గాంధారి ఖిల్లా

మాగి కాలం మాపటేళ్ల మేతకు పొయ్యిన గొడ్లు, బర్లు అన్ని ఇంటి మొఖం పట్టినయ్..
పనిమీద బయటికి పొయ్యచ్చిన మా బావ (నా పెనిమిటి) “ఓ… పిల్లా… గొడ్లు, బర్లు అచ్చె యాళ్ల అయింది. ఇంక ఇంట్లనే దిద్దులాడవడితివి. దొడ్డి కాడికి పొయ్యి దుడ్డలను జాడదీసి జరంత మట్లకు పెట్టుపోరాదు… నేను పొయ్యి గడ్డి తెత్తా”

“అయ్యో… నేనేం దిద్దులాడుతున్ననోయి. నీకే ఇంత సాయ (చాయ్) బొట్టు ఇత్తనని పొయ్యిమీద పెడితిని”
“మా పెట్టినవ్ తియ్ అదేమన్న కట్టల పొయ్యా! గ్యాస్ పొయ్యేనాయే. అయినంక నేను తాగుతాలే గాని నువ్వు ఇగ ఇంటెనుకకు పో”
“హా..! మా పోతన్న తియ్ అంటే ఆగనే ఆగవు”

ఇంతల బర్లు, గొడ్లు రానే అచ్చినయ్. అన్ని కలిపి ఓ పది, పదిగేను సనుగులు అయితయ్..
ఓ బఱ్ఱె అటువురుకుతే, ఓ గొడ్డు ఇటు ఉరకవట్టే. సక్కగా మట్టు కాడికి అచ్చి నిలవడితే ఒట్టు..
అటురుక, ఇటురుక నాకేమో యాస్టకు రావట్టే..
నీ అవ్వ! బర్లకునా పారెత్తు అంటూ… సేతిల కట్టే, నడుమీద సెయ్యి ఏసీ ఈ కట్టం పగోనికి కూడ రావద్దురా దేవుడా అని వాటి ఎంబడి ఊరుకాతా ఉంటె..
గడ్డి మోపు ఎత్తుకొని గప్పుడే అచ్చిన మా బావ నన్ను సూసి పక్క పక్క నవ్వవట్టే.
“ఏంది బావ గట్ల నవ్వవడితివి. బర్లు మట్ల మీదికి అత్తలేవ్ అని నేను భాధ పడితే, నీకు నవ్వులాట అయిందా…?”

మా బావ నవ్వుకుంటనే..
“ఓసి.. పిచ్చి నా సరూ..! వాటి ముందు మేతలేకుంటే ఎట్లాగుతయే, ఎడ్డి మా లోకమా..” అనుకుంటా ఏవో సాత్రాలు ఏసుకుంటా నన్నుకూడ నవ్వియ్య వట్టే.
ఈ లోకం మరిసి ఇద్దరం పక్కపక్క నవ్వుకుంటా పనిమీద పడితిమి.

ఇంతల మా బిడ్డ (మా యారాలు కూతురు)
“సిన్ని ఇంట్ల నీ ఫోన్ మోగుతుంది. ఇక్కడ మీరు ముచ్చట మీద పడ్డరా!”

“లేదురా ! బర్లు మట్లమీదికి అత్తలేవ్ ఎగపోసుకుంటా ఆటి ఎనుక ఊరుకుతా ఉంటే అది చూసి మీ సిన్న బాపు నవ్వవట్టే. ఏం చేసేది..
సరే! అత్తన్న పా..!”
ఇంట్లకు అచ్చి ఫోన్ చూసిన ఎవరు ఫోన్ చేసిందా అని..మా(అక్క) పెద్దాడి బిడ్డ! తిరిగి నేను మల్ల చేసిన..
ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఇంతలో మా అక్క(పెద్దాడి బిడ్డ) (మా బావోళ్ల పెద్దక్క… మా కాడ ఆడిబిడ్డను కూడ అక్కా! అనే అంటం) ఫోన్ తీసింది..
“హాలో… అక్కా! ఫోన్ చేసినవ్ గా..”
“హా..! చేసిననే. ఎల్లుండి దీలే నోములు. అందరు రండీ. ఇంతకు పిల్లలు మంచిగా ఉన్నరా…? ఎక్కడ ఉన్నరే? సెలవులకు ఇంటికి అచ్చిండ్ర ! హాస్టల్లనే ఉన్నరా…?”
“హాస్టళ్లనే ఉన్నరక్క. సెలవులు లెవ్వట..”
“సరేగాని మా అవ్వ మంచిగా ఉన్నదా…?”
“హా..! ఇగ గట్లనే ఉన్నదక్క”
“ఒకసారి మా తమ్మునికి ఫోన్ ఇయ్యే, పని ఉంది వానితోని”

“సరే అక్కా”

మా బావకు, నాకు మా ఇంట్ల అందరికి పెదరాయుని లెక్క… మా అక్క. తన మాటంటే మా ఇంట్ల అది శాసనమే. మా అక్క అంటే అంత ఇష్టం, గౌరవం మరీ… మా అందరికి.
మా ఇంట్ల ఆమె మాట కాదనే వారే లేరు.
మా అత్త తరువాత ఆమె అందరికి అవ్వ లెక్క.
అందరికన్న తనే పెద్దది. మేం నలుగురం కోడళ్లం. మా అందరికి కూడ ఆమె అమ్మనే.
ఆడపడుచు హోదాలో మమ్ముల మందలించేది కాదు.
ఆమె మా అమ్మ, మా పెద్దక్క మంచి, చెడు, కష్టం, సుఖం విలువ తెలిసిన మనిషి.
జీవితం పట్ల ఎలా బాధ్యతగా ఉండాలో నేర్పే మనిషి.
అందుకే ఆమె అంటే అంత గౌరవం.
మా అక్క(మా ఆడబిడ్డ) సింగరేణి కార్మికురాలు. చనిపోయిన మా అన్న (మా ఆడబిడ్డ భర్త) ద్వారా అణువణువునా అభ్యుదయ భావాలను కలిగిన గొప్ప ఆలోచనలను ఉన్న మనిషి.
మా అన్నను ఓర్వ లేని కళ్ళు కత్తిపోటుకు గురిచేసినై.
కానీ మా అన్న(కాల్వ మల్లేష్) సింగరేణి కార్మికునిగా తోటి కార్మికుల కష్టాలను అర్థం చేసుకొని వారికి అండగా వుంటూ ‘‘మన హక్కుల సాధన : మన స్వేచ్ఛ’’ అని నినాదంతో ముందుకువెళ్లే మనిషి. కానీ, అది జీర్ణించుకోలేక మా అన్నను పొట్టన పొట్టుకున్నరు కొంత మంది దుర్మార్గులు.
కానీ తను కార్చే ప్రతీ చెమట చుక్క అతని చివరి రక్తపు బొట్టు వరకు అతని చివరి శ్వాస వరకు నలుగురికి సాయం చేస్తూ… అభ్యదయ భావాలతోనే వున్నడు.

అదే ప్రేరణగా మా అన్నే మా అక్కకు ఆదర్శంగా..
ముగ్గురు చిన్న పిల్లలను ఇంకా లోకం పోకడ తెలియని పసి పిల్లలు. వాళ్ళను ఎలా పెంచాలో తెలియని అయోమయం. అప్పటి వరకు ఇల్లే ప్రపంచం అయిన తనకు బయట ప్రపంచంలో ఎలా బతకాలో తెలియని అమాయకత్వం. కానీ గుండెను రాయి చేసుకుంది. మా అన్న పోవడం వల్ల ఆ ఉద్యోగం మా అక్కకు వచ్చింది. దాని ఆధారంతో ఆ పసి పిల్లలను చదివించుకుంది. వాళ్ళను ప్రయోజకులను చేయడానికి ఆమె పడ్డ బాధలు ఎన్నో, అవమానాలు ఎన్నో. వాటన్నిటినీ దాటుకుంటూ పిల్లలను మంచి స్థాయికి తెచ్చింది. ఒంటరి పోరాటం చేసింది జీవితాన్ని గెలవడానికి.

ఒక్క నిమిషంలో అవన్నీ నా కళ్ళ ముందు గిర్రున తిరిగినై.
తొందరగా తేరుకొని, “బావా, ఓ.. బావా… పెద్దక్క నీతోని మాట్లాడుతదట. తొందరగా రా..!”
“ఏంటిదటనే..! అత్తన్న అత్తన్న..”
పెరట్ల ఉన్న బావ జెల్ది అచ్చి, నా చేతుల ఫోన్ తీసుకున్నడు.

ఫోన్ స్పీకర్ ఆన్ లనే వుండే..
మా అక్క సెప్పేది నాకు గూడ ఇనబడుతంది.
“హా… అక్క చెప్పే..!”
“హలో..! అరేయ్ చిన్నోడ ఎల్లుండి దీలే నోములు.. మరదలను తీసుకొని పొద్దుగాలనే రా.. నోము కావాల్సినయ్ అన్ని తెచ్చుకున్న గాని.. రాంగ మర్రి ఆకులు,మర్రి ఊడలు, తంగేడు, కొన్ని బంతి పువ్వులు, హా..మామిడి ఆకులు కూడ తేరా..”
“హా..! సరెనే”
మా ఊరు అంత జంగల్ రాజ్యం మా కాడ సెట్టు, సేమ ఎక్కువ గందుకే అన్ని దొరుకుతయ్ అని మా అక్క.. ఆ పని మా బావకు అప్పచెప్పింద

ఆ రోజు నేను మబ్బులనే లేసి అలుకుపూత
అంత జెప్పన సేసుకొని పూజ జెల్దె కానిచ్చిన..
మా బావ గూడ మబ్బులనే లేసి దొడ్డికెయి పొయ్యి బర్ల సంగతి సూసిండు..
కుడిది పెట్టుడు,మేత ఏసుడు..

పాలిచ్చే బర్లు ఓ నాలుగు మా ఉన్నయ్ వాటి పాలు
పిండుకొని మా బావ ఇంట్లకు అచ్చిండు..
“పని అయ్యిందానే సరూ..తయారు అయినవా
పొయ్యిమీద మల్లనాకు నీళ్లు ఏసినవా.. గిదే సందు అని సనీళ్లు గతి సేత్తవా..
ఏమోనన్నా..!కడుపుల పెట్టుకున్న కోపం కట్టెల మీద తీసి మండకుండ సేత్తివ.”

మా బావ నవ్వుకుంట నాతోనే పరాసికం ఆడుతుండు..
“అవ్ కద బావ..నా గీ ఉపాయం దోయక పాయే సలికాలం సన్నీళ్ల తానం సేపిచ్చి నాఎత అంత ఏళ్లదీసుకుందు..”
నవ్వు కుంటా నేను గూడ..
“నాకు తెలిసే మొగన్ని సాధిచ్చుడే మీ పెళ్ళాలు అంత… నవ్వు కుంటా మళ్ళీ”

ఇగ మా బావ పొయ్యి మీది నీళ్లు దోడుకొని తానానికి పొయ్యిండు..
ఆ లోపు నేను ఇన్ని పాలబొట్లు,పెరుగు, నెయ్యి డబ్బాలల్లా పోసుకుంటా ముల్లెలు కట్టిన..
ఇంటెనుక పెరట్ల కోసిన బంతి పువ్వులు అన్ని సంచిల పోసి పెట్టిన..
మా ఇంటి పక్కనోళ్ళకు బర్లుపోంగ ఇడువు మని సెప్పి ఇగ బయలు దేరినం..
పోంగ, పోంగ మా బావ మాటమీదికెళ్లి మాట అచ్చి
“మీ అన్న గాడు (మా ఆయన వాళ్ళ దోస్త్..రమేషన్న) బండి మీదికెళ్లి పడ్డడే నిన్న కొద్దిగంత మోకాలు కొట్టుక పోయింది.”
“అయ్యో! ఎంత పనాయే నాకు నిన్న సెప్పలేదుకదా బావ..”
“ఏదో పని మీద పడి సెప్పలేదే”
“సరే దారిలనే గా..అన్నను సూసి పోదాం”
“సరెనే”
ఇంతల మా అన్నవాళ్ళ ఇల్లు రానే అచ్చింది..
బండి దిగి గలుమలకు పోంగనే మా అవ్వ (మా బావ దోస్త్ వాళ్ళ తల్లి)ఎదురుంగ అచ్చి బిగ్గీత అలుముకొని గినొద్దులకు మతికచ్చినమా బిడ్డా! అని ఒక్కసారి
కడుపుల దుఃఖాన్నంత వలపోసింది..
మా అవ్వ ( రామవ్వ ) నన్ను కనలే,పెంచలే కానీ ఆత్మగళ్ళ అవ్వ.. తల్లిని పోగొట్టు కున్న నాకు సొంత అవ్వ లెక్కనే..
నేనంటే మత్తు పావురం,పానం ఇడుసుకుంటదినామీద..
నువ్వు నా పెద్ద బిడ్డవ్ గాదే అవ్వా!అని నన్ను సూసుకుంటా మురిసిపోతది.

