేక వైపులా అనే భావన నాకు మానవ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగపడింది. ఇంకొక మాట చెప్పాలంటే ఇంత సంక్లిష్టమైన మానవ జీవితాన్ని ఎట్లా మార్చడానికి అవకాశం ఉంటుంది? ఈ నవల రాసే క్రమంలో ఆ శీర్షిక నవల రచనా క్రమాన్ని ప్రభావితం చేసినట్టే అనేకవైపుల సాగే విప్లవోద్యమం నన్ను ప్రభావితం చేసింది. ఒక 30 ఏళ్లుగా విప్లవ రాజకీయాలతో కొనసాగుతూ ఉన్నా, విప్లవోద్యమంలో ఏదో ఒక రంగంలో పని చేస్తూ ఉన్నా నాకు నిజానికి విప్లవం అర్థమైంది ఈ నవల రాసే క్రమంలోనే. ఆ విధంగా అనేక వైపుల అనే ఒక భావన.. అది ఒక పదం కాదు.. అదొక భావన అని తెలిసి వచ్చింది. మానవ జీవితానికి ఉండే వైశాల్యాన్ని చూడటం, మానవ జీవితానికి ఉండే బహుముఖాలను చూడటం అని అర్థమైంది. ఈ బహుముఖాలలో అన్నింటిని విప్లవోద్యమం ఎట్లా ప్రభావితం చేస్తుంది? తద్వారా విప్లవోద్యమం ఎట్లా ముందుకు వస్తుంది? అనేక రకాల మనుషుల్ని ఎట్లా దగ్గరికి తీసుకుంటుంది? అనేక రకాల మనుషులకు అది ఎట్లా జ్ఞానాన్ని ఇస్తుంది? ఈ మానవ సముదాయాలు అన్నింటి నుంచి.. ఎందుకంటే విప్లవం ప్రజల మధ్య జరిగేది కాబట్టి, ప్రజలు నిర్వహించే ల విప్లవోద్యమ ఆచరణ వల్ల మొత్తంగా విప్లవ నిర్మాణం కూడా ఎట్లా నేర్చుకుంటుంది? అనీ తెలుసుకున్నా.

బహుముఖాలుగా, అనేక మానవీయ తలాలలో జరిగే విప్లవోద్యమ మానవీయ ప్రక్రియ నాకు నవల రాసే క్రమంలో తెలిసింది. అది అట్లాంటి ఒక నవల నిర్మాణ అమరికకు దోహదం చేసింది. ఆ అమరికలో ఉండే ప్రతి అంశము కూడా చాలా ఉద్దేశపూర్వకంగా చేసిందే. అనుకొని ప్రయత్నపూర్వకంగా ఆ అమరికను తీసుకొచ్చాను.

ప్రభాకర్:
అంటే విప్లవాన్ని కేవలం ఒక రాజకీయ ఆచరణగా కాకుండా, ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారంగానే కాకుండా, ఒక కాలానికో ఒక స్థలానికి సంబంధించిన విషయంగా కాకుండా, అది నిరంతరం జరిగేటువంటి ఒక ప్రయోగమని అనుకున్నారు. అలాగే విప్లవమంటే మనుషులు కొత్త ఎరుకలోకి ప్రయాణించడమని.. ఇది మీ మాటే .. కొత్త మనుషులుగా మారటం అనీ విప్లవాన్ని కేవలం ఒక రాజకీయ ఆచరణగా మాత్రమే కాకుండా ఒక తాత్వికార్థంలో విప్లవంలో కేవలం అక్కడ పనిచేస్తున్న వాళ్లే కాదు, మనమందరం కూడా ఈ అనేక వైపుల నుండి ప్రభావితమవుతున్నాం, పాఠకులుగానే కాదు రచయితగానే కాదు మొత్తం సమాజమే అని అర్థమైంది. విప్లవమంటే విస్తృతార్థంలో మార్పు. అది జీవితమంత విశాలమైనది. అది జీవన పార్శ్వాలన్నింటిని ముట్టుకుంటుంది. మానవ సంబంధాలను ఉన్నతీకరిస్తుంది. ఇంకా మానవీయం చేస్తుంది. మనుషుల్ని ఉదాత్త వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే .. మార్క్సిస్టు పరిభాషలో, నూతన మానవ ఆవిష్కరణకు దోహదం చేస్తుంది .. అనే అర్థంలో తీసుకున్నట్టుగా అనిపిస్తుంది, ఇప్పుడు మీరు ఇచ్చిన మీ విశ్లేషణ ద్వారా. ఇది నవల పొడుగుతా అది నాకు కనిపించింది. అందుకే ఎన్నోసార్లు దానికి దగ్గరగా వెళ్లడం .. ఆ వ్యక్తులతో ఐడెంటిఫై కావడం. అయితే దీనికి ప్రధానంగా మీరు ఏవైనా కొన్ని పాత్రలని ముందే ఎంచుకున్నారా? లేకుంటే ఈ తాత్వికతని అర్థం చేయించడానికి మీరు స్కీమ్ ఎన్నుకున్నారా? విప్లవాన్ని విస్తృతార్థంలో ఒక తాత్వికార్థంలో అవగాహన చేసుకోవడానికి ఈ నవల ఎలా దోహదం చేస్తుంది?

పాణి:
మొట్టమొదట ఇందులో ఉండే పాత్రల గురించి చెప్పదలుచుకుంటే, మామూలుగా ఒక మాట అంటూ ఉంటాం. చాలా సజీవమైన పాత్రలని, మన కళ్ళ ముందు ఉన్న పాత్రలని అంటూ ఉంటాం. కానీ ఉన్నదాన్ని చిత్రించడమే సాహిత్యం పని కాదు. ఎట్లా ఉండాలో కాల్పనికంగా ఊహించి చెప్పడం కూడా సాహిత్యం పని కాదు. ఆ రెండు పనులు కూడా చేయవచ్చు గాని నిజానికి సాహిత్యం చేయవలసిన పని జీవితం లోపల ఉండగల, సమాజంలో ఉండగల అంశాలని చెప్పడం. ఆ ఉండగల అంశాలు ఏమై ఉంటాయి? అట్లా ఉండగల మనుషులు ఎట్లా ఉంటారు? నిజానికి ఈ నవలలో ఉన్న పాత్రలు.. నేను ఆరంభంలో చెప్పినట్టు చాలామంది మిత్రులకు, పాఠకులకు ఎరుకలో ఉన్న మనుషులే. కానీ సాహిత్యం పని ఉన్న వాళ్లను చెప్పడం మాత్రమే కాకుండా, ఉండగలవాళ్ళు ఎవరు? జీవితంలో ఉండగల కోణం ఏమిటి? ఉండగల అవకాశం ఏమిటి? అనేవి సాహిత్యానికి శక్తినిస్తాయని ఒక అభిప్రాయం నాకు ఉన్నది. అందువల్ల విప్లవంలో లేదా మన చుట్టూ ఉండగల మనుషులు ఎవరు? విప్లవంలో రూపొందగల మానవులు ఎవరు? సమాజం మొత్తం నిర్మాణం కావలసిన అంశాలు ఏమిటి? అనే దిశగా చూసి, దానికి తగిన పాత్రలు ఎంచుకున్నాను. కొన్ని యథాతథంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కొన్ని ఉండగల పాత్రలుగా కూడా మనకు కనిపిస్తాయి. ఆ రెండు విధాల వ్యక్తిత్వాలు మనకు కనిపిస్తాయి.

ఇట్లా విప్లవాన్ని విస్తృత అర్థంలో చూసినా, మామూలుగా చెప్పాలంటే విప్లవం ఒక రాజకీయ చర్య. దాన్ని విస్మరిస్తే మెట్ట వేదాంతం చెప్పినట్టు ఉంటుంది. తప్పనిసరిగా విప్లవం రాజ్యాధికారాన్ని సాధించే రాజకీయ ప్రక్రియ. అది వర్గ పోరాట ప్రక్రియ. అందులో అనుమానం లేదు. అయితే విప్లవంలో ఇది ఒక్కటే నడుస్తుందా? దీనికోసం ప్రజలు చేసే ప్రయత్నం ఆ ఒక్క రంగంలో మాత్రమే ఉంటుందా? ఆ ఒక్క కోణంలో మాత్రమే ఉంటుందా? అది అనేక వైపుల నుంచి సాగుతూ ఉంటుందా? అని ఆలోచిస్తే విప్లవం అనేక వైపుల జరుగుతుంది అనేది మన అనుభవంలోని విషయం. విప్లవాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాము అనేది పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు. నిజానికి దాని నిత్య ఆచరణను చూసామంటే, అది ఎట్లా కొనసాగుతూ ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది.

అది కేవలం ఒక రాజకీయ నిర్మాణానికి సంబంధించినది మాత్రమే కాదు. ఈరోజు ఒకానొక రాజకీయ నిర్మాణం నాయకత్వం వహిస్తూ ఉండవచ్చు. రేపు పొద్దున మరొక నిర్మాణం నాయకత్వం వహించ వచ్చు. గడిచిన విప్లవాల చరిత్ర మనం చూసినామంటే, వేరువేరు దశల్లో వేరువేరు నిర్మాణాలు విప్లవాన్ని ముందుకు నడిపించిన అనుభవాలు మనకు ఉన్నాయి. మనదేశంలో కూడా అదే జరుగుతున్నది. పార్టీ పేర్లు మారుతాయి. నిర్మాణమే మారుతుంది. కొత్త నిర్మాణం రావచ్చు. కాబట్టి రాజకీయ చర్యగా రాజ్యాధికారం స్వాధీనం చేసుకోవడం మౌలికమైన అంశం అయినప్పటికీ విప్లవాన్ని అంతవరకే పరిమితం చేయవలసిన అవసరం లేదు. విప్లవోద్యమం అంతవరకే జరగట్లేదు. విప్లవోద్యమం అనేక తలాలలో అనేక ముఖాల జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే సాహిత్యం అవుతుంది. కాబట్టి దానికి ఎంత విస్తృతమైన అర్థాన్ని ఇస్తాము అనేది మన అవగాహననుబట్టి ఉంటుంది.
అట్లా చూసినప్పుడు మీరు ఈ నవలలోంచి మీరు ప్రస్తావించిన వాక్యం ఉంది కదా, విప్లవాన్ని ఒక దశలో ఎరుకగా భావిస్తాం, విప్లవాన్ని ఒక దశలో పరివర్తనగా భావిస్తాం. విప్లవాన్ని ఇంకో దశలో ఆచరణగా భావిస్తాం. ఇంకొక పద్ధతిలో విప్లవాన్ని అనేకమంది మనుషుల అనేక ఆలోచనల విశాల సమాహారంగా భావిస్తాం. అది సమగ్రం అవడానికి జరిగే ఒక ప్రక్రియ. నిరంతరాయంగా కొనసాగే ఒక సామాజిక సాంస్కృతిక భావజాలపరమైన ఒక తాత్వికమైన ప్రక్రియగా బహుముఖాలుగా సాగుతుంది . దాన్ని ఈ నవల ఏమైనా చిత్రించిందా అనేది పరిశీలించాలి.

ప్రభాకర్ :
విప్లవం అనగానే ఒక రొమాంటిక్ భావన .. ఒక ఆరాధన భావనతో కూడా కొంతమంది మాలాంటి వాళ్ళం చూస్తూ ఉంటాం, దానికి దూరంగా ఉంటాము కాని అదేదో మా జీవితంలో, ప్రజా జీవితంలో ఓ కొత్త మార్పు తీసుకువస్తుంది అని .. ఒక ఆరాధన భావంతో చూస్తూ ఉంటాం. దానికి మీరు మరొకచోట ఒక మాట అంటారు: అదేమిటంటే… ‘విప్లవాన్ని ఆరాధిస్తే అందులో ఏ సౌందర్యము కనిపించదు’.. అని అన్నారు . అంతేకాదు. క్రిటికల్ గా చూస్తే అద్భుత సౌందర్యం కనిపిస్తుంది అని కూడా అన్నారు. అసలు విమర్శనాత్మకతే దానికున్న సౌందర్యం అన్నారు. ఈ మాటను సుధ అనే క్యారెక్టర్, అద్భుతమైనటువంటి క్యారెక్టర్, ఈమె సాధనను పెంచిన తల్లి, ఆమె పోలీసుల ఇంటరాగేషన్లో చెప్పిన మాట ఇది. ఆమె చాలా విమర్శనాత్మకంగా ఉంటుంది. అన్ని విషయాల పట్ల క్రిటికల్ గా ఉంటుంది, చుట్టూ ఉన్న సమాజం పట్ల కావచ్చు వ్యక్తుల పట్ల కావచ్చు, సాహిత్యం పట్ల కావచ్చు, ఇంక్లూడింగ్ విప్లవాన్ని ఆచరిస్తున్నటువంటి రాజకీయ ఆచరణ పట్ల కూడా కావచ్చు.

అలాగే ఇందులో ‘ప్రధాన్’ కూడా అటువంటి వ్యక్తే. తన రాజకీయ ఆచరణను ఎన్నోసార్లు విశ్లేషించుకుంటాడు, నాయకత్వ స్థాయిలో ఉన్న తాను విప్లవాన్ని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చేసే ప్రయత్నం చేసే తాను.. చాలా విమర్శనాత్మకంగా ఉండే అద్భుతమైన క్యారెక్టర్. ప్రధాన్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.. ఇక్కడ ‘విమర్శనాత్మకంగా ఉండడమే విప్లవ సౌందర్యము’ అనే ఒక సూత్రీకరణ చేశారు. అందుకనే నేను మిమ్మల్ని విప్లవాన్ని మరింత విస్తృతార్థంలో చూడవలసిన అవసరం ఉంది కదా అని అడిగాను .. ఇందులో ప్రధాన్ దగ్గరికి వస్తే .. ఆ రోల్ లో అతను విప్లవాన్ని విమర్శనాత్మకంగా చూడటం, ఆచరణను విమర్శనాత్మకంగా చూడటం, చేసిన తప్పుల్ని విమర్శనాత్మకంగా చూడడం, గతాన్ని విమర్శనాత్మకంగా చూడటం, వర్తమానాన్ని విమర్శనాత్మకంగా చూడటం, ఈ విమర్శనాత్మకతే దాని సౌందర్యం అంటాడు. విప్లవం గురించి ఇందాక మీరు ‘ఉండగల మనుషులు’అన్నారు. ఈ ఉండగల మనుషులు ఎట్లా ఉండబోతున్నారు? విప్లవం గురించి ఆలోచించడం అంటే ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించడమని చివరికి సాధన విప్లవోద్యమంలో ఉన్నటువంటి తన తండ్రి ‘రఘు’ దగ్గరికి వెళ్లినప్పుడు నేర్చుకున్నటువంటి పాఠం… దీన్ని ఇంకాస్త విశ్లేషిస్తారా!

