*చెట్టు*
నేను
ప్రశాంతంగా కూర్చొని
కవిత రాస్తుంటే..
నా వెనుకన నిల్చొని
ఆకుల చేతులతో
నను నిమిరేస్తూ,
గాలుల శబ్దంతో
నను తడిమేస్తూ
ఓ పులకింతల కావ్యాన్ని
నాకు పాఠంగా చెబుతోంది..
*గాలి*
చల్లని తాకిడితో
ఓ తాదాత్మ్యాన్ని
వెచ్చని తాకిడితో
ఓ ఉత్తేజాన్ని
కలిగిస్తుంటుంది..
రగిలిస్తుంటుంది..
కిందపడేలా చేస్తుంది
పడినా లేవమని చెబుతుంది
నిరంతరం వెన్నుతట్టి
ప్రోత్సహించే
ఆత్మీయతను, స్నేహాన్ని
నాకు పాఠంగా చెబుతోంది..
*సెలయేరు*
గలగలల శబ్దంతో
అడ్డులేకుండా ముందుకెళ్ళమని,
బండరాళ్ళను, ముళ్ళపొదలను
దాటుకుంటూ సాగిపొమ్మని
బోధిస్తుంది..
కడలిలాంటి జీవితాన్ని
ఎదురీదే రహస్యాలపాఠం
నాకు పదే పదే చెబుతూ ఉంటుంది..
*వెలుతురు*
నాలో ఓ కొత్తదనాన్ని
గుండెల్లో ఓ ఉల్లాసాన్ని
కలంలో ఓ ఉత్తేజాన్ని
నింపేస్తుంటుంది..
లోపలి చిరాకునంతా
బయటకు వెళ్ళగొట్టి
రోజూ రోజూ నన్ను
తనకు ప్రతిబింబంలా మార్చేసుకుంటుంది..
లోకాన్ని మనకు
మనల్ని లోకానికి
చూపించే అద్దాన్ని పాఠంగా
నాకు అందిస్తూనే ఉంటుంది..
*చీకటి*
నాలో నిరాశకు, నిరూత్సాహానికి
అదొక ప్రతీక..
నా కోపానికి, దు:ఖానికి
అదొక సూచిక..
తరిమేసిన ప్రతీసారి
నన్ను ఆవరించాలని చూస్తుంటుంది..
వదిలించుకోవాలనుకున్న
ప్రతీసారి
నన్ను చుట్టేయాలని చూస్తుంటుంది..
నిశ్శబ్దాన్ని
నిశ్శబ్దంలో ప్రళయాన్ని
నాకు పాఠంలా చెబుతుంటుంది..
ఈ ప్రకృతి అంతా
నాకు పాఠాలు చెప్పి
పరీక్ష పెట్టేసింది.
ఆ పరీక్ష ఫలితం..
నా ఈ కవిత్వం..