“ఓ..అవ్వ వుకోయే.. కట్టాలు మనుషులకు కాకుంటే ఎవరికి అత్తయే.” అని నేను గూడ కండ్ల నీళ్లు తీసుకుంటా మా అవ్వను ఊకోబెట్టిన..
“బావ నాకు రాంగ ఇయ్యలనే సేప్పిండవ్వా అన్నకు దెబ్బతాకిందని నిన్న సెప్పలే లేకుంటే నిన్ననే ఫోన్ చేద్దును..గందుకే అన్నను సూసిపోదాం అనే అచ్చిన.. అట్లనే పెద్దక్కోల్లు నోముకుంటుండ్రు ఆడికి పోదాం అని..”
“సరేగాని రా బిడ్డా..! గిట్ల కూసో “
అని ఆడ ఉన్న నులక మంచం ఆల్చింది..
నేను పొయ్యి కూసున్న..
“సాయి, ఓ సాయి..!”
మా అన్నోళ్ల భార్య ( సాహితీ) లోపల ఉంది.. మా అవ్వ నేను అచ్చినఅన్న సంబురంలో జెరంత గట్టిగనే పిలువ వట్టే..

‘సాయి” మూడో పిలుపు లోపల వంట చేయడంలో నిమగ్నమయ్యిన వదినకు గట్టిగా పిలిచే దాక ఇనబడలే..
“అక్క అచ్చిందే.. మీ చిర్రకుంట అక్క..”
ఆ పిలుపు విన్న మా వదిన క్షణం ఆగలే..
బయటకు జెప్పన అచ్చి
“హా..! అక్క మంచిగా ఉన్నవా..? గిదేనా రాక..?
ఇన్నోద్ధులకు యాదిల పడితిమా.. అంటింట్ల బువ్వ అండవడితి గంతుకే అత్త పిలిసింది ఇనబడలే .”
ఆత్మగళ్ళ మా వదిన ఆలింగనం ఆప్యాతను కురిపిస్తూ కుశలం అడగవట్టే..
ఆమె కళ్ళల్లో గడ్డ కట్టిన కన్నీరు నా కళ్లను సూటిగా చూస్తూ కరిగి నన్ను ప్రశ్నిస్తుంది..
“అన్నకు దెబ్బతాకే ,అవ్వ పొలం కాడ జారిపడే..
ఇంట్ల అంత అడ్లు, పెరుగు కలిపినట్టు ఎమ్ మంచిగ లేదాయే.. నువ్వు ఒక్కసారన్న రాకపోతివి..”

రక్త సంబంధం కాదు, బంధుత్వం కూడ కాదు..
ఆత్మగళ్లమనుషులు అభిమానం అనే హక్కు,అధికారం నా పై వాళ్లకు ఉంది..

అసొంటి ఆపతిల నేను పక్కకు లేకుంటే ఆళ్ల ధైర్యం సన్నగిల్లి ప్రశ్నిస్తూవుంటే.
ఎమ్ చెప్పాలో అర్థం కాని నేను మా వదినను,అమ్మ ను గట్టిగా హత్తుకున్న..
ఇగ అందరం కూసున్నం .
మా వదిన
“అన్నా, వదిన..సేతులు కడుక్కొని రాండి..
బువ్వ తినేరు”
“అయ్యో!వదిన పెద్దక్క వాళ్ళు నోముకుంటుండ్రు వాళ్ళ ఇంటికి పోవాలే.. బువ్వ తిని పోము గాని..గొంత సాయ(ఛాయ)పెట్టు తాగి పోతాం..”

మా అవ్వ బువ్వ తింటలేరని కోసేపు గులిగింది.
మా వదినే సరే అంటూ లోపలికి పోయింది.
‘”సరేగాని బిడ్డా! ఈ బుధవారం బొక్కలగుట్ట “గాంధారిఖిల్లా”కు పొయ్యేది ఉంది. ఇంట్ల ఎమ్ మంచి జరుగుతలేదాయే గందుకే మొక్కుకున్న.
గి మొక్కు ఎప్పడిదో ఇగ తప్పదు ఈసారి తప్పక పోవుడే..
మీ బాపు నిన్ననే మేకను కూడ తెచ్చిపెట్టిండు.”

నడిమిట్ల నారాయణ లెక్క మా బావ
” అత్త.!గిది కార్తీక మాసం మీ బిడ్డ నీసు తినదాయే తినంది ఆడికి అచ్చి ఎమ్ సేత్తది సెప్పు..
ఓ ముక్క తినేది కాదాయే.. సుక్క ఏసేది కాదాయే..గిదెందుకు అత్త మనతోని తొంటపేరంటం లెక్క”
నన్ను సూసుకుంటా పక్క,పక్క నవ్వుకుంటా అనవట్టే..
“ఏ వుకో బిడ్డా! గట్ల అంటావ్ నా బిడ్డ రాకుండ మేమెట్ల పోతాం..”
“అది కాదే అవ్వా! పరాశికాల మనిషి మీ అల్లుడు..
ఎప్పడి నుండో తీసుకుపొమ్మని మీ అల్లున్ని పోరుపెడుతున్న తీసుకపోతలేడు. .. ఇంటి ముంగటి ఆకిట ఉన్నట్టు ఉందిగని తీసుకుపోవడానికి తీరలే మీ అల్లునికి..
గందుకే “బొక్కల గుట్ట” అంటే సంకలు గుద్దు కుంటా అత్తనని..
అట్ల అంటుండు మా బావ,రమేషన్న…

ఇద్దరు మంచి సోపతి గాళ్ళు..ఇద్దరు ఒక కాడనే ప్రయివేటు బడి పంతుళ్ళు.. ఒకరు తెలుగు, ఇంకొకరు లెక్కలు.
కానీ వారిరువురికి ప్రభుత్వం పట్ల అసహనం మారుతున్నవి ప్రభుత్వాలే తప్ప వారి బ్రతుకులు కాదని..ఈ వ్యవస్థ మీద విరక్తితో కూడిన వ్యతిరేకత..
రిజర్వేషన్ పేరిట నోటికాడికి అచ్చిన కూడను లాక్కొని ఇంకొకరికి ఇస్తుంటే చూస్తూ ఎన్నాళ్ళు ఈ అన్యాయం అని పిడికిలి బిగించి పోరుబాటన నడుస్తున్న యువరక్తం..
కుల పిచ్చి గజ్జిలా అంటుకున్నంత కాలం బహుజన వాదం బలపడదని ఐక్యతతో అన్యాయాలను ఎదురించాలని ఆరాటపడే మనుషులు..
బహుజనుల పట్ల స్వార్థ రాజకీయాలు చేసే కుట్రలను తరిమికొట్టాలని సమాజాన్నీ మేల్కొలిపే నిస్వార్థలు..
ఇలాంటి సోపతికి అన్ని మంచి ఆలోచనలే..

ఇంతలో వాళ్ళు మర్రి ఆకులు, మర్రి ఊడలు, తంగేడు అన్ని తీసుకొని వాళ్ళ పొలంకాడ పండిన కూరగాయలు కూడ ఓ సంచి నింపుకొని అచ్చిండ్రు
మా అన్న..
మోహమాటానికైనా ఎంత అద్దన్న వినరు..
మా అవ్వ నాకు సొంత అవ్వలెక్కనే అన్ని ముల్లెలు గట్టి పంపుతది.
కూరగాయాతో పాటు, అన్ని దినుసులు ఆరొక్కటి ఏది పండుతే అది నా బిడ్డకు అని ముల్లె గట్టి మా అన్నతో పంపుతది..
ఇగ అక్కడి నుండి బయలు దేరుతూ
తప్పకుండ బుజారం (బుధవారం) పొద్దుగాలనే అత్త అవ్వ .. అంటూ అక్కడికెళ్లి మా పెద్దక్క ఇంటికి బయలు దేరినం..
ఆరోజు నోముకొని తిని ఇంటికి అచ్చె వరకు సీకటి అయ్యింది..
ఇగ రెండొద్దులు గడిచినయ్..

బుజారం రానే అచ్చె..
ఇగ అప్పుడు సూడాలే నా సంబురం ఎప్పుడెప్పుడు “గాంధారి ఖిల్లా” చూద్దామా అన్న ఆరాటం..
మబ్బులనే లేసి మా బావను గూడ జెప్పన తయారు గమ్మన్న.
“ఏందే! నీ సంబరం సల్లగుండ.. నీ ఏగిర్ధం చూస్తుంటే.. నాతిరి నిర్ధ కూడ పోనట్టు ఉన్నావ్..
బర్ల పాలు పిండద్దానే..ఆగు”
మా బావతోని గుట్ట మీద ఒక సెల్ఫీ దిగుదాం అని మంచి సీర కట్టుకున్న..
నేను తయారు అయ్యే లోపే మా బావ అచ్చి..
“ఏమైందే బుజ్జి నన్ను ఏగిర్థ పెట్టి నువ్వు ఇంకా తయారే కాలేగా… నాకు తెలుసే ఆడోళ్ళు ఒడవనియ్యరు, తెగనియ్యరు అని”
” అయిపోయుంది బావ అత్తన్న జేడ ఏసుకుంటే అయిపోయే”

“ఓ..నీ వాలు జడ… సిప్పురు బూరు ఏసుకొని శివసత్తి లెక్క ఎంటికలు ఇరవోసుడేనాయే..అదో జడ.. ఈ మధ్య ఆడోళ్ళు నెత్తికి మంచిగ నూనె పెట్టుకొని మంచిగ జెడ అల్లుకొని తల నిండ పువ్వులు పెట్టుడు మర్సిపొయ్యి ఎంటికలు కత్తిరిచ్చుడు గిట్ల ఇరవోసుడు..
సాలు,సాలు గాని ఇగ నడువ్”

ఇంతలో అన్న వాళ్ళ దగ్గరి నుండి ఫోన్
“బయలు దేరిండ్రా”
“ఎక్కడా! మీ అక్క ముస్తాబు ఒడువలె.. మీరు నడువుండ్రి మేము బండి మీద అత్తం”

నేను రెడీ అయిన ఇద్దరం బండి మీద బయలు దేరినం..”గాంధారి ఖిల్లా”.. మా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో బొక్కగుట్ట గ్రామం వద్ద ఉంది..

మా ఊరికి కూడ బాగ దూరం ఎమ్ కాదు దాదాపు ఓ పది, పదిహేను కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది..అంతే
కానీ ఏటా ఇక్కడ ఆషాడ మాసం లో జరిగే బోనాల జాతరకు ఒక్క సారన్న మా బావ తీసుకురాలే..
ఇయ్యాల నా కల నెరవేరుతుంది.
ఆమాట, ఈ మాట మాట్లాడుకుంటా పోతావుంటే జెప్పన్నే అచ్చె..
“గిదేనా బొక్కల గుట్ట ఊరు..”
నేను మెయిన్ రోడ్డు మీది నుండి మంచిర్యాలకు చాలా సార్లు వెళ్ళా కానీ ఊరు లోపలికి ఎప్పుడు పోలే..
గిదే మొదటి సారి..