పాణి:
మానవ జీవితంలో ఆరాధన కూడా ఉంది .. (ప్రభాకర్: మొదట ఆరాధన తోనే దగ్గరవుతాం. ఇది కేవలం వ్యక్తి ఆరాధనగా మిగిలిపోవడం వల్ల కొంత ఇబ్బందిగా ఉండవచ్చు.) మొదట చివర అనే కాకుండా మీతో పరిచయమైనప్పటి నుండి చివరిదాకా కూడా అది ఉండవచ్చు. ఆరాధించడం అనే భావన మానవ స్పందనలలో, మానవ ఉద్వేగాలలో భాగమైన అంశం. మనుషుల్ని ప్రేమించడం లాగానే, మనుషుల్ని ఇష్టపడటం లాగానే, ఆరాధన కూడా ఉంటుంది. అయితే చాలాసార్లు దానితో ప్రమాదం ఏమిటంటే, మనుషుల్ని అయినా ఉద్యమాల్ని అయినా చివరికి సిద్ధాంతాల్ని అయినా సరే ఆరాధన కొంచెం అటు ఇటుగా అంధత్వానికి దారి తీసే ప్రమాదం ఉంది. నిర్విమర్శగా మనం దానికి సాగిలపడే ప్రమాదం ఉంది. మార్క్సిజం ఒక విమర్శనాత్మక సిద్ధాంతం. మనుషుల్లో ఎంత ఆరాధనా భావన ఉన్నట్టు కనిపించినా, మన చుట్టూ ఉన్నవాళ్ల పట్ల, మనం ఇష్టపడే వాళ్ళ పట్ల ఆరాధన ఉన్నట్టు అనిపించినా, మనుషులు చూపులోనే విమర్శనాత్మకత కూడా ఉంటుంది. ఒకదానిని మరొకదానితో పోల్చి చూస్తాం. ఒక గుణంతోటి ఒక బలహీనతను పోల్చి చూస్తాం. ఒక బలం తోటి మరొక బలహీనతను అంచనా వేసి చూస్తాం. అంటే మనుషుల పరిశీలనలోనే విమర్శనాత్మకత అనేది అంతర్నిహిత లక్షణం. ప్రేమ ఉన్నట్టే, ఆరాధన ఉన్నట్టే విమర్శనాత్మకత కూడా ఉంటుంది. ఆరాధన వల్ల మొత్తంగా తీసేసుకోవాల్సింది, మొత్తంగా నెత్తికెత్తు కోవాల్సినదీ కాదు. ఆరాధన అనేది మామూలు మనుషుల్లో భగవద్ భావనగా ఉంటుంది. నవలలో ఒకచోట అమరవీరుల్ని ఆరాధించడంలో మన వాళ్లలో ఒక పాటి భగవద్ భావనగా కూడా ఉంటుందేమోనని ప్రధాన్ అంటాడు.(ప్రభాకర్: అడ్డు వస్తున్నాను. హీరో వర్షిప్ అనేది పెరిగి వాళ్లను ఆరాధన తో పూజనీయస్థానంలో చూడడం వల్ల వాళ్లను ఆదర్శంగా కాకుండా అట్లా చూడడం వల్ల వాళ్ల ఆచరణని చూడలేని పరిస్థితిలో కూడా వెళ్తామని..)

అవును .. ఈ మాటే ప్రధాన్ అంటాడు. అని కొన్ని సందర్భాలను కూడా చెప్తాడు ఆయన. అంటే ఆరాధన అనేది ఒక పూజనీయ స్థానానికి చెందినది. మానవ చింతనలోనే విమర్శనాత్మకత ఉన్నది కాబట్టి, ఆధునిక దృక్పథంలో విమర్శనాత్మకత దాని వెన్నెముక కాబట్టి, మార్క్సిజం ఆ విమర్శనాత్మక చింతనను స్వీకరించింది. అది దేనిపట్లైనా క్రిటికల్ గా ఉంటుంది. కాబట్టి ఆరాధన సౌందర్యమా? ప్రేమ సౌందర్యమా? విమర్శనాత్మకత సౌందర్యమా? అనే ప్రశ్న వేసుకుంటే విమర్శనాత్మకతే అసలైన సౌందర్యం. ఎందువల్లనంటే విమర్శనాత్మకత, మనకు కనిపించే వాటి పట్ల మాత్రమే కాకుండా కనిపించని వాటి పట్ల కూడా మనకు చూపునిస్తుంది. ఎట్లా ఉన్నదో చూసి సంతృప్తి పడ్డం మాత్రమే కాకుండా ఎట్లా ఉండగలదో చూసే చూపును కూడా విమర్శనాత్మకత మనకు అందిస్తుంది. అందులో ఆ గొప్ప సౌందర్యం ఉంటుంది. మనం విప్లవాన్ని అట్లాగే చూడాలి. అప్పుడు మాత్రమే అది సమగ్రం అవుతుంది. నిరంతరాయం పురోగతికి దారితీస్తుంది. నిరంతరం చలనంలో ఉండటము, నిరంతరం ముందుకు పోతూ ఉండడం అనేదే బ్యూటీ. యథాతథంగా ఉన్నవి శిలాజాలుగా మారిపోతాయి. నిర్జీవంగా మారిపోతాయి. ఈరోజు నుంచి రేపటిలోకి, అనేకంలోకి మారే క్రమం ఏదైతే ఉంటుందో.. అందులో సౌందర్యం ఉంటుంది. విమర్శనాత్మకత అనేది ఒక విమర్శనాత్మక ఆచరణ కూడా. విమర్శ అనేది కేవలం పరిశీలన, విశ్లేషణ వరకే ఉండదు. అసలు ఆచరణే విమర్శనాత్మకంగా ఉంటుంది. ఒక అడుగు వేస్తాం.. నేల సరిగ్గా ఉందా లేదా పరిశీలిస్తాం. సరిగ్గా లేకుంటే పక్కకు ఇంకో అడుగు వేస్తాం. ఈ దారిలో ఇలా వెళ్దాం.. అని అనుకుంటాం, కొంత దూరం వెళ్తాం. ఈ దారి సరైనదో కాదో క్రిటికల్ గా చూస్తాం. మరొక దారి వెతుక్కుంటాం. అంటే మానవ ఆచరణ నిరంతరాయం విమర్శనాత్మకతతో సాగుతుంది అట్లా పురోగమిస్తూ ఉంటుంది. అందువల్ల అది సౌందర్యం అని చెప్పాలి.

ప్రభాకర్:
ఇటువంటి ఆచరణ నాకు మీరు రాసిన నవలలోని ఒక జీవితంలో నుంచి నేర్చు కోగలను అనిపించింది. అది రసూల్ అనే వ్యక్తి జీవితం నుంచి. రసూల్ ఉద్యమ క్షేత్రంలో ఉంటాడు. ఆ ఉద్యమం బస్తర్ ప్రాంతంలో జరుగుతుందనుకుందాం, వాళ్లు అక్కడ ఒక కలెక్టర్ ను కిడ్నాప్ చేశారు. మీరు కిడ్నాప్ అనలేదు. దాన్ని అరెస్టు అంటారు. ఆ తర్వాత అతన్ని ప్రజా కోర్టులో ప్రవేశపెడతారు. అక్కడ ‘అడమా’ అనే జనతన సర్కార్ న్యాయమూర్తి ఉంటాడు. అతను ఆదివాసి. ఉద్యమ క్రమంలో అతను తన తల్లిదండ్రులను కోల్పోయి ఉద్యమంలోనే పెరిగి పెద్దయి ఉంటాడు. ఇదంతా మీరు చాలా బాగా వర్ణించారు. ఈ రసూల్ అనే వ్యక్తి తన విప్లవ కార్యాచరణలో అమరుడైపోతాడు. ‘హిడ్మే’ అనే ఒక ఆదివాసీతో పెళ్లవుతుంది. ఆమె కూడా అక్కడ ఉద్యమంలో ఒక స్థాయిలో పనిచేస్తుంటారు. సరే, ఆ కథ అలా ఉండగా .. అరెస్టు చేసినటువంటి ఆ కలెక్టర్ పట్ల వాళ్లు ఎట్లా ప్రవర్తిస్తారు? మీరు అక్కడ జనతన రాజ్యంలో న్యాయ శాఖ వివరాలు అన్నీ చెబుతూ, అతని పట్ల ఏ విలువలతో మనం ప్రవర్తించాలి అని ఒక సంఘర్షణని అక్కడ చూపించారు. ఆచరణ అన్నప్పుడు క్రిటికల్ గా ఉండడం అన్నప్పుడు అతని పట్ల ఎంత విమర్శనాత్మకంగా ఉంటున్నారు ఎంత మానవీయంగా ఉంటున్నారు? ఈ సంఘటన ద్వారా మీరు ఈ సందేశాన్ని బలంగా అందించగలిగాను అనుకున్నారా? అసలు ఆ సంఘటన యథార్థమేనా? అసలు ఈ సంఘటనలన్నీ, చాలా సంఘటనలు శకలాలు శకలాలుగా ఉన్నాయి, ఇవన్నీ యథార్థంగా జరిగినటువంటి సంఘటనలే కదా! వీటిని ఈ నవల లో చూపించడానికి మీరు తీసుకున్నటువంటి పద్ధతి ఏంటి?

అడమా న్యాయ మూర్తిగా ఇచ్చిన తీర్పుకు ఒక అగ్రిమెంట్ వస్తుంది. అంటే జైల్లో ఉన్నటువంటి ఆదివాసీలందరినీ ఓ 300 మందిని, జోగాలు అనే ఒక నాయకుని విడుదల చేయాలి అని చెప్పి .. ఇటువైపు నుంచి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు .. ప్రభుత్వం అంగీకరించినట్టు అంగీకరించి వాళ్లను విడుదల చేయదు. కానీ వీళ్లు కలెక్టర్ ను విడిచిపెట్టారు. ఈ మానవీయమైనటువంటి గుణాలని కూడా క్రిటికల్ గా చూడొచ్చు. ఎందుకంటే వాళ్లు ప్రభుత్వం అట్లా ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంత మానవీయంగా ఉండాలి? అనుకోలేదు. మీరు మాట్లాడుతున్న క్రమంలో నాకు ఇట్లా అనిపిస్తుంది. ఇది కదా ఆచరణ అంటే, ఇది కదా విమర్శనాత్మకంగా ఉండడం అంటే, ఇది కదా జీవితాన్ని సౌందర్యాత్మకంగా చూడడం అంటే, అనిపించింది. విప్లవాచరణలో ఈ విలువల గురించి మీ మాటల్లో ఇంకా తెలుసుకోవాలని…

పాణి:
ఇట్లాంటి సన్నివేశాలు నిజంగా విప్లవోద్యమంలో జరిగినవి లేదా విప్లవంలోని జరగడానికి అవకాశాలు ఉన్నవి. ఇప్పుడు నవలలోంచి మీరు ప్రస్తావించిన కలెక్టర్ అరెస్ట్ ఉదంతం లాంటివి గత పది 15 ఏళ్ల కాలంలో రెండు మూడు సార్లు అయినా మనం చూసి ఉన్నాం. అంటే ప్రభుత్వ ప్రతినిధులు, వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నవాళ్లు.. విప్లవకారుల ప్రాంతంలోకి వెళ్లినప్పుడు వాళ్లను అరెస్టు చేశారు. ఇలాంటివి జరిగిన తరువాత వాళ్లను విడుదల చేయడానికి జరిగిన ఆ ప్రక్రియ కూడా మనకు తెలుసు. అయితే విప్లవకారులు తమకంటూ ఒక విలువల పునాది మీద ఒక ప్రత్యామ్నాయ సమాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. బీజరూపంలో అక్కడ క్రాంతికారీ జనతన సర్కారు ఏర్పడి కూడా ఉన్నది. దాన్ని వాళ్లు విలువల ప్రాతిపదిక మీద, క్రమాల ప్రాతిపదిక మీద, ప్రక్రియల ప్రాతి పదిక మీద నిర్మించారు. మీరు ప్రస్తావించిన ఆ ఎపిసోడ్ చూస్తే, కలెక్టర్ కు ఆయన పక్కన కేటాయించిన వ్యక్తి రసూల్ అనే కామ్రేడ్. ఆయన జనతన సర్కార్ ఎలా పని చేస్తున్నదో కలెక్టర్ కు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ప్రతిసారి, కలెక్టర్ కు జీవోలు గుర్తుకు వస్తాయి. ఆదేశాలు గుర్తుకొస్తాయి. ఎడతెరిపిలేని సమీక్షా అనిపించినాసమావేశాలు గుర్తుకొస్తాయి. చట్టాలు గుర్తుకొస్తాయి. వాటిని అతిక్రమించడం గుర్తు కొస్తుంది. వ్యక్తిగా తనకు అట్లా కాదు కదా ఇలా ఉండాలి అని వాటిని నిమిత్తరహితంగా చట్టాల ప్రకారం, ఆదేశాల ప్రకారం అమలు చేయవలసిన ఒక స్థితి తనకు ఎట్లా ఉండేదో గుర్తుకొస్తుంది. ఇక్కడ దానికి ప్రత్యామ్నాయం చేస్తున్నారు. అంటే ఒక అధికార వ్యవస్థకు ప్రత్యామ్నాయం. ఇందాక మనం విప్లవం అంటే రాజ్యాధికారం అని ఒక మాటగా చెప్పుకున్నాం కానీ రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ముఖ్యంగా మనలాంటి వెనుకబడ్డ దేశాలలో, బహుశా ప్రపంచంలోనే ఒక అరుదైన అనుభవం ఇక్కడ ఉంది. అది … ఏమిటంటే రాజ్యాధికారానికి సుదూరంగా ఉన్న కాలంలో .. ఇప్పటికి భారత ప్రజలు విప్లవ రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉన్నారు .. అలాంటి ప్రజలు ఎక్కడో ఒకచోట ఒక ప్రత్యామ్నాయ నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నారు.

