బూటకపు పాలనలో పిల్లల నాటకమూ నేరమే!

అమెరికాలో నేను పనిచేస్తున్న అకడెమిక్ సంస్థలో అమెరికన్ మూలవాసుల సంఘీభావ గ్రూప్ ఒకటుంది. అందులో ఎక్కువగా “డకోట” అనే మూలవాసీ తెగకు సంబంధించిన వాళ్లు సభ్యులుగా ఉంటారు. వాళ్ల నుండి నేర్చుకోవడానికి, వాళ్లకు మద్దతు పలకడానికి నాతో పాటు మరికొందరు అందులో సభ్యులుగా చేరారు. మేము నెలకు ఒకసారి కలుస్తాం. మా మీటింగ్‌లో ఎక్కువగా మూలవాసీ తెగకు చెందిన పెద్దలు వాళ్ల సామాజిక, వ్యక్తిగత చరిత్రను, వాళ్లు అనుభవించిన హింస, అవమానాలను నలుగురితో పంచుకుంటారు. అవి కొన్నిసార్లు వ్యక్తిగత అనుభవంగా చెబుతారు. మరి కొన్నిసార్లు కథలుగా చెబుతారు.

కథలు చెప్పడం (story telling method) వాళ్ల ఓరల్ హిస్టరీ లో ప్రధానమైంది. ఆ కథలు చెప్పేటప్పుడు అక్కడున్న ఎవ్వరిని కదిలించినా బోరున ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ల చరిత్ర నిండా, జీవితాల నిండా హింసే. నాకు అర్థమైనంత వరకు మొత్తం మానవ చరిత్రలోనే అంతటి హింస అనుభవించిన జాతి మరొకటి ఉండదనుకుంట. అందుకే వాళ్ళు అనుభవిస్తున్న దుఃఖం తరతరాలుగా (inter-generational trauma) కొనసాగుతూనే ఉంది. ఆ బాధని కొంత తేలిక పరచుకోవడం కోసం వాళ్లే నలుగురూ పోగై తమ అనుభవాలను, గాయాలను పంచుకుంటారు.

ఒకరోజు నేను వాళ్ల సభకి వెళ్లేసరికి అక్కడ దాదాపు 40 ఏళ్ల వయసున్న ఒక డకోట మహిళ మాట్లాడుతోంది. ఆ మీటింగ్ హాల్ వాతావరణం ఎంతో గంభీరంగా ఉంది. సాధారణంగా వాళ్లు చాలా సుతిమెత్తగా, నిదానంగా మాట్లాడుతుంటారు. వాళ్ల మాటలు దు:ఖంతో నిండిన గొంతు దాటి బయటకు వస్తుంటాయి. ఆ మహిళ తన జీవితాన్ని తానే విశ్లేషించుకుంటోంది. దాన్ని నలుగురితో పంచుకుంటోంది. చిన్నతనంలో తనని తన కుటుంబం నుండి వేరుచేసి ఒక రెసిడెన్షియల్ స్కూల్‌లో ఉంచారు. అప్పటి పరిస్థితి గురించి, దాని ప్రభావం గురించి మాట్లాడుతోంది.

మూలవాసీ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చేర్చడం అంటే వాళ్లని ఒక “నాగరికత” బెల్ట్ మీదకు ఎక్కించడం. నాగరికత మిషన్‌తో నడిచే ఈ రెసిడెన్షియల్ స్కూల్‌లోకి పోగానే మూలవాసీ పిల్లలకు మొదటగా వాళ్ల జుట్టు కత్తిరిస్తారు. (మూలవాసులు ఆడ, మగా అందరూ జుట్టు పెంచుకుంటారు). బట్టలు మార్చేస్తారు. వాళ్ల ఆహారపు అలవాట్లని ఎగతాళి చేస్తూ కొత్త (తెల్లజాతి ఆహారపు) అలవాట్లని నేర్పుతారు. వాళ్ల భాష మాట్లాడితే శిక్ష విధిస్తారు. ఇంగ్లిష్ భాషని బలవంతంగా నేర్పిస్తారు. బైబిల్ చేతికిస్తారు. అదే అన్ని సమస్యలకు పరిష్కారం అనే నమ్మకంలోకి నెట్టేస్తారు.