ఊరు సొర్రంగ్గనే తేట నీళ్లతో వాగు..
వాగు మీద బ్రిడ్జి
“అబ్బ ఎంత గమ్మతి ఉంది.గేదేం వాగు బావ”
“ఇది రాళ్ళ వాగే..పారుకం ఎక్కువ ఉండి నీళ్లు తేటగ ఉంటాయి”
పక్క పాంటి పార్కులు… అందమైన చెట్లు..
ఇగ బొక్కల గుట్ట ఊరు సొచ్చినం..
“బావ…. గుట్ట ఈ ఊరికి ఇంక ఎంత దూరం ఉంటది?”
“దగ్గరనేనే… దాదాపు రెండుమూడు కిలోమీటర్ల ఉంటది”
ఊరు దాటినం. గుట్ట మొదలు అయ్యింది..
జంగల్ మధ్యల కెళ్ళి దారి..తొవ్వోంట అటు,పక్క దట్టమైన సెట్లు..
నాకైతే ఏదో వేరే లోకం పోతున్నట్టు అనిపించింది.

మేము వెళ్లే సరికే మా అవ్వ వాళ్ళు అక్కడికి సేరుకున్నరు..
గుట్ట కింద అంత మైదానం మంచిగా ఉంది..
అండుకోవచ్చు,తినచ్చు ఎంత మంది అయిన సరే..

మా అవ్వ ఏగిర్థపడుతుంది..
“గింత సేపు సేత్తివి బిడ్డా.. బోనం పొయ్యాలే.. బోనం ఎత్తుక పొయ్యి మొక్కులు సెల్లియాలే.. యాటను కొయ్యాలే..అండాలే, తినాలే అంటే గొంత సేపు పడుతదా”
“అచ్చినంక ఆగుతదా ఎనుక ముందు..ఏగిర్థ పడితే అయ్యే పని కాదు కదా అత్తా” మా వదిన
” నువ్వు పా అక్క..పక్కన సెలిమె వుంది పొయ్యి మనం నీళ్లు తెద్దాం..
మీ అన్న,మా అన్న గొన్ని కట్టపుల్లలు,పొయ్యి రాళ్లు జాడ తీత్తరు”
“సరే! పోదాం పా వదిన”
అక్కడ కోతులు బాగ ఉన్నాయి.. మీదనే పడుతన్నాయ్.

మా రామవ్వ మొక్కులు పెట్టి తినేటాళ్లకు పొద్దు గుత్త ఐతదని తెలిసే పొలగాండ్లు,పెద్ద మనుషులు ఆకటికి ఆగరని ఇన్ని అటుకులు మర్రవోసుకొని తెచ్చింది..
వాటి ఆసన అచ్చిందో మన్నో…
కోతులన్ని ఎగవడ్డయ్..తలో కట్టే వట్టి తరిమి కొడుదాం అని సూసిన..
గురకాయించు కుంట మీది,మీదికే అత్తన్నయ్..
ఓ దిక్కు బలే గమ్మతి అనిపిచ్చుడు, ఓ దిక్కు ఏం ఎత్తుకుపోతాయో అనే భయం..
మా బావ,నేను,అచ్చిన సుట్టపొల్లు అందరం బీరిపోయి సూత్తన్నం..
ఏనంగా అచ్చిందో ఓ కోతి బెల్లం కవరు ఎత్తుకొనిపొయ్యి సెట్టుమీద కూకుంది..

అడవులు అంతరించి పోవడం వల్ల జీవరాశి జనారణ్యం లో తిరగడం మొదలు పెట్టింది..
“గూడెం” గుట్ట కాడ సుత గిదే బాగోతం.” కొండగట్టు” అంజన్న కాడ గూడ..
సేతిల కవరు కనబడితే ఐపాయ్ ఎత్తుకొని ఉరుకుడే
ఇక్కడ మాత్రం అంత అడవే.. కానీ పండ్ల చెట్లు తక్కువ ఉన్నాయ్..వాటికి ఆహారం కొరత..
అందుకే..
ఇంతలో మా బావ!
“ఓయ్… రమేష్ ఏదన్నా పండు ఉంటే చెట్టు మీద ఉన్న దానికి ఇసిరేయ్..క్యాచ్ పట్టడానికి రెండు సేతులు వదిలేత్తది..”
మంచి ఉపాయమే..
రమేషన్న ఓ అరటి పండు తెచ్చి చెట్టు పైకి ఇసిరిండు..
అంతే కోతి అరటి పండు పట్టుకోపొయ్యి కవరు ఇడిసి పెట్టింది..
బెల్లం లేకుంటే బోనం ఎట్ల సేసుడు..
అక్కడే ఉన్న రమేషన్న దాన్ని టక్కున క్యాచ్ పట్టిండు..
ఇగ సూడు అందరూ ఒకటే నవ్వుడు…

ఇదంత సూసుకుంటా నీళ్లు తెద్దాం అన్న మనుషులం ఆడనే ఉన్నం..

ఇగ సెరో క్యాన్ సేతుల పట్టుకొని గొంత దూరం పోయినం..
అక్కడ ఒక అద్భుతం
బండ సొరికలో నుండి ఊట..
“వదినా! ఈ సెలిమ ఎపుడు ఎండి పోదు..
నీళ్ల ఊట ఎప్పడికి ఉంటుంది..పైన ఒక చెట్టు.
ఆ చెట్టువేళ్ళ దగ్గరి నుండి.. సుట్టు ఖని బండలు తియ్యగా,సల్లగా,తేటగా వుండే.నీళ్లు..
ఇవి..జాతర అప్పుడైతే ఎంత మంది కొండవోయిన నీళ్లు మళ్ళ ఊరతనే వుంటాయి..
మనం రెండు క్యాండ్లు తొడినమా మళ్ళ రెండు క్యాండ్లు ఊరుతయ్..సూడు”
బలే అనిపించింది..నాకు..
“అఖిలా !” అని గట్టిగా కేక వేసా.. ఆ పిలుపు విని మా బావ కూతురు..

మా రామవ్వ వాళ్ళుకు మా కుటుంబం అందరితోని సోపతే. అందుకే వాళ్ళను కూడ పిలిచారు..

“ఏంటి సిన్ని”
“ఫోన్ తీసుకు రా”
“హా..!
సిన్ని అక్కడ ఏం ఉందే?”
“నువ్వు..రా! చూసేవ్”
ఫోన్ పట్టుకొని తను వచ్చింది..
ఆ సెలిమ చూసిన అఖిల సంతోషం అంత..
మాతో సెల్ఫీ దిగుతూ ఫోన్ లో బందీ చేసింది..
మా వదిన,నేను ,అఖిల అక్కడికెళ్లి.నీళ్ళ క్యాoడ్లు పట్టుకొని బయలు దేరినం

మేము వెళ్లేసరికి మా వాళ్ళు అంత వంటకు సిద్ధం చేశారు..
మూడు రాళ్లు తెచ్చి పొయ్యి పెట్టిండ్రు..కొన్ని కట్టెలు తెచ్చి పెట్టిండ్రు..మొగోళ్ళు అంత కోతుల కావాలి..పిల్లగాండ్లు తెచ్చిన అటుకులు కోతుల సూడకుండ దాసుకుంట,దాసుకుంట తింటుండ్రు..
నీళ్ల క్యాన్ల తో అత్తున్న మమ్ముల సూసి మా అవ్వ సంచిల కెళ్ళి కొత్త పేర్పు తీసింది..
మేము కొండవొయ్యిన నీళ్లతో రాళ్లను కడిగి..పసుపు ,కుంకుమ ఏసీ..పొయ్యి అంటుపెట్టి..బోనం రుద్దింది..
“సాయి! ఆ బోనం కుండ నువ్వు అక్క మంచిగ పూదిచ్చి.. గుట్ట మీదికి ఎమ్,ఎమ్ కావాలో అన్ని సర్ది..మిగితాయన్ని మంచి ముల్లెగట్టి పెట్టు..కోతులు మల్ల అంగడి చెయ్యకుండ”
“సరే!అత్త”
“అక్క నువ్వు రా ఇగ ఆపని సూద్దాం”
“సరే ! పా”
ఇద్దరం కలిసి మంచిగ పూదిచ్చినం.. అన్ని ఓ గమాలల సర్ది పెట్టినం..అక్కడికి,ఏమేమ్ అవసరమో అన్ని..
మా అవ్వ సుట్ట బట్ట గట్టిగ సుట్టి నెత్తి మీద పెట్టుకుంది..
మా బాపు మైసవ్వ తల్లికి మొక్కుటానికి తెచ్చిన ఓ దున్నపోతు దూడను..ఇంత బొట్టు పెట్టి మెడల దండ ఏసీ..తనుగుతోని పట్టుకొని రెడీ గా ఉన్నడు..గుట్టమీదికి పోంగా,పోంగా దాన్ని గుట్ట మీద ఇడిసి పెట్టటానికి..
ఇగ మాతో జాతరకు వచ్చిన కూన వెంకన్న తాడుతోని మేకను పట్టుకున్నడు..
మేకను బలిచ్చుడు, కోళ్లను కోసుకుని తినుడు..
ఇక్కడ మైసమ్మ దేవికి ప్రీతి అని.. అది ఒక ఆచారంగ మారింది..
కొబ్బరి కాయ కొట్టిన దేవుడే! కానీ మన కాడ ఒక్కొదేవునికి ఒక్కో తరీక మొక్కు..
మంచి జరుగుడు కోసం ఎట్ల మొక్కుతే అట్ల మొక్కులు సెల్లిచ్చుడే..

ఇగ ఆడోళ్ళం అంత తల ఓటి తాoబులంల పట్టుకున్నాం.. పసుపు,బొట్టు, గాజులు,పూలు,పండ్లు అన్ని..
నెత్తి మీద పెట్టుకొని..బోనం కుండ తోని..బయలెల్లినం గుట్టమీదికి..

ఇగ మా ఎనక ఎవరో ట్రాలి పట్టుకొని ఇద్దరు మనుషులు చేతుల తనుగులు పట్టుకొని ఫాలో అయితండ్రు..
మావోళ్ల అందరికి అర్థం అయ్యింది ఆళ్ళు మా ఎనకాలనే ఎందుకు అత్తుoడ్రు అని!
మా బాబు ఎనకకు తిరిగి “అరే! సూతే గాల్లారా! బట్టేబాజ్ ముండ కొడుకులు.. మమ్ముల మొక్కన్నపెట్టనియ్యరారా! గుట్టమీదికి అయిన పోక ముందే మా ఎనక వడ్డరు..”
వాళ్ళను తిడతానే ఉండు వాళ్ళు మాత్రం అచ్చుడు మానుత లేరు..
“అయ్యా! గంత దూరం కెళ్ళి మళ్ళ ఎమ్ ఈడ్స్కరమ్మంటావ్ గీన్నే ఇడిసి పెట్టారాదు”
నాకు అర్థం కాలే వాళ్ళు ఏమంటుండ్రో..
“బావ గీ లొల్లి అంత ఏంది..
ఎమ్ జరుగుతుంది ఇక్కడ..”

“నీ బొంద నే, నీ బొంద అది కూడ అర్థం అయిత లేదా! దున్నపోతూ దూడ కోసం ఈ లొల్లి అంత..
మనం ఇడిసి పెట్టంగానే వాళ్ళు దాన్ని ట్రాలీల ఏసుక పోతరు”
“అగొ గందేది బావ దేవుని పేరు మీద ఇడిసి పెట్టింది..జంగళ్ల మంచిగ దాని ఇట్టం అచ్చినట్టు తిరగాలే గాని..గీ బద్మాష్ గాళ్ళు కొండవోవుడు ఏంది..
కొండవోయి ఎమ్ జేత్తరు?”
“ఏమోనే! కోసుకుని తింటరు గావచ్చు!లేదంటే అమ్ముకుంటరు”
ఓ పావు గంట సేపు వాదన తరువాత..
మాతోని అచ్చిన ఓ పెద్ద మనిషి..
” సూడుండ్రి బిడ్డా! మా మొక్కులు కాక ముందే మీరు గిట్ల అచ్చుడు పద్దతి కాదు..
మా మొక్కులు అయినంక గుట్ట మీద ఇడిసిపెడతాం అప్పుడు మీ ఇట్టం..
ఇగ పాండ్రి పోదాం ఎంత ఏగిర్థ పడ్డ గాడికే రావట్టే..
రామక్క నువ్వు బోనం పట్టుకొని ముందు నడువ్..”
ఇగ అందరం కదిలినం అక్కడి నుండి.. గుట్టమీదికి సెప్పులు లేకుండనే నడవాలి అంటే.. అందరం సెప్పులు ఏసుకోకుండా నడక మొదలు పెట్టినం..
కొంత దూరం ఎక్కినం అంతే..
మొత్తం రాతితో కట్టిన పెద్దర్వాజ..కొంచెం శిథిలం అయినట్టు ఉంది..
మొక్కుకుంటూ ముందుకు వెళ్ళాం..

