తెలంగాణలో కాలం నిలిచిందా, వెనక్కి నడిచిందా?

జూన్ 2, 2014 తెలంగాణ బిడ్డలలో అత్యధికులు భావోద్వేగాలతో ఊగిపోయిన రోజు. తమ మధ్య విభేదాలు కాసేపటికి పక్కన పెట్టి సబ్బండవర్ణాలు సంబురపడిన రోజు. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వపరిపాలన సిద్ధించిందని అనుకున్న రోజు. తరతరాల చరిత్ర పీడననూ, ఉజ్వల ధిక్కార ధారనూ తవ్విపోసుకున్న రోజు. 1969 ఉద్యమం నాటి నుంచీ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ప్రయత్నాలలో మరణించిన వందలాది అమరుల స్మృతిలో కన్నీరు కార్చిన రోజు. ఆ అమరుల ఆశయాన్ని సఫలం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామనే శపథానికి పునరంకితమైన రోజు. కాలం ముందుకు కదలడానికి ఒక కుదుపు దొరికిన రోజు. కాలం వెనక్కి వెళ్లడానికో, నిలిచిపోవడానికో వీలు లేదని సమాజం ప్రకటించిన రోజు.

పది సంవత్సరాలు గడిచిపోయాయి. మానవ పరిణామ చరిత్రలో, ఒక దేశ, ప్రాంత చరిత్రలో పది సంవత్సరాలు ఘనమైన కాలమేమీ కాదు. కాని వ్యక్తుల జీవితాలలో ఒక దశాబ్దం, పది సంవత్సరాలు, మూడు వేల ఆరు వందల యాబై రోజులు, ఎనబై ఏడు వేల ఆరు వందల గంటలు చాలా చాలా విలువైనవి. ప్రాధాన్యత గలవి. కీలకమైనవి.

కాని ఈ పదేళ్ల కాలానికి ఆ విలువా ప్రాధాన్యతా ఉన్నాయా అని ఇవాళ ఆ కాలం గడిచిపోయిన తర్వాత పునరాలోచించవలసి వస్తున్నది. చాలా మంది విషయంలో 2014 జూన్ 2న అనుభవించిన మహత్తర ఉద్వేగాలు, ఈ దశాబ్దం తర్వాత 2024 జూన్ 2 నాటికి కనుమరుగయ్యాయి. అందరూ దొంగలే, ఎవరినీ నమ్మలేము అనే నిరాశ, నిర్లిప్తత వ్యాపించాయి. అంతకు ముందు కనీసం పదిహేను సంవత్సరాలు క్రియాశీలంగా సామాజిక వ్యక్తులుగా తమ భాగస్వామ్యాన్ని, భావసామ్యాన్ని పంచుకున్న అనేక మంది నిష్క్రియలోకి జారిపోయారు. అతికొద్ది మంది విషయంలో సమాజ సంతోషం వ్యక్తిగత, కుటుంబగత సంతోషంగా కుదించుకుపోయింది. ఉద్యమ నాయకత్వమే ఉద్యమ ఆకాంక్షలకు ద్రోహం చేసిన తీరు అడుగడుగునా, అనుక్షణమూ కనబడింది.
వెయ్యి సంవత్సరాల చరిత్ర నుంచి డజన్ల కొద్దీ ఉదాహరణలు ఇస్తూ ధిక్కారం తెలంగాణ సహజ స్వభావం అని చెప్పిన మాట, ఈ పది సంవత్సరాలలో హఠాత్తుగా నిజం కాకుండా పోయిందా? పది సంవత్సరాల్లోనే కాలం మారిపోతుందా, తిరగబడుతుందా, తలకిందులు అవుతుందా, ఒక సహజ స్వాభావిక లక్షణం కనబడకుండా పోతుందా?

తెలంగాణలో కాలం నిలిచిపోయిందా? అసహజంగా? అసాధారణంగా?

ఒకరకంగా చూస్తే అవుననిపిస్తుంది. ఏ ఆశయాలతో, ఏ ఆకాంక్షల సాధన కోసం తెలంగాణ స్వరాష్ట ఉద్యమం సాగిందో ఆ ఆశయాలూ, ఆకాంక్షలూ ఉక్కుపాదాల కింద అణగిపోతుంటే, ఆ ఆశయాలకూ లక్ష్యాలకూ తప్పుడు నిర్వచనాలు సాగిపోతుంటే తెలంగాణ ఆలోచించకుండా, ప్రశ్నించకుండా, ధిక్కరించకుండా మౌనంగా ఉండిపోయింది. జోర్ జులుం కీ టక్కర్ మే సంఘర్ష్ హమారా నారా హై అని ఎన్నో భయానక జోర్ జులుం లను ఎదిరించిన జాతిలో అత్యధిక భాగం పది సంవత్సరాలు నిశ్శబ్దాన్ని ధరించింది.