ఒక్క మాటలో చెప్పాలంటే, వాళ్లలోని మూలవాసీ ఆనవాళ్లని బలవంతంగా తుడిపేసి తెల్లజాతి సంస్కృతిని వాళ్ల మీద రుద్దుతారు. మొత్తంగా, మూలవాసీ పిల్లలు పరాయీకరణకు గురవుతారు. తమ నుండి తాము వేరు చేయబడతారు. తమ కుటుంబాలు, తమ జాతి మనుషులు వాళ్లకు కొత్తగా కనబడతారు. వాళ్లు మూలవాసీ సంస్కృతిలో, చరిత్రలో భాగం కాలేని మనుషులుగా మిగిలిపోతారు. అయితే ఆ రోజు మీటింగ్‌లో మాట్లాడుతున్న మహిళ చిన్నతనంలోనే రెసిడెన్షియల్ స్కూల్‌కి వెళ్లి, అక్కడ నుండి ఒక తెల్లజాతి కుటుంబం దత్తత తీసుకుంటే, వాళ్ల దగ్గరే పెరిగి తన మూలాలు ఏంటో తెలియకుండానే బతికింది. తనకి 40 ఏళ్లు వచ్చిన తర్వాత గాని తాను మూలవాసీ సంతతికి చెందిన మనిషినని పూర్తిగా అర్థమయ్యాక తన జీవితంలో ఏం కోల్పోయిందో వెనక్కి తిరిగి చూసుకున్నది. వెనక్కి తిరిగి చూసుకోవడమంటే అదేదో కేవలం జ్ఞాపకాలని కుప్ప పోసుకోవడం కాదు. ఆమె అనుభవించిన పరాయీకరణని, దాని ద్వారా తన జీవితంలో ఏం కోల్పోయిందో, ఎంతటి బాధ అనుభవించిందో చెబుతోంది. అలా చెబుతూ తన మూలాలకు సంబంధించిన విషయాల్ని ఇప్పుడు తన పిల్లలకు చెప్తున్నాను అని చెప్పింది.

ఆ మాట వినగానే ఆ రూమ్‌లో ఉన్న ఒక తెల్లజాతి పెద్దమనిషి వెంటనే “పిల్లలకు మీ మీద జరిగిన హింస గురించి, మీరు అనుభవించిన బాధల గురించి చెప్పకండి. ఎందుకంటే అది వాళ్ల మానసిక స్థితి మీద దెబ్బ కొడుతుంది. వాళ్ల వ్యక్తిత్వ వికాసం మీద ప్రభావాన్ని చూపుతుంది” అని ఒక ఉచిత సలహా ఇచ్చాడు. అప్పటి వరకు మెల్లగా మాట్లాడుతున్న ఆమె గొంతులో ఒక్కసారిగా కోపం, బాధ కలగలిసి బయటకొచ్చాయి.

“నా జీవితంలో 40 ఏళ్లు నేను ఎవరినో తెలియకుండానే బతికాను. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియకుండానే జీవించాను. నేను సమూహంలో పెరిగిన ఒంటరిదాన్ని. నాగరికత పేరిట జరిగిన విధ్వంసానికి సాక్ష్యంగా మిగిలినదాన్ని. ఇప్పటి వరకు నలుగురు నా జాతి చరిత్ర చెప్తే విన్నాను తప్ప, నేనెప్పుడు నా గురించి చెప్పుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు మాట్లాడుదామంటే, నా కడుపున పుట్టిన పిల్లలకు చెబుదామంటే నువ్వు వచ్చి అది తప్పు అంటున్నావు. కానీ నాకు మాత్రం నా పిల్లలకి చెప్పడం ద్వారా వాళ్లను మరింత మానవీయంగా ఎదిగే అవకాశం ఇస్తున్నాను అనిపిస్తుంది,” అని సమాధానం చెప్పింది. ఆమె మాటలకు అంగీకారంగా అక్కడున్నవాళ్లందరూ చప్పట్లు కొట్టారు.