ఇగ అక్కడ అందరు ఒక్కసారి ఆగిపోయిండ్రు..
నేను ఆతృతగా చూసా..
బండకు చెక్కిన విగ్రహం..
అందరు పసుపు,కుంకుమ, పూలు ఏసీ మొక్కి.. కొబ్బరి కాయ కొట్టి మొక్కుతుండ్రు..

మా అవ్వ..
“సరవ్వా, ఓ సరవ్వా.. ఇటు ముందుకు రా బిడ్డా! దేవునికి మొక్కి కొబ్బరి కాయ కొట్టేవురా..”
నేను జరంత ముందుకు జరిగిన..దేవునికి మొక్కి కొబ్బరి కాయ కొట్టిన..
అసలు సిత్రం ఏటంటే నాకు అది ఏ దేవుడో, ఏ దేవతో పేరు కూడ తెల్వద్..అవ్వ సెప్పింది మొక్కిన అంతే..
అందరికి మాతోనే అచ్చిన ఓ పెద్దమనిషి బొట్టుపెట్టింది..
నేను కొంచెం ఎనకకు మళ్ళీ జరిగి..
“బావ,ఓ బావ.. గిదేం దేవుడు”
నేను పిలుస్తున్న హడావిడిలో మా బావ ఇనిపిచ్చుకోలే..
కానీ నా ఎనక..సేతిల మేకను పట్టుకొని నిలబడ్డ కూన ఎంకన్న అది విని..
“సెల్లా! నేను చెప్తా అది ఎమ్ దేవుడో ఇటాటూ జరుగు..”
ఆసక్తిగా కొంచెం అటు జరిగిన తెలుసుకుందాం అన్న అతృతతో..
“సెల్లా! ఇది ఒంటి కాలు బైరవి..
మేము అయితే “భైరవి” అంటాం..ఇంకా కొందరు భక్తులు బైరవుడు అంటారు..ఏది నిజమో..
కానీ ఈ గుట్ట గురించి రాసేటోళ్లు అందరూ
“బైరవుడు” అనే రాస్తారు..
దీనికి..ఒంటి కాలు బైరవి అని పేరు ఎందుకు అచ్చిందో కూడ చెప్తా..
ఆ ఒంటి కాలు బైరవా? మళ్ళీ ఒకసారి ఎనకకు మర్రి సూసిన. నిజమే ఒక కాలు అంత చెక్కేసి ఉంది…
నాకు ఇంట్రెస్ట్ కలిగింది అదేంటో తెలుసుకోవాలని
“హా..! ఎంకన్న చెప్పే..”

“హా..!సెప్త గాని అందరు ఇటచ్చి గీ బండ మీద కూకోండ్రి.”
.”సరే అన్నా! “
మేమంతా ఒక బండ మీద కూసుందాం అని మోపినం అంతే..
“ఓరి ఏంకా! నీ ముచ్చట సల్లగుండ అచ్చిన పని ఏంది నువ్వు సేసేది ఏంది.. అందరిని అక్కడ ఆపుతే మొక్కులు ఎప్పుడు పెట్టుడు…పొద్దంత పోవట్టే!”
మా రామవ్వ..మొత్తుకుంటుంది..
ఏ అత్తన్నం, అత్తన్నం.. నువ్వు పా.. నీ ఎన్కనే అత్తమ్..
ఏందో ఈ పోరగాండ్లు సెప్తే మాట ఇనరాయే అనుకుంటా..తను నడవసాగింది..
“నువ్వు చెప్పే ఎంకన్న”
తను చెప్పడం మొదలు పెట్టిండు..
ఎనకట ఈ ఖిల్లా మీద ధనం (నిధి) ఉండేది అట.
అది తెలుసుకున్న బంది పోటు దొంగలు దాన్ని దోసుకపోవుడానికి అచ్చిండ్రట. అది చూసి.. తెలుసుకున్న బైవవి గుట్టమీద మైసవ్వ తల్లికి బంది పోటు దొంగల గురించి చెప్పిందని… కాలును ఇరుగ కొట్టిండ్రట..”
అందుకే కాలు చెక్కేసినట్టు ఉంటది..
నాకు ఈ ముచ్చట మా ముసలోళ్లు చెప్పిండ్రు..
ఇది ఆధారం లేని కథ..నేను విన్నది మీకు చెప్పిన..
మధ్యలో మాతో వచ్చిన ఓ పెద్ద మనిషి..
“గుప్త నిధులు ఉన్నయ్ అని మాత్రం నానుడి ఉంది..”
సరే,సరే..పోదాం పండి.. అవ్వ ఎనకకు మర్రింది అంటే మాత్రం.మనకు తిట్ల దండకమే..
అందరం లేసినం..అక్కడవున్న భీముని పాదాలను మొక్కుకుంటూ..అక్కడ నుండి గుట్ట మీదికి నడవసాగాం..
దారి మధ్యలో “మా అఖిల “
“అంకుల్ అసలు ఈ గుట్టకు గాంధారి ఖిల్లా అనే పేరు ఎందుకు వచ్చింది?”
“ఏమో! రా తల్లి నాకు అంతగా తెలియదు గాని.. ఇక్కడ పాండవులువు వనవాసం చేశారు అని చెప్తారు. హస్తినను పాలించిన పాండవుల పెద బాపు మహారాజు ధృతరాష్ట్రుడి భార్య మహా రాణి గాంధారి పేరు తోనే ఈ వనం వుందని అంటారు. కానీ, నిజం ఏంటో తెలియదు తల్లీ!’
“అవును, అవును”
మా అఖిల “ఇంతకు ముందు..మనం భీముని పాదాలు కూడ చూసినం గా నిజమే కావచ్చు గా సిన్ని”
“హ్మ్మ్..కావచ్చు రా ..ఏమో.. నాకు కూడ అంతగా తెలియదు..”
ఇంతలో మాతో వచ్చిన మా ఆ గ్యాంగ్ లోని ఓ కుర్రాడు..(తను మా బావ వల్ల స్టూడెంటే)
“ఆంటీ.. అఖిల.. అంకుల్ ను అడగానే నేను మధ్యలో గూగుల్ లో సర్చ్ చేసిన దీని గురించి..

అందులో ఉన్నది ఏంటంటే..
రాచకొండ కేంద్రంగా పాలిస్తూ ..వైష్ణవ మతం వ్యాప్తి కోసం పెద్దిరాజు ఆనంతరాజు, రఘు నాయకులు. కోటలో హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దీని ధ్రువీకరించే..15 వ శతాబ్దపు తెలుగు శాశనం.ఉంది..
పెద్దిరాజును పాండవుల పెద నాన్న ధృతరాష్ట్రుడు,పెద్దమ్మను అతని భార్య గాంధారిగా భావించి ఈ కోటను “గాంధారి కోట”గా పిలిచారు అని చరిత్రకారుల అభిప్రాయం.. అని ఉంది..
అందరం అతని మాటలు విన్నాం..కానీ దాని గురించి మాకేమి తెలియదు..
ఇంతలో మా అవ్వ కేక..
కదిలిండ్ర లేదా..
హా.. అత్తన్నం, అత్తన్నం..
గుట్ట మొత్తం ఎక్కువ రాయి తోనే ఉంది..
ఆ రాతిమీది నుండి పైకి అందరం పయనం అయ్యాం..
గుట్ట మీద చెట్టు,సేమ,రాతి పై చెక్కిన శిల్పాలు..
అదొక అద్భుతం లా అనిపించింది..
మెల్లగా,మెల్లగా..గుట్ట పైకి చేరుకున్నాం..
నేను అదొక గుడిలా వుంటుందేమో అనుకున్న.. కానీ అదొక రాతి ద్వారం. ఆ ద్వారానికి కుడి వైపు ఉన్న రాయి పై చెక్కి ఉంది “మైసమ్మ” తల్లి రూపం. ఎంత బాగ చెక్కారో. పసుపు, కుంకుమ, పూలు, గాజులు, నిమ్మకాయ దండతో అలంకరించారు. ఆ తల్లిని చూడగానే దండం పెట్టుకున్నం అందరం. పైకి ఎక్కడం వల్ల కొద్దిగంత మొస అచ్చినట్టు అయ్యింది..

మా అఖిల, నేను ఓ బండ ను సూసుకొని కొద్దిగంత సేపు కూకున్నం.
ద్వారానికి ఎడమవైపు ఉన్న బండ పై కూకున్నం. ఆ బండను తడిమి సూత్తే ఏదో బరుసులు, బరుసులు రాతల లాగ సెయ్యికి తాకినట్టు అనిపించింది..
“ఓ..ఎంకన్న ఏందో బరుసులు, బరుసులు తాకుతంది. ఏందో రాతలన్నీ రాసుకున్నారు ఏందో అన్న గిది”
“సెల్లె ఎనకట రాజుల కాలం ల దీనిపై ఏవో రాతలు సెక్కిండ్రట..
అయ్యేమ్ రాతలో, గదేం ఎమ్ లిపో, ఏ భాసనో ఏం సెక్కిండ్రో తెల్వదు కానీ.. ఆ రాతలన్ని బండ మీద అరిగి పోయినయ్ అంటరు.
మీద సున్నం,పెయింట్ తోనో ఇక్కడికి అచ్చినోళ్ళు వాళ్లకు ఇట్టం ఉన్నయ్ రాసుకుంటరు”
మా ముచ్చట మాదే. వాళ్ల పని వాళ్లదే..
ఎవ్వరి పని మీద ఆళ్ళు ఉన్నం.
ఇంతలో ఓ పెద్ద మనిషి(మా అవ్వ వాళ్ల ఇయ్యపురాలు) రోట్లో ఏదో దంచుతుంది..
మేము అక్కడికి పొయ్యి అగో గీడ రోలు కూడ ఉందా?
“హా… ఉంది… రా”
పెద్దబండ మీద మధ్యలో రోలు సెక్కిండ్రు..
బండ అంత పరుసుక పారి ఉంది..
మళ్ళ పొయ్యి ఆడ కూకున్నాం..
ఇంతలో పొలగాండ్లు మా ముంగటనే ఫస్ట్ నేను అంటే ఫస్ట్ నేను అని మొత్తుకుంటున్నారు

అగో గి పొలగాండ్లు ఏంది గింత మొత్తుకుంటుండ్రు
“ఎందుల్లా గింత లొల్లి లొల్లి”
ఓ దిక్కు నేను అడుగుతానే ఉన్న కానీ నా మాట ఎవరు గైసేత్త లేరు..
ఎదురుంగ మా బావ ఒక్కసారి నన్ను కిందినుండి మీది రాక సూసిండు..
నన్ను గట్ల సూత్తండు ఏంది అని నేను కూడ మారేసి సూసిన
“ఓ..మిడిగుడ్లు ఏసుకొని ఎమ్ మారేసి నన్నేం సూత్తవ్ గాని ఓ సారి పైకి సూడు”
గిర్రున తిరిగి ఓ సారి పైకి సూసిన..దాదాపు ఓ ఇరవై అడుగుల ఎత్తులో గోడ లాగ ఒకరాయి.దానికి పైన ఓ సిన్న దిగుడులెక్క ఉంది..
అండ్ల సిల్లర పైసలు ఇసురుతుండ్రు అందరు.. గదంతా నా ముంగటనే జరుగుతుంది..
నేనె గైసెయ్యక వాళ్ళను అడిగే సరికి నన్ను బిత్తిరి దాన్ని సూసినట్టు సూసిండ్రు ఆ పొలగాండ్లు..
ఆ… సూత్తే సూసిండ్రు లే… అనుకొని దులుపుకున్న..
“బావ, ఓ బావ”
“ఏందే…. నీ ముంగిట పెట్టుకొని ఓ..మొత్తుకోవడితివి.బావ,బావా అని”
“అయ్యో!గీ పొలగాండ్ల లొల్లికి నీకు ఇనవడదని గట్టిగా పిలిసిన గాని..
గండ్ల అందరు ఎగురుకుంటూ, ఎగురుకుంటా సిల్లర ఎందుకు ఏత్తoడ్రు”
“ఆ గూట్లే ఎవరి పైసలు పడితే ఆళ్ళు అనుకున్నది జరుగుతదని ఓ నమ్మకం.సిన్నగా పొలగాండ్ల కు ఎవరో ఊల పెట్టిండ్రు..ఇగేముంది నేనంటే,నేను అని అందరూ పైసలు ఏత్తండ్రు.”