అది మానవీయత విలువల మీద ఆధారపడిన ప్రత్యామ్నాయ విలువ. 300 మంది సాధారణ ఆదివాసీలు జైల్లో మగ్గుతున్నారు కాబట్టి వాళ్లను విడుదల చేయాలని, ఒక ఆదివాసీ నాయకున్ని విడుదల చేయాలని కండిషన్ పెట్టారు. దానిమీద ఒప్పందం కూడా జరిగింది. వీళ్లు కలెక్టర్ ను పంపించారు. అవతలి వాళ్ళు ఆదివాసీలను, తమ నాయకుడిని విడుదల చేస్తారా లేదా? చేస్తేనే మనం చేయాలి .. అని పోటీ పెట్టదల్చుకోలేదు. ఎందుకంటే ఒక అగ్రిమెంటును పాటించడం ప్రజాస్వామిక స్పృహ. అది ఒక పరస్పర ఒప్పందం. పైగా ఆ వ్యక్తి నేరుగా దోపిడీదారుడు కాదు. దోపిడి రాజ్య యంత్రాంగంలో ఒక ఉద్యోగస్తుడు. జీతానికి పనిచేసే వ్యక్తి. కాకపోతే ఓ కీలకమైన వ్యక్తి. అతనితో ఎట్లా వ్యవహరించాలి అనే విషయంలో వీళ్లకు కొన్ని విలువలు, ప్రమాణాలు ఉన్నాయి. కొన్ని పద్ధతులు ఉన్నాయి. కాబట్టి వాళ్లు వాటిని పాటిస్తారు. అక్కడ ఆ సందర్భంలో ఒక మాట ఉంటుంది. విప్లవకారులు అరెస్ట్ అయినప్పుడు .. అది అరెస్టు కూడా కాదు .. మాటుగాచి మూకుమ్మడిగా విరుచుకుపడి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి పోతారు. విపరీతంగా హింసలు పెడతారు. దాహం వేస్తుంది నీళ్లు పోయమంటే మూత్రం పోస్తారు. అది వాళ్ళ నాగరికత. కానీ వీళ్లు అరెస్టు చేసిన కలెక్టర్ ని దారి పొడవునా గౌరవంగా చూసుకున్నారు. తమ దగ్గర ఉన్న నీళ్లను ఆయనకు ఇస్తారు. ఆయనకు ఆకలి అవుతుందేమోనని తమ దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారం ఇస్తారు. ఆ రాజ్య యంత్రాంగంలో భాగమైన కలెక్టర్ ఈ రెండు యంత్రాంగాల మధ్య ఉండే తేడా ఏమిటి అని వివేకంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన మౌలికంగా మనిషి. ఆయన ఆ సీట్లో కూర్చున్నప్పుడు కలెక్టర్. ఇప్పుడు కలెక్టర్ గానే వీళ్లకు బందీ అయి ఉండవచ్చు. ఇప్పుడు బందీగా ఉన్న ఆయన ఒక వ్యక్తి.. మనిషి .. తోటి మనిషి. ఆ తోటి మనిషితో ఎలా వ్యవరించాలి అనేది వీళ్లకు తెలుసు. అట్లాగే ఆ మనిషి కూడా తాను కలెక్టర్ గా భేషజాలకు పోకుండా, ఇప్పుడు ఎట్లా వీళ్ళు వ్యవహరిస్తున్నారు? అని తెలుసుకోగల సహజమైన ఓ మానవ వివేకం ఆయనకు ఉంది. ఆయన అది గ్రహిస్తాడు. ఇదంతా ఏమిటి అంటే, మానవ జీవితంలో ఉండే సంబంధాల వ్యవహారం. మనుషుల మధ్య సంబంధాలు ఉన్నతీకరించబడడం. సంబంధాలు.. అనేవి సంబంధాల వ్యవస్థగా మారాలి. అప్పుడు మాత్రమే మనుషులకు హామీ ఉంటుంది. అది కొన్ని విలువల మీద ఆధారపడి ఉండాలి. కొన్ని ప్రక్రియల మీద ఆధారపడి ఉండాలి. కొన్ని ప్రమాణాల మీద ఆధారపడి ఉండాలి. ఇదంతా నవలకు ఆధారం.

రసూలే కాదు, అందులోనే తీర్పు చెప్పిన అడమా కూడా ఈ విలువలు పాటిస్తారు. ఎందుకంటే జనతన సర్కారుకి ప్రజలు ఎంచుకున్న న్యాయాధికారి ఆడమా. ప్రజలు ఓట్లు వేసి.. దొంగ ఓట్లు కాదు.. తప్పుడు ఓటింగ్ కాదు, ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి ఎన్నుకున్న న్యాయాధికారి ఆయన. అపాయింటెడ్ పోస్ట్ కాదు. పార్టీ నియమించేది కాదు. పంచాయతీ అయితే ఆ పంచాయతీ కమిటీ, డివిజన్ కమిటీ అయితే డివిజన్ స్థాయిలో ఉండే గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఎంచుకున్న వ్యక్తి. కాబట్టి ఆయన ఆ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేవాడి లాగా ఉండాలి. ప్రజల అవసరాలు, ప్రజల స్పందనలు గుర్తించగలిగే వాడై ఉండాలి. గుర్తించి తీర్పు చెప్పగలగాలి. పెద్దమనిషిగా ఉండగలగాలి. ఆ పాత్రను ఆయన పోషించాడు. పోషించే స్థానంలో ఉంటాడు. ఇది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. ఈ ప్రజాస్వామిక ప్రక్రియ జరగకుండా, ప్రజలకు అలాంటి అనుభవం లేకుండా రాజ్యాధికారంలోకి రావడం, రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. దాన్ని పొందే క్రమంలో, దానికి చేరుకునే క్రమంలో మనుషులు ఎలాంటి రాజకీయ సాంస్కృతిక శిక్షణ పొందవలసి ఉంటుంది? మనుషులు ఎలాంటి ఎరుకను పొందవలసి ఉన్నది? ఎలాంటి చైతన్యాన్ని విలువలను ప్రదర్శించవలసి ఉన్నది? అనేది చాలా కీలకమైన విషయం. ఇది లేకుండా, రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగే పని కాదు. జరిగినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇవేవి తెలియని వాళ్ళు కమ్యూనిస్టులను ఎద్దేవా చేస్తూ ఉంటారు. వీళ్లకు రాజ్యాధికారం తప్ప మరి ఏమి పట్టదు అని. రాజ్యాధికారం విప్లవకారులకు ఏకైక లక్ష్యమని ప్రచారం చేస్తుంటారు. రాజ్యాధికార స్వాధీనం పట్ల సోయిలేని కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. రాజ్యాధికారం గురించి మాట్లాడే వాళ్ళ పట్ల ఏమో ఈ ఆరోపణ ఉంది. రాజ్యాధికారం అనే ప్రక్రియ ఎన్ని అంచెలుగా, ఎన్ని తలాలుగా ఉంటుంది అని చెప్పాలని నాకు అనిపించింది.

ప్రభాకర్:
సుధను అరెస్టు చేసి జైల్లో పెట్టిన తర్వాత, ఇంటరాగేషన్ ప్రాసెస్ లో, అట్లాగే సాధనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు, సాధనను పెంచిన తండ్రి శ్రీనివాస్ అరెస్ట్ సందర్భంలో పోలీసుల ప్రవర్తన విప్లవకారుల ఆచరణకు భిన్నంగా .. ఉంటుంది. ప్రధాన్ కూడా అరెస్టై విడుదలైయ్యాక ఆయన్ని మూకుమ్మడిగా దాడి చేసి చంపేస్తారు. అంటే ఇంత కాంట్రాస్ట్ గా వాళ్లు – వీళ్లు ఉంటారు. శత్రువు మిత్రుడు అనేటువంటిమానవీయంగా పదాలు ఎట్లాగూ వస్తున్నాయి కాబట్టి – విప్లవచరణలో ఉన్న వాళ్లను తమ శత్రువులుగా చూసి, యుద్ధ ఖైదీలుగా కాకుండా శత్రువులుగా చూసి వాళ్లను నిర్మూలిస్తామనే ప్రక్రియ ఒకచోట, ఇక్కడ వీళ్లు ఇంత ఉండటం అనే ఈ రెండు వైరుధ్యాలను చాలా బాగా చూపించారనిపించింది. అంటే నలుపు తెలుపు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కదా! దీన్ని ప్రధాన్ ప్రత్యేకంగా పేర్కొంటూ ఉంటాడు .. ఆయన, చనిపోయే ముందు వరకు కూడా. ఆయన చనిపోతూ తన మరణాన్ని అంతిమ పరిష్కారంగానో అంతిమ యుద్ధంగానో కూడా ఆయన చూడడు. అంతిమ యుద్ధం అనేటువంటి ప్రకటనలు అటువైపు నుంచి వస్తుంటాయి గానీ విప్లవమనేటువంటిది నిరంతరమైనటువంటి ప్రయోగమని మీరు చాలాసార్లు ఇందులో ప్రస్తావించారు. విప్లవాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూస్తారని కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంలో ప్రధాన్ తన సహచరి ‘ఊరే’ ని గుర్తు చేసుకుంటూ వెన్నెల్లోకి వెళుతూన్నప్పుడు – వెన్నెలకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది కదా అని పక్కనే ఉన్న సుధ అంటుంది. అప్పుడు ప్రధాన్ ఊరేకి ప్రత్యేకమైన ఆకర్షణ కాదది, అది సహజమైన ఆకర్షణ అని గుర్తు చేసుకుంటాడు. అంటే అతను ఒక సౌందర్యాన్ని గాని ఒక జీవితాన్ని గాని ఒక విలువను గాని, కలెక్టర్ పట్ల వాళ్లు ప్రదర్శించినటువంటి అత్యంత మానవీయ విలువని గాని , ఈ విలువలను ఆదివాసీలు ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తారు అని, ఏ విలువైన కావచ్చు .. సౌందర్యం కావచ్చు .. విప్లవం కావచ్చు. విప్లవాన్ని ఆదివాసి ఎలా చూస్తున్నారు? విప్లవాన్ని బయట ఉన్నటువంటి సమాజం ఎలా చూస్తున్నది! అది ఒకటి ఈ పుస్తకంలో నాకు అంతర్లీనంగా అనిపించింది. అక్కడ మీరు చెప్పినటువంటి క్రాంతికారీ జనతన సర్కారు కావచ్చు, నందే అనే ఒక మహిళ జీవితం కావచ్చు, బిద్రీ అనే ఒక వృద్ధ మహిళ ఆదివాసి కావచ్చు, వీళ్లు విప్లవాన్ని ఎలా చూస్తున్నారు?

పాణి:
విప్లవం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమవుతుంది. (ప్రభాకర్: వెన్నెలంతా సహజంగా చూస్తున్నారా? అవసరంగా చూస్తున్నారా? ఆదర్శంగా చూస్తున్నారా?) అంటే విప్లవం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిపించడం అనేది ఆ వ్యక్తుల పరిమితి అని కూడా నేను అనుకోను. విప్లవంలోనే అలాంటి వైవిధ్యం ఉంటుంది. విప్లవంలో కొన్ని అద్భుతమైన ఆదర్శాలుంటాయి. ఆదర్శవంతమైన విలువలు, ఆదర్శవంతమైన లక్ష్యాలు, ఆదర్శవంతమైన భాగస్వామ్యం ఉంటుంది. వాళ్ల వ్యక్తిగత జీవితంలో విప్లవం అవసరం ఉందో లేదో పక్కన పెట్టేస్తే, విప్లవాన్ని ఒక ఆదర్శవంతమైన విషయంగా చారిత్రికమైన విషయంగా చూస్తారు. ఉదాహరణకి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మన వ్యక్తిగత జీవితంలో అంత అవసరం అయినది కాకున్నా, దాన్ని ఒక చారిత్రిక విషయంగా చారిత్రిక క్రమంగా చూస్తాం. అందులో ఎంతో కొంత ఆదర్శం ఉంది. అందులోని మనుషులను మనం ఆదర్శప్రాయంగా చూస్తాం. మరి కొంతమందికి చాలా సహజమైన విషయం కావచ్చు. ఎంత సహజమైన విషయంగా ఉంటుంది అంటే, వెన్నెల మనలాంటి వాళ్లకు ఒక ప్రత్యేకమైన విషయం. ఓ సందర్భం వెన్నెల కాచే రోజు. కానీ అడవుల్లో పుట్టి పెరిగిన వాళ్లకు, తొలి రోజు నుంచి పున్నమి దాకా అన్ని రకాల వెన్నెలదశలను చూసిన వాళ్లకు అది చాలా సహజమైన విషయం గా ఉంటుంది. అట్లాగే విప్లవం కూడా వాళ్లకు అంతే సహజమైన విషయం.