ఈ సంఘటన జరిగి దాదాపు నాలుగేండ్లు అవుతోంది. కానీ నాగరికత అంటే ఏమిటి? అభివృద్ధి అంటే ఏమిటి? మానసిక వికాసం అంటే ఏమిటి? ఏ ప్రమాణాలతో వీటిని చర్చించాలి అనే అంశం వచ్చిన ప్రతిసారి ఈ సంఘటన గుర్తుకొస్తుంది. మళ్లీ ఇప్పుడు విరసం సభల్లో ఆదివాసీ సమాజం మీద తిరుగుతున్న హింస ఆధారంగా వేసిన ‘ఈ అడవి మాదే‘ అనే నాటకంలో పాల్గొన్న పిల్లల్ని ఎత్తుకెళ్లి, కౌన్సిలింగ్ పేరిట పోలీసులు మరో నాటకం ఆడారని తెలిసినప్పుడు ఆ సంఘటన మరోసారి గుర్తుకొచ్చింది.

***

ఈ నెల 4న విప్లవ రచయితల సంఘం (విరసం) తన 54వ ఆవిర్భావ దినోత్సవ సభను హైదరాబాద్ లో జరుపుకుంది. ఆ సభ భారత ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసం, హిందూత్వ ఫాసిస్టు పునాదిని బలోపేతం చేసుకోవడం కోసం మధ్య భారతంలో ఆదివాసీల మీద చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన సభ. “కగార్” పేరిట ఆదివాసులని ఖతం చేసే కార్యక్రమాన్ని భారత పాలకులు రాజ్యాంగ విరుద్ధంగా ఏ విధంగా అమలుచేస్తున్నారో వివరించే లక్ష్యంగా జరిగిన సభ. ఆ సభలో అనేకమంది కవులు, రచయితలు, కళాకారులు, ప్రజా మేధావులు మధ్యభారతంలో జరుగుతున్న మారణహోమాన్ని వివరిస్తూ, మైదానం అడవిని ఎలా కాపాడుకోవాలో, ఏం చేస్తే కొనసాగుతున్న హత్యాకాండ ఆగుతుందో చర్చించారు. వివరించారు. అదే సభలో ఆడవి బిడ్డల మీద భారత ప్రభుత్వ అర్థ సైన్యాలు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఇతర అనేక రకాల బలగాలు హింసను ఏ విధంగా, ఎందుకు కొనసాగిస్తున్నాయో వివరించే ప్రయత్నంగా ఒక నాటకం ప్రదర్శించారు.

ఆదివాసులు జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ అనే నినాదంతో (అంటే మా నీళ్ల మీద, మా భూమి మీద. మా అడవి మీద హక్కు కలిగి ఉంటూ గౌరవంగా బతకడం) తమ అస్తిత్వాన్నే రూపుమాపాలనుకుంటున్న శక్తులను ప్రతిఘటిస్తున్నారు. మధ్యభారతంలో లక్షల కోట్ల విలువ చేసే వనరులున్నాయి. ఆ వనరులను కాపాడుతూ ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీలతో కలిసి విప్లవకారులు పనిచేస్తున్నారు.