గింతలనే “మా రామవ్వ మధ్యలో దూరి “పిలగాండ్లు కాదు పెద్ధోళ్ళు కూడ ఎయ్యచ్చు..
మన నసీవ ఎట్లుందో తెలుసుకుందామని ఎవరికి ఆరాటం ఉండదు బిడ్డా..”

అనేది,అనుకుంటనే రెండు రూపాయల బిళ్ళ మీదికి ఇసరనే ఇసిరింది..
ఒక్కసారికే బిళ్ళ గూట్లే పడింది..
ఇగ సూడు అందరూ ఏయ్ పడింది,పడింది రామవ్వ బిళ్ళ పడింది..
మైసవ్వ కరుణించిది అని గట్టిగా సప్పట్లు కొట్టుకుంటూ మొత్తుకుంటున్నారు..
అది సూసి నాకు గూడ పైసలు ఎయ్యాలి అనిపించింది.
మా బావ జేబులో కెళ్ళి 5 రూపాయల బండి తీసి మీదికి ఇసిరిన నాది పడలే కింద పడ్డది..

మనసులో ఏదో వెలితి మళ్ళ ట్రై చేసిన..
పడలే..మల్లోక్క సారి ఎయ్యావొంగా మధ్యల ఓ తాత పైసలు ఏసిన ఒక్కసారో,రెండో సారో అయితే పాటి..
పడేదాక ఏసుకుంటనే ఉంటే అదేం పాటి సూపియ్యది..
ఆ ముసలోని మాట ఎవ్వరు ఇంటరని… ఆ తాత మాటలు పట్టించుకోలే..
నా గురి ఎలాగైనా అండ్ల పైసలు ఎయ్యాలి అంతే..
ఈ సారి మైసవ్వ తల్లికి గట్టిగా మొక్కిన..
పైకి ఇసిరిన ఏ పో.. సక్కగ పొయ్యి గూట్లే పడ్డది..
ఇగ జూడు నా సంబురం..
“బావో..నా బిళ్ళ కూడ గూట్లే పడ్డది”అని గట్టిగా అరిసిన..
“ఎహె సిన్న పోరి లెక్క సెయ్యకు ఇటు రా… ముందు”
“హా..అత్తన్న,అత్తన్న”
అందరు దేవుని దగ్గర నిలబడి తెచ్చిన పండ్లు,పూలు,పసుపు,కుంకుమ ,గాజుల అన్ని ఆమైసవ్వ తల్లకి అలంకరించమని అక్కడ ఉన్న పూజారికి ఇచ్చిండ్రు..
ఇగ ఉపారాలల్ల పాశం పెట్టి మైసవ్వ తల్లిమంగట పెట్టిండ్రు..
కోడి గుడ్డు కూడ పెట్టిండ్రు…

మైసవ్వ తల్లి పక్కకు జరంత అటెటు అని చెక్కతోని సేసిన రెండు దేవుని ప్రతిమలు ఉన్నాయి..
మేము అప్పడి దాకా పైసలు ఏసిన ఆరాయి కి ఆనుకొని బండ మీద నిలబెట్టి ఉన్నాయి..
“ఓ ఎంకన్న గీ దేవుళ్ళ పేరు ఏందే జరంత సెప్పు”
“పాండవుల అస్త్రాలు అంటరు… సెల్లె నాకు గూడ తెల్వదు పురాగా”
ఏందో..గి ఎంకన్న అన్ని సగం, సగం ముచ్చట చెప్పవట్టే..

ఇగ మా వొళ్ళు అంత మేకను బలి ఇచ్చుటానికి తయారు సెత్తoడ్రు
“జెడత ఇత్తె కోసి నంక ఇక్కడ ఎవ్వరు వుండద్దు..
ఎనకకు మర్రి సూడద్దు… గుట్టమీద ఏదన్నా సూసేది ఉంటే జెప్పన పొయ్యి సూసిరాపొండ్రి..”
మాతోనే అచ్చిన ఓ..పెద్ద మనిషి అన్నది..
“అగొ..ఇంక గుట్టమీద సూసేటియ్ ఇంకా ఉన్నయా..బావ”
“ఇప్పుడిదాకా నువ్వు సూసింది..ఎక్కింది సగం కూడ కాదు..మీద ఇంకా సూసేటియ్. ఉన్నాయి”
“అవునా..!”
“బావ,బావ ప్లీజ్ ..నాకు మొత్తం సూపియ్యవా”
“నీ బొంద నే,నీ బొంద గంత దూరం ఎక్కుడు నీతోని ఐతదా..!
ఉత్తగనే గస్సు కొడుతవ్..
కాళ్ళ నొప్పులు అంటావ్..
నువ్వు మధ్యల కూలపడితే నిన్ను మొయ్యాలంటే నాతోనే అయితదా..జబ్బలకు తాడుగట్టి ఈడ్సుకచ్చుడు ఐతది..”
అనుకుంటా ఒక్కటే నవ్వుడు..

నాతోనే ఎప్పుడు గట్లనే పరాశికం ఆడుతాడు..

నాకు కొంచెం మా బావ మీద కోపం అచ్చింది.గాని
గిప్పుడే గుట్ట కూడ ఎక్కలేనంత సాతగాని తనంలా ఉండి పోయిననా…
ఛీ… దీనమ్మ జీవితం ..ఇజ్జత్ కే సవాల్..
ఎట్లనైనా ఆ గుట్ట ఎక్కుడే కావాలె..ఎక్కి తీరాలి.. మనసులో అనుకున్న..
నా పోరు పడ లేక మా బావ “సరే పోదాం పా”అన్నాడు..
మాతో పాటు కూన ఎంకన్నను కూడ రమ్మన్నాం.గుట్ట మీద తెలిసినయ్,తెలువనియ్ మొత్తం సూపెట్టుటానికి..
ఆ అన్న సరే పోదాం పార్రి అని అడుగులు ముందుకు వెయ్యసాగాడు..
మాతో పాటు మా అఖిల ఇంక కొంత మంది ఎంగర్స్ తయారు అయ్యారు..గుట్టమీద చూడడానికి..
మా రామవ్వ మొత్తుకుంటుంది..
” ఓ పోరగాండ్లు మేల్లం అంత మంచిగనే మోపు అయిండ్రు గాని జెల్ది పొయ్యి రాండ్రి”
“హా…అట్లనే”

అటేటు కొంచెం జరిగినం..మేము పొయ్యే ఎడమ పక్క గుట్టమీదికి బండ మీదనే చెక్కిన మెట్లు ఉన్నాయి..
“ఓ..అన్న ఈ మెట్లు గీడ ఎందుకు సెక్కినట్టు..?”
“సెల్లె..ఎనకట రాజుల కాలంలో శత్రువులు ఎటునుండి అత్థండ్రో తెలుసుకోవడాని ఈ గుట్ట ఎక్కితే సాన దూరం దాక ఎవరు అత్థండ్రో సూడచ్చు..కోట మీద నగారా కూడ వుందట.. శత్రువులను పసిగట్టి మోగిచ్చు డానికి..”
“హ్మ్మ్..అవునా”
“సరే మీదికి ఎక్కుదామా..”
” గుట్టకు ఇటు బాజు సూసేటియ్ బాగున్నాయి..ముందుగాల అటు పోయ్యచ్చి రాంగ వీలైతే సూద్దాం..”

కొంచెం దూరం వెళ్ళాక ఒక మంటపం ఉంది..
మా బావను అడిగా ఇదేంటి అని..
“కుబేరుని మంటపం అని చెప్పాడు”

ఎంకన్న అడుగులు కొంచెం ముందు వరకు కదిలాయి..మేము కూడ అతనిని అనుసరిస్తూ..పయనం అయ్యాం..
గుట్ట ఎక్కడానికి మెట్లు లెవ్వు..అంత పర్సుక పారిన బండ..
ఆ గుట్ట ఎక్కుతాంటే జెరంత కాలు జారిన బొక్కలు కూడ దొరుకయ్..చాల జాగ్రత్తగా బండలను పట్టుకుంటూ ఎక్కుతున్నాం..ఒక్కసారి కింది సూత్తే కళ్ళు గిర్రుమన్నయ్..కింద అంత లోయ లెక్క కనుబడుతాంది..
మా అఖిల,మా బావ ఇంకా మాతో వచ్చిన యూత్ పిల్లలు ఫాస్ట్ గా ఎక్కుతండ్రు కానీ నాకు కొంచెం మొస అచ్చినట్టు అయ్యి.నడుమంత్రాన్ని కూలబడ్డ.
ఇగ నన్ను సూసిన మా బావ “ఏమైందే ఎక్కుతా,ఎక్కుతా అంటివి గిట్ల నడిమిట్ల ఆగినవ్.ఏందే..”

” ఏ ఊకో బావ నాకు నిజంగానే దమ్ము అచ్చినట్టు అయ్యింది”

“అందుకే అన్ననే నీతోని కాదని.నాకు తెల్వదా నీ పానం గురించి.సెప్తే ఇనవు..నీ మొండి పట్టు నీదే..”
“సరే..కాసేపు గిట్ల కూసో..ఇగో కొన్ని నీళ్ళు తాగు”
తంసప్ బాటిల్ కి తట్టు తోని కట్టిన బుర్రల నీళ్లవి..ఏడికి పొయ్యిన అవి మాత్రం జబ్బకు తలుగేసుకొని అత్తడు..
ఏంది బావ గిది అన్నా వినడు.. ఏడికి పొయ్యిన..
పిలగండ్లు ఉన్నకాడ సేతిల నీళ్ల బాటిల్ ఉండాలే అంటాడు.. మా బావకు ముందు జాగర్త ఎక్కువ.
మా బావకు నాకు కొంచెం పానం మంచిగ లేకున్నా తండ్లాట ఎక్కువ..పానం మంచిగ లేకుంటే అందరి లెక్క నేను ఎక్కువ ఓర్సు కోను అయ్యే,పొయ్యే పాణాలు సేత్త..గందుకే నన్ను ఆయన ఇడిసిపెట్టి నమ్మడు..పాణం లెక్క సూసుకుంటడు..
మీదికి ఏదో దెప్పి పొడుపు మాటలు అంటాడు..కానీ..,సిన్న దెబ్బ తాకిన కండ్ల సెమ్మ తెచ్చుకుంటాడు.. పసివిల్ల లెక్క నన్ను సూసుకుంటాడు..
అందుకే నా ధైర్యం అతనే..నా ఎంట మా బావ ఉంటే సప్త సముద్రాలు కూడ ఈజీగా దాట గలనన్న నమ్మకం..
ఎప్పడికి నా సెయ్యి ఇడువని నమ్మకం అతను..
“ఒసే..ఏ లోకంలకు పొయ్యినవే బిత్తిరి మొఖం ఏసుకొని నన్ను అట్ల సూత్తన్నవ్.”
“ఎమ్..లేదు బావ”
“సరే ఇగ లే..ఇగో నా సెయ్యి పట్టుకొని మెల్లగా రా..ఐపోంది దగ్గరికి అచ్చినం..ఇగ..మెల్లగా నడువు.. దబ్బ, దబ్బ నడువకు..మళ్ళ దమ్ము అత్తది “
“సరే..బావ పా “
మా బావ సేతిల సెయ్యి ఏసీ గట్టిగా పట్టుకొని మళ్ళీ నడక మొదలు పెట్టిన..

అలా కొంత దూరం పైకి నడిచాం అక్కడ ఒక అద్భుత మైన కట్టడం..మొత్తం ఏక శిలతో కట్టిన ఆలయం..గుడి ముందుకు వెళ్ళాం.

