చల్లపల్లి స్వరూప రాణి తాజా కవితా సంపుటి,’అల్లిక’లో తాను రాసిన గత కవిత్వం కంటే భిన్నమైన, గాఢమైన, తీవ్రమైన దళిత అభివ్యక్తి ఉంది. గతంలో లానే ఇప్పటికీ ఆమె తన మూలాల మీద నిలబడే గానం చేస్తుంది. సమాజం పట్ల తన దళిత దృష్టి, బహుజన సోయా ఏమాత్రం వన్నె తగ్గక పోగా సరికొత్త నాణ్యతనీ, లోతునీ సంతరించుకున్న కవితా సంవాదం ఈ సంపుటిలో నిర్మితమయ్యింది. బహుజన ఈస్థటిక్స్ నిండుగా నిక్షిప్తమైన కవిత్వమిది. సమకాలీన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ బహుముఖ దృశ్యాన్ని అంబేద్కరిస్టు చూపునుంచీ, బుద్ధిస్టు అవగాహన నుంచీ వడపోసి రాసిన కవిత్వమిది. ఇది వాక్యాన్ని చిత్రికపట్టే సాధన కాదు. అలజడినుంచీ, వ్యాకులత నుంచీ, ఆగ్రహం నుంచీ కట్టలు తెంచుకున్న వరద నది చిందరవందరగా రచించిన ‘అల్లిక’. కవిత్వం అనేది రోజువారీ బహుజన శ్రమ జీవనంలో అంతర్భాగం కనుక అది ‘మాకు లెక్కలోదీ జమలోదీ గాదు’ అని తేల్చిపారేస్తుంది.
“అది మా అమ్మ రోజూ
రోట్లో నూరే రొయ్యల కారం
కై కట్టడమంటే
మోకాలి లోతు బురదలోంచి
వెనక్కి అడుగులేస్తూ
అల్లే వరి నాటు
వాకిలి ముందు
అన్నాయిలు నలుగురూ చేరి
నులక మంచం అల్లడంలో ఉంటాది
అబ్బురమైన చందస్సు
కైతకమంటే
పగలంతా పొలం పనిచేసి
రాత్రి వీధి కరెంటు స్థంభం దగ్గర
నాన్న అల్లే చేగ్గడ్డి యెంటు “
అవిశ్రాంత శ్రమ జీవులు అలవోకగా చేసే పనుల్లోని సృజనే అసలు కవిత్వం అని పై విధంగా తీర్మానించింది కవి. రొయ్యల కారం నూరినా, పచ్చడి నూరినా, మంచం అల్లినా, చాప అల్లినా, బుట్ట అల్లినా, యెంటు అల్లినా ఆ అల్లికలో అదృశ్య చందస్సు, అపురూప వ్యాకరణం ఉంటాయి. అవి కవిత్వం కాక మరేమిటి. ఆ కవిత్వం వెనక ఉన్నది బహుజన ఈస్థటిక్స్ కాక మరేమిటి. కూలితల్లి గురించి రాస్తూ
“నాజూకు తనాన్ని
రేగటి చాళ్ళలో పాతేసుకున్న పొగచూరు కట్టె ఆమె
గట్టు మీద బుసలు చిమ్మిన
వెకిలి పాముల్ని
నారకట్టలా విదిల్చడం
ఆమెకు పచ్చడి మెతుకుతో పెట్టిన విద్య”
అని కవి రాసినప్పుడు మెరిసిన ఈస్థటిక్స్ బహుజన ఈస్థటిక్సని వేరే చెప్పక్కర్లేదు. ‘వెకిలి పాములు’ అనే పద ప్రయోగం ఎంత ఫ్రెష్ గా ఉందీ!’వెన్నతో పెట్టిన విద్య’ అనే బ్రాహ్మణీయ దేశీయాన్ని ‘పచ్చడి మెతుకుతో పెట్టిన విద్య’ గా మలచడంలోని బహుజన సోయను గమనించడం తేలికే గదా. ‘ఎదిగిన పైరు బిడ్డ పై / తన పచ్చటి పైటకొంగు కప్పిన / ఆ కూలితల్లి’ అనడంలో ఎంత గొప్ప వ్యక్తీకరణ ఉందో కవిత్వ చదువరులందరికీ తెలిసిన విషయమే.’పైరు బిడ్డ’ అనే పదబంధంలోని చాతుర్యం మాట ఏంటి?