గత 75 ఏండ్లుగా ఆదివాసీలని పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి కోసమే అంటూ అడవిలోకి కొత్త దారులు వేస్తోంది. కనీసం సైకిల్ కూడా లేని ఆదివాసీల అడవి గుండా భారీ రహదారుల నిర్మాణం చేస్తోంది. భూమార్గంలో రోడ్లే కాదు, ఆకాశయానానికి సులువుగా ఎయిర్ పోర్ట్ లు కూడా కడుతుంది. ఇవన్ని ఆదివాసీలకు అవసరం లేనివి. వాళ్ల భాగస్వామ్యం లేనివి. ఈ విషయం అర్థం కావడానికి పెద్ద మేధావులై ఉండాల్సిన పనిలేదు. ఎందుకంటే భారత పాలకవర్గాలు తమ ప్రయోజనాల కోసమే పనిచేస్తాయి తప్ప సమాజంలో అట్టడుగున ఉన్న మనుషుల గురించి కాదు అనేది మనకు చరిత్ర చెబుతోంది. ఆదివాసుల బాగోగులు చూడకపోగా తమ ప్రయోజనాలకు అడ్డుగా ఉన్నారని వాళ్లను తమ శత్రువులుగా ప్రకటిస్తున్నారు. ఆదివాసీలను అంతం చేయడమే తన కర్తవ్యంగా “అంతిమ యుద్ధం” అంటూ అడవి నిండా సైనిక బలగాల్ని నింపుతున్నారు. ఆ పని కోసం భారత ప్రభుత్వం బస్తర్ ప్రాంతంలోప్రతి రెండు కిలోమీటర్లకి ఒక మిలిటరీ క్యాంపుని నిర్మాణం చేస్తోంది. ఆ క్యాంపుల నుండే ఆదివాసీ గ్రామాల మీదికి డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తున్నారు. ఎదురుకాల్పుల పేరిట కనబడితే కాల్చివేస్తున్నారు.

గత 6 నెలల్లో దాదాపు 150 మంది ఆదివాసీ బిడ్డలని, వారికి అండగా ఉన్న విప్లవకారులని భారత సేనలు చంపివేశాయి. ఇటువంటి క్రూరమైన హింసాకాండను తమ విజయంగా స్వయంగా హోంమంత్రి ప్రకటిస్తున్నాడు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని గొప్పలు చెప్పుకునే దేశంలో ఆ దేశ మూలవాసుల మీద ఇంతటి హింస ఏంటి? అని ప్రపంచం విస్తుపోతోంది. కానీ దేశంలో ఉన్న పౌరసమాజానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇటువంటి సందర్భంలో మనుషులుగా తోటి మనుషుల మీద హత్యాకాండ జరుగుతుంటే మనం ఎటువైపు నిలబడదాం అనే ప్రశ్నను సమాజం ముందు ఉంచడానికే విరసం సభలో ఆదివాసీ సమాజానికి సంఘీభావంగా ఆ నాటకం వేశారు.

ఆ నాటకంలో కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఆదివాసీల మీద భారత సైన్యం చేస్తున్న యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. చివరిగా పోలీస్ బలగాల చేతిలో చంపివేయబడిన తమ తల్లుల, తండ్రుల చేతుల్లో “ఆదివాసులపై దాడులను ఆపివేయాలి,” “జల్ జంగల్ జమీన్ హమారాహై,” “ఆపరేషన్ కగార్ ఆపివేయాలి,” “ఈ కంపెనీలు మాకొద్దు”…. నినాదాలతో ఉన్నప్లెకార్డులను పిల్లలు పట్టుకొని తమ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామన్నట్లుగా కదిలారు. అంతటితో ఆ నాటకం అయిపోతుంది. బహుశా పిల్లల్ని ఆ నాటకంలో భాగం చేయడానికి ఒక కారణం : ఆదివాసీ పోరాట సంస్కృతిని ఎత్తిపట్టడం, “నువ్వు అంతిమ యుద్ధం అంటూ ఎంత మందిని చంపినా, చివరి మనిషి వరకు నిన్ను ప్రతిఘటిస్తూనే ఉంటారు” అనే ఒక చారిత్రక సత్యాన్ని చెప్పడం.