“ఇంతలో మాతో వచ్చిన కూన ఎంకన్న నేను అడుగక ముందే..నేను అడుగుతాను అని ఆ అన్నకు తెలుసు..అందుకే
ముందే సుదాలాయించుకొని..
“సెల్లె ఇది “నాగ శేషుని” ఆలయం..మొత్తం ఒకే రాయితో చెక్కిండ్రు..మస్తు మహిమ గళ్ళ దేవుడు అంటారు..ఈ దేవుడి దగ్గర ఎమ్ మొక్కుకున్న జరుగుతుందని నమ్మకం..
అందుకే గాంధారి ఖిల్లాకు ఎవ్వరు వచ్చిన ఈ దేవుడిని దర్శించు కుంటారు..”
గుడి ముందట గలుమను అందరం కళ్ళకు అద్దుకొని లోపలికి వెళ్ళాం..
గుడి లోపల అంత చీకటి..గలుమ ముందు మాత్రమే వెలుతురు పడి కొంచెం వెలుగు.ఉంది..
“అన్నా లోపల అంత చీకటి ఉందిగా.. ఇక్కడ లైట్ సెట్టింగ్ పెట్టలేదా…
లేదురా జాతర టైమ్ లో పెడతారు..మిగితా టైమ్ లో ఉండదు.”
అందరం సేతుల ఉన్న ఫోన్లతో లైట్లు వేసాం..
అంతే..ఆ కాంతిలో గుడి అంత వెలుతురు ..
ఆ దేవుడి గర్భ గుడిలోకి వెళ్లే ముందు దర్వాజకు అటువైపు,ఇటు వైపు..చిత్రాలు చెక్కబడి ఉన్నాయి..
“అన్నా.. ఈ చిత్రాలు ఎవరివి..వీరిని ద్వార పాలకులు అంటారు సెల్లె..వీరి పేర్లు జయుడు,విజయుడు అని విన్న..నాగశేషుని కోటకు ద్వార పాలకులుగా వున్నారు వీరు..”
చాల అందంగా చెక్కిన శిల్పాలు అవి..
“బాహుశ మనం జాతర టైమ్ లో వస్తే ఇంత నువ్వద్ధిగా వీటిని చూడక పోతుంటిమి..ఎవ్వరు లేరు కాబట్టి అన్ని క్షున్నంగా చూడగలుగుతున్నాం..అదే.. మందిలో మంద లెక్క అత్తె మనతోని కాకపోవు..”
“నిజమే అన్న ..ఎంత చక్కటి శిల్పాలు ఎంతో నైపుణ్యంతో చెక్కబడ్డ వీటిని ఇన్నొద్దులు సూడకుండా ఆలస్యం చేసాం..
వీటన్నటిని చూస్తున్న నా కళ్ళది ఎంత భాగ్యం.
“అవును సెల్లె..రండి గర్భగుడిలోకి పొయ్యి ఆ నాగ శేషుని దర్శనం చేసుకుందాం..”
అందరం మళ్ళీ గర్భగుడి గలుమను మొక్కుకుంటూ లోపలికి వెళ్ళాం..
సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో గుడి అంత కాంతితో నిండి పోయింది..
ఎదురుగా ఒకే రాయితో చెక్కబడిన పడగ విప్పిన నాగశేషుడు..

ఎంత అద్భుతంగా చెక్కారు.. గుడి అంతా రాయితో చెక్కిందే..
ఇక పడగ విప్పిన నాగ శేషుని చూడడానికి రెండు కళ్ళు చాలవు.. పక్కన శివ లింగం కూడ ఉంది.
ఇక అందరం ఆ దేవుడి దర్శనం తరువాత కొబ్బరికాయ కొట్టి..కొద్దిగంత సేపు అక్కడనే కూకొని ఏవో ముచ్చట్లు సరదాగా చెప్పుకుంటున్నాం..
ఇంతలో ఎంకన్న ..
“సెల్లె! ఇంక పైన సూసేటియ్ ఉన్నయ్..ఇగ జెప్పన కదులుండ్రి..కింది పోయినంక ఇంక మనకు బొచ్చెడు పనులు ఉన్నయ్”
“సరే..అన్నా.. పా..”
మధ్యలో మా బావ
” ఓహో..ఇప్పుడి దాక పానం పోయినట్టు సేసినవ్..గా..మళ్ళ హుషార్ అయినవా”
“హా..లేకపోతే ఏంది..అన్ని సూడాలన్న కాయిసు ఉంటే ఐపాయ్..హుషార్ అవుడే..”
“సరే,సరే..పోదాం మరీ..” అంటూ మా అఖిల మా కంటే ముందే అడుగుల వేసింది..
అందరం మళ్ళీ నడక మొదలు పెట్టాం..ఇంకా మీదికి ఎక్కుడు కొంచెం కట్టమే..
కానీ అన్ని సూడాలే అన్న ఉబలాటం నన్ను కూడ పైకి నడిచేలా చేసింది..
గుట్ట పైన చాల అద్భుతాలు..ఉన్నాయి..
కొద్ది దూరం నడిచాక.. శాసనాలతో చెక్కబడిన ఆంజనేయ స్వామి గుడి..
గుడి అంటే గుడి కాదు ..ఒక రాతిపై చెక్కిన శాసనాలు పక్కనే ఆంజనేయ స్వామి ని కూడ రాయిపైనే చెక్కి ఉంచారు..
చెక్కిన అక్షరాలను చదవాలని ప్రయత్నించిన కానీ సరిగా అర్థం కాలే..
మంచిగ మొక్కి అక్కడికెల్లి సవతుల బాయి సూడడానికి వెళ్ళాం..
అంత మీద ఒక గుట్ట పైన ఆ బావులను ఎలా ఏర్పాటు చేశారో..అది ఎలా సాధ్యం అయ్యిందో..
ఆచ్చర్యం నాకైతే..
“అన్నా!ఈ బావుల నీళ్లు ఎప్పడికి ఇలాగే ఉంటాయా?
సుమారుగా ఎంత లోతు ఉండచ్చు?”

‘ఆంజనేయ స్వామి పక్కన చెక్కిన ఆ శాసనాలు పెద్దిరాజు,అనంత రాజు ,సామంత రాజులు కాలం లో చెక్కినయ్ అంటారు చెల్లె.. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన విష్ణుమూర్తి శంకు,చక్రాలు ఉన్నాయి..
ఇక అక్కడి నుండి మళ్ళీ అందరం కదిలాము..కొద్ది దూరం వెళ్ళాక ఒక పెద్ద బావి..మెట్లు కూడ ఉన్నాయి..
అన్నా ఇదేం బావి..మెట్లతో చాల బాగుంది..
“హా..సెల్లె దీన్ని పెద్ద బాయి(ఏనుగుల బాయి) అని కూడ అంటారు”
“అవునా”
ఇంతలో మా ఆయన
“ఎనకట రాజులు,సైనికులు అందరూ కూడ ఈ బాయిల నీళ్లే తాగేదట. మెట్లు అందుకే నిర్మించినట్లు చెప్తరు. మెట్ల మీదికెళ్లి దిగి నీళ్లు కొండపొయ్యేది అట”
“హ్మ్మ్..చాల పెద్దగా ఉంది కదా బావ ఈ బావి”
“హ్మ్మ్..ఇక్కడ మందుల సెట్లు కూడ దొరుకుతయంటరు”
“హ్మ్మ్”
“సరే..ఇక నడుద్దాం మరి గుట్ట మీద ఇంకా ఉన్నాయ్ సూసేటియ్..”
“సరే..పాండ్రి”
కొద్ది దూరం మీదికి నడిచాం..
కాళ్ళ కింద రాళ్లు తలుగుడు. అటుపక్క ఓ పెద్ద గుట్ట. రెండు గుట్టల నడుమ పెద్ద లోయ. అబ్బర బిడ్డో ఈడి కెళ్ళి పడితే బొక్కలు కూడ. దొరుకయ్. ఒక్కసారి కళ్ళు గిర్రున తిరిగినయ్.
మళ్ళ ఏమన్నా అంటే ఎక్కడ పెర్నాల పెడుతడో అని..ఆళ్ల ఎనక సప్పుడుజేక నడుస్తున్న.

కొద్ది దూరం ఎక్కినంక కొండ లింగమయ్యా స్వామి శివ లింగం రూపంలో వున్నడు. స్వామి వారిని ఒక రాయి పైన చెక్కిండ్రు. చాల అద్భుతం గా ఉంది. అందరం దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడికెళ్ళు కలినం.

అందరం కొండపైకి చేరుకున్నం.
“సెల్లె..అచ్చినవా.. మెల్లగా అత్తె ఎనకవడ్డ వేమో అనుకున్న..ఇగో ఇది సవతుల బాయి గుట్ట..
చివరిగా పరిపాలించిన రాజు భార్యల గుర్తుగా ఈ మూడు బావులు తవ్వించారు అంటారు..
( బ్రహ్మసరోవరం,రాక్షశిస్తల్,గౌరిపుండం)ఈ మూడు బావుల దగ్గర కొండ లింగమయ్య స్వామి వారు కొలువై వున్నారు..అలాగే నoదీశ్వరుడు, బృంగీశ్వరుడు,,హనుమంతుడు,విగ్నేశ్వరుడు,.
అలాగే ఈ పక్కన సాక్షి గణపతి కూడ ఉంటాడు..
మనం ఈ బావులను దర్శనం చేసుకున్నప్పుడు సాక్షిగా అంటారు..అట్లనే ఈ బావుల నీళ్లు పవిత్ర మైనవి అంటారు..
ఈ బావుల లోతు నాకు తెలిసి ఇంత వరకు ఎవ్వరు తెలుసుకోలే..మా తాత అనేది..7 నులక మంచాల నులక తాడు ఏసిన ఇంకా లోతే ఉండేది..అని..
ఎర్రటి ఎండాకాలం కూడ ఈ బాయిల నీళ్లు ఇట్లనే ఉంటాయట..ఎప్పడికి ఎండి పోదు అంటారు..”
“హ్మ్మ్..”
సూపర్ ఎంత బాగున్నాయి..ఏదో వింత లోకానికి పోయినట్టు అనిపిస్తుంది
ఆ బావులు మూడు ఒకే దగ్గర ఉన్నాయి మధ్యలో ఒక గోడ లాంటిది ఉంది..
అందరం కాసేపు రిలాక్స్ అయ్యాం..
ప్రకృతి సోయగం.. నన్ను ఏదో మత్తు లోకి దింపినట్టు చేసింది..అలా చూస్తూ ఉండి పోయా..
అందరూ ఫోన్ లో ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు దిగుతుండ్రు..

నాకు కూడ ఫోటో దిగాలి అనిపించింది..
“బావ,ఓ..బావ.. అబ్బ ఒక్క పోటువ దిగుదామ”
మా బావకి ఫోటోలు దిగుడు నచ్చదు..అందుకే బతిమాలుడు..
“ఏ..పోవే.. నువ్వు నీ ఫోటోల పిచ్చి..’
అని నవ్వుకుంటూ తల మీద ఓ మొట్టికాయ వేసాడు..
నాకు పెద్దగా తలగకున్న..
“అబ్బా..ఇంత గట్టిగా వేశావ్ ఏంటి బావ మొట్టికాయ..తల అంత నొప్పి దెబ్బకు”
“అరే.. దెబ్బ గట్టిగ తాకిందానే.. నేనేదో సరదాకి చిన్నగా వేసా..తాకుతుంది అనుకోలే..ఏది ఇటు రా నేను చూస్తా..అని నన్ను దగ్గరికి
తీసుకున్నాడు..నా తలను ప్రేమగా నిమురుతూ..ఫొటో దిగుదామ అన్నాడు..
నేను తదేకంగా అతనినే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తున్న..
నా చూపులు అతనిని ఆడిగాయి.. అసలు “ప్రేమంటే”?
నన్ను దగ్గరగా తీసుకున్న అతని గుండె చప్పుడు చెప్తుంది..
అసలు ప్రేమకు కొలమానం ఉందా?
Yes..
What is love?
It means caring, supporting, responsibility, freedom and more importantly trust..