ఓ నలభై ఏళ్ల కిందట విప్లవోద్యమం ఇక్కడ నుంచి వెళ్లి అక్కడ పనిచేసిన తొలి రోజుల్లో వాళ్లకు ఎట్లా అనిపించిందో ఈరోజూ అట్లే అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం లక్షల బలగాలను మోహరించి, ఆకాశం నుంచి బాంబులు వేస్తూ ఉంటే కూడా వాళ్లకు విప్లవం అంతే అనిపిస్తుంది. కాబట్టి ఆదివాసుల వైపు నుంచి విప్లవాన్ని చూసామంటే అది చాలా సహజమైన విషయంగా ఉంటుంది. జీవితంలో ఉండగల విషయంగా కనిపిస్తుంది. బహుశా ఆదివాసులు అట్లా చూస్తారేమో అని స్ఫురించింది. విప్లవం జీవితంలో ఉండగల విషయం. జీవితంలో భాగమైన విషయం. వెన్నెలలాగా జీవితంలో విప్లవం పురోగమిస్తూ ఉంటుంది. మళ్లీ నీడలు వస్తాయి. మళ్లీ వెలుగు వస్తుంది. మళ్లీ క్షీణ చంద్రుడు వస్తాడు. మళ్లీ పున్నమి చంద్రుడు వస్తాడు. నిరంతరాయమైన క్రమంలో మానవులు ఎట్లా మారుతారు ? ఏమవుతారు?

నోరు తెరచి మాట్లాడడానికి చేతకాని మనుషులు, వందల వేల ఏండ్ల కింద ఎక్కడో ఉండిపోయిన మనుషులు, ఈరోజు ఆధునిక ప్రజాస్వామ్యాన్ని విప్లవాన్ని, కలల్ని వాటిని నిజం చేయగల స్థాయికి మనుషులు ఎదుగుతూ వచ్చారు . ఈ మధ్యలో చాలా చీకటి రాత్రులు ఉంటాయి. ఇందులో చాలా వెన్నెల పూచిన రోజులు కూడా ఉంటాయి. చాలాసార్లు పడిపోయి ఉంటారు. చాలాసార్లు లేచి నిలబడి ఉంటారు. కాబట్టి విప్లవాన్ని వాళ్ళ వైపు నుంచి చూస్తున్నాం.
అందుకే ఈ నవలలో సాధన మరొక అర్థంలో ‘జెన్నీ’ తో అంటుంది, ‘విప్లవోద్యమం ఉన్నది అని, లేదని , బలంగా ఉన్నదని, బలహీనంగా ఉన్నదని నీవు నేనూ మాట్లాడు కోవడం కాదు. ప్రజల వైపు నుంచి విప్లవాన్ని చూద్దాం. మనం మాటలు నేర్చుకున్న వాళ్ళం. మనకు భాష వచ్చు. విషయాలు చాలా సూత్రీకరించి మాట్లాడుతాం’.. అంటుంది. దానికి జెన్నీ ‘ప్రజలు విప్లవాన్ని కోరుకోవడం లేదు కదా?’ అంటుంది. అప్పుడు సాధన ఏమంటుందంటే.. ‘అవసరం నిజమైతే, వాళ్లకు అది మరింత సృజనాత్మకంగా, అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇంకా ఎక్కువ పని చేయవలసి ఉంటుంది దానికోసం.’

అంటే దళితులకైనా ఆదివాసీలకైనా మైనారిటీలకైనా మొత్తంగా కార్మిక వర్గానికైనా, విప్లవాన్ని మన వైపు నుండి కాకుండా వాళ్ల వైపు నుండి, వాళ్ళ జీవితావసరం నుండి చూడాలి. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో వాళ్లకు ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు. దాని గురించిన స్పృహ ఉండక పోవచ్చు. కానీ వాళ్ల జీవితాలను బాగుచేయ గలిగిన ఒక రాజకీయ సామాజిక సాంస్కృతిక ప్రక్రియ విప్లవం… అంటున్నామంటే, అది ఒక మానవీయ ప్రక్రియ అంటున్నా మంటే, ఆ పక్క నుంచి చూసి నప్పుడు అది గొప్పగా, సౌందర్య భరితంగా కనిపిస్తుంది.

ప్రభాకర్:
నవలలో రసూల్ ఉద్యమ క్షేత్రం నుంచి తన తల్లికి రాసిన ఉత్తరాలు సాధన తెచ్చి ఇస్తుంది అతని తల్లి ‘సుల్తానా’కు. ఆమెకు ఇంకో కొడుకు కోడలు మనుమడు ఉన్నారు. వీళ్ళందరితో జీవిస్తూ ఉంటుంది. ఆ తల్లికి అతడు రాసిన ఉత్తరాలు ఆమె చదువుతూ తన కొడుకైన కామ్రేడ్ రసూల్ కు దగ్గర అవుతుంది. అంటే కొడుకు ఆచరణకు దగ్గరవుతుందామె. తను కూడా విప్లవంలో ఒక భాగమేమో అన్న భావనకు గురవుతుంది. నాకు అక్కడ గోర్కి నవల ‘అమ్మ’ చదువుతున్న ఫీల్ కలిగింది. అంటే .. గోర్కి అమ్మ ఎట్లా అందరికీ అమ్మో సుల్తానా కూడా అందరికీ అమ్మ అని అనిపించింది. ఆమె దుఃఖం ఆ ఉద్వేగం అవన్నీ .. ఆ వ్యక్తిని మీరు చూసుంటారు! రసూల్ ని చూశారో లేదో కానీ సుల్తానాను అయితే చూసుంటారు, ఆమె జీవితం అలా ఉండగా ఆ కథను ప్రధానంగా నవల నడపలేదు. మొదట ఆ కథే ప్రధానంగా కనిపించింది నాకు. చివరికి హిడ్మే తన అత్తగారి దగ్గరికి రావడం ఆ అత్త కోడళ్ళ కలయిక, ఆ కలయికలో నాకు కొంత సాంత్వన లభించింది, ఇది కదా కలయిక అంటే, అనిపించింది. ఒక ఆదివాసి యువతి ఒక ముస్లిం యువకుడ్ని తన కామ్రేడ్ని, పెళ్లి చేసుకొని ఏమీ తెలియనటువంటి తన అత్త దగ్గరకొచ్చి, ఆమెతో వీడ్కోలు తీసుకుని వెళ్లడం .. ఇది ప్రధానమైన కథ అనిపించింది నాకు.

నవల లోపల కథలు మరికొన్ని కూడా ఉంటాయి. సాధనను పెంచినటువంటి సుధ కథ ఉంది. రమణ అని మరొక అతని కథ అతను విప్లవోద్యమం నుండి బయటికి వచ్చి కుల అస్తిత్వ రాజకీయాల్లోకి వెళ్తాడు. ఇలా చాలా కథలు ఉండగా .. మీరు ‘సదాశివ’ అనే ఒక 92 ఏండ్ల స్వాతంత్ర్యోద్యమకారుని దగ్గర అతని మనుమని దగ్గర మొదలుపెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో సమైక్య రాష్ట్రాన్ని బలపరిచిన వ్యక్తి సదాశివ. అతని దగ్గర మొదలుపెట్టి అతనిలోని వైరుధ్యాలను గురించి మాట్లాడుతూ, అతని గతాన్ని నెమరు వేసుకోవడం దగ్గర మొదలుపెట్టి చివరికి మళ్ళీ అతని దగ్గరే ఎందుకు ముగించారు?
అంటే విప్లవోద్యమం కేంద్రంగా ఉండగా, ఆ భావన, ఆ ఆలోచన ఆచరణ కేంద్రంగా ఉండగా, కథను ప్రధాన్ దగ్గరో సాధన దగ్గరో, రసూల్ దగ్గరో రసూల్ తల్లి దగ్గరో, మరొక చోటో.. ఈ అనేక వైపులలో ఎక్కడి నుంచో కాకుండా ఇక్కడి నుంచి ఎందుకు కథను ప్రారంభించారు! ఎందుకు ముగించారు? అంతేకాదు చరిత్ర కొనసాగుతూనే ఉంటుంది అని చెబుతూ ముగించారు. దీని వెనకాల అంతస్సూత్రం ఏమిటో మీ నుండి తెలుసుకోవాలి అని…

పాణి :
ఇక్కడ స్కీమ్ తో పాటు అవగాహన కూడా ఉన్నది. స్కీం అన్నామంటే నవల అమరికకు సంబంధించిన సాంకేతిక విషయం, లేదా శిల్ప విషయం కావచ్చు. అంత మాత్రమే కాదు. నిజానికి దృక్పథంతో ముడిపడే శిల్పం కూడా ఉంటుంది. అట్లా చూసినప్పుడు సదాశివంతో మొదలై సదాశివంతో ముగియడం కేవలం శిల్ప విషయమే కాదు. ఒక అవగాహన విషయం కూడా చెబుతాను. మనలాంటి దేశంలో, కార్మిక వర్గం ప్రబలంగా రూపొందడానికి అవకాశం లేనటువంటి సమాజంలో, చాలా సముదాయాలు ఉన్న సమాజంలో, చాలా భిన్నమైన ప్రగతిశీల ఆలోచన ధారలు ఉన్న సమాజంలో విప్లవం ఎట్లా విజయవంతమవుతుంది? ఎవరు విప్లవాన్ని నిర్వహిస్తారు? ఎవరెవరికి అందులో ఎలాంటి పాత్ర ఉంటుంది ? వాళ్ళు కార్మికవర్గ చైతన్యంతో ఎట్లా విప్లవం చేస్తారు? అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి. మన దేశానికి మార్క్సిజం రావడానికి కంటే ముందు ఇక్కడ అనేక ప్రగతిశీల భావాలు ఉన్నాయి. ఎక్కడో వేమన బసవేశ్వరుల నుంచి చార్వాకుల నుంచి మనదైన ప్రగతిశీల ధారలు ఉన్నాయి. ఇట్లాంటి సమాజంలో విప్లవ పార్టీ నాయకత్వాన విప్లవం చేస్తున్న కార్మిక వర్గం, రైతాంగం చుట్టూ ఉన్న విశాలమైన ప్రజా బాహుళ్యం పాత్ర కూడా ఉంటుంది. వాళ్లు లేకుండా.. మనం వాళ్లను తటస్థులని కూడా చెప్పలేం, ఎందుకంటే – వాళ్లు ఒకసారి తటస్థంగా ఉంటే ఉండవచ్చు, కానీ వర్గ సంఘర్షణ తీవ్రమయ్యే క్రమంలో, రాజకీయ పరిణామాలు వేగవంతంగా, మారుతూన్నప్పుడు, ఒక స్టాండ్ తీసుకుంటారు. అలాంటి అనేక సముదాయాల భాగస్వామ్యం లేకుండా, అంతిమంగా వాళ్ళ మొగ్గు లేకుండా విప్లవం విజయవంతం అవుతుందని చెప్పలేం. కాబట్టి ఇక్కడ ప్రధాన్ ఎట్లా ఉంటాడో సదాశివం కూడా ఉంటాడు. జమీల్ ఎలా ఉంటాడో బిస్మిల్ కూడా ఉంటాడు.

ఈ నవలలో జమీల్ అని ఒక కార్యకర్త ఉంటాడు. బిస్మిల్ నేపథ్యం వేరే. బిస్మిల్ నవలంతా చాలా ఫెరిఫెరల్ గా ఉన్నట్లు అనిపిస్తాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ జమీల్ అనే కుర్రవాడు చాలా చిన్న వయసులో వచ్చి విప్లవంలో పడ్డాడు. . అయితే బిస్మిల్ లాంటి వాళ్ళ భాగస్వామ్యం లేకుండా విప్లవం ముందుకు పోదు. సదాశివం నేపథ్యంలోకి చూస్తే .. టెర్రరిస్టులు అని ముద్ర మోసిన పాత జాతీయోద్యమకాలం నాటి విప్లవకారుల పరంపరలోనో లేదా ఆ భావజాలం లోనో, ఆ ప్రభావంలో వచ్చిన చివరి తరానికి చెందిన వాడు సదాశివం. ఆయన గాంధేయ వాదులను ఒప్పుకోడు. కమ్యూనిస్టులనూ ఒప్పుకోడు. చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళ ప్రభావంలో వచ్చి, ఆ తర్వాత సొంత అభిప్రాయాలతో, అటు కాంగ్రెస్ మీద, ఇటు కమ్యూనిస్టుల మీద కోపమూ ఉండే ఒక ప్రత్యేకమైన పర్సనాలిటీ ఆయన. అలాంటివాళ్లు చాలామంది ఉంటారు. తెలంగాణ ఆంధ్ర విభజన వచ్చినప్పుడు సమైక్యవాదం వైపు ఆయన మొగ్గు చూపుతాడు. మనవడేమో రాయలసీమ వాది. ఆయనకు ఎక్కడో జాతీయోద్యమానికి సంబంధించిన సమైక్యత అనే భావన పనిచేసింది. కానీ మనవడు చాలా క్రిటికల్ అప్రోచ్ ఉన్నటువంటి వాడు. సదాశివం గారి విమర్శనాత్మకతకు సాధన చాలా ముచ్చట పడుతుంది. ఆయన భావధారతో చాలా విభేదిస్తూ కూడా.

ప్రభాకర్:
మీరు విమర్శనాత్మకతే విప్లవ సౌందర్యం అన్నారు .. దానికి అతన్నికూడా ప్రతీకగా తీసుకున్నారు కదా! ఎందుకంటే ఆయన తన గతం పట్ల కూడా క్రిటికల్ గా ఉంటాడు, నిన్నటి ఆచరణ పట్ల కూడా క్రిటికల్ గా ఉంటాడు. అంటే విప్లవోద్యమంలో ఉన్న ప్రధాన్ ఎంత క్రిటికల్ గా ఉంటాడో సదాశివం కూడా అంత క్రిటికల్ గా ఉంటాడు. చనిపోయే నాటికి తన 97 ఏళ్ల వయసులో కూడా. అందుకని అతనితో మొదలుపెట్టి అతనితో ముగింపు చేశారా? ‌

పాణి:
అందువల్లనే! నిజంగా కూడా ప్రధాన్ వంటి వాళ్ళ నాయకత్వం విప్లవానికి వ్యాన్ గార్డ్ పాత్ర పోషిస్తుంది. అనుమానమే లేదు. విప్లవానికి అవసరమైన ఒక వ్యూహాన్ని నిర్మిస్తారు .. విప్లవాన్ని ముందుకు తీసుకుపోగల డైనమిజాన్ని ప్రదర్శిస్తారు వాళ్ళు.