చందమామను చాలామంది కవులు చాలా రకాలుగా వర్ణించారు. పలు అందాల్ని ఆపాదించారు. స్వరూప రాణి మాత్రం ‘ద్వేషం నిండిన సిబ్బిరేకులా’ కనిపిస్తున్నావు అనగలిగింది. వెన్నెలను ఉద్దేశించి ‘తాటాకు గుడిసె కొసల్నుంచి / మెత్తగా కారే కర్దూపానివి’ అంది. ఇవన్నీ బహుజన ఈస్ట్రటిక్స్ ఎందుకైనట్లు? వీటి మూలాలన్నీ బహుజన జీవితంలో ఉన్నాయి కనుక.
ఈ కవి వాడిన ప్రతీకలూ, పద చిత్రాలూ, పదబంధాలూ కేవలం అభివ్యక్తి కోసం కాదు
ఉద్దేశితమయ్యింది. బహుజన జీవిత వాస్తవాన్ని కవిత్వంగా చేసేదాన్లో భాగంగానే ఇది జరిగింది.’చెరువు’ గురించి మాట్లాడుతూ తీపి జ్ఞాపకాలను వల్లెవేయటం కాకుండా దళిత వేదనను పలికిస్తుంది.
“అసాముల బర్రె గొడ్లు
మమ్మల్ని చూసి
గొల్లున నవ్వాయి
మా ఊరి చెరువు గట్టున
వాడ పరువు వురితీయబడింది”
అన్నప్పుడు దళిత ఆత్మగౌరవం బద్దలైన దృశ్యం ఉంది. ఆధిపత్య కులాల దృష్టిలో గొడ్ల కున్న విలువ దళితులకు లేని వాస్తవాన్ని బయట పెట్టటం ఉంది. అందుకే చెరువుని ‘అంటు రోగాన్ని కడుపులో పెట్టుకున్న మేడిపండు’ అని పిలిచింది.
“మా బాల్యం
చెరువొడ్డునే నెర్రెలిచ్చిపోయింది.
మాకు చెరువంటే
పిడికెడు తీపిగురుతులు కాదు
ఊరూ వాడల మధ్య విస్తరించిన
సహారా ఎడారి”
చెరువులే కాదు ‘హరిజన వాడ బడి’ జీవితాల అనుభవాలు కూడా విభిన్నమైన దళితత్వాన్ని వ్యక్తం చేయటానికి కవికి మంచి సమయాన్ని సమకూర్చుతాయి.హరిజన వాడ బడుల్లో…
“కూచ్చోను బల్లలు ల్యాపోతే
గోతాం పట్టాలు తెచ్చుకుంటాం
చిన్న పిల్లలం ఏ చెట్టు చాటుకో పోయి
కడుపు నెప్పి దింపుకుంటాం!
మరి పెద్ద మనిసైన పిల్లల మాటేంది?
ఆళ్ళు బడి మానేసేది ఎందుకో
ఎప్పుడన్నా యిసారించున్నారా?
మీ దినాల్జెయ్య!”
ఇంతకు మించిన ప్రత్యేక దళిత వాస్తవికత ఏముంది. దళిత ఆడ పిల్లలు బడి మానేయడం వెనక ఉన్న భయంకర వాస్తవం ఈ దేశపు ప్రధాన వాస్తవం. అది తెలుసుకోమని రాజకీయ నాయకులకు హితబోధ చేస్తుంది కవి.
“చీపురు చాత పట్టుకు పుటువా దిగే
పెద్ద మనుషుల్లారా!
ఒకమాలి మా బడికి రండి!
అసలు దేశాన్ని
చూసిపోదురుగాని”
ఇలా దళిత ఈస్థటిక్సూ, దళిత వాస్తవికతా కలగలిసిపోయిన దళితత్వం ఈ సంపుటికి అమరిన విశిష్టత అని అర్ధమౌతుంది.
ఈ సంపుటిలో మరో బలమైన ఇతివృత్తం మతోన్మాదం. మతాన్నీ కులాన్నీ రాజ్యాన్నీ వాటిని నడుపుతున్న వ్యవస్థల్నీ ఆగ్రహంతో దునుమాడటం చూస్తాం. మునుపటి కంటే తీవ్రమైన భిన్నమైన కోపోద్రిక్తత ఈ సంపుటిలో నమోదయ్యింది.