అతని ఆలోచన నాకోసం, అతని కష్టం నాకోసం..,
అతనిలో ఉన్న ప్రేమ అంత నాకోసమే అన్న గర్వం
ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషాన్ని ఇస్తుంది..
అమ్మ ప్రేమంత స్వచ్ఛమైన ప్రేమను
అతని నుండి పొందడంలో నేనెంత అదృష్టవంతురాలినో కదా..!
అవును నా తల్లిని దూరం చేసుకున్న క్షణం కన్నీళ్లతో బరువెక్కిన నా గుండె బరువును మోసిన అతని భుజాలకు తెలుసు నేను కూడ నీకు అమ్మ ఒడినే అని..ఇక సేదా తీరు బిడ్డా! నీ దుఃఖం తీరే దాక..అనే ఓదార్పు నిజంగా నా తల్లి నా పక్కన ఉన్నంత భరోసా ఇచ్చాయి..
ఆ ఆలోచనలో నుండి తేరుకున్న ఇద్దరం ఒకరిని,ఒకరం చూసుకుంటూ చిన్నగా నవ్వుకున్నాం..
మమ్ముల చూసిన మా అఖిల ఏంటి సిన్ని మీకు,మీరే నవ్వుకుంటున్నారు..
ఎమ్ జోకు వేసాడు… మా బాబాయ్..
“అయ్యే..జోకు ఎమ్ లేదురా..ఫోటో అంటే మొట్టికాయ అన్నాడు”
అఖిల కూడ ఒక్కసారిగా నవ్వింది..
“ఇటు రండి పిన్ని నేను తీస్తా మీ ఫోటోలు..”
“సరే..రా..”
ఇద్దరం కలిసి చాల సరదాగా ఫొటోస్ దిగాం..
సరే,సరే ఇక కిందికి వెల్దాం…

అందరం కలిసి గుట్టకిందికి బయలుదేరం..
యంగ్ పిల్లలు చాలా ఫాస్ట్ గా దిగుతున్నారు..
మా అఖిల కూడ జెప్పననే దిగుతోంది..
కానీ పైకి ఎక్కినంత సులువు కాదు కిందికి దిగుడు అని నాకు అప్పుడే అర్థం అయ్యింది..
కాళ్లకు పట్టు లేక జర్ర,జర్ర జారుతుంది..
ఏడ కింద పడుతానో అనే భయం..
మెల్లగా,మెల్లగా కిందికి దిగుతున్న..
నా ముందు మా బావ దిగుతుండు..
ఆయన మాత్రం హుషారుగా దిగుతుండు..
ఆయనను చూస్తూ నేను దిగుతున్న..

ఎందుకో మా మధ్య బంధానికి 22 ఏండ్లు అయిన నా మనసులో ఉన్న ఒక్కమాట అతనికి ఇంతవరకు చెప్పలేదు..22 ఏండ్లు గా ట్రై చేసిన చెప్పలేక పోయా..
ఎందుకో ఈ రోజు ఆయనకు చెప్పాలి అనిపించింది..

అదే ఆలోచనతో కిందికి దిగుతున్న నా కాలు కొంచెం జారింది..కింద పడిపోతున్న నా చేతిని అతను గట్టిగా పట్టుకున్నాడు..
“జెరంత అయితే పడుతుంటివి మెల్లగా రా..”
“హ్మ్మ్…బావ నీకోటి చెప్పాలని ఉంది..అతని చేతిని ఇంకా గట్టిగా పట్టుకున్న..”
“హ్మ్మ్..నాకు తెలుసు నువ్వు ఎమ్ చెప్పాలి అనుకుంటున్నావో… నీతో ఏడడుగులు వేసిన నాడే..నీ మనసు చెప్పిన మాట..నా మనసు గ్రహించిన మాట..”
అంటూ నా చేతిని పట్టుకొని జాగ్రత్తగా కిందిగి తీసుకుపోయాడు..

తిరిగి అందరం మైసవ్వ తల్లి దగ్గరికి చేరుకున్నాం..
మేము గుట్టమీది నుండి అచ్చె సరికి అక్కడ ఉన్నోళ్లు అంత దేవుని మొక్కులకు అన్ని తయారు పెట్టిండ్రు. ఆ మైసవ్వ తల్లి దగ్గర పూజరిగా ఓ ముసలాయన వున్నాడు..

మా వొళ్ళు అంత కళ్ళు,బెల్లం శాఖ తాగిచ్చి మేకను జడత పట్టుటానికి రెడీ గా వున్నారు. ఇగ అందరం తెచ్చిన కొబ్బరికాయలు తలోటి కొట్టి ఆ దేవుని సల్లగా సూడమని మంచిగా.. మొక్కుకున్నాం..
కొబ్బరి కాయలు కొట్టుడు అయినంక మేకను, మేకతోని కోడిపిల్లను రెంటినీ జడతకు తీసుఖచ్చి మంచిగ మొక్కులు సెల్లించ్చిండ్రు..మేక మంచిగనే ఒక్కసారికే జెడితిచ్చింది. అందరికి సంబురం. అనుమానం లేకుండ జెడత ఇచ్చినందుకు..
ఇగ అక్కడ ఉన్న పెద్దమనిషిని..
‘తాత అందరికి కొంచెం బొట్టు పెట్టు” అని అడిగాం
సరే తల్లి ఇటు రార్రి అందరు అని అమ్మ వారి బొట్టు అందరికి పెట్టాడు..
‘బిడ్డా ముత్తైదులు అందరూ ఇగో అమ్మ వారి గాజులు ఏసుకొండ్రి మీకు మంచి జరుగుతాది..”అని అందరికి గాజులు ఇచ్చిండు.కళ్ళకు అద్దుకొని ఆ గాజులు ఆడవాళ్ళం అందరు ఏసుకున్నాం..
ఆ తాతకు ఎవరికి తోసినంత వాళ్ళం ఎంతో కొంత మంగళ హారతి పళ్ళెంలో వేసాం..కొంత మంది ఆ తల్లి మహిమ గళ్ళ బొట్టు ఇంటికి తెచ్చుకోడాని ఆ తాతను అడిగారు..ఆ తాత కూడ అడిగిన వాళ్లకు అందరికి ఇచ్చాడు..
సరే ,సరే మొక్కులు అయినయా ఇగ పదండ్రి మేకను కోసినంక ఇక్కడ వుండద్దు..
సరే అని అందరం అక్కడి నుండి బయలు దేరాం..
కానీ నా మనసులో ఆ తాత గురించి..గాంధారి ఖిల్లాలో జరిగే జాతర గురించి తెలుసుకోవాలనిపించింది కానీ ఎలా?
అందరం తిరిగి మళ్ళీ ఎక్కడినుండి వెళ్ళామో అక్కడికి వచ్చాము..

మావోళ్లు మేకను కోసుడు పని మీద వున్నారు..ఆడవాళ్ళం అందరం..పొయ్యి రాళ్లు పెట్టి అంట సేసుటానికి తయారు చేస్తున్నం..ఇంతలో మా బాపు కట్టెల మోపు తీసుఖచ్చి పొయ్యి కాడ ఏసిండు.. మా అఖిల,నేను..కూరగాయలు కోసే పని మీద ఉన్నాం..కార్తీకమాస ఒక్కపొద్దులు నీసు తిననోళ్లకోసం..మేము ఎకేరే అండుతున్నాం..మేము కూడ ఒక్కపొద్దె అందుకే మాకు,మేము అండ్ల కలువద్దని అండుకుంటున్నాం..
ఇంతలో మేక కోసుడు పూర్తి అయ్యింది..అండలు పెట్టి అండుడాయే అడోళ్లకు ఏడ గంటే తిరుగుతది.. అందుకే మొగోళ్ళు గంటే సేతుల పట్టిండ్రు..మా బావ మస్తు అండుతడు.. ఆయన ఏదన్నా అండుతే గుంజు ఊర్సుక తినుడే..గంత మంచిగ అండుతడు..ఇగ గుంజు పొయ్యిమీద పెట్టి ముందుగాల కూరపొయ్యిమీద ఏసిండు. వుడుకుటానికి టైమ్ పడుతుంది..అలోపు మిగితా అన్ని తయారు సేసుకోవచ్చుఅని..
అల్లం, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మసాలా వాసనతో అక్కడ అంత గుమ గుమ వాసనతో ఉడుకుతున్న కూర అందరి నోరూరేలా చేసింది..
ఇంతలో మా అన్న..
“బావ… ఏ.. బావ నీ కూర వాసనతోనే కడుపు నింపుతావా ఏంది. ముక్క తోని జెరెంత సుక్కఎయ్యాలే. కడుపు కాలిగా ఉండేలా సూడు. సుక్క ఏసినంక “సుక్క తీరు ,సక్కనోడని లెక్కలెన్నో రాసుకున్న” అని పాడుకుంటా జోరుమీద ఎగురాలే.
” ఏ..నీ సుక్క సల్లగుండ ముందు గాల కడుపునిండనైతే బువ్వ తిను. అటెంక తిన్నది అరిగేదాక ఎగిరేవు.”
అది వింటున్న మేము అందరం ఒక్కటే నవ్వుడు.
ఇంతలో మా బావ ఇంకో పొయ్యి మీద భగార ఏసిండు. అది కూడ భగార మసాలతో అక్కడి వాతావరణం అంత వంటల వాసనతో నిండి పోయింది.
అందరు పొద్దుట నుండి ఎమ్ తినలేదు కాబట్టి ఆకలి మీద ఉన్నరు. ఆ వాసనకు అక్కడవున్న కోతుల గుంపు మళ్ళ రానే వచ్చింది.
ఇంకేముంది మళ్ళ తలోటి కట్టే వట్టి కావాలి నిలపడ్డరు.

ఆడోళ్ళమంత అటెటు అవతలికి పోదాం అని సెలిమే ఉన్న దిక్కే.ఎడమ చేయ్ బాజు కొంత దూరం నడిసినం. పెద్ద కట్ట ఓసి ఉంది..అందరం అదేందో సూద్దాం అని కట్ట ఎక్కినం పెద్ద సెరువు..సెరువు నిండ నీళ్లు..అచ్చం సినిమాల సూసినట్టు ఉంది ఆ లొకేషన్.. మేము పొయ్యిన పని మర్శి కొద్ది సేపు ఆడ కూకొని మళ్ళ ఫోటోలు దిగి ముచ్చట మీద పడ్డం.
మా అఖిల, “ఎంత సూసిన దంగుతలేవ్ గా సిన్ని..ఇంక మనం సూడనియ్ ఎన్ని ఉన్నాయో”
“అవును..రా..సూసిన కొద్ది ఒడుత్త లేదు..”
ఇంతలో మా వదిన, “వంటలు అయినయ్..అవతలికి అని అచ్చి ఈడనే కూలవడ్డరు ఏంది..నడువుండ్రి తిందాం..”
“హా..పా..పా..అటు పొయ్యి..కాళ్ళు, రెక్కలు కడుక్కొని అత్థం”

ఇగ వంటలు అన్ని అయినయ్.. ముందుగాల ఆడోళ్ళు తినటానికి కూసున్నము…. మొగ వాళ్ళు కట్టెలు పట్టుకొని కోతులు రాకుండ చూస్తుండ్రు..
మేము అందరం తిని సక్కగపొయ్యి ఓ సెట్టుకింద ఒరిగినం..
“అయ్యే..గిదేందుల్లా. మీరు తినేదాక మేము కావలి ఉన్నం. మేము తినే దాక మీరు వుండరా.”.
అందరూ నవ్వుకుంటా
“వుండం అని సేతులు ఊపి సేతులు ఎత్తేసినం..”
అచ్చం రాజకీయ నాయకుల లెక్క..