అయితే అలాంటి వాళ్ళ చుట్టూ సదాశివం లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆయన పాత తరానికి ప్రతినిధి కావచ్చు గాని, ఈ కొత్త తరానికీ ఆదర్శం. ఎన్నో మినహాయింపులతో చందన్ కూడా అందులో భాగమే. జెన్నీ కూడా. అయితే వీళ్ళందరి కంటే కూడా చాలా గంభీరమైన వ్యక్తిత్వం కలిగి ఉండడము, చరిత్రతో ముడిబడి ఉండటం సదాశివం ప్రత్యేకత. కాబట్టి ఆయనతో నవల మొదలవుతుంది. ఆయనతోనే ముగుస్తుంది. అందుకే చివరలో సాధన, ‘చరిత్రలో ఆయన ఇక భౌతికంగా ఉండరు. చరిత్ర మాత్రం ముందుకే వెళుతుంది. నువ్వు నేను మనమందరము అందులో ఉంటాం.’ అని అంటుంది. దాంతో నవల ముగుస్తుంది.

ప్రభాకర్:
అంటే అది ఒక ప్రతీకగా తీసుకున్నారా? ‘చరిత్ర కొనసాగుతుంది’ అని చెప్పడానికి ఆయనతో ప్రారంభించి ఆయన తోనే ముగించారా?

పాణి:
అవును! వేరువేరు ప్రజానుకూల భావజాలాలు ఉన్నవాళ్లకు విప్లవంలో చోటు ఉంటుంది. సదాశివం సొంత ప్రయోజనాలు లేనివాడు. ఆయన త్వరపడి సమైక్యవాదాన్ని బలపరిచిన నాడు కూడా ఆయనకు అందులో సొంత ప్రయోజనాలు ఏమీ లేవు. చిట్ట చివరికి ఆయన ఆసుపత్రిలో మరణశయ్యపై ఉండి, బయట ఓ పదిమందితో ఓ చిన్న ఆందోళన జరుగుతూ ఉంటే, పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి అవకాశం లేక వాళ్ళు .. సుప్రీం కోర్టు ప్రకటించిన ఒక హిందుత్వ తీర్పుకు వ్యతిరేకంగా రోడ్డు మీద ఆందోళన చేయబోతూ ఉంటే ఆయన తన మనవడితో అక్కడికి సందేశం పంపిస్తాడు. మందుల చిట్టి వెనుక.. ఆయనకు పెన్ను పట్టుకొని రాయడానికి చేతగాక మనవనికి చెప్పి రెండు వాక్యాలు రాయించి పంపిస్తాడు. కోర్ట్ తీర్పు మీద తన డిసెంటును వినిపించాలి. అది తన క్రిటికల్ అప్రోచ్. ఈ లోకం నడుస్తున్న తీరు పట్ల నాకు ఏకాభిప్రాయం లేదు అని చనిపోయే పరిస్థితిలో కూడా చెప్పే పెద్దమనిషి ఆయన . సమాజం పట్ల, ప్రభుత్వం పట్ల, పాలనా రీతుల పట్ల తన విమర్శను వినిపించాలను కుంటాడు. అంటే విమర్శనాత్మకత అనేది మనుషులందరిలో ఉండే ఒక లక్షణం. అందుకే మనకి ఆయన చాలా అందంగా కనిపిస్తాడు. మీరు ఆశ్చర్యపోతారు! మొన్నీమధ్య నెల రోజుల కిందట, నేను కర్నూల్ లో ఓ ప్రాంతానికి వెళుతున్నా. మీరు నవలలో ఆ లొకేషన్ ని గమనిస్తారు. పాత కర్నూలు కోర్టు దగ్గరి ప్రాంతం లోనే సదాశివం ఇల్లు ఉన్నది, నేను హడావిడిగా పోతున్నాను. రద్దీగా ఉండే రోడ్డుమీద బండిమీద పోతూ ఉంటే… నాకు ఓ క్షణం పాటు ‘సదాశివం గారికి ఆరోగ్యం బాగోలేదు కదా! ఎలా ఉన్నారో! ఓసారి వెళ్లొస్తే…’ అనిపించింది. ఆయన క్రిటికల్ అప్రోచ్ మనల్ని అంతగా వెంటాడుతుంది. హేతుబద్ధమైన ఆయన జీవన వైఖరులు, మనుషుల పట్ల విలువలతో కూడిన వ్యవహార శైలి మనల్ని ఆకట్టుకుంటుంది. నిజానికి అది సమాజంలో ఉంది. ఒక ధారగా ఉన్నది. అది మన సమాజపు సంప్రదాయం. అది లేకుండా విప్లవం సాధ్యం కాదు. అందుకని ఫిజికల్ గా 97 ఏళ్ల పెద్దమనిషి చనిపోయాడు గానీ, ఆయన లాంటి వాళ్లు అందించిన విమర్శనాత్మకత, ఆచరణ చరిత్రలో ఉండిపోతాయి. ఆయన చాలా సీరియస్ ఆలోచనలు ఉన్నవాడు.. యువకుడుగా ఉన్నప్పుడు… చివరి రోజుల్లో కూడా. ఆయన ఎంత ఆచరణశీలి అంటే, తన ఆత్మ కథను రివైజ్ చెయ్యాలి అని అనుకుంటాడు. తను చెప్పకుండా వదిలేసిన విషయాలు ఇప్పుడు తప్పకుండా చెప్పి తీరాలి అనుకుంటాడు. ఆ ఖాళీలు భర్తీ చేసి తన ఆత్మ కథను సమగ్రం చేయాలి అనుకుంటాడు. అది కూడా ఒక ఆచరణ. అలాంటి ఆచరణశీలురు, ఆలోచనాపరులు ఈ సమాజంలో ఉండాలి. ఉన్నారు. ఉండగలరు. అక్కడ కూడా మళ్లీ ఇలాంటి వాళ్లు ఉన్నారా? ఉంటారా? సదాశివం అనే మనిషి లేకపోవచ్చు కానీ ఉండగల పాత్ర, ఉండగల ఆలోచనా ధార అంటాను.

ప్రభాకర్:
అంటే .. మనుషులు ఉండకపోవచ్చు గాని భావనలు ఉంటాయి కదా, భావనలు కొనసాగుతూ ఉంటాయి కదా..

పాణి:
తప్పనిసరిగా. అందుకే ఈ పాత్రలు ప్రతీకలు మాత్రమే కావు. పాత్రలు భావనలు కూడా నేమో! అని నాకు అనిపిస్తుంది. మీ వంటి విమర్శకులు చెప్పాలి. ఎవరో .. అవి ప్రతీకలా! నమూనాలా ? అంటే.. కాదు అవి భావనలు అన్నాను.

ప్రభాకర్:
తాత ఉన్నాడు, తాతకో మనుమడున్నాడు. ఆ మనుమడు తాత తనకు ‘బిస్మిల్’ అనే ముస్లిం పేరు పెట్టినందుకు బాధపడేటువంటి పరిస్థితి నుంచి తర్వాత నెమ్మదిగా, ఉద్యమాన్ని అర్థం చేసుకునే వైపు ఎదిగాడు. రెండు ఉద్యమాలు – దగ్గరగా ఉన్నటువంటి రాయలసీమ ఉద్యమాన్ని, తనకు దూరంగా ఉన్నటువంటి విప్లవోద్యమాన్ని రెండింటిని అర్థం చేసుకునే క్రమంలో- అంటే, సాధారణంగా నవలలో పాత్రలు క్యారెక్టర్స్ పరిణతి కి గురి కావలసినటువంటి సందర్భంలో, అలాంటి పరిణతి చెందినటువంటి పాత్ర బిస్మిల్. అయితే ఇక్కడ నాకు ఇంకో మాట అనిపించింది. సదాశివం కూడా విప్లవోద్యమంలో భాగం కావాలని భావిస్తూ మీరు కొనసాగింపుగా రాశారా? అనేక వైపుల నుండి నిర్మించే ఐక్య సంఘటనలో అతను కూడా భాగమై తన పాత్రను పోషిస్తాడు అనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ ని తీసుకొచ్చారా? నాకేమనిపించింది అంటే సాధారణంగా విప్లవంలో మూడు దశలు ఉంటాయంటారు . ఒకటి పార్టీ నిర్మాణం, రెండోది ప్రజా సైన్యం, మూడోది ఐక్య సంఘటన అనుకుంటాం. ప్రధాన్ ఒక మాట అంటాడు : ‘మూడో ఇప్పుడు ప్రధానమైనది’ అని. అంటే ఐక్య సంఘటనలు నిర్మించుకోవాలని. భారతదేశం ఫాసిస్టు దశలోకి చేరుతున్న ఆ దశలోకి నడుస్తున్న దాన్ని ప్రతిఘటించాలంటే, ఐక్య సంఘటనలు అవసరం. ఈ కారణంగా కూడా సదాశివంను అనేక వైపుల నుంచి ఐక్య సంఘటనను నిర్మించడంలో భాగంగా ప్రధానంగా తీసుకున్నారా?

పాణి:
అంటే .. వయసు రీత్యా సదాశివం ఏమి చేయక పోవచ్చు గాని ఆయన ఒక భావన అనుకున్నప్పుడు తప్పకుండా భాగం అవుతాడు. ఎందుకంటే ఫాసిజం విషయంలో ఆయన చాలా ధృఢంగా మాట్లాడుతాడు. చివరి రోజులల్లో. అసలు ‘మన కాలంలో మన కళ్ళ ముందు ఇట్లా జరిగిపోతుందని నేను అనుకోలేదు’ అని చాలా దుఃఖపడతాడాయన.
‘ఇలాంటి వాడు, ప్రధాని అవుతాడని, నేననుకోలేదు.’ అని చాలా బాధపడతాడు. ‘ఎంతోమందిని చూశాను ఇలాంటి వాడు ప్రధాని కావడమేమిటి? ఈ దేశానికి!’ అని అంటాడు. అంటే చివరిదాకా కూడా ఫాసిజం విషయంలో, దృఢమైన వైఖరులు సంతరించుకుంటూ వచ్చాడాయన. తప్పనిసరిగా ఫాసిస్టు వ్యతిరేక యుగంలో, ఒక ఐక్య సంఘటనకు చాలా కీలకమైన ప్రాధాన్యత ఉన్నది. విప్లవంలోనే కాదు, ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో కూడా. అసలీ ఫాసిజాన్ని, ఫాసిస్టు యుద్ధాన్ని ఓడించే క్రమంలోనే, విప్లవోద్యమం ఒక ముందడుగు వేయగలుగుతుంది. అందువల్ల అటువంటి వాళ్ళు తప్పనిసరిగా అవసరం. ప్రధాన్ నిర్మాణ దక్షుడు కాబట్టి ఉద్యమ నిర్మాత, నాయకుడు కాబట్టి ఆయనకు ఆ క్లారిటీ ఉంది.

ప్రభాకర్:
సదాశివం గురించి మాట్లాడే సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక మాట అడగాలి: విప్లవోద్యమం కేంద్రంగా నవల నడిచినప్పటికీ రాయలసీమ అస్తిత్వ చైతన్యం నేపథ్యంలో నుంచి దాన్ని నిర్వహించారు. ఈ చైతన్యాన్ని పప్పూరు రామాచార్యులు దగ్గర నుంచి చరిత్రలోకి వెళ్లి వర్తమానం వరకు అనేక దశల్ని విశ్లేషించారు. ప్రాంతీయ అస్తిత్వాన్ని విప్లవోద్యమంతో కలిపి ముడివేస్తూ నవల ఇతివృత్తాన్ని నిర్వహించడంలో ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? వైరుధ్యాల క్రమాల మధ్య పరిష్కారం సాధించడంలో ఏమైనా ఇబ్బంది ఎదురైందా?

పాణి:
ఎలాంటి ఇబ్బంది పడలేదండి. ఈ యాభై ఏళ్లలో వచ్చిన విప్లవ సాహిత్యంలో మీకు అనేక వైరుధ్యాల చిత్రణ కనిపిస్తుంది. వైరుధ్యాల పరిష్కార క్రమాలు కూడా కనిపిస్తాయి. వాటి సమన్వయమూ కనిపిస్తుంది. దేనికంటే, విప్లవమంటేనే మానవ జీవితంలోని వైరుధ్యాలను సరిగా అర్థం చేసుకోవడం, వాటి వల్ల బాధితులైన ప్రజలు తమ సమస్యల గురించి తెలుసుకొని పరిష్కారానికి సిద్ధం కావడం. విప్లవోద్యమ ఆచరణను చూస్తే ఈ సంగతి మనకు అర్థమవుతుంది. ప్రజల మధ్య ఉన్న వందల, వేల సమస్యలను విప్లవకారులు పరిష్కరిస్తూ ఉద్యమ నిర్మాణం చేస్తుంటారు. అవి ఆలూ మగల మధ్య, అన్నదమ్ముల మధ్య, రైతుకు కూలీకి మధ్య, అగ్రకులస్థులకు, పీడిత కులాలకు మధ్య సమస్యలు విప్లవకారుల దగ్గరికి వస్తుంటాయి. ఈ సమస్యలు మన సమాజంలోని వర్గ వైరుధ్యాలను, వాటికి ఉండే కుల, మత, పితృస్వామ్య స్వభావాలను తెలియజేస్తుంటాయి. వాస్తవికత గురించి మనం ఎన్ని సిద్ధాంతాలు తయారు చేసుకున్నా, ఆచరణలోనే వాస్తవికత ఎట్లా ఉన్నదో, ఎందుకు అట్లా ఉన్నదో తెలుస్తుంది. ఆచరణలోనే దాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఈ విప్లవాచరణ నుంచి విప్లవ దృక్పథాన్ని వివరించుకుంటే దాని వైశాల్యం మనకు అర్థమవుతుందని నేను నమ్ముతాను. రాయలసీమ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యల మీద పని చేసే రాయలసీమ వాదులకు అది ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నీళ్లు, ప్రాజెక్టులు సాధించుకొనే అస్తిత్వ పోరాటం. ఇది పూర్తిగా నిజం. అదే సమయంలో ఆ ప్రాంతంలోని విప్లవ కార్యకర్తలకు మాత్రం అది విప్లవంలో భాగమే. ప్రభుత్వం మీద, దాని విధానాల మీద వత్తిడి తెచ్చి కొన్ని సమస్యలు సాధించుకోడానికి ప్రజలను సిద్ధం చేయడం అనేది వ్యవస్థను మార్చే పోరాటానికి చాలా అవసరం. రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలకు ఆ ప్రాంతంలోని, ఆంధ్రా ప్రాంతంలోని పాలకవర్గం కారణం. వాళ్ల విధానాలు కారణం. రాయలసీమ ఉద్యమానికి సుమారు వందేళ్ల చరిత్ర ఉందండి. ఇంత కాలం జరిగిన పరిణామాలను విశ్లేషిస్తూ పొతే మనకు ఆంధ్రా, రాయలసీమ పాలక వర్గాల చేతిలో ఒక ప్రాంతంగా రాయలసీమ ఎట్లా దగా పడిందో తెలుస్తుంది. అది వర్గ విశ్లేషణే అవుతుంది.