“మతమా నువ్వో పురుషాంగానివి!
కులానివి! రాజ్యానివి!
జనం సొమ్ము తిని తెగ బలిసిన దొరవి!
ఇది దేశం కాదు
ఆడదాని నగ్న దేహంతో
చలి కాచుకునే
సిగ్గూ శరం లేని ముసలి మృగం”
ఇలా మత వ్యవస్థ స్వరూప స్వభావాల్ని తూర్పారబట్టింది కవి. ఒక హత్యాచారం మీద రాస్తున్నప్పుడు దానికి సంబంధించిన మొత్తం వ్యవస్థ ను బోనెక్కించటమే ఏ కవైనా చేయాల్సింది. ఇక్కడ స్వరూప రాణి చేస్తున్నదదే.
“ఆమె కంట్లో నీరింకిపోక ముందే
హంతక దేవుళ్లను బోనెక్కించాలి!
మనిషితనం కోసం
పారిన నెత్తురెంతో లెక్క తేల్చాలి!
అన్నిటికన్నా ముందు
దేవాలయాలూ చర్చీలూ మసీదులూ
కూలగొట్టి
మనిషిని ప్రతిష్టించుకోవాలి!
దేవుళ్ళని ఈనేల నుంచి బహిష్కరించి
దేశాన్ని సరికొత్తగా నిర్మించాలి”
ఈ ఊపులోనే సనాతనాన్ని వ్యంగ్యంగా ఎండగట్టింది. కృష్ణా నదిని ఆధారం చేసుకుని ‘సూత రుక్కు’ ను నిర్మించింది. ఆ కవిత తప్పనిసరిగా చదవాల్సిందే.
వ్యవస్థ మీద ముస్లింలు చేస్తున్న పోరాటాన్ని ‘షాహిన్ బాగ్’ కవిత రూపంలో ప్రతిధ్వనించింది.’పగ బట్టిన కాలం మీద / సామరస్యపు చినుకులు చల్లే / సూఫీ పద్యానివి’ అని షాహీన్ బాగ్ ను అభివర్ణించడం చక్కగా సరిపోయింది. హిజాబ్ నా మాగ్నాకార్టా’ అనే శీర్షికతో రాసిన కవిత గూడా ఒక హైలైటే.
ప్రభుత్వాలూ, పాలకులూ ఆశించినట్టే కూలిపోయిన జనం పిడికిళ్లు ఎత్తే బదులు చప్పట్లు చరిచే చేతులుగా మిగిలిన కాలంలో ‘కాలికింద పిడికెడు నేలకోసం / దేశం చౌరస్తా మీద నిలబడ్డ’ దృశ్యాన్ని కూడా శక్తివంతంగా చిత్రించిన కవిత్వం ఇక్కడ ఉంది.
ఇవి కాక నోరు లేని జీవాల గురించీ ప్రకృతి గురించీ కోవిడ్ గురించీ అంతర్జాతీయ రాజకీయాల గురించీ యుద్ధాల గురించీ బౌద్ధం గురించీ ఈ కవి రాసిన వైబ్రెటింగ్ కవిత్వం ఈ సంపుటికి బహుముఖత్వాన్ని సమకూర్చింది. నిండుతనాన్ని తీసుకొచ్చింది. దళిత స్త్రీవాదాన్ని విభిన్నంగా ప్రదర్శించిన కవిత్వం సంపుటి సెంట్రల్ వస్తువుగా నడిచిన విషయం కూడా మరచిపోలేం.
“మా ఆడ పిల్లలు
యీ ప్రపంచం మాదనే ధీమా పొందాలి
వారు కొండ కోనల్లో
వాగువంకల్లో సింహాలవలే తిరగాలి
………………………………….
కళ్లారా కలలు కనడానికి
షరతులు లేని హామీ కావాలి
అన్నింటికీ మించి
మా తలపై
అజమాయిషీ లేని ఓ ఆకాశం కావాలి”
ఇదీ ఈ సంపుటిలోని కవిత్వ స్వరూపం, సారాంశం. బహుజన కవిత్వం వెనుకపట్టు పట్టిందనే వారికి సరైన సమాధానం ఈ సంపుటి. తన గత కవిత్వం కంటే మెరుగైన పరిపక్వమైన కవిత్వాన్ని అందించిన స్వరూప రాణికి అభినందనలు.
★★★