గద్దెనెక్కిన వారి నిరంకుశత్వం ఒకానొక అంశం. నిజమే, మాట్లాడడానికి వీలు లేకపోయింది. సభలూ సమావేశాలూ జరగనివ్వలేదు. బహిరంగ సభలూ ఊరేగింపులూ నిషిద్ధాలైపోయాయి. చివరికి సంస్మరణ సభలను కూడా రద్దు చేసి, కన్నకొడుకు కోసం ఏడ్వదలచిన తల్లినీ, రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని తలచుకుందామనుకున్న అన్ననూ నిర్బంధించారు, బెదిరించారు, అడ్డుకున్నారు, వేధించారు. నిరసన అనే ప్రజాస్వామిక హక్కు రద్దయిపోయింది. ధర్నా చౌక్ మాయమైపోయింది. లెక్కలేనంత మంది మీద అక్రమ కేసులు బనాయించారు. పిడికెడు మందిని అక్రమంగా నిర్బంధించి, వందలాది మందిలో భయం నెలకొల్పడానికి ప్రయత్నించారు. భిన్నాభిప్రాయాలున్నవారి మీదా, అసమ్మతి వాదుల మీదా, ప్రత్యర్థుల మీదా మాత్రమే కాదు, సొంత పార్టీ నాయకుల మీదా, మంత్రుల మీదా, శాసనసభ్యుల మీదా కూడా నిఘా పెట్టారు. వాళ్లు ఎవరితో ఏమి మాట్లాడుతున్నారో అక్రమంగా రహస్యంగా చట్టవ్యతిరేకంగా విన్నారు. అలా విన్నదాని మీదా, విననిదాని మీదా కూడా ఆధారపడి కక్ష సాధింపు మొదలుపెట్టారు.

అటువంటి పనులే ఇతర పార్టీలూ ఇతర పాలనలూ చేయలేదా అనే ఎదురు ప్రశ్న జవాబు కాజాలదు. ఆ ఇతర పార్టీల మీదా, ఇతర పాలనల మీదా అసంతృప్తి, వ్యతిరేకతల తోనే, స్వపరిపాలన, అదీ ఉద్యమ పార్టీ పాలన భిన్నంగా ఉంటుందనే, ఉండాలనే అధికారం చేతికిచ్చారు. ఆ అధికారాన్ని అవతలివాళ్ల లాగానే, అంతకు ముందరి వాళ్ల లాగానే వాడేట్టయితే, వాళ్లనే సాకుగా చూపెట్టేట్టయితే పాలనలో మార్పు ఎందుకు?

అంతకు ముందు సాగిన వనరుల దోపిడీ నుంచి విముక్తి కావాలనుకుంది తెలంగాణ. పది సంవత్సరాలలో తెలంగాణకు దక్కినది అంతకు మించిన వనరుల దోపిడీ.

తన భాషకూ, సాహిత్యానికీ, సంస్కృతికీ అవమానం జరగగూడదనీ, అవి విస్మరణకో, చిన్నచూపుకో గురి కాగూడదనీ కోరుకుంది తెలంగాణ. పది సంవత్సరాలలో భాషా సాహిత్య , సాంస్కృతిక రంగాలలో జరిగిన పెద్ద మార్పులేమీ లేవు. ప్రచార సాధనాలలో, సినిమాలో, పాలకుల పోషణలో నిన్నటిదాకా విమర్శకు గురయిన ప్రాంతానికే ఎక్కువ పాత్ర దక్కింది. చేయవలసిన పని బారెడంత కాగా, చేసిన పని చిటికెన వేలంత కాదు. దానికే ఏదో మహత్తరమైనది సాధించామన్నట్టు అంతుబట్టని ప్రగల్భాలు. వందిమాగధుల స్తోత్ర పాఠాలు.

తన ప్రాంతంలో పారే నీరు తనకే దక్కాలనీ, తన బీళ్లు మాగాణాలు కావాలనీ కోరుకుంది తెలంగాణ. పది సంవత్సరాలలో నీరు నీరుగా ఉండడం మాని, విజయవంతంగా భావోద్వేగంగా మారిపోయింది. ఒకసారి భావోద్వేగంగా మారిన తర్వాత దాని భౌతిక లక్షణాలు మాయమవుతాయి, దానితో మాయ చెయ్యడం సులభం అయిపోయింది. నీరు ఇస్తున్నామనే పేరుతో అసత్యాలూ అర్ధసత్యాలూ ప్రవహింపజెయ్యడం మొదలయింది. పల్లానికి నీరు ఎంత ప్రవహించిందో తెలియదు గాని ఎగువకు, ఎవరిని నిన్నటి వరకూ విమర్శించామో ఆ డబ్బు సంచులకు, ఆ గుత్తేదార్లకు, డబ్బు ప్రవహించింది. అక్కడి నుంచి తెలంగాణాధీశుల బొక్కసాలకు ఎత్తిపోతలూ సాగాయి.