కాబట్టి విప్లవకార్యకర్తగా రాయలసీమ ఉద్యమంలో పని చేయడానికి నాకు ఏ ఇబ్బందీ కలగనట్టే, రాయలసీమ అస్తిత్వ ఉద్యమాన్ని, విప్లవోద్యమాన్ని ఈ నవలలో ముడి వేయడానికి రచయితగా కూడా ఏ ఇబ్బందీ కలగలేదు. కాకపోతే మీరు అడిగినదానికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రాయలసీమ ఉద్యమ స్వభావం, ప్రత్యేకతల వల్ల అక్కడ విప్లవ పరిభాష అవసరం ఉండదు. కాబట్టి దానికి తగినట్లే మాలాంటి వాళ్ళం మాట్లాడుతూ ఉంటాం. అదే తగినది. అవసరమైనది. ఇది రాజకీయ ఆచరణ శిల్పం. మీరు ఈ నవలలో ఇది గమనించి ఉంటారనుకుంటా. విప్లవ రాజకీయాలు ఉన్న సుదర్శన్‌గాని, సాధనగాని రాయలసీమ ఉద్యమ సందర్భాల్లో ఎట్లా మాట్లాడతారో, ప్రవర్తిస్తారో తెలుసుకోవచ్చు. పాలకవర్గ పంథాకు దూరంగా, రాయలసీమే సర్వస్వంగా పని చేసే వెంకటరెడ్డిలాగే వీళ్లూ మాట్లాడతారు. అదే ఓట్ల ప్రయోజనం ఆశించే కొండారెడ్డిలాంటి రాయలసీమవాదితో పోల్చితే సుదర్శన్‌, సాధన చాలా డిఫరెంట్‌ అండర్‌ ష్టాండింగ్ తో ఆ ఉద్యమంలో ఉంటారు. ఈ ఆచరణాత్మక రాజకీయ శిల్పం వల్ల రాయలసీమ, దండకారణ్యం కలిసిపోతాయి. కర్నూలు జిల్లాలో నీళ్లు లేక, అప్పులపాలైన రైతుల ఆత్మహత్యలు, ఈ వ్యవస్థ మౌలిక మార్పు కోసం విప్లవంలోని ఎన్‌కౌంటర్‌ హత్యలు ఒకే మానవ విషాదాన్ని కలిగిస్తాయి. నవలను ఈ దృక్పథ అన్వయమే నడిపిందని అనుకుంటున్నా. ఇలాంటి అన్వయం రాజకీయాల్లో ఎట్లా ఉంటుందో నేను నల్లమల విప్లవోద్యమంలో నేరుగా చూశా . ఒకరకంగా అది చిన్న పోరాటం అనిపిస్తుంది కానీ, అది చాలా ప్రయోగాలు చేసింది. ఒక్క నల్లమలే కాదు. రాయలసీమలో జరిగిన విప్లవోద్యమం, ముఖ్యంగా అనంతపురంలో విప్లవోద్యమం భూస్వామ్య వ్యతిరేక, మార్కెట్ వ్యతిరేక పోరాటమంతా స్థానీయత మీద ఆధారపడి సాగింది. మనం ప్రాంతీయ అస్తిత్వ పోరాటాల జాబితాలో గుర్తించే అన్ని సమస్యల మీద ప్రజలందరూ చేయగల పోరాట రూపాలను విప్లవోద్యమం నడిపింది. చట్టబద్ధ పోరాటాల నుంచి సాయుధ రూపాల దాకా. విప్లవ ప్రజా పంధాను అమలు చేయడం ఎంత సృజనాత్మకంగా ఉంటుందో రాయలసీమ విప్లవోద్యమానికి నల్లమల ఒక ప్రయోగశాలగా, ఆచరణశీలిగా చాలా అనుభవాలను అందించింది. విప్లవోద్యమానికి ఇలాంటి గొప్ప అన్వయ సంపద ఉన్నప్పుడు ఒక రచనలోకి దాన్ని తేవడం ఇబ్బంది ఎందుకు అవుతుంది ?

ప్రభాకర్:
సాధన రాయలసీమ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక సందర్భంలో అక్కడికి వెళ్లి వాళ్లను పలకరిస్తుంది. ఆశీర్వాదం అనే రైతు చనిపోతాడు. అతని తమ్ముడు జార్జ్ చదువుకున్నటువంటి వ్యక్తి, అతను వ్యవసాయంలో ఉన్నటువంటి కష్టాలు – నీటి కష్టాలు కరువు, వీటన్నిటి – గురించి మాట్లాడుతూ .. వాటి పట్ల ప్రభుత్వ ప్రమేయం స్టాండ్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతూ, ఆ తర్వాత ఇంకో కుటుంబాన్ని కూడా పరామర్శిస్తారు.. ఒకేరోజు రెండు ఆత్మహత్యలు జరుగుతాయి ఒకే గ్రామంలో. వాటిని ఈ రాయలసీమ ఉద్యమంలో పనిచేస్తున్నటు వంటి వాళ్ళు, వెళ్లి విజిట్ చేసి అవన్నీ నేర్చుకొని వచ్చినప్పుడు .. ‘ఈ దేశాన్ని ఈ రెండు చేతులతో తీసుకొని ‘పునర్నిర్మాణం’ చేయాలనిపిస్తున్నది’ అంటుంది. ఎంత గొప్ప మాట. ఎంత మృదువైనటువంటి భావన అది. అంత దుఃఖాన్ని తొలగించడానికి ఈ పునర్నిర్మాణం అనే మాట వాడారు కదా! ఆ పునర్నిర్మాణం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రధాన్ కూడా అలాంటి పునర్నిర్మాణం లోకి దృష్టి సారించాడు. ఉద్యమంలో ఇంతకుముందు పనిచేసినటువంటి వాళ్ళని, ఉద్యమం పట్ల సానుభూతి ఉన్నటువంటి వాళ్ళని, ఉద్యమానికి దూరంగా తటస్థులుగా ఉన్నటువంటి వాళ్ళని, ఈ ఉద్యమం వైపు, ఐక్య సంఘటన వైపు, ప్రస్తుత సందర్భానికి అవసరమైనటువంటి ఐక్య సంఘటన నిర్మించే ప్రయత్నంలో ఉంటాడు.

ఈ రెండు నిర్మాణాలు .. ప్రధాన్ ఆశిస్తున్నటు వంటి పునర్నిర్మాణం ఎటువంటిది? సాధన .. అంత చిన్న వయసులో ఇంకా ఉద్యమాన్నీ, ఉద్యమ భావజాలాన్ని ఇంకా నేర్చుకుంటున్నటువంటి క్రమంలోనే పునర్నిర్మాణం అంటుంది. వీళ్లిద్దరి ఆలోచనలు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ నవల ద్వారా మీరు ఆశిస్తున్న మొత్తం సమాజ పునర్నిర్మాణం ఎలా ఉండబోతుంది?

పాణి:
ప్రధాన్ పాత్ర ఈ దశ విప్లవోద్యమ నిర్మాణానికి చెందిన పాత్ర. ఈ దశ విప్లవోద్యమ అవగాహనను, ఆచరణను, ఎత్తుగడలను చెప్పే పాత్ర. ఆ భావనలన్నింటికీ ప్రతీక. ఒక తీవ్రమైన సంక్షోభ కాలంలో ఆ సంక్షోభాన్ని అధిగమించేందుకు, విప్లవ ప్రజాస్వామిక శక్తులు ఏం చేయాలి? మనుషులందరినీ ఎట్లాగా కూడగట్టాలి. మనుషులు తాము చేయగల పని ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తించి ఆచరణలోకి రావడం అవసరమని భావించే మనిషి ప్రధాన్. అంటే ఈ దశ ఉద్యమ అత్యున్నత భావన ప్రధాన్. సాధన కర్నూలు బయలుదేరినప్పుడు ఒక మాటంటుంది. నేను, విప్లవాన్ని తెలుసుకునే పనిలో ఉన్నాను అని. ఆమె తెలుసుకునే క్రమంలో ఆమె తన చుట్టూ ఉన్న మనుషుల్ని కలుస్తూ ఉంటుంది. వాళ్లందరినీ కలిపే పనీ చేస్తూ ఉంటుంది. నవలలోని చాలా సన్నివేశాలకు మధ్య ఒక అంతస్సూత్రంగా, ఆ పాత్ర ఉంటుంది. లింకు లాగా. కర్నూల్ లో ఉండే మనుషులకు జరిగే కార్యకలాపాలకు స్నేహాలకు ప్రేమలకు మధ్య ఉంటుంది. ఇతరత్రా కూడా అలాంటి పాత్ర నే పోషిస్తుంది. అంటే basic level లో ఈ పని జరగాల్సి ఉంది. పునర్నిర్మాణం ఇట్లా కావలసి ఉన్నది అని మనకు సాధన పాత్ర ద్వారా తెలుస్తుంది. ఇట్లాంటి నిర్దిష్టత లన్నింటినీ కలిపి, ఒక సాధారణీకరించబడ్డ ప్రాథమిక స్థాయిలో నుంచి అత్యున్నత స్థాయిలో పునర్నిర్మాణం ఎట్లా ఉంటుంది అనేది మనకు ప్రధాన్ ఆలోచనల్లో, పథకంలో కనిపిస్తుంది.

ప్రభాకర్:
ఇదే సందర్భంలో శిల్ప దృక్పథాల పరంగా నవల్లోని పాత్రల పరిణామం గురించి కూడా ఒకట్రెండు అంశాలు ముచ్చటించుకుందాం. ముఖ్యంగా సాధన పాత్ర గురించి. సాధన అటు విప్లవోద్యమాన్నీ ఇటు ఇతరేతర అస్తిత్వ ఉద్యమాల గమనాన్నీ పరిశీలిస్తూ తనవైన స్థిరమైన అభిప్రాయాల్ని కలిగి ఉంటూనే ఎవరినీ నొప్పించకుండా అందరిని కలుపుకుపోయే విధంగా ప్రవర్తించింది. అందరి అభిమానాన్ని చూరగొంది. ఆ వయసులో ఆమె చూపిన పరిణతి ఎంతో ముచ్చట గొలుపుతుంది. ఆ పాత్రను నడిపే క్రమంలో మీరు సాధన ప్రేమలో పడిపోయారని అనిపించింది. నిజాయితీగా చెప్పాలంటే మేము అందరం పాఠకులుగా ఆమెను ప్రేమతో గుండెకు హత్తుకున్నాం. ఆమె నేర్చుకుంటూ మనకందరకు ఎన్నో నేర్పింది. ఈ పాత్ర ఎవల్యూషన్ గురించి రెండు మాటలు చెప్పండి.

పాణి:
సాధన పాత్ర ఎవల్యూషన్‌ గురించి చెబుతాగాని, ఆమె గురించి మీ మాటలు వింటుంటే ఒకటి స్ఫురిస్తోంది . ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ పాత్ర నన్నేమైనా ప్రభావితం చేసిందా? ఆ అమ్మాయేగాక మిగతా పాత్రలు కూడా నన్నేమైనా ప్రభావితం చేశాయా? అని. రచయితలు తాము సృష్టించే పాత్రల వ్యామోహంలో పడిపోతారేమో. ఇతరుల రచనల్లో నేను అట్లా గమనించిన సందర్భాలు ఉన్నాయి. ఇది సహజమే. రచయితనే ప్రభావితం చేయలేని పాత్రలు పాఠకులనేం ప్రభావితం చేస్తాయి? అనవచ్చేమో. అయితే అప్పుడు ఒక ప్రమాదం జరుగుతుందేమో. అదేమంటే, తమ ఇష్టం వచ్చినట్లుగా రచయితలు పాత్రలను తయారు చేస్తారు. అంటే పాత్రలను రచయితలు లొంగదీసుకుంటారు. లేదా వాటి ప్రేమలో పడిపోయి ఇష్టం వచ్చినట్లు తయారు చేస్తారు.