ఆ మొత్తం సభను రహస్యంగా వీడియో రికార్డ్ చేసుకున్నతెలంగాణ పోలీసులకి (ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు హామీ పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడిచే పోలీసులకి) వనరుల దోపిడీలో గాని, ఆ దోపిడీని ప్రతిఘటిస్తూ పోరాటం చేస్తున్న ఆదివాసులుని చంపడంలో గానీ ఎలాంటి తప్పు కనిపించలేదు. కానీ ఆ సున్నిత మనస్కులకు పిల్లలని ఆ నాటకంలో భాగం చేయడం చాలా కలిచివేసింది. అందుకే సభ నుండి బయటకు వచ్చిన ఇద్దరు పిల్లలను మఫ్టీలో వచ్చి మరీ ఎత్తుకెళ్లిపోయారు. ఆ నాటకంలో ప్రదర్శించిన హింసాత్మక సంఘటనలు పసిపిల్లల హృదయాల్ని కలచివేస్తాయి కాబట్టి అందులో పాల్గొన్న పిల్లలకు, వారిని ప్రోత్సహించిన వారి తండ్రికి కౌన్సిలింగ్ అవసరం అని సదరు పోలీసు భావించారట. అందుకే ఆ పిల్లల్ని, వాళ్ల నాన్నకి ఉచిత కౌన్సిలింగ్ ఇచ్చి, మరోసారి ఇలాంటి తప్పు చేయకూడదని ఒక అండర్‌టేకింగ్ తీసుకొని పంపారు.

బహుశా దేశం మొత్తంలోనే ఇంతటి “కరుణామయ” పోలీసులు మరెక్కడా ఉండకపోవచ్చు. నిజమే. కళ్ల ముందు హింస జరుగుతుంటే చలనం లేనట్లుగా చూస్తూ ఉండిపోవాలి తప్ప రక్తమాంసాలున్న మనుషులుగా, బుద్ధిజీవులుగా ఎందుకు స్పందించాలి? అందులోనూ పిల్లలను భాగస్వామ్యం చేయడం ఏంటి? తెలంగాణ పోలీసులది ఎంతటి ఉదారవాద మానవత్వం!

మరి ఇంతకీ ఆ పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు పోలీస్‌స్టేషన్ల ఉన్నతుపాకులు ఏం చేశారో? బహుశా పిల్లల కంట పడకుండా దాచేసే ఉంటారు. కౌన్సిలింగ్ అని ఒక మంచి ముద్దు పేరు పెట్టారు కానీ, ఇంతకు ఆ పిల్లలతో పోలీసులు ఏం మాట్లాడిఉంటారు? తమ ‘‘తోటి పిల్లల్ని తమ గ్రామాలకు, బడులకు, బాల్యానికి దూరం చేస్తూ వేటకుక్కల్లా వెంటాడుతున్న ‘కగార్’ సైనిక మూకల్ని అడవి నుండి బయటకు పిలవండి’’ అని పిల్లలు అడిగితే పోలీసుల దగ్గర ఏం సమాధానం ఉండేదో?! మళ్లీ ఇటువంటి నాటకంలో భాగంగా కావద్దు అని అంటే, కనీసం మానవత్వం ఉన్న మనుషులుగా బతకొద్దు అనే మెసేజ్‌ను పోలీసులు కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చారనుకుందామా?

అయినా నాటకాలు ఆడితే చట్ట సభల సాక్షిగా దోపిడీ వర్గాలు, కులాలు ఆడాలి కానీ, పీడిత ప్రజలు, వారికి మద్దతునిచ్చే కవులు, కళాకారులు రచయితలు ఆడితే ఎట్లా? ఎన్నికల్లో బూటకాలను ప్రచారం చేయడం, గెలిచి నాటకాలను చట్టసభల్లో ప్రదర్శించడం కూడా పిల్లల మనసులను, ఎదుగుతున్న వాళ్ల వ్యక్తిత్వాన్ని గాయపరుస్తాయి కదా. మరి వీటి సంగతి ఏంటో రేవంత్ రెడ్డి పోలీసులే చెప్పాలి.

చరిత్రని చదువుకునే వయసులోనే ఆ పిల్లల్ని చరిత్ర నిర్మాణంలో భాగం చేసిన విప్లవ రచయితల సంఘానికి అభినందనలు. గడ్డకట్టుకుపోతున్న సమాజాన్ని చలనంలోకి తేవడానికి తమ వంతు ప్రయత్నం చేసిన ఆ పిల్లలకి, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు వందనాలు!

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

2 thoughts on “బూటకపు పాలనలో పిల్లల నాటకమూ నేరమే!

Leave a Reply