ఉమ్మడి రాష్ట్రంలో తన విస్తీర్ణానికీ, జనాభాకూ తగిన నిష్పత్తిలో న్యాయమైన వాటా నిధులు దక్కలేదని ఫిర్యాదు చేసింది తెలంగాణ. ఆక్రోశించింది, గగ్గోలు పెట్టింది, వాదించింది, గణాంకాల తార్కాణాలు చూపించింది. ఈ పది సంవత్సరాలలో ఆ ఫిర్యాదుకు అవకాశం లేదు. న్యాయమైన వాటా అనే మాటకు కాలం చెల్లిపోయింది. కాని అందిన మొత్తానికి మొత్తం నిధులు ఎటు ప్రవహించాయో, ఎక్కడెక్కడ ఎవరెవరు కాల్వలు మళ్లించుకున్నారో, నిధులు కాదు, అవినీతి ప్రవాహాలు తెలంగాణమంతటా వ్యాపించాయి. యథా రాజా తథా రాజోద్యోగీ, తథా రాజాశ్రితా అన్నట్టు అవినీతి తరతమ స్థాయిల్లో రాష్ట్రవ్యాప్తమయింది. భవిష్యత్ తరాల ఉనికిని కూడా తాకట్టు పెట్టే కనీవినీ ఎరగని రుణభారం పెరిగింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలలో తన న్యాయమైన వాటా తనకు దక్కలేదనీ, అందువల్ల తన బిడ్డలు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారనీ ఆక్రోశించింది తెలంగాణ. ఈ పది సంవత్సరాలలో తెలంగాణ బిడ్డల నిరుద్యోగం ఏమీ మారలేదు సరిగదా పెరిగింది. కొత్త ఉద్యోగకల్పన జరగలేదు, ఉన్న ఉద్యోగాలనైనా నింపడం జరగలేదు. కనీసం పదవీ విరమణలతో ఖాళీ అయిన ఉద్యోగాలూ భర్తీ కాలేదు. ఉద్యోగాల కన్నా ఎక్కువగా దొంగ లెక్కలూ, అబద్ధ ప్రగల్భాలూ ఉత్పత్తి అయ్యాయి. పెరిగిపోతున్న నిరుద్యోగ యువత చేతిలో ఒక పోర్న్ సెల్ ఫోన్ పెట్టి, నోటికి ఒక సీసా అందించి, ఇంకా కావాలంటే ఉడ్తా పంజాబ్ లా, ఉడ్తా తెలంగాణగా మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చి నిరుద్యోగ యువతరానికి విధ్వంసమే ఉద్యోగమనే ఆభాస కల్పించింది.

పది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధే లేదా అని గుడ్లురిమి చూసే వారుంటారు. కాని అభివృద్ధి కోసమే రాష్ట్రం ఏర్పరచుకున్నప్పుడు, ఆకాంక్షలు తీరుస్తారనే, అభివృద్ధి సాధిస్తారనే ఒకరికి అధికారం కట్టబెట్టినప్పుడు వారు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే గింటే అది వారి విధ్యుక్త ధర్మ నిర్వహణ మాత్రమే గాని ఎవరికో మెహర్బానీ చెయ్యడం కాదు. అందుకు ఎవరూ వారికి కృతజ్ఞులై ఉండనవసరం లేదు. ఇదేమీ రాచరిక ఔదార్య పాలన కాదు. ప్రజా ప్రాతినిధ్య పాలన. మరి అది ప్రజా ప్రాతినిధ్య పాలనలా కాక, మధ్యయుగ రాచరిక పాలనలా, సర్వజ్ఞ సింగభూపాలుని రెండో రాకడలా, రాచకొండ రాజ్యపు పునర్జన్మలా సాగితే, కాలం వెనక్కి పోయినట్టా, నిలిచిపోయినట్టా?

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

One thought on “తెలంగాణలో కాలం నిలిచిందా, వెనక్కి నడిచిందా?

  1. అయ్యో మీరు జ్వాలా నరసింహారావు గారు ఆలపిస్తున్న కేసీఆర్ భజనగీతాలను భక్తితో చదువుతున్నట్లు లేదే. కేసీఆర్ గారు ప్రపంచంలోనే అత్యంత విఖ్యాతులైన సమర్ధులైన విశ్వసనీయులైన అభివృద్ధి సాధకులైన పరమగౌరవనీయులైన మహాపాలకులు అన్నది అర్ధం చేసుకోలేక పోయారే. కేసీఆర్ గారు తెలంగాణకే కాక యావద్దేశానికీ మరీ సూటిగా చెప్పాలంటే యావత్ప్రపంచానికీ దిక్కూదివాణం అని నొక్కివక్కాణించ వలసిన త్రికాలపూజ్యనాయకులు. గ్రహించగలరు.

Leave a Reply