అయితే నిర్దిష్ట స్థల కాలాల్లో తన స్వీయ వ్యక్తిత్వం వల్లేగాక, స్వీయ వ్యక్తిత్వంగా కూడా మారిన విశాలమైన సామాజిక ఆచరణ వ్యక్తిత్వం గల పాత్రలను అట్లా తయారు చేస్తే రచయిత విఫలమైనట్లే. విప్లవ సాహిత్యంలో కాల్పనిక పాత్రలు ఉండవచ్చు. ఇంతకుముందు అన్నట్లు ఉండగల పాత్రలను ఎంచుకోవచ్చు. కానీ అవి లక్షలాది మంది ప్రజలకు, విప్లవాభిమానులకు పరిచయమైన విప్లవకారుల లాగే ఉండాలి. ఇట్లా ఉన్నందుకే అనేక వైపులలోని చాలా విప్లవ, విప్లవాభిమాన పాత్రలను పాఠకులు తమకు తెలిసిన నిజ వ్యక్తులుగా గుర్తించారు. మహాశ్వేతాదేవి ఒక తల్లిలోని తల్లి మనందరినీ ప్రభావితం చేసినట్లే రచయిత్రిని కూడా ప్రభావితం చేసి ఉండవచ్చు. కానీ ఆమె మనకు తెలిసిన వేలాది మంది విప్లవ తల్లులకు పూర్తి సరిపోయే పాత్ర. బషాయిటుడు కూడా అంతే. మన చుట్టూ ఉన్న వేలాది, లక్షలాది విప్లవకారుల మూర్తిమత్వంగా మలచడం దగ్గరే రచయితల కాల్పనికత ఉంటుంది. కానీ ఆ పాత్రలు నిర్దిష్ట స్థలకాలల్లో, గడ్డు వాస్తవికమైన మానవ సంబంధాల్లో రూపొందుతున్న మానవులకు నమూనాలు. అందుకే విప్లవ సాహిత్య ప్రభావశీలతలో విశ్వసనీయత అత్యంత ముఖ్యమైనది. ఇది చారిత్రికంగా పరిణామం చెందే శక్తి. ఇదే దాని శిల్ప రహస్యం.
అనేక వైపుల సందర్భంలో మీరు వేసిన ప్రశ్న వల్ల నాకు ఇలాంటి ఆలోచనలు కలిగాయి. ఇక ఈ నవలలోని సాధన దగ్గరికి వస్తే, ఆమె ఈ కాలంలోని, ఈ తరం విప్లవోద్యమానికి ప్రతీక. ఆమె అనేక సందేహాలతో, ప్రశ్నలతో కర్నూలు వస్తుంది. అక్కడ సమాధానాలు ఉంటాయని కాదు. కానీ విప్లవాన్ని తానుగా తెలుసుకోవాలనే వస్తుగత దృష్టి ఉన్నది. తండ్రికి అందులో కొంచెం పెడ ధోరణి కూడా కనిపిస్తుంది. దేనికంటే ఆమె పెరుగుదలలోని ఎత్తుపల్లాలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి అనుమానం. అనుకూల విషయం ఏమంటే, ఈ దశ విప్లవోద్యమంలో ఏవో మార్పులు జరుగుతున్నాయని ఆమె గ్రహించింది. కొంచెం మనసు పెడితే ఎవరికైనా అవి అర్థమయ్యేవే. చాలా మంది మేధావులే తెలుసుకోలేకపోతున్నారు. ఈ సంగతి కూడా సాధనకు తెలుసు. అయితే చాలా స్వీయాత్మకంగా, కాస్త పెడసరంగా, కొంచెం అతిశయంగా, మాటకు మాట విసిరే స్వభావం ఆమెది. మన చుట్టూ ఉన్న పిల్లల్లో ఇది చూస్తుంటాం. అయితే ఆ పిల్లకు ఏదైనా సరే, విప్లవానికి మేలు చేసేలా పని చేయాలనే లక్ష్యం ఉంది. అందువల్ల చాలా నేర్చుకుంటుంది. విప్లవం గురించైనా, రాయలసీమ గురించైనా. అతిశయానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆమె వ్యక్తిత్వంలో బలహీనతలు కూడా ఉన్నాయి. ఎక్కడో విప్లవంలో ఏదో జరగకూడనిది జరిగిందని, దాన్ని అర్థం చేసుకోలేక ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది. చందన్‌ అనే అబ్బాయి మాటకారితనాన్ని విడమర్చుకోలేక భ్రమలకు లోనవుతుంది. అతడ్ని ప్రేమిస్తుందేమో అని పాఠకులకు అనిపిస్తుంది. మనకు అనిపించడం ఏమిటి? ఆ పిల్లను పెంచిన సుధకు కూడా అనిపిస్తుంది. కానీ ఒకటి రెండేళ్లకు పరిణతి వచ్చే క్రమంలో విప్లవంలో తాను ఎట్లా ఉండాలో కాస్త తెలుసుకుంటుంది. అప్పుడు అతని ప్రేమను చాలా సున్నితంగా, స్పష్టంగా తిరస్కరిస్తుంది. మళ్లీ దానికి తానే కారణమేమో అనే పశ్చాత్తాపానికి గురి అవుతుంది. ఇట్లా అనేక సందేహాలతో, సందిగ్ధతలతో ఆమె పరిణామం జరిగింది. అయితే ఆమె విప్లవ నేపథ్యం సామాన్యమైనది కాదు. కేవలం విప్లవకారుల కూతురే కాదు. మరో రెండు జంటల మధ్య పెరుగుతుంది. వాళ్లంతా విప్లవానుబంధంలో ఉన్నవాళ్లు. తెలంగాణ ఉద్యమంలో ఏదో ఒకస్థాయిలో పని చేస్తుంది. కన్నతల్లి మరణం తర్వాత చిన్న వయసులోనే అడవికి వెళ్లి తండ్రిని, విప్లవకారులను కలిసి వస్తుంది. ఇది ఆమె నేర్చుకోడానికి దోహదం చేసింది. ఇలాంటి వాళ్లను నేను చాలా మందిని చూశా. అట్లాగే ఈ నేపథ్యం వల్లనే విప్లవమంటే పడకుండా తయారయ్యే పిల్లలు కూడా ఉంటారు. వాళ్ల మీద బైటి ప్రతికూల ప్రభావాలు ఎక్కువ ఉన్నాయని అనుకోలేమో. కానీ సాధన మీద ముగ్గురు తల్లిదండ్రుల నుంచి, బైటి నుంచి అనుకూల ప్రభావాలు పడ్డాయి. అయినా చివరి దాకా ప్రశ్నలే. తానుగా తెలుసుకోవాలనుకోవడం పాజిటివ్‌ అప్రోచే. కానీ అందులో ఆ పిల్లకు స్వీయాత్మకత అనే బలహీనతకు కూడా ఉంది. నవల చివర్లో కన్నతండ్రి, విప్లవోద్యమ నాయకుడు అయిన రఘును మరోసారి కలుస్తుంది. కూతురితో కాసేపు ఒంటరిగా మాట్లాడగానే ఆయన ఈ లోపం గ్రహించేస్తాడు. అదే మాట చెబుతాడు. అప్పటికి తన స్వీయాత్మకత ఏమిటో గ్రహించగల పరిణతిని సాధన పొందుతుంది. విప్లవంలో ఇట్లాగే ఉంటుంది. ఆమె వ్యక్తిత్వంలోని ఈ సహజమైన, తార్కికమైన ఆటుపోట్ల వికాసమే బహుశా మనకు ఆకర్షణీయంగా ఉండవచ్చు.

ప్రభాకర్:
అలాగే ప్రధాన్ సుధ రఘు జమీల్ .. వీళ్ళు వర్తమాన విప్లవ ఉద్యమానికి ప్రతినిధులుగా వ్యాఖ్యాతలుగా విశ్లేషకులుగా కనిపిస్తారు. వీళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఉద్యమ ఆచరణ నుంచి రూపుదిద్దుకున్నదిగా చూపించారు. ప్రతి సందర్భంలోనూ వీళ్ళందరూ గొప్ప మానవీయ విలువలతోనూ ప్రజాస్వామ్యంగానూ వ్యవహరిస్తారు. విప్లవంలో మానవ సంబంధాలు ఎలా ఉండాలో తెలుసుకోడానికి ఈ పాత్రలు దోహదం చేస్తాయి. ఇంతకు ముందు మీరు సమాజంలో ‘ఉండగల’ మనుషులు అన్నమాట ఉపయోగించారు. ఈ ‘ఉండగల’ వ్యక్తుల్ని సృష్టించడానికి అనను గానీ గుర్తించడానికి మీకు ఏ తాత్వికత నిర్దేశనం చేసింది?

పాణి:
మీరు అనుమతిస్తే.. ఈ ప్రశ్నను ఇంకోలా మార్చి చర్చించుకుందామనిపిస్తోంది. ప్రధాన్‌, రఘు, సుధ, జమీల్‌ లాంటి విప్లవోద్యమ నాయకులను, కార్యకర్తలను నిజ జీవితంలో నిర్దేశిస్తున్న తాత్వికత ఏమిటి? అని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. విప్లవాన్ని దగ్గరిగా చూస్తున్నప్పటికీ .. నన్ను ఒక సందేహం వెంటాడుతూ ఉంటుంది. అదేమంటే, విప్లవోద్యమం మీద పాలకవర్గం దేనికి ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నది? ఇంతకాలంగా చేస్తున్నది? పాలక మేధావులు దేనికి అంతగా విప్లవాన్ని ద్వేషిస్తుంటారు? కేవలం వాళ్ల దగ్గర తుపాకులు ఉన్నందుకేనా? వాళ్లకూ సైన్యం ఉన్నందుకేనా? కాదేమో. అత్యంత సహజంగా, మానవీయంగా ఉండవలసిన మనుషులు వాటికి దూరమయ్యారు. వ్యతిరేకంగా ఉంటున్నారు. ఎట్లా ఉండాలో, ఉండగలరో దానికి భిన్నంగా జీవిస్తున్నారు. మానవసారాన్ని విప్లవం తిరిగి అద్భుతంగా, సజీవంగా, అత్యున్నతంగా, సహజంగా తీర్చిదిద్దుతుంది. ఆ క్రమంలో ఉండగల కొత్త మానవులను తయారు చేస్తున్నది. సాహిత్య సందర్భం కాబట్టి మనం మానవ సంబంధాలనీ, ఉద్వేగాలనీ అనుకుంటున్నాం గాని, వాస్తవానికి మనం ఇక్కడ చరిత్రను నిర్మించే మానవుల గురించి మాట్లాడుకుంటున్నాం. వ్యవస్థలను విలువల ప్రాతిపదిక మీద, తార్కికంగా, స్వయం చలనాలతో నిర్వహించేలా తయారయ్యే మనుషుల గురించి ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఈ ప్రాసెస్‌ రాజ్యానికి, పెట్టుబడికి, సామ్రాజ్యవాదానికి నచ్చదు. మిగతా ప్రజాస్వామిక ఉద్యమకారుల్లా విప్లవకారులు ఏవో కొన్ని న్యాయమైన సమస్యల మీద పోరాడి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పరిష్కరించే వరకే పరిమితమైతే పాలకులు ఇంత హింసకు పాల్పడేవారు కాదేమో. కానీ విప్లవకారులు ఎప్పటికైనా ఈ చరిత్ర ముందుకుపోయి, అందులో ఉండగల మానవులుగా ఇప్పుడే, ఇక్కడే, మన మధ్యనే రూపొందుతున్నారు. ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు. చారిత్రిక క్రమం. దీన్ని విప్లవకారులు మన దేశంలో ఎన్నడో ప్రారంభించారు. బహుశా అది ఈ యుద్ధం వల్ల వెనకడుగు వేయవచ్చేమోగాని, చరిత్ర ఆ పట్టాల మీద ముందుకే పోతుంది. ఇరవయ్యో శతాబ్ది విప్లవాల అనుభవాల తర్వాత కూడా చరిత్ర ముందుకు పోవడానికి ఆ దారి తప్ప ఇంకోటి లేదని ఇటీవలి పరిణామాలు పదే పదే రుజువు చేస్తున్నాయి. ఈ చారిత్రిక వాస్తవికతను వివరించగల తాత్వికత ఆధారంగా రఘు, ప్రధాన్‌, సుధ, జమీల్‌లాంటి వాళ్లు తమను తాము సిద్ధం చేసుకున్నారు. విప్లవం కోసం, విప్లవంలో పునర్నిర్మించుకున్నారు. ఈ తాత్వికతను నేను ఏ కొంచెమైనా గ్రహించానేమో. అందుకే వేలాది, లక్షలాది నిజ విప్లవ మానవులకు ప్రతినిధులనదగిన పాత్రలుగా పైన చెప్పిన వాళ్లు నవలలోకి వచ్చారు. మీ ప్రశ్నకు సూటిగా చెప్పగలిగానో లేదో. కానీ నేను ఈ తాత్వికతను ఇట్లా అర్థం చేసుకుంటున్నాను. అందువల్లే, ఈ నవల, ఇందులోని పాత్రలు ఇట్లా నిర్మాణమయ్యాయని అనుకుంటున్నా. మీరు ఒక మంచి మాట అన్నారు. సృష్టించడం కాదు గాని గుర్తించడం.. అని. ఇది కరెక్ట్‌. విప్లవం ఎట్లా ఉన్నదో, ఉండగలదో మనం గ్రహించగలం, గుర్తించగలం. అంతే. కాబట్టి విప్లవంలో ఉండగల పాత్రలను రచయితలు సృష్టించడం ఉండదు. తెలుసుకోవడమే ఉంటుంది. విచిత్రమేమంటే ఈ తెలుసుకోవడం అనేది సాధన దగ్గరి నుంచి ప్రధాన్‌ దాకానే కాదు. ఈ నవలలోని నాగులు దగ్గరి నుంచి రామస్వామి దాకా, రసూల్‌ తల్లి సుల్తానా దగ్గరి నుంచి సాధన రూం ఓనర్‌ అయిన ముస్లిం మహిళ దాకా విప్లవాన్ని ఏదోలాగా నిరంతరం తెలుసుకుంటూ ఉంటారు. ఈ తెలుసుకోవడంలోని బ్యూటీ ఉంటుంటుంది కదా? అదే నవలలోని అన్ని పాత్రల్లోని సాధారణ లక్షణం. కొందరిలో అది కేవలం జీవితానుభవంగా ఉంటే, రఘు, ప్రధాన్‌, మోహన్‌లాంటి వాళ్లలో అదొక తాత్వికతగా ప్రతిఫలిస్తుంది.