ఇక తప్పదు అని..వాళ్లకు వాళ్లే కావాలి ఉండి తింటున్నారు..
ఇంతలో గుట్ట మీద మైసవ్వ తల్లి దగ్గర ఉన్న ఆ తాత అదే అక్కడి పూజారి కిందకి దిగి మా దగ్గరకు వచ్చిండు..
“రా తాత బువ్వ తింటవా బుక్కడంత..”
“తింట బిడ్డ పొద్ధటి నుండీ బువ్వ లేక మత్తు ఆకలి అయితంది”
” అయ్యో..సేతులు కడుక్కొని రాపో మరి”
“సరే..బిడ్డా”
మా బావకు సైగ సేసిన ఈ ముసలాయనకు కూడ ఇంత బువ్వ పెట్టమని
నా సైగ అర్థం అయిన మా బావ
” ఇటు రా తాత అన్నాడు”
ఆ తాత వెళ్లి బంతిలో అందరితో కూసోని బువ్వ తింటుండు..
నా బుర్రలో మాత్రం ఇంక ఆ ఖిల్లా గురించి తెలుసుకోవాలన్న ఆరాటమే..
ఇంతలో ఆ తాత తినుడు అయ్యింది..
మావోళ్లు మాత్రం ఇంత తీర్థం తీసుకునుడులో మునిగిపోయారు..
“తాతా…. నువ్వు ఎక్కడి నుండి వాస్తవ్..? రోజు వస్తవా.?”
“దేవపూర్ నుండి అత్త బిడ్డ రోజు పొద్దుగాల బస్సుకు అచ్చి మాపటేళ్లకు మళ్ళీ పోతా..”
తాత ఇక్కడ జాతర ఎప్పుడు జరుగుతుంది..? అసలు జాతర ఎప్పుడు మొదలు అయ్యింది..?
ఎప్పుడు మొదలు అయ్యిందో తెల్వద్ గాని బిడ్డా కొద్దీ రోజులు కొన్ని లొల్లులు అయ్యి జాతర బంద్ సేసిండ్రు..మళ్ళ కొన్ని ఏండ్లు సంది మళ్ళ మొదలు అయ్యింది..
ఆ మాట విన్న నాకు ఇంకా మనసు అగలే మా అఖిలను ఫోన్ లో సర్చ్ చేయమన్న దాని గురించి తెలుసుకుందాం అని..
నేను కూడ ఫేస్ బుక్ లో వెతకడం మొదలు పెట్టిన. అలా వెతుకుతున్నప్పుడు మా సర్ (మా గురువు) ఇట్యాల
వెంకట కిషన్ గారి..
పోస్ట్ కనబడింది.. ఆది ఫిబ్రవరి. 8. 2017 లో పోస్ట్ చేయబడింది. వెంటనే తెలుసుకోవాలి అన్న కుతూహలంతో చదవడం మొదలు పెట్టా..

మందమర్రి మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధి లోని బొక్కల గుట్ట గ్రామ సమీపం లో గాంధారి ఖిల్లా ఉంది. హైదరాబాద్ – చాందా ప్రదాన రహదారి లో మంచిర్యాల పట్టణం దగ్గర బొక్కల గుట్ట బస్ స్టాప్ నుండి ఐదు కిలోమీటర్ల దూరం లోని దట్టమైన అటవీ ప్రాంతం లో ఉంది.
సుమారు 700 ఏళ్ల పూర్వం కాకతీయుల సామంత రాజులైన పెద్ది రాజుల కాలం లో గాందారి ఖిల్లా వెలుగొందినట్టు చారిత్రక ఆనవాళ్లు చెప్తున్నాయి.ఆదివాసీ రాజులు దీన్ని రాజదానిగా చేసుకొని పాలించారు. గాందారి ఖిల్లా పెద్ది రాజుల కళా నైపుణ్యానికి అద్దం పడుతోంది. గుట్ట పై నిర్మించిన కోటలో అనేక కళారూపాలు,శిల్పసంపదా,విగ్రహాలున్నాయి.

గుట్టపై ఉన్న ఖిల్లాకి వెళ్ళేందుకు మెట్లున్నాయి. అవి ఇప్పటికీ చెక్కు చెదరక పోవటం విశేషం. కొండపైన బండరాయితో తొలిచిన మూడు ప్రదాన ద్వారాలున్నాయి. కోటపైన బోగ0 గుళ్లూ,గాంధారి మైసమ్మా ,కాలభైరవుడూ,శివుడూ,విగ్నేశ్వరుడూ,ఆంజనేయుడూ మొదలైన ప్రతిమలున్నాయి. పెద్దిరాజులు నిర్మించిన పలు స్తూపాలు శిథిలావాస్తకు చేరుకున్నాయి. శత్రువుల రాకను పసిగట్టేందుకు నగారా గుండు (రక్షణ దుర్గం ) నిర్మించారు. ఖిల్లా పైకి ఏనుగులూ,గుర్రాలు వెళ్ళేందుకు అనువుగా మార్గాన్ని నిర్మించారు.

గాంధారి మైసమ్మ ఇక్కడి గిరిజనులకు ఆరాధ్య దైవం కావటం తో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గోండులూ,కోయలూ,మన్నెలూ,నాయక్ పోడ్ జాతులు గాంధారి ఖిల్లాలో పూజలు చేస్తారు. 1998 వరకు పెద్ద ఎత్తున జరిగిన గాంధారి మైసమ్మ జాతర ఆ యేడాది జరిగిన జాతరలో ఒక వక్తి హత్య జరగడముతో ఆగిపోయింది. ఆ తర్వాత నుండి కొద్ది మొత్తములో చిన్నగా జాతర జరుగుతుంది. ఆది , గురువారాల్లో పూజలు జరుగుతాయి. వర్షాలు కురవాలని పంటలు వేసేముందు ప్రతియేటా మాఘ పౌర్ణమి కి గిరిజనులు లక్ష్మి దేవరకి ( దేవత ), భీమన్న దేవునికి నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజలని నాయకుపోడు రొడ్డ వంశీయులైన పూజారులు నిర్వహిస్తారు.ఈ జాతరలో అన్నీ కులాల వాళ్ళు పాల్గొంటారు. మాదిగ కులస్తులు పెద్ద వేడుకగా తరలి వచ్చి జాతర రెండవ రోజు రాత్రి గుట్ట పైనే పూజల్లోభాగంగా దున్నపోతులని బలి ఇస్తారు. పూజల్లో భాగంగా గిరిజనులు రాత్రంతా ఇక్కడే ఉండి జంతుబలులిస్తూ చాటలో గటక పోసి “సరువు సాటవడి” పేరిట గ్రామాల చుట్టూ తిరుగుతారని స్థానికులు తెలిపారు. ఇక్కడ గిరిజనులే కాదు ఇతరులుకూడా మొక్కులు చెల్లించుకుంటారు. విధ్యార్తులు పిక్నిక్ స్థలంగా దీన్ని సందర్శిస్తూంటారు. ఖిల్లాను అనుకోని ఉన్న మేడిచెరువు దిగువ భాగంలో 180 ఎకరాల సాగు భూమి ఉంది
ఆధారాలు :

  1. ఆదిలాబాద్ విజ్ఞాన సర్వస్వము – శర్మ
  2. స్థానిక పెద్దలు మారపక రాజన్న, బొద్దుల సాంబయ్య , దొడ్డి రాజలింగు , బలికొండ కిషన్బొ, లిశెట్టి కనకయ్య స్థానిక ఎంపీపీ తదితరులు చెప్పిన వివరాలు.

నేను(కిషన్ సార్) మందమర్రి తహశీల్దార్ గా 2014 నవంబర్ లో జాయిన్ అయిన వెంటనే కాకతీయ ఉత్సవాలు ప్రభుత్వంము రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుందని దానిలో భాగంగా కాకతీయ సామ్రాజ్యం వారి సామంత రాజ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో ఉత్సవాలు జరుపుటకు అనువైన చారిత్రాత్మకమైన ప్రదేశాలని గుర్తించాలనే జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ ఆదేశాలతో నేను గాంధారి ఖిల్లాని స్థానిక నాయకుల ప్రజల సహకారంతో గాంధారి ఖిల్లాని 22 నవంబర్ 2014 న నేను మిత్రుడు కెమెరామెన్ వర్షిణి శ్రీనివాస్ ని నా పర్సనల్ ఇంట్రెస్ట్ తో తీసుకొని వెళ్ళి ఉదయము 7 గంటలకు ఖిల్లా ఎక్కడము ప్రారంభమైన మా ప్రయాణo మధ్యాహ్నానికి పూర్తయ్యింది.అదే రోజు సాయంత్రం రిపోర్ట్ తయారు చేసి పంపినం. కాకతీయ ఉత్సవాలు జరగలేదు కానీ 17 సంవత్సరాల తర్వాత 2016 ఫిబ్రవరిలో తిరిగి గాంధారి మైసమ్మ జాతర జరుపాలనే నిర్ణయానికి ఆ రోజు పునాది వేసింది. నాయకుపోడ్ ఆదివాసుల రాష్ట్ర అద్యక్షులు పల్లె సత్యనారాయణ జిల్లా అద్యక్షుడు గంజి రాజన్న సాంస్కృతిక అద్యక్షుడు మేశం రాజన్న, పెద్ది రాజన్న, గుండం రామస్వామి, ఏదుల రాజమల్లు, ప్రధాన పూజారి రొడ్డ వంశీయుల రొడ్డ రమేష్, స్థానిక ఎం‌పి‌పి బొలిశెట్టి కనుకయ్య జడ్పటీసి కంభగోని సుదర్శన్ గౌడ్ సర్పంచు దరావత్ తిరుపతి నాయకులు బలికొండ కిషన్ మారపాక రాజన్న దొడ్డి రాజలింగు గోపాల్ తదితరపెద్దలు, స్థానిక ఎంఎల్ఏ, ప్రభుత్వ చీఫ్ విప్ నల్లాల ఓదెలు, అప్పటి పీవో ఐటీడీఏ ప్రస్తుత మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ల సహకారంతో 2016 లో ఈ జాతర తిరిగి ప్రారంభమై పెద్ద ఎత్తున జరిగింది.
ఈ జాతరలో..
సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే తప్పెటగుళ్ల చప్పుళ్ళు , పిల్లనగ్రోవి పాటలు , నృత్యాలు , లక్ష్మీదేవర భీమదేవర కొలుపు చాలా గొప్పగా ఉంటుంది.
ఇదంత

ఊపిరి బిగపట్టి చదివిన నేను ఒక్కసారి ఊపిరి పీల్చుకున్న..

అందరి భోజనాలు అయిపోయినై.
మాపటేళ్ల మళ్ళ గొడ్లు, బర్లు అచ్చె ఆళ్ల అయ్యింది..
అందరు డి.జె.పెట్టి ఎగురుదాం అని సిద్ధం అయిండ్రు. .
సరే మరీ..మరి మనం వెళదామ మా బావ
“సరే పా. బర్లు రావచ్చు. ఆగం అయినయో ఏమో”
మా రామవ్వను పిలిసి ఇక పోతం అని సెప్పినం.
“అయ్యో బిడ్డా… సంబరంగా ఇంక గొంత సేపు ఉండి పోరాదుండ్రి.
“లేదవ్వ బర్లు రావచ్చు. పోతం..”
“సరే బిడ్డా… పైలంగా పాండ్రి. ఇంటికి సేరినంక ఫోన్ చేయిండ్రి”.
“హ్మ్మ్”
ఇక అక్కడి నుండి బయలు దేరినం..ఎన్ని అందాలు,ఎన్ని అద్భుతాలు ఎంత గొప్ప చరిత్ర అన్ని నా మనసులో మెదులు తున్నయి.
బండి మీద పోతా ఉంటే గాల్లో తేలినట్టు ఉంది.
ఇంటికి వచ్చాము మా బావ బర్లు కట్టేసుటానికి పొయ్యిండు.
నేను ఛాయ పెట్టిన..ఎటు పొయ్యి అచ్చిన జెరంత ఛాయా నోట్లే పడాలే..మా బావ కాళ్ళు,రెక్కలు కడుక్కొని అచ్చిండు. సెరో గ్లాసుల ఛాయ పోసి తీసుకచ్చిన.. అరుగు తీనెల మీద ఆటొకరం, ఇటొకరం కూసోని, ఛాయ తాగుకుంటా మళ్ళ ముచ్చట్లలో మునిగిపోయినం.

కవయిత్రి, కథా రచయిత. ఉపాధ్యాయురాలు. పుట్టిన ఊరు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం, నారాయణపూర్ గ్రామం. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి B. Com. చదివారు. వృత్తి : అంగన్వాడీ టీచర్. రచనలు : పల్లె ముచ్చట్లతో కొన్ని వ్యాసాలు, కవితలు, స్త్రీవాద వ్యాసాలు, సమీక్షలు, కథలు రాశారు. మొదటి కథ సదువు ఇమ్మర్స, గల్పికా తరువు పుస్తకం లో 2020 లో ప్రచురించారు. 'లేఖావలోకనం' (మరణించిన తన తల్లికి లేఖ) 2021 లో ప్రచురించారు."మల్లె సాల" సంకలనంలో చేతి వృత్తి కథను ప్రచురించారు."బహుళ " పత్రికలో కథలు, వ్యాసాలు, కవితలు రాశారు.

Leave a Reply