ప్రభాకర్:
సాధన ఎట్లాగూ నేర్చుకుంటూ ఉంటుంది కాబట్టి నేర్చుకునే క్రమంలో … ఆమె, జెన్నీ చెప్పేటువంటి కుల అస్తిత్వ ఉద్యమాలకు, ఉండేటువంటి పరిమితుల గురించి మాట్లాడుతూ, స్త్రీ వాదం గురించి కూడా మాట్లాడుతూ ఏమంటుంది అంటే, స్త్రీలను విప్లవం అందుకుంది అంటుంది. ‘అందుకుంది’ అనే మాటతోనే ఆగకుండా అందువల్ల మేము శరీర రాజకీయాలను దాటాము! ఇప్పుడు విప్లవం అంటే ప్రతి చోట స్వేచ్ఛను వెతుక్కోవడం! ప్రతి దాంట్లోనూ చోటును వెతుక్కోవడం. అది ఎవరో ఇచ్చేది కాదు.. అని స్వేచ్ఛను నిర్వచిస్తుందామె. జీవితంలో స్వేచ్ఛ ఒక భాగం కాదు జీవితం అంటేనే స్వేచ్ఛ అంటూ, దేన్నైనా విమర్శనాత్మకంగా చూడాలంటే అన్ని సంకెళ్ల నుంచీ విముక్తం కావాలి అంటుంది. ఇది ఒక ఎరుక. ఆమెకు కలిగినటువంటి ఈ ఎరుకనించే ఆమె నేర్చుకోవటం గురించి మాట్లాడుతూ, “ఇదంతా నేర్చుకోవటమే” అంటాడు అల్లం రాజయ్య ఈ పుస్తకానికి చివరి మాట రాస్తూ. అందులో చివరగా ఆయన ఏమంటాడంటే – ‘తీవ్రమైన భావోద్వేగాలతో నవల నడిచింది. అక్కడి నుంచి మానవ ఆచరణ మీద కేంద్రీకరించింది. అంటే మానవ ఉద్వేగాలతోటి మానవ ఆచరణ వైపు నడిచింది. ఉద్వేగాలు ఆచరణ సిద్ధాంతం సిద్ధాంత జ్ఞానం అనే క్రమంలో, మనుషుల మధ్య మనుషులకు వ్యవస్థకు ఉన్న అనేక సంఘర్షణలు ఈ నవలను ముందుకు నడిపించాయి. ఉన్న స్థితిని చెప్పడం కాకుండా రూపొందుతున్న క్రమాలను అనేక వైపులా చెప్పటం ఈ నవల ప్రత్యేకత. అందులోని ప్రయాస దుఃఖం మనను నిలువనీయవు. వీటితోపాటు లోతైన తాత్విక రాజకీయ పరిశీలనలు ఉన్నాయి. వాస్తవికతను సమస్త చలనాల్లో గ్రహించే ప్రయత్నం చేసింది. వీటివల్ల కొత్త శిల్పంతో ఈ నవల నిర్మాణమయింది. మరే ఇతర నవలా శిల్పాన్ని పోలినది కాదు. అనేకవైపులా రూపొందుతున్న విప్లవోద్యమ ఆచరణ శిల్పమిది. అనేకవైపుల నుండి వ్యక్తులు సమూహాలుగా మారే జీవనక్రమాల్లోని కళాత్మక శిల్పం ఇది.’ ఇవి రాజయ్య గారి మాటలు.

రాజయ్య గారి చివరి మాటలు మళ్లీ మీ ముందు ఉంచుతూ, ఆయన సాహిత్య రచనా శిల్పాన్ని, విప్లవ ఆచరణ శిల్పాన్ని పర్యాయ పదాలుగా వాడారు. ఇది అద్భుతమైనటువంటి అబ్జర్వేషన్ గా నాకు అనిపించింది. ఇటువంటి శిల్పాన్ని అంటే ఎక్కడో రష్యన్ నవలల్లో చైనా నవలల్లో లేకపోతే మన మహా శ్వేతాదేవి నవల్లో ఇట్లాంటి చోట మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా! దాన్ని ఈ నవలలో చూడగలిగాను. ముందుమాటలో ఫెలో ట్రావెలర్ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఇటువంటి నవల ఇంతకుముందు రాలేదని కూడా చెప్పారు. ఈ నవల రచనా శిల్పం, విప్లవ ఆచరణ శిల్పం గురించి మీరు చెప్పటంతో ఈ సంభాషణను పూర్తి చేసుకుందాం. అసలు ఈ నవలకు మీరు ముందుమాట రాసి ఉంటే మన మధ్య సంభాషణ ఇంతసేపు జరిగి ఉండేది కాదేమో!

పాణి:
రాజయ్య గారు విప్లవమే కళాత్మకత అని చాలా కాలం క్రితమే చెప్పారు. మన చుట్టూ చాలా కళా సంబంధమైన విషయాలు ఉంటాయి. అవన్నీ మానవ జీవన శ్రమ సంబంధమైనవి. మానవ శ్రమలోంచి మానవ ఆలోచనలోంచి, ప్రకృతిలో నుంచి వచ్చిన సౌందర్య భరితమైన విషయాలు. అయితే విప్లవమే సౌందర్యాత్మకమైనది, కళాత్మకమైనది అని రాజయ్య గారంటారు. విప్లవోద్యమ నిర్మాణం ఎట్లాగో, సాహిత్య నిర్మాణం కూడా అంతే. విప్లవ నిర్మాణం ఎట్లా సౌందర్యాత్మకంగా ఉంటుందో విప్లవ సాహిత్య నిర్మాణం కూడా అట్లాగే కళాత్మకంగా ఉంటుంది. బహుశా శిల్పానికి ఆయనవి చాలా కొత్త నిర్వచనాలు. శిల్పాన్ని- దృక్పథాన్ని, శిల్పాన్ని- వస్తువుని కలిపి చెప్పే పద్ధతుల్ని రాజయ్య గారు డెవలప్ చేశారు. అట్లాగే ఫెలో ట్రావెలర్ కూడా శిల్పం అంటే ఏమిటి? అని చెబుతూ కల్పనకన్నా వాస్తవమే కళాత్మకమైంది అని అద్భుతమైన సూత్రీకరణలు గతంలో చేసి ఉన్నారు. రాజయ్య గారు అన్నట్టు విప్లవం మనుషులందరినీ ముట్టు కుంటుంది. అది ఈరోజు ఎక్కడో పరిమిత ప్రాంతాల్లోనో, కొద్ది ప్రాంతాల్లోనో ఉన్నట్టు మనకు అనిపించవచ్చు. అది నేరుగా భౌతికంగా విస్తరించే క్రమంలోనైనా, భావజాలం రీత్యానైనా రాజకీయాల రీత్యానైనా, విప్లవ సంస్కృతి రీత్యానైనా సరే అది తనలోకి రాగల మనుషులందరినీ అది ముట్టుకుంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుందని ఆలోచిస్తే ..

విప్లవమంటే మానవతను నిర్మించడం. మానవతను పునర్నిర్మించడం. మీరిందాక సమాజ పునర్నిర్మాణం ఎట్లా ఉంటుంది? అని అన్నారు. సమాజ పునర్నిర్మాణం తప్పనిసరిగా మానవత పై ఆధారపడి జరుగుతుంది. అసలు విప్లవమంటే మానవతను అన్వేషించడం. కారణం ఏమిటంటే, అనేక కారణాల వల్ల ఈ సమాజంలో మానవీయంగా ఉండవలసిన మనం మానవీయంగా లేకుండా పోతున్నాం. నేనైనా మీరైనా మనం ఎవరమైనా. సహజంగా ఉండవలసిన మానవతను మనం సంతరించుకోలేక పోతున్నాం. ఎక్కడో అరకొరగానే మనం మనుషులుగా జీవించ గలుగుతున్నాం. మానవత సంక్షోభంలో పడిపోతున్నది.

మానవతను ప్రగతిదాయకంగా పునర్ నిర్మించడం కేవలం ఒక భావనగా కాకుండా కోటానుకోట్లమంది ప్రజల భౌతిక రాజకీయ సాంస్కృతిక ఆచరణలో సాగడమే విప్లవానికి మౌలిక చట్రం.

బహుశా ఈ నవలా నిర్మాణంలోకి ఇన్ని పాత్రలు, ఇన్ని విభిన్నమైన పాత్రలు, పొసగని పాత్రలు, మన స్థల కాలాలలో ఉండగల పాత్రలు, ఘర్షణ పడుతున్న భావజాలాలు, తీవ్రంగా రాపిడి పడుతున్న విలువలు ఇవన్నీ, ఈ అమరికలోకి వచ్చాయి. విప్లవానికి సంబంధించిన మౌలిక చట్రమే ‘అనేక వైపుల’ నవలా నిర్మాణ చట్రం. అక్కడి నుంచి బయలు దేరితే నవల వస్తు, శిల్పాల గురించి, దృక్పథం గురించి మాత్రమే కాక వాటన్నిటి ద్వారా వ్యక్తమైన ఇప్పటి చారిత్రిక యుగపు మానవ జీవన సంఘర్షణ కొంతైనా నవలలోకి వచ్చి ఉంటుంది .

మనుషులలో ఉండే సకల సృజనాత్మక శక్తులను విప్లవం విడుదల చేస్తుంది. ఈ నవలలో కూడా మనకు కనిపించే పాత్రలు, తమలోని సృజనాత్మక శక్తిని గుర్తించడం దగ్గర మొదలవుతాయి. మనుషులు నేనేమిటి అని ప్రశ్నించుకొని ఎరుక పొందడం దగ్గర ఒక నైతిక కోణం కూడా ఉంది. తనను తాను తెలుసుకొని, తనను అధిగమించినప్పుడు సమూహంగా మారతారు. రాజయ్య గారు అక్కడ ఆ మాట అంటారు. వైయక్తికత, స్వీయాత్మకత నుంచి సమూహంగా మారటం గురించి .. బహుశా ఇది నవల లోని కొన్ని పాత్రలకో లేదా కొన్ని క్రమాలకో ఆపాదించి విశ్లేషించవలసిన విషయం కాదు. నిర్మాణమైన చరిత్రను మనం పరిశీలిస్తే మనుషులు, ముందు నేనేమిటి? అనే ఎరుక పొందుతారు. ఆ తర్వాత సమిష్టిగా మారుతానా లేదా? అని ఆలోచిస్తారు. అట్లా సమిష్టిగా మారే క్రమంలోనే ప్రజలు చాలా సృజనాత్మకమైన విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యారు. ఈ సమాజంలో వచ్చిన మార్పులన్నీ మనుషులు వర్గాలుగా మారి, తమ పాత్ర నిర్వహించడం వలన ఈ మార్పులను తీసుకొచ్చారు. ఈ మార్పులను మనం రాజకీయ పరిభాషలో వర్గ పోరాటం అని చెప్తాం . తాత్విక అర్థంలో మనిషి తనను తాను అధిగమించి, సమూహంగా మారిన తర్వాత చరిత్ర నిరంతరం పురోగమిస్తూ ఉంటుంది. నవలకు చరిత్రకు ఉండే సంబంధం అట్లాంటిది. నవల చరిత్రను ఎక్కడ అధిగమిస్తుంది అంటే, చరిత్ర చెప్పజాలని విషయాలను నవల కాల్పనికంగా.. ఇట్లా ఉండగలదు అని రూపొందుతూన్న చరిత్రను చిత్రిస్తుంది. ఈ రూపొందుతున్న చరిత్ర భవిష్యత్తులో ఇట్లా ఉండడానికి అవకాశం ఉన్నది, దానికి ఆధారం ఇలా ఉన్నది అని చెప్పే దగ్గర చరిత్రను నవల అధిగమిస్తుంది.

అది ఈ నవలలో ఏ కొంచమైనా రావాలి అనుకున్నాను. అది నేను విప్లవాన్ని అర్థం చేసుకున్న తీరు. ఈ నవల రాసే క్రమంలో విప్లవం నాకు అర్థమైన తీరది. అది text లోకి వచ్చిందా? ఎట్లా వచ్చింది ? అది పాఠకులకు చేరుతుందా? అనేది విమర్శకులు పరిశీలించాలి. అక్కడ ఏమాత్రం ఆరాధన లేకుండా, విమర్శనాత్మకంగా పరిశీలించి అంచనా వేయాలి .

ప్రభాకర్:

అంటే సాహిత్యంలో సృజనాత్మకతని, సమాజంలో విప్లవం తీసుకొచ్చే సృజనాత్మకతని, ఈ రెండిటిని నవలలో మిళితం చేయడం ద్వారానే ఈ నవల ఇంత మంది దగ్గరికి చేరువైంది అనే ఒక దృఢమైన అభిప్రాయం నాకు ఉంది. ఇప్పుడు మీతో మాట్లాడగా మరింతగా బలపడింది. సాహిత్య సృజన అనేది విప్లవాచరణలో భాగం అని ఒక సాధారణమైన మాట ఉంది కదా! ఈ రెండు సృజనాత్మక ఆచరణలని నిర్వహిస్తూ ఇటు వర్తమానాన్ని గతంతోని ముడి పెడుతూ భవిష్యత్తులోకి చూసేలా నవల రాశారు. భవిష్యత్తు చాలా అందంగా ఉండాలి అనుకుంటాం కదా… అటువైపు నడిపించడానికి దోహదం చేసే ఒక చిన్న ఆలోచనకి ప్రేరేపించానా? అని చాలా modest గా చెప్పారు. కానీ చాలా బలంగా చెప్పారని చాలామంది పాఠకులు భావిస్తున్నారు. మొదటగా నేను భావించాను. ఈ ఉద్దేశాన్ని పాఠకులందరూ అర్థం చేసుకొని ఈ నవలను చదవడానికి ఇప్పుడు మీతో చేసిన సంభాషణ అనేకవైపుల నుంచి ఉపయోగ పడుతుందని భావిస్తూ…

థాంక్యూ వెరీ మచ్ పాణీ !

పాణి : థాంక్యూ సార్, థాంక్యూ!!

(మార్చి 2, 2025 న ‘హర్షణీయం’ podcast కోసం చేసిన సంభాషణని యీ రూపంలో అందించడానికి తోడ్పడిన అనిల్ కుమార్ కు, శ్రీనివాసాచార్యకు అనేక కృతజ్ఞతలతో.